top of page

గీతా మాధుర్యం - 1


'Githa Maduryam - 1' New Telugu Web Series

Written By Sripathi Lalitha

'గీతా మాధుర్యం - 1' తెలుగు పెద్ద కథ

రచన: శ్రీపతి లలిత

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

గీతా మాధుర్యం పెద్ద కథ 1/3


"ఏమోయ్! నీ కూతురు ఫోన్ చేసింది, మళ్ళీ ఏమి ముంచుకొచ్చిందో!" గోపాల్ సెల్ గీతకి ఇస్తూ అన్నాడు. "అవును అదేమన్నా మంచి చేస్తే మీ కూతురు. పిచ్చపనులు చేస్తే నా కూతురు" అంటూ ఫోన్ తీసుకుంది. "ఏమిటే ఏమైంది?"అడిగింది కూతుర్ని. "అమ్మా! రాజీవ్ అర్జెంటుగా, రాత్రి కంపెనీ పనిమీద మూడు వారాల కోసం, అమెరికా వెళ్ళాడు. నువ్వు, నాన్న వెంటనే రండి. లేదంటే ఆది కి ఇబ్బంది. రాజీవ్ వచ్చేదాకా ఉండి వెళుదురు." అంది మాధురి హడావిడిగా. ఆది అనబడే అద్వైత్, రాజీవ్, మాధురీల కొడుకు. "ఇలా నువ్వు ప్రతి నెలా ఏదో ఒకటి చెప్పి రమ్మంటే మాకు ఎలా కుదురుతుంది మధూ! అయినా పక్కనే మీ అత్తగారు, ఆడపడుచు ఉంటారు. వాళ్ళ సాయం తీసుకోవచ్చుగా." విసుగ్గా అంది గీత. "అమ్మా! నువ్వు వస్తావా? రావా? లేపోతే ఎవరి సాయం తీసుకోవాలో నువ్వు నాకు చెప్పకు. నాకు తెలుసు." కోపంగా అంది మధు. "వస్తాను. రాక చస్తానా! ఏమి తెలుసు నీకు నీ బొంద, అసలు నిన్ను ఇలా తయారు చేసినందుకు మీ అయ్యని అనాలి" ఫోన్ పెట్టేసి తిరిగే లోపు ఆ అయ్యా కాస్తా జారుకున్నాడు. గోపాల్, గీతల ఏకైక సంతానం మాధురి. పెళ్ళైన ఏడేళ్ళకి, ఇంకా పిల్లలు పుట్టరు, అనుకునే సమయంలో పుట్టింది మాధురి. తల్లి, తండ్రి ఇద్దరిలో ఉన్న మంచి పోలికలు పుణికి పుచ్చుకుని జనముద్దు పిల్లగా పెరిగింది. గీత కొంత కట్టడిలో పెంచినా, గోపాల్ కూతుర్ని అరచేతుల్లో పెట్టుకొని పెంచాడు. కూతురు ఏది చెపితే అదే సరి అనేవాడు. గీత అలా కాదు. కరెక్ట్ కాదు అంటే కాదు అని చెప్పేది. కొంచెం తల్లి భయం ఉన్నా, తండ్రి ముద్దుతో తల్లిని పట్టించుకునేది కాదు. చదువులో ఫస్ట్, మంచి వాక్చాతుర్యం జత అయ్యి, మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది. నిజంగా చెప్పాలంటే మొగపిల్లల తల్లి తండ్రులు క్యూ కట్టారు మధుని కోడలుగా చేసుకోడానికి. వచ్చిన వాటిల్లో అందరికీ నచ్చిన రాజీవ్ సంబంధం ఖాయం చేసారు. రాజీవ్ తండ్రి ఆనందరావు, ప్రభుత్వకార్యాలయంలో మంచి స్థానం లో చేసి, రాజీవ్ ఉద్యోగంలో చేరిన కొన్ని రోజులకే క్యాన్సర్తో పోయారు. తల్లి శాంతి నిజంగా శాంతమైన మనిషి. అక్క అపర్ణ, బావ సంతోష్ ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు. వాళ్ళకి 10 ఏళ్ల శాన్వి, 8 ఏళ్ళ సంజయ్ పిల్లలు. రాజీవ్ అక్కకంటే 5ఏళ్ళు, బావ కంటే 10 ఏళ్ళు చిన్నవాడు. అందుకే, అక్క, బావ, అతన్ని చిన్నపిల్లాడిలాగేనే చూస్తారు. తండ్రి అకస్మాత్తుగా పోవడం అందరికి దెబ్బే కానీ రాజివ్ బాగా దిగులు పడ్డాడు. ఆ సమయంలో అతనికి అక్క బావ బాగా తోడు నిలిచారు. ఆనందరావు తనకి కాన్సర్ అని తెలియగానే ఆర్థిక లావాదేవీలు, సమస్యలు రాకుండా వీలునామా రాసారు. తాను ఉంటున్న ఇల్లు తన భార్యకి, ఆవిడ తరవాత కూతురికి. పక్కనే ఉన్న స్థలం, కొడుకు తనకి ఇష్టమైనట్టు కట్టుకోడానికి వీలుగా డబ్బు ఏర్పాటు చేసారు. భార్యకి తన పెన్షన్ వచ్చినా, ఉన్న ఇల్లు కాక పైన వాటా అద్దెకి ఇచ్చి, అదికూడా ఆవిడ వాడుకునేట్టు, ఒకవేళ కూతురు అక్కడ ఉంటాను అంటే, ఆమె కూడా తల్లికి అద్దె ఇవ్వాలని, తల్లి తరవాతే ఆ ఇల్లు కూతురుకి వస్తుందని రాసి చనిపోయారు. తండ్రి పోయాక అపర్ణ, సంతోష్, పిల్లలతో పైన వాటాకి మారిపోయారు. అంతకు ముందు కూడా దగ్గరలోనే ఉండేవారు. అపర్ణ వాళ్ళు ఆఫీసుకి వెళితే గీత దగ్గరే పిల్లలని వదిలేది. ఇప్పుడు ఇంట్లోకే మారారు, తల్లికి, తమ్ముడికి దగ్గరగా ఉండచ్చు అని. రాజీవ్ తనకి ఇష్టప్రకారం, తల్లి, అక్క, బావ సలహాలతో మంచి ఇల్లు కట్టుకున్నాడు. తల్లి తనతో ఉన్నా వీలుగా ఉండేట్టు, ఆవిడకి నచ్చినట్టు, పూజ గది, కావాల్సినట్టుగా బెడ్ రూమ్, వంటిల్లు కట్టించాడు. భర్త లేని బాధ ఉన్నా, కూతురు, అల్లుడు, కొడుకు ప్రేమలో శాంతి తేరుకుని, తన వీలు ప్రకారం రోజు కొంత సమయం పూజలో, కొంత మనవలతో గడుపుతుంది. రాజీవ్ అయితే అన్నిటికి అక్కని బావని సలహా అడుగుతాడు. గీతకి, గోపాల్కి ముఖ్యంగా మాధురి కి ఆ సంబంధం నచ్చింది. గీతకి శాంతి, అపర్ణల పద్దతి, మాటతీరు నచ్చితే, గోపాల్కి వాళ్ళ ఆస్థి, రాజీవ్ ఉద్యోగం, మాధురికి రాజీవ్ అందం, స్టైల్, సరదాగా మాట్లాడే తీరు నచ్చింది. పెళ్లి అయ్యాక ఎలానో పక్కనే ఉంటాము కదా అని, రాజీవ్, మాధురిని కొత్త ఇంట్లోనే ఉండమన్నారు. పెళ్లి అయ్యి, వీళ్ళు కాస్త సెటిల్ అయ్యేసరికి ఆది కడుపున పడ్డాడు. ఆది పుట్టాక ఇంక సెలవు అయిపోయింది, ఉద్యోగంలో చేరాలనుకునేలోగా కరోనా వచ్చింది. మాధురికి కరోనా మంచిదే అయింది. అన్ని కంపెనీల లాగానే రాజివ్కి, మాధురికి వర్క్ ఫ్రొం హోమ్ ఇచ్చారు. నానమ్మ, అమ్మ, నాన్న, అత్త, మామ మధ్య అత్త పిల్లల తో పెరిగి మూడేళ్ళవాడు అయ్యాడు. కరోనా తగ్గి మళ్ళీ ప్రపంచము మాములుగా అయింది. రాజీవ్ ని, మాధురిని వారానికి మూడు రోజులు రమ్మన్నారు. ఎవరో ఒకరు ఇంట్లో ఉండేటట్టు గా చూసుకొని ఇద్దరూ ఉద్యోగాలకి వెళ్తున్నారు. ఆదిని నర్సరీ స్కూల్లో చేర్పించారు మధ్యాహ్నం ఇంటికి వచ్చేసరికి అమ్మో, నాన్నో ఉండేవారు. గీత గమనిస్తోంది, గత ఆరునెలలుగా మాధురి ఎప్పుడు ఫోన్ చేసిన అత్తగారిమీదో, ఆడపడుచు మీదో నేరాలు చెప్తూనే ఉంటుంది. వాళ్ళు ఏమి చేసిన తప్పే, సర్దుకోమంటే తల్లి మీద అరుస్తుండేది. మొదట్లో గోపాల్ కూడా మాధురికి వంత పాడాడు, కానీ గీత అన్ని వివరిస్తే కూతురిదే తప్పు అనిపించినా, తప్పు అనలేని బలహీనత అతనిది. ఇప్పుడు కూతురు ఫోన్ చేస్తే ఎందుకు అనకుండా వెళ్ళడానికి సిద్దమయ్యాడు. బయటికి వెళ్లినవాడు కూతురికి ఇష్టమైన స్వీట్స్, కారాలు తీసుకొని వచ్చాడు. "నీకు టికెట్ మధుని బుక్ చెయ్యమన్నాను. ముందు నువ్వు వెళ్ళు, నేను ఒక వారంలో నేను వస్తాను. రాజీవ్ వచ్చాక ఇద్దరం కలిసి వద్దాము"అన్నాడు. గీతకి కూడా ఇదే మంచిది అనిపించింది. గోపాల్ ఉంటే, ప్రతిదానికి మధుని వెనకేసుకు వస్తాడు అని తాను ముందు బయలుదేరింది. రైలుదిగి వెళ్లేసరికి అప్పుడే ఆదిని స్కూల్కి పంపింది మాధురి. "అమ్మా నేను కాంటీన్లో తింటాను, నీకు కావాల్సినవి నువ్వు చేసుకో, ఆది ఒంటిగంటకు వస్తాడు"అంటూ క్యాబ్లో వెళ్ళిపోయింది. లోపల చూసిన గీతకి నీరసం వచ్చింది. ఇల్లంతా ప్యాకెట్ల కవర్లు, పళ్ళ తొక్కలు, సోఫా మీద తడి టవల్, ఆ పక్కనే విప్పిన నైట్ డ్రెస్, ఎండిపోయిన ఖాళీ కాఫీ కప్పులు, ఎంగిలి ప్లేట్లు. వంటింట్లో స్టవ్ మీద పొంగిన పాల మరకలు ఎండిపోయి, మాడిపోయి ఉన్నాయి. ఇది ఇల్లా, ఇంత చెత్తగా ఇల్లు పెట్టుకోవచ్చా ? ఇల్లంతా ఒక్కటే వాసన.. కూతురి మీద, తనమీద కోపం వచ్చింది. "ఇంత దరిద్రంగా పెంచానా మధుని. అసలు శుభ్రం లేకుండా ఉంది, తన దగ్గర ఉన్నపుడు ఇంత బద్దకంగా ఉండేది కాదు. అసలు ఎటునుంచి పని మొదలు పెట్టాలో అయోమయం గా చూస్తుంటే బెల్ మోగింది. ఎవరా అని చూసేసరికి శాంతి. "మధు చెప్పింది మీరు వస్తున్నారు అని"రెండురోజుల నుంచి పని అమ్మాయి రావడం లేదు. అందుకే మీకు టిఫిన్, కాఫీ తెచ్చాను. ఇల్లు శుభ్రం చేయడానికి వేరే అమ్మాయిని పిలిచాము, ఆమె మా ఇంట్లో చేస్తోంది. ఈ లోగ మీరు టిఫిన్ తిని స్నానం చెయ్యండి. ఆ అమ్మయి వచ్చి ఇల్లు శుభ్రం చేస్తుంది, భోజనంకి నా దగ్గరికి వచ్చెయ్యండి. ఆది ఒంటిగంటకు వస్తాడు"అంది శాంతి. "సరే" అని తల ఊపడం తప్ప మాటరాలేదు గీతకి. టిఫిన్ తిని కాఫీ తాగాక కొంచెం ప్రాణం లేచి వచ్చి ముందు స్నానం చేసి వచ్చింది. శాంతి పని అమ్మాయిని తీసుకు వచ్చింది. తాను కూడా కూర్చుని అన్ని రూంలు శుభ్రం చేయించింది. గీత కూడా టవల్స్ బయట ఆరేసి, విడిచిన బట్టలు మెషిన్ లో వేసి, గిన్నెలు అన్నీ సింక్ లో వేసి డైనింగ్ టేబుల్ సర్దింది. ఎలాగో ఒక గంటకి ఇల్లు కాస్త శుభ్రపడింది. "మీరు కాసేపు రెస్ట్ తీసుకోని రండి గీత, ఇద్దరం భోజనం చేద్దాము"అని వెళ్ళింది శాంతి. ఇద్దరు ఒకే వయసు అవడంతో ముందు నుంచి ఇద్దరు పేర్లు పెట్టె పిలుచుకునేవారు. ఒక అరగంట ఫ్రిడ్జ్ లో ఏమి ఉన్నాయి, సరుకులు ఏమి ఉన్నాయి అని చూసింది గీత. మాధురి, ‘నువ్వు వండుకు తిను’ అంది కదా అని. ఫ్రిజ్ కూడా గందరగోళంగా ఉంది. అలమరాలో సరుకుల డబ్బాలన్నీ ఖాళీ. సాయంత్రం మధు వచ్చాక చూడాలి అనుకుంటూ శాంతి దగ్గరికి వెళ్ళింది. కింద వాటా లో శాంతి ఒక్కతి ఉంటుంది. తన వంట తనే చేసుకుంటుంది. ఇల్లు శుభ్రంగా ఉంది. అపర్ణ ఆఫీసుకి వెళుతూ, పిల్లలు రాగానే తినడానికి రెండు డబ్బాల్లో టిఫిన్, మార్చుకునేందుకు డ్రెస్సులు పెట్టి వెళ్ళింది. "నేను మాధురికి చెప్పాను గీతా. 3 వారాలు స్కూల్ నుంచి ఆది నా దగ్గర ఉంటాడు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు అని." ‘అమ్మ వాళ్ళు వద్దామనుకుంటున్నారు, వద్దంటే ఏమన్నా అనుకుంటారేమో అంది మధు’. ఏదైనా పని ఉందా ఇక్కడ" అని శాంతి అడిగితే ఏమి సమాధానం చెప్పాలో తెలీలేదు గీతకి. "ఏమిటో ఈ మధ్య ఆది కల్లోకి వస్తున్నాడు, దిగులు అనిపించింది. రాజీవ్ కూడా లేడు కదా" అని వచ్చాను. "మీ అన్నయ్య ఒక వారం తరవాత వస్తారు."అంది గీత. ఒంటిగంట దాకా కూర్చున్నారు ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ. గీత, శాంతి ఇద్దరికీ చాలా ఇష్టాలు కలుస్తాయి. స్కూల్ వాన్ ఆగగానే."నానమ్మ!" అంటూ పరిగెత్తుకు వచ్చిన శాంతిని హత్తుకున్నాడు ఆది. ఎవరు వచ్చారో చూడు అంటే అప్పుడు చూసాడు గీతని. "అమ్మమ్మా" అంటూ ఎప్పుడు వచ్చావు ? తాత ఏరి? నాకు సర్ప్రైజ్ ఇచ్చావు" అంటుంటే అసలు మధు తమని ఎందుకు రమ్మందో అర్థం కాలేదు గీతకి. ఆది అక్కడే ఉండి శాంతి అన్నం కలిపి ఇస్తే చక్కగా కూర్చుని తిన్నాడు. అపర్ణ పిల్లలు వస్తే వాళ్లతో ఆడుకొన్నాడు. "సరే సాయంత్రం మాధురితో మాట్లాడచ్చు" అనుకుంది గీత. సాయంత్రం మాధురి వచ్చాక "వంట చేస్తాను, బియ్యం ఎక్కడ.. నాకు కనపడలేదు." అంటే "అరే ఉండు, బ్లింకిట్ లో తెప్పిస్తాను" అంది. "కూరలు కూడా లేవు, నూనె కూడా కనిపించలేదు" ఇలా ఒకొక్క ఐటెం చెపితే "అబ్బా ఏంటమ్మా.. అర్జెంట్గా కావాల్సినవి బ్లింకిట్లో తెప్పిస్తాను, మిగిలినవి నువ్వు షాపులో తెచ్చుకో" అంది. "మరి నువ్వు మధ్యాహ్నం ఏమి తిన్నావు?" అని కూడా అడగలేదు. రాత్రికి ఆలుగడ్డ కూర చేసి, తెప్పించిన పెరుగు తో తిన్నారు. వేడివేడిగా ఆలూ కూర" యమ్మీ మమ్మీ" అంటూ ఆది తిన్నాడు.


===========================================================

ఇంకా ఉంది...

===========================================================


శ్రీపతి లలిత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:

నా పేరు శ్రీమతి శ్రీపతి లలిత.

నేను ఆంధ్ర్రా బ్యాంకు లో ఆఫీసర్ గా పని చేసి పదవీ విరమణ చేశాను.

నా భర్త గారు శ్రీపతి కృష్ణ మూర్తి గారు కేంద్ర ప్రభుత్వం లో గెజెటెడ్ ఆఫీసర్ గా పని చేసి పదవీ విరమణ చేసారు.

నాకు చిన్నప్పటి నుంచి పుస్తక పఠనం , శాస్త్రీయ సంగీతం , లలిత సంగీతం వినడం ఇష్టం.

అరవై ఏళ్ళ తరవాత జీవితమే మనకోసం మనం బతికే అసలు జీవితం అనుకుంటూ రచనలు మొదలు పెట్టాను.

నా కధలు ఫేస్బుక్ లోని "అచ్చంగా తెలుగు " , "భావుక " గ్రూప్ లో , " గోతెలుగు. కం" లో ప్రచురించబడ్డాయి.

ప్రస్తుత సమాజం లో ఉన్న సమస్యల మీద , ఏదైనా పరిష్కారం సూచిస్తూ కధలు రాయడం ఇష్టం.

నేను వ్రాసిన కధలు ఎవరైనా చదువుతారా !అని మొదలు పెడితే పాఠకులనుంచి మంచి స్పందన, ప్రోత్సాహం , ఇంకాఉత్సాహం ఇస్తుంటే రాస్తున్నాను.

పాఠకుల నుంచి వివిధ పత్రికల నుంచి ప్రోత్సాహం ఇలాగే కొనసాగగలదని ఆశిస్తూ.. మీకందరికీ ధన్యవాదాలుతెలుపుతూ మళ్ళీ మళ్ళీ మీ అందరిని నా రచనల ద్వారా కలుసుకోవాలని నా ఆశ నెరవేరుతుంది అనే నమ్మకం తో ... సెలవు ప్రస్తుతానికి.

83 views0 comments

Comments


bottom of page