'Iruku Kompa' - New Telugu Story Written By Sudarsana Rao Pochampally
'ఇరుకు కొంప' తెలుగు కథ
రచన: సుదర్శన రావు పోచంపల్లి
“లొల్లి చెయ్యకుండిరా నాయనలారా మీకు దండం బెడుత తలనొప్పిగా వుంది” అని విసుక్కుంటాడు శ్యామ సుందర్.
“తాతయ్యకు తల నొప్పిగా ఉందటర. మీరు లొల్లి చేయకుండా కాసేపు బయట ఆడుకొండి. లేదా చదువుకొండి” అని భర్తను సమర్థించుకుంటూ అంటుంది రుక్మిణి.
“అదేంది అత్తయ్యయ్య గారు.. మనది లంకంత కొంపనా పాడా.. రెండు పడక గదులలోనే మీరిద్దరు మేము నలుగురము సర్దుకోవాలి. పూజకు ఒక తులసి మొక్క పెట్టుకుందామా అంటె స్థలము లేదాయె. అయినా పిల్లలు అల్లరి చేయక పెద్దలు చేస్తారా? వాళ్ళను మాత్రం సదా చదువుకొమ్మంటె వంట పట్టొద్దా.. అయిన బయట స్థలము ఎక్కడ ఏడ్చిందని?” అని అత్తగార్ని నిలదీస్తుంది నిర్మల.
భర్త అనిరుద్ కార్యాలయానికి పోయిండు కనుక- లేక పోతే మహా అణిగిమణిగి ఉండే ఇల్లాలుగా వ్యవహరిస్తుంది.
శ్యాం సుందర్ గాని రుక్మిణి గాని కోడలు ఏమన్నా కొడుకుకు చెప్పబోరు ఇంట్లో కలతలు పెరుగ గూడదని.
శ్యాం సుందర్ కు పూర్వీకుల ఆస్తి ఏమీ లేదు. తలిదండ్రులకు ఒక్కడే కొడుకు. తనకూ ఒక్కడే కొడుకు అనిరుద్. ఎదో చిన్న ఉద్యోగము చేస్తూ ఆయింత ఇల్లు సంపాదించుకున్నాడు శ్యాంసుందర్.
వయసు మీద పడి ఉద్యోగమునుండి దిగిపోతున్న సమయాన యాజమాన్యము ఇచ్చిన సొమ్ము కొంత తానుంచుకొని మిగతా డబ్బుతో కొడుకు పెళ్ళి చేస్తాడు. కోడలు తరఫు వారుకూడా ఎక్కువ ఉన్నోళ్ళేమి కాదు.
దుబారా వ్యయము చేసెటి వాడు కాడు కనుక అగ్గువ ఉన్ననాడు ఊరికి దూరమైనా రెండు మూడు ఇంటి స్థలాలు కొని పెడుతాడు శ్యాంసుందర్.
అదీ గాక జీవిత భీమా, ఆరోగ్య భీమా తన పేరిట భార్య రుక్మిణి పేరిట చేసి పెడుతాడు. అనిరుద్ కు కూడా ఉద్యోగములో అంతంత మాత్రమే వేతనము కనుక తండ్రి బాటలోనే కొన్ని ఇంటి స్థలాలు కొని పెడుతూ ఆస్తిని ప్రోగు చేసుకుంటుంటాడు. ఆరోగ్య బీమా, జీవిత బీమా కూడా చేసి పెడుతాడు. కార్యాలయములో పనులకు లంచము ఆశించకుండా నిజాయితీగా పనులు నిర్వర్తిస్తుంటాడు అనిరుద్. ఇద్దరు కొడుకులు ప్రవీణ్, ప్రమోద్ లను ప్రభుత్వ పాఠశాలలోనే చదివిస్తుంటాడు.
ఇల్లు చిన్నది కావడము చేత అప్పుడప్పుడు స్పర్థలకు దారి తీస్తుంది. ఆ సంఘర్షణలో అనిరుద్ ఇటు తలిదండ్రులకు సర్ది చెప్పలేక అటు భార్య నిర్మల ను సముదాయించ లేక సతమత మౌతుంటాడు. రోజూ ఏదో కారణంగ ఇరుకు కొంప ఇరుకు కొంప అని ప్రతిధ్వనిస్తూనే ఉంటది ఇంటిలో.
పిల్లలు పెరుగుచున్నా కొద్ది శ్యాంసుందర్ నిర్మలకు కూడా ఒకే గదిలో సర్దుకోవడము ఇబ్బందిగా తోస్తుంది. మింగలేక కక్క లేక అన్నట్టు అవస్థ పడుతుంటారు. ఎవరైనా బంధువులు వస్తె ఇక వాళ్ళ ఇబ్బంది చెప్పనలవి కాదు.
తల్లి దండ్రిని వరండాలో ఉండమన్నా ముసలి తనము చేత వాళ్ళకు గదిలోనే బాత్రూం లాంటి వసతులుంటేనే సరిపోతుంది. పైగా శ్యాంసుందర్ కు దగ్గు, దమ్ము, జలుబు. చలి సదా వెంటాడుతుంటుంది.
ఉన్న ఇల్లు అమ్ముకొని పెద్దది కట్టించుకుందామనుకుంటె పాతబడ్డ ఇంటికి ధర పలుకదు. కొత్తది వసతిగా కట్టించుకుందామనుకుంటె నిర్మాణ వ్యయము ఆకాశము వైపే చూస్తుంది. అనిరుద్ అనుకుంటాడు ఇల్లు ఈ యింత మాత్రమన్న ఉన్నది అదీ లేనివారి పరిస్థితి మహా హీనంగా ఉంటదిగదా అని. ధైర్యము చేసి రెండు ఇంటి స్థలాలు ఇప్పుడున్న ఇంటిని అమ్ముదామనుకున్నా సరిపోను డబ్బులు రావు. రుణానుబంధ రూపేణ పశు పత్ని సుత ఆలయ అన్నట్టు ఈ ఇంటి మీది మమకారము కూడ నాన గారికి ఒదులక పోవచ్చు అనుకుంటాడు అనిరుద్.
తండ్రి కొన్న స్థలాలు కూడా అమ్మేయ మంటె మా జీవిత కాలమింక ఎంత ఉన్నదో మాకు రోగ నొప్పులకు నీవు అమ్ముకొని నేనూ అమ్ముకొని ఆపదలనెదుర్కొనేదెట్లా అంటడు. ఎటూ తేల్చుకోలేక దినదిన గండం వెయ్యేళ్ళ ఆయుష్యు లా కాలం వెళ్ళబుచ్చుచుంటారు.
నిర్మలకు మాత్రము పెద్ద ఇల్లు కట్టించుడో కట్టినది కొనుడో చేయాలని ఉంటది మనసులో. భర్త ఎంత చెప్పినా వినడనుకొని వేలొంకర పెట్టనిది వెన్న తీయరాదను సామెతల ఇంట్లో తరుచు ఏదో కారణము చేత గొడవలు సృష్టించ జూస్తుంది. మనిషిని చితగ్గొట్టి ముద్దుపెట్టుకున్నట్టు అత్తయ్యగారూ. మామయ్యగారూ అని మర్యాదకేమి లోటు లేనట్లుగా నటిస్తుంది నిర్మల.
ఇవన్నీ గమనిస్తున్న అనిరుద్ దీర్ఘాలోచనలో పడుతాడు ఈ వ్యవహారానికి పరిష్కారమేమిటా అని.
తలవని తలంపుగా ఇంటిపక్కనే ఉన్న రెండు పడక గదులున్న ఇల్లు ఖాలీ అయితది. ఇక ఏమాత్రము ఆలసించక ఆ ఇల్లు అద్దెకు తీసుకుంటాడు అనిరుద్. నిర్మల కొంత సంతృప్తి చెందుతుంది..
పదేండ్లు గడిచిన తరువాత పిల్లలు కళాశాల చదువులకెదుగుతారు. శ్యాంసుందర్. రుక్మిణి పూర్తిగా ముసలివాళ్ళైపోతారు.
“వాళ్ళకు సేవ చేయుటలో ఆ ఇల్లు ఈ ఇల్లు తిరుగలేక చస్తున్నాను” అంటుంది నిర్మల.
“ఎట్లా నిర్మలా నీతో వెగేది? ఒక్క ఇంట్లో ఉంటే ఇరుకు కొంప అని పోరు బెడితి.వి అద్దె ఇల్లు నీకు అనుకూలంగా ఉంటాదని తీసుకుంటె ఇప్పుడా ఇల్లు ఈ ఇల్లు అని పేచీ పెట్టబడితివి. అసలు ఇల్లు ఇరుకు కాదు నీ మనసే ఇరుకు మనసు” అని నిట్టూరుస్తాడు అనిరుద్.
సమాప్తం.
సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
పేరు-సుదర్శన రావు పోచంపల్లి
యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)
వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి
కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను
నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,
నివాసము-హైదరాబాదు.
కథ బావుంది