top of page

కాలవలో ఈతలు – పడవల మీద షికార్లు

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Youtube Video link

'Kalavalo Ethalu Padavala Mida Shikarlu' New Telugu


Story Written By M R V Sathyanarayana Murthy


రచన : M R V సత్యనారాయణ మూర్తి


కాటన్ దొర పుణ్యమా అని ధవళేశ్వరం వద్ద గోదావరి నదికి ఆనకట్ట వచ్చింది.

ఉభయగోదావరి జిల్లాలలో సాగునీటికోసం పెద్ద పెద్ద కాలువలు తవ్వడం జరిగింది. ఆ క్రమంలోనే మా పశ్చిమ గోదావరి జిల్లాకు విజ్జేశ్వరం నుండి నర్సాపురం వరకు పెద్ద మంచినీటి కాలువ వచ్చింది. ఈ కాలువ కింద వేల ఎకరాల భూమి సాగులోకి వచ్చింది.


లారీలు అంతగా ప్రాచుర్యంలోకి రాలేదు. సరుకుల రవాణా ఈ కాలువ మీద తిరిగే

పడవల ద్వారా బాగా జరిగేది. ప్రజలు కూడా ఈ కాలవలమీద తిరిగే పడవలలో తరచూ ప్రయాణాలు సాగించేవారు. అప్పుడప్పుడు పుణ్య క్షేత్రాలకు కూడా పడవలమీద నిడదవోలు వరకూ వెళ్లి అక్కడనుంచి రైలు ఎక్కి వెళ్ళేవారు. ఉప్పు పప్పు కాదండోయ్, బెజవాడ నుంచి

సిమెంట్ కూడా పడవలమీద మా పెనుగొండ సిమెంట్ కొట్టులకు వచ్చేది.


ఇంకో గొప్ప విషయం కూడా ఉందండోయ్, పాలగుమ్మి పద్మరాజు గారి పేరు

తెలుసు కదండీ, అదేనండి బాబూ ‘గాలివాన’ కథతో మన తెలుగువాడి సత్తాని ప్రపంచానికి చాటిన మహానుభావుడు.

ఆయన రాసిన మరో గొప్ప కథ ‘పడవ ప్రయాణం’ మా విజ్జేశ్వరం – నర్సాపురం కాలువ

మీదే నడిచిందండి. అంతటి పేరూ, ప్రఖ్యాతి ఉన్న మా కాలువమీద ఎన్నెన్ని సరదాలు,

సిత్రాలు,చమక్కులు జరిగేయో తెలుసుకుంటే మీరు ‘అవాక్కు’ అవడం ఖాయం.


మా పెనుగొండలో సహం మంది మొగాళ్ళు కాలవలోనే స్నానాలు చేస్తారు. స్నానం

అవగానే ప్రత్యేక్షనారాయుడు ఆ సూర్నారాయుడికి దణ్ణం పెట్టుకుని మరీ ఇంటికి వెళ్ళరు. ‘ఆ

మీకు మళ్ళీ నీళ్ళు తోడిఇచ్చే ఖాళీ ఎవరికుంది? పోయి కాలవలో మునిగి రండి’ అని ఆళ్ళ ఆడంగులు అంటారని కిట్టని వాళ్ళు అంటారు. అయన్నీ మీరు పట్టించుకోకండి. ఎందుకంటే మనం అన్నీ మంచిగా ఆలోచించాల.

అప్పుడే మన వళ్ళూ ,మనసూ ప్రశాంతంగా ఉంటాయి. ఇప్పుడు ఇంగ్లీషులో కూడా పెద్ద

పెద్ద వాళ్ళు అదే అంటన్నారుకదండీ, ‘పాజిటివ్ థింకింగ్’ అని. అదన్నమాట.


పొద్దున్న ఐదు గంటల నుండి ఏడుగంటల వరకూ మా పెనుగొండలోని స్నానాల

రేవులన్నీ కోటిపల్లి గోదావరి రేవులా కళకళ లాడిపోతా ఉంటాదండి. చెరుకువాడ నుంచి పెనుగొండ శివారు పార్ధ సారధి రైస్ మిల్లు వరకూ ఆడాళ్ళకు, మొగాళ్ళకు వేరు వేరుగా స్నానాల రేవులు వేరుగానే ఉన్నాయండి.


ఎందుకంటే మా పెద్దోళ్ళకు ముందుచూపు ఎక్కువండి. జనార్ధనస్వామి గుడి వెనక ఉన్న మగాళ్ళ స్నానాల రేవులో గున్నయ్య మేట్టారు, శరభ రాజు మేట్టారు{ఈయన్నే పాముల మేట్టారు అని కూడా అంటారు. పాము మంత్రం వేసి ఎంతోమంది పాణాలు కాపాడిన మహానుబావుడు} ఓడూరి రాయుడు మేట్టారు, నూలి వీరన్న, తవ్వా పుత్రయ్య, తవ్వా కాసు, తుమ్మలపల్లి హనుమంతు, పోస్ట్ ఆఫీస్ వెంకటరెడ్డి {ఈయన అసలు పేరు తమనంపూడి వెంకట రెడ్డి. కానీ పోస్ట్ ఆఫీస్ ఈయన ఇంట్లో ఉండడంవలన ,ఈయన్ని పోస్ట్ ఆఫీస్ వెంకటరెడ్డి గా పిలుస్తారు}

సిద్దిరెడ్డి సత్యనారాయణ ఇంకా ఎంతోమంది స్నానాలు చేసి వెళ్తారు.


ఊళ్ళో వింతలు, విశేషాలు పొద్దున్నే ఇక్కడ చర్చకు వస్తాయి. ఈ రేవు పక్కనే ఆడాళ్ళ రేవు ఉంది. ఇక్కడ స్నానాలు చేసే ఆడంగులు తక్కువ,మంచినీళ్ళ కోసం అంటూ వచ్చి కబుర్లు చెప్పుకునే వాళ్ళు ఎక్కువ. అత్తగారు పెట్టే బాధలు చెప్పుకుని కన్నీళ్ళు పెట్టుకునే వారు కొందరు ఓ పక్క , నిన్న రాత్రి పాలకొల్లు లీలా మహల్ లో మొగుడితో సినిమా చూసి వచ్చిన వయ్యారి భామ చెప్పే కొత్త సినిమా కబుర్లు ఇంకో పక్క. పిల్లలు బడి కెళ్ళకుండా ఎంత మొండిగా ఉంటున్నారో చెప్పుకుని బాధపడేవారు మరో పక్క. అంతా కలగా పులగంగా బుధవారం సంతలా ఉంటుంది ఇక్కడి వ్యవహారం.


మొగాళ్ళ రేవులోని మెట్లు అన్నీ సాఫీగా ఉంటాయి. ఆడాళ్ళ రేవులోని కింది మూడు మెట్లు గుంటలుపడి ఉంటాయి. ఆళ్ళేడో కురుక్షేత్రం యుద్ధం చేసి మెట్లు పాడుచేసారని మీరు ఇంకో రకంగా అనుకోకండి. మా పెనుగొండ లోని ఆడోళ్ళు అందరూ చాలా మంచోళ్ళు. గొడవలకు వెళ్లరు. మరి ఆళ్ళ రేవులోని మెట్లే ఎందుకు గుంటలు పడ్డాయని మీకు మా సెడ్డ అనుమానం. మీ డౌట్ క్లియర్ చేసే పూచీ నాది.


జూలై , ఆగష్టు నెలల్లో గోదావరికి వరద వస్తుంది కదండీ. అప్పుడు నీళ్ళు అన్నీ బురదగా మారి

పోతాయి. మా కాలవలోని నీళ్ళు కూడా బురద రంగులోకి వచ్చేస్తాయి. ఇళ్ళకు మంచినీళ్ళు పట్టుకు వెళ్ళే ఆడాళ్ళు , ఇండుపు కాయలు తెచ్చుకుని కాలవరేవులోని మెట్ల మీద అరగదీసి, ఆ రసాన్ని బిందెల నీళ్ళలో కలుపుకుని ఇంటికి తీసుకెళతారు. కాసేపటికి నీళ్ళలో ఉన్న మట్టి బిందె అడుగుకి చేరిపోతుంది.


విజ్జేశ్వరం నుండి నర్సాపురం వరకు ఉన్న ఊళ్ళలోని ఆడాళ్ళు చేసే పనే ఇది.

అందుకని ఇండుపుకాయలు సంవత్సరాల తరబడి మెట్ల మీద అరగదీయడం వలన

ఏర్పడిన గుంటలండి బాబూ. అంతే.


ఉదయం తొమ్మిది గంటలవరకూ స్నానాల రేవు అందడిగా ఉంటే ,తొమ్మిది దాటాకా ఆడాళ్ళు అందరూ దాన్ని బట్టలుఉతికే రేవుగా మార్చేస్తారు.ఇంటి దగ్గర బట్టలు ఉతుక్కోవాలంటే చాలా నీళ్ళు కావాలి. నూతుల్లోంచి తోడుకోవాలి, లేదా చేతి పంపులు కొట్టుకోవాలి. మరి కాలవకొస్తే, ఆ

గోదారమ్మ తల్లి బోల్డు నీళ్ళు ఇస్తాదిగదండి. అదన్నమాట ‘మతలబు’.


మా ఊళ్ళో లింగాలవీధి , కొవ్వురివారి వీధి, కన్యకాపరమేశ్వరి గుడి వీధి కుర్రాళ్ళు

మా సెడ్డ చురుకైనోల్లండి. కాలవలో ఈతలు కొట్టడంలో మొనగాళ్ళు. ఈ గట్టున మునిగితే మళ్ళా

అవతలి గట్టునే తెల్తారండి. చేతులు ఉపయోగించకుండా కేవలం కాళ్ళతోనే నీటిని తోసుకుని ఈ వడ్డు నుంచి ఆ వడ్డుకి వెళ్ళేవాళ్ళు కొందరున్నారండి. జామీందారు గారి హై స్కూల్ లో పదవ తరగతి చదివే ఈళ్ల అల్లరి అంతా ఇంతా కాదండి బాబూ.


మా కాలవలో పడవలు ఎల్తాయని తమరికి ముందే మనవి చేసుకున్నాను కదండి. స్కూల్ అయ్యాక సాయంకాలాలు కాలవగట్టు దగ్గర ఈళ్ళు చేసే విన్యాసాలు జెమినీవారి

సర్కస్లో వాళ్ళు కూడా చేయలేరండి బాబూ. రేవులో మెట్ల పక్కన కట్టిన చప్టా మీద నుంచి ఒకడు పరిగెత్తుతూ వచ్చి కాలవలో దూకుతాడు. ఇంకోడు కాలవగట్టు పెద్ద రోడ్డు మీంచి పరిగేట్టికుంటూ వచ్చి ఎనిమిది అడుగుల ఎత్తునుంచి కాలవలోకి దూకుతాడు. మా సివ్వాద్రి గాడు ఈళ్ళతో కలవకుండా, బుద్ధిమంతుడిలా కాలవ ఈదుకుని అవతలి ఒడ్డుకు వెళ్తాడు. మళ్ళీ జాగ్రత్తగా ఇవతలకు వచ్చేత్తాడని అందరూ అనుకుంటారు.


అలా అయితే వాడు సివ్వాద్రి ఎందుకు అవుతాడండి. చిరునవ్వులు చిందిత్తా, పోలీస్ స్టేషన్

ఎదురుగుండా ఉన్న నిద్ర గన్నేరు చెట్టు ఎక్కి అక్కడ నుంచి కాలవలోకి దూకి ఈదుకుంటూ వస్తాడు. అదీ ఆడి స్పెషాలిటీ.


సాయంకాలాలు కాలవమీంచి గాలి రయ్యన ఈస్తూ ఉంటాది. మార్టేరు లాకుల

తర్వాత మళ్ళీ పడవ లాగక్కర లేకుండా తెరచాప ఎత్తితే ఆ గాలి వేగానికి పడవ రయ్యిమంటూ

ఎల్లిపోతాదండి. పడవ మీద చుక్కాని దగ్గర ఒకడు ఉంటె మిగతా వాళ్ళు ఊసులాడుకుంటా ఉంటారండి. ఆ సీను చూడ్డానికి భలే ఇదిగా ఉంటాదండి. జనార్ధనస్వామి గుడి వెనకాల ఉన్న రేవు దగ్గర కాలవ కొంచెం మలుపు తిరిగినాదండి. ఆ మలుపు దగ్గరకు రాగానే పడవవాళ్ళు హడావిడిగా తెరచాప దించే పనిలో ఉంటారు.

ఎందుకంటే కూతవేటు దూరంలో కాలవమీద పెద్ద వంతెన ఉంది. పడవ అదే స్పీడ్ గా

వెళ్తే తెరచాప వంతెనకు తగిలే ప్రమాదం ఉంది. అప్పుడు ఈ కుర్రగాళ్ళు రంగం లోకి దిగుతారు. ఒకడు పడవ ముందుకు వెళ్లి రెండు కాళ్ళూ పడవ ముందు భాగానికి తన్నిపెట్టి ఉంటాడు. ఆ వేగానికి కాలవ నీళ్ళు వాడి మేడ మీంచి గొడుగులా వస్తాయి. ఇంకోడు చుక్కాని పట్టుకుంటాడు. ఎందుకంటే ఈత కొట్టే పనే లేకుండా ప్రవాహానికి ఎదురుగా వెళ్ళిపోతాడు. చుక్కాని పట్టుకున్న పడవ వాడు ‘ఒరేయ్ చుక్కాని వదలరా’ అంటాడు.


కింద నీళ్ళలో చుక్కాని పట్టుకున్న కుర్రాడు వాడి మాట వినకుండా నవ్వుతూ ఉంటాడు. చుక్కాని సరిగా పట్టుకోపొతే పడవ కాలవలో మధ్యలో కాకుండా ఒడ్డుకి తగిలే ప్రమాదం ఉంది. ప్రాణం విసిగి, పడవ వాడు తాడుతో కింద చుక్కాని పట్టుకున్న కుర్రాడ్ని రెండు తగిలిస్తాడు. అప్పుడు వాడు చుక్కాని వదిలివెళ్తాడు. ఈలోగా ఇంకోడు పడవ అంచు పట్టుకుని పడవ పైకెక్కి గంతులేస్తాడు. పాపం, పడవ వాళ్ళు తెరచాప దించుకుని, తెరచాపకోసం ఉన్న స్తంభాన్ని ఏటవాలుగా వాల్చే ప్రయత్నంలో ఉంటారు.


అప్పటికి పడవ పెద్ద వంతెన దగ్గరకు వచ్చేస్తుంది. అప్పుడు కుర్రాళ్ళు పడవ అంతా తిరుగుతూ గంతులు వేసి చివరకు మరలా కాలవలో దూకి ప్రవాహం వాలుగా ఉండడంతో తేలిగ్గా ఈదుకుంటూ రేవు దగ్గరకు వస్తారు. వేసవి ఎండ బాగా ఉందని స్కూళ్ళకు ఒంటిపూట బదులు మెదలెట్టారు. అప్పుడు చూడాలి వీళ్ళ ఆటలు, పాటలు.


నాలుగు గంటలు దాటగానే బ్యాటులు పట్టుకుని కాలవ అవతల ఉన్న పోలీస్

స్టేషన్ గ్రౌండ్ లో బ్యాడ్మింటన్ ఆడటానికి బయల్దేరారు కృష్ణారెడ్డి, అయ్యన్న, నందం

సుబ్రహ్మణ్యం, సత్తిపండు, ప్రభాకరం, గాంధీ. కాలవగట్టు రోడ్డు మీద నడుచుకుంటూ

వెళ్తున్న వాళ్ళ కంటే ముందుగా అక్కడా ఉండాలని సత్తిపండు, ప్రభాకరం బట్టలు విప్పేసి, కాలవ రేవు దగ్గర దాచుకున్నగోచీలు పెట్టుకుని బ్యాట్టు కి తమ బట్టల్ని తాడుగా చుట్టి , కాలవలో దిగి కుడిచేత్తో బ్యాట్టు, బట్టలు తడవకుండా పైకి పట్టుకుని ఎడమచేతితో కాలవలో ఈదుకుంటూ అవతల వడ్డుకి వెళ్ళారు.


పెద్ద నిద్ర గన్నేరు చెట్టు వెనక చేరి , గబా గబా బట్టలు కట్టుకుని గోచీలు భద్రంగా దాచుకుని గ్రౌండ్ లోకి వెళ్లి ఊలు బంతి ఎగరేసుకుంటూ బ్యాడ్మింటన్ ఆడటం ప్రారంభించారు. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేటప్పటికి పది నిమిషాలు పట్టింది. వాళ్ళకూ ఈత వచ్చును కానీ వీళ్ళ ఇద్దరిలా వంటి చేతితో ఈదడం రాదు. వాళ్ళు వచ్చాకా పోలీస్ స్టేషన్ లోకి వెళ్లి మూల దాచిన నెట్ తీసుకువచ్చి కర్రలకు కట్టి గేమ్ మొదలు పెట్టారు. ఇది రోజూ జరిగే తతంగమే.

అయితే ఒకటి రెండు సార్లు వీళ్ళు సిగ్గు పడే సందర్భాలు ఎదురయ్యాయి.


గ్రౌండ్ పక్కనే ఒక పెద్ద పాక ఉంది. అందులో ఒక రాజు గారు ఉంటున్నారు పిల్లలతో. వాళ్ళ పెద్ద

అమ్మాయి కాలవలో నీళ్ళు తెచ్చుకోవడానికి బిందెతో వచ్చింది. మన గజఈతగాళ్ళు అదేం చూసుకోకుండా గోచీలు విప్పేసి నిక్కర్లు కట్టుకుంటూ ఉంటె కిసుక్కున నవ్వులు వినిపించాయి. పక్కకు తిరిగి చూస్తే నోటికి చెయ్యి అడ్డం పెట్టుకుని ఆ అమ్మాయి నవ్వడం కనిపించింది. గబా గబా చొక్కాలు వేసుకుని గ్రౌండ్ లోకి ఒకటే పరుగు. ఆరోజు జరిగిన పందెం లో సత్తిపండు, ప్రభాకరం ఓడిపోయారు, గాంధీ , కృష్ణారెడ్డి టీం నెగ్గింది.


అప్పుడప్పుడు పోలీసులు కూడా వచ్చి వీళ్ళతో బ్యాడ్మింటన్ ఆడేవారు. కాలవలో ఈదుతూ, పడవలు ఎక్కి అల్లరి చేసినా పెద్దవాళ్ళు ఎక్కువగా దండించేవారు కాదు. ఎందుకంటే ఒకసారి ఆడాళ్ళ రేవులో వెంకటలక్ష్మి తో వచ్చిన ఆమె ఐదేళ్ళ కూతురు కిరణ్మయి మెట్లు జారి కాలవలో పడిపోయింది. అదే సమయానికి స్కూల్ కి వెళ్తున్న సత్తిపండు, ప్రభాకరం చేతిలో పుస్తకాల్ని గట్టున పడేసి కాలవలో దూకి ఆ చిన్నపిల్లని రక్షించి ఒడ్డుకు తీసుకువచ్చారు. అప్పటి నుంచీ

వాళ్ళు ఇద్దరూ హీరో లై పోయారు.


వెంకటలక్ష్మి ప్రతి పండగకు సత్తిపండు, ప్రభాకరం ని వాళ్ళ ఇంటికి పిలిచి సున్నుండలు, జంతికలు పెడుతుంది. రాఖీ పండుగ రోజున కిరణ్మయి వీళ్ళు ఇద్దరికీ రాఖీలు కడుతుంది.

ఈ ఈతల బ్యాచ్ కి ఒక రోజున ఓ దుర్భుద్ధి పుట్టింది. పెనుగొండ పెద్ద వంతెన

నుండి మార్టేరు లాకుల వరకూ కాలవలో ఈదాలి. నెగ్గిన వాళ్లకి తణుకు నరేంద్ర టాకీసులో ఉదయం ఆట, మధ్యాహ్నం పద్మశ్రీ టాకీసులో మ్యాట్నీ రెండు సినిమాలు చూపించాలి అదీ భోజనంతో సహా. పందెం అందరికీ నచ్చింది. ఎందుకంటే ప్రతీ వాడికీ తానే గెలుస్తానన్న నమ్మకం. ఈ పందానికి పెద్దగా లింగాల వీధి పోలిశెట్టి నాయుడ్ని పెట్టుకున్నారు. నాయుడు పిల్లల్లో పిల్లాడిగా, పెద్దల్లో పెద్దాడిగా కలిసిపోతాడు.


ఒక ఆదివారంనాడు సత్తిపండు, ప్రభాకరం, సుబ్రహ్మణ్యం, అయ్యన్న, తమనంపూడి సుబ్బిరెడ్డి, పేర్రాజు, గాంధీ, భానుమూర్తి పెద్దవంతెన ఎక్కి నిలబడ్డారు. నాయుడు ఈల వేయగానే అందరూ దభీ మని కాలవలో దూకి ఈతలు కొట్టసాగారు. కాలవలో ప్రవాహం కిందకు వెళ్తున్నందున పెద్ద శ్రమ లేకుండా ఈదుకుంటూ వెళ్తున్నారు. పన్నాస వారి కొట్టు దగ్గరకు వచ్చేసరికి గాంధీ, భాను మూర్తి ఈదలేమని ఒడ్డు ఎక్కేసారు. తర్వాత నాండ్ర వారి పొలాల దగారకు రాగానే సుబ్రహ్మణ్యం, పేర్రాజు ఒడ్డు ఎక్కేసారు. ఆ తర్వాత కొంత దూరం రాగానే అయ్యన్న, సుబ్బిరెడ్డి కూడా ఒడ్డు ఎక్కేసారు. చివరకి సత్తిపండు,ప్రభాకరం మార్టేరు లాకులు వరకూ ఈదుకుంటూ వచ్చి పందెం నెగ్గారు. పన్నెండు మంది సైకిళ్ళ మీద వచ్చారు ఈ పందెం చూడటానికి. ఈతగాళ్ళ బట్టలు వాళ్ళే పట్టుకొచ్చారు. నెగ్గిపూడి పంచాయతీ ఆఫీస్ దగ్గర ఉన్న రేవులోంచి పైకి వచ్చి బట్టలు

కట్టుకున్నారు సత్తిపండు ప్రభాకరం. నాయుడు వీళ్ళని తీసుకుని మార్టేరు సెంటర్ లోని సీతయ్య కాఫీ హోటల్ కి తీసుకువెళ్ళి గార్లు, బజ్జీలు పెట్టించాడు.


అనుకున్నట్టుగానే పోటీదారులు అందరూ తణుకు వెళ్లి రెండు సినిమాలు చూసి, శంకర్ విలాస్ లో భోజనాలు చేసి వచ్చారు. సత్తిపండు, ప్రభాకరం తమ డబ్బులు తామే పెట్టుకున్నారు. పోటీ సరదా కోసమే గానీ, డబ్బులు కోసం కాదని వాళ్ళు చెప్పగానే నాయుడు వాళ్ళు ఇద్దర్నీ అభినందించాడు.


ఇదండీ బాబూ మా పెనుగొండ కుర్రోళ్ళ ఈతల చిత్రాలు.


***శుభం***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.




రచయిత పరిచయం : సత్యనారాయణ మూర్తి M R V


ఎమ్. ఆర్. వి. సత్యనారాయణ మూర్తి. పెనుగొండ. పశ్చిమ గోదావరి జిల్లా. కవి, రచయిత, వ్యాఖ్యాత, రేడియో ఆర్టిస్టు. కొన్ని కథల పుస్తకాలు, కవితల పుస్తకాలు ప్రచురితం అయ్యాయి. కొన్ని కథలకు బహుమతులు కూడా వచ్చాయి. రేడియోలో 25 కథలు ప్రసార‌మయ్యాయి. 20 రేడియో నాటికలకు గాత్ర ధారణ చేసారు. కవితలు, కథలు కన్నడ భాషలోకి అనువాదం అయ్యాయి.




28 views1 comment
bottom of page