top of page

దొంగగారు పప్పుదాకలో జారి పడ్డారు


'Dongagaru Pappudakalo Jari Paddaru' New Telugu Story(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)


(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

మౌర్య సామ్రాజ్యాన్ని సామ్రాట్ అశోకుడు పరిపాలించిన 37 సంవత్సరాలలో రాజ్యం సుభిక్షంగా ఉండడం కోసం చాలా కొత్త కొత్త మార్పులు జరిగాయి.


ప్రజల ధనసంపాదన కోసం ఆర్థిక సంస్కరణల ఏర్పాట్లు జరిగాయి, ప్రజారోగ్య అభివృద్ధి దృష్ట్యా విభిన్న మందిరాల స్థాపనలు జరిగాయి.


ఇంకా కుటుంబంసమస్యల పరిష్కారం కోసం, అలాగే ఆస్తి తగాదాల నిర్మూలన కోసం ప్రత్యే కమైన "వీధితీర్పు మందిరాలు" లాంటివి కూడా వెలిసాయి.


దానితోపాటు ప్రజల జీవన విధానాలు.. పూర్తిగా మారాయి.


కానీ రాజు గారికి రాజ్యంలో ఏదో వెలితిగా ఉన్నట్లు అనిపించింది. ప్రజలు నూటికి నూరు మంది క్షేమంగా ఉండాలన్నది ఆయన అభిమతం, ఆలోచన... ! ప్రజలందరూ తనను స్నేహితుడుగా, హితుడిగా భావించాలని.. ఆయన మనసులో నిర్ణయించుకున్నారు.


'కానీ.. ఒక వర్గం తనకు భయపడుతున్నారని, తనను శత్రువుగా చూస్తూ జీవితం వెళ్లబుచ్చు తున్నారు... '

అని అశోకుడు వేగుల ద్వారా తెలుసుకున్నాడు.... ఆ వర్గమే దొంగలు.. గజదొంగలు..


వాళ్లు కూడా మనుషులే.. పుట్టుకతో ఏ ఒక్కరూ దొంగ గా మారాలని అనుకోరు.. మారరు. అస్త వ్యస్తమైన వాళ్ళ కుటుంబం, వాళ్ళ జీవన విధానాన్ని మార్చిపాడేస్తుంది. దాంతో వాళ్ళు సులభ తరమైన జీవనవిధానాన్ని నేర్చుకుంటారు.... అదే "దొంగతనం".... అది తప్పుడు మార్గం అయినా దానికి అలవాటు పడిపోయి... అలా అలా జీవనం సాగించేస్తుంటారు.. అందులో కొందరు కరడు

గట్టిన గజదొంగలు గా కూడా మారతారు. ఇంకొందరు హంతకులుగా... తయారవుతారు.


అలాంటి దొంగలను, గజదొంగలను కూడా మామూలు మనుషులుగా... మార్చాలని అశోక సామ్రాట్ రాజుగారు నిర్ణయించుకున్నారు..


ఆ విషయాన్ని.. పెద్ద పెద్ద శిలా ఫలకాల మీద ఈ విధంగా రాయించారు.


"ఇందుమూలముగా.. ప్రజలందరికీ... తెలియ జేయునది..... రాజ్యం సుభిక్షంగా ఉండడం కోసం అన్ని రకాల దొంగలను.. వారు చేసిన తప్పులను క్షమించి.. సాధారణ ప్రజాజీవనంలో వారిని మమేకం చేయాలని.. అశోక సామ్రాట్ మహారాజుగారు.. పెద్దమనసుతో నిర్ణయించుకున్నారు.


ఈ సదవకాశాన్ని... అలాంటి దొంగలు ఉపయోగించుకొని.. తమ జీవనాన్ని మార్చుకొని తమ భార్య బిడ్డలతో ఇదే రాజ్యంలో కష్టపడి పని చేసుకుంటూ బ్రతకవలసినదిగా.. ఇది ఒక సువర్ణావకాశంగా.. భావించవలసినదిగా..... కోరడమైనది.


ఇందుకోసం చిల్లరమల్లర దొంగలు, చిన్న దొంగలు, పెద్ద దొంగలు, దోపిడి దొంగలు, హంతకులు.. బందిపోటులు అందరూ రాజుగారిని సందర్శించి తమ గత చరిత్రను రాజుగారి సమక్షంలో విన్న వించుకొని భవిష్యత్తు చక్కగా మార్చుకొనుటకు అంగీకరిస్తున్నామని తెలిపి రాజు గారి క్షమాపణ కోరి వారి అనుగ్రహంతో ప్రజా జీవనవిధానంలో మమేకం కావచ్చు!


ఈ విషయాన్ని అందరూ అందరికీ చేరవేయండి


ఇట్లు

ప్రధాన మంత్రి వర్యులు


ఇటువంటి శిలాఫలకాలు రాజ్యపు అన్ని కూడళ్ళలో.. అందరికీ కనపడే లాగా ఏర్పాటు చేశారు ఆ రాజ్యంలో. దాంతో చాలా మంది చిన్న పెద్ద దొంగలు, గజదొంగలు రాజుగారి ఆస్థానానికి వచ్చి రాజు గారి చేత మన్నింపబడి ఆయన కృపకు పాత్రులై... ఆ రాజ్యంలోనే క్షేమంగా జనజీవన విధానంలో కలిసిపోయి జీవనం సవ్యంగా సాగిస్తూ.. తమ భార్యాబిడ్డలను ఆనందంగా చూసుకుంటూ కాలం గడుపుతున్నారు.


కానీ ఇంకా ఒకరు ఇద్దరూ కరడుగట్టిన గజ దొంగలు లొంగుబాటు లోకి రాలేదని రాజుగారికి వేగుల ద్వారా సమాచారం తెలిసింది.


ఒక రోజు ఏమి జరిగింది అంటే....


మిగిలిన వాళ్లలో.. రామదత్తుడు ఒక మొండి గజదొంగ. తాను మామూలు మనిషిగా మారి పోవాలని పూర్తిగా నిశ్చయించుకొని.. సరాసరి రాజసభకు వచ్చేశాడు.


"మహారాజా నేను ఇంతకాలం దొంగతనాలు చేస్తూ నా కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నాను. అయితే... తమ పరిపాలనలో ప్రజల స్థితిగతులు బాగోగులు చూసిన తర్వాత నాకు ప్రజాజీవనంలో కలిసిపోవాలని మామూలు మనిషిగా బ్రతికి నా భార్యబిడ్డలను పోషించుకోవాలి అని.... మనస్ఫూర్తి గా అనిపించింది.


తప్పో ఒప్పో ఇన్నాళ్ళు నేను చేసిన తప్పిదాలను పెద్దమనసుతో మన్నించి నాకు... మామూలు జీవన విధానం తో బ్రతికే అవకాశం కల్పించ వలసినదిగా.. మహారాజుల వారికి శిరస్సు వంచి కోరు కుంటున్నాను" అంటూ సవినయంగా విన్నవించుకున్నాడు.


రాజుగారు చాలా ఆనందపడ్డాడు. మనిషిలో మానసిక పరివర్తనకు మించిన శిక్ష ఉండదని.. తద్వారా ఆ దొంగను క్షమించి విడిచి పెట్ట వచ్చునని నిశ్చయించుకొని.. ఇలా అడిగాడు.


"ఓయి దొంగ... నీ పేరు.." అంటూ ప్రశ్నించాడు రాజుగారు.


రామదత్తుడు మాట్లాడలేదు.


అక్కడున్న ప్రధానమంత్రి రాజు గారి ప్రశ్నకు సమాధానం చెప్పమని సైగ చేశాడు.


"మహారాజుగారు క్షమించాలి... నేను నిన్నటి వరకే దొంగను.. ఈరోజు గతంలో చేసిన తప్పులకు పశ్చాత్తాపపడి పూర్తిగా మారిపోయిన మామూలుమనిషిని. అందుకనే తమరు "దొంగ" అని సంభోదిస్తే సమాధానం చెప్పలేకపోయాను.. ధర్మప్రభువులు క్షమించాలి."

అంటూ చేతులు జోడించి తలదించి వినయంగా చెప్పాడు.


రాజుగారు సంతోషించారు....


అతనిలో మానసికంగా న్యాయబద్ధంగా మార్పు వచ్చిందని గ్రహించారు.


''సరి... నిన్ను 'దొంగ' అని పిలవడం మాకు మాత్రం.. ఆనందం అనుకుంటున్నావా? సరే నీ తల్లిదండ్రులు నీకు పెట్టిన పేరు?'' మళ్లీ ప్రశ్నించాడు రాజుగారు.


"మహారాజా నా పేరు... రామదత్తుడు. ''. చేతులు జోడించి సవినయంగా చెప్పాడు రామ దత్తుడు.


''సరే రామదత్త.. నీకొక పరీక్ష పెడతాను.. ఆ పరీక్షలో నెగ్గితే నువ్వు కోరినట్టే చేస్తాను.. " అన్నాడు అశోకుడు గంభీరంగా.


అలా అంటూ ఒక చిన్న కడియాన్ని.. దొంగకు అందిస్తూ...


"ఈ క్షణం నుండి దొంగతనాలు మానేసి 30 రోజుల తర్వాత "ఇదే కడియం" పట్టుకొని మా దగ్గరికి రా.. ఇది నీ మానసిక బలానికి, పరిపక్వత కు సంబంధించిన ఒక చిన్ని... పరిశీలన మాత్రమే. అంతదనుక మా రాజ్యం లోని ఊరు చివర ఉత్తరాన గల శాంతిమందిరంలో నువ్వు భార్యబిడ్డలతో హాయిగా నివసించవచ్చు.. నీ జోలికి ఎవరూ రారు... అందుకు తగిన ఏర్పాట్లు మా ప్రధానమంత్రి వర్యులు చేస్తున్నారు నువ్వు ధైర్యంగా ఉండవచ్చు నీ భార్యాబిడ్డలతో. " అంటూ రామ దత్తుడికి ధైర్యం చెప్పాడు రాజుగారు


వెంటనే ప్రధాన మంత్రివర్యులు వైపు చూస్తూ అలా చేయమoటూ.. ఆజ్ఞాపించాడు... సామ్రాట్ అశోకుడు..


ఆ రోజుకు సభ ముగిసింది.


రామదత్తుడు మహదానందంగా ఆ కడియాన్ని జాగ్రత్తగా... తన భుజపు ఉత్తరీయం లో మూటగట్టి.. ఆ ఉత్తరీయం మరొక సంచిలో జాగ్రత్తగా భద్రపరుచుకొని వెనుదిరిగాడు.


రామదత్తుడు ఆ రాజ్యంలోని ఊరు చివ శాంతి మందిరంలో భార్యాబిడ్డలతో తల దాచుకుంటూ... చిన్నపని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తు న్నాడు.

***

కాలం... కాల గర్భంలో 20 రోజులు గడిచిపో యింది.


రాజ ఆస్థానానికి వెళ్లి రాజుగారిని కలిసే సమయం దగ్గర పడుతోంది.... ఉన్నట్టుండి రామదత్తుడికి ఒక 'అనుమానం' వచ్చి పడింది. అది పెనుభూతమై కూర్చుంది


'తను నివసించే సత్రంలో చాలా మంది జనం ఉండేవారు. ఈ 20 రోజులలో తాను సత్రంలో లేనప్పుడు.. తను రాజుగారు ఇవ్వగా భద్రంగా పాతబట్టల సంచిలో దాచిన ఆ కడియాన్ని ఎవరైనా తస్కరించారా??... ' అన్న అనుమానం కలిగింది.


వెంటనే మూట విప్పి చూశాడు. కడియం తను పెట్టిన చోట భద్రంగా ఉంది... 'హమ్మయ్య' అని ఊపిరి పీల్చాడు.


మరో వారం గడిచింది...


రామ దత్తుడికి మరో అనుమానం కలిగింది. అది పీక్కుతినే బ్రహ్మరాక్షసిలా అతని నెత్తిమీద కూర్చుంది!


"ఏమో తను లేనప్పుడు ఎవరైనా ఆ కడి యాన్ని తీసేసుకుని.. అదే స్థానంలో నకిలీ కడియం పెట్టారేమో... ఏమో... ఎందుకైనా మంచిది... ఒకసారి స్వర్ణకారుడు దగ్గర పరిశీ లన చేసి చూస్తే తెలిసిపోతుంది కదా''..... అనుకొని పక్కనే ఉన్న వీరాచారి గారికి చూపించాడు.


చారిగారు దానిని గీటు పెట్టి నిశితంగా పరిశీ లించి....


"అబ్బే.. అబ్బే... ఇది బంగారపు ది కాదు.

నకిలీది.. ఇత్తడి కడియఓ'' అంటూ తేల్చి చెప్పేశాడు.


రామదత్తుడి గుండెలో.. బండరాయి పడినట్టు అయ్యింది.. గాబరా పడిపోయాడు కంగారు.. పడిపోయాడు..


"అమ్మో ఇక రెండు రోజులే సమయం.. ఈ నకిలీ దాని స్థానంలో అసలు సిసలైన బంగారు కడియం ఎలా పెట్టాలి".. అంటూ చాలాసేపు ఆలోచించాడు..


"ఏముంది కడియం చిన్నదే కనుక పెద్ద రేటు ఉండకపోవచ్చు.. ఈ నెల రోజులలో తను కూడబెట్టిన డబ్బుతో దానిని సులభంగా కోనవచ్చు" అని మనసులో నిర్ణయించుకున్న రామదత్తుడు.


నకిలీ ఇత్తడి కడియాన్ని చేతపట్టుకొని.. తనకు తెలిసిన వారి దగ్గర కూడా కొంత డబ్బు తీసుకుని, తన దగ్గర డబ్బు కూడా పోగుపెట్టి పరుగు పరుగున అంగడికి వెళ్లి.... అదే మాదిరి అసలు సిసలు బంగారు కడియాన్ని వెతికి వెతికి.... చివరికి కొని తన దగ్గరి నకిలీ ఇత్తడికడియాన్ని.... చెరువులోకి గిరాటు పెట్టి వెంటనే ఇంటికి వచ్చి బంగారపు కడియాన్ని మరల యధావిధిగా దాచి పెట్టాడు.


"హమ్మయ్య" అని ఊపిరి పీల్చుకుని.. రెండు రోజులు గడిచాక తాను వెళ్ళవలసిన రోజున రాజుగారి ఆస్థానానికి వెళ్ళాడు.


రాజుగారు రామదత్తుడుని.. పిలిచి అతని దగ్గర కడియం తీసుకొని.. అటు ఇటు తిప్పి చూసి... అనుమానం వచ్చి రాణి వారికి బంగారు ఆభరణాలు చేసే విరూపాక్ష ఆచారి గారి చేత.. పరిశీలింప చేయించి అది "బంగారు" ది అని... అసలు సిసలైన పదహారణాల బంగారపు ది అని తెలుసుకున్నాడు.


రాజుగారు వెంటనే కోపంతో పైకి లేచిపోయారు.


వెంటనే సభలోని ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులు, సైన్యాధ్యక్షులు అందరూ రాజుగారు ఆగ్రహాన్ని చూసి తాము కూడా భయపడి నిలబడిపోయారు.


"మూర్ఖుడా నువ్వు మామూలు మనిషిగా మారా వేమో కానీ నిజాయితీ మనిషిగా మాత్రం.... మారలేదు. "అంటూ గర్జించారు.


ఆ స్థానంలో ఉన్న సామంతులు, ముఖ్య ప్రధానమంత్రులు భయపడి లేచి నిలబడ్డారు.. మిగిలిన ప్రజానీకం అంతా కంగారు పడ్డారు.


''నేను నీకు ఇచ్చింది ఇత్తడి కడియం... నేను నీకు నకిలీ ఇత్తడి కడియమే ఇచ్చాను. కానీ నేను ఇచ్చినది మార్చి నువ్వు "బంగారపు" కడియం తెచ్చావు''


ఆ రోజు నిన్ను దొంగ అని నేను సంబోధించి నప్పుడు నీ మానసిక మార్పు నాకు నచ్చింది.


అది నిజమైన మార్పు కాదని ఈ పరీక్ష ద్వారా ఇప్పుడు అర్థమైంది.


ఆ రోజు నేను నీకు ఇది " బంగారుకడియం" అని చెప్పలేదుకదా.. ఇది నీ మానసిక బలానికి, పరిపక్వత కు సంబంధించిన ఒక చిన్ని... పరి శీలన మాత్రమే... అని విపులంగా వివరించాను కదా.... మరెందుకు కంగారుపడి కడియాన్ని మార్చావు.. పైగా నేను నీకు ఇచ్చిన అసలు కడియం ఎవరో దొంగిలించారు.. అని నువ్వు అనుమానపడటం... ఈ రాజ్యపరి పాలన పట్ల నీకు సరి అయిన అవగాహన లేదనడానికి నిదర్శనం!!!... ఇక్కడ ఇంకా చిల్లరమల్లర దొంగలు అలాగే ఉన్నారు... అని నువ్వు భావించడం... నీలో కరుడుగట్టిన దొంగబుద్ధి ఇంకా పూర్తిగా పోలేదు అనడానికి మరో నిదర్శనం!!!


ఇవన్నీ నువ్వు "మారినమనిషి" గా నాకు చూపించడం లేదు.


ఇది రాజద్రోహం.. మా రాజ్యంలో.. కష్టపడే వారితో పాటు.. నిజాయితీ.. స్వచ్ఛత మనస్సు కలిగిన వారు మాత్రమే ఉండవలసి ఉన్నది.


కానీ నువ్వు అందుకు విరుద్ధంగా అనుమానపు బీజం తో... భయాందోళనలకు లోనయి నేనిచ్చి న కడియం మార్చేసావు.


దొంగతనాలు.. దోపిడీలు చేస్తూ బ్రతికిన ఏ మాత్రం తప్పులేదు కానీ..... ప్రతి నిమిషం ఇలా... ఇలా... భయాందోళనతో.... భీతితో... అనుమానంతో తన నిజాయితీ మీద తనకే నమ్మకంలేని అసహ్యం బ్రతుకు బ్రతకడం చాలా పెద్ద నేరం.... !!!!


ఒక దొంగ కన్నా నీలాంటి నిబ్బరమైన మనసు లేని వ్యక్తుల వల్లే ఈ రాజ్యానికి ప్రమాదం...

ఎక్కువ. అందుచేత నిన్ను పూర్తిగా క్షమించ లేను.


నీకు వేసే శిక్ష ఏమిటంటే ఒక సంవత్సరం నువ్వు రాజ్యం బయట ఉన్న మానసికశిక్షణ రాజప్రాంగ ణాల్లో..... అక్కడివారు శిక్షణలో గడపవలసి ఉంది. తదుపరి మాత్రమే నీకు రాజ్య ప్రవేశము. అంత దనుక నీ భార్యా బిడ్డల బాధ్యత ఈ రాజ్యపు అధికారుల పర్యవేక్షణలో సుభిక్షంగా ఉంటుంది. "


అంటూ రాజుగారు హుకుం జారీ చేసి గంభీ రంగా కూర్చున్నారు తన సింహాసనం మీద.. సామంతులు, ముఖ్యప్రధాన మంత్రులు.. అశోకసామ్రాట్ రాజుగారు శాంతించి నట్లు గ్రహించి.. తాము కూడా సుఖాసీనులై అయ్యారు.


సభలో అంతా గ్రహిస్తున్న మామూలు ప్రజానీక మంతా ముక్కున వేలు వేసుకున్నారు. రామ దత్తుడి తికమక ఆలోచనకు అతడిని నిందిం చారు.


వెంటనే రామదత్తుడుని అక్కడి భటులు మానసికశిక్షణ రాజప్రాంగణానికి పంపించేశారు.


అతను తిరిగి వచ్చేవరకు అతని భార్య బిడ్డలు ప్రశాంతంగా బ్రతకడానికి తగిన ఏర్పాటు చేయించారు రాజుగారు.


మౌర్య సామ్రాజ్యంలో ఆర్థిక సంస్కరణల తో పాటు మానసిక స్థితిగతుల మీద కూడా ప్రత్యే కమైన శ్రద్ధ ఉండేదట. అందుకు తగిన శిక్షణ ఆలయాలు కూడా ఉండేవి.


చివరలో.... రాజుగారు శత్రువులతో యుద్ధం చేసిన తర్వాత ఒకనాటి రాత్రి ఆ యుద్ధ భూమిలో శత్రువుల శవాలను తిరిగి తిరిగి చూసి... మనసు వికలమై, హృదయం ద్రవించి, కళ్ళు చమర్చి... భవిష్యత్తు లో ఇక తను యుద్ధం చేయకూడదని నిర్ణయించుకోవడానికి కూడా... ఇలాంటి సంఘటనలు.... దోహద పడ్డాయి.


ఇలాంటి "మానసిక శిక్షణ రాజ ప్రాంగణాలు"... అనుభవం కూడా నేర్పాయి.


అందుకనే అశోకుడు.. 'సామ్రాట్'... అయ్యాడు.


@@@@@@@@


( ఈ కథ ద్వారా సంగ్రహించవలసిన విషయం.. అతి తెలివిగా ఆలోచిస్తే బొక్క బోర్లా పడతారు. మనిషికి మానసిక పెరుగుదల విజయాన్నిస్తుంది. )


రచయిత

నల్లబాటి రాఘవేంద్రరావు


☀️☀️☀️☀️☀️

నల్లబాటి రాఘవేంద్ర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసంమాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).Podcast Link


Twitter Link

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.రచయిత పరిచయం: నల్లబాటి రాఘవేంద్ర రావు


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


ముందుగా  " మన తెలుగు కథలు"  నిర్వాహకులకు నమస్సులు..

"రచయిత పరిచయం"..... ఇది చాలా ముఖ్యం.

రచయిత తన  గొప్పలు చెప్పుకోవడం కాదు గాని తన గతచరిత్ర వివరాలు అందరికీ తెలియ చేయటం అవసరమే. ఈ చర్య ఆ రచయితకు మానసికంగా ఎంతగానో ఉపయోగపడి అతను మరిన్ని మంచి మంచి రచనలు చేసి సమాజానికి అందించే అవకాశం ఉంది.. ఎంతో పెద్ద ఆలోచనతో అలాంటి 'మహా ప్రయత్నం'.. చేస్తున్న 'మన తెలుగు కథలు' కు మరొక్కసారి అభినందనలు.

పునాది....

-----------

ఏడు సంవత్సరాలు వయసు నాది. మా తండ్రి సుబ్బారావు గారు  ప్రోత్సాహంతో శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే 10 నిమిషాల నాటకాన్ని నేనే రాసి కృష్ణుడి వేషం  నేనే వేసి దర్శకత్వం నేనే చేసి పెద్ద స్టేజి మీద  దసరా నవరాత్రులకు ప్రదర్శించాము.


ఆ తర్వాత భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గా.. మరో నాటకంలో శ్రీరాముడుగా..   రచన దర్శకత్వం నాదే.. ఏడు సంవత్సరాల వయస్సు.


తర్వాత పదిహేను సంవత్సరాల వయసులో

టెన్త్ క్లాస్ యానివర్సరీ కి  15 మంది నటులతో నా దర్శకత్వం లో పెద్ద స్టేజి మీద నాటకం వేసాము.

అప్పుడే నేను రచయితను కావాలన్న

ఆశయం   మొగ్గ తొడిగింది.

నా గురించి..

---------------

50 సంవత్సరాల సుదీర్ఘ సాహితీ ప్రయాణం.

450  ప్రచురిత కథల రచన అనుభవం.

200 గేయాలు  నా కలం నుండి జాలువారాయి

200 కవితలు నా మేధస్సు నుండి ఉద్భవించాయి

20 రేడియో నాటికలు ప్రసారం.

10 టెలీఫిల్మ్ ల నిర్మాణం.

200 కామెడీ షార్ట్ స్కిట్స్

3  నవలలు దినపత్రికలలో


" దీపావళి జ్యోతి "అవార్డు,

"రైజింగ్స్టార్" అవార్డు

" తిలక్ స్మారక" అవార్డు... మరికొన్ని అవార్డులు.


ప్రస్తుత ట్రెండ్ అయిన  ఫేస్బుక్ లో  ముఖ్యమైన 15 గ్రూపుల్లో... ఇంకా అనేక వెబ్ సైట్లు, బ్లాగులు,ఆన్లైన్ పత్రికలలో యాక్టివ్ గా తరచు  నాకథలు,  కవితలు,గేయాలు, ముఖ్యంగా కామెడీ షార్ట్ స్కిట్స్ ప్రతి రోజూ దర్శనమిస్తూ ఉంటాయి..

రమారమి 75 అవార్డులు, రివార్డులు అందు కున్నాను... అని గర్వంగా చెప్పుకునే అవకాశం  కలగటం... ఆ చదువులతల్లి అనుగ్రహమే!

ఇదంతా ఒక్కసారిగా  మననం చేసుకుంటే...  'పడని సముద్ర కెరటం' లా... నూతనశక్తి మళ్లీ పుంజుకుంది.

ఇక నా విజయ ప్రయాణగాధ....

------+------------------------------

పేపర్లెస్ రచయితగా... ఒక కుగ్రామం లో పేరు ప్రఖ్యాతులు పొందిన  నా తండ్రి సుబ్బారావు గారు నా ఆలోచనలకు, రచనలకు ప్రాణప్రతిష్ట చేసిన ప్రథమగురువు. తల్లి వీరభద్రమ్మ  నాకే కాదు నా కథలకూ ప్రాణదాతే!!


తదుపరి రమారమి 50 సంవత్సరాల క్రితమే.. మా ఊరివాడైన నా జూనియర్ క్లాస్మేట్... నా స్నేహితుడు ఇప్పటి సినీ దర్శకుడు " వంశీ "... కథలు రాస్తూ...   నన్ను కూడా కథలు రాయ మని... చెప్తుండేవాడు. అప్పటి నుండి  ఎక్కువగా రాయడం మొదలు పెట్టాను.ఆ తర్వాత మా ఊరి  వారైన  సినీ గేయరచయిత

" అదృష్టదీపక్".. నా కథలు.. చదివి.. మెచ్చు కునే వారు.. దాంతో ఇంకా విరవిగా కథలు రాయడం మొదలు పెట్టాను.


1. మొదటి రచన 1975 నాటి ప్రఖ్యాత పత్రిక "ఆంధ్రసచిత్రవారపత్రిక" లో బుద్ధిలేనిమనిషి  కథ.


2. రేడియో నాటికలు  గొల్లపూడి మారుతీ రావు    గారి సమకాలంలో విరవిగా వచ్చాయి.


3. సినిమాకథలపోటీ లో అలనాటి "విజయచిత్ర"  ద్వితీయబహుమతి కథ..  "డిసెంబర్ 31 రాత్రి"


4. ఉగాది కథలపోటీ "ఆంధ్రభూమి" బహుమతి కథ


5. ఉగాది కథల పోటీలో "ఆంద్రజ్యోతి" బహు మతి కథ


6.  దీపావళి కథలు పోటీలో  "ఆంధ్రజ్యోతి" బహుమతి కథ.


7. అప్పాజోస్యుల( అమెరికా) నిర్వహించిన కథల పోటీలో "నలుగురితో నారాయణ".. ఆంధ్రప్రభ విశిష్ట కథ ప్రచురణ


8. అల్లూరి స్మారక జయంతి "కళావేదిక " కరప తిలక్ స్మారక అవార్డు కథ " బ్రతుకు జీవుడా"


9. "స్వాతి "   తానా అమెరికా కథల పోటీలో ప్రచురణ కు ఎన్నికైన కథ..." వైష్ణవమాయ."


10. రాష్ట్రస్థాయి కథలపోటీ హైదరాబాద్  "నిమ్స్"ద్వితీయ బహుమతి కథ..న్యాయనిర్ణేత శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి." బంగారు పేకమేడ"


11. "అనిల్ అవార్డ్" స్వాతి కన్సోలేషన్ బహు మతి..." అమృతం  కురిసింది"


12. సస్పెన్స్ కథల పోటీ "స్వాతి" లో ఎన్నికైన కథ


13. "పులికంటి సాహితీ సంస్థ" రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన కథ..


14. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆరాధన" హైదరా బాద్ ద్వితీయ బహుమతి కథ.." అదిగో స్వర్ణ యుగం"  న్యాయనిర్ణేత   జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.. శ్రీ రావూరి భరద్వాజ గారు.


15. "అభ్యుదయ ఫౌండేషన్" కాకినాడ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ కథ.. " ఐదేళ్ల క్రితం " .


16. సి.పి.బ్రౌన్ "సాహితీ స్రవంతి".. ప్రత్యేక కథ

" ఇంద్రలోకం".


17.  కొమ్మూరి సాంబశివరావు స్మారక  సస్పెన్సు కథల పోటీలో  "నవ్య' ప్రచురణకు ఎన్నికైన కథ.


18. "వేలూరు పాణిగ్రహి" విజయవాడ "  గాంధీ తాత"  రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి కథ.


19. 'కదలిక'... సర్వశిక్షఅభియాన్  రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మింపబడిన అత్యున్నత టెలీ ఫిల్మ్... చిన్న సినిమా.


20. "అల కమ్యూనికేషన్" హైదరాబాద్ కథల పోటీలో ఎంపికైన కథ...." హృదయానికి శిక్ష".


21. రాష్ట్రస్థాయి కథలపోటీ "మైత్రేయ కళాసమితి" మెదక్.. పుస్తక సంకలనానికి ఎన్నికైన కథ. "బిందెడు నీళ్లు".


22. రాష్ట్ర స్థాయి కథల పోటీలు "జాగృతి" కన్సోలేషన్ బహుమతి  కథ "ఆలస్యం అమృతం విషం"


23. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ  "ఆంధ్ర ప్రదేశ్" పత్రిక ప్రత్యేక బహుమతి హాస్య కథ.


24. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్రప్రభ" ప్రచురణకు ఎంపికైన కథ.


25. దీపావళి కథల పోటీ "ఆంధ్రభూమి" ప్రచురణ కు ఎన్నికైన కథ.


26.  రాష్ట్రస్థాయికథల పోటీ "ఆప్కో ఫ్యాబ్రిక్స్" హైదరాబాద్ నిర్వహణ  పోటీ లో ఎన్నికైన కథ.


27. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆంధ్రప్రదేశ్పత్రిక" కు ఎన్నికైన హాస్యకథలు." చంద్రమండలంలో స్థలమును అమ్మబడును".


28.దీపావళి కథల పోటీ "జాగృతి" పత్రిక కు ఎన్నికైన కథ.


29. "హాస్యానందం" విశేష స్కిట్స్ కొరకు.. "రైజింగ్ స్టార్".. అవార్డు.


30 ఆంధ్రజ్యోతి "భావ తరంగం"  వారం వారం 30 కథలు.


31. "కళా దర్బార్"  రాజమండ్రి.. రాష్ట్రస్థాయి  కవితలపోటీలలు... 4 సంవత్సరాలు ఉత్తమ  కవిత్వానికి ప్రథమ బహుమతి...మూడుసార్లు.. ఉత్తమ కవిత్వానికి ద్వితీయ బహుమతి.


32.."హాసం" మాస పత్రిక లో ప్రచురింపబడిన  "చిరాకు దంపతులు చింతకాయ పచ్చడి"    కథ చదివిన చాలా మంది సినీ ప్రముఖులు  ఫోన్ కాల్స్ చేసి అభినందించడం.


33. ప్రఖ్యాత సిరివెన్నెల పత్రికలో  సిరివెన్నెల సీతా రామశాస్త్రి గారి నిర్వహణలో జానపద పాటల పోటీలో  ప్రథమ బహుమతి  పాటకు వారి నుండి  పత్రికాముఖంగా ప్రత్యేక ప్రశం సలు.. తదుపరి ఆ పాట అనేక   రంగస్థల ప్రదర్శనలు పొందడం.


34. విశేష కథలుగా  పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కథలు

  నలుగురితోనారాయణ

  కొరడా దెబ్బలు

  అమృతం  కురిసింది.

  వైష్ణవమాయ

  ఐదేళ్ల క్రితం

  ఇంద్రలోకం

  బిందెడు నీళ్లు

  చంద్రమండలంలో స్థలములు అమ్మబడును

  డిసెంబర్ 31 రాత్రి

  మహాపాపాత్ముడు

 

35. రాజమండ్రి ,కాకినాడ ,విజయవాడ, విశాఖ పట్నం ,రామచంద్రపురంలో.. విశేష సన్మానాలు.


ప్రస్తుతం...


1. ఒక పరిశోధన నవల.. ఒక చారిత్రక నవల రాసే ప్రయత్నం


2. పరిషత్ నాటికలు జడ్జిగా..


3.  కొందరు సినీప్రముఖుల ప్రోత్సాహంతో..

సినిమాలకు కథ మాటలు స్క్రీన్ప్లే అందించే ప్రయత్నం.


4. ..  4 కథల సంపుటిలు... రెండు కవితా సంపుటిలు.. 1గేయ సంపుటి.. 2 కామెడీ షార్ట్ స్కిట్స్.. రెండు నాటికల సంపుటిలు..ఒక నవల ప్రచురణ తీసుకొచ్చే ప్రయత్నం.


5. ఒక ప్రింటెడ్ పత్రిక  ప్రారంభించే ఉద్దేశ్యం.


భార్య.. గోవిందీశ్వరి... హౌస్ వైఫ్.

కుమారుడు... వెంకట రామకృష్ణ .. బి.టెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్... మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్.

కోడలు... మాధురీ లత..... ఎం ఫార్మసీ.

కుమార్తె.. సౌభాగ్య.. స్టూడెంట్.

మనుమరాలు.. ఆద్య... యాక్టివ్ బేబీ.

నా కథలను ఆదరించి తమ అమూల్య అభి ప్రాయాలు తెలియజేస్తున్న... రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ... వినమ్ర నమస్సులు.

నల్లబాటి రాఘవేంద్ర రావు

63 views1 comment

1 Comment


సామ్రాట్ అశోకుడి పరిపాలనా దక్షతను తెలియచేసే మంచికథను వ్రాసారు. ఈ కథ ద్వారా ఆయన సామ్రాట్ అనే బిరుదుకు ఎంత సమర్థుడే తెలియచేసారు. ఇప్పటి ప్రభుత్వాలు కూడా నక్సలైట్లను జనజీవన స్రవంతిలో కలిసి పొమ్మని పిలుపు నిచ్చే సందర్భాలను గుర్తు చేసారు.

Like
bottom of page