top of page
Writer's pictureKaranam Lakshmi Sailaja

కలసి ఉంటే కలదు సుఖము 3



'Kalasi Unte Kaladu Sukham 3' New Telugu Web Series

Written By K. Lakshmi Sailaja

'కలసి ఉంటే కలదు సుఖము 3' తెలుగు పెద్ద కథ

రచన, కథా పఠనం : కే. లక్ష్మీ శైలజ


పెద్ద కథ 3/3

“ఏమత్తా, మాకు అన్నం పెట్టేదుందా, లేదా?” అనేవాడు వీళ్ళ పనులు చూసి రామసుబ్బారావు.


“రాముడూ, ఈ నాలుగు రోజులూ అందరికీ ఇక్కడే భోజనాలు, ” అనేది సుభద్రమ్మ.


“హైమా, మరి మాకు టిఫన్ అయినా చేసి పెడతావా?” అన్నాడు రామసుబ్బారావు.


“అలాగే..చేస్తాను” అన్నది హనుమావతి. హనుమావతి పేరును పెళ్ళిలో రామసుబ్బారావు వాళ్ళు హైమావతి అని మార్చుకున్నారు.


ఒకాదివారం రోజు స్కూల్ గ్రౌండ్ కు వెళ్ళి రామ్మూర్తికి, విజయ్ కూ ఫుట్ బాల్ నేర్పించాడు, రామ సుబ్బారావు. రామసుబ్బారావు మంచి ఫుట్బాల్ ప్లేయర్. వాళ్ళ నాన్న పేరు మీద ట్రోఫీ కూడా పెట్టారు. "నువ్వు బలే ఆడావు బావా!" రామ్మూర్తి అడ్మైరింగ్ గా చూశాడు, రామసుబ్బారావు వైపు. ఆడపిల్లలకు కొద్దిరోజులు బాడుగ సైకిల్ కూడా నేర్పించాడు, రామ సుబ్బారావు. ఆ స్ఫూర్తి తోనే నేమో రాణీ ' కోకో ' ఆటలో స్కూల్ తరఫున కర్నూల్ వెళ్ళి ఆడి వచ్చింది.


పేలాలు, బియ్యంపిండి వడియాలప్పుడయితే అటు హనుమవతమ్మ ఇంట్లోనూ, ఇటు సుభద్రమ్మ ఇంట్లోనూ సందడే సందడి. ఆడవాళ్లు తెల్లవారు ఝామున నాలుగు గంటలకే లేచి, స్నానాలు చేసి పెద్ద గంగాళాలకు పిండి ఉడికించే వాళ్ళు. వాటిని స్పూన్ తోనూ, కారాల చిట్లతోనూ పెట్టేవాళ్ళు. అలా పెట్టడం కోసం నేత చీరలు, పంచెలు వాడనివి ముందు రోజు తీసి రెడీగా పెట్టుకునే వాళ్ళు. ఉదయాన్నే రాంమూర్తి బావిలో నీళ్లు తోడిపెడితే..... కుమారి, రాజ్యమ్మ ఆ చీరలు, పంచెలు పిండి పెట్టేవాళ్ళు. ఎండాకాలం అందరూ రాత్రి పూట మిద్దెలమీద నులక మంచాలు వేసుకొని దోమతెరలు కట్టుకొని పడుకునే వాళ్ళు కాబట్టి, ఆ మంచాల మీద ఈ తడి బట్టలు పరిచి ఉంచేవాళ్ళు. చెక్క నిచ్చెనలు అందరూ చక్కగా ఎక్కే వాళ్ళు, ఒక చేతిలో కొంచెం వేడిగా ఉన్న పిండి గిన్నెలు కూడా పట్టుకొని. మట్టి మిద్దెలయినా ఎవరూ ఫీలయ్యే వాళ్ళు కాదు. హాయిగా కిందనే కూర్చునే వాళ్ళు.


“అమ్మా, నేనూ వడియాలు పెడతా, ” అని పేలాల వడియాలు పెడ్తున్న హనుమావతమ్మను బ్రతిమిలాడుతోంది, శైలజ. “ఇవి నీకు సరిగా రావు గానీ, బయ్యం పిండి వడియాలు పెడుదువులే, ” అని అనునయంగా చెప్పింది హనుమావతమ్మ.


“పిల్లలందరూ ఇక్కడ రండీ, ” అని పిలిచి సుబ్బమ్మ బియ్యంపిండి వడియాల రోజు ఒక చిన్న చాప మీద పంచ పరిచి, చిన్న పిల్లలను దానిమీద స్పూన్ తో పెట్టుకోమన్నది. చిన్నపిల్లలు సంతోషంగా ఆ పంచ చుట్టూరు చేరి వడియాలు పెట్టారు, సుబ్బమ్మ ఆధ్వర్యంలో. అందరూ పెడు తున్నారు నేను కూడా పెట్టాలని, వాళ్ళమధ్యలోకి వెళ్ళి రెండు సార్లు పిల్లలు వడియాలు పెట్టిన ఆ పంచ మీద జారీ, వడియాల పిండి వళ్ళంతా పూసుకున్నాడు, ప్రమీల, సుబ్బారావు ల రెండు సంవత్సరాల కొడుకు బాబు. అది చూసి ముందు ‘అయ్యో, ’, అని అరిచేసినా, తరువాత అందరూ పడీ పడీ నవ్వారు. వడియాలు పెట్టడం అయిన తరువాత, గిన్నెలో అడుగున ఉన్న కొంచెం గట్టిగా, కొంచెం మాడినట్లున్న పిండిని అందరూ ఇష్టంగా తలా పిడికెడు తిన్నారు.


మధ్యలో ఒకరోజు రాత్రి రెండు కిలోల గోధుమ పిండి తడిపి చపాతీలు చేశారు అందరికీ. పెద్దవాళ్ళు పిండి తడిపితే, మిగతావాళ్ళు ఒకరు ఉండలు చేస్తే, ఒకరు రౌండ్ గా రేకు వత్తిస్తే, ఒకరు ఆ రేకును చిన్న త్రికోణంగా వత్తిస్తే, ఇంకొకరు ఆ త్రికోణాన్ని పెద్ద త్రికోణంగా వత్తిస్తే ఇంకొకరు ఆ చపాతీలను నూనె వేసి కాల్చారు. అలా అందరూ కలిసి చపాతీలు చేశారు.


'పిల్లలకు సెలవులు ఇచ్చారు, నువ్వు కూడా ఇక్కడికే రమ్మని వాళ్ళమ్మకు ఉత్తరం వ్రాశాడు, రామ సుబ్బారావు. నంద్యాల దగ్గర కోడూరు నుంచి పొలం వ్యవహారాలు అన్నీ కూడా పూర్తయ్యాయి కనుక శేషమ్మ కూడా వచ్చింది. నానమ్మ చెప్పే భట్టి విక్రమార్క కథలు, రాజుగారికి వీపున రాచ పండు రావడం లాంటి కథలంటే పిల్లలకూ చాలా ఇష్టం.


చైత్ర పూర్ణిమ రోజు రాత్రి సుబ్బమ్మ, ప్రమీల పిల్లలందరికీ అన్నంలో చింతచిగురు గట్టిపప్పులో నెయ్యి వేసి ముద్దలు కలిపి పెట్టారు. ఉప్పు మిరప కాయలు వేయించారు. ఆ రోజు పిల్లలు రోజూ తినేదాని కంటే ఒక ముద్ద ఎక్కువే తిన్నారు. హనుమావతమ్మ వాళ్ళింట్లో వండిన ఒక పడి కంచుతపిలెడు అన్నం కూడా ఇక్కడికే తెచ్చేసింది.


ఆ తెల్లవారి బొరుగులు నానబెట్టి ఉగ్గాని చేసి, మిరపకాయ బజ్జి చేసింది, హనుమావతి. కర్నూల్ జిల్లాలో ఈ టిఫెన్ బాగా ఇష్టపడతారు. శశి వాళ్ళకు కూడా అవి ఇచ్చి పంపారు. సుభద్రమ్మ తో "మా కోడలు వంటలు బాగా చేస్తుంది" అని కోడలు హనుమావతి ఎదుగానే కోడలిని మెచ్చుకుంది, శేషమ్మ.


ఒకరోజు అందరూ కన్యకా పరమేశ్వరి ఆలయం చూసి వచ్చారు. అమ్మవారు చాలా బాగుంది. చాలా పెద్ద గుడి.


ఒకరోజు బియ్యంపిండి వడియాలు చుట్టలు చుట్టలుగా ఎంతో ముచ్చటగా పెట్టారు. దాదాపు రోజూ ఒక పది మంచాలకు ఒక నాలుగు రోజులు పెట్టేవాళ్ళు. అలా పెట్టిన వడియాలను రెండురోజుల తరువాత సాయంత్రం పూట వలవాలి. ఆ చీరలు, పంచలు వెనుకవైపు కొంచెం నీళ్ళు ఉంచితే చల్లి ఒక పది నిముషాల తరువాత ఆ వడియాలు ఆ బట్ట నుంచి సులభంగా వదిలి వస్తుంది. అందుకని ఒక్కో పంచ చుట్టూరు నలుగురు కూర్చొని వాటిని వలిచి చాటలల్లో లేదా స్తాంబాణాలల్లోపెడుతుంటే, ఇంకో ఇద్దరు ఆ వడియాలు తీసుకెళ్ళివాటిని హాల్ లో ఒక వారగా చాపల మీద వరుసగా ఆరబెట్టి వస్తున్నారు. హాలు చాలా పెద్దగా, రెండు వరుసలల్లో ఆరు నల్లటి పెద్దపెద్ద స్తంభాలతో ఉంటుంది.


పిల్లలకు వలిచిన ఒక్కోవడియాల చీరకు కొంత డబ్బులిస్తామన్నారు. కాబట్టి పిల్లలు గబగబా తియ్యడం చూసి పద్మావతమ్మ, “వడియాలు విరిగితే, మీకు ఇచ్చే డబ్బులు తగ్గిచ్చేస్తాము. బాగా విరగకుండా తీస్తే సినిమా చూడటానికి డబ్బులిస్తాము, ” అనింది. దాంతో మళ్ళీ నెమ్మదిగా తీస్తున్నారు పిల్లలు. అలా వడియాలు వలిచేటప్పుడు ఒక్కోరోజు ఎవరో ఒకరు వాళ్ళు చూసిన ఒక సినిమా కథను చెప్పడమూ లేదా రేడియోలో ఒక ‘సినిమా కథ’ ఒక గంట వచ్చేది, అది వినడమూ చేసేవాళ్ళు. ఆ రోజు అందరూ చూసిన సినిమానే అయినా ‘కృష్ణవేణి' సినిమా చెప్పింది, రాజ్యమ్మ. పెద్దవాళ్ళందరూ వాణిశ్రీ యాక్షన్ గురించి బాగా చేసిందని మాట్లాడుకున్నారు.


“అక్కా, మా ఇంటి దగ్గర ఒకామె పాపం బీదవాళ్ళు. కష్టపడి బియ్యం కొనుక్కొని వడియాలు పెడుతుంటే, బాగా వర్షం పడి అన్నీ చెడి పొయ్యాయి, ”అనింది ప్రమీల.


“ అయ్యో పాపం. దరిద్రుడు తల కడిగితే వడగళ్ళ వాన అంటే ఇదే, ” అన్నది సుభద్రమ్మ.


“అందుకే వడియాలు వైశాఖమాసంలోనే పెట్టేసుకోవాలి. జ్యేష్టమాసం లో గాలి వీస్తుంది. వర్షం కూడా రావచ్చు, ” అంది మళ్ళీ.


ఆ వలిచిన వడియాలు ఎండేంతవరకూ వాటికీ కాపలాగా ఎక్కువగా మగపిల్లలుండేవాళ్ళు. ఆడపిల్లలు కోతులకు భయపడతారని. వాళ్ళు రేకు కుర్చీలు మిద్దెమీదకు తీసుకెళ్ళి కూర్చునేవాళ్ళు. వాళ్లకు మంచినీళ్ళ చెంబులు, కారాలు, కజ్జికాయలు, అరిసెలు చిన్న పిల్లలు సప్లై చేసేవాళ్ళు. దోమతెర కఱ్ఱలు చేతబట్టుకొని కోతులు, కాకులు రాకుండా చూసేవాళ్ళు. మరీ ఎప్పుడూ ఎండలోనే ఉంటే, ఎండదెబ్బ తగులుతుందని బేడీషీట్స్, మూడు కర్రలకు కట్టి గుడారాలు ఏర్పాటు చేసుకునేవాళ్ళు. ఆకోతులుకూడా వీళ్ళు ఎప్పుడు వెనక్కు తిరుగుతారో, అప్పుడు దూకుదామని రెడీగా చూస్తుండేవి. వీళ్ళు కొంచెం ఏమారితేచాలు పరుగున వచ్చి అందినన్ని వడియాలు తీసుకెళ్ళేవి. అందుకని వీళ్ళు జాగర్తగా గమనిస్తూ ఉంటారు.


విజయుడు, రామ్మూర్తి ఆంధ్రప్రభ, ఆంద్ర పత్రిక తీసుకొని మిద్దె పైకి వెళుతుంటే, “మీరు తల వంచుకొని చదువుకుంటూ ఉంటే, కోతులు వడియాలు భోజనం చేస్తాయి చూసుకోండి, ” అనింది శశి.


అలా ఒక వారం రోజులు అన్ని వడియాలు ఎండిన తర్వాత అన్నీ పెద్ద పెద్ద రేకు డబ్బాల లో న్యూస్ పేపర్లు లోపల వేసి అందులో వడియాలు ఎత్తిపెట్టారు. రెండు పెద్ద పెద్ద స్తాంబాణాలకు వడియాలు వేయించి పిల్లా, పెద్దా అందరికీ ఇచ్చింది, నాగమణి. పిల్లలు ఇంకా కావాలంటూ వున్నారు.


“ఈ వడియాలన్నీ సంవత్సరం రోజులు రావాలిరా, అన్నీ ఇప్పుడే తినకూడదు, ” అంది కామేశ్వరమ్మ ఇంకో రెండు వేస్తూ.


అందరూ వడియాలు ఆనందంగా తినగానే తాతగారు పిల్లలందరికీ సమానంగా డబ్బులిచ్చారు. ఆ డబ్బులు ఏం చేస్తారు అని అడిగితే, రాణి “ఎగ్జిబిషన్ కు వెళదాము” అనింది. శశి, శైలజ కూడా సరే నన్నారు.అందరూ ‘అది మంచి పని’ అన్నారు. శశి, రాణీ, శైలజల నిష్కల్మషమైన స్నేహం వికసించిన బంగారు రోజులవి.


ఆ వడియాలను కూడా కొడుకులకూ, కూతుళ్ళకూ, దగ్గరి బంధువులకూ అందరికీ పంచి ఆనందించింది సుభద్రమ్మ.


ఆ విధంగా ఎండాకాలం సెలవులంతా పెద్దలూ పిల్లలూ ‘కలిసి’ సద్వినియోగం చేసుకున్నారు.


***సమాప్తం***

( ఈ కథ 1972 నుండి 1975 వరకు నిజంగా జరిగిన సంఘటనల సమాహారం నా బాల్యం. నా బంధువులు ఈ కథ చదివి బాల్యం గుర్తు చేసుకొని సంతోషపడతారనీ పేర్లు కూడా మార్చలేదు. మా పెద్దలందరినీ వరుసలతో కాకుండా పేర్లతో వ్రాసినందుకు ఈ లోకం లోనూ, పరలోకం లోనూ ఉన్న పెద్దలందరూ నన్ను క్షమించాలి🙏🙏🙏🙏)

కే. లక్ష్మీ శైలజ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

Podcast Link:

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం : నా పేరు K. లక్ష్మీ శైలజ.

నెల్లూరు లో ఉంటాను.

నేను ఎం. ఏ. ఎం.ఫిల్ చేశాను.

ఇప్పటి వరకు 40 కథలు , పది కవితలు ప్రచురితమైనవి.

జూన్ 2022 న తానా గేయతరంగాలు లో గేయం రచించి పాడటమైనది.

యూట్యూబ్ లో కథలు చదవడం ఇష్టం.


53 views0 comments

Comentarios


bottom of page