top of page

ఇంతే సంగతులు


'Inthe Sangathulu' - New Telugu Story Written By Surekha Puli

Published On 06/12/2023

'ఇంతే సంగతులు' తెలుగు కథ

రచన: సురేఖ పులి

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



మిస్టర్..


మీ ఉత్తరం అందింది.


మీరు కోరిన విధంగా నేను “సరే, ఓకే” అని సమాధానం యివ్వక, ఇదిగో నాకు తోచిన రీత్యా రాస్తున్నాను. ఇవి మామూలు మాటలు కావు, నా మనసున రగిలే మంట తాలూకు నిప్పు రవ్వలు!


మీ భార్యామణి పైన అనుమానం కల్గి, ఆమెకు విడాకులు ఇవ్వదల్చి, నా కాళ్ళ బేరానికి వస్తున్నారా?!


అయ్యో, మీ ఖర్మ ఎంత కాలింది. అంత ఇష్ట, కష్ట పడి, ఏరి కోరి చేసుకున్న మహిళ మంచిది కాదని, మూడేళ్ళ కాపురం చేసి, బిడ్డ తండ్రి అయ్యాక.. నేను, నా తోడు కావాల్సి వచ్చిందా?


అబ్బా! నేను మీ జాలి, సానుభూతి భరించలేను. నా హృదయంలో, నా జీవితంలో అలాటి పెద్ద మాటలకు చోటు లేదు.


మీరు ఒక్కప్పుడూ అవకాశవాదే, ఇప్పుడూ అంతే. మీలో మార్పు లేదు. కానీ నేను మారాను. మిమ్మల్ని నమ్మడానికి అప్పటి అమాయకత లేదు నాలో.


“పాతవన్నీ మర్చిపోయి, నన్ను క్షమించి నా దానివిగా, నా పాపకు తల్లిగా, నా జీవనజ్యోతిగా.. ”


యింకా ఏదేదో కష్టపడి డైలాగ్స్ రాశారు. మీరు పాత సంఘటలన్నీ మర్చిపోయారు కనుకనే మళ్ళీ మీ జీవతంలోకి నన్ను ఆహ్వానించే ధైర్యం చేశారు.


కొన్ని సంఘటనలు మాత్రమే గుర్తు చేస్తున్నాను. అప్పుడు చెప్పండి ….


మీకు డబ్బు, అందం దేవుడు మర్చి పోయి యిచ్చాడు. మీరు వాటిని మరింత దుర్వినియోగ పర్చారు. మీ అమ్మగారు స్వర్గస్తులయినందుకు మామూలుగా వుండే మన స్నేహంలో ఆత్మీయత చూపెదాన్ని, ఎందుకని? నాకు తల్లి లేదు కనుక.


మీరు చెప్పే మాయ మాటలను, మీ కొంటెదనమనుకునే దాన్ని. మీరు చూపే నటననే నిజమైన ‘ప్రేమ’ అనే భ్రమలో పడ్డాను. మీకు హోటల్ భోజనం పడదని, ప్రతీ దినమూ మీ కోసం కారేజ్ తెచ్చేదాన్ని, మీ ఆరోగ్యం బాగుండాలని.


చుట్టూ పక్కల వాళ్ళందరూ నన్ను అనుమానిస్తూన్నారని, నేనికి మీ యింటికి రానని మొండి కేస్తే; నన్ను దుర్గమ్మ దేవాలయానికి తీసుకెళ్ళి, పూజారి ఇచ్చిన పూలదండను నా మెళ్ళో వేసి ఏమన్నారో గుర్తుందా?


నిజంగా మీ మాటలు నమ్మి, మీకు ఉద్యోగం వచ్చే వరకే కాదు, నా చివరి శ్వాస వరకు మీకోసం వేచి వుంటానని వెర్రిదానిలా మాట్లాడాను. ఇంటికి వెళ్ళాక, సంతోషం పట్టలేక వంట అంతా మాడ్చాను.


ఒకసారి మీ ఫ్రెండ్స్ అందరినీ మీ ఇంట్లో పరిచయం చేస్తే బుద్దిగా అందరికీ నమస్కారం పెట్టాను. మీ ఇల్లాలి వలె నిండా పయిట కప్పుకొని, తల వంచుకుని అందరికీ కాఫీ, టిఫిన్లు అందిస్తే; మీరు నవ్విన నవ్వులు ఎగతాళి సంకేతాలని అప్పట్లో నా చిన్ని జీవితానుభవం గుర్తించ లేక పోయింది.


నేను చేసిన మరో పిచ్చి పని!


నా పుట్టిన రోజు నాడు మీరు తెచ్చిన చీర కట్టుకొని, మీ కాళ్ళకు మొక్కాను. ఆ క్షణంలో మిమ్మలిని నా దేవుడిగా వూహించు కున్నాను. అదే నేను చేసిన తప్పు. మీకు అవసరానికి మించి అధికారం వచ్చిందనుకున్నారు. అందుకే ఇంటి వాళ్ళ ముందు నన్ను అవమానించారు. నాలో నేనే బాధ పడి ‘సారి’ అడిగాను. అలా కాకుండా నేనూ మీ వలె మీపై కేకలేసి వుంటే......


అలా చేయలేనని, మీరంటే దేవుడు, దయ్యం అని నమ్ముతానని తెలిసి మీరు చొరవ తీసుకో గలిగారు.


ఆ నాడే నాకు పార్టీ యిస్తానని నాన్నగారికి ఏదో గుడ్డి సాకులు చెప్పి నమ్మించి నన్ను తీసుకెళ్లారు. నేను మీతో హాయిగా కాలం గడుపుతాననే సంబరం మిగిలింది. కానీ మీ మాటల గారడీలో పడి, నన్ను ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించే నాన్నకు అబద్దం చెప్పి మోసం చేస్తున్నాననే ధ్యాస రాలేదు.


మీరు ప్లాన్ చేసిన సినిమా కాకుండా పౌరాణిక సినిమాకు వెళదామంటే మీరు విరగబడి నవ్వారు. మీ నవ్వు అంటే ఇష్టమని చూస్తూ వున్నానే కానీ మీరు ఎన్నిక చేసిన సినిమా ‘ఎ’ సర్టిఫికేట్కు చెందినదని నాకు తెలియదు.


స్కూటర్ పైన మీ వెనుక సీట్లో కూర్చున్నాక మీ బుజం పట్టుకోమన్నారు. నాకు సిగ్గు, నేను వేయనన్నాను. కానీ మీరు సడన్గా బ్రేక్స్ వేసి, మీ కోర్కెను పూర్తి చేసుకున్నారు. మీ మాటే గెలవాలని మీ పంతం.


స్కూటర్ ఆక్సిడెంట్ అయితే ఎలా అని భయపెట్టారు. కానీ మనిద్దరమూ కల్సి జీవించడమే కాదు, మీతో కల్సి చావు కూడా సమ్మతమే అనే సరికి వ్యంగ్యంగా వెకిలించారు. నాకు మీ వ్యంగ్యం బోధపడలేదు.


మీ సన్నిహిత స్నేహితుడు ఫణిందర్ ఇంటికి తీసుకెళ్లారు. నేను మీరున్నారనే ధైర్యంతోనే అయిష్టంగానే వచ్చాను.


కానీ ఏం జరిగింది? నా కొంగు పట్టుకు లాగే సరికి, వురుములా అరిచాను. నా నోరు మూసి, మీ కోరికను వెల్లడించారు.


గబాల్న బయట పడ్డాను. అంతే ఆ తర్వాత మీరు ఎన్ని మార్లు కబురు పెట్టినా నేను రాలేదు. మీరంటే అప్పట్లో ప్రేమ వున్నా, పెళ్లి కానిదే ఒంటరిగా కలుసుకోవాలని లేదు. ఆ మాటే మీతో అంటే నా ముందే యితర అమ్మాయిలతో చనువుగా వుండేవారు. నా ఆత్మవిశ్వాసం వలన నాలో అనుమానం మొలకెత్తలేదు.


నేనెవరో బాయ్ ఫ్రెండ్ తో వున్నానని ఎంత చెప్పినా వినక నా చెంప చెళ్లుమనిపించారు. నాన్నగారు ఇంట్లో లేరు కాబట్టి సరిపోయింది, లేకుంటే మిమ్మల్ని బయటకు గెంటేసే వారు. అల్లారు ముద్దుగా పెరిగిన నాకు దెబ్బ పడినందుకు, మీలో మూర్ఖత్వమే కాక పశుత్వం కూడా వుందని కుమిలిపోయాను.


మీకు ఢిల్లీ లో ఉద్యోగం వచ్చినట్లు నాతో చెప్పలేదు, ఫణిందర్ ద్వార తెల్సింది. అయినా మీ ఇంటికి వచ్చి, ఉద్యోగం వచ్చింది కదా, మరి పెళ్లి ఎప్పుడు చేసుకుందామని అడిగితే, మనిద్దరి మధ్యా ఏమీ జరుగ లేదు, పెళ్లి ఎందుకు, స్నేహితుల్లా వున్నాము అలాగే వుందాము లేదా విడి పోదాము అన్నారు.


ఈ జగత్తులో ప్రేమించుకున్న వారంతా శారీరకంగా కలిస్తేనే పెళ్లి చేసుకోడానికి అర్హులా?


అట్లాటప్పుడు వారిలో ప్రేమ లేదు. ప్రేమ లేని చోట పెళ్లి చేసుకొని ఒకటిగా బ్రతకటం దుర్లభం! మీకు ఫరవాలేదు. కానీ నాకు ఫరవావుంది.


ఒకప్పుడు మీకు-నాకు మధ్య ఏమీ జరుగలేదు కనుక పెళ్లి వద్దన్నారు. ఇప్పుడూ ఏమి జరిగిందని మీతో పెళ్లికి నేను ఒప్పు కోవాలి??


మీ భార్య ప్రవర్తనను అనుమానిస్తున్నారు. మీ సంకుచిత బుద్దితో నన్నూ అనుమానించరనే రూఢి ఏంటి?


మరో మాట…, కట్టు బట్టలతో ఢిల్లీ రమ్మన్నారు.


మిస్టర్…. ప్రేమించిన వాడి కోసం అష్టకష్టాలు పడమంటే నా మనఃసాక్షి ఒప్పుకుంటుంది కానీ లేచిపోడానికి నేను సిద్దపడను. మీతో జీవితం పంచుకోనందుకు నేను అదృష్టవంతురాలిని, నేను గెలిచాను.


స్వర్గం లాంటి జీవితాన్ని అందజేస్తారా.. నేను నరకంలో వుంటే కదా.. స్వర్గం కావాలి.. మీరెంతటి ఇంద్రులో-చంద్రులో వర్ణించారు.. నా లాంటి సామాన్య జీవికి అవన్నీ అవసరము లేవు.


నాన్నగారి ఆఫీసులో గౌరవప్రదమైన ఉద్యోగం, కాలక్షేపానికి పుస్తకాలు, స్నేహితులు.


మీ గురించి ఆలోచించడానికి, ప్రత్యక్షంగా కలుసుకోవటానికి, ఉత్తర ప్రత్యుత్తరాలు జరపటానికి, నాకు తీరిక లేదు. నా ఈమెయిల్ ఐడి నేను ఇవ్వను.


ఇంతే సంగతులు.....



*****

సురేఖ పులి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సురేఖ పులి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:

Profile Link:

Youtube Play List Link:

పేరు :సురేఖ

ఇంటి పేరు: పులి

వయసు: 68 సంవత్సరాలు

భర్త పేరు: స్వర్గీయ పి. అరుణ్ కుమార్

ఎంఏ (సోషియాలజీ&ఇంగ్లీష్) చేశాను. ఇద్దరు అమ్మాయిల వివాహమైంది.

పుట్టి, పెరిగింది హైదరాబాద్ లో.

ప్రస్తుత నివాసం బెంగళూర్ లో.

మా నాన్న స్వర్గీయ అర్జున్ రావు గారు నా మార్గదర్శకులు.

స్కూల్, కాలేజీ మ్యాగజైన్ కు రాయడంతో నా రచనా వ్యాసంగం ప్రారంభమైంది.

HMT Hyd లో నా ఉద్యోగం, 2008 లో స్వచ్ఛంద పదవీ విరమణ తర్వాత

ఒక డైలీ న్యూస్ పేపర్ కోసం పనిచేసాను.

చందమామ, యువ, స్వాతి, ఈనాడు, నెచ్చెలి, మన తెలుగుకథలుడాట్కాంల లో నా కథలు, కథానికలు ప్రచురితమయ్యాయి.

ప్రస్తుతం విశ్రాంత సీనియర్ సిటిజన్ను. కధలు రాయటము, చదవడం నా హాబి. చిత్ర లేఖనం, పెన్సిల్ డ్రాయింగ్ ఇష్టపడతాను.

మీ ప్రోత్సాహమే నా బలం 🤝

మరిన్ని రచనలతో పాఠకులకు దగ్గర కావాలన్నదే నా ఆశయం.

సురేఖ పులి


55 views0 comments

Comments


bottom of page