'Kalasi Unte Kaladu Sukham 1' New Telugu Web Series
Written By K. Lakshmi Sailaja
'కలసి ఉంటే కలదు సుఖము' తెలుగు పెద్ద కథ
రచన, కథా పఠనం : కే. లక్ష్మీ శైలజ
పెద్ద కథ 1/3
“హనుమావతీ, చింతకాయ తొక్కు పెట్టుకుందాము. రేపు మార్కెట్ కు పొయ్యొస్తారా? “
సుభద్రమ్మ ఉసిరిక్కాయలు నూనె వేసి, పెద్ద ఇత్తడి గిన్నెలో మగ్గిస్తూ అంది. హనుమావతి మెంతిపొడి, ఆవపొడి, కారంపొడి, ఉప్పు, పసుపు తీసి పెడుతోంది, ఉసరిక పచ్చడి తయారు చేయడానికి.
“అవును పిన్నమ్మా, వెళ్ళాలి. పిల్లలను బడికి పంపించి, నేను రాజ్యమ్మ పొయ్యొస్తాము. చింతకాయలు తీసుకుని వచ్చేటప్పుడు రిక్షా లో వస్తాములే. మగపిల్లలను పంపితే, మంచి కాయలు తేకుంటే మళ్ళీ మనకు బాధ. పచ్చిమిరపకాయలు కూడా తెస్తాము, ఒకటేసారి,” అనింది, హనుమావతి. ఉప్పును రోట్లో వేసి దంచుతూ. రాజ్యమ్మ సుభద్రమ్మ మూడవ కూతురు.
పచ్చడికి తిరగమోత పెట్టడానికి, నూనె కూడా వేరేగిన్నెలో పోసి కాచి, అందులో ఆవాలు, ఇంగువ, ఎండుమిరపకాయలు వేసి చిటపటా అన్నతరువాత పక్కన పెడుతూ పేలాలు వేయించుకోవాలి. వడ్లు తెమ్మని చెప్పాను. అంకాళయ్యవాళ్లు రేపు తీసుకొని వస్తున్నారు,” అన్నది సుభద్రమ్మ. సుభద్రమ్మ మరిది అంకాళయ్య, చిన్న సుభద్రమ్మలకు లకు పిల్లలు లేరు. అందుకని సుభద్రమ్మ, వెంకటసుబ్బయ్యల రెండో కూతురు ప్రమీలకు వాళ్ళు కన్యాదానం చేశారు. అప్పుడప్పుడూ ఇలా వీళ్ళింటికివచ్చి ఒక వారం ఉండి పోతారు. వాళ్ళ పొలం లో పండిన వడ్లు తెచ్చిస్తారు.
“చెంచు వాళ్ళ పుల్లమ్మకు చెప్పి పెడతానులే పిన్నమ్మా, అటుకులు కూడా దంచి ఇస్తుంది,” అంటూ “మనం జాడీలన్నీ తుడిచి పెట్టుకోవాలి,” అంది హనుమావతి.
“అవును. ఈ నెలంతా పనులు బాగా ఉంటాయి మనకు. పెద్దక్కయ్య సుబ్బమ్మ, చిన్నక్కయ్య ప్రమీల కూడా పిల్లలకు సంక్రాంతి సెలవులిస్తే వస్తారుకదా, ఒక పదిరోజుల తరువాత. అప్పుడు టమాటో పచ్చడి, పండుమిరప పచ్చడి కూడా పెట్టుకుందాం,” అంది సుభద్రమ్మ బాగా మగ్గిన ఉసిరిక్కాయలు పొయ్యి మీద నుంచి దించి పక్కన పెడుతూ. ఈ పచ్చళ్ళు ఆ కూతుళ్ళిద్దరికీ కూడా పెట్టి పంపాలి, వాళ్ళు వెళ్ళేటప్పుడు.
కాసేపు ఇద్దరూ మాట్లాడుకున్న తరువాత…. ఉసిరిక్కాయలు, నూనె చల్లారిన తరువాత అన్నీ కలిపి, పచ్చడిని రెండు పెద్ద జాడీలల్లో పెట్టారు. సుభద్రమ్మా వాళ్ళ ఇంట్లో నుంచి బయటకొచ్చి, నాలుగు ఇళ్ళ తరువాత రోడ్ దాటి రెండో ఇల్లయిన తమ ఇంట్లొకి వెళ్ళింది, హనుమావతి. ఒక అరగంట లో రామసుబ్బారావు, భోజనానికి వచ్చేశాడు.
శ్రీశైలం దగ్గరున్న ఆత్మకూరుకు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చినప్పటి నుంచీ, దూరపు బంధువులయిన సుభద్రమ్మా వాళ్ళతో హనుమావతీ, రామసుబ్బారావులు బాగా కలిసి పొయ్యి అందరూ కష్టసుఖాలు పంచుకుంటూ సంతోషంగా వున్నారు. సుభద్రమ్మ…. రామసుబ్బారావుకు చిన్నజేనాన్న కూతురు. వీళ్ళకు ఇద్దరు మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు. పిల్లలందరూ కూడా సుభద్రమ్మా వాళ్ళ పిల్లలతో బాగా కలిసి పొయ్యారు
సుభద్రమ్మా వాళ్ళకు ముగ్గురు మగపిల్లలు, ఐదుగురు ఆడపిల్లలు. ఇద్దరు ఆడపిల్లలు, మగపిల్లలకు పెళ్ళిళ్ళయ్యాయి. పెద్దకొడుకు రామేశ్వరం, కోడలు
నాగమణి వాళ్ళ మూడు సంవత్సరాల లోపల ఇద్దరు ఆడపిల్లలు ఆ ఇంట్లోనే వున్నారు. రెండో కొడుకు సత్యం, భార్య కామేశ్వరమ్మ బండి ఆత్మకూరు లో ఉంటారు. అతను టీచర్ గా పని చేస్తున్నాడు. వాళ్ళకు ఐదు సంవత్సరాల అబ్బాయి. వాళ్ళు సెలవులకు ఇక్కడికి వస్తారు. ఇంకా ఒక కొడుకు, ముగ్గురు ఆడపిల్లలు ఇంట్లో ఉంటారు. తండ్రీ, కొడుకులిద్దరూ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర డాక్యూమెంట్స్ వ్రాస్తుంటారు. పొలాల ద్వారా పల్లెటూరు నుంచి ఆదాయం వస్తూ ఉంటుంది.
ఆరోజు టెన్త్ క్లాస్ చదువుతున్న హనుమావతమ్మ పెద్దకొడుకు విజయ్ కు స్కూల్ డే సందర్భంగా పాటల పోటీలు ఉంటే అందరూ అక్కడికెళ్లి పిల్లలు వేసే నాటికలు చూశారు. మహమ్మద్ రఫీ పాడిన " నా మదినిన్ను పిలిచింది గానమై" అనే పాట పాడిన విజయ్ కు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది.
ఆ తెల్లవారి ఆడవాల్లిద్దరూ వెళ్ళి ఒక బస్తా చింతకాయలు తెచ్చారు. సుభద్రమ్మ మూడో కొడుకు రాంమూర్తి, విజయుడు వాటిని పెద్ద గంగాళాలల్లో వేసి, నిండా నీళ్ళు పోసి కడిగేశారు. నులక మంచాల మీద నేత చీరలు పరిచి వాటిని ఆరబెట్టారు. ఆ మధ్యాహ్నం వాటికి పీచులు తీశారు, సుభద్రమ్మ ముగ్గురు కూతుళ్ళు రాజ్యమ్మ, కుమారి, శశి, వాళ్ళతో పాటు హనుమావతమ్మ కూతుళ్ళు శైలజ, రాణి. శశి, రాణి ఒకే తరగతి. శైలజ కూడా వాళ్ళకంటే ఒకటిన్నర సంవత్సరమే పెద్ద కనుక వాళ్ళు ముగ్గురూ ఫ్రెండ్స్ గా వుంటారు. వాళ్ళకు వరుసకు శశి పిన్నమ్మ అవుతుంది కానీ ముగ్గురూ పేర్లు పెట్టి పిలుచుకుంటారు. చింతకాయలు పీచులు తీస్తుంటే, కొన్ని పండుకాయలు వచ్చాయి. వాటిని బోట్లు అంటారు. అవి తినడానికి బాగుంటాయి,తియ్యగా.
అవి తీసి పక్కన పెట్టుకుంటున్న పిల్లలను చూసి, “మరీ ఎక్కువ తినొద్దు. పండ్లు పులిసి పొయ్యి, అన్నం నమల లేరు,” అంది హనుమావతి.
===================================================================
ఇంకా ఉంది...
============================================================
కే. లక్ష్మీ శైలజ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
Podcast Link:
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం : నా పేరు K. లక్ష్మీ శైలజ.
నెల్లూరు లో ఉంటాను.
నేను ఎం. ఏ. ఎం.ఫిల్ చేశాను.
ఇప్పటి వరకు 40 కథలు , పది కవితలు ప్రచురితమైనవి.
జూన్ 2022 న తానా గేయతరంగాలు లో గేయం రచించి పాడటమైనది.
యూట్యూబ్ లో కథలు చదవడం ఇష్టం.
コメント