top of page

దిబ్బన్నగోరి....


'Dibbanna Gori' New Telugu Story

Written By Ch. C. S. Sarma

'దిబ్బన్నగోరి....' తెలుగు కథ

రచన: సిహెచ్. సీఎస్. శర్మ


(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

‘‘ఒరేయ్!... దిబ్బా!...’’

‘‘ఏందిరా సుబ్బన్నా?...’’

‘‘నేను పెండ్లి చేసికోవాలను కొంటుండారా!...’’

‘‘ఒకే!... నీది చాలా నాయమాన కోరిక. నీవు నాకంటే పెద్దోడివి కదా! ముందు నీ పెళ్లి జరగాలి కదరా!‘‘


సుబ్బన్న ఆనందంగా నవ్వాడు.

‘‘ఎందుకురా నవ్వుతుండవ్!...’’

‘‘ఆనందంరా!...’’

‘‘ఆనందమా!’’

‘‘ఎందుకు’’

‘‘నీవు నా పెళ్ళికి ఒప్పుకొన్నందుకు!...’’


‘‘ఇంతకూ పిల్ల ఎవర్రా!...

‘‘నీకు బాగా తెలిసినదే. ఆలోచించి ఎవరో సెప్పు!...’’

దిబ్బన్న ఆలోచనలో పడ్డాడు... ఆతనికి ఒక క్యాండిడేట్ గుర్తుకొచ్చింది. అది వాడి లవ్వరు. ఎంటనే అనుమానం... ‘ఈడు లచ్చిని మనసులో పెట్టుకొని మాట్టాడతుండాడా!...’ అనుకొన్నాడు స్వగతంలో.


‘‘జవాబు సెప్పరా!...’’ నవ్వుతూ అడిగాడు సుబ్బన్న.

‘‘నాకు ఎరుకలేదురా!... నివ్వే సెప్పు!...’’ దిబ్బన్న జవాబు.

‘‘చెప్పనా!...’’

‘‘సెప్పు!...’’

‘‘మన...’’

‘‘ఆ...మన!...’’

‘‘మనలచ్చి!...’’ గబుక్కున నవ్వుతూ చెప్పాడు సుబ్బన్న.


దిబ్బన్న ఆశ్చర్యంతో నోరు తెరిచాడు. అతని కళ్ళల్లో కన్నీళ్ళు...

లచ్చి వాళ్ళ మేనమామ రోసిగాడి కూతురు. అన్నతమ్ము లిరువురికీ వరసే...

సుబ్బుడు నాకంటె పెద్దొడు. వాడి మనసులోని మాటను సెప్పిండు.


‘‘నేను చిన్నోణ్ణి. వాడి మాటకు ఒప్పుకోవాల్సిందే!...’’ కళ్ళల్లో నీళ్ళు నిండి చక్కిళ్ళపైకి దిగజారాయి దిబ్బడికి.

‘‘ఓరే దిబ్బా!... ఎందుకురా ఏడుస్తుండావ్?...’’ ఆతృతగా అడిగాడు సుబ్బుడు.


‘‘ఏం లేదురా!...’’

‘‘ఏదో వుంది సెప్పు!...’’


‘‘నీకు తొరలో పెళ్లి కాబోతోందని సంతోషంరా!...’’

‘‘రేయ్!.... నేను నీకన్నా మూడెళ్ళ పెద్ద. నీ అన్నను. నీవు అబద్దం సెబుతుండివ్. నీ మాటను నేను నమ్మ. నిజం సెప్పురా!...’’ ప్రాధేయపూర్వకంగా అడిగాడు సుబ్బన్న.


దిబ్బన్న తలదించుకొన్నాడు. మౌనంగా వుండిపోయాడు.

ఏటి ఒడ్డున శివాలయం. ఇరువురి చూపులు ఆ ఆలయంవైపు మళ్ళాయి. గుడిలో గంటలు మోగుతున్నాయి. అపరార్ణవేళ. అర్చకుడు దైవానికి నివేదన సమర్పించే సమయం. నదిమీద ఉత్తర దక్షిణం ఒక కిలోమీటరు బ్రిడ్జి. దానికి పడమట వైపున నది ఉత్తరం వైపు ఒడ్డున శివాలయం. బ్రిడ్జికి తూర్పున దక్షిణపు వైపున వల్లకాడు. అక్కడ శవసంస్కారం (దహనం) జరుగుతుంది. కొందరి సాంప్రదాయ ప్రకారం గుంటతీసి లోన శవాన్ని వుంచి పూడ్చిడం కూడా జరుగుతుంది.


దిబ్బన్న తండ్రి సాంబన్న. తల్లి గౌరి ఇరువురూ గతించారు. ఆ అన్నతమ్ములకు ఒక అక్క గౌరి. ఆమెకు వివాహం జరిగి ఇరవై సంవత్సరాలు. ఆమె కూతురు లచ్చి. వయస్సు పద్దెనిమిది. అన్న తమ్ములు ఇరువురికి వరసే.


ఎంతగా అడిగినా చెప్పని దిబ్బడి చేతిని తన చేతిలోనికి తీసుకొన్నాడు సుబ్బన్న. శివాలయం వైపు లాక్కెళ్ళాడు.

అర్చకులు వారిని చూచి అరటి ఆకులో నివేదన చేసిన ప్రసాదాన్ని వుంచి తనకు నమస్కరించిన సుబ్బన్న చేతుల్లో వుంచాడు.


‘‘సామీ!’’

‘‘ఏరా!...’’

‘‘ఓ చిన్నసాయం సేయాలయ్య!...’’

‘‘ఏమిట్రా అది?....’’

‘‘కాగితం పెన్ను వుందా అయ్యా!...’’

‘‘ఆ వుందిరా... ఆలయంలో ఎప్పుడూ వుంచుతాను. కొందరు అడుగుతుంటారు. ‘సామీ!... నాలుగు మంచి మాటలను వ్రాసి ఇమ్మని...’ వ్రాసి ఇస్తాను. నీకు అలాంటివి కావాలా!...’’ చిరునవ్వుతో అడిగారు పూజారి పూర్ణానందస్వామి.


సుబ్బన్న నవ్వాడు.

‘‘ఏరా నవ్వుతున్నావు?..’’


‘‘నేను సెప్పింది మీరు చిన్న కాగితపు ముక్కమీద రాయండి సామీ?...’’ వినయంగా అడిగాడు.

‘‘అదేమిట్రా!...’’

‘‘పేరు...’’

‘‘ఎవరి పేరు?...’’


‘‘అక్కకూతురు లచ్చి పేరు సామి... రెండు కాగితాల్లో రాయండి సామీ!...’’

పైన ఒకదాంట్లో నాపేరు... రెండో దాంట్లో మా తమ్మడు యీ దిబ్బడిపేరు. రెంటినీ రాసి మాకు ఏది ఎవరిదని తెలీయకుండా మడచి ఆ సామి ముందు ఏసి... ఒకదాన్ని తమరు చేతికి తీసుకోని అందులో వున్నది నాపేరా... నా తమ్మడిపేరా!... ఏది వుందో సెప్పండి సామీ!... మెల్లగా అభ్యర్థించాడు సుబ్బన్న.


పూజారి పూర్ణానందస్వామి దిబ్బన్న... సుబ్బన్న ముఖంలోకి ఆశ్చర్యంగా చూచారు.

‘‘సామీ!... దయచేసి నేను చెప్పినట్టు సేయండి సామీ!...’’ దీనంగా కోరాడు సుబ్బన్న

పూర్ణానంద స్వామివారు సమానమైన రెండు తెల్లపేపర్ ముక్కలను తీసికొని లచ్చి సుబ్బన్న... దిబ్బన్న లచ్చి పేర్లను వ్రాసి సర్వేశ్వరుల సమక్షాన నేలపై వేశారు.


‘‘సామీ!... మీకు త్రోచిన ఒక దాన్ని సేతికి తీసుకొండయ్యా!...’’

పూజారి సర్వేశ్వరనామ సంకల్పంతో ఒక చీటిని చేతికి తీసుకొన్నారు.

‘‘సామీ!... చదవండి!...’’ నవ్వుతూ కోరాడు సుబ్బన.

పూజారిగారు చీటిని విప్పి... ‘లచ్చి దిబ్బన్న...’ అన్నారు నవ్వుతూ.


సుబ్బన్న మనస్సుకి ఆనందం...

దిబ్బన్న మనస్సున ఆశ్చర్యం...


‘‘ఒరేయ్!... సుబ్బూ... నాకు తెలియక అడుగుతన్నా!... ఏమిట్రా ఇదంతా!...’’

‘‘సామీ!.... తమరికి తెలియదంటూ లేదు. లచ్చి నాకు వరసే. యీడికీ వరసే. దాని మెడకు తాళికట్టి ఏలుకోవాల్సింది ఎవరో ఒక్కరమే కదా సామీ!... తమరు నేను సెప్పినట్టు చేసి ఆ ఒక్కరు ఎవరో తెల్చి సెప్పారు. ఆ...సామీ లచ్చి దిబ్బడి పెళ్ళికు ఓ మంచి మూర్తం సెప్పండి సామీ!...’’ చిరునవ్వుతో అడిగాడు సుబ్బన్న.


పంచాంగాన్ని చేతిలోకి తీసికొని పదినిముషాలు నాలుగుపేజీలు తిప్పి... వేళ్ళమీద పదో గణితాన్ని లెక్కించారు పూర్ణానంద స్వామి.

ఇరువురు అన్న తమ్మలు ఆసక్తికరంగా వారి ముఖంలోకి చూస్తున్నారు.

‘‘రేయ్!... సుబ్బు!...’’

‘‘ఆ సామీ! సెప్పండి!...’’


‘‘ఈ రోజు సోమవారం వచ్చే సోమవారం వుదయం ఇదే సమయం చాలా బాగుంది.’’ నవ్వుతూ చెప్పారు స్వామీజీ.

‘‘సంతోషం సామీ!... దండాలు... ఎల్లొస్తా సామీ!...’’ నమస్కరించి ప్రసాదంతో వారి ఏటి ఒడ్డున వున్న గుడిశకు చేరారు అన్న తమ్మలు.

* * *

సుబ్బన్న... స్వామివారు చెప్పిన ముహూర్తానికి లచ్చి దిబ్బల వివాహాన్ని జరిపించాడు. అయిన వాళ్ళందరూ ఆదపంతులను దీవించారు. ఆ రాత్రి వేకువన సుబ్బన్న వూరు విడిచి ఎటో వెళ్ళిపోయాడు. తెల్లవారి... దిబ్బడు తన అన్నకోసం వూరాంతా వెదికాడు. ఎందరినో అడిగాడు. ఎవరూ చూచినట్లు చెప్పలేదు.


‘నా మనస్సులోని అభిప్రాయాన్ని ఎరిగిన అన్న నాకు లచ్చకి పెండ్లి చేశాడు. లచ్చి తన మనస్సులోనూ వున్నందన తాను ఇక్కడ వుంటే సమస్యలు వస్తాయని... వూరేవదలి పోయాడు. గొప్పోడు. మా అన్న సుబ్బన్న.... చాలా చాలా గొప్పోడు...’ అనుకొన్నాడు దిబ్బన్న.

* * *

కాలగతంలో రెండు సంవత్సరాలు జరిగిపోయాయి... లచ్చికి మొగబిడ్డ పుట్టాడు. వాడికి సూరన్న అని పేరు పెట్టారు.

మరో పది వసంతాలు తోచుకొని... తోచుకొని వచ్చి వేగంగా వెళ్ళిపోయాయి. అప్పటికి సూరన్న వయస్సు పదకొండు సంవత్సరాలు.


లచ్చికి సూరన్న అంటే పంచప్రాణాలు. ‘‘రేయ్! బిడ్డా! నీవు బాగా చదవాలయ్య. మంచి చెడ్డలను బాగా తెలిసికొని... మంచి విలువను ఎరిగి... పదిమందికి మంచి చేయాలనే ఆలోచనలో ఎప్పడూ బతకాలయ్యా! పెద్ద పెద్ద వాళ్ళు మెచ్చుకొనేలా గొప్పోడివి కావాలయ్య!...’’


సూరన్న దగ్గర కూర్చోపెట్టుకొని అప్పుడప్పుడూ తనకు తెలిసిన ఆ మాటలను చెబుతూ వుండేది లచ్చి.


వివాహానంతరం... ఒక సంవత్సరం దిబ్బన లచ్చికి ఇష్టంలేకున్నా చుట్టూ తిరిగేవాడు. సూరన్న కడుపున పడ్డాక... అతనిలో మార్పు కలిగింది. లచ్చి ఇష్టం లేకుండానే తనతో వర్తిస్తూ నటిస్తూవుందని గ్రహించాడు. ఆమె మనస్సున తన అన్న సుబ్బన్న వున్నాడన్న విషయం అర్థం అయింది.


వెంటనే ఒక వారం ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలనన్నింటినీ అన్న సుబ్బన కోసం వెదికాడు. ప్రయోజనం లేకపోయింది. తాను సుబ్బన్నకు లచ్చికి అన్యాయం చేశానని బాధపడేవాడు. బాధను మరిచేదానికి కాటి సుంకాన్ని కల్లుపాకలకు చెల్లించేవాడు.


ఆవేదనలో లచ్చి అనేకసార్లు దిబ్బన్నను వారించేది. ‘నేను నీకు అన్యాయం చేశాను లచ్చి. నేను నీకు అన్యాయం చేశాను లచ్చి...’ అని బోరున ఏడ్చేవాడు.

దిబ్బడే సర్వసం అని నమ్మిన లచ్చి అతని దుస్థితిని చూచి ఎంతగానో బాధపడేది. పది ఇళ్ళలో పనిచేసి... సూరన్నను హాస్టల్లో వుంచి బాగా చదివించేది.


పనికి పోయి ముగించుకొని గుడిశకు తిరిగివస్తూ వుండగా... తాగి లారీ నడుపుతున్న ఒక మహనీయ్యుడు లచ్చిని గుద్ది పారిపోయాడు.

లచ్చికి సంసారిక యాతనా నరకాన్నించి విముక్తి కలిగింది. చనిపోయింది.


ఆ నోటా ఈ నోట పడి విషయం దిబ్బడికి తెలిసింది. హాస్పటల్ కు పరుగెత్తాడు.

మార్చీరీలో వున్న లచ్చి శవాన్ని యాంబులెన్స్ లో ఏటి ఒడ్డున వున్న తన గుడిశకు తీసికొచ్చాడు.

అది మల్లె పూల సీజన్. మూడు గంటల నుంచి ఆవూర్లో తోపుడు టైర్ బండ్లమీది మల్లెపూలను పోసుకొని విడిపూలను సేర్లు లెక్కన అమ్ముతారు. మస్తాన్ దిబ్బన స్నేహితులు. లచ్చిపోయిందన్న మాట వినగా పరుగెత్తుకొని దిబ్బన్న గుడిశకు వచ్చాడు. దిబ్బన్నను చుట్టుకొని బోరున ఏడ్చాడు.

దిబ్బన్న పెన్నలో దిగి తన భార్య గోతిని తానే స్వయంగా కన్నీటితో నేలను తడిపి ఆచారం ప్రకారం గోతిని తీశాడు.


ప్రాణస్నేహితుడు మస్తాన్ తన పూల బండిని తోసుకొని వచ్చి దిబ్బన్న గుడిశముందు నిలిపాడు.

స్నేహితుని సమీపించి తన సోదరి అంతిమ యాత్రకు కావలసని సన్నాహాన్ని చేశాడు.

చమటలు కార్చుతూ ఎటినుండి గుడిశకు వచ్చని స్నేహితుని చుట్టుకొని బోరున ఏడ్చాడు మస్తాన్.

లచ్చి శకటం మల్లెపూలతో అలంకరించాడు మస్తాన్. నలుగురు మిత్రులు శకటాన్ని (పాడె) ను నదిలో దిబ్బడు తీసిన గుంట ప్రక్కకు చేర్చాడు. లచ్చిని మెల్లగా గుంటలో మస్తాన్ పరచిన మల్లెపూల పాన్పుపైకి దించాడు.


పైన మల్లెపూలను బోరున ఏడుస్తూ చల్లాడు దిబ్బన్న.... మస్తానులు.

గుంట మట్టితో కప్పబడింది. లచ్చి శకం ముగిసింది.

* * *

అప్పటికి సంవత్సరం ముందు సుబ్బన్న వచ్చి.... సూరన్న వున్న హాస్టల్ కు వెళ్ళి తనను గురించి అతనికి చెప్పి... మెప్పించి లచ్చిని ఒప్పించి.... తనుతో తీసుకొని వెళ్ళాడు. ఆ సందర్భంలో తాను ఎక్కడివున్నాదీ... ఏం చేస్తున్నదీ మస్తాన్ కు చెప్పి వెళ్ళిపోయారు. జరిగిన విషాధ విషయాన్ని మస్తాను సుబ్బన్నకు ఫోన్ ద్వారా తెలియజేశాడు. సూరన్నతో సుబ్బుడు వచ్చాడు. లచ్చి అంత్యక్రియల్లో వారిరువురూ పాలుపంచుకొన్నారు. కన్న తల్లి శవాన్ని చూచి సూరన్న బోరున ఏడ్చాడు. సుబ్బన్న మస్తానులు అతన్ని ఓదార్చారు.


గుంటూరులో సుబ్బన్న ఒక ఫుట్ వేర్ షాపుకు యజమాని. నలుగురైదుగురు షాపులో పనిచేస్తున్నారు. సూరన్నను హాస్టల్ లో చేర్చి చదివిస్తున్నాడు. అప్పటి అతని వయస్సు పదమూడు సంవత్సరాలు. ఎనిమిదో తరగతి చదువుతున్నాడు.


లచ్చి కార్యక్రమం ముగిశాక సుబ్బన్న సూరన్నను తీసికొని గుంటూరు వెళ్ళిబయలు దేరారు.

‘‘అన్నా!...’’ పిలిచాడు దిబ్బడు.

‘‘ఏరా!...’’

‘‘పిల్లోణ్ణి వుంచి పోరాదూ!...’’


‘‘ఒద్దు పరీక్షలు దగ్గరపడినయి. వాడు బాగ చదవాలి. మంచి ఉద్యోగి కావాలి. అది మనలచ్చి ఆశరా!... దాని అశను నేను నెరవేరుస్తా!...’’ గంభీర వదనంతో చెప్పాడు సుబ్బన్న.

తల ఆడించాడు దిబ్బడు.


సుబ్బన్న... సూరన్నలు గుంటూరికి వెళ్ళిపోయారు. ఖర్మ రోజు ఇరువురు నెల్లూరికి వచ్చారు. విధులను నెరవేర్చి గుంటూరుకు బయలు దేరారు.

దిబ్బన్న కళ్ళలో కన్నీరు.


సుబ్బన్న అతన్ని సమీపించాడు.

‘‘రేయ్!.... ఇంక నీకు ఈడ ఏముందిరా!... మాతో గుంటూరికి రా.. షాపులో కూకొని పనిచేసుకొందువు. ప్రతిరోజూ సూరిగాణ్ణి కంటారా చూచుకొందువు. నా మాట ఇనరా!...’’ ఎంతో ఆప్యాయంగా చెప్పాడు సుబ్బన్న.


దిబ్బన్న విరక్తిగా నవ్వాడు.


‘‘ఓరే అన్నా!... ఈ తల్లి గట్టున తాత... నాయన... కాటికాపరులుగానే బతికారు. ఈ మట్టిలోనే కలిసి పోయిండ్రు. నాకూ అదే ఆశరా!... నేను నీతో రాలేను. నేను రాలిపోయానని తెలిసిన దినాన సూరన్నను తీసుకోనొచ్చి... నన్ను లచ్చి పాదాల కింద పూడ్చరా!... నాకు ఆమె మనసు లేటుగా తెలిసింది. నా వల్ల ఆమెకు సుఖంలేదు. నేను ఆమె ఇషయంలో తప్పు చేసినా అన్నా!... నీకు అన్యయం చేసినా అప్పటి నా మనసెరిగి నీవు నాకు న్యాయం చేసినావ్.. తప్పు చేసినా! నేను తప్పు చేసినా!... నన్ను క్షమించన్నా!...’’ బోరున ఏడుస్తూ సుబ్బన్న కాళ్ళు పట్టుకొన్నాడు దిబ్బన్న.

సుబ్బన్న కళ్ళల్లో కన్నీరు పాత జ్ఞాపకాల పరుగులు తమ్ముణ్ణి బుజాలు పట్టుకొని పైకి లేపాడు. తన పై పంచతో దిబ్బన్న కన్నీళ్ళు తుడిచాడు.


‘‘అంతా దైవనిర్ణయం. జరగాల్సిన రీతిగా జరిగిపోయింది. నీ తప్పు ఏమీలేదురా జాగ్రత్త. అతిగా తాగకు. ఆరోగ్యాన్ని పాడుచేసుకోకు. ఇక మేము బయలుదేరుతాము...’’


సూరన్న ఇరువురినీ విచిత్రంగా చూస్తుండిపోయాడు. అతని కళ్ళల్లో కన్నీటి జీరలు.

సుబ్బన్న సూరన్న చేతిని తన చేతిలోనికి తీసుకొని వారి గుడిశల ప్రాంతాన్ని దాటి రోడ్డు మీదికి చేరాడు. దిబ్బన్న వారిని కన్నీటితో సాగనంపాడు.

* * *

కాలచక్రం... ఎనిమిది వసంతాలను వన్నె చెన్నెలతో చూచింది. అప్పటికి సూరన్న వయస్సు ఇరవై రెండు సంవత్సరాలు. యం.ఏ. స్టేట్ ఫస్టులో పాసైనాడు. పేపర్లలో ఫోటో పడింది. యం.ఆర్.ఓ. వుద్యోగం వచ్చింది. పోస్టింగ్ విశాఖపట్నం. నెల్లూరి వచ్చి తండ్రికి విషయాన్ని చెప్పి... తండ్రి పాదాలు తాకి ఆశీర్వచనం తీసుకొన్నాడు.


‘‘నాన్నా!....’’

‘‘ఏం అయ్యా!...’’

‘‘నీకు వయస్సు అయింది నాన్నా!... నీవు చేసే పని మానెయ్. నాతో విశాఖపట్నం రా. హాయిగా ఇంట్లో విశ్రాంతి తీసుకొందువుగాని!’’

ప్రాధేయపూర్వకంగా చెప్పాడు సూరన్న.


‘‘సూరా!.... చూడు. ఈ నది దక్షిణపు ఒడ్డే నా రాజ్యం. పుట్టింది పెరిగింది... ఆడింది పాడింది అంతా యీడనేనయ్యా. ఈ జాగాలకు నాకు ఎంతో ఋణానుబందం. ఈ వయస్సులో ఈ నా తల్లని ఒదిలి నేను ఎక్కడికి రాలేను. అదుగోసూడు. ఒక యాపచెట్టు దాని ముందు వున్నది. మీ అమ్మ సమాది. నేను చచ్చిపోతే నన్నూ మీ అమ్మపాదాల కింద పూడ్చిపెట్టయ్యా. నాకుగా నీవు ఆ పని చేస్తే నేను చాలా సంతోషిస్తానయ్యా!... ఎల్లు... ఉద్యోగంలో చేరి ధర్మంగా న్యాయంగా పనిసెయ్యి. మంచోడు అన్న పేరు తెచ్చుకో. నా కోరికను మరచిపోకు.’’ విరక్తగా నవ్వాడు దిబ్బన్న.


సూరన్న ఎంతో బ్రతిమాలాడు తనతో రమ్మని... దిబ్బన్న ససేమీరా ఒప్పుకోలేదు.

సూరన్న వెళ్ళిపోయాడు.

* * *

కార్తీకమాసం.. విపరీతమైన వర్షాలు.. వయస్సు మీరిన ఆడవారు నలుగురు... మగవారు ముగ్గురు... గతించారు. దిబ్బన ఆరోగ్యం పూర్తిగా సన్నగిల్లింది. అయినా ఆ ఏడు శవాలకు ఏటిఒడ్డున ఏడు గోతులు తీశాడు. మట్టి క్రింద కప్పెట్టేశాడు.


వారం రోజులుగా కుండపోతగా కురిసిన వాన ఆగింది. దిబ్బన్న పెన్నలో మునిగి శివాలయాన్ని సమీపించాడు. లోన ప్రవేశించకూడని కారణంగా సర్వేశ్వరునికి ఎదురుగా ఆలయం బయట చేతులు జోడించాడు.


‘‘సామీ!.... కాళ్ళు సేతులు నామాట ఇనడంలే. ఎందరికో ఎన్నో గుంటలు తీసినా. అయ్యా సామీ! నా గుంటను నాలచ్చి కాళ్ళకింద నేను తీసికోవాలని నాకోరిక. అందులో పడుకొని... నిన్ను తలుచుకొంటూ కళ్ళుమూయాలని నా ఆశ. నా తప్పుల్ని మన్నించు. సామీ చివరి కోరికను తీర్చు నా సామీ. తీర్చు!’’ కన్నీటితో వేడుకొన్నాడు.


పూజానివేదనలను ముగించి పూర్ణానందస్వామి ఆలయం నుండి బయటికి వచ్చాడు. దిబ్బడిని చూచాడు. నవ్వుతూ పలకరించాడు. మూట విప్పి గిన్నెలోని ప్రసాదాన్ని దిబ్బడి చేతిలో వుంచి వారు మూటను సర్ధుకొని వెళ్ళిపోయాడు.


దిబ్బడు తన చేతిలోని ప్రసాదాన్ని కళ్ళకు అద్దుకొని సర్వేశ్వరులను తలుచుకొంటూ నోట్లో వేసికొన్నాడు. చేతులు జోడించి శివన్నకు నమస్కరించాడు. తన గుడిశ వైపుకు బయలుదేరాడు.

గడ్డపార... పార చేత పట్టుకొని నది ఒడ్డున వున్న వేపచెట్టును సమీపించాడు.


లచ్చిగోరీ క్రింద త్రవ్వి గోతెను తీయ్యడం ప్రారంభించాడు. వానవలన తడిసిన ఇసుక గడ్డపార ప్రమేయం లేకుండానే పారతోనే సులభంగా గుంటను తీయగలిగాడు. ఒకటిన్నర గంట సమయంలో ఆకాశంలో కారుమబ్బులు, వురుములు మెరుపులు. వర్షం ప్రారంభమయింది.


చలికి దిబ్బడు గడగడ వణుకుతున్నాడు. పెన్న పొంగింది. నీటి వేగం ప్రవాహం ఇసుక కరిగి కాలుజారి దిబ్బడు గుంటలో పడిపోయాడు.


నీటితో పాటి వచ్చిన ఇసుక ఆ గుంటను కప్పేసింది. నీరు దారులు తన్ని ప్రవహించసాగాయి.

దిబ్బన్న ఆశయం... ఎలాంటి పోరాటం... బాధ... శ్రమ లేకుండా పకృతి మాత శక్తి సర్వేశ్వరులు ఆ రీతిగా తీర్చారు. దిబ్బడి ఆత్మ మహదానందం తో గాల్లో కలసిపోయింది.


ఆ వర్షపు ఉరవడి పెన్నా ప్రవాహం రెండు రోజులు కొనసాగింది. మూడవరోజు... సుబ్బన్న సూరన్న బషీర్ లు వేప చెట్టు క్రిందకు వచ్చారు. అక్కడ వున్న పార... గడ్డపారలను కొంత ఇసుకను తోడి చూచారు. దిబ్బన్న శవాన్ని కూడా తలవైపు చూచారు. కన్నీరు కార్చారు.


సూరన్న తండ్రి క్రతువులను పెదనాన్న, బషీర్ భాయి సహాయంతో సవ్యంగా నిర్వర్తించాడు. నెలరోజుల లోపలే ‘‘దిబ్బన్న గోరీ’’ వేపచెట్టు క్రింద రెండవదిగా వెలిసింది. తల్లి తండ్రి గోరీలు సూరన్నకు పూజనియ్యమైనాయి.


* * *

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


రచనా వ్యాసంగం: తొలి రచన ‘లోభికి మూట నష్టి’ విద్యార్థి దశలోనే రాశాను, అప్పట్లో మా పాఠశాల బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ నుండి ఈ శ్రవ్య నాటిక అన్ని తరగతులకు ప్రసారం చేశారు.

అందులోని మూడు పాత్రలను నేనే గొంతు మార్చి పోషించాను.

మా నాయనమ్మ చెప్పిన భారత భాగవత రామాయణ కథలు నన్ను రచనలకు పురికొల్పాయి.


27 views0 comments
bottom of page