top of page

కలసి వుంటే కలదు సుఖం


'Kalasi Unte Kaladu Sukham' - New Telugu Story Written By Parupalli Ajay Kumar

'కలసి వుంటే కలదు సుఖం' తెలుగు కథ

రచన: పారుపల్లి అజయ్ కుమార్

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

"ఇద్దరమే మనమిద్దరమే.. ఇద్దరమే

కొల్లేటి కొలనులో కులికేటి అలలమై

వలపించే భావాల వెలలేని కలలమై

ఇద్దరమే మనమిద్దరమే.. ఇద్దరమే"


సీడీ ప్లేయర్ లో వినిపిస్తున్న పాత పాటను తన్మయత్వంగా వింటున్నాడు అనురాగ్.


ఆ పాట చివరిగా వచ్చే పదాలు


"పదిమంది కోసమే బతకాలి నీతిగా.. బతకాలి నీతిగా" చాలా ఇష్టం తనకు.


యుగళగీతంలో కూడా సమాజ శ్రేయస్సు కోసం పదాలను పొదిగిన మహాకవి శ్రీశ్రీ అంటే ఎనలేని ఇష్టం ..


"బాబూ పడుకున్నావా?" అంటూ లోపలికి వచ్చారు తల్లీ తండ్రి.


వారిని చూస్తూనే మంచం మీద పడుకున్న వాడల్లా లేచి మంచం మధ్యలో బాసింపట్టు వేసి కూర్చున్నాడు.


"ఏంటమ్మా మీరింకా నిద్రపోలేదా? అమ్మమ్మ పడుకుందా?" అడిగాడు తల్లిని.


"రోజూ పెందలకడనే తిని పడుకుంటుంది. ఎక్కువ ఓపిక వుండటం లేదు. వయసయి పోతున్నదిగా. అమృత వచ్చినప్పుడల్లా అమ్మమ్మకోసమని విటమిన్ టాబిలెట్స్, బలానికి టానిక్స్ తెచ్చి ఇచ్చి పోతూనే ఉంటుంది." అంది శారద.


"నువ్వు అమెరికా నుండి రాగానే పెళ్లి చూపుల కొస్తామని ఇద్దరికీ మాటిచ్చాను. రేపే పెళ్లిచూపులు. నువ్వు వేరే ప్రోగ్రాములు ఏమి పెట్టుకోకు. అది చెబుదామని వచ్చాము" తండ్రి అశోక్ అన్నాడు.


"ఓకే నాన్నా. వూళ్ళోనేగా వెళదాం."


"ఒకరు హోటల్లో ఏర్పాటు చేస్తామని చెప్పారు, మరొకరు ఇంట్లో ఏర్పాటు చేస్తామని చెప్పారు."


"హోటల్లో వద్దు నాన్నా. ఇంటికి వెళితే బాగుంటుంది. అందరినీ చూడవచ్చు. ఇంటినీ చూడవచ్చు. వారి ఇల్లు, పరిసరాలు చూస్తేనే మనకు విషయాలు పూర్తిగా అర్థం అవుతాయి.


నా సంగతులన్నీ చెప్పారా ?పెళ్ళి అయ్యాక నేను ఫారెన్ లో ఉండనని. నేను ఒక్క రూపాయి కూడా కట్నం క్రింద తీసుకోనని, పెళ్ళి కూడా హంగులు, ఆర్భాటాలతో వద్దని, పెళ్ళి ఖర్చులు రెండువైపుల వాళ్ళు కలసి భరించాలని, పెళ్ళయినా ఉమ్మడి కుటుంబానికే ప్రాధాన్యత అని,

ఇంకా ఇంకా.." తన షరతులు కొన్ని గుర్తుకురాక తల్లి వైపు చూసాడు.


తల్లి నవ్వింది కొడుకును మురిపెంగా చూస్తూ.


"మధ్యవర్తితో నీవన్నవన్నీ చెప్పాను. అతను వారికేం చెప్పాడో మరి. రేపు మాటల్లో మనమే చెపుదాం.

సరే, ముందు వారికి ఫోన్ చేసి చెపుతాను. ఇంట్లోనే ఏర్పాటుచేయాలని. ఇక పడుకో." తండ్రి అన్నాడు.


తల్లిదండ్రులు గది నుంచి బయటకు వెళ్లారు.


అశోక్ కు పెద్ద బజారులో వస్త్ర దుకాణాలు మూడు వున్నాయి. వ్యాపారంలో బాగానే సంపాదించాడు. భార్య శారద అతనికి అన్ని విషయాలలో చేదోడువాదోడుగా వుంటుంది.


నిరంతరము కుటుంబ బాగోగులు చూస్తూ బంధుమిత్రులను ప్రేమతో ఆదరించి పలకరిస్తూ మసులుకుంటుంది.


ఇద్దరు పిల్లలు, అనురాగ్, అమృత.


అనురాగ్ అమెరికాలో సాఫ్ట్ వేర్ జాబ్ లో ఉన్నాడు.


అమృత ప్రస్తుతం హౌస్సర్జన్ చేస్తున్నది. M. S. పూర్తి అయ్యాకనే పెళ్ళి అని చెప్పింది.


అనురాగ్ పెళ్ళి అయ్యేవరకూ అమెరికాలో జాబ్ చేస్తానని పెళ్లి అయ్యాక కొంత కాలానికి ఇండియా వచ్చేస్తానని అమెరికా వెళ్లే ముందే చెప్పాడు.


అమ్మ, నాన్నలతో కలసి ఉండటమే అతనికి ఇష్టం. మారుతున్న సమాజంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్చిన్నమై పోవడంపట్ల విచారంవుంది అనురాగ్ కు.


నేటి సమాజంలో వ్యష్టి కుటుంబ వ్యవస్థ పెరగడం వల్ల మానవసంబంధాలు తగ్గుతున్నాయి. పిల్లలకి వారసత్వ అనుభూతులు, కుటుంబ నేపథ్యాలు, అందరితో కలసి వుండటం తెలీకుండా పోతుంది.


ఆధునీకరణ, నగరీకరణ, పాశ్చాత్యీకరణ, కంప్యూటరీకరణ ఎక్కువయిపోతుంది. పిల్లలకు వారివారి మూలాలు, సంస్కృతీ సంప్రదాయాలు చెప్పే నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు వారికి అందుబాటులో ఉండటంలేదు. సమిష్టి కుటుంబంలో ఉన్నప్పుడు ప్రతీపనిలోనూ సహాయసహకారాలు, సూచనలూ, సలహాలు లభించేవి. ఇప్పుడు ఆధునీకరణ వలన సమిష్టి వ్యవస్థ పూర్తిగా వ్యష్టి వ్యవస్థగా మారిపోతున్నది. వీలయితే చెల్లి పెళ్ళి అయ్యాక అందరికీ ఆమోద యోగ్యమైతే కలసి వుండాలని అతని ప్లాను.. ఆలోచిస్తూనే నిదుర లోకి జారుకున్నాడు.


# # # # #


"ఏరా అమ్మాయి ఎలావుంది ?"

మొదటి పెళ్ళికూతురి ఇంటినుండి బయటకు వచ్చి కారులో కూర్చుని అడిగింది తల్లి.


"అమ్మాయి చూడటానికి బాగున్నా ఆ ఇంటి వాతావరణం నాకు నచ్చలేదమ్మా. వాళ్ళ నానమ్మని గాలివెలుతురు రాని గదిలో ఉంచారు. కనీసం పెళ్ళిచూపులప్పుడు కూడా బయటకి తీసుకొచ్చి కూర్చో బెట్టలేదు.


ఇక అమ్మమ్మ, తాతయ్యలు ఇదే ఊర్లో ఉన్నా కబురు చేయలేదని చెపుతున్నారు. కుటుంబసభ్యులు అందరూ సుఖాల్నీ, సంతోషాల్నీ, కష్టాల్నీ, బాధల్నీ, పరస్పరం పంచుకోవాల్సి ఉండగా 'ఎవరికి వారే యమునాతీరే' అన్న విధంగా మెలగుతున్నారు ఈ యింట్లో. బంధాలకు పెద్దగా విలువివ్వని అమ్మాయిలా అనిపించింది.


ఆ అమ్మాయికి అమెరికా వదిలి ఇక్కడ ఉండాలని లేదు. నేను మనదేశం వదిలి అమెరికాలో ఉండలేను. మా ఇద్దరికీ కుదరదు. ఆ అమ్మాయి ఇప్పటితరం, నేను పాతతరం వాడిని." చిన్నగా నవ్వుతూ అన్నాడు.


"అందరూ నీలా వుంటారా కన్నా? పెళ్ళి చూపులకు నేనెందుకని అన్నా బలవంతాన తీసుకొస్తివి. ఈ రోజుల్లో ముసలివాళ్ళని గౌరవించి దగ్గర ఉంచుకుని సేవ చేసేది కొద్దిమందేరా. అందుకే వృద్దాశ్రమాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి" అంది అమ్మమ్మ.


మరో ఇంటికి పోయేసరికి ఆ యింట్లో వాళ్ళు వారిని సాదరంగా ఆహ్వానించి కూర్చోమన్నారు.


పెళ్లికూతురు ఇంట్లోలేదని ప్రక్కింటి బామ్మగారికి సడెన్ గా హార్ట్ స్ట్రోక్ వస్తే హాస్పిటల్ కు తీసుకుని వెళ్లినదని చెప్పారు.


అనురాగ్ ను వారి అమ్మాయి స్నేహ గదిలో కూర్చోబెట్టారు. ఏమీ తోచక గది అంతా పరిశీలనగా చూశాడు. పుస్తకాలు కనిపించి అటు నడిచాడు.


బుక్ రాక్ లో మాలపల్లి, అతడు-ఆమె, పాకుడురాళ్ళు, అంపశయ్య, చివరకుమిగిలేది, శరత్ సాహిత్యం, చలం, బీనాదేవి, రావి శాస్త్రి, కొడవటిగంటి, రంగనాయకమ్మ, మాలతీ చెందూర్, గోపీచంద్, వంశీ పుస్తకాలు నీటుగా పేర్చివున్నాయి. మరో ప్రక్కగా వ్యక్తిత్వ వికాస పుస్తకాలు, జిడ్డు కృష్ణమూర్తి రచనలు, విశ్వకవి రవీంద్రనాధ్ ఠాగూర్ గీతాంజలి, శ్రీశ్రీ మహప్రస్థానం, సినారే విశ్వంభర, ఆరుద్ర త్వమేవాహం, దాశరథి అగ్నిధార, వివేకానంద, రామకృష్ణ పరమహంస జీవిత చరిత్రలు వున్నాయి. అన్నీ తనకు నచ్చిన పుస్తకాలే అనుకున్నాడు అనురాగ్.


గది గోడలకు రాజా రవివర్మ చిత్రాలు అలంకరింపబడి వున్నాయి. ఆ పుస్తకాలు, గోడలకు ఉంచిన చిత్రాలు, గదిలో ఒక ప్రక్కగా ఉంచబడిన వీణ ఇవన్నీ పెళ్ళికూతురు అభిరుచులను చెప్పకనే చెపుతున్నాయి.


ఇంటిలో ఉన్న వారందరినీ పరిచయం చేశాడు పెళ్లికూతురు తండ్రి. తాతయ్యలు, అమ్మమ్మ, నాన్నమ్మ పిన్ని, బాబాయ్, మేనమామ, అత్త, అక్కలు, తమ్ముళ్లు తో ఇల్లంతా కళ కళ లాడుతుంది.


"కలిసి ఉంటే కలదు సుఖం అనే సూత్రం మీదే సమిష్టి కుటుంబ వ్యవస్థ ఆధార పడి ఉంది. ప్రతిపనిలోనూ సహాయ సహకారాలు, సూచనలూ, సలహాలూ లభిస్తాయి. పరస్పర ప్రేమలు సమిష్టి కుటుంబంలోనే ఉంటాయి. అందుకే కలిసి ఉంటే కలదు సుఖం అని మా పెద్దలు మాకు చెప్పారు.

అదే సూత్రాన్ని మేము మీకు చెపుతున్నాం." అని పెళ్లికూతురు తాతయ్య చెప్పిన మాటలు అనురాగ్ కు బాగా నచ్చాయి.


కాసేపు చూసి పెళ్ళికూతురు రావటం లేట్ అవుతుందని తెలిసి వెనక్కు వచ్చేసారు అనురాగ్ వాళ్ళు.


కారు ఎక్కాక అన్నాడు అనురాగ్


"స్నేహ గదిని చూసి ఆ అమ్మాయి అభిరుచులు కొంత మేరకు తెలుసుకున్నాను. ఇల్లు నిండుగా పండుగ వాతావరణంలా కళకళ లాడుతుంది. పెళ్ళి చూపులు వున్నా కూడా పక్కింటి వారికి ఆపద సమయంలో దగ్గర వుండి సహాయం చేయడం అన్న విషయం ఆమె సేవా గుణాన్ని తెలియ చేస్తున్నది. ఈ అమ్మాయి నాకు తగినది అని అనిపిస్తున్నది. ఆ అమ్మాయి అభిప్రాయం తెలుసుకోవాలి."


తల్లిని, అమ్మమ్మను, తండ్రిని ఇంట్లో దింపి హాస్పిటల్ కెళ్ళి ఆ అమ్మాయిని కలుస్తానని చెప్పి హాస్పిటల్ కు వచ్చాడు. అంతకు ముందే ఫోటో చూసున్నాడు కనుక స్నేహను గుర్తుపట్టి దగ్గరకు వెళ్లి పరిచయం చేసుకున్నాడు.


"సారీ అండీ. మీరొస్తారని తెలిసినా యింట్లో ఉండలేదు. బామ్మగారి కొడుకు ఆఫీస్ పని మీద ఊరెళ్ళారు. కోడలు కంగారు పడుతుంటే ధైర్యం చెప్పి తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేసాము. లోపల ఐ సి యూ లో ఉంచి చెక్ చేస్తున్నారు. ఇప్పుడే నాన్నగారు ఫోన్చేసారు, మీరొచ్చి వెళ్లారని. రియల్లీ వెరీ సారీ" అంది స్నేహ.


"సారీ ఎందుకండీ? మీరు చేసింది మంచి పని. ఆపత్సమయంలో ఇతరులకు సాయపడటం కన్నా ముఖ్యమైంది కాదు మన పెళ్లి చూపులు. మీ ఇల్లు, మీగది, మీ పరిసరాలు అన్నీ చూశాను ఇంతకుముందే. మీ ఇష్టాలు, అభిరుచులు కొద్దిగాఅర్థమయ్యాయి. ఇప్పుడు మానవత్వం మూర్తీభవించిన మిమ్ములను చూస్తున్నాను.


బంధాలు, అనుబంధాలకు విలువ లేకుండా పోతున్న ఈరోజుల్లో మీ యిల్లు ఉమ్మడి కుటుంబంతో కళకళ లాడటం నాకెంతో నచ్చింది. చిన్నప్పటి నుండి ఉమ్మడి కుటుంబం అంటే ఇష్టం పెంచుకున్నాను. నా దురదృష్టం నానమ్మ, తాతయ్యలు నేను ఇంజనీరింగ్ చదువుతూ వుండగానే చనిపోయారు. అమ్మమ్మ ఒక్కటే ప్రస్తుతం జీవించి వుంది.


బంధుమిత్రులు, మేనమామలు, అత్తమామలు మరియు తాతయ్యలతో పెరగడం వల్ల పుట్టినపిల్లలు అందరితో కనెక్ట్ అవ్వడానికి మరియు సన్నిహిత బంధాలను ఏర్పరచుకోవడానికి అవకాశం వస్తుంది.


తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించాలనుకునే అనేక విలువలు ఉమ్మడికుటుంబంలో బాగా నేర్పబడతాయి. కలిసి పెరుగుతున్నప్పుడు పిల్లలు ప్రతి ఒక్కరినీ ముఖ్యంగా పెద్ద వయసు వారిని ప్రేమించడం, శ్రద్ధగా చూడటం మరియు గౌరవించడం నేర్చుకుంటారు. చుట్టుపక్కల వారిని ఎలా ప్రేమగా చూడాలో కూడా వారు నేర్చుకుంటారు. అందుకే మీ కుటుంబం నాకు బాగా నచ్చింది. మీ పరోపకార వ్యక్తిత్వం నాకు మరీ నచ్చింది. మీ కిష్టమైతే మీ 'స్నేహ ' హస్తాన్ని అందుకోడానికి నేను సిద్ధంగా వున్నాను" అన్నాడు అనురాగ్ చిరునవ్వుతో.


"కానీ.." అంటూ సందేహంగా ఆగింది స్నేహ.


"చెప్పండి. ఆగిపోయారేం?"


"అమెరికా చూసి రావటానికి బానేవుంటుంది.. కానీ ఇక్కడ మా..అదే.. మన వారందరిని వదిలి ఉండలేను."


"మా నాన్నగారు మీ నాన్నగారితో చెప్పే వుంటారు. మీదాకా రాలేదేమో ఆ విషయం. పెళ్లి అయ్యాక కొద్ది కాలం తప్ప నేను అమెరికాలో ఉండనని ముందే చెప్పాను. మా అమ్మా నాన్నలను వదిలి నేనుండలేను. అందరూ కలిసి ఉంటేనే ప్రేమలు పెరుగుతాయి అన్నది నా అభిమతం.


'కుటుంబం,

ఉమ్మడి కుటుంబం..

చల్లని హృదయాలకు

చక్కని ప్రతిబింబం'


అన్న పాత పాట విన్నారా? ఆ పాట నాకెంతో ఇష్టం. ఆ పాట లోని భావం మరింత ఇష్టం.


'మనసులన్ని పెనవేసి

తలపులన్ని కలబోసి

మమతలు పండించి

మంచితనం పెంచేదే

ఉమ్మడి కుటుంబం'


నేను ఎక్కువగా పాత పాటలు ఇష్టపడుతుంటాను. మా ఫ్రెండ్స్ అందరూ నన్ను సరదాగా 'పాత చింతకాయ పచ్చడి' అని అంటూ వుంటారు. ఎంత చదివినా, అమెరికా వెళ్ళినా మన భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను మరచిపోలేదు.


ఉమ్మడి కుటుంబం లోనే పరస్పర ప్రేమ, సహకారాలు సూచనలూ, సలహాలూ లభిస్తాయి. వీలయితే చెల్లి పెళ్ళి అయ్యాక వచ్చే బావగారు ఒప్పుకుంటే అందరము కలసి ఉండాలని నాకుంది. బంధాలకు, అనుబంధాలకు ప్రాణమిచ్చే కుటుంబం మాది." అన్నాడు అనురాగ్.


ఒక్క నిమిషం అంటూ స్నేహ ప్రక్కకు వెళ్లి తండ్రికి రింగ్ చేసి రెండు నిమిషాల పాటు మాట్లాడింది. నవ్వుతూ తిరిగి వచ్చింది.


అనురాగ్ ఆమె తన తండ్రికి అతని అంగీకారం కోసం ఫోన్ చేసి ఉంటుందని వూహించాడు. ఆమె చేసిన ఆ పనివల్ల అనురాగ్ కు స్నేహ మీద గౌరవం మరింత పెరిగింది.


అనురాగ్ మందహాసంతో కుడిచేతిని ముందుకు చాపాడు.


స్నేహ చిరునవ్వుతో చూసి అనురాగ్ చేతిలో చేయి కలిపింది. ఇద్దరూ కలసి వెళ్ళి హాస్పిటల్ కాంటీన్ లో టిఫిన్ చేసి కాఫీ తాగారు. టిఫిన్ పార్సిల్ చేసుకుని తీసుకు వచ్చి బామ్మగారి కోడలు చేత బలవంతంగా తినిపించింది స్నేహ.


బామ్మగారి అబ్బాయి ఫోన్ చేసి వెంటనే బయలు దేరుతున్నానని తను వచ్చేదాకా హాస్పిటల్ లో వుండమని స్నేహను అర్ధించాడు. స్నేహ సరేనన్నది. అనురాగ్ ఇంటికి ఫోన్ చేసాడు. హాస్పిటల్ లో స్నేహకు తోడుగా వున్నానని, ఈ రాత్రికి రావటం కుదరక పోవచ్చునని అన్నాడు.


అర్ధరాత్రి దాటాక ఒక యాక్సిడెంట్ కేసు వచ్చింది హాస్పిటల్ కు. కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి రక్తం విపరీతంగా పోయింది. వెంటనే రక్తం ఎక్కించాలన్నారు. గాయపడిన వ్యక్తి గ్రూప్ ఓ నెగిటివ్. చాలా అరుదైన గ్రూపు. ఆ గ్రూపు వారికి అదే గ్రూప్ రక్తం ఎక్కించాలి. హాస్పిటల్ లో వున్న నిలువ అయిపోయిందట.


డాక్టర్లు హడావుడిగా ఎక్కడెక్కడికో ఫోన్ చేస్తున్నారు.

అనురాగ్ వారి మాటలు విని ఆ డాక్టర్ దగ్గరకు వెళ్ళి

"డాక్టర్ నాది ఓ నెగిటివ్ గ్రూప్. కావాలంటే బ్లడ్ నేనిస్తాను"అన్నాడు.


డాక్టర్ సంతోషంతో ' వెరీ గుడ్ ' అని సిస్టర్ ను కేకేసి అనురాగ్ రక్తాన్ని పరీక్ష చేయమన్నాడు. రక్తం మాచ్ అయింది. అనురాగ్ శరీరం నుండి ఒక యూనిట్ రక్తం తీసి గాయపడిన వ్యక్తికి ఎక్కించారు.


"మీరు సమయానికి రక్తం ఇచ్చి ఒక మనిషి ప్రాణం నిలబెట్టారు. రక్తదానం మీద సరిఅయిన అవగాహన, చైతన్యం ప్రజల్లో రావటం లేదు. అందుకే మన దేశంలో రక్తం కొరతగా వుంటున్నది. ఎన్ని రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసినా ఫలితం తక్కువగానే వుంటున్నది. మీరు ముందుకొచ్చి రక్తం ఇచ్చినందుకు అభినందనలు." అన్నాడు డాక్టర్.


అనురాగ్ చిరునవ్వు నవ్వుతూ "నాదీ అదే గ్రూప్. సమయానికి నేనిక్కడ వున్నాను, కాబట్టే ఒక మనిషిగా స్పందించి రక్తం ఇచ్చాను. రక్తదానం మీద నాకూ కొంత మేరకు అవగాహన వుంది. సోషల్ మీడియాలో కూడా నేను రక్తదాన గ్రూప్ లో నమోదై వున్నాను. ఎవరికైనా అవసరమైనప్పుడు నన్ను సంప్రదించిన వారికి రక్తం ఇస్తుంటాను. రక్తం తరిగిపోయేది కాదు కదా. మళ్ళీ మళ్ళీ అదే శరీరంలో తయారవుతూనే వుంటుంది." అన్నాడు.


స్నేహ అబ్బురంతో అనురాగ్ ను చూస్తూ

"అనురాగ్, మీరు చాలా మంచిపని చేసారు. నాకు బాగా నచ్చారు" అంటూ ప్రశంసించింది.


అనురాగ్"నిజంగా?" అన్నట్టు చూసి చిరునవ్వు చిందించాడు.


స్నేహ సిగ్గుల ముగ్ధ అయ్యింది.


బామ్మగారి అబ్బాయి వచ్చేసరికి ఉదయం అయిదు గంటలు దాటింది. బామ్మగారికి క్రొద్దిగా నిమ్మళించింది. అప్పటిదాకా అనురాగ్ కూడా స్నేహ ప్రక్కనేవున్నాడు


బామ్మగారి అబ్బాయికి, అతని భార్యకు చెప్పి ఇద్దరు బయటికొచ్చారు. అప్పుడప్పుడే తూరుపు దిక్కు వెలుగురేఖలను పరుచుకొంటున్నది.


అటు చూస్తూ అనురాగ్


"తూరుపున కిరణాలు

ఉదయించాయి

గగన తీరాలను

అందుకోను పయనించాయి"


చిన్నగా హమ్మింగ్ చేయసాగాడు.


"మంచి ఆశయాలుంటే మానవులందరూ మచ్చలేని వెలుగునే చేరుకొందురు."


స్నేహ గొంతులోని ఆలాపన వింటూనే చిరునవ్వులతో స్నేహను చూశాడు.


పెదవులు దాటిన పాట

రాగమై, అనురాగమై,

స్నేహానురాగమై,

రసగంగా ప్రవాహమై

పలికింది ఇద్దరి నోట

ప్రేమానుబంధాలు పరవశించేలా..


'నువ్వూ, నేనూ నడిచేది

ఒకేబాట ఒకేబాట..

నువ్వూ, నేనూ పలికేది

ఒకేమాట ఒకేమాట.. '


ఇద్దరూ చేయిచేయి కలిపి ఆనందంగా ముందుకు సాగారు.

మనసు వెన్నెలై విరబూస్తే ప్రతీ రోజూ ఒక పండుగే.

వారి జీవితం అలానే కొనసాగింది.


&&&&&&&&&&&&&&&&&&&&&&

పారుపల్లి అజయ్ కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

నా పేరు పారుపల్లి అజయ్ కుమార్ ...

పదవీ విరమణ పొందిన ప్రభుత్వ జూనియర్ అధ్యాపకుడుని ...

ఖమ్మం జిల్లా, ఖమ్మం పట్టణ వాసిని ...

సాహిత్యం అంటే ఇష్టం .... కథలు,

నవలలు చదవటం మరీ ఇష్టం ...

పదవీ విరమణ తరువాత నా సహచరి దుర్గాభవాని సహకారంతో ఖమ్మం లో

"పారుపల్లి సత్యనారాయణ పుస్తక పూదోట - చావా రామారావు మినీ రీడింగ్ హాల్ " పేరిట ఒక చిన్న లైబ్రరీని మా ఇంటి క్రింది భాగం లో నిర్వహిస్తున్నాను ..

షుమారు 5000 పుస్తకాలు ఉన్నాయి .

నిరుద్యోగ మిత్రులు ఎక్కువుగా వస్తుంటారు ..

రోజుకు 60 నుండి 70 మంది దాకా వస్తుంటారు ...

ఉచిత లైబ్రరీ ....

మంచినీరు ,కుర్చీలు ,రైటింగ్ ప్యాడ్స్ ,వైఫై ,కరెంటు అంతా ఉచితమే ...

ఉదయం 6 A M నుండి రాత్రి 10 P M దాకా ఉంటారు ...మనసున్న

మనిషిగా నాకు చేతనైన సాయం నిరుద్యోగ మిత్రులకు చేస్తున్నాను. ఇప్పుడిప్పుడే కొంతమందికి జాబ్స్ వస్తున్నాయి.


107 views0 comments

Comments


bottom of page