top of page

ధృవతార


'Dhruvathara' New Telugu Story

Written By Ch. C. S. Sarma

'ధృవతార' తెలుగు కథ

రచన: సిహెచ్. సీఎస్. శర్మ

సత్యాన్ని, ధర్మాన్నిపిల్లలకు తల్లిదండ్రులకు చిన్న వయస్సు నుంచి నేర్పాలి. కంటి ఎదుట తప్పు జరిగితే.. వారు అప్పుడు దాన్ని ఎదురించగలుగుతారు. పదిమంది అభిమానానికి, ఆదర్శంగా తయారవుతారు. అది తల్లి తండ్రికి ఆనందం.


బస్సు, స్టాప్ ‌కు వచ్చి ఆగింది. నలుగురు దిగారు. పదిమంది ఎక్కారు. సమయం సాయంత్రం.. నాలుగూ నలభై అయిదు. స్కూళ్లు వదిలినందన బస్సులో స్కూలు పిల్లలు, ఆడ మగ అధికంగా వున్నారు. పిల్లలు సీటుకు ముగ్గురు చొప్పున స్నేహితులతో కలసి కూర్చొని వున్నారు. కొందరు నిలబడి సీటు కమ్మిని పట్టుకొని వున్నారు.


ఎక్కిన పదిమందిలో.. యిరువురు పాతికేళ్ళ ప్రాయపు వాళ్ళు.. గళ్ళ బనీన్లు.. మాసిన ప్యాంట్స్.. తైల సంస్కారం లేని తలలతో వున్నారు, కండక్టర్ విజిల్ వేశాడు. బస్సు కదిలింది.

కండక్టర్.. 'టికెట్.. టిక్కెట్', అంటూ యింజన్ వైపు నుండి వెనక్కు, టిక్కెట్ యిచ్చి పైసలు వసూలు చేసికొంటూ వస్తున్నాడు. పాసులున్న వారు పాసులు చూపించారు. టిక్కెట్టు కొనవలసిన వారు కొంటున్నారు. ఆ యిద్దరూ టిక్కెట్టు కొన్నారు. వారి.. ముందు స్థూలకాయురాలు, మరి కొందరు పిల్లలూ నిలబడి వున్నారు. బస్సు, ముందున్న స్టాపుకు మరికొద్ది నిముషాల్లో చేరబోతుంది.. ధృవ తన యిద్దరి స్నేహితులలతో సీటు చివర కూర్చోని వున్నాడు. ముందు సీట్లో తన ఎదురింట్లో వుండే ఆంజనేయులు అంకుల్ ఫోన్ లో ఎవరితోనో మాట్లాడుతున్నారు. అతని ఫోన్ ప్రసంగం ముగిసింది. తనకు ప్రక్కగా నిలబడి ఉన్న ఆ ఇరువురిని ధృవ గమనిస్తున్నాడు.. బస్సులో రద్దీ జాస్తిగా వుంది.

కండక్టర్ వెనక్కు వెళ్ళిపోయాడు.


ఆ ఇద్దరిలో ఒకడు జేబు నుంచి ఒక కత్తెర బయటికి తీశాడు. అతను చూపులు తన ముందున్నస్థూలకాయురాలి మెడలో ఉన్న బంగారు గొలుసు మీద ఉన్నాయి.

ఈ విషయాన్ని ధృవ గమనించాడు. ఏదో జరగబోతూ ఉందని అతనికి తోచింది. ముందు సీట్లో ఉన్న ఆంజనేయులుని అడిగి అతని సెల్ ఫోన్ కాల్ చేయాలని తీసుకున్నాడు.


బస్సు మలుపు తిరగడంతో ధృవ కూర్చుని ఉన్న ఎడమ వైపుకు బస్సు ఒరిగింది. వాడు కత్తెరతో ఆమె గొలుసును కట్ చేశాడు. సెల్ తో ధృవ ఆ దృశ్యాన్ని ఫోటో రెండుసార్లు తీశాడు.

ఆ ఇరువురూ ముందు జనాన్ని తోసుకుంటూ ముందుకు వెళ్లారు. బస్సు స్టాప్ లో ఆగింది. ఆ యిరువురూ వేగంగా దిగి పారిపోయారు. నిలబడి వున్న దిగని జనం ముందుకు జరిగారు. వెనక ద్వారం గుండా జనం, పిల్లలు బస్సులో ఎక్కారు. సెల్ ను ఆంజనేయులు ధృవ దగ్గర అడిగి తీసుకున్నాడు. బస్సు కదిలింది.


ఆ స్థూలకాయురాలు.. సోషల్ వర్కర్ అరుంధతి. మెడను తడివి చూసుకొంది. ఛాతీ వైపు చూసింది. చైన్ ఎవరో దొంగిలించారనే నిర్ధారణకు వచ్చింది. ఎంతో కలవరంతో కండక్టర్ ను సమీపించింది.

"సార్!.. నా ఆరు సవర్ల బంగారు గొలుసును ఎవరో దొంగిలించారు. బస్సు నుండి ఎవరినీ దిగనీయకండి. పోలీస్ స్టేషన్ కు పోనీయ్యండి" కన్నీటితో ఎంతో కలవరంగా ఆమె కండక్టర్ తో చెప్పింది..

కండక్టర్ తెల్లబోయాడు.


"నేను సోషల్ వర్కర్ ని. నా పేరు అరుంధతి. మీరు నేను చెప్పినట్టు చేయాలి. లేకపోతే మీ మీదా నేను కంప్లైంట్ చేయవలసి వస్తుంది. " అరుంధతమ్మ అథారిటీగా చెప్పింది.

కండక్టర్.. డ్రైవర్ ను సమీపించి బస్సును పోలీస్ స్టేషన్ వైపుకు పోనివ్వమని చెప్పాడు. బస్సు స్టేషన్ వైపుకు తిరిగింది.


బస్సులో ఉన్న జనం.. అసహనంతో నోటికి వచ్చినట్లు మాట్లాడ సాగారు. కొందరు అరుంధతమ్మను చూసి జాలిపడ్డారు. 'ఆరు సవర్లే.. లక్ష రూపాయల సొమ్ము.. ' కొందరు ఆడవారు తమ సపోర్టును ఆ రీతిగా అరుంధతమ్మకు వ్యక్తం చేశారు. బస్సులో జరుగుతున్న హంగామాను చూస్తూ ఉండిపోయాడు ధృవ. బస్సు పోలీసు స్టేషన్ ను సమీపించింది. ఆగింది.


"బస్సులో నుంచి ఎవరూ దిగకండి. మేడం మీరు కిందికి రండి. " తను బస్సు దిగి చెప్పాడు కండక్టర్. అరుంధతమ్మ బస్సు దిగింది. పరుగున వెళ్లి ఇన్స్పెక్టర్ తో విషయాన్ని చెప్పింది. ధృవ బస్సు దిగాడు. కండక్టర్ ను సమీపించాడు.


"అంకుల్!.. "

"ఏంట్రా!.. " విసుగ్గా అడిగాడు కండక్టర్.

"ఆమె దండను దొంగిలించిన వారిని నేను చూసాను. "

"ఎవర్రా!.. "

"వాళ్ళు ఇద్దరు. పారిపోయారు. బస్సులో లేరు"

"రేయ్!.. ఏందిరా నువ్వు చెప్పేది?"

"లాస్టు స్టాప్ లో వారు దిగిపోయారు అంకుల్. "

ఇన్స్పెక్టర్.. ఇద్దరు పోలీసులు బస్సును సమీపించారు.

ధృవ ఆంజనేయులు గారిని బస్సు దిగమన్నాడు. అతను బస్సు దిగాడు. సెల్ ఇవ్వమని అడిగాడు.

"ఎందుకురా!.. "


"ఆ దొంగల్ని నేను ఫోటో తీశానంకుల్. ఇన్స్పెక్టర్ గారికి చూపిద్దాం. ప్లీజ్ ఇవ్వండి. "

వాడి అభ్యర్థనకు ఆంజనేయులు ఆశ్చర్యపోయాడు. 'పిట్ట కొంచెం కూత ఘనం' అనుకుని సెల్ ను ధృవ చేతికి ఇచ్చాడు ఆంజనేయులు.


ధృవ సబ్ ఇన్స్పెక్టర్ గారిని సమీపించాడు.

"సార్!.. "

"ఏం బాబూ!.. "

"మీరు బస్సులో ఎవరినీ చెక్ చేయవలసిన అవసరం లేదు సార్. "

అరుంధతమ్మ కోపంగా ధృవ ముఖంలోకి చూసింది.

పోలీసులు జనాన్ని చెక్ చేసే దానికి బస్సు ఎక్కారు.

"సార్!.. దొంగలు పారిపోయారు. వారి ఫోటో ఈ సెల్ లో ఉంది. నేను తీశాను. " తన చేతిలోని సెల్ ను చూపిస్తూ చెప్పాడు ధృవ.


బస్సులో జనం అసహనంతో విమర్శలు ప్రారంభించారు.

"అంకుల్!.. బస్సులో జనం ఆలస్యం అవుతూ ఉందని అరుస్తున్నారు. మీరు బస్సు పంపించేయండి. తను తీసిన ఫోటోలు సెల్ లో ఇన్స్పెక్టర్ గారికి చూపించాడు ధృవ.

ఆ ఫోటోను చూసి ఇన్స్పెక్టర్ ఆశ్చర్యపోయాడు. పోలీసులను బస్సు దిగమన్నాడు. డ్రైవర్ కండక్టర్లతో..


“మీరు వెళ్ళిపోండి.. దొంగలు దొరికారు. ” నవ్వుతూ ధృవను చూస్తూ చెప్పాడు ఇన్స్పెక్టర్.


పోలీసులు బస్సు దిగడంతో బస్సులో కలకలం తగ్గింది‌ జనం వ్యాఖ్యానాలను ఆపారు‌ డ్రైవర్ సీట్లో కూర్చుని బస్సు స్టార్ట్ చేశాడు. కండక్టర్ విజిల్ వేశాడు. బస్సు వెళ్ళిపోయింది.

"సార్!.. ఈ మిరపకాయ చెప్పింది నాకేం అర్థం కాలేదు. జనాన్ని చెక్ చేయకుండా మీరు బస్సును పంపేశారు. " ఆందోళనగా అంది అరుంధతమ్మ.


"బాబు.. వీరెవరు?’’ ఆంజనేయులును చూస్తూ అడిగాడు ఇన్స్పెక్టర్‌.

"మా ఎదురింట్లో ఉంటున్నారు. మీ చేతిలో ఉండే సెల్ వారిదే. "

అరుంధతమ్మను ఆంజనేయులును చూసి..


"రండి. కంప్లైంట్ వ్రాసిస్తురుగాని!.. " ఇన్స్పెక్టర్ వెనకాల ఆ ముగ్గురు స్టేషన్లోకి నడిచారు.

ఇన్స్పెక్టర్ గారు తన సీట్లో కూర్చునిముగ్గురిని టేబుల్ ముందున్నకూర్చీలలో కూర్చోమని చెప్పారు.

పేపర్ ను అరుంధతమ్మ చేతికి అందించి కంప్లైంట్ వ్రాయమన్నారు. ఆవిడ కంప్లైంట్ వ్రాసి ఇచ్చింది."మేడం.. మీరు ఈ బాబు సమయస్ఫూర్తిని, సాహసాన్ని మెచ్చుకోవాలి. మీ చైన్ దొంగిలించిన వాడి ఫోటో ఈ బాబు తీశాడు. చూడండి. " సెల్లో ఉన్న దొంగ ఫోటోలు అరుంధతికి చూపించాడు ఇన్స్పెక్టర్.

"వీడు జేబుదొంగ. రిలీజ్ అయ్యి వారం రోజులు అయింది. మీ చైన్ కొట్టేశాడు. ఈ బాబు ఈ ఫోటోలు తీయకపోతే మీరు మీ చైన్ మర్చిపోవాల్సిందే. వారం రోజుల్లో మీ నగ దొరుకుతుంది. ప్రశాంతంగా ఇంటికెళ్ళండి. "


"సార్ వీలైనంత త్వరగా నా నగ నాకు చేరేలా చూడండి" దీనంగా చెప్పింది అరుంధతమ్మ. "

"అలాగే ఇక మీరు వెళ్ళవచ్చు"

ఇన్స్పెక్టర్ గారికి నమస్కరించి కుర్చీ నుండి లేచింది అరుంధతి. ధృవను సమీపించింది.

"బాబూ!.. నీ పేరేమిటి?"

ధృవ!.. "


"థాంక్యూ బాబు!.. " అతని చేతిని తన చేతిలోనికి తీసుకొని కరచాలనం చేసింది. ఆంజనేయులకు నమస్కరించి వెళ్లిపోయింది అరుంధతమ్మ.

"ధృవా!.. "

"సార్!.. "


"మీ నాన్నగారి పేరు ఏమిటి?"

"ఈశ్వర్!.. ఎక్సైజ్ ఆఫీసర్"

"వారి సెల్ నెంబర్?".. "

"**********"

"మీ ఇల్లు ఎక్కడ?"

"పంజాగుట్ట"

"ధృవా! యు ఆర్ ఏ బ్రేవ్ బాయ్. బాగా చదవాలి. నాలా ఇన్స్పెక్టర్ కావాలి. ఏ క్లాస్ చదువుతున్నావ్?"

"ఎయిత్ క్లాస్"


"గుడ్.. " డ్రైవర్ ను పిలిచాడు. ధృవను ఆంజనేయులును వారి ఇంటిదగ్గర వదిలి రమ్మని చెప్పాడు ఇన్స్పెక్టర్ రంగా. ఇరువురూ వారికి కరచాలనం చేసి జీప్ ఎక్కారు.

***

ధృవ యింటికి చేరడంలో దాదాపు గంట లేట్ అయింది. తల్లి శాంతి.. తాతయ్య రంగయ్య గారు కాలు కాలనపిల్లుల్లా రోడ్ లోకి, వాకిట్లోకి దిగులుగా తిరుగుతున్నారు. వాకిట్లో జీప్ ఆగింది. డ్రైవర్ కి థాంక్స్ చెప్పి ఇంటి ఆవరణలో ప్రవేశించాడు ధృవ.

అతని వెనకాలే ఆంజనేయులు..


జరిగిన విషయాన్ని ఆలస్యానికి కారణాన్ని ఆంజనేయులు శాంతికి, రంగయ్య గారికి వివరించి ధృవను అభినందించి తన ఇంటికి వెళ్లిపోయారు. ఆనందంతో కొడుకును హృదయానికి హత్తుకుంది శాంతి. నవ్వుతూ తన్నే చూస్తున్న తాతయ్య వైపుకు చూశాడు ధృవ.

“సాహసం చేయరా డింభకా’.. తాతయ్యా! మీరు చెప్పిన ఈ పాతాళభైరవి మాంత్రికుడి డైలాగ్ తలుచుకునే నేను ఈరోజు అలా చేశాను” నవ్వుతూ చెప్పాడు ధృవ. ధృవను దగ్గరికి తీసుకొని తాతయ్య రంగయ్య..


"ఈరోజు వరకే కాదు నాన్నా!.. ఇకముందు కూడా నీ కళ్ళకు కనిపించిన అన్యాయాన్ని సాహసంతో ఎదిరించాలి. సాటివారికి మంచి చేయాలి. " ఆనందంతో ధృవ నొసటన ముద్దు పెట్టాడు. తిరిగి ధృవ తాతయ్య బుగ్గపై అదే పని చేశాడు "మా మంచి తాతయ్య" అంటూ.

***

ఆఫీసు నుండి బయటకు వచ్చి స్కూటర్ ను సమీపించిన ఈశ్వర్ సెల్ మ్రోగింది. నెంబర్ చూశాడు. కొత్త నెంబర్. "హలో.. "

"ఈశ్వర్ సారా! గుడ్ ఈవెనింగ్. ఎస్సై రంగా సార్!.. మీ కుమారుడు ధృవ వెరీ వెరీబ్రేవ్ బాయ్. వాడికి మంచి భవిష్యత్తు ఉంది. మాకు ఒక దొంగను పట్టుకునేదానికి సాయం చేశాడు. అలాంటి బిడ్డ మీ బిడ్డ అయినందుకు మీకు నా అభినందనలు" నవ్వుతూ చెప్పాడు రంగా.

“హి ఈజ్ నాట్ ధృవ బాబు. ధృవతార..”


ఈశ్వర్ కు అంతా అయోమయంగా ఉంది. ఇన్స్పెక్టర్ సెల్ కట్ చేశాడు. విషయాన్ని వివరంగా తెలుసుకోవాలని స్కూటర్ స్టార్ట్ చేసి, వేగంగా తన ఇంటి వైపుకు బయలదేరాడు ఈశ్వర్.


* * *

-సమాప్తం-

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


రచనా వ్యాసంగం: తొలి రచన ‘లోభికి మూట నష్టి’ విద్యార్థి దశలోనే రాశాను, అప్పట్లో మా పాఠశాల బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ నుండి ఈ శ్రవ్య నాటిక అన్ని తరగతులకు ప్రసారం చేశారు.

అందులోని మూడు పాత్రలను నేనే గొంతు మార్చి పోషించాను.

మా నాయనమ్మ చెప్పిన భారత భాగవత రామాయణ కథలు నన్ను రచనలకు పురికొల్పాయి.

ఇప్పటి వరకు 20 నవలలు, 100 కథలు, 30 కవితలు రాశాను.23 views0 comments

Comments


bottom of page