top of page

ఏ తల్లి కన్నదో...




'Ee Thalli Kannado' - New Telugu Story Written By Ch. C. S. Sarma   

Published In manatelugukathalu.com On 14/12/2023

'ఏ తల్లి కన్నదో' తెలుగు కథ 

రచన: సిహెచ్. సీఎస్. శర్మ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



'సత్యమూర్తి'...

సార్ధక నామధేయుడు...


అది హైదరాబాద్ మహానగరం... మూడు సంవత్సరాల క్రితం... జూన్ రొండవ తేదీన తెలంగాణా రాష్ట్రం అవతరించి, అంటే మూడేళ్ళు పూర్తి అయినాయి. సత్యమూర్తి... ఏకాకి... చిన్నతనంలోనే తల్లిదండ్రులు బస్ యాక్సిడెంట్లో చనిపోయారు.


తల్లి... అన్నయ్య కోదండరామయ్య, వారి భార్య జానకీ సత్యమూర్తిని పెంచి బిటెక్ వరకూ చదివించారు. కోదండరామయ్య స్నేహితుడు సాంబశివరావు హైదరాబాద్లో పవన్ కన్స్ట్రక్షన్ కంపెనీ సి.యం.డి. రాష్ట్ర విభజనానంతరం ముఖ్యమంత్రి గారు రాష్ట్రాభివృద్ధి కోసం... ఎన్నో పథకాలను ప్రాజెక్టులను ప్రారంభించారు. సాంబశివరావుగారికి... సి.యం. గారు... పరిచయస్తులైనందున కట్టడ నిర్మాణంలో సాంబశివరావుకు మంచిపేరు వున్నందున... కొన్ని కోట్ల పనులు టెండర్ మూలంగా వారికి లభించాయి.


ప్రాజక్టుల కార్యనిర్వహణకు... సాంబశివరావుగారు పాతిక మంది ఇంజనీర్లను తీసుకోవడం జరిగింది. ఆ పాతిక మందిలో సత్యమూర్తి ఒకరు. మామగారు కోదండరామయ్యగారి సాయంతో పవన్ కన్స్ట్రక్షన్లో సత్యమూర్తికి వుద్యోగం లభించింది.


ఇప్పటికి సత్యమూర్తి వుద్యోగంలో ప్రవేశించి మూడు మాసాలు.

సత్యమూర్తి... మితభాషి... తాను ఎవరో... తన స్థితిగతులు ఏమిటో మరువని వ్యక్తి. ముక్కుకు సూటిగా నడిచే తత్వం.


ఆఫీస్ లో చేరి మూడు మాసాలైనా... పెద్దగా పరిచయాలు... స్నేహాలు పెరగలేదు. తమ తన పని.. బాస్ అడిగిన దానికి సమాధానం... చేయమని చెప్పిన పనిని ఏకాగ్రతతో చేయడం... రోజువారీ టార్గెట్ ను ముగించి తన గూటికి చేరడం... తీరిక సమయంలో తెలుగు సాహిత్యాన్ని చదవడం.


ఆ రోజు...

ఒకటిన్నరకు... యాజమాన్యం నడిపే క్యాంటిన్ కు భోజనానికి వెళ్ళాడు. బఫే పద్ధతిలో ఆ క్యాంటిన్ కాంట్రాక్టు తీసుకొన్నవారు నడుపుతున్నారు. ప్లేట్లో కావలసిన వాటిని వుంచుకొని టేబుల్ ముందు కూర్చొని భోజనం చేయడాన్ని ప్రారంభించాడు సత్యమూర్తి.


మాధవరావు... సత్యమూర్తి పనిలో చేరిన మూడు వారాల తర్వాత... కంపెనీలో చేరాడు.

అతను... భోజన ప్లేటుతో సత్యమూర్తి ముందు కూర్చున్నాడు.

"గుడ్ ఆఫ్టర్ నూన్ సార్!..." నవ్వుతూ చెప్పాడు మాధవరావు.


“గుడ్ ఆఫ్టర్ నూన్....” తింటూ మాధవరావు వైపు చూడకుండానే చెప్పాడు సత్యమూర్తి. 


"సార్...." నా పేరు మాధవరావు..."


"విన్నాను...".


"మా వూరు మీ వూరి ప్రక్క వూరే సార్...."


ఆశ్చర్యంతో మాధవరావు ముఖంలోకి చూచాడు సత్యమూర్తి.

"మీద నెల్లూరు... మాది కోవూరు..." నవ్వారు మాధవరావు. 


అలాగా... అన్నట్లు తల ఆడించారు. సత్యమూర్తి.

మనిషి... చాలా మితభాషిలా వున్నాడు. సరదాగా మాట్లాడాలనుకొంటే... నోరు తెరవకుండా తల ఆడిస్తున్నాడు. ఎంతైనా సీనియర్. మర్యాదనివ్వాలి... ఓవర్ గా వాగితే మనకే అవమానం.... అనుకొన్నాడు మాధవరావు.


ఆ భావనతో మాధవరావు మౌనంగా భోంచేయసాగారు.


సత్యమూర్తి భోజనం ముగించి... లేచి వెళ్ళిపోయాడు.


*

ఆ రోజు... ఆదివారం ఆఫీస్ కు శలపు. ఆరుగంటల షో బాహుబలి (ది కంక్లూషన్) పార్టు టును చూచి సత్యమూర్తి థియేటర్ బయటికి వచ్చి బస్ స్టాప్ లో ఆగాడు. అతనికి కొంచెం దూరంలో పాతిక సంవత్సరాలకు లోపు వయస్సు కల ఇద్దరు అమ్మాయిలు నిలబడి వున్నారు.


శరవేగంలో ఓ కారు వచ్చి వారి ముందు ఆగింది. వెనక డోర్ తెరచుకొని ఒక యువకుడు దిగి ఆ ఆడపిల్లలను సమీపించి... అందులో ఒక అమ్మాయి చేతిని పట్టుకొని బలవంతంగా లాక్కొని పోయి కారు వెనక సీట్లోకి త్రోసి... తానూ కూర్చొని డోర్ మూసేశాడు. కారు కదలి వెళ్ళిపోయింది. ప్రక్కన వున్న అమ్మాయి... "దీపా!..."బిగ్గరగా అరచింది. క్షణాల్లో జరిగిన ఆ చిత్రమైన సన్నివేశాన్ని తెలివిగా... సమయస్ఫూర్తితో, తన ఐ ఫోన్లో ఎక్కించాడు సత్యమూర్తి.


"సార్.... మా అక్కయ్యను కాపాడండి సార్... ఏడుస్తూ ఆ రొండవ అమ్మాయి సత్యమూర్తిని సమీపించింది. 


తమ ముందు వెళుతున్న ఆటోను ఆపి...

"భయపడకండి. మీ అక్కయ్యకు ఏం కాదు. మీరు నాతో రండి..."


ఇరువురూ ఆటోలో కూర్చున్నారు.

సాబ్... కా జానా!..."


"పోలీస్ స్టేషన్..."


"పచ్చాస్ రూపాయ్ హోతా సాబ్....


"ది ఏంగే... జల్ దీ చెలో...."


ఇరవై నిముషాల్లో ఆటో పోలీస్ స్టేషన్ ముందు ఆగింది. సత్యమూర్తి... ఆ అమ్మాయి ఆటో దిగారు. ఆటో అతనికి డబ్బులు ఇచ్చాడు సత్యమూర్తి. అతను వెళ్ళిపోయాడు.

‘‘మీ పేరు..." 


"జ్యోతి సార్...."


"నాతో రండి..."

ఇరువురూ స్టేషన్లో ప్రవేశించారు.


అంతవరకూ... యస్.ఐ. భార్గవతో మాట్లాడిన వారు కుర్చీల నుంచి లేచి వారికి నమస్కరించి వెళ్ళిపోయారు. యస్.ఐ. భార్గవ సత్యమూర్తిని జ్యోతిని చూచి...

"కూర్చొండి.... ఏమిటి విషయం?..." అడిగాడు.


ఇరువురూ కూర్చున్నారు. అరగంట ముందు జరిగిన విషయాన్ని సత్యమూర్తి భార్గవ్ కు చెప్పాడు. తన సెల్ లో వున్న వీడియోను చూపించాడు.

కొన్ని క్షణాలు ఆ వీడియోను చూచి భార్గవ్...

"నీ పేరేమిటి?..."


"సత్యమూర్తి...


"ఏ వూరు?..."


"నెల్లూరు..."


"ఆ అమ్మాయికి యీ అమ్మాయికి... నీకు ఏమిటి సంబంధం!..."


"ఎలాంటి సంబంధం లేదు..."


"అయితే... నీ దారిన నీవు పోకుండా ఈ అమ్మాయిని తీసికొని యీడ కెందుకొచ్చినావ్!..."


"అన్యాయాన్ని కళ్ళారా చూచాను కాబట్టి!... ప్రజారక్షక వ్యవస్థ మీ చేతుల్లో వుంది కాబట్టి... ఆ అమ్మాయిని కాపాడాలనే వుద్దేశ్యంతో వచ్చాను”


"వాడెవడో నీకు ఎరుకనా?..."


"తెలీదు...."


"యం. ఎల్. ఏ కొడుకు!..."


"అయినంత మాత్రాన అక్రమాలు చేయాలా సార్....”


"వాళ్ళతో పెట్టుకొంటే నీకు ప్రమాదం!..."


"నాకేమైనా ఫరవాలేదు. ఆ అమ్మాయిని కాపాడండి సార్...."


"తెలిసి తెలిసి రిస్కులో పడతానంటవ్!!... అవునా!..."


"అవును సార్!... నా బాగోగులు కన్నా.. ఆ అమ్మాయిని రక్షించడం... నాకు ముఖ్యం. యం.ఎల్.ఏ గారి గూండాలు వచ్చి... నన్ను చంపుతారనే భయం నాకు లేదు”.


"నేను నీ మాటలను లక్ష్య పెట్టకుండా... కాదని ఏమీ చేయనంటే... నీవేం చెస్తవు?....”


చిరునవ్వుతో సత్యమూర్తి... "మీరు అలా అవరని నాకు నమ్మకం సార్..." ప్రాధేయపూర్వకంగా చెప్పాడు.


"చూడు... నేను అన్నమాట మీదనే వుంటా. నన్నేం చేస్తావ్....”


"మిమ్మల్ని నేను ఏం చేయగలను సార్.... ఏమీ చేయలేను... కానీ విషయాన్ని ఇంతటితో వదలను సార్...." చివరి మాటలను కాస్త సీరియస్ గా చెప్పాడు సత్యమూర్తి.


జ్యోతి... భయంతో... బాధతో ఏడుస్తూ వుంది.

"వదలక ఏం చేస్తవ్?..."


సత్యమూర్తి కుర్చీ నుంచి లేచాడు...

"జ్యోతీ!... లే..."


జ్యోతి లేచి నిలబడింది.

"పద..."


సత్యమూర్తి రొండు అడుగులు ముందుకు వేశాడు. జ్యోతి అతని ప్రక్కకు చేరింది.

"బాబూ!... ఎక్కడికి పోతుండావ్...." అడిగాడు భార్గవ్.


‘‘ఐ.జీ. గారిని కలిసేటందుకు వెళుతున్నాను” నడుస్తూనే చెప్పాడు సత్యమూర్తి.


‘‘అగు!...’’


ఆగి... సత్యమూర్తి వెను తిరిగి భార్గవ్ ముఖంలోకి నిర్లక్ష్యంగా చూచాడు.


భార్గవ్ నవ్వుతూ అతన్ని సమీపించి భుజంపై చెయ్యి వేసి... "నీ ధైర్యం... నీ సాహసం... నాకు నచ్చాయి సత్యమూర్తి నీలాంటివాళ్ళు నూటికి పది మంది వుంటే... సంవత్సరం లోపల మా పోలీసు బలగాలు ఇలాంటి అరాచకాలను నామరూపం లేకుండా చేయగలవు... కూర్చో!..."


సత్యమూర్తి జ్యోతి ముఖంలోకి చూచాడు. ఇరువురూ మరలా కుర్చీలలో కూర్చున్నారు.

భార్గవ్... ఆరు ఫోన్ కాల్స్ ఎనిమిది నిముషాల్లో చేశాడు. విషయాన్ని తన బృందానికి తెలియజేశాడు. కుర్చీ నుంచి లేచి... "సత్యమూర్తి!... నాతో రండి.”


ముగ్గురూ పోలీస్ కారులో ఎక్కారు. ఇరవై అయిదు నిముషాల్లో ఐడిపిల్ జంక్షన్ చేరారు.

నాలుగు వైపులా పోలీస్ వాహనాలు... పోలీసులు మధ్యలో యం.ఎల్.ఎ కుమారుడు పాపారావు కారు. 

భార్గవ్ కారు నుండి దిగి పాపారావు కారును సమీపించాడు. డోర్ బలంగా తట్టాడు. పాపారావు బిక్క ముఖంతో కారు దిగాడు.


భార్గవ... ప్రక్కనున్న పోలీస్ ను చూచి... 'సంకెళ్ళు తగిలించు..." అది మామూలు మాట కాదు శాసనం. పాపారావు తబ్బిబై తల దించుకొన్నాడు. పోలీసులు అతన్ని లాక్కొని వెళ్ళి పోలీస్ వ్యాన్ ఎక్కించారు.


చెరిగిన జుట్టు... కన్నీటితో దీప కారు దిగింది. ఆమె ప్రక్కన మాధవరావు నిలబడి వున్నాడు.

వేరే దిశ నుంచి వచ్చిన సబ్ ఇన్ స్పెక్టర్ బాలాజీ భార్గవను సమీపించి... "సార్!... యీ మాధవరావుగారి సాయంతోనే మేము ఆ కారును ఆప కలిగాము. ఆ అమ్మాయి కారు అద్దాన్ని పగలగొట్టి... 'హెల్ప్' అని అరవగా... ఆ కేకను విన్న మాధవరావు కారుకు అడ్డంగా తన బైక్ను వుంచి అది ఆగేలా చేశాడు”


మాధవరావు... భార్గవను సత్యమూర్తిని చిరునవ్వుతో సమీపించాడు. ఇరువురూ మాధవరావు సాహసాన్ని అభినందించారు.


సత్యమూర్తి... చిరునవ్వుతో తన చేతిని మాధవరావు చేతితో కలిపాడు.

మిత్రులిద్దరూ పోలీస్ వ్యాన్ లో దీపను జ్యోతిని వారి ఇంటికి చేర్చారు.


అక్కాచెల్లెళ్ళు... జరిగిన సంఘటనను గురించి తల్లిదండ్రులకు చెప్పారు. ఆ దంపతులు సత్యమూర్తికి మాధవరావుకు ధన్యవాదాలు చెప్పారు. ఆ ఇరువురూ... వారి ఇంటి నుండి బయలుదేరారు.


'ఏ తల్లి కన్నదో!!!...' ఆ ఇద్దరు బిడ్డలను దేవుడు ఎప్పుడూ చల్లగా చూడాలి...' అని జ్యోతి దీపల తల్లి... అన్నపూర్ణమ్మ... దైవాన్ని వేడుకొంది.

***


సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.

48 views0 comments

Comments


bottom of page