top of page

ఎవరు నాన్నా.. ఆవిడ?


'Evaru Nanna Avida' New Telugu Story Written By Penumaka Vasantha

'ఎవరు నాన్నా.. ఆవిడ?' తెలుగు కథ

రచన: పెనుమాక వసంత

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


"ఎవరూ అదీ" అన్నం తిని నీళ్ళు పుక్కిలించడానికి బయటకు వచ్చిన చారి, బయట ఎవరో గేట్ దగ్గర చీకట్లో తచ్చట్లాడుతుంటే చూసి కేక పెట్టాడు.


వచ్చిన వాళ్ల దగ్గర నుండి సమాధానం లేకపోతే ఈసారి ఇంకాస్త గట్టిగా "ఎవరు?.. అంటే పలకరేం" అన్నాడు.

ఒక స్త్రీ.. దాదాపు యాబై యేళ్లు పై మాటే.. పైన ముసుగు, మూతికి మాస్క్ ఉన్నాయి. కాటన్, జరీ చీరలో ఉన్న ఆమెను "ఎవరమ్మా మీరు? ఎవరు కావాలి.. లోపలికి రండి" అన్న చారితో కళ్ల నీళ్ళు తుడుచుకుంటూ లోపలికి వచ్చి "శారద" అనేలోపు..


"శారద.. అది నా భార్య పేరు. చనిపోయింది గా! ఇంకో శారద అయితే ఈ వీధిలోనే ఆ మూడో ఇంట్లో ఉంటారు, వెళ్లండి. "

మాస్క్ తీసి "ఏమండీ! నేను శారదను. గుర్తు పట్ట లేదా?" అంది.


అపుడు శారద ను గుర్తు పట్టిన చారి “అవునూ.. శారదే! ఏంటి ఇలా అయింది.. చిక్కి శల్యం లాగా ఉంది.. బొద్దుగా, తెల్లటి రంగులో ఉండే శారదేనా! నా ఎదురుగా ఇపుడు ఉంది. శత్రువైయినా, ఇంట్లో కి పిలిచి మంచినీళ్లు ఇవ్వటం ఆచారం. ఇంట్లోకి రా!” అని వరండా లో కూర్చోమని కుర్చీ చూపించి, లైట్ వేసి లోపలికి వెళ్ళాడు.

'అమ్మయ్య! నామీద కోపం లేదు' అనుకుంటూ.. కుర్చీ లో కూర్చుంది. అప్పటి లాగానే ఉంది ఇల్లు ఏమి? మారలేదు. అదే పెద్ద సింహద్వారం, పైన దేముడి ఫోటోలు.. ఇంకొంచం లోపల కి చూసిన శారదకు హల్ గుమ్మం పై అత్త, మామ ఫోటోల కి దండలు.


ఆ ఇద్దరూ పోయారన్నమాట!? అపుడు నన్ను ఎంత వేపుకు తిన్నారు.. ఆ పక్కన ఉన్నది ఎవరు..? అని కళ్ళ జోడు సరి చేసుకుని చూసింది శారద.


నేనే! నా ఫోటో కి దండ.. అలాగే ఆశ్చర్యపోతూ ఆ ఫోటో ను చూస్తూ ఉంటే చారి వచ్చి మంచి నీళ్ళు ఇచ్చాడు.

కళ్ల నీళ్ళు తుడుచుకుంటూ "ఎలాఉన్నారు!" అని అడిగింది శారద చారిని.


"ఇదిగో ఇలా ఉన్నా.. !” అన్నాడు చారి.

"పిల్లలు ఎలా ఉన్నారు? అంది శారద.


“అమ్మాయి కి పెళ్లి అయింది. అత్తవారింట్లో ఉంది. అబ్బాయి కి కూడా పెళ్లి అయింది. కోడలు కడుపుతో ఉంది. పురిటికి పుట్టింటికి వెళ్ళింది. అబ్బాయి పట్నం వెళ్ళాడు. లాస్ట్ బస్ కి వస్తాడు..”

"నా ఫోటోకి దండ వేశారు. కర్మకాండలు బాగా చేశారా లేదా.. నాకు!? ఒక మనిషి బతికుండగానే తన ఫోటో కి దండ వేసి ఉండటాన్ని చూసుకోవటం బహుశా నా ఒక్కదానికే.. నేమో? ఇంత అదృష్టం.. ఈ జన్మకి ఇది చాలు. ఇక ఇపుడు ప్రాణం పోయినా.. పర్లేదు"

"ఎవరు చేసిన కర్మ వాళ్లు అనుభవించాల్సిందే. పిల్లకు ఐదో యేట, పిల్లాడికి మూడో ఏటన వెళ్లిపోయిన దానివి! ఇపుడే కదా రావటం! నా మంచితనాన్ని అలుసుగా తీసుకొన్నావు. పిల్లలు, ‘అమ్మ ఎక్కడా.. ?’ అంటే చెప్పలేక ఎన్ని రోజులు మనసులో కుమిలిపోయానో నీకేమి తెలుసు. !?

మేము ఆడంబరాలకు పోయే వాళ్ళం కాదు. ఉన్న దాంట్లో తృప్తిగా తిని బ్రతికే వాళ్ళం. నీకు మా అంతస్తు, మేము, నచ్చక ఉద్యోగం వెతుక్కొన్నావు. ‘వెళ్తున్నా.. నా అవసరం ఉంటే.. మీరే వస్తారని తలుస్తా..’ అని ఉత్తరం రాసి పెట్టి వెళ్ళావు గా.. ?

కనీసం పిల్లలు కూడా గుర్తుకు రాలేదా, ఇన్నాళ్లు నీకు! లోకం, ‘చారి పెళ్ళాం లేచిపోయింది’ అని కోడై కూసింది. ఆ అవమానాన్ని తట్టుకోలేక, ‘పట్నం లో ఉద్యోగానికి వెళ్ళింది. మేము పిల్లలు పట్నం వెళ్దామనుకునే లోపు ఆక్సిడెంట్! అయి.. పోయింది’ అనీ.. కట్టుకథలు చెప్పి నమ్మించాలని, చూసినా..

వాళ్ళు నా వైపు చూసే చూపులో ‘నిజం చెప్పు’ అన్నట్లు ఏదో భావం కనపడేది. అపుడు తలకాయ ఎక్కడ, పెట్టుకోవాలో తెలియక, నాలో.. నేను కుమిలి పోయాను. అపుడు అమ్మా, నాన్న లేకపోతే వీళ్ళను పెంచ గలిగేవాడినా. ?!” అన్నాడు చారి.

“మిమ్ములను, పిల్లలను, నాకు ఉద్యోగం వచ్చిన చోటికి తీసుకెళ్దాం అనుకుంటే మీరు రాము అన్నారుగా!?” అంది శారద.


“అవును.. !? అమ్మ నాన్నని వదిలి నేను ఎలా రాగలను. ?” అన్నాడతను.

మీకు, మీ అమ్మ నాన్న.. తర్వాతే నేను! అని తెలుసుకొని ఉద్యోగం చూసుకొని వెళ్ళిపోయాను. పిల్లలను పెంచలేక మీరు వెంటనే నా దగ్గరకు వస్తారనుకున్నా!? రాలేదు. నేను మీరు రాలేదన్న కోపంతో అలాగే దూరం గా ఉండిపోయాను.

ఎలా వస్తాను నీతో నేను.. ఇక్కడ గుడి అర్చకత్వం, ఒకటీ! నాన్న అమ్మ, పెద్దవాళ్ళు అయ్యారు. నీకు సిటీ లో ఉండటం కావాలి. నీ ఫ్రెండ్స్ తో నిన్ను పోల్చుకుని ఈ పల్లెటూరు లో ఉండలేక! పట్నం లో హాయిగా ఉండవచ్చు అని వెళ్ళావు! నేను బాధ్యతలు తప్పించుకొని రాలేను.. నీలాగా.. !

అమ్మా, నాన్న ఉండబట్టీ! పిల్లలను, పెంచగలిగాను.

నన్ను మళ్ళీ! పెళ్లి చేసుకోమని అమ్మ వత్తిడి చేసింది. నేను ఈ జన్మకు ఒక్క పెళ్లి చాలు అన్నాను. ఇపుడైనా గేట్ బయట చూస్తే ఆటునుండి అటు పంపేవాడ్ని నిన్ను, ఇంట్లో కి రానివ్వకుండా. వచ్చిన తర్వాత గుర్తు పట్టా. అయినా..

ఇదివరకు ఉన్న ఆవేశం ఇపుడు ఉండదు కదా! అందుకే నిన్ను ఇంతసేపు క్షమించా.. !

నువ్వు చేసిన తప్పు వల్ల ఎంతమందిమి బాధపడ్డామో! నీకు తెలియాలి కదా.. నీవు ఎంత తప్పు చేశావో!? ఇప్పటికైనా తెల్సుకుంటే కొంతైనా నీ పాపం పోతుంది. !? నేను తప్పు చేయలేదు అనుకుంటే మటుకు ఈ పాపం జన్మ.. జన్మలకు వెంటాడుతుంది”

“నేను కాదు! మీరు చేశారు తప్పు.. పట్నం వచ్చి నన్ను తిట్టి లేదా తన్ని వెనక్కి తీసుకురావాలి. తర్వాత నేను పిల్లల కోసం వద్దామనుకొనే లోపు ఈ ఊరి వాళ్ళు కనపడి ‘నువ్వు చనిపోయావు అని మీ ఆయన నీకు కర్మకాండలు చేశారు’ అని చెబితే ఇంక నా మొహం ఎవరికి చూపించలేక ఎవరికి అందనంత, దూరం ట్రాన్స్ఫర్ చేయించుకొని వెళ్లాను. నా జీవితం ఎలాగూ పాడైపోయింది, మీరన్నా సుఖం గా ఉండాలని.


సర్లే, అయిందేదో! అయింది. పిల్లల గురించి చెప్పండి! వాణీ ఎలా ఉంది!” కూతురు గురించి అడిగింది.


“బావుంది! మా అక్క కొడుకు చేసుకొన్నాడు. వాళ్లకి ఒక అమ్మాయి, అబ్బాయి. అబ్బాయి రాము అర్చకత్వంతో పాటు జిరాక్స్ సెంటర్ పెట్టాడు. చదువు లేని పేదింటి అమ్మాయిని పెళ్లి చేసుకొన్నాడు. కోడలు మంచి పిల్ల. రాము పట్నం వెళ్లాడు వచ్చే టైం అయ్యింది. వాడు వచ్చిన ఆ బస్ కి నువ్వు వెళ్ళిపో ! అదే లాస్ట్ బస్” అన్నాడు చారి.

“నాకు ఆరోగ్యం బావుండటం లేదు. ఈ చివరి దశలో మీ దగ్గర, ఉందామనుకొంటున్నాను. నా తప్పు ఒప్పుకుంటున్నాను! నన్ను క్షమించి, మీ పాదాల దగ్గర చోటు ఇవ్వండి”

“లేదు!శారదా! నువ్వు చాలా లేట్ చేశావు. నువ్వు ఎక్కాల్సిన బండి జీవితకాలం లేటు. పిల్లల దృష్టి లో నువ్వు చనిపోయావు. దాదాపు నిన్ను అందరం మర్చిపోయాం. ఇపుడు నువ్వు ఇంట్లో ఉంటే నేను పిల్లలకు లోకువ అవుతాను. అపుడు మమ్ములని వదిలేసి వెళ్లిన ఈవిడను ఇంట్లోకి రానిచ్చినందుకు పిల్లల దగ్గర లోకువ అవుతాను.

దయచేసి రాము వచ్చేలోపు వెళ్ళిపో!” అని శారదకు దణ్ణం పెట్టాడు చారి.

గేట్ తీసిన చప్పుడుకు చారి, శారద లు అటు చూస్తే రాము వచ్చాడు ఇంటిలోకి.


"రాము.. బస్ ఆపమని కేకేసి చెప్పు డైవర్ కి. "

“తిప్పుకొని పైనుండి వస్తాడు లే నాన్న” అంటూ మాస్కు వేసుకొని ఉన్న శారదను చూసి "ఈవిడా?..” అని చారి వైపు చూసిన రాము తో "ముందు బస్ ఎక్కించి రా ఆమెను! బస్ పోతుంది” అన్నాడు చారి.

శారద కళ్ల నీళ్ళు తుడుచుకుంటూ రామూని తదేకంగా చూస్తూ. రాము వెనక బస్ కోసం నడిచింది. శారద ను బస్ ఎక్కించి వచ్చాడు రాము.

“ఎవరు నాన్నా ఆవిడ?! నన్ను అలా చూస్తూనే ఉంది. నన్ను దగ్గరకి తీసుకొని బుగ్గలు నిమిరి ‘నువ్వు బాగుండాలి నాన్నా’ అని కళ్ల నీళ్ళు తుడుచుకుంటూ బస్ ఎక్కిం”


"చిన్నప్పుడు మిమ్మలను కొన్నాళ్ళు పెంచింది లే. అందుకే ఇపుడు చూసి పోదామని వచ్చింది”

"అదేంటి నాన్నా! ఉండమనకపోయారా ఈ రాత్రి.. పొద్దునే లేచి వెళ్ళే వారుగా!? పెద్దావిడ పాపం”


"కొంత మందిని దూరం గా ఉంచటమే, ఉత్తమం రా!"


'నాన్నకి ఈ మధ్య వేదాంతం ఎక్కువైంది. ప్రతి మాట లో ఒక జీవిత సత్యం ఉంటుంది. గుడి లో పురాణాలు చెప్పి.. చెప్పి.. ఇలా మాట్లాడుతున్నారు' లోపల గొణుక్కుని లోపలికి నడిచాడు రాము..

***


పెనుమాక వసంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


Podcast Link:


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:

పేరు వసంత పెనుమాక, గృహిణి. రచనలు చేయటం, పాటలు వినటం హాబీస్. మన తెలుగు కథలకు కథలు రాస్తున్నాను. ధన్యవాదములు.





60 views0 comments
bottom of page