top of page

డాక్టర్ ఋషి


'Doctor Rushi' - New Telugu Story Written By Ch. C. S. Sarma 

Published In manatelugukathalu.com On 17/08/2024

'డాక్టర్ ఋషి' తెలుగు కథ

రచన: సిహెచ్. సీఎస్. శర్మ


"సర్వేశ్వర నిర్దేశకమైన ఈ మహా సృష్టిలో నలుబది కోట్ల అనేకమైన తెగలతో జీవరాసులు ఉన్నాయి. ఆ జీవరాసుల్లో మానవుడు సర్వశ్రేష్టుడు. మనిషికి ఆ సృష్టికర్త మూడు గొప్ప గుణాలను ప్రసాదించాడు. ఒకటి ఆలోచనాశక్తి. రెండు విచక్షణాశక్తి. మూడు జ్ఞాపకశక్తి.


అడవుల్లో ఎన్నో వన్య క్రూరమృగాలు, సాధు జంతువులు వుంటాయి. స్వజాతితో అవి ఎంతో ఐకమత్యాలతో వుంటాయి. ఆహారం కోసం ఒక తెగ, మరో తెగను వేటాడుతుంది, చంపుతుంది, తింటుంది. ఆకలి తీరాక వేటినీ ఏమీ చేయవు. కానీ.... సర్వోత్తమమైన మానవుడు వన్యమృగాలకు భిన్నంగా స్వజాతిపైనే కోపతాపాలు, కక్షలు, కార్పణ్యాలు, పగ, ప్రతీకారాలను కలిగి, స్వార్థంతో, అజ్ఞానంతో, ఆవేశంతో సాటి మనిషిని హతమారుస్తాడు (చంపుతాడు). అంటే ఈ మహోన్నత జీవుడు ఆ అడవి వన్యమృగాలకన్నా (కొందరు) హీనులు. స్వార్థం కన్నా నీచాతినీచమైన గుణం మరొకటి లేదు." డాక్టర్ ఋషి చెప్పడం ఆపేశాడు. దీనికంటే ముందు వారి మధ్యన వ్యాధులు, ట్రీట్‍మెంట్స్ గురించి చర్చ జరిగింది.


అతని ముందున్న పాతికమంది మెడికల్ స్టూడెంట్స్ మౌనంగా వారి ముఖంలోకి ఆశ్చర్యంతో చూడసాగారు. 


"నేను చెప్పినదానికి ఎవరైనా, ఏదైనా ఆక్షేపణను తెలియజేయతలుచుకుంటే యూ ప్లీజ్ ఆస్క్ మీ" అన్నాడు డాక్టర్ ఋషి. 


ఎవరూ నోరు విప్పలేదు. కారణం వారు చెప్పింది సత్యం, నిప్పులాంటి నిజం.

మీటింగ్ పూర్తయ్యింది.


"ఓకే! లెట్ అజ్ డిస్‍బర్స్" చిరునవ్వుతో చెప్పి డాక్టర్ ఋషి హాల్లో నుండి బయటకు నడిచాడు.

  *

డాక్టర్ ఋషి ఎం.బి.బి.యస్ (భారత్) ఎండి. యఫ్. ఆర్. సి.ఎస్ అమెరికా. వారి తండ్రి గారు రామచంద్రయ్య, తల్లి అన్నపూర్ణమ్మ. ఋషికి మన దేశం అన్నా, దేశ ప్రజలన్నా, కన్నతల్లిదండ్రులన్నా, తోడబుట్టువులు అన్నా ఎంతో ప్రేమాభిమానాలు.


పుట్టినప్పుడు ఒట్టిచేతులతో దిగంబరంగా వచ్చాము. పోయేటప్పుడు ఒట్టి చేతులతో కనీసం వంటిమీద బట్టకూడా లేకుండా మట్టిలో కలిసిపోతాము. జీవితం మూడునాళ్ళ ముచ్చట, రైలు ప్రయాణంలాంటిది. వారి వారి స్టేషన్ రావడంతోనే ఆ స్టేషన్‍లో దిగిపోవలసిన వారి దిగిపోతారు ఎక్కవలసిన వారు ఎక్కుతారు. అశాశ్వతమైన ఈ జీవిత పయనంలో కన్నవారిని సోదరీ సోదరులను విడిచి దూరదేశాల్లో కేవలం డబ్బు కోసం పనిచేయడం ఇష్టంలేక చదవదలచుకొన్నవి చదివి, మూడు సంవత్సరాలు పనిచేసి స్వదేశానికి తిరిగి వచ్చాడు ఋషి. 


శ్రీరామకృష్ణ పరమహంస, శ్రీ వివేకానందస్వామీజి. శ్రీ భగవాన్ రమణమహర్షిలు అంటే వారికి ఎంతో ఇష్టం. వారి చరిత్రలను, సందేశాలను చదివేవాడు. భూమిపై వున్నంత వరకూ మనిషి.... మంచి మనిషిగా బ్రతకాలన్నది నేర్చుకొన్నాడు. ’పరోపకారం ఇధం శరీరం’ అన్న వేదవాక్యాన్ని నమ్మి, హృదయపూర్వకంగా పాటించే వ్యక్తి డాక్టర్ ఋషి.


అతనికి ఒక తమ్ముడు శివ, చెల్లెలు పార్వతి వున్నారు. తండ్రి రామచంద్రయ్య బియ్యపు వ్యాపారి. రెండు రైస్ మిల్లులు వున్నాయి. తల్లి అన్నపూర్ణమ్మ. హౌస్ వైఫ్. వారికి పది ఎకరాల పంట భూమి, పదిహేను ఎకరాలు పంట భూమి, పదిహేను ఎకరాల తోటలు (మెట్టభూమి) వున్నాయి. తండ్రికి, వ్యవసాయ విషయంలో శివ సాయం చేస్తుంటాడు. చెల్లి బి.యస్సీ ఫైనల్ ఇయర్ చదువుతూ ఉంది. తన గ్రామంలో హాస్పిటల్‍ను నిర్మించి పేదలకు ఉచితంగా వైద్యాన్ని చేస్తున్నారు డాక్టర్ ఋషి.


వినలేని బాలబాలికలు (Deaf, చెవిటితనం), మాట్లాడలేని బాల బాలికలు (Dubm, మూగతనం) కల బాలబాలికలకు ఒక పాఠశాలను నిర్మించి నడుపుతున్నాడు. దాదాపు అరవైమంది బాలబాలికలు ఆ పాఠశాలలో చదువరులుగా వున్నారు. వారికి హాస్టల్ వసతిని కల్పించాడు. 


వైద్యరంగంలో అతను ప్రముఖుడు. అలాంటి స్కూలును నిర్మించాలనే తన ఉద్దేశాన్ని తన క్లాస్, కాలేజి, తాను చదివిన అమెరికాలో మిత్రులకు తెలియజేయగానే, అందరూ వారివారికి తోచిన విరాళాలను పంపారు. అతని సత్ సంకల్పానికి చక్కటి రూపకల్పన జరిగింది. ఆయా విద్యా విధానాలలో సుక్షితులైన ఉపాధ్యాయులను నియమించాడు. పిల్లలకు ఫస్ట్ క్లాస్ నుండి టెన్త్ క్లాసు వరకు శిక్షణ జరిగేలా ఏర్పాటు చేశాడు డాక్టర్ ఋషి. 


ఈ రెండు వర్గాల్లో చెవిటితనం (Deaf) చాలా విచారకరమైనది. కారణం తన గురించి ఎదుటి వారు ఏం మాట్లాడుతున్నారన్న విషయాన్ని ఆ చెవిటి వ్యక్తి వినలేనందున. కానీ ఆ దైవం వారికి మంచి తెలివితేటలను, సూక్ష్మబుద్ధిని ప్రసాదిస్తాడు. చదువువిషయంలో వారు, చాలా తెలివికలవారుగా, మేధావులుగా వుంటారు. డాక్టర్ ఋషి వయస్సు ముఫ్పై రెండు సంవత్సరాలు. కానీ ఇంకా వివాహం చేసుకోలేదు. అతను అమెరికా నుండి తిరిగి వచ్చి దాదాపు మూడు సంవత్సరాలు. నాలుగైదుసార్లు తల్లిదండ్రులు అతనితో వివాహ ప్రసక్తిని జరిపారు.


జవాబుగా డాక్టర్ ఋషి తల్లిదండ్రులకు ఇచ్చిన జవాబు.... "వివాహం మీద నాకు ఆసక్తి ప్రస్తుతానికి లేదు. కొంతకాలం జరగనివ్వండి" అన్నాడు.


ఐదారుసార్లు వివాహ విషయాన్ని గురించి అడిగిన తల్లిదండ్రులకు ఋషి ఇచ్చిన సమాధానం ఆ పై రెండు మాటలే.


డాక్టర్ ఋషి ఎప్పుడూ చాలా బిజీగా వుంటాడు. తన గ్రామంలోని హాస్పిటల్‍ను ఉదయం నుండి మధ్యాహ్నం వరకూ చూచుకొంటాడు. వారికి సహాయంగా ఇద్దరు డాక్టర్స్ హాస్పిటల్లో వున్నారు. వారు బెస్ట్ న్యూరోసర్జన్ (Specializing in surgery on the nervous system. Especilly the brain and spinal cord)


వారి గ్రామానికి జిలా హెడ్ క్వార్డర్స్ కు పదిహేను కిలోమీటర్లు. అక్కడ వున్న ఐదారు హాస్పిటల్స్ కు మధ్యాహ్నం భోజనం అయిన తరువాత వెళతాడు. విజిటింగ్ ప్రొఫెసర్ (సలహాదారుడుగా) ఆ హాస్పిటల్స్‍ను చూచుకొని రాత్రి తొమ్మిది పదిగంటల మధ్యన ఇంటికి వస్తాడు. ఒక్కోరోజు తాను చేయవలసిన ఆపరేషన్ ఏదైనా వుండిన, దాన్ని ముగించి ఇంకా పొద్దుపోయాక ఇంటికి వస్తాడు. తన దినవారి ప్రోగ్రామ్‍ను తల్లిదండ్రులకు వివరంగా చెబుతాడు.

  *

అంత ఉన్నతస్థాయిలో వున్న డాక్టర్ ఋషి వివాహ నిరాకరణకు ఆరు సంవత్సరాల క్రింద జరిగిన ఒక విచారకర సంఘటన ప్రధాన కారణం.

అక్క... శాంతి వివాహం....


ఋషి అక్క వివాహం వారంరోజుల్లో జరగనున్న సమయంలో అమెరికా నుండి తిరిగివచ్చాడు. తల్లిదండ్రులకు సోదరీ సోదరులకు అతని రాక మహాదానందం. శాంతికి, ఋషికి వయస్సులో వ్యత్యాసం ఒకటిన్నర సంవత్సరం. శాంతికి ఉపాధ్యాయ వృత్తి అంటే చాలా ఇష్టం. ఎం.ఎ లిట్, పి.హెచ్.డి ఉత్తమశ్రేణిలో పాసయ్యింది. జిల్లా నగరంలో ఒక కాలేజీలో ఇంగ్లీషు లెక్చరర్‍గా జాయిన్ అయ్యింది. ఆ ఉద్యోగం శాంతికి ఎంతో ఆనందాన్ని కలిగించింది.


దగ్గరి బంధువుల అబ్బాయి శాంతారామ్‍తో ఆమె వివాహం ఎంతో ఘనంగా జరిపించారు తల్లిదండ్రులు, ఋషి.


శాంతారామ్ కుటుంబం చాలా పెద్దది. అతనికి ఇద్దరు అన్నలు, ముగ్గురు సోదరీమణులు. అన్నలిరువురుకీ పెద్ద చెల్లెలు సుజాతకు వివాహాలు జరిగాయి.


తల్లి శకుంతల, తండ్రి ధర్మారావు. అన్నలు రఘుపతి, అతని భార్య సరళ. చిన్న అన్న గోపీనాథ్, అతని భార్య కామిని. పెండ్లి కాని సోదరీమణులు గీత, గిరిజలు. అంతా కలిసి ఒకే కుటుంబం. ధర్మారావుగారు కాంట్రాక్టర్. మంచి మనిషి. ఎక్కువరోజులు బయట పనిమీద వుంటారు. దైవభక్తి కలవాడు. వ్యాపారరీత్యా వారికి చాలా మంచిపేరు. తన జీవితకాలంలో అందరూ కలిసి ఒకే కుటుంబంగా సహాజీవనాన్ని ఆనందంగా గడపాలన్నది వారి నిర్ణయం. అర్థాంగి శకుంతలకు అది నచ్చకపోయినా, ధర్మారావును ఎదురించే సాహసం, వారి భావాలకు వ్యతిరేక భావాలను వారికి చెప్పి కొడుకులకు వేరే కాపురాలను పెట్టించేదానికి సాహసించలేకపోయింది శకుంతల. ఆమెకు చిన్న కూతుళ్ళు గీత, గిరిజ అంటే పంచ ప్రాణాలు. తాను తలచుకొన్నది సాధించేవరకూ నిద్రపోదు. మహాగర్విష్టి. అహంకారి....


శాంతి వివాహానంతరం ఆ యింటికి కాపురానికి వెళ్ళింది. శాంతి అత్తవారి ఇంటికి వెళ్ళేముందు, ఆమె తల్లి అన్నపూర్ణమ్మగారు...


"అమ్మా శాంతీ! మీ అత్తగారి కుటుంబం చాలా పెద్దది. అందరూ నీలాగే బాగా చదువుకొన్నవారు. ప్రతి వ్యక్తిలోనూ స్వార్థం, ద్వేషం అనే ఈ రాక్షసగుణాలు నివురుకప్పిన నిప్పులా వుంటాయి. తమ నిర్ణయాన్ని ఎదుటివారు కాదన్నా, వారిని విమర్శించినా ఆ గుణాలు బయట పడుతాయి. వాదనలు పెరుగుతాయి. 


పర్యవసానం వారు వారిని ఎదిరించిన మంచివారిని విరోధభావంతో చూస్తారు. మాటలతో కించపరుస్తారు. రెచ్చగొడతారు. అలాంటి సమయంలో.... ఆ సమస్యకు లోనైన మంచివారు మౌనంగా చెవిటివారిలా, వారి మాటలను పట్టించుకోకుండా, వారికి వీలైనంత దూరంగా వుండటం శ్రేయస్కరం. దీన్నే సహనం అంటారు పెద్దలు. నీ సహనం నీకు సదా శ్రీరామరక్ష అవుతుంది తల్లి!.... గుర్తుంచుకో!.... ఎంతో ప్రాధేయపూర్వకంగా చెప్పింది అన్నపూర్ణమ్మ. శాంతి తల ఆడించింది. తల్లి అక్కకు చేసిన నయబోధను ఋషి విన్నాడు. 


వివాహం అయిన తరువాత భర్తవారి అత్తామామల ఇష్టానుసారంగా శాంతి ఉద్యోగాన్ని మానవలసి వచ్చింది. ఋషి అమెరికా వెళ్ళిపోయాడు.


శాంతి... కాపురానికి వెళ్ళిన నెలరోజుల తర్వాత ఒక దుస్సంఘటన జరిగింది. ఆ ఇంటి ఆడవారికందరికీ శాంతిపట్ల ద్వేషం. కారణం వారందరికన్న బాగా ఎక్కువ చదువును చదివింది. బయట దండాలమీద అందరి వస్త్రాలు కాయడానికి వేసి వున్నారు. అది నవంబర్ నెల. ఆశ్వయుజ మాసం. వర్షాకాలం కొద్ది నిముషాల్లోనే వాతావరణం మారిపోయింది. వర్షం ప్రారంభమయ్యింది.

అత్తగారి ఆదేశానుసారం శాంతి బయట ఆరవేసిన గుడ్డలను తీసుకొని వచ్చేటందుకు వానలో తడుస్తూ వెళ్ళింది. తల్లి ప్రక్కన వున్న ఆమె చిన్న కూతుళ్ళు గీత, గిరిజలు శాంతి అవస్థను చూచి ఆనందంగా నవ్వుకోసాగారు. అది తప్పు అని ఆ తల్లి ఆ పిల్లలను మందలించలేదు. ఆ సన్నివేశం ’ఎలుకకు ప్రాణసంకటం. పిల్లికి చెలగాటం’లా వుంది. వానలో తడుస్తూ శాంతి దండాల మీది గుడ్డలను ఒకసారి తీసుకొని వచ్చి హాల్లో సొఫాలపైన వేసింది. ఇంకా వున్నందున మరోసారి వెళ్ళక తప్పలేదు. 


శాంతి వేగంగా గుడ్డలను తీస్తూ వుంది. చిత్రంగా పెద్ద పెద్ద ఉరుములు... మెరుపు ’ఢాం...’ అనే పెద్ద శబ్దంతో పిడుగుపడింది. అది శాంతి తలను తాకింది. శాంతి భయంతో అమ్మా అని అరిచి నేలకూలింది. అమ్మా కూతుళ్ళు ఆ సన్నివేశాన్ని చిత్రంగా ఇంట్లోనుండీ చూస్తున్నారు. 

అప్పుడే కారు దిగి ఇంట్లోకి వచ్చిన శాంతారామ్ దొడ్డివైపుకు వున్న ద్వారం గుండా శాంతిని చూచాడు. పరుగున వెళ్ళి నేలకూలిన శాంతిని సమీపించాడు. స్పృహ లేకుండా నేలపడివున్న శాంతిని తన చేతుల్లోకి తీసుకొని ఇంట్లోకి వచ్చాడు.


శాంతిని మంచంపై పడుకోబెట్టారు. అందరూ డేగల్లా ఆ మంచంచుట్టూ చేరారు.

"ఇప్పుడేమయిందని? కావాలని యాక్షన్ చేస్తూవుంది..." ఒకరు.


"అవునవును ఈ రీతిగా కొన్ని రోజులు మంచం దిగకుండా రెస్టు తీసుకోవచ్చుగా!" మరొకరు.


"గలగలా మాట్లాడకుండా మౌనంగా మూగవారిలా వుండేవారిని నమ్మకూడదు!" మూడవ స్త్రీమూర్తి.

కోడళ్ళు అత్త ధోరణి ఆ రీతిగా సాగింది.


"నేను ఈవిడ గారు వచ్చినప్పటినుంచీ...." గీత పూర్తిచేయకముందే....


"గీతా!... నోర్ముయ్యి!" ఆవేశంతో అరిచాడు శాంతారామ్. 


అందరూ ఉలిక్కిపడ్డారు. ఒకరినొకరు ఆశ్చర్యంతో చూచుకొన్నారు. 

శాంతికి ఏం జరిగిందో తెలియని శాంతారామ్, ఆమెను తన చేతుల్లోకి తీసుకొని పోర్టికోలోకి కారువైపుకు పరుగెత్తాడు.


"సార్!... అమ్మగారికి ఏం జరిగింది సార్!" ఆవేదనతో అడిగాడు డ్రైవర్ ఏడుకొండలు.


"కొండయ్యా! డోర్ తెరువు!...."


బ్యాక్ డోర్ తెరిచాడు ఏడుకొండలు.

శాంతిని సీట్‍పై కూర్చోపెట్టి తాను కూడా కూర్చుని ఆమె తలను తన ఒళ్ళొ పెట్టుకొంటూ....

"కొండయ్యా!.... వేగంగా హాస్పిటల్‍కి పోనీ!" అన్నాడు శాంతారామ్.


ఏడుకొండలు విచారంతో కారును స్టార్ట్ చేశాడు.

వరండాలో ఇంటిల్లిపాదీ ఆడంగులు, నిలబడి సినిమాను చూస్తున్నట్లు చూడసాగారు.


కారు వీధిలో ప్రవేశించింది. ఇరవై నిమిషాల్లో హాస్పిటల్ పోర్టికోలో కారును నిలిపాడు ఏడుకొండలు. తాను దిగి కొంచెందూరంలో వున్న స్ట్రెచ్చరును కారు వద్దకు తీసుకొని వచ్చాడు. శాంతారామ్ ఏడుకొండలు శాంతిని స్ట్రెచ్చరుపై పడుకోబెట్తారు. నర్సులు వచ్చారు. స్ట్రెచ్చరును తమ చేతిలోని తీసుకొని హాస్పిటలోనికి తీసుకువెళ్ళారు. అయోమయ స్థితిలో శాంతారామ్, ఏడుకొండలు వారిని అనుసరించాడు.

"ఏమైంది?...." అడిగాడు డాక్టర్.


"వర్షంలో తడుస్తూ దండెంమ్మీది బట్టలను తీస్తూ వుండింది. పిడుగుపడ్డ శబ్దం. నేను ఇంట్లోకి ప్రవేశించేసరికి, నా కళ్ళముందే నేలకూలింది సార్. ఏమైందో....? ఏమిటో? మీరు పరీక్షించి చెప్పాలి సార్!" విచారంగా చెప్పాడు శాంతారామ్.


"ఓకే... ఓకే! మీరు ఇక్కడే ఆగాలి సార్!" అన్నాడు డాక్టర్.


శాంతారామ్ ఏడుకొండలు ఆగిపోయారు.

డాక్టర్ ఆదేశానుసారంగా నర్సులు స్ట్రెచ్చరును ఓ ఏసీ గదిలోనికి తీసుకొని వెళ్లారు.

  *

రెండువారాలు గడిచిపోయాయి.

ఆ రోజు... ఉదయం డాక్టరు గారు వచ్చారు. వారి పేరు పరశురామ్. వారిని చూచి శాంతారామ్ నమస్కరించాడు.

"నాతో రండీ!" చెప్పాడు డాక్టర్ పరశురామ్.


శాంతారామ్, పరశురామ్ వెనకాలే వారి గదికి నడిచాడు.

"కూర్చోండి సార్!" చెప్పాడు డాక్టర్ పరశురామ్.


శాంతారామ్ డాక్టరుగారి టేబుల్ ముందున్న కుర్చీలో కూర్చున్నాడు. అయోమయ స్థితిలో ప్రశ్నార్థకంగా వారి ముఖంలోకి చూచాడు.

"మీ పేరు శాంతారామ్ కదూ!" అడిగాడు డాక్టర్ పరశురామ్.


"అవును సార్!"


"మిస్టర్ శాంతారామ్! మీ ఆవిడ తలకు అతి దగ్గరగా పిడుగు పడిన కారణంగా షి లాస్ట్ హర్ ఇయరింగ్ కెపాసిటీ. అతి సూక్ష్మమైన ఆ నరాలన్నీ చిట్లి పగిలిపోయాయి. ఆమె తన వినికిడి జ్ఞానాన్ని కోల్పోయింది. ఆ విషయాన్ని గ్రహించిన ఆమె చాలా బాధపడుతూ వుంది. షీ ఈజ్ ఎ లెక్చర్ అట వ్రాసి చూపించింది. నేటి నవీన విజ్ఞానరీత్యా ఈ సమస్య పరిష్కారానికి ఐదు రకాల సాధనాలు వున్నాయి.


1. ఆడియో ఇన్‍డికేటన్ (Audio Indication) 

2. లూప్ ఎఫ్. ఎం. సిస్టమ్ (Loop Fm System)

3. ఇన్‍ఫోర్డ్ సిస్టమ్ (Inforded System)

4. పర్సనల్ యాంప్లిఫయిడ్ సిస్టమ్ (Personal Amplified System)

5. బ్లూటూత్ సిస్టమ్ (Bluetooth System)


మిస్టర్ శాంతారామ్! నేను మీ మేలుకోరి చెబుతున్నాను. మీరుగాని, మీ ఇంట్లోవారు గాని, ఆమెకు జరిగిన ఈ దుస్థితిని గురించి చర్చించడం, విమర్శించడం తగదు. మీకు సత్యహరిశ్చంద్రుడు, నలమహారాజు, పంచమవేదం భారతంలోని పంచపాండవుల గురించి విని వున్నారుగా!.... వారంతా ఎన్నో కష్టాలు పడ్డారు. అది ఆ దైవ నిర్ణయం. మీ ఆవిడగారి పరిస్థితీ అంతే. కనుక మీరు మీ కుటుంబ సభ్యులందరూ ఆమెను పసిబిడ్డలా చూచుకోవాలి. 


అర్థరహిత ప్రసంగాలను ఆమె ముందు చేయకూడదు. కారణం ఆమె వినలేదు కాబట్టి. మీరు మాట్లాడే మాటలు తన గురించే అని ఆమె బాధపడవచ్చు. ఎందరో విద్యార్థులను బోధన చేసి, భావి భారత పౌరులుగా తీర్చి దిద్దవలసిన ఆ లెక్చరుగారికి అలా జరగడం అన్నది కడు శోచనీయ్యం. సార్! ఆమె చాలా డిప్రషన్‍లో వున్నందున డిశ్చార్జికి ఇష్టపడనందున, ఇన్నిరోజులు హాస్పిటల్లో ఉంచుకున్నాము. ఈరోజు డిశ్చార్జి చేస్తున్నాము. లెక్చరర్ శాంతిగారిని జాగ్రత్తగా చూచుకోండి మై డియర్ బ్రదర్.... శాంతారామ్!" చెప్పడం ముగించాడు డాక్టర్ పరశురామ్.


శాంతి డిశ్చార్జి చేయబడింది. తన ప్రక్కనే నిలబడి దీనంగా చూస్తున్న డాక్టర్ పరశురామ్‍ను చూచి శాంతి చేతులు జోడించింది.


"ధన్యవాదాలు సార్! మీరు నాకు పునర్జన్మని ప్రసాదించారు. నా జీవితాంతం నేను మిమ్ములను మరువలేను" అని కాగితంపై వ్రాసి డాక్టరుగారికి చూపించింది. ఆ క్షణంలో శాంతి రెండు నయనాలూ ఆశ్రువులతో నిండిపోయాయి. ప్రీతిగా శాంతారామ్ శాంతి చేతిని తన చేతిలోకి తీసుకొన్నాడు. పోర్టికోలో కారును సమీపించారు ఇరువురు.


ఏడుకొండలు చేతులు జోడించి "నమస్కారం చిన్నమ్మగారూ!" ప్రీతిగా పలికాడు. అతనికి విషయం తెలియదు. శాంతి చిరునవ్వుతో చేతులు కలిపింది.


శాంతారామ్, శాంతి వెనుక సీట్లో కూర్చున్నారు. ఏడుకొండలు కారును స్టార్ట్ చేశాడు. అరగంటలో ఇంటికి చేరారు. సమయం సాయంత్రం ఆరున్నర. కుటుంబ సభ్యులందరూ ఇంట్లోనే వున్నారు.

శాంతారామ్ శాంతి చేతిని తన చేతిలోనికి తీసుకొని నేరుగా తన బెడ్‍రూముకు వెళ్ళిపోయాడు. వారిరువురినీ అందరూ విచిత్రంగా చూచారు.

  *

ఆ రాత్రి.... శాంతారామ్ శాంతికి ప్లేట్లో భోజనాన్ని పెట్టుకొంటున్న సమయంలో...

"రేయ్!..... చూచావా నీ భార్యకు ఎంత పొగరో!.... నన్ను కాని నా వారిని కాని పలకరించకుండానే బెడ్‍రూములోకి దూరేసింది!" అంది తల్లి శకుంతల ఆవేశంగా.


శాంతారామ్ కొన్ని క్షణాలు తల్లి ముఖంలోకి పరీక్షగా చూచాడు. మౌనంగా వుండిపోయాడు.

"ఏరా!.... అలా చూస్తున్నావ్? అవునూ ఆ ఆహారం ఎవరికి?"


"శాంతికి..."


"ఏం వారు ఇక్కడికి డైనింగ్ టేబుల్ దగ్గరికి రారా!" వ్యంగ్యంగా అడిగింది శకుంతల.

అవునన్నట్లు తలాడించి ప్లేటుతో తన గదిలోనికి వెళ్ళిపోయాడు.


"అబ్బో!.... మీ ఆవిడ గ్రేడ్ పెరిగిందే!... ఏరా!.... భార్యా దాసుడవైపోయావ్?" వికారంగా శాంతారామ్‍ను చూస్తూ అంది శకుంతల.


శాంతి వద్దన్నా.... శాంతారామ్ అన్నం కూరా కలిపి బలవంతంగా నోట్లో పెట్టాడు.

ఆ మరుదినం.... తనతో డాక్టర్ పరశురామ్ గారు చెప్పిన ఈ అండ్ ఐ స్పెషలిస్ట్ డాక్టర్ మార్తాండ వద్దకు తీసుకొని వెళ్ళాడు. 


డాక్టర్ మార్తాండ శాంతిని పరీక్ష చేశారు. హియర్ ఎయిడ్‍ను చెవిలో అమర్చారు.

శాంతికి ఇతరుల మాటలు వినపడసాగాయి ఆ మూడువారాలుగా మనస్సులో గూడుకట్టుకొని వున్న ఆవేదన తొలగిపోయింది. ఆ మూడువారాలుగా తన భర్త తనను చూచుకొన్న విధానానికి హృదయంలో ఎంతో ఆనందం.


కార్లో తిరిగి వచ్చేటప్పుడు డ్రైవింగ్ చేస్తున్న భర్తవైపుకు జరిగి అతని ముఖంలోకి చూచి ఆనందంగా నవ్వుతూ బుగ్గపై ముద్దుపెట్టింది శాంతి. 


"చాలా... చాలా ధన్యవాదాలండి. నాకోసం మీరు ఎంతగానో శ్రమించారు.... శ్రమిస్తున్నారు" అంది శాంతి.


"శాంతా! ఏమిటామాటలు!... అది నా ధర్మంరా!" నవ్వుతూ చెప్పాడు శాంతారామ్.


శాంతి ముఖంలో పండువెన్నెల....

"శాంతీ!...."


"చెప్పండి!..."


"విషయాన్ని మీ అమ్మా నాన్న వాళ్ళకు నీవు చెప్పినట్లుగానే నేను ఇంతవరకూ చెప్పలేదు. విషయం వారికి తెలిస్తే నన్ను తప్పుగా అనుకొంటారేమో!..... ఆలోచించు...!" ప్రాధేయపూర్వకంగా చెప్పాడు శాంతారామ్.


"వద్దు..... ఇప్పుడూ సరిపోయిందిగా!...." సాలోచనగా చెప్పింది శాంతి.


చిరునవ్వుతో చూచాడు శాంతారామ్ శాంతి ముఖంలోకి....

"తన కష్టనష్టాలను తనవారెవరికీ తెలియనీయకుండా వుందంటే.... నా శాంతి చాలా గొప్ప వ్యక్తిత్వం గల సహనశీలి. ఇలాంటి వ్యక్తి నా అర్థాంగి కావడం నా అదృష్టం’ అనుకొన్నాడు శాంతారామ్.

  *

రోజులు గడుస్తున్నాయి. శాంతారామ్ శాంతి ఇంట్లో వున్న సమయంలో అతి సన్నిహితంగా వుండటం, ఆమెను ఏ పనీ చేయనీయకుండా చేయడం, తల్లి, చిన్న సోదరీమణులకు, వదినలకు అసహ్యంగా.... ఆవేదనగా శాంతిపట్ల ద్వేషంగా మారిపోయింది. తల్లి శకుంతల అతి తెలివితేటలతో శాంతి, శాంతారామ్‍లు ఇంట్లో లేని సమయంలో వారి గదిని సోదా చేసింది. వారు ఎవరికీ చూపని కాగితాలు (హాస్పిటల్ రిపోర్టులు)ను చూచింది.


హాల్లో పంచాయితీ పెట్టి కుటుంబ సభ్యులందరినీ వాటిని చూపించింది.

అందరూ శాంతిని గురించి వారివారి నోటికి వచ్చిన చచ్చు కామెంట్లను చేశారు.

ఫైనల్‍గా....

"ఇంత జరిగినా మనకు వివరంగా చెప్పలేదంటే.... ఆ శాంతిని గురించి ఏమనుకోవాలి. అన్నింటికీ తెగించిందని అనుకోవాలి. నా కొడుకును తన దాసుడిగా మార్చేసింది. ఎంత పొగరు?... ఎంత అహంకారం?.... దానిలోని ఆ రెంటినీ అణచాలి. దాన్ని మన చెప్పుచేతల్లో పెట్టుకోవాలి" అనే నిర్ణయానికి వచ్చారు వారందరూ.


కూతురు గీత.... వారి బెడ్ రూములో దూరి, శాంతి స్నానానికి వెళ్ళినప్పుడు హియర్ ఎయిడ్‍ను దొంగిలించి తల్లికి ఇచ్చింది. 


స్నానం చేసి వచ్చిన శాంతి దానికోసం వెదికింది. అది గదిలో వుంటేగా దొరికేదానికి?.. శాంతి విచారంతో గదిలోనుంచి బయటికి రాలేదు.


శాంతి భర్త ఇంట వచ్చిన తరువాత, విషయాన్ని చెప్పింది. శాంతారామ్ మౌనంగా విని, డాక్టర్ మార్తాండను కలిసి మరొకదాన్ని తెచ్చి శాంతికి ఇచ్చాడు.

వారంరోజుల తర్వాత అదీ కనబడలేదు.

విచారంతో శాంతి ఏడ్వసాగింది.


అదే సమయం అనుకొని అందరూ శాంతిని హాల్లోకి లాక్కొచ్చి నోటికి వచ్చినట్టు తిట్టారు. విమర్శించారు. వారంతా ఆనందంగా నవ్వుకొన్నారు. ఇక‍ఇకలు... పకపకలు....

అదే దుస్థితిని శాంతి మరో మూడుసార్లు ఎదుర్కోవలసి వచ్చింది. శాంతారామ్‍కు విసుకు కలిగింది. ఐదుసార్లు హియర్ ఎయిడ్‍ను శాంతి పోగొట్టుకున్నందుకు.


"నీవు నా వారితో కలిసి మెలసి ఉండని కారణంగానే ఇలా జరుగుతూ వుంది. తప్పు నీదే. నీకు... ఇక నేను సేవలు చేయలేను. నిన్ను తీసుకొని వెళ్ళి మీ ఇంట్లో వదిలేస్తాను. అప్పుడే నాకు ప్రశాంతత..." చాలా ఆవేశంగా చెప్పాడు శాంతారామ్.


భర్త కూడా తనకు వ్యతిరేకమై తప్పంతా తనదేనని విమర్శించడం వలన.... శాంతికి జీవితం మీద విరక్తి కలిగింది. బంధువుల పెండ్లికి ఇంట్లోని వారంతా ఉదయాన్నే శాంతిని పిలువకుండా ’ఆ చెవిటిది ఎందుకు? పదండి’ అని పకపకా నవ్వుకొంటూ వెళ్ళిపోయారు. భర్త శాంతారామ్ అసిస్టెంట్ ఇంజనీర్ క్యాంపుకు వెళ్ళిపోయాడు. శాంతి డ్రైవర్ ఏడుకొండలుతో బజారుకు వెళ్ళింది. రెండు మెడికల్ షాపుల్లో నిద్రమాత్రలను కొనుక్కొని ఇంటికి తిరిగి వచ్చింది.


స్నానం చేసింది. చక్కగా అలంకరించుకొంది. ఏనాడూ అత్తగారు అడుగుపెట్టనివ్వని పూజామందిరంలో ప్రవేశించి దీపారాధన చేసింది. తన నిర్ణయాన్ని ఆ దైవానికి తెలియజేసింది. గదికి వచ్చి పెన్ పేపరును తీసుకొని.....

’ప్రియాతి ప్రియమైన శ్రీవారికి నమస్కారములు..... నాకోసం మీరు చాలా కష్టపడ్డారు. మీరు నాయందు చూపిన ప్రేమాభిమానాలకు హృదయపూర్వక ధన్యవాదములు. ఇకపై మీరు నామూలంగా కష్టపడటం కాని, అవమానపడటం కానీ నాకు ఇష్టం లేదు. ఈ జన్మలో నేను, నాకు తెలిసి ఎవరికీ ఏ అన్యాయాన్నీ, అవమానాన్నీ కలిగించలేదు. 


బహుశా పూర్వజన్మ పాపఫలం అనుకొంటాను. నా ఈ చెవిటిదశ చాలు. అనుభవించిన జీవితం చాలు. అందుకే నేను మీ ఇంటినుంచీ, ఈ భూమిమీద నుంచి నిష్క్రమిస్తున్నాను. మీరు మీకు అన్నివిధాల తగిన, మీ అమ్మగారికి బాగా నచ్చిన అమ్మాయిని వివాహం చేసుకొని శేష జీవితాన్ని ఆనందమయం చేసుకోండి.

ఇట్లు శాంతి (అభాగ్యురాలు)


వ్రాసిన కాగితాన్ని టీపాయ్‍పై వుంచి, పేపర్ వెయిట్‍ను వుంచింది. నిద్రమాత్రలను మ్రింగింది. ఆనందంగా మంచంపై వాలిపోయింది. గంట తరువాత ఆమె జీవుడు తనువు నుండి వేరై గాల్లో కలిసిపోయాడు.

  *

శాంతి మరణవార్తను శాంతారామ్ తండ్రి, ఆమె తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా తెలియజేశాడు. క్యాంప్ నుంచి వచ్చిన శాంతారామ్ శాంతి వ్రాసిన ఉత్తరాన్ని చదివాడు. భోరున ’శాంతి....’ అంటూ కుప్పలా నేలకూలిపోయాడు.


అమెరికాలో వున్న డాక్టర్ ఋషి... విషయాన్ని విని భారత్‍కి వచ్చాడు. శాంతి అంతిమయాత్రను అతను చూడలేకపోయాడు. డ్రైవర్ ఏడుకొండలు ఏడుస్తూ చెప్పిన విషయాలు విన్నాడు. హృదయం ముక్కలైంది. నయనాలు కన్నీటి సాగరాలైనాయి. తీరని.... ఆరని ఆవేదన. ఆ స్థితిలో తన తల్లిదండ్రులను సోదరీ సొదరులను తాను అక్కను తలచుకొని ఏడుస్తూ వారిని ఓదార్చాడు.

మూడు నెలల తర్వాత ఋషి అమెరికా వెళ్ళాడు. తన ఉద్యోగానికి రాజీనామా చేసి భారత్‍కు తిరిగి వచ్చాడు. అక్క పేరున ’శాంతినివాస్’ అనే మూగ చెవిటి స్కూలు హాస్పిటల్‍ను స్థాపించాడు. వివాహాన్ని వద్దనుకొని ’మానవసేవే మాధవసేవ’ అనే ఆర్యోక్తిని తలచుకొంటూ వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాడు డాక్టర్ ఋషి....

  *

సమాప్తి


సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.




44 views0 comments

Bình luận


bottom of page