top of page

ఇంటింటి రామాయణం


'Intinti Ramayanam' - New Telugu Story Written By M. Bhanu

'ఇంటింటి రామాయణం' తెలుగు కథ

రచన: M. భాను

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

“అబ్బా!” మొహం చిట్లిoచి “ఏమిటి ఇది? కూరలో ఉప్పు వేసావా? ఉప్పే కూరగా వoడావా? ఛీ! ఛీ! నీ వoట తినలేక చస్తున్నాను” అని కoచoలో నీళ్లు పోసి అక్కడ నుంచి వెళ్లి పోయాడు రామం.

ఆ మాటలకి చేష్టలకి కళ్ళలో నీళ్లు గిర్రున తిరిగాయి. ఏమిటో ఈ మధ్య ఏది బాగా వoడినా, పనులు ఎoత బాగా చేసినా విసుక్కోవడము, అరవడo..

ఏదైనా తిరిగి అనబోతే “నీకు ఇoతకoటే గొప్పగా ఏ పనులు చేతనవుతాయి?” అని అనడం, “ఏదైనా పని చేస్తే కాస్త శ్రద్ధ పెట్టి చెయ్యాలి. అంతేగానీ చేశామా వoడేమా అన్నట్టు ఉండకూడదు” అని మనసు నొచ్చుకునేలా గా మాటలని వెళ్లిపోతాడు.

“ఏమైంది ఈయనకు? ఇదివరకు బాగానే ఉండేవారు. నీ చేతి వoట చక్కగా ఉంటుంది అని మెచ్చుకునేవారు. ఆఫీస్ నుంచి రాగానే కబుర్లు చెప్పేవారు. పార్కులకి, సినిమాలకి తిరిగి వచ్చే వాళ్ళము. ఇప్పుడు ఏదైనా కాస్త సరదాగా మాట్లాడితే “అబ్బా! నోరు మూసుకుంటావా.. నీ మాటలు వినలేక చస్తున్నాను. ఎప్పుడూ ఏదో లొడలొడా వాగుతూ వుంటావు. నీ నోరు మూసుకుంటే నాకు ప్రశాంతంగా ఉంటుంది” అనే మాటలు విని తను నోరు విప్పి మాట్లాడటం మానేసింది. ఇలా ఆలోచిస్తున్న లక్ష్మి అత్తగారు మావగారు మాటలతో ఈ లోకంలోకి వచ్చింది. ఇద్దరికీ భోజనం వడ్డించింది. భయపడుతూనే కూర వడ్డించింది.

వాళ్లిద్దరూ తింటుంటే వాళ్లు మొహాలను పరిశీలించసాగింది.

అది చూసిన లక్ష్మి అత్తగారు “ఏమిటి అమ్మాయి అలా చూస్తున్నావ్” అన్నారు.

లక్ష్మి “అదే అత్తయ్య, కూర.. కూర..” అని నీళ్లు నమలసాగింది.


“కూరకి ఏమైంది? బ్రహ్మాండంగా ఉంది. చాలా బావుంది కదా ఏవండి” అంది భర్త వైపు తిరిగి.


లక్ష్మి మామగారు కూడా “చాలా బావుందమ్మాయ్ కూర, అయినా నీ వంటలకి వంకలు ఎవరు పెడతారు చెప్పు” అన్నాడు.


లక్ష్మి “అదేమిటి మీ అబ్బాయి చాలా ఉప్పగా ఉంది అన్నారు”


“వాడి మొహం.. వాడేదో చిరాకులో అని ఉంటాడు. నువ్వు కూడా తిని చూడు, నీకే తెలుస్తుంది” అని అత్తగారు మావగారు భోజనం ముగించి లేచారు.


వారి తర్వాత భోజనం తిన్న లక్ష్మికి చాలా ఆశ్చర్యమేసింది ‘ఇంత రుచిగా ఉంటే ఎంతో ఉప్పగా ఉందన్నారు. ఏమైంది ఈయనకు?’ అనుకుంది.


ప్రతి విషయానికి.. బట్టలు సరిగా ఉతకలేదని, ఇస్త్రీ సరిగా చెయ్యలేదని, షూ పాలిష్ చేయలేదని, ఇల్లు శుభ్రంగా లేదని ప్రతీదానికి వంకలు పెడుతూనే ఉన్నాడు. వినీవినీ జీవితం మీద విరక్తి వచ్చేస్తోంది లక్ష్మీ కి.


ఆ రోజు రాత్రి వంటగదిని శుభ్రం చేసి పడుకోడానికి వస్తుంటే బాల్కనీలో ఎవరితోనో మాట్లాడుతున్న మాటలు వినిపించి ఆగి విన్నది.


“ఈ రోజు మా ఇంట్లో బంగాళదుంపల కూర సూపర్ గా ఉంది. నిన్ను కూడా భోజనానికి పిలుద్దామనుకున్నాను కానీ అప్పటికే నువ్వు భోజనం చేసే ఉoటావని పిలవలేదు. అయినా ఏమాటకామాటే చెప్పుకోవాలి. మా లక్ష్మీ పనితనం గురించి గొప్పలు చెబుతున్నాననుకోకు. ఇల్లు ఎంత శుభ్రంగా పెడుతుందో వంట అంతబాగా చేస్తుంది. మా అమ్మానాన్నకీ ఏ కష్టం లేకుండా చూసుకుంటోంది. నిజంగా అటువంటి భార్య దొరకడం నా అదృష్టం” అంటూ చెబుతున్నాడు ఎవరితోనో.


అది విన్న లక్ష్మికి చాలా ఆశ్చర్యమేసింది ఇదేమిటి ఇలా మాట్లాడుతున్నాడు. ఇంట్లో చూస్తే ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు ఒకటే తిట్లు, జీవితం మీద విరక్తి కలిగేలా. ఈయనకేమైనా మెదడు చెడిపోయిందా అనే ఆలోచన వచ్చింది లక్ష్మికి.


మళ్లీ వెంటనే ఏమిటి ఇలా ఆలోచిస్తున్నాను అనుకుoటూ లోపలకు వెళ్ళిపోయింది. అసలు సమస్య ఎక్కడుంది పరిష్కారం ఏమిటి ఆలోచిస్తూ పడుకుంది లక్ష్మీ.


అత్తగారు మామగారు తో చెప్పి ఈ సమస్యకు పరిష్కారం ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది.


ఆ మర్నాడు రామం తన ఫ్రెండును భోజనానికి తీసుకువస్తున్నానని చెప్పాడు.


వెంటనే లక్ష్మి “తీసుకురావద్దు, నేను వంట చెయ్యను” అని చెప్పింది.


దానికి రామం ఆశ్చర్యంగా “అదేమిటి అలా అంటున్నావు?” అన్నాడు.


“అవును, నా వoట బాగుండదు కదా.. ఉప్పు వేసి కూర వoడుతాను, ఏ పని సరిగా రాదు. శుభ్రంగా ఉండను. మీ స్నేహితుడుని తీసుకోవచ్చి మీరు అవమానం పాలవ్వడం ఎందుకు? బయట ఎక్కడైనా పెట్టించoడి.” అని స్థిరంగా చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. ఆశ్చర్యంగా నిలబడ్డాడు రామo. ఏమైంది లక్ష్మికి? ఎవరిని తీసుకొచ్చిన చక్కగా వండిపెట్టేది..


తల్లి దగ్గరికి వెళ్లి “అమ్మ.. నా స్నేహితుడు ఊరి నుంచి వచ్చాడు. కొంచెం వంట చేస్తావా” అని అడిగాడు.


“నేను చేయలేను, నాకు ఓపిక లేదు” అని చెప్పడంతో ఏమీ చెయ్యలేక బయటికి వెళ్ళిపోయాడు రామం.


రాత్రి పడుకోవడానికి వచ్చిన రామానికి బెడ్ రూమ్ అంతా చిందర వందరగా కన్పించింది. పక్క బట్టలు సరిగా లేవు, మంచం మీద ఎక్కడబడితే అక్కడ బట్టలున్నాయి, చూడడానికి చాలా చీదరగా ఉంది.


“లక్ష్మి.. లక్ష్మి..” అని గావు కేకలు వేశాడు, పరిగెత్తుకొచ్చిన లక్ష్మిని “ఏమిటిది ఎక్కడ పడుకోవాలి? ఈ బట్టలేమిటి? నీ అవతారం ఏమిటి ఏబ్రాసిలా గాను?” అని కేకలు వేస్తున్న రామం మాటలు పట్టించుకోకుండా గబగబా బట్టలన్నీ తిసి పక్కన పడేసి పక్క సర్దింది.


ముఖం మాడ్చుకుని పడుకున్నాడు రామం. ఇలా ఒక నెల్లాళ్లు సాగింది. ఎప్పుడూ లేనిది మధ్యమధ్యలో తల్లీతండ్రీ లక్ష్మి మీద చాడీలు చెప్పడం, సమయానికి తిండి పెట్టడం లేదు, బట్టలు సరిగా ఉతకడం లేదని.

వినీవినీ విసుగొచ్చేసి జీవితం మీద విరక్తి వచ్చేసింది రామానికి.


ఒకరోజు తెల్లవారు జామున లక్ష్మికి మెలకువ వచ్చింది. ఏవో మాటలు వినిపించసాగాయి. ఏమిటా అని చెవులు నిక్కబొడుచుకుని విoది. అక్కడ రామం ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు.


“ అరే! వెంకీ! పెళ్ళాన్ని మెచ్చుకుంటే అణిగిమణిగి ఉండరన్నావ్? వాళ్ళేం చేసినా మెచ్చుకోకూడదు అని చెప్పావు. నీ మాటలు విని బంగారం లాంటి నా కాపురంలో నిప్పులు పోసుకున్నాను. చక్కగా వండిపెట్టేది, ఇల్లూ వాకిలీ శుభ్రం చేసేది. అమ్మానాన్నని చక్కగా చూసుకునేది ఇప్పుడు అన్ని సమస్యలు వచ్చిపడ్డాయి నీ వల్ల.


ఇంకెప్పుడూ నా కాపురానికి సలహాలు ఇవ్వకురా నాయనా! విని చెడిపోయాను ముందు నీ కాపురం బాగుచేసుకో” అంటూ ఫోన్ పెట్టేశాడు.


ఆ మాటలు విన్న లక్ష్మికి విషయం మొత్తం అర్ధం అయ్యింది. వెంకీ భార్య గయ్యాళి ఎవరి మాట వినదు, శుచీ శుభ్రం ఉండదు, వంటసరిగా చెయ్యదు అందుకనే వెంకీ తనకు లేని సుఖం ఎవరికీ ఉండకూడదని ఇలాంటి పనులు చేస్తున్నాడు.


అమ్మయ్యా! నిజం తెలుసుకున్నారు కాబట్టి సరిపోయింది. లేకపోతేనా.. అనుకుంటూ కళ్ళు మూసుకుంది గట్టిగా.


మరునాడు ఉదయం లేచిన రామం లక్ష్మి దగ్గరికి వెళ్లి “లక్ష్మీ! నన్ను క్షమించు. ఇంకెప్పుడు నిన్ను విసుక్కోను. చాలా బాగా వంట చేస్తూ పనులన్నీ చక్కగా చేస్తావు. ఇదివరకటిలాగే ఉండు” అంటూ ప్రాధేయపడ్డాడు.


ఇదంతా చాటునుంచి చూస్తున్న అత్త మామ గారు బయటికి వచ్చారు.


“ఒరే రామూ! ఎవరైనా ఏదైనా పని చేసినప్పుడు బావుందని మెచ్చుకుంటే మనసుకి సంతోషంగా ఉండి మరింత ఎక్కువగా బాగా పని చేస్తారు. చూశావుగా నెల్లాళ్లు నువ్వెలా నలిగిపోయావో! లక్ష్మి చేసే పనులకి. మరి నువ్వు అన్న మాటలకు, చేతలకి లక్ష్మి ఎంత నొచ్చుకుందో!?


ఎవరి మాటలో విని మన సంసారంలో నిప్పులు పోసుకోకూడదు. ఇకనైనా జాగ్రత్తగా ఉండు మళ్ళీ లక్ష్మీ ని విసిగించావో మేమే బయటికి తీసుకొని వెళ్ళిపోతాం” అంటూ నవ్వుతూ బెదిరించారు.


రామo రెండు చెంపలు వేసుకుంటూ “లేదమ్మా! బుద్ధి వచ్చింది. ఎప్పుడు ఎవరి మాట వినను. సంసారాన్ని సమస్యల వలయంలో నెట్టుకున్నాను. నాదే తప్పు”అంటున్న రామాన్ని నవ్వుతూ చూశారు తల్లితండ్రి.

------------------------------------------------

కొంతమంది తమ సంసారంలో సుఖంలేదని ఎదుటి వారి సంసారంలో కూడా నిప్పులు పోయాలని ప్రయత్నిస్తారు. అలాంటివారిని గ్రహించి దూరంగా పెడితే మన జీవితం సవ్యంగా ఉంటుంది.

M. భాను గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:

నమస్తే అండి. నా పేరు భాను. నేను టీచర్ గా పని చేసి ఉన్నాను. కథలు వ్రాయాలి అని తపన. వ్రాస్తూ ఉంటాను. ప్రస్తుతం నేను మావారి ఉద్యోగరీత్యా రంపచోడవరం లో ఉంటాను.

ధన్యవాదములు 🙏



38 views0 comments

Comments


bottom of page