top of page
Writer's pictureLalitha Sripathi

గీతా మాధుర్యం - 2


'Githa Maduryam - 2' New Telugu Web Series

Written By Sripathi Lalitha

'గీతా మాధుర్యం - 2' తెలుగు పెద్ద కథ

రచన: శ్రీపతి లలిత

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

గీతా మాధుర్యం పెద్ద కథ 2/3


జరిగిన కథ

గోపాల్ గీతల కూతురు మాధురి.

మాధురి భర్త రాజీవ్. కొడుకు అద్వైత్.

భర్త కంపెనీ పని మీద అమెరికా వెళ్లడంతో తల్లిని సాయానికి రమ్మంటుంది మాధురి.

పక్కనే అత్తగారు, ఆడబడుచు ఉన్నా తన సాయం కోరడంతో ఆశ్చర్యపోతుంది గీత.

అక్కడకు వెళ్లిన గీత, ఇల్లు అపరిశుభ్రంగా ఉండటంతో బాధ పడుతుంది.


ఇక గీతా మాధుర్యం పెద్ద కథ 2/3 చదవండి..

మర్నాడు ఆది కి, మాధురికి సెలవు. మాధురి తో కలిసి పొద్దున్నే షాప్కి వెళ్లి కూరలు, సరుకులు తెద్దామనుకుంది గీత. అలవాటుకొద్దీ ఆది పొద్దున్నే లేచాడు."మమ్మీ"అంటూ మాధురిని లేపితే వాడికి ట్యాబు ఇచ్చి ఆడుకోమంది. గీత పిలిచి పాలు కలిపి ఇచ్చి"వెళ్లి అక్కా వాళ్లతో ఆడుకో"అంది. వాడు మొహం ఆశ్చర్యంగా పెట్టి"నిజంగా"" మమ్మీ కోప్పడుతోందేమో"అన్నాడు. "నేను చెప్తాలే, కొంచెం సేపు ఆగి రా ఏదైనా టిఫిన్ పెడతాను" హుషారుగా వెళ్ళాడు. మాధురి 10 అయినా నిద్రలేవలేదు. వారం అంత కష్ట పడుతుంది పోనిలే, అని వదిలేసింది. పొద్దున్నే టిఫిన్ తినే అలవాటు తనకి. తిందామంటే ఇంట్లో ఏమి కనపడలేదు మాగ్గీ తప్పా. నెమ్మదిగా లేచిన మాధురి ఫోన్ పట్టుకుని కూర్చుంది. "మధూ! వంట ఏమి చేద్దాము? కూరలు కావాలి, కొన్ని సరుకులు కావాలి"అంది. "అబ్బా ఏంటమ్మా గోల, నువ్వూ మా అత్తగారిలానే ఉన్నావు, వంటా, పెంటా అంటూ, నేను మీల్స్ ఆర్డర్ చేస్తాను"అంది. "మీల్స్ ఆర్డర్ చేస్తావా! ఏం రోజూ వంట చెయ్యవా ? రోజూ బయట తింటే అసిడిటీ వస్తుంది." అంది గీత. "మీరు ఏమి తింటారు సరుకులు లేవు, కూరలు లేవు. పాల ప్యాకెట్లు అలానే ఉన్నాయి. అసలు పాలు కాచడం, పెరుగు తోడు వెయ్యడం ఉందా లేదా ?""ఆదికి ఏమి పెడతావు?"కొంచెం విసుగ్గా అంది గీత. "ఏమిటమ్మా? మా అత్తగారు, ఆడపడుచు గోల తప్పుతుంది అని నిన్ను రమ్మంటే నువ్వు నా బుర్ర తింటున్నావు ?" "నా జీతం ఎంతో తెలుసా? రాజీవ్ కి ఎంత వస్తుందో తెలుసా, అన్ని కోతలు పోయి మా ఇద్దరికి కలిపి 3 లక్షల రూపాయలు వస్తాయి. తెలుసా? మాకు సొంత ఇల్లు ఉంది. హాయిగా ఖర్చు పెట్టుకోకుండా ఒకటే సోది. బయట ఆహరం తినద్దు, పిజ్జా వద్దు, బర్గర్ వద్దు అంటూ అన్నిటికి కట్టడి, నాకు విసుగు వస్తోంది. వంటింట్లో చెప్పులు వేసుకోకు. జుట్టు వదిలేసుకోకు, ఆదికి ఊరికే ట్యాబు, ఫోన్ ఇవ్వకు, అయ్యో వంట చెయ్యలేదా ? నేను వంకాయ కూర పంపుతా అని ఒకళ్ళు, నేను కొబ్బరి పచ్చడి పంపుతా అని ఇంకొకళ్ళు. ఏమన్నా అంటే అపర్ణ ఇలా చేస్తుంది నువ్వు కూడా చెయ్యి అని అత్తగారి గోల. ఈ రాజీవ్ కూడా మా అక్క కూడా ఉద్యోగం చేస్తోంది, అయినా ఇంట్లో వంట చేస్తుంది, నీకేమిటి సమస్య అంటాడు. నాకు మండిపోతోంది. మధ్యలో ఆ పిల్లలు అత్తయ్య, మామయ్య అంటూ. ఆది కూడా వాళ్లతో చేరి చెడిపోతున్నాడు. మా అత్తగారు శ్లోకాలు నేర్పిస్తే అవి నేర్చుకుంటాడుకాని నేను రైమ్స్ నేర్పిస్తుంటే పారిపోతాడు. కాలనీలో అందరూ ఇంగ్లీషులో మాట్లాడితే వీళ్ళు ముగ్గురూ తెలుగు మాట్లాడతారు. రాజీవ్ తో వేరే ఫ్లాట్ కొనుక్కుని వెళదాము అంటే కోపం వచ్చింది. అసలు నేను ఏమి తప్పు అన్నాను అని అంత కోపం ? డబ్బులు ఉన్నాయి, హాయిగా, దూరంగా ఫ్లాట్ కొంటే ఈ గోల వదుల్తుంది అంటే, కోపం తెచ్చుకుని అమెరికా ప్రాజెక్ట్ అప్పటికప్పుడు వేయించుకొని వెళ్ళిపోయాడు." ఆవేశంగా చెప్తున్న కూతురిని చూసి అప్పుడు అర్థమైంది గీతకి. అంత ఖంగారుగా ఎందుకు రమ్మనది అని.. ఇంకా నయం గోపాల్ వచ్చాడు కాదు అనుకుంది. కూతురిని ఆ చెంపా ఈ చెంపా పగలగొటదామన్న కోరికని గట్టిగా ఆపుకుని దీర్ఘంగా గాలి పీల్చి "మధూ! నాకు ఆ బయట భోజనం పడదు. ఉన్నవాటితో ఎదో ఒకటి చేస్తాను. ఈ పూటకి కానిద్దాము. రేపు నువ్వు సెలవ పెట్టు. ఇలాంటి విషయాలు ఆది ముందు మాట్లాడకూడదు. వాడు స్కూల్కి వెళ్ళాక మాట్లాడదాము" అని లేచి వంటింట్లోకి వెళ్ళింది. కడుపులో ఉన్నది తల్లి ముందు కక్కేశాక మాధురికి కూడా కొంచెం తేలికపడ్డట్టు అయింది. సాయంత్రం కాసేపు శాంతి దగ్గరికి వెళ్తే మాధురి కూడా వచ్చి కూర్చుంది. సెలవ కావడంతో అపర్ణ, సంతోష్ కూడా కిందికి వచ్చారు. అపర్ణ పిల్లలు, ఆది చక్కగా ఆడుకుంటూ మధ్య మధ్య వచ్చి నానమ్మ, అత్త పెడుతున్నవి తిని వెళ్తున్నారు. గీత కూడా ఊరినుంచి తెచ్చినవి కొన్ని స్వీట్స్, కారాలు తెచ్చి ప్లేటులో పెట్టింది అందర్నీ తినమని. అపర్ణ అందరికీ టీ పెట్టి ఇచ్చింది. ఏ కళ నుందో మాధురి కూడా అందరికి అన్నీ అందిస్తూ నవ్వుతూ కబుర్లు చెప్పింది. ఎలాగోలా రాజీవ్ ని ఒప్పించి ఇల్లు మారిపోదామని నిర్ణయానికి వచ్చింది. ఉన్న నాలుగు రోజులు అందరితో మంచిగా ఉంటే పోతుంది అని అనుకుంది. మరునాడు పొద్దున్నే ఆదిని స్కూల్కి పంపింది గీత. యధాప్రకారం మాధురి ఆలస్యంగా నిద్ర లేచింది. మాధురి నిద్ర లేచేలోగా తనకిష్టమైన వంట చేసింది. గుత్తివంకాయ కూర, మామిడికాయ పప్పు, సాంబారు, కొబ్బరి పచ్చడి. చిక్కటి పాలు, బాగా జీడిపప్పులు వేసి సేమ్యా పాయసం. దేవుడి దగ్గర మంచి చందనం అగరువత్తి పెట్టింది. డైనింగ్ టేబుల్ మీద వాస్ లో గులాబీలు పెట్టి అందంగా సర్దింది. మాధురి నిద్ర లేస్తూనే"అబ్బా! ఏమిటమ్మా? ఇంత మంచివాసన నాకు ఇష్టమైన అగరువత్తి పెట్టావా!" అంటూ బయటికి వచ్చి. "వావ్ వంటల ఘుమఘుమలు బాగా వస్తున్నాయి. నేను త్వరగా స్నానము చేసి వస్తా. ఇద్దరం భోజనం చేద్దాము." అంటూ బాత్రూమ్లో దూరింది. స్థిమితంగా తలస్నానం చేసి వచ్చింది. "అబ్బా ఆకలి దంచేస్తోంది. పెట్టేయ్యి"కూర్చుని అన్ని వంటలు ఒకటి ఒకటి రుచి చూస్తూ "సూపర్, అదిరింది,"అంటూ రక రకాలుగా చెపుతూ అన్నీ వేసుకొని తిని "అబ్బా! ఎలా అయినా నీ చేతిలో మంత్రం ఉంది అమ్మా!" ఎక్కువ తినేసాను అంటూ వెళ్లి సోఫాలో అడ్డం పడిపోయింది. టేబుల్ అంతా సర్ది గీత కూడ వెళ్లి పక్కనే కూర్చుంది. వెంటనే తల్లి ఒళ్ళో తలా పెట్టుకొని పడుకుంది మాధురి. "కూతురి తల నిమురుతూ"ఆఖరిసారి నీకు ఇష్టమైనవి చెయ్యాలనుకున్నాను చేశాను. నాకు సాయంత్రం విమానానికి టికెట్ బుక్ చెయ్యి. నేను వెళ్తాను"అంది గీత. ఒక్కసారి లేచి కూర్చుంది మాధురి. "అదేమిటమ్మా? రాజీవ్ వచ్చేదాకా ఉండవా? ఇప్పుడు అంత అర్జెంటు ఏముంది. నాన్న కూడా వస్తారన్నవుగా ?" ఆశ్చర్యంగా అంది. "నాన్నని రావద్దని ఫోన్ చేశాను. నేను వెళ్తాను. ఇంకా మేము నీ ఇంటికి రాము. నువ్వు కూడా మా ఇంటికి రాకు, మాకు ఫోన్ చెయ్యకు."గట్టిగా అంది గీత. "ఏమైందమ్మా?"అయోమయంగా చూసింది మాధురి. "ఏమి అవలేదు, కానీ నా మీద నాకే అసహ్యం వేస్తోంది. నిన్ను ఇంత దరిద్రంగా పెంచినందుకు. అందుకే మాకు ఈ శిక్ష నేనే వేస్తున్నాను."కన్నీరు పెట్టుకుంటూ అందిగీత "అమ్మా! అసలు నువ్వు ఏమి మాట్లాడుతున్నావో అర్థం కావడం లేదు" అయోమయంగా అంది మాధురి. "అర్థం కాదు, ఎందుకంటే నీకు నువ్వు తప్ప, ఎవరూ కనిపించరు అమ్మా, నాన్నా, భర్త, కొడుకు, ఎవరి గురించి నీకు అక్కరలేదు." నేను నిన్న రాగానే ఆఫీసుకి వెళ్ళిపోయావు. ఇంట్లో ఏమి లేవు. అమ్మ ఏమి తింటుంది అని లేదు. కనీసం వచ్చాక ఏమి తిన్నావు ? అని కూడా అడగలేదు. మీ అత్తగారు పాపం వంట చేసి పెట్టారు. ఇల్లంతా చెత్తగా వదిలేసావు. ఎవరు సర్దారు అని కూడా అడిగావా? వేరే పని అమ్మాయిని పిలిచి మీ అత్తగారు ఇల్లంతా శుభ్రం చేయించారు. అపర్ణ వాళ్ళ పిల్లలు వస్తే తినడానికి డబ్బాలు పెట్టి వెళ్ళింది. ఆది వచ్చాక తినడానికి ఏమి పెట్టి వెళ్ళావు ? నీకు తల్లి సంగతి పట్టదు, కొడుకు సంగతీ పట్టదు. "ఏమన్నావు? జుట్టు వదిలేయకు, చెప్పులతో వంటింట్లోకి వెళ్ళకు అంటారా? నీ అంత చదువుకోలేదు కదా అలానే అంటారు. ఎందుకంటే జుట్టు విరబోసుకొని తిరిగితే ఆ వెంట్రుకలు గాలికి ఎగిరి వంటల్లో పడతాయి తినేప్పుడు అలా వస్తే నీకు ఎలా ఉంటుందో అందరికి అలానే. బాత్రూమ్లో చెప్పులకి బోలెడన్ని బాక్టీరియా ఉంటాయి. అవి వంటింట్లోకి రాకుండా ఆ చెప్పులు వంట గదిలో వాడద్దు అంటారు, ఎందుకంటే నీ అంత సైన్స్ వాళ్ళకి తెలీదుగా. ఆది స్కూల్ నుంచి రాగానే వాళ్ళ నానమ్మని ఎంత సంతోషంగా పట్టుకున్నాడో. నిన్ను అలా ఎందుకు పట్టుకోడు ? ఎందుకంటే నువ్వు వాడి మాటలు వినవు. స్కూల్ కబుర్లు అడగవు, చెపితే వినవు. నీకు నీ చిన్నతనం గుర్తుందా? నువ్వు స్కూల్ నుంచి రాగానే ఆపకుండా కబుర్లు చెప్పేదానివి నాకు. మళ్ళీ అన్నీ మీ నాన్నకి వినిపించేదానివి." వాడు మీ ఆడపడుచు పిల్లలతో ఆడితే నష్టం ఏమిటి? చిన్నప్పుడు నువ్వు ఒక్కదానివి ఉన్నావని ఎప్పుడూ నిన్ను అందరు కజిన్స్ తో కలిపి ఉంచేదాన్ని నీకు ఒంటరితనం ఉండకూడదు అని. అప్పుడు బానే సంతోషంగా ఉన్నావు నీ కొడుకు మాత్రము ఒంటరిగా పెరగాలి. వాడికి తోడు ఫోన్, లేపోతే ట్యాబు. అంతేనా" రైమ్స్, ఇంగ్లీష్ జీవితం అంతా నేర్చుకుంటాడు. శ్లోకాలుఎప్పుడు నేర్చుకుంటాడు? మీ నానమ్మ, అమ్మమ్మ నేర్పించిన పద్యాలూ నీకు గుర్తులేవా? దానివల్ల చెడిపోయావా? ఆ శ్లోకాలు చదివేటప్పుడు ప్రాణాయామం దానంతట అదే అవుతుంది. నాలిక తిరిగి మాట స్వచ్ఛమవుతుంది. ఒక నిమిషం ఆగింది గీత. పాలిపోయిన మొహంతో వింటోంది మాధురి. "అమ్మా! నువ్వు, నేను చెప్పినవి సరిగ్గా అర్థం చేసుకోలేదు"పీల గొంతుతో అంటున్న మాధురిని "నోర్ముయ్!"అని ఒక్కసారి అరిచింది. "లేక లేక పుట్టావని గారాబం చేసాము. కానీ ఇంత చెడగొట్టాము అనుకోలేదు." "నీకు ఇష్టమైనవి అన్నీ చేస్తే పీకలదాకా మెక్కావు. కానీ రాజీవ్ కి మంచి భోజనం పెట్టకూడదు. వాళ్ళ అమ్మ చేసేవి తినకూడదు. అసలు నీ కొడుకు నువ్వు చేసే ఒక్క వంట అయినా"మా అమ్మ చేసేది నాకు ఇష్టం"అనేది ఉందా" "పిజ్జా, బర్గర్, నూడుల్స్ ఎప్పుడైనా తినడానికి పర్వాలేదు. రోజు అవి తినలేముగా. ఏ చైనావాడైన, ఏ ఇటలీ వాడైనా రోజూ అన్నం తింటాడా?" ఎవరి ఆహరం వారిది." "నేను, నాన్న ఓపికఉన్న వరకు అక్కడ ఉండి తరవాత మీ దగ్గరికి వచ్చేద్దామనుకున్నాము. కానీ ఇప్పుడు నా అభిప్రాయం మార్చుకున్నాను. నీకు నిన్ను చూసుకోడానికే టైం సరిపోదు. మమ్మల్ని ఏమి చూస్తావు? ఓపిక తగ్గితే ఏ వృద్ధాశ్రమానికో వెళ్తాము"అంటుంటూనే గీత కళ్ళలో నీళ్లు నిండాయి." "అమ్మా!"ఏడుస్తూ అంది మాధురి"ప్లీజ్ అలా మాట్లాడకు" అని ముందుకు వచ్చేలోగా ఫోన్ మోగింది. చూస్తే ఆది స్కూల్ నుంచి. వణుకుతున్న గొంతుతో "హలో" అన్న మాధురి అవతల నుంచి చెప్పినది విని "వాట్? ఆక్సిడెంట్.." అంటూ చతికిలపడి, "అమ్మా! ఆది.. ఆది స్కూల్ వాన్ కి ఆక్సిడెంట్ అయిందిట.. అమ్మా! ఆది.. అమ్మా! నా ఆది కి ఏమైందో.."గట్టిగా ఏడుస్తున్న కూతుర్ని చూసి ఖంగారు వచ్చింది గీతకి.



===========================================================

ఇంకా ఉంది...

గీతా మాధుర్యం పెద్ద కథ 3/3 త్వరలో

===========================================================


శ్రీపతి లలిత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:

నా పేరు శ్రీమతి శ్రీపతి లలిత.

నేను ఆంధ్ర్రా బ్యాంకు లో ఆఫీసర్ గా పని చేసి పదవీ విరమణ చేశాను.

నా భర్త గారు శ్రీపతి కృష్ణ మూర్తి గారు కేంద్ర ప్రభుత్వం లో గెజెటెడ్ ఆఫీసర్ గా పని చేసి పదవీ విరమణ చేసారు.

నాకు చిన్నప్పటి నుంచి పుస్తక పఠనం , శాస్త్రీయ సంగీతం , లలిత సంగీతం వినడం ఇష్టం.

అరవై ఏళ్ళ తరవాత జీవితమే మనకోసం మనం బతికే అసలు జీవితం అనుకుంటూ రచనలు మొదలు పెట్టాను.

నా కధలు ఫేస్బుక్ లోని "అచ్చంగా తెలుగు " , "భావుక " గ్రూప్ లో , " గోతెలుగు. కం" లో ప్రచురించబడ్డాయి.

ప్రస్తుత సమాజం లో ఉన్న సమస్యల మీద , ఏదైనా పరిష్కారం సూచిస్తూ కధలు రాయడం ఇష్టం.

నేను వ్రాసిన కధలు ఎవరైనా చదువుతారా !అని మొదలు పెడితే పాఠకులనుంచి మంచి స్పందన, ప్రోత్సాహం , ఇంకాఉత్సాహం ఇస్తుంటే రాస్తున్నాను.

పాఠకుల నుంచి వివిధ పత్రికల నుంచి ప్రోత్సాహం ఇలాగే కొనసాగగలదని ఆశిస్తూ.. మీకందరికీ ధన్యవాదాలుతెలుపుతూ మళ్ళీ మళ్ళీ మీ అందరిని నా రచనల ద్వారా కలుసుకోవాలని నా ఆశ నెరవేరుతుంది అనే నమ్మకం తో ... సెలవు ప్రస్తుతానికి.



62 views0 comments

コメント


bottom of page