'Kalasi Unte Kaladu Sukham 2' New Telugu Web Series
Written By K. Lakshmi Sailaja
'కలసి ఉంటే కలదు సుఖము 2' తెలుగు పెద్ద కథ
రచన, కథా పఠనం : కే. లక్ష్మీ శైలజ
పెద్ద కథ 2/3
“కొంచెమే లేమ్మా, ”అన్నాడు చిన్నవాడు అజయ్.
ఆ తరువాత రోజు పెద్ద రోట్లో చింతకాయలు, పసుపు ఉప్పు మెంతులు వేసి దంచి, చింత తొక్కు రెడీ చేశారు. దంచడానికి ఇద్దరు చెంచువాళ్ళు వచ్చారు. రాజ్యమ్మ, కుమారి తోస్తూ ఉంటే, వాళ్ళు దంచారు. ఆ పచ్చడిని పెద్ద పెద్ద జాడీలకు ఎత్తి పెట్టారు. అది మూడవ రోజు తీసి మళ్ళీ దంచి పెడ్తే, సంవత్సరం రోజులు ఉదయాన్నేబడికి వెళ్ళే పిల్లలకు చద్దన్నం లోకి మంచి అనుపానంగా ఉంటుంది. అందుకే ఒక జాడీకి పచ్చిమిరపకాయలు వేసి దంచిన పచ్చడి పెడతారు. పచ్చి మిరపకాయలు వెయ్యని పచ్చడిని అవసరమున్నప్పుడు చిన్న గిన్నెలోకి తీసుకొని, మిరపకాయలు వేసి నూరుకొని తిరగమోత వేసుకుంటారు. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఎంతో రుచి.
తరువాత వారం చీకట్లో లేచి వడ్లు ఉడికించి, పని వాళ్ళతో దంపించి, అటుకులు తయారు చేశారు. వాటిని వడ్లు ఏరి, చెరిగి, చివరలో వచ్చిన రవ, పిండి తీసేసి ఎత్తి పెట్టుకున్నారు. ఇవి సంవత్సరం రోజులు వస్తాయి. అక్కడ చెంచు వాళ్ళు కూడా పనికి బాగా పలుకుతారు. అందువల్ల మామిడికాయ పచ్చడికి కారం, ఉప్పు, ఆవపిండి, మెంతి పిండి కూడా వాళ్ళతోనే దంపించి పెట్టుకుంటారు.
టొమోటోలు తెచ్చి, తరిగి ఎండబెట్టి, పచ్చడి చేశారు. పెద్ద, పెద్ద బుట్టల టొమాటోలు అందరూ కూర్చొని తరుగుతుంటే చూడ్డానికి ఏదో పెళ్ళికి పని చేస్తున్నట్లుండేది. మరి అందరికి పంపడానికి కావాలికదా! పండుమిరపకాయలు కడగడం, తొడిమెలు తీయడం పెద్దవాళ్ళే చేశారు. పిల్లలు ఆ చేతులు కళ్ళకు పూసుకుంటారేమోనని వాళ్ళను దగ్గరికి రానివ్వలేదు. చింతపండు వేసి ఆ పచ్చడి దంచుకున్నారు. రెండు పచ్చళ్ళనూ జాడీలకు ఎత్తిపెట్టి, తెల్లని పంచెబట్టను వాసెన కట్టి, దానిమీద జాడీ మూత పెట్టారు. చిన్న పురుగులు కూడా లోపలి వెళ్ళకుండా ఆ ఏర్పాటు చేస్తారు.
అలావాళ్ళు చింతకాయ, ఉసిరిక్కాయ, టమాటో, పండుమిరప పచ్చళ్ళు పెట్టుకున్నారు. హనుమావతమ్మ కూడా ఇక్కడే పచ్చళ్ళు, వడియాలు పెట్టుకునేది, తన సరుకులు తెచ్చుకొని. అందరి సలహాలు, సంప్రదింపులూ మధ్య సరదాగా పని చేసుకునేవాళ్ళు, అందరూ. డబ్బు సమస్య కాదు. అందరూ కలిసి సరదాగా మాట్లాడుకుంటూ ఉంటే, లేనిబలం కూడా వచ్చి ఎక్కువ పని చేసుకునే వాళ్ళు.
సంక్రాంతికి సుభద్రమ్మ ఇంటికి వచ్చిన కూతుళ్ళు, అల్లుళ్ళు, కొడుకులు, కోడళ్ళు, మనవలు, మనవరాళ్ళతో ఇల్లంతా సందడిగా వుంటుంది. హనుమావతి, పిల్లలు కూడా ఎక్కువగా ఇక్కడికేవచ్చి కలిసి మాట్లాడుతూ, ఆటలాడుతూ వుండేవాళ్ళు. పిల్లలందరూ ఇల్లు పీకి పందిరేసినట్లుగా చేసేవాళ్ళు. సుబ్బమ్మ, వేణు గోపాలరావు కొడుకు రాజా, సత్యం కొడుకు సూర్యం తాతగారికి వచ్చిన ఉత్తరాలను ఇంట్లో కడ్డీకి తగిలించినవి రోజూ తీసుకెళ్ళి హనుమావతి వాళ్ళింటి ఎదురుగా ఉన్న పోస్ట్ ఆఫీస్ బయట ఉండే పోస్ట్ బాక్స్ లోవేసి వచ్చేవాళ్ళు. ఆ పోస్ట్ మాన్ తాతయ్యతో, "అయ్యగారూ మీ ఇంటికి ఇచ్చిన పాత ఉత్తరాలను మళ్ళీ ఎవరో పోస్ట్ బాక్స్ లో వేస్తున్నారు. కొంచెం చూడండీ" అని మొరపెట్టుకునే వాడు. తాతగారు ‘వెధవల్లారా ఎవర్రా వేసిందీ’ అని పిల్లలను దండిస్తే వీళ్ళిద్దరూ నవ్వుకుంటూ ‘మేమే’ అని చెప్పేవాళ్ళు. బాల్యం ఎంత అపురూపం! పండుగకు వచ్చిన కూతుళ్ళకూ, సత్యం వాళ్ళకు తాము చేసిన నాలుగు పచ్చళ్ళతో పాటు చట్నీపొడి, కరివేపాకు పొడులు కూడా పెట్టి పంపించేది సుభద్రమ్మ.
ఆ పోస్టాఫీసు లోనే పోస్ట్ మాస్టర్ గారి కుటుంబం కూడా వుండేది. వాళ్ళింట్లో నలుగురు ఆడపిల్లలు. అందరూ డిగ్రీలు చదువుతున్నారు. హనుమావతి వాళ్ళతో బాగా స్నేహంగా వుంటూ వారపత్రికలు చదువుకుంటూ వుండేది. ఆదివారం రోజు వెళ్ళి పోస్ట్ ఆఫీస్ లో చిత్తు పేపర్ల మీద డేట్ ముద్రలు వేస్తూ, టెలిగ్రాఫ్ మిషన్ తో శైలజ, రాణి ఆటలాడుతూ వుండేవాళ్ళు. అవి ముట్టుకోకూడదని తెలియని అపురూప బాల్యమది.
హనమావతమ్మ నిత్య నైవేద్యం పెట్టేది. ఎండాకాలం లో ఇంట్లో బావిలో నీళ్ళు అయిపోతాయి అప్పుడు పోస్ట్ ఆఫీస్ కు కొంచెం అవతలగా పెద్ద చేదు డు బావి వుండేది. అక్కడి నుండి వీధిలో తడి చీరతో మడి నీళ్ళు తెచ్చుకోలేక హనుమావతమ్మా రాణీ, అజయ్ లకు చిన్న చిన్న బిందెలు ఇచ్చి, తను నీళ్ళు బకెట్ తో తోడి ఇచ్చి, తాడుతో బకెట్ ను బయటికి తీసి కిండపెడ్తే, ఆ పిల్లలు ఇద్దరూ ఆ నీళ్ళు చిన్న బిందెలల్లో పోసుకొని పూజకు తెచ్చి ఇచ్చేవాళ్ళు.
ఒకరోజు ఉదయాన్నే తాతగారి దగ్గరకు రామయ్యగారు ఆత్మకూరు పక్కన ఉండే కరివెన గ్రామం నుండి వచ్చారు. ఇద్దరూ మంచి స్నేహితులు. రామయ్య గారు మంచి ఆస్తిపరులు. రామయ్య, లక్ష్మీ నరసింహం, శివయ్య వీళ్ళు ముగ్గురూ, మనకు స్వాతంత్య్రం రాకముందు నుంచీ, తమ స్వంత డబ్బులే కాక, ఆత్మకూరు, నందికొట్కూరు, నంద్యాల కర్నూల్ మొదలైన ఊర్ల నుంచీ చందాలు వసూలుచేసి, మొదట శివరాత్రి పూజల కోసం శ్రీశైలం కు ఆత్మకూరు, పెద్దచెరువు, భీమునికొలువు ద్వారా నడిచి వెళ్ళే బ్రాహ్మణ యాత్రికులకు ఉచిత భోజన వసతి కల్పించేవారు. క్రమంగా కరివెన అన్నదాన సత్రం అనే పేరు తో శ్రీశైలం లో శివరాత్రి మూడు రోజులు భోజనం పెట్టేవారు. రామయ్య తాత పిల్లల చేత శివ పంచాక్షరీ పలికించారు 'ఓం నమః శివాయ' అని. రామయ్య తాత తో రామ్మూర్తి "మామా, ఇప్పుడు బస్సులు వచ్చాయి కాబట్టి, పూర్వం లాగా మీకు సరుకులు బండ్లల్లో తీసుపోయే కష్టం తప్పింది కదా, " అన్నాడు. "అవున్రా ఆహారపు మూటలు బియ్యం, పప్పు అన్నీ ఎడ్లబండ్ల మీద తీసుకెళ్ళే వాళ్ళము. భీముని చెరువు నుంచీ బండ్లు పోలేకుంటే, చెంచు వాళ్ళు మూటలు మోసేవాళ్ళు. ఇప్పుడు బస్సులోచ్చాయి కనుక ఆ ఇబ్బంది లేదు, " అన్నాడు. ( ఇవే కరివెన బ్రాహ్మణసత్రాలు. ఇప్పుడు దేశం లో ముఖ్య పుణ్య క్షేత్రాలలో పని చేస్తున్నాయి.)
ఆ రోజు ఉదయాన్నే హానుమావతి రామ్మూర్తి తో "మా బావిలో కొత్త మైసూర్ శాండల్ సబ్బు పడింది, తీస్తావా!" అని అడిగింది. అది విని "సుభద్రమ్మ ఎందుకు తియ్యడూ, మా ఇంట్లో స్పూన్లు, గరిటెలు వాడే బావిలో పడేసి, శశి బావిలో పడేసింది, తియ్యడానికి దిగుతున్నాను అని నిన్న మా బావిలో దిగి ఒక అరగంట సేపు ఈత కొట్టి వచ్చాడు, " అంది ఈత కొట్టడానికి బావిలో దిగుతాడులే అన్నట్లు.
హనుమావతి తో పాటు రామ్మూర్తి కూడా నవ్వి, "తీస్తాను. పదక్కా, " అన్నాడు. బావిలోదిగి చూస్తే, . ఎప్పుడెప్పుడో వేసిన కాఫీ గ్లాసు, చిన్న ప్లేట్ లాంటివన్నీ కాకులు, కోతులు ఎత్తుకొచ్చి వేసినవన్నీ దొరికాయి.
శశి సుభద్రమ్మ చెల్లెలు దగ్గర ఇందిరేశ్వరం లో ఉండి, రోజూ వాళ్ళ పిల్లలతో పాటు మళ్ళీ ఆత్మకూరు కు వచ్చి చదువుకుంటూ వుండేది. రాణి, శశి ఒకటే తరగతి. సెక్షన్ లు వేరు. ఆ వూరు నుండి ఆత్మకూరు ఒకటిన్నర కిలోమీటర్ ఉండేది. పిల్లలు సంతోషంగా, దారివెంట పంటల టైం లో కంది కాయలు, దోసకాయలు మొదలైనవి కోసుకొని తింటూ వెళ్ళేవాళ్ళు. వర్షాకాలం లో వల్ల పిల్లలు కూడా ఆత్మకూరు లోనే శశి వాళ్ళ ఇంట్లోనే రెండు మూడు రోజులు ఉందిపోయ్యే వాళ్ళు. వాళ్ళ చిన్నాన్న గారు టీచర్ గా పనిచేస్తూ ఉండేవారు. అందువల్ల భయంగా చదువుతుందని అక్కడ వదిలారు. మళ్ళీ ఆత్మకూరు లో వీళ్ళ ఇంటి ముందునుంచే స్కూల్ కు వెళ్ళాలి. అప్పుడు పిల్లలందరూ శశి వాళ్ళ ఇంట్లోదూరి మంచి నీళ్ళు తాగి వెళ్ళేవాళ్ళు. అప్పుడు వాళ్ళకు ఏదో ఒక చిరు తిండి పెట్టేది సుభద్రమ్మ. చెల్లెలికి కూడా సుభద్రమ్మ ఒక సెలవు రోజు మగపిల్లలతో సైకిల్ లో పచ్చళ్ళ డబ్బాలు పంపిస్తూ వుండేది.
ఒకరోజు రాణీ, శశి స్కూల్ కు వెళ్ళారు. రాణికి కొంచెం ఒళ్ళు వెచ్చ చేసి వుంది. స్కూల్ కు వెళ్ళేటప్పుడు మాత్ర ఇద్దామని అనుకొన్న హానుమావతమ్మకు, రాణి వెళ్ళిన తరువాత మాత్ర ఇవ్వలేదని గుర్తొచ్చింది. మళ్ళీ జ్వరం పెరుగుతుండెమోనని, స్కూల్ పక్కవీధి లోనే కనుక రామ సుబ్బారావు ఆఫీస్ కు వెళ్ళేటప్పుడు ఇచ్చి వెళ్ళమంది, హనుమావతమ్మ. సరే నని మాత్ర తీసుకొని స్కూల్ కు వెళ్ళాడు, రామసుబ్బారావు. అక్కడ అటెండర్ ను ఏడవ తరగతిలో రాణీ ఉంది, పిలవమన్నాడు. అతను క్లాస్ లో కనుక్కొని వచ్చి 'రాణీ అనే పేరుగల వాళ్ళెవరూ క్లాస్ లో లేరంట' అని చెప్పాడు.
రామ సుబ్బారావు వెంటనే ఇంటికి వచ్చి, "రాణీ స్కూల్ లో లేదు, "అని గాభరాగా చెప్పాడు.
"లేదా, అయ్యో జ్వరమెలాగుందో? " అనుకుంటూ… ఏదో గుర్తొచ్చి "స్కూల్ లో ఏమని అడిగారు?" అంది.
"రాణీనీ పిలవమన్నాను, " అన్నాడు.
హానుమావతమ్మా నవ్వింది. పూర్తి పేరు కే.ఆర్. మైత్రేయి కనుక స్కూల్ లో మైత్రేయి అనే పిలుస్తారు. రాణీ అంటే తెలియదు," అంది.
"అవును కదా! కంగారులో నేను మరిచిపోయాను. అందువల్ల భయపడ్డాను, " అంటూ మళ్ళీ వెళ్ళి 'మైత్రేయి' అని అడిగి మాత్ర ఇచ్చి వచ్చాడు. జరిగింది తెలిసి సాయంత్రం పిల్లలందరూ నవ్వుకున్నారు.
శశి వాళ్ళ పిన్నమ్మ కొడుకు నరసింహులు కు ఉద్యోగం రాగానే ఆత్మకూరు పక్కనే ఉన్న ( నల్ల కలువ) నల్లకాలువ నరసింహ స్వామి గుళ్ళో పెళ్ళికి అందరూ ఎద్దుల బండిలో వెళ్ళి అక్కడ గుళ్ళో ఆ రాత్రికి ఉండి తెల్లవారి పెళ్ళయిన తరువాత సాయంత్రం ఆత్మకూరు కు వచ్చారు. దారిలో వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు పిల్లలు కొంతమంది బండి దిగి సరదాగా నడిచి వచ్చారు. పెళ్ళి లో చిన్న సుభద్రమ్మ పెళ్ళికి వచ్చిన దంపతుల నందరినీ వరుపాటల ద్వారా సరదాగా ఎగతాళి చేస్తుండేది.
సెలవులల్లో శశి, శైలజ, రాణి చిన్న బారకట్ట ఆడుకుంటూ ఉంటే, సుభద్రమ్మ, హనుమావతి, నాగమణి, కోటేశ్వరమ్మ, పెద్ద బారకట్ట ఆడుకునేవాళ్ళు మధ్యాహ్నం. రామ్మూర్తి, విజయుడు పులి, మేక ఆట ఆడేవాళ్ళు. సుబ్బమ్మ, ప్రమీల వాళ్ళ పిల్లలను చూసుకుంటూ ఏదో ఒక ఆటలో జాయిన్ అయ్యేవాళ్ళు. సినిమా కెళ్తే మగవాళ్ళు తలాఒకసారి వెళ్ళే వాళ్ళు. ఆడవాళ్ళు మాత్రం ఒక జట్టుగా వెళ్ళేవాళ్ళు, అదీ నేల టిక్కెట్టుకు. తలా ఒక బెడ్ షీట్ తీసుకెళ్ళి, ఇసుకలో పరుచుకొని కూర్చునేవాళ్ళు. మధ్యలో వేరుశెనక్కాయలు కొనుక్కొని తింటూ సినిమా హాయిగా చూసేవాళ్ళు.
అందరూ రోడ్ లో నడిచే పొయ్యేవాళ్ళు, నడిచే వచ్చే వాళ్ళు. ఎప్పుడో ఊరికి వెళ్ళేటప్పుడు తప్ప రిక్షా ఎక్కే వాళ్ళు కాదు. ఒక సినిమా హాలు వీళ్ళ ఇళ్ళకు నాలుగు వీధుల వెనుక వుండేది. వీళ్ళు రాత్రి భోజనాలు చేసి, పడుకోవడానికి పక్కలు తీసుకొని మిద్దేమీద పరుచుకు నేసరికి సెకండ్ షో మొదలై సినిమా మొత్తం వీళ్ళకు బాగా వినపడ్తూ వుండేది. ఒక్కో సినిమా అయితే అందరికీ డైలాగులు బాగా నోటికొచ్చేవి.
ఒకరోజు ప్రేమనగర్ లో నాగేశ్వరరావు, వాణిశ్రీ మాటలు వస్తూవుంటే, వింటూన్న నాగమణి నాగేశ్వరరావు లాగా వాళ్ళింట్లో జరిగిన దొంగతనం గురించి అడిగినట్లుగా 'లతా ఎందుకు చేశావీ పని?"అంది.
వెంటనే కుమారి, వాణిశ్రీ లాగా "బాబుగారూ మీరు కూడానా?" అంది.
అన్నీ వింటూన్న సుభద్రమ్మ "చాలు గానీ నోరు మూసుకొని పడుకోండి. ఉదయాన్నే శుక్రవారం ఇల్లు తుడిచే పనివుంది, " అనగానే వాళ్ళు సైలెంట్ అయ్యారు. అన్నీ వింటున్న పిల్లలందరూ పకపకా నవ్వారు.
ఇంకా సంవత్సరానికి సరిపడా బియ్యం బస్తాలు కొనుక్కొని అవి చెరిగి, రాళ్ళు లేకుండా చేసి పెట్టుకునే వాళ్ళు. కంది పప్పు కూడా పక్కనున్న ఇందిరేశ్వరం నుంచి సుభద్రమ్మ వాళ్ళు నాలుగు బస్తాలు హానుమావతమ్మ రెండు బస్తాలు తె ప్పించుకున్నారు. పడమటి సీమ కదా. రోజు పప్పు చేసుకుంటారు. అందువల్ల ఎక్కువగానే ఖర్చవుతాయి. అలా వాళ్ళు పని చేసుకునేటప్పుడు రాజ్యమ్మ కానీ, కుమారి కానీ ఎదో ఒక సినిమా కథ చెప్పడమో లేదా యద్దనపూడి సులోచనా రాణి, మాదిరెడ్డి సులోచన రాణి లాంటి వారి నవలలను చదివి, వినిపిస్తూ ఉండటమే చేస్తుండే వాళ్ళు. అవి వింటూ వాళ్ళు సీరియస్ గా పని చేసుకుంటూ వుండేవాళ్ళు. ఆ టైం లో ఆ ఇల్లంతా ఒక సినిమా హాల్ లాగే ఉండేది. ఎవరూ మాట్లాడేవాళ్ళు కాదు. చదివే వాళ్ళు చక్కగా చదువుతూ వుండేవాళ్ళు.
ఇంకా పూర్తిగా ఎండాకాలం రాకముందే బావుల్లో ఉన్న నీళ్ళు తగ్గాయి. హనుమావతి, నాగమణి విడిచిన బట్టలు తీసుకెళ్ళి వాళ్ళ వెనుక వీధి నుంచి అర ఫర్లాంగు దూరం లో ఉన్న భవనాసి వాగు లో పిండుకొని వచ్చేవాళ్ళు. ఒకసారి ఎండాకాలం ఆ వాగుకూడా ఎండిపోయింది. అప్పుడు బిందెలు తీసుకొని ఆ వాగుకూడా దాటి, పక్కన తోటలో ఉన్నమంచి నీళ్ళ బావి లో నీళ్ళు తెచ్చేవాళ్ళు.
శ్రీరామ నవమి పండుగకు రామాలయం లో భోజనాలకు చెంబుతో ఇంటినుంచి మంచి నీళ్ళు తీసుకెళ్ళే వాళ్ళు. భోజనం అవగానే అందరికీ తలా ఒక రూపాయి ఇచ్చేవారు. ఒకసారి ఇంకెవరైనా భోజనాలు ఏర్పాటు చేస్తే బంగారు రంగులో ఉన్న ఇరవై పైసల బిళ్ళలు ఇచ్చారు అందరికీ. ఆ రోజు రాత్రి ఆడవాళ్ళందరూ ఒకచోట చేరి 'ఆ ఇరవై పైసలల్లో బంగారు ఉందట, పక్క వీధిలో పార్వతమ్మ ఉంగరం, ముక్కు పుడక చేయించుకొనిందట ' అని మాట్లాడుతూ వుంటే విని, 'అలా పిచ్చి పనులు చెయ్యొద్దు మీరు, ' అని తాత కోప్పడగానే అందరూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళారు, నవ్వుకుంటూ.
ఉగాది దాటి, శ్రీరామ నవమి వెళ్ళి, పిల్లలకు సంవత్సరం పరీక్షలు జరిగే సమయమొచ్చింది. ఆరోజు సాయంత్రం పద్మావతమ్మ … హనుమావతమ్మా వాళ్ళింట్లో కాఫీ తాగుతూ, ”పిల్లల పరీక్షలైపోయిన తరువాత వడియాల పనులు మొదలు పెట్టుకుందాములేవే. మనం పొద్దున్నే వడియాలు పెట్టేసి వస్తే, వాళ్ళు మిద్దెల మీద కోతులు, కాకులు రాకుండా కాపలా ఉంటారు, ” అనింది.
“అవునత్తా, పిన్నమ్మా, నేను అదే అనుకుంటూ ఉన్నాము, ” హనుమావతి జొన్న రొట్టెకోసం నూరిన ఉల్లి గడ్డ కారం పెన్నం మీద నూనె వేసి వేయించుతూ. అలా చేస్తే కారం తగ్గి, పిల్లలు బాగా తింటారు.
పద్మావతమ్మకు చిన్నప్పుడే భర్త చనిపోయాడు. సుభద్రమ్మా వాళ్ళ ఇంటి వరుసలో ఉన్న నాలుగు పెద్ద పెద్ద ఇండ్లు వాళ్ళవే. ఒక్కతే ఇల్లు సమర్ధించుకుంటూ వస్తోంది. ఆమె చిన్నప్పటినుంచీ ఆమెను పిల్లలు పెద్దలు అందరూ ‘అత్తా’ అనే పిలవడం అలవాటై పోయింది. ఆమెకు ఒక్కడే కొడుకు. ఇంకా చదువుకుంటూ వున్నాడు.
“కాపలా కాయడానికేనా అత్తా మేముండేది? మాకేంటి లాభం?” అన్నాడు హాల్ లో ఒకమూల కూర్చొని తొమ్మిదో తరగతి పరీక్షలకు చదువుకుంటూ ఉన్న విజయుడు.
“అందరికీ సినిమా చూడటానికి డబ్బులిస్తాం లే విజయుడూ, ” అని సుభద్రమ్మ తరఫున కుడా ఆమే మాట ఇచ్చేసింది. ఇంటి ఓనర్ అనే అహంకారం లేకుండా ఆమె అందరితో కలిసి పోతూ ఉండేది. అందుకని ఎవరూ ఆమె మాట కాదనే వారు కాదు. ఆమె చెప్పేది కూడా సమంజసంగానే అనిపించేది.
“అట్లయితే సరేలేత్తా, ” అంటూ మూడవ తరగతి చదువుతున్న తమ్ముడు అజయుడికి నోట్ బుక్, పెన్ ఇచ్చి బొమ్మలు గీసుకొమ్మని అవతలికి పంపించాడు, తాను చదువు కోవడానికి పుస్తకం తీసుకుంటూ, విజయుడు. రాణి, అజయ్ లకు పరీక్షలైపోయి సెలవులిచ్చేశారు. శైలజ శశి వాళ్ళింట్లో చదువుకుంటూ వుంది. శశి, రాణి ఇద్దరూ సోఫాలో ఉండే అరుగుల మీద కూర్చొని వామనగుంటలు ఆడుకుంటూ ఉన్నారు. రామ సుబ్బారావు నాగేశ్వరరావు అభిమాని. ఇద్దరుమిత్రులు సినిమా చూసి కొడుకులిద్దరికీ అజయ్, విజయ్ అని పేర్లు పెట్టుకున్నాడు.
సెలవులు రానేవచ్చాయి. ముందు మినప్పప్పు వడియాలు పెట్టారు. పెద్దవాళ్ళు చిన్న మినప్పప్పు ముద్దను తీసుకొని పూరీ లాగా వట్టి ఇస్తూ ఉంటే, పెద్ద పిల్లలు అవి ఎండలో పెట్టి వచ్చారు. అవి నాలుగు రోజులు బాగా ఎండాయి.
పేలాల వడియాల కోసం పెద్దవాళ్ళు వడ్లు వేయించి, బస్తాల కొద్దీ పేలాలు చేశారు. ఆ పేలాలకు అక్కడక్కడా వడ్లు అంటుకొని ఉండేవి. అవన్నీ ఏరి పెట్టడం పిల్ల పని. చివరలో వచ్చే వడ్లు కుడా తీసేయ్యాలి.
“ఒక్కో బుట్ట పేలాలకు ఐదు పైసలు ఇస్తా, ”మంది రాజ్యమ్మ.
ఇక పిల్లలు ఒక్కొక్కరూ బుట్టల కొద్దీ పేలాలు తీసుకొని, తలా ఒక మూల కూర్చొనివరుసగా మూడు నాలుగు రోజులు ఏరిపెట్టేవాళ్ళు. ఆ పేలాలు నీళ్ళల్లో నానబెట్టి తీసి, పచ్చిమిరపకాయలు ఉప్పు నూరి కలిపి ముద్దగా పిడికిలితో పెట్టే వాళ్లు. అవి చాలా రుచిగా ఉండేవి. కానీ చాలా శ్రమతో కూడినపని. అయినా ఓపిగ్గా చేసుకునేవాళ్ళు.
===================================================================
ఇంకా ఉంది...
============================================================
కే. లక్ష్మీ శైలజ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
Podcast Link:
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం : నా పేరు K. లక్ష్మీ శైలజ.
నెల్లూరు లో ఉంటాను.
నేను ఎం. ఏ. ఎం.ఫిల్ చేశాను.
ఇప్పటి వరకు 40 కథలు , పది కవితలు ప్రచురితమైనవి.
జూన్ 2022 న తానా గేయతరంగాలు లో గేయం రచించి పాడటమైనది.
యూట్యూబ్ లో కథలు చదవడం ఇష్టం.
Comments