top of page

ఇచ్చినమ్మా వాయనం

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.

Youtube Video link

'Ichhinamma Vayanam' New Telugu Story“ఏమిటో మా వైపు నలుగురు, మీ వైపు ఆరుగురు అన్నదమ్ములు వున్నా, ఒక్కపూట ఆదరించి భోజనం పెట్టే వాళ్ళు లేరు. మా తమ్ముడు వాళ్ళు పిలిచినా, వాళ్ల వంటలు బాగుండవని రారు, మీ వాళ్ళు పిలవరు. రోజూ ఏమి వండాలి అని అడగటం, మీ కిష్టమైంది వండటం... విసుగెత్తిపోతోంది ఈజీవితం” అంటూ గొణుక్కుంటున్నట్లు కొద్దిగా పెద్దగానే అంటోంది సుకుమార్ భార్య సీత.

“చూడు! ఎవ్వరి పనిలో వాళ్ళు వుంటారు. పూర్వం లాగా ఆప్యాయతలు లేవు. తమ గొప్ప చూపించుకోవడానికి పెళ్లిళ్ళకి పిలుస్తున్నారు, అనవసరంగా బాధపడక, ఆ దరిద్రపు గోరుచిక్కుడు కాయలు వండక, ఈ రోజు బంగాళాదుంప ఉల్లికారం, చల్లపులుసు వండు. నేను స్నానం చేసి వచ్చి, పప్పులోకి నాలుగు చల్లమిరపకాయలు వేయించుకుంటానులే” అన్నాడు సుకుమార్.

మొగుడు వంక అదో రకంగా చూసి, “ఈ గోరుచిక్కుడు కాయలు ఎవరు తెమ్మన్నారు, మీకు యిష్టం లేకపోతే.. తెచ్చి పడేస్తే గోళ్లు ఊడేడట్లు వలవడం, నేనే తినడం! మీకు మాత్రం రుచులు కావాలి అరవై దాటినా” అంది సీత.

“వంటింటి మహారాణివి, నీకు కావలిసినవి వండుకుంటే నేను కాదన్నానా” అన్నాడు నవ్వుతూ సుకుమార్.


“మీకేం.. ఎంతసేపైనా మాట్లడుతూ కూర్చుంటారు. వండలేక నేను చావాలి. ముందు ఆ బుట్టలోనుంచి నాలుగు పెద్ద బంగాళాదుంపలు అందివ్వండి, లేవలేను నడుము లాగేస్తోంది”అంది సీత.

“యింకా నయం! నడుము నొప్పి రాత్రి నుంచి అనలేదు, ఎవరైనా వింటే నన్ను హేళన చేసేవాళ్ళు” అన్నాడు చిలిపిగా నవ్వుతూ.

మొత్తానికి చిన్న చిన్న గొడవలతో భోజనం కానిచ్చి, మేడమీద గదిలో కాసేపు విశ్రాంతి కోసం వెళ్తూ, పాపం పలకరించే వాళ్ళు లేకపోవడం తో తనకి బోర్ కొడుతున్నట్టు వుంది అనుకున్నాడు సుకుమార్.

మంచం మీద పడుకుని లోకల్ గా వున్న నలుగురు తమ్ముళ్ళకి ఫోన్ చేసి ‘రాబోయే శని, ఆదివారలలో మా యింటికి రండి. టిఫిన్ నుంచి లంచ్,, డిన్నర్, పడకల వరకు మా ఇంట్లోనే, తప్పకుండా రండి’ అని పిలిచాడు.

వాళ్ళు కూడా సరే అన్న తరువాత కాసేపు పడుకుని లేచి, కాఫీ తాగి వాకింగ్ వెళ్ళిపోయాడు. దీనితో తన భార్య సీత కి శని, ఆదివారం కార్యక్రమం గురించి చెప్పడం మర్చిపోయాడు.

మాములుగా తెల్లారింది. కుర్చీలో కూర్చొని పేపర్ చదువుతున్న సుకుమార్ కి కాఫీ గ్లాస్ అందించి, తానుకూడా ఒక కుర్చీలో కూర్చుని, “మధ్య పేపర్ యిటు ఇవ్వండి. నేను కూడా చూస్తాను” అంది సీత.

“మొత్తం పేపర్ నువ్వే తీసుకో, వాడి మీద వీడు, వీడు మీద వాడు తిట్టు కోవడం తప్ప ఏమీలేదు. వచ్చే నెల నుంచి పేపర్ తెప్పించడం మానేస్తాను, మనశాంతి గా వుంటుంది” అన్నాడు పేపర్ భార్య కి అందిస్తూ.

అప్పుడు గుర్తుకు వచ్చింది సుకుమార్ కి, భార్య కి శని, ఆదివారం లో జరిగే విందు ప్రోగ్రాం గురించి చెప్పలేదు అని.

“అది సరే.. నీకు బోర్ కొడుతోంది అన్నావుగా, దానికి విరుగుడు గా రేపు శనివారం, ఆదివారం రెండు రోజులు మా తమ్ముళ్ళని ఫ్యామిలీ తో మన ఇంటికి రమ్మన్నా. భోజనం టిఫిన్ లు, పిల్లల ఆటలతో నీకు బలే టైం పాస్ అవుతుంది, నీలో కొత్త ఉత్యాహం పుట్టుకు వస్తుంది” అన్నాడు భార్య తో.

“ఏమిటీ, యింత పెద్ద పోగ్రామ్ పెట్టటానికి ముందు నన్ను అడగాలని అనిపించలేదా? మనల్ని ఎవ్వరూ పిలవడం లేదంటే, మీరు వాళ్ళందరినీ పిలుస్తారా? మీరు మరీ శాడిస్ట్ గా మారిపోయారు. అసలే నడుము నొప్పి, కాళ్ళ నొప్పులతో చస్తోవుంటే యిప్పుడు యింత హడావిడి అవసరమా” అంటూ ఆగకుండా మాట్లాడేస్తున్న సీత తో,

“అదికాదే, మనం ఎవరినైనా పిలిస్తే కదా వాళ్ళు పిలిచేది. అందుకే ముందు పెద్దవాడిగా నేను పిలిచాను” అన్నాడు సుకుమార్.


“ఆ, బాగానే వుంది మీ పెద్దరికం. మనం అయితే యిద్దరితో సరిపోతుంది. వాళ్ళందరూ అయితే పదిమంది అవుతారు” అంది.

“పనికోసం నువ్వు కంగారు పడకు, వంట మనిషి ని మాట్లాడేసా. అన్నీ ఆవిడే చూసుకుంటుంది. నీ పని వచ్చిన వాళ్ళతో హాయిగా గడుపు. అంతే!” అన్నాడు.

“నా జీవితానికి హాయి కూడాను. చేసిందంతా చేసి, నెపం నా మీదకి తోయటం మీకు బాగా అలవాటు అయ్యింది. సంక్రాంతి కి అబ్బాయి దగ్గరికి వెళ్ళి వుంటాను. చూద్దాం మీ తమ్ముళ్లు ఏమాత్రం పిలుస్తారో మిమ్మల్ని” అంది.

“అబ్బబబ్బా, వెధవ గొడవ, ఏమైంది నీకు? నువ్వే గా ఎవ్వరు ఫోన్ చేసినా ఒక రెండు రోజులు వచ్చి వెళ్లొచ్చు గా అనేదానివి.. నేను పిలిచాను అనగానే గొడవ. యింతకీ నాకు కాఫీ యిచ్చావా?” అన్నాడు సుకుమార్.

“యిప్పుడే గా గ్లాస్ నిండా కాఫీ మీకు యిచ్చి, నేను కొద్దిగా తాగుతున్నాను” అంది.

“సరే! వాళ్ళు వున్న రెండు రోజులు ఏమేమి వండించాలో కూడా ఒకసారి అనుకుంటే లిస్ట్ రాసిస్తా. బజారు వెళ్ళి తీసుకొని రండి. ఏమిటో లిస్ట్ రాయడమే గాని ఎప్పుడూ యింట్లో మర్చిపోయి వెళ్లడం, అక్కడ నుంచి ఫోన్ చేసి అరవడం” అంటూ లేచి వెళ్లి కాగితం, పెన్ను తీసుకొని వచ్చి, “చదివింది చాలు గాని, ఆ పేపర్ పక్కన పెట్టి, శనివారం టిఫిన్ ఏమిటి చెప్పండి ముందు” అంది సీత.

“సరే రాసుకో, శనివారం ఉదయం గారెలు చేయిద్దాం” అన్నాడు.

“అయ్యో రాత, శుభమా అని ఫంక్షన్ పెట్టుకుని, గారెలు తో మొదలుపెట్టకూడదు. పూరి, ఇడ్లీ సాంబార్ చేద్దాం” అంది.

“సరే అలాగే కానీ” అంటూ రెండు రోజుల లిస్ట్ తయారు చేసారు.

శనివారం ఉదయం 8 గంటలకల్ల నలుగురు తమ్ముళ్లు, వాళ్ల భార్యలు వచ్చేసారు.

వాళ్ళని చూడగానే సీత చాటంత మొహం చేసుకుని ఎదురు వెళ్లి, “ఎన్నాళ్ళకి కలిసాము, ఈ పాడు కరోనా బయటకు రాకుండా చేయడం తో, ఆ ఇంటి మీద కాకి ఈ యింటిమీదకి రాకుండా చేసింది” అని వాళ్ల చేయి పట్టుకొని ఆప్యాయత గా లోపలికి తీసుకొని వస్తోవుంటే,భార్య ని చూసి ‘ఆహా! వీళ్ళ నటన ముందు అలనాటి సావిత్రి కూడా పనికి రాదు., విడిగా ఒకరంటే ఒకరికి పడదు, కలిసినప్పుడు ప్రాణం యిచ్చుకునే లాగా వుంటారు’ అనుకున్నాడు సుకుమార్ ముక్కున వేలు వేసుకుని.

సుకుమార్ పెద్ద తమ్ముడు మూర్తి, అన్నగారు ముక్కున వేలు ఎందుకు వేసుకున్నాడో తెలియక, బహుశా రమ్మనగానే అందరూ వచ్చేసామని అనుకుంటున్నాడా అని, “ఏమైంది ముక్కున వేలు వేసుకున్నావు” అని అడిగాడు.

కంగారుగా వేలు తీసివేసి, “ఏమీలేదు. ఏదో కుట్టింది” అన్నాడు సుకుమార్.

మొత్తానికి రెండు రోజులు ఆడుతూ పాడుతూ జరిగిపోయింది. వెళ్ళేడప్పుడు ఆడవాళ్లందరు ఒకళ్ళని ఒకళ్ళు కౌగిలించుకొని, కళ్ళనీళ్లతో వీడుకోలు చెప్పుకున్నారు.

లోపలికి వచ్చిన తరువాత, సీత సోఫాలో కూర్చొని, “పోనీలెండి! పిలిస్తే పిలిచారు గాని, సంతోషం గా గడిపాము” అంది.


“గడపక ఏమిచేస్తారు, అందరు యిక్కడే వున్నారుగా, ఎవరిమీద చాడీలు చెప్పుకుంటారు?” అన్నాడు సుకుమార్.

“ఛీ, మీకు ఏ మాత్రం జాలిలేదు. నడుము ఊడేడట్లు మాట దక్కిస్తే చివరికి యిదా మీరు అనేది” అంది.

“నడుము నీది వూడితే, వంటమనిషి, నా డబ్బు ఎందుకు ఊడగొట్టింది” అన్నాడు నవ్వుతూ సుకుమార్.

“మీ ఎదురుగా కూర్చోవడం నాది తప్పు” అంటూ వంట గదిలోకి వెళ్ళిపోయింది సీత.

ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి, సీత చాలా బాగా కష్టపడి మాట దక్కించింది. వెళ్ళేడప్పుడు మా చిన్న తమ్ముడు అన్నాడు, “వదిన నీ మాట వింటుంది కాబట్టి యింత బాగా చేసావు. మా యింట్లో విని చావరు” అన్నాడు.

“వింటారు లేరా! మనం ముందుకు దూకితే వాళ్ళు కూడా సహకరిస్తారు. మన అమ్మ కోడళ్ళు అందరూ మంచివాళ్ళే” అని అన్నాను ముందు మాటగా ఎందుకైనా మంచిది అని.

మొత్తానికి వున్నది ఏదో తిని మంచం మీద వాలాడు. సీత కూడా యిల్లు, వంట యిల్లు సద్దుకుని మంచం మీద కూర్చొని, “యిదిగో యిప్పుడే చెపుతున్నాను, మీ తమ్ముళ్లలో ఎవరైనా రేపు శనివారం భోజనానికి రమ్మని పిలిస్తే, ఈ శనివారం వద్దు, వచ్చే శనివారం పెట్టుకోమనండి. వెంటనే అయితే ఓపిక లేదు రావడానికి” అంది.

కప్పుకున్న దుప్పటి లోనుంచి బయటకు తలపెట్టి, “బాగానే వుంది నీ వరస. ‘యిచ్చెనమ్మా వాయనం, పుచ్చుకున్నాను అమ్మ వాయనం’ అన్నట్టుగా మనం పిలిచిన రెండో రోజుకే వాళ్ళు వెంటనే భోజనానికి పిలుస్తారు అని ఎలా అనుకుంటున్నావు? ఒక వేళా వాళ్ళు పిలవకపోతే నేను నా తమ్ముడు వాళ్ల ఇంటికి వెళ్తే రానివ్వడా? ఏమిటో మీ ఆడవాళ్ళ గొడవ అర్ధం కాదు” అన్నాడు సుకుమార్.

“మీలాగా మేము పిలవకపోయినా వెళ్లలేము మొహం వాచినట్టు! మా ఆడవాళ్ళకి కొన్ని పట్టింపులు వుంటాయి” అంది సీత.

“అయితే పిలిచే వరకు ఆగు, వాళ్ళు మన యింటికి వచ్చి వెళ్లి ఆరుగంటలు కాలేదు, అప్పుడే వాళ్ళు ఎప్పుడు పిలుస్తారని నన్ను అడిగి చంపకు. ఈ రోజు బాగా గడిచింది అని హాయిగా పడుకో” అన్నాడు ముసుగు పైకి లాక్కుంటూ సుకుమార్.

“నా బొంద హాయి గా పడుకోవడం, పెళ్లి అయిన మొదటి రోజే మీ గుర్రు తో నా హాయి కాస్తా ఎగిరిపోయింది” అంటూ దిండు తీసుకుని పక్క గదిలోకి వెళ్ళిపోయింది సీత.

శుభం


జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసంమనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.రచయిత పరిచయం:

నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.76 views0 comments

Comments


bottom of page