top of page

గీతా మాధుర్యం 3


'Githa Maduryam - 3' New Telugu Web Series

Written By Sripathi Lalitha

'గీతా మాధుర్యం - 3' తెలుగు పెద్ద కథ

రచన: శ్రీపతి లలిత

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

గీతా మాధుర్యం పెద్ద కథ 3/3


జరిగిన కథ

గోపాల్ గీతల కూతురు మాధురి.

మాధురి భర్త రాజీవ్. కొడుకు అద్వైత్.

భర్త కంపెనీ పని మీద అమెరికా వెళ్లడంతో తల్లిని సాయానికి రమ్మంటుంది మాధురి.

పక్కనే అత్తగారు, ఆడబడుచు ఉన్నా తన సాయం కోరడంతో ఆశ్చర్యపోతుంది గీత.

అక్కడకు వెళ్లిన గీత, ఇల్లు అపరిశుభ్రంగా ఉండటంతో బాధ పడుతుంది.

కూతురికి బుద్ధి చెబుతుంది.

ఇంతలో ఆది స్కూల్ బస్సు కి యాక్సిడెంట్ అయినట్లు ఫోన్ వస్తుంది.


ఇక గీతా మాధుర్యం పెద్ద కథ చివరి భాగం వినండి..


"అయ్యో ఏమయిందే, ఆక్సిడెంట్ ఏమిటి?" "ఆది వస్తున్న స్కూల్ వాన్ కి ఆక్సిడెంట్ అయిందిట, పిల్లలని ఆసుపత్రి కి తీసుకెళ్లారుట. నాకు ఏమిటో, ఏమి చెయ్యాలో అర్థం కావట్లేదు అమ్మా!" ఏడుస్తున్న కూతుర్ని అయోమయంగా చూసింది గీత. "సంతోష్".. ఒకసారి గట్టిగా అరిచి బయటికి పరిగెత్తి "సంతోష్" అని మళ్ళీ గట్టిగా అరిచింది. ఆ అరుపుకి పైన ఉన్న సంతోష్, కింద ఉన్న శాంతి బయటకి వచ్చారు. "ఆంటీ! ఏమైంది?" పైనుంచే అరిచాడు సంతోష్. "సంతోష్! ఆది వాన్ కి ఆక్సిడెంట్ అయిందిట, మాధురి ఏడుస్తోంది. ముందు నువ్వు దాని తీసుకోని ఆసుపత్రికి వెళ్ళు బాబూ!" గీత మాట వింటూనే సంతోష్ "ఆంటీ.. నేను వస్తున్నాను. మాధురిని బయటికి రమ్మనండి" అంటూ లోపలికి వెళ్ళాడు. శాంతి కూడా గబగబా ఇవతలికి వచ్చి మాధురి దగ్గరికి వెళ్ళింది. "ఊరుకో మధు! ఆదికి ఏమీకాదు. నువ్వు ఖంగారు పడకు. నేను చెప్తున్నా కదా! వాడికి ఏమి కాదు" ఓదార్చింది. "అత్తయ్యా!" అని శాంతిని పట్టుకొని "ఆది.. వాడికి ఏమి కాకూడదు.. మీరు మృత్యుంజయ మంత్రం చదవండి" ఆవిడ చేతులు పట్టుకొని అడిగింది. "చూడు.. నువ్వు సంతోష్ తో వెళ్ళు. ధైర్యంగా వెళ్ళు" అంటూ "సంతోష్! అపర్ణకి ఫోన్ చేసి ఆసుపత్రి కి రమ్మన్నావా?" శాంతి అడిగితే "అపర్ణ బయలుదేరింది అత్తయ్యా! తను అటు వస్తుంది. మీరు ఆంటీ ఖంగారు పడకండి" అంటూనే కారు తీసి "రా మధూ!" అన్నాడు. అప్పటికే డ్రెస్ మార్చుకొని బాగ్ పట్టుకుని ఉన్న మాధురి కార్ ఎక్కింది. ఇంట్లోకి వెళ్లిన శాంతి, గీత చెరోవైపు తోచిన దేవుళ్ళకి ప్రార్థన చేస్తూ కూర్చున్నారు. ఓ గంట తరవాత అపర్ణ ఫోన్ చేసింది, ఆది బానే ఉన్నాడని ఇంటికి తీసుకుని వస్తామని. "హమ్మయ్య" అనుకున్నారు ఇద్దరూ. అదిగో, ఇదిగో, అని దాదాపు సాయంత్రం ఆరు గంటలు అయింది వాళ్ళు ఇంటికి వచ్చేసరికి. అపర్ణ పిల్లలు కూడా ఎదురుచూస్తున్నారు అందరి కోసం. కార్ ఆగగానే ఇంటిల్లిపాది పరిగెత్తారు కార్ దగ్గరికి. ఆది తోటకూర కాడలా వాడిపోయి ఉన్నాడు. అపర్ణ వాడిని భుజాన వేసుకుంది. మాధురి కూడా మొహం అంతా వాడిపోయి నీరసంగా ఉంది. అపర్ణ ఆదిని తీసుకొని మాధురి ఇంట్లోకి వచ్చి వాడిని బెడ్ రూమ్ లో పడుకో పెట్టింది. గీత ముందు టీ పొయ్యి మీద పెట్టి, అంతకు ముందే చేసిపెట్టి ఉంచిన పునుగులు ప్లేట్లల్లో పెట్టి అందరికి అందించింది. అందరూ ఆకలి మీద ఉన్నారేమో మాట్లాడకుండా తిని టీ తాగారు. ఆదికి ఒక్క పాలు, అది కూడా సగం గ్లాస్ ఇమ్మంటే ఇచ్చి వచ్చి కూర్చుంది గీత. "ఏమైందిట సంతోష్.."అన్న గీతకి "పిల్లలని తీసుకువస్తున్న వాన్ కి ఎదురుగ వస్తున్న బస్సు బ్రేక్లు ఫెయిల్ అయ్యి వేగంగా వస్తుంటే, దానిని తప్పించడానికి వాన్ డ్రైవర్, గోడని గుద్దాడు. స్పీడ్ తక్కువగా ఉండడంతో, ఎవరికీ పెద్ద దెబ్బలు తగల్లేదు, కానీ, ఆది ముందు సీట్లో ఉండడంతో కిందపడి తల వెనుక దెబ్బ తగిలి రక్తం వచ్చింది. డ్రైవర్కి చెయ్యి విరిగింది. అతను అలా చెయ్యకపోయి ఉంటే పిల్లల ప్రాణాలు దక్కేవికావు. అందుకే అక్కడికి వచ్చిన తల్లితండ్రులు ఆ డ్రైవర్ వైద్యం ఖర్చు భరిస్తాము అని చెప్పారు." సంతోష్ చెప్తుంటో అందరూ "అమ్మో.. ఎంత గండం గడిచింది" అన్నట్టు విన్నారు. వీళ్ళు ఇలా మాట్లాడుతుంటే ఎప్పుడు వెళ్లిందో అపర్ణ వంట కూడా చేసింది. గీత అప్పుడు గమనించింది.. మాధురి బొమ్మలా కూర్చుంది, ఒక్క మాట కూడా మాట్లాడకుండా. "ఏమిటి ? ఉలుకూ పలుకూ లేకుండా కూర్చున్నావు ?" అంటూ కుదుపుతుంటే "మేము వెళ్లేసరికి ఆది మొహం అంతా రక్తంతో భయమేసేటట్టు ఉన్నాడు. తనకి షాక్ గా ఉంది. భోజనం చేసాక ఒక నిద్రమాత్ర వేస్తే మంచిది అని డాక్టర్ చెప్పారు. కానీ రాత్రి అంత ఆదిని గమనించాలి. వాంతులు అవడం కానీ తలనొప్పి వచ్చినా, కొంచెం ఫిట్స్ లా వచ్చినా వెంటనే తీసుకు రమ్మన్నారు. ఇప్పటికి ఏమి సమస్య లేదు కానీ ఒకోసారి అలా అవచ్చు, అందుకే రాత్రి మేలుకొని చూడాలి" అన్నాడు సంతోష్. "కొంచెం, కొంచెంగా పాలు కానీ, నీళ్లు కానీ పట్టచ్చు. అన్నము వద్దు, అని చెప్పారు డాక్టర్. నేను చూస్తాను. ఖంగారు లేదు" అంది అపర్ణ. "వద్దమ్మా! నువ్వు పగలు అంతా ఆసుపత్రిలో అలసి పోయావు. నేను చూస్తాలే" అంది గీత. "అవును అమ్మా! నువ్వు రెస్ట్ తీసుకో. నేను అత్తయ్యకి తోడు ఉంటాలే" అంది శాంతి. "అవును మేమిద్దరం చూస్తాము మీరు రెస్ట్ తీసుకోండి." అందరూ తిన్నాక అపర్ణ వాళ్ళు ఇంటికి వెళ్లారు. మాధు "ఆది పక్కనే పడుకుంటాను"అంది. వియ్యపరాళ్లు ఇద్దరు కాసేపు టీవీ, తరవాత కబుర్లు చెప్పుకుంటూ ప్రతి అరగంటకి ఆదిని చూస్తున్నారు. అలసట ప్రభావమో మందుల వలనో ఆది చక్కగా నిద్ర పోయాడు. మాధురి మాత్రం కలత నిద్రే. గీత, శాంతి ఇద్దరు చెప్తూనే ఉన్నారు "కళ్ళు మూసుకొని పడుకో" అని. తెల్లారుజామున మాత్రం వీళ్ళకి నిద్ర ఆపుకోవడం అవలేదు. చెరో సోఫాలో పడుకుండిపోయారు. "నానమ్మా! అమ్మమ్మా నిద్ర లేవండి"అంటూ ఆది వచ్చి లేపితే ఉలిక్కిపడి ఇద్దరు ఒకేసారి “ఎలా ఉన్నావు నాన్నా!" అని అడిగారు. "నేను ఫైన్. మమ్మీ కాఫీ చేస్తోంది, లేవండి" అన్నాడు. మాధురి లేచి పాలు కాచి కాఫీకి తయారు చేస్తోంది. వీళ్ళు కాఫీ తాగుతూ ఉంటే సంతోష్ వచ్చాడు. "మనము ఆదిని తీసుకుని వెళ్ళాలి. నువ్వు తయారేనా" అని మాధురిని అడిగితే “నేను రెడీ అన్నయ్యా! ఆది కూడా పాలు తాగాడు." అంది. అపర్ణ కూడా ఆ రోజు సెలవ పెట్టింది. పిల్లలు స్కూల్కి వెళ్లారు. వంట కూడా తానే చేసింది. మాధురి, సంతోష్ ఆదిని తీసుకోని వచ్చారు. "చక్కగా ఉన్నాడు ఆది. ఏమి సమస్య లేదు. కొంచెం భయపడ్డాడు. రెండు రోజులు ఇంట్లో ఉంచి స్కూల్కి కూడా పంపమన్నారు." వెలుగుతున్న మొహంతో చెప్పింది మాధురి. "అన్నయ్యా! వదినా! మీకు నేను ఎంత ధన్యవాదాలు చెప్పినా తక్కువే. చాలా చాలా థాంక్స్" అన్న మాధురితో "మనలో మనకి థాంక్స్ ఏమిటి మాధురి. ఆది ఎవరు? నా తమ్ముడి కొడుకు. రేపు శాన్వి కి, సంజూ కి ఏదన్నా అవసరం అయితే నువ్బు చెయ్యవా?"అంది అపర్ణ. "చేస్తాను వదినా! కానీ దేవుడి దయ వల్ల ఇలాంటి అవసరాలు వద్దు. నాకు అసలు మైండ్ అంతా బ్లాంక్ అయింది నిన్న. అంత అన్నయ్యే చూసుకున్నారు. నా అదృష్టం ఆ టైములో ఆయన ఇంట్లో ఉండడం." మనస్ఫూర్తిగా అన్న మాధురిని చూసి నవ్వి "ఇంక భోజనాలు చేద్దాము. థాంక్స్ తో కడుపు నిండదు." అన్న సంతోష్ "రాజీవ్ కి చెప్పావా ?" అడిగాడు. "పొద్దున్న చెప్పాను, ఆది మాట్లాడాక తాను కూడా ధైర్యంగా ఉన్నాడు. వచ్చే వారం వస్తాడు” అంది. ఆది మాములుగా అయ్యి స్కూల్కి వెళ్తున్నాడు. ఈ వారం అంతా వర్క్ ఫ్రొం హోమ్ తీసుకొంది మాధురి. వచ్చే వారం రాజీవ్ వచ్చాక గీతని వెళ్ళమంది. గోపాల్ కూడా ఒకటి రెండు రోజుల్లో వచ్చి గీత తో కలిసి తిరిగి వెళ్తానన్నాడు. ఆరోజు ఆది స్కూల్ కి వెళ్ళాక మాధురి తల్లి దగ్గరికి వచ్చి కూర్చుంది. ఏదో చెప్పడానికి సంకోచిస్తున్న మాధురి భుజం మీద చెయ్యి వేసి "చెప్పు మధూ!"అంది గీత. తల్లి వంక చూసి "సారీ అమ్మ! నేను దారి తప్పాను. నువ్వు సరిచేసే సమయానికి సరిగ్గా దేవుడు నాకు కుటుంబం విలువ చెప్పాడు. నిన్న వదిన అన్నయ్య లేకపోతే నేను ఒక్కదాన్ని ఏమి చేసేదాన్నో నాకే తెలీదు. ఇంట్లో నువ్వు, మా అత్తగారు రాత్రంతా వాడిని చూసుకున్నారు. అలానే నేను నా కుటుంబాన్ని చూసుకోవాలి. అందులో నేను, రాజీవ్, ఆది మాత్రమే కాదు మా అత్తగారు, వదిన కుటుంబం, మీరు అంతా ఉండాలి. నాకు ఎటునుంచి మొదలు పెట్టాలో తెలియటంలేదు. ఒకరకంగా నువ్వు నా చేత ఏ పని చేయించలేదు, కాదు.. కాదు నాన్న నన్ను ఏ పనీ చేయనిచ్చేవారుకాదు. అందుకే వంట, ఇంటి పని అంటే అలుసు నాకు. కానీ ఇప్పుడు ఎలా నేర్చుకోవాలి తెలీటంలేదు." బాధగా అంది మాధురి. కూతురి చెయ్యి చేతిలోకి తీసుకొని అడిగింది. "నీకు ఆఫీసులో చాలా పని ఉంది. కానీ మీ దగ్గర ఆ పని తెలిసిన వాళ్ళు లేరు ఏమి చేస్తావు ?" "అవుట్ సోర్సింగ్.. అది చెయ్యగల వేరే కంపెనీకి ఇస్తాము" అంది మాధురి. "అదే నువ్వు చెయ్యి. నిన్న ఏమన్నావు ? నాకు, రాజీవ్కి బోలెడు జీతం అన్నావు కదా? అన్నీ చేసే అమ్మాయిని పెట్టుకో. జీతం ఎక్కువ ఇవ్వు. అన్ని పనులు చేయించుకో నెమ్మదిగా కొన్ని వంటలు నేర్చుకొని సెలవ రోజు చెయ్యి". అని గీత చెపితే "కరెక్ట్. అలానే చేస్తాను, గీతా! నీ బోధ కి ధన్యవాదాలు."అంది తలవంచుతూ మాధురి. నవ్వుతూ కూతురి తలమీద మొట్టికాయ వేసింది గీత. వారం తరవాత రాజీవ్ వచ్చాక అందరినీ భోజనానికి పిలిచింది మాధురి. "పిలిచి భోజనం పెడతానంటే వద్దంటామా?" అంటూ వచ్చారు అపర్ణ వాళ్ళు. "అత్తా నాకు ఐస్ క్రీం," అడిగాడు సంజయ్. "నాకు నూడుల్స్"అంది శాన్వి. "నాకు రెండూ" అన్నాడు ఆది. "ముందు అన్నం, తరవాత ఐస్ క్రీం, సాయంత్రం నూడుల్స్ ఓకే?" మాధురి అంటే "ఓకే" అరిచారు పిల్లలు. పని అమ్మాయి సాయంతో కొన్ని వంటలు మాధురి చేస్తే శాంతి, గీత, అపర్ణ ఒకో ఐటెం చేసి తెచ్చారు. అందరూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ తిని, తరవాత మాధురి, అపర్ణ సర్దుతూ ఉంటే, గోపాల్, సంతోష్, రాజీవ్ కబుర్లు చెపుతుంటే, పిల్లలు అటుఇటు పరిగెడుతూ ఆడుతుంటే, పెళ్లి ఇల్లులా అనిపించింది. "థాంక్స్ గీతా! మా మాధుర్యాన్ని మాకు ఇచ్చినందుకు" అంది శాంతి సంతోషంగా. "అవును, అదే నా మనసుకు శాంతి" నవ్వింది గీత. గీతకి తెలుసు ఆరోజు మాధురిని కోప్పడుతున్నప్పుడు శాంతి లోపలికి రాబోయి ఆగింది, తను అన్నవి కొంత విన్నది అని. సమాప్తం

శ్రీపతి లలిత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:

నా పేరు శ్రీమతి శ్రీపతి లలిత.

నేను ఆంధ్రా బ్యాంకు లో ఆఫీసర్ గా పని చేసి పదవీ విరమణ చేశాను.

నా భర్త గారు శ్రీపతి కృష్ణ మూర్తి గారు కేంద్ర ప్రభుత్వం లో గెజెటెడ్ ఆఫీసర్ గా పని చేసి పదవీ విరమణ చేసారు.

నాకు చిన్నప్పటి నుంచి పుస్తక పఠనం , శాస్త్రీయ సంగీతం , లలిత సంగీతం వినడం ఇష్టం.

అరవై ఏళ్ళ తరవాత జీవితమే మనకోసం మనం బతికే అసలు జీవితం అనుకుంటూ రచనలు మొదలు పెట్టాను.

నా కధలు ఫేస్బుక్ లోని "అచ్చంగా తెలుగు " , "భావుక " గ్రూప్ లో , " గోతెలుగు. కం" లో ప్రచురించబడ్డాయి.

ప్రస్తుత సమాజం లో ఉన్న సమస్యల మీద , ఏదైనా పరిష్కారం సూచిస్తూ కధలు రాయడం ఇష్టం.

నేను వ్రాసిన కధలు ఎవరైనా చదువుతారా !అని మొదలు పెడితే పాఠకులనుంచి మంచి స్పందన, ప్రోత్సాహం , ఇంకాఉత్సాహం ఇస్తుంటే రాస్తున్నాను.

పాఠకుల నుంచి వివిధ పత్రికల నుంచి ప్రోత్సాహం ఇలాగే కొనసాగగలదని ఆశిస్తూ.. మీకందరికీ ధన్యవాదాలుతెలుపుతూ మళ్ళీ మళ్ళీ మీ అందరిని నా రచనల ద్వారా కలుసుకోవాలని నా ఆశ నెరవేరుతుంది అనే నమ్మకం తో ... సెలవు ప్రస్తుతానికి.





69 views0 comments
bottom of page