top of page

జనని భారతి


'Janani Bharathi' New Telugu Story Written By M R V Sathyanarayana Murthy

'జనని భారతి' తెలుగు కథ

రచన: M R V సత్యనారాయణ మూర్తి

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


మన బ్యాచ్ లో చాలా మంది యు. ఎస్. వెళ్ళడానికే మొగ్గు చూపుతున్నారు. ఇటీజ్ ఎ వైజ్ డెసిషన్. ఆ.. కావేరి, నీ నిర్ణయం చెప్పలేదు.. యు. ఎస్. కా.. ఆస్ట్రేలియా కా ?” అడిగాడు రాహుల్.

అతని ప్రశ్నకి దీర్ఘంగా శ్వాస విడిచింది కావేరి. “నేనింకా ఎటూ డిసైడ్ అవ్వలేక పోతున్నాను. ఇంటికి వెళ్ళాక ఆలోచించి నీకు ఫోన్ చేస్తాను” అంది కావేరి.


“ఓకే. టేక్ యువర్ ఓన్ టైం. కానీ ఇండియా లోనే ఉంటానన్న స్టుపిడ్ ఆలోచన మాత్రం పెట్టుకోకు” అన్నాడు రాహుల్ బిగ్గరగా నవ్వుతూ.


అతని మాటలకి కావేరి మనసులో కొద్దిగా బాధ కల్గింది. బెంగళూరు లో మెడిసిన్ లో పి. జి. చేసిన తెలుగు వారి ఫేర్ వెల్ పార్టీ అది. రాహుల్ వాళ్ళు అందరికీ లీడర్. ప్రస్తుతం ఈ పార్టీ ని స్పాన్సర్ చేసింది అతనే.


పార్టీ అయ్యాక రూమ్ కి వచ్చి లగేజి సర్దుకుని ట్రైన్ ఎక్కింది కావేరి. ఆమె స్నేహితులు చాలా మంది విమానంలో వెళ్ళిపోయారు. మర్నాడు ఉదయం తణుకు లో ట్రైన్ దిగి, నర్సాపురం బస్సు ఎక్కి శివాపురం వచ్చింది కావేరి. రమణమ్మ కూతుర్ని కౌగలించుకుని చాలా సంతోషపడింది.

తన కూతురు ఇప్పుడు ఒక పెద్ద డాక్టర్! ఆ విషయం తలుచుకోగానే ఆమె కళ్ళ వెంట ఆనందభాష్పాలు జల జలా రాలాయి.


“అమ్మా, ఇప్పుడు నీకు సంతోషమేనా?” తల్లి కన్నీళ్లు తుడుస్తూ అడిగింది కావేరి.


“ఆ.. చాలా సంతోషం తల్లీ. నా మాట నిలబెట్టావు” అంది కూతురు నుదిటి మీద ముద్దుపెట్టుకుని.

కావేరి స్నానం చేసి నగరేశ్వర స్వామి గుడికి వెళ్ళింది. పూజారి సూర్యనారాయణ గారు “కులాసానా కావేరి? ఎం. డి. పరీక్ష కూడా పాసయ్యావుట గదా, మీ అమ్మ నిన్న చెప్పింది” అన్నారు ఆప్యాయంగా.


“అంతా మీవంటి పెద్దల ఆశీర్వచన ఫలితం అయ్యగారూ” అంది కావేరి వినయంగా. దానికాయన చిన్నగా నవ్వారు.


“ఆ శివయ్య అనుగ్రహం, మా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి. మీ నాన్న, నీ చిన్నతనంలోనే చనిపోయినా, కృంగి పోకుండా ధైర్యంగా పరిస్థితుల్ని ఎదుర్కొని నిన్ను కష్టపడి చదివించింది మీ అమ్మ. నా బిడ్డ డాక్టర్ కావాలి, సమాజానికి దేశానికి సేవ చేయాలని రోజూ గుడికి వచ్చి శివయ్యకి మొక్కుకునేది. ఆమె కష్టం, నీ కృషి, నిన్ను డాక్టర్ ని చేసాయి. రామ్మూర్తి మాస్టారు మీ కుటుంబానికి చాలా అండగా నిలబడి సహకారం చేసారు. ఆయన ఊళ్ళో లేరు. లేకపోతే గడప గడపకూ తిరిగి నీ రాక గురించి చెప్పేవారు. నువ్వంటే అంత ప్రేమ ఆయనకు” అన్నారు సూర్యనారాయణ గారు.


మాస్టారు ఊళ్ళో లేరు, అని తెలియగానే నిరుత్సాహపడింది కావేరి. గుడి నుంచి తిన్నగా మాస్టారి ఇంటికి వెళ్ళాలనుకుంది. పూజారి గారు ఆమె గోత్ర నామాలు చెప్పి, స్వామి వారికి హారతి ఇచ్చి, స్వామి వారి పాదుకలు ఆమె శిరస్సు పై ఉంచి ఆశీర్వదించారు. మహిషాసుర మర్ధని అమ్మవారిని కూడా దర్శించుకుని ఇంటికి వచ్చింది కావేరి.


రమణమ్మ టిఫిన్ తెచ్చి కూతురికిచ్చి, ఊళ్ళో వాళ్ళ గురించి, కావేరి స్నేహితుల గురించి కబుర్లు చెబుతోంది. టిఫిన్ తింటూ తల్లే కేసి చూస్తోంది కావేరి. తన కోసం ఎంత కష్టపడింది? తన ఆరవ ఏట అనారోగ్యంతో తండ్రి చనిపోయాడు. ఉండటానికి పూరి పాక తప్ప ఏమీ లేదు. అయినా అధైర్య పడలేదు.


వ్యవసాయ కూలీగా మారి ఎండనకా, వాననకా శ్రమించింది. కూలి పని ఉందంటే ఎంత దూరమైనా నడచి వెళ్ళేది. తిరిగి నడిచి వచ్చేది. బస్సు ఎక్కేది కాదు. పని లేనప్పుడు తనకి అన్నం పెట్టి ఆమె పస్తులు ఉండేది. తన భవిష్యత్తు కోసం ఆమె రక్తాన్ని ధారపోసి తనని పెంచింది. ఆమె ఋణం ఎలా తీర్చుకోవాలి? అన్న భావన రాగానే కావేరి కళ్ళల్లో సన్నని కన్నీటిపోర కదలాడింది. అది చూడగానే రమణమ్మ విలవిలలాడి పోయింది.


“ఉప్మా కారంగా ఉందా బిడ్డా? కొంచం పంచదార తెస్తానుండు” అని లేవబోయిన రమణమ్మని చేయి పట్టుకుని ఆపింది కావేరి.


“నువ్వు చేసిన ఉప్మా కమ్మగా ఉండక, కారంగా ఎందుకుంటుంది? ఎదో గుర్తుకు వచ్చింది” అంది కళ్ళు తుడుచుకుంటూ కావేరి. ఈలోగా సెల్ ఫోన్ మోగింది. టిఫిన్ గబా గబా తిని ఫోన్ మాట్లాడింది. అది రాహుల్ నుండి వచ్చిన ఫోన్.


“కావేరీ, జాగ్రత్తగా చేరావుగా. స్టేట్స్ నుంచి మా అంకుల్ ఫోన్ చేసారు. త్వరగా వీసాకు అప్లై చేసుకోమని. ఆయన చికాగో లో పెద్ద హాస్పిటల్ లో డాక్టర్ గా పని చేస్తున్నారు. మనవాళ్ళు అందరూ నాలుగు రోజుల్లో వీసాకు అప్లై చేస్తున్నారు. నువ్వు కూడా అప్పటికి హైదరాబాద్ వస్తే అందరం ఆ పనిలో ఉందాం. ఏమంటావు?” గబ గబా మాట్లాడాడు రాహుల్. అతను ఎప్పుడూ అంతే. చాలా స్పీడ్ గా ఉంటాడు ప్రతి విషయంలో. హెల్పింగ్ నేచర్ ఉన్న మనిషి..


ఆలోచిస్తోంది కావేరి.

“హలో కావేరీ.. ఏమిటి మాట్లాడవు ?” అడిగాడు రాహుల్.


“ఆ.. ఏం లేదు.. ఏదో ఆలోచిస్తున్నాను”అంది కావేరి.


“నో నో.. నువ్వు వేరే ఆలోచన ఏమీ పెట్టుకోకు. నువ్వుకూడా హైదరాబాద్ వస్తున్నావు. అంతే” అని ఫోన్ కట్ చేసాడు రాహుల్. అతని మాటలకు చిన్నగా నవ్వుకుని టిఫిన్ ప్లేట్ సింకు లో పడేసి చేతులు కడుక్కుని వచ్చింది కావేరి.


ప్రస్తుతం రమణమ్మ ప్రభుత్వం వారు బలహీనవర్గాలకు కట్టించిన చిన్న డాబా లో ఉంటోంది.

రామ్మూర్తి మాస్టారు, సర్పంచ్ చంద్రమౌళేశ్వర రెడ్డి మరి కొంత సాయం చేయడంతో డాబాని సౌకర్యంగా మలుచుకుంది రమణమ్మ. ఆరోజంతా ఇరుగు పొరుగు వారు, చిన్ననాటి స్నేహితులు వచ్చి పలకరించడంతో బిజీ గా ఉంది కావేరి.

****

మర్నాడు ఉదయం రామ్మూర్తి మాస్టారు వచ్చారని తల్లి చెప్పగానే గబా గబా బయలుదేరి మాస్టారి ఇంటికి వెళ్ళింది కావేరి. మాస్టారు హాలులో కుర్చీలో కూర్చుని పేపర్ చదువుకుంటున్నారు.

“నమస్కారం మాస్టారూ” అంటూ లోపలకు వెళ్లి ఆయన పాదాలకు నమస్కరించింది కావేరి.

“దీర్ఘాయుష్మాన్ భవ” అని ఆశీర్వదించి “కూర్చో తల్లీ” అని కుర్చీ చూపించారు మాస్టారు కళ్ళనిండా ఆనందం నింపుకుని. కుర్చీలో కూర్చుంది కావేరి.


“చాలా సంతోషం కావేరీ. మన శివపురంలో ఎం. డి. చదువుకున్న తొలి మహిళవు నువ్వే. అభినందనలు” అన్నారు మాస్టారు.


“ఇది అంతా మీ సహకారమే మాస్టారూ. ఆరోజు నన్ను గుంటూరు తీసుకువెళ్ళి మెడికల్ కాలేజీ లో చేర్చిన సంఘటన ఎప్పుడూ నా కళ్ళముందు కదలాడుతుంది. నెల నేలా వచ్చి నా మంచి చెడ్డలు చూసి వెళ్ళేవారు. మీ ఆర్ధిక సహకారంతో, స్కాలర్షిప్ తో నేను ఎం. బి. బి. ఎస్. చదివాను. మీ బంధువుల ‘ట్రస్ట్’ సహకారంతో ఎండి. పూర్తీ చేసాను. నన్ను ఇంతటి విద్యావంతురాలిని చేసిన మిమ్మల్ని ఎప్పటికీ మరవలేను” అంది మరోసారి చేతులు జోడించి నమస్కరిస్తూ కావేరి.


“నువ్వు తెలివైన దానివి. జీవితంలో ఉన్నతశిఖరాలు చేరుకోవాలన్న పట్టుదల ఉంది. నీ కృషి, పట్టుదల చాలా గొప్పవి. అవే నిన్ను పైకి తీసుకువచ్చాయి. ఏదో నాకు తోచిన సాయం చేసాను. అది పెద్ద విషయం కాదు” అన్నారు మాస్టారు.


రెండు నిముషాలు గడిచాయి. “ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావ్?”అడిగారు మాస్టారు.


“ఇంకా ఏం నిర్ణయం తీసుకోలేదు మాస్టారూ. మా బ్యాచ్ చాలా మంది విదేశాలు వెళ్ళే ప్రయత్నాలలో ఉన్నారు. నన్నూ రమ్మనమని ఫోర్సు చేస్తున్నారు” అంది వినయంగా కావేరి.


ఆమె కేసి పరిశీలనగా చూసారు మాస్టారు. ఉన్నత విద్యతో వచ్చిన తేజస్సుతో కళకళ లాడుతోంది. కానీ మనస్సు డోలాయమానం లో ఉందని గ్రహించారు.


“కావేరీ, ప్రస్తుతం మన దేశం స్వాతంత్ర దినోత్సవ అమృతోత్స్వం జరుపుకుంటోంది. కొన్ని వేలమంది ప్రాణాలు అర్పిస్తేనే కయీ మనకు స్వాతంత్రం రాలేదు తెలుసా?” గంభీరంగా అన్నారు మాస్టారు.


అర్ధం కాక ఆయన కేసి చూసింది కావేరి.


“అవునమ్మా. బ్రిటిష్ వాళ్ళు మనకి స్వాతంత్రం ఇవ్వడానికి మనల్ని చాలా బాధలు పెట్టారు. ‘వందే మాతరం’ అని అంటే లాఠీలతో దారుణంగా కొట్టి హింసించారు. ఎంతో మంది త్యాగదనులు భార్యా బిడ్డల్ని వదిలి స్వాతంత్రోద్యమం లో పాల్గొని జైళ్లకు వెళ్లి ఎన్నో కష్టాలు పడ్డారు. జైలు శిక్ష పూర్తీ అయ్య్యాక మరలా ఉద్యమం లో పాల్గొని మళ్ళీ జైలుకి వెళ్ళేవారు.

మన దగ్గరలోనే ఉన్న రేలంగి గ్రామం లోని తిరుపతి రాజు గారు ఆరు సార్లు జైలుకు వెళ్ళారు. ఏలూరు లోని ఒక కుటుంబం లో ఎనిమిది మంది జైలుకి వెళ్ళారంటే, దేశం పట్ల వారికి ఎత గాడాభిమానం ఉందో మనకు అర్ధమవుతుంది. అంతెందుకు, మన శివపురం లో డేగల సూర్యనారాయణ, ఆయన భార్య వెంకటరత్నం ఉద్యమం లో పాల్గొని జైలుకి వెళ్ళారు. ఆ దంపతులకు జైలు లోనే ఆడబిడ్డ పుడితే ‘భారతి’ అని పేరు పెట్టుకున్నారు. అంత దేశభక్తి వారికి”


మాస్టారు ఒక్క నిముషం ఆగి టీపాయ్ మీద ఉన్న గ్లాసులోని నీళ్ళు తాగారు.

కావేరి ఆయనకేసే చూస్తోంది. కొద్ది క్షణాలు గడిచాకా మాస్టారు మరలా చెప్పసాగారు.


“జైలు కెళ్ళిన వారికి ఏమైనా సౌకర్యాలు ఉండేవా? ఉహూ.. ఏమీ ఉండేవి కావు. చీకటి గుయ్యారాల వంటి గదులు, దోమలు, దుర్వాసనతో ఉండేవి. ఉద్యమం లో పాల్గొన్న ఖైదీలకు తగినంత భోజనం పెట్టేవారు కాదు. వారు ఆకలితో అల్లాడిపోయి, ఆ తర్వాత ఆ పరిస్థితికి అలవాటు పడేవారు.


దుస్తులు కూడా, ఒక బనీను, ఒక మట్ట లాగు, ఒక గోచీ, ఒక గోచీ ఇచ్చేవారు. గోచీ పెట్టుకుని స్నానం చేసి, బట్టలు ఉతుకుకుని, అవి ఎండలో ఆరాకా వాటిని కట్టుకునే వారు. ఇవన్నీ నాకు ఎలా తెల్సు అనుకుంటున్నావా?మా నాన్నగారు స్వాతంత్ర ఉద్యమం లో పాల్గొని జైలుకు వెళ్లి వచ్చారు. ఆయన చెప్పేవారు ఈ సంగతులు అన్నీ. అలా కొన్ని లక్షల మంది జైళ్లకు వెళ్లి ఎన్నో కష్టాలు అనుభవించి తమ దేశభక్తిని చాటుకున్నారు.


ఎంతో కష్టపడి సంపాదించుకున్న స్వాతంత్రానికి విలువ లేకుండా చేస్తున్నారు కొంతమంది. మనల్ని ఎంతో హింసించి, మన వారి ప్రాణాల్ని హరించడమే గాక మన అపార సంపదని వారి దేశానికి తరలించుకుపోయిన బ్రిటిష్ వారిని ఇంకా మెచ్చుకుంటున్న వారిని చూస్తె చాలా బాధ కలుగుతోంది.


మనిషి స్వార్ధపరుడై తానూ, తన కుటుంబం బాగుంటే చాలునని, ధన సంపాదనే ధ్యేయంగా ప్రవర్తిస్తున్నాడు. డబ్బు శాస్వతం కాదు తల్లీ. మన సమాజం, మన దేశం బాగుండాలన్న భావనలు అందరిలో బలంగా నాటుకున్న నాదే దేశం బాగుంటుంది” అన్నారు మాస్టారు.


“బాగుంది వరస. కావేరి పరీక్ష పాసయ్యానని చెప్పడానికి వస్తే మీ ఉపన్యాసంతో హదల గొట్టేస్తున్నారు. కాఫీ తాగండి” అంటూ ఇద్దరికీ కాఫీ ఇచ్చారు మాస్టారి భార్య రాజ్యలక్ష్మి.


కాఫీ తాగి ఇంటికి వచ్చింది కావేరి. మాస్టారి మాటలే ఆమె చెవుల్లో మారు మ్రోగుతున్నాయి.

ప్రతివారూ తమ సుఖమే చూసుకుంటే ఎలా? మనం ఈరోజు ఇలా సుఖంగా ఉంటున్నామంటే కారణం స్వాతంత్ర సమార యోధులు, మన సరిహాద్దుల్లో కాపలా కాస్తున్న సిపాయిలు. మన ఎదుగుదల చూడలేక మన పొరుగు దేశాలు నిరంతరం మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నారు.

తాను అనుకున్నది ఒకటి. విదేశాలు వెళ్లి బాగా డబ్బు సంపాదించాలి. తర్వాత ఇండియా వచ్చి పేదలకి వైద్య సహాయం అందించాలని. కానీ దానికి చాలా సంవత్సరాలు పడుతుంది. కానీ దేశం కోసం ఏం చేయాలి?


ఆలోచిస్తూనే ఉంది కావేరి. జైలులో నానా కష్టాలు పడుతున్న సమర యోధుల రూపాలు ఆమె కళ్ళముందు కదలాడు తున్నాయి. ఏం ఆశించి ఆ మహానుభావులు అంత త్యాగం చేసారు. కేవలం దేశభక్తి. అవును ‘దేశం బాగుండాలి’ అన్న లక్ష్యం కోసమే వారు జీవించారు అన్న నిజం ఆమెకి అవగతమయ్యింది.


తెల్లవార్లూ ఆలోచించి చివరకు ఒక నిర్ణయానికి వచ్చింది కావేరి.


మర్నాడు ఉదయమే భారత రక్షణ శాఖ ప్రధాన కార్యదర్శికి ఉత్తరం రాసింది, ‘సరిహద్దుల్లో ఉన్న సైనికులకి వైద్య సేవలు అందించడానికి అవకాశం ఇమ్మని’.


ఇప్పుడు ఆమె మనసు ప్రశాంత గోదావరిలా హాయిగా ఉంది.

***

M R V సత్యనారాయణ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).Podcast Link:


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం : సత్యనారాయణ మూర్తి M R V


ఎమ్. ఆర్. వి. సత్యనారాయణ మూర్తి. పెనుగొండ. పశ్చిమ గోదావరి జిల్లా. కవి, రచయిత, వ్యాఖ్యాత, రేడియో ఆర్టిస్టు. కొన్ని కథల పుస్తకాలు, కవితల పుస్తకాలు ప్రచురితం అయ్యాయి. కొన్ని కథలకు బహుమతులు కూడా వచ్చాయి. రేడియోలో 25 కథలు ప్రసార‌మయ్యాయి. 20 రేడియో నాటికలకు గాత్ర ధారణ చేసారు. కవితలు, కథలు కన్నడ భాషలోకి అనువాదం అయ్యాయి.


95 views0 comments

Comments


bottom of page