top of page
Writer's pictureMadduri Bindumadhavi

కాలేన దురతిక్రమః


'Kalena Duratikramaha' written by Madduri Bindumadhavi

రచన : మద్దూరి బిందుమాధవి

"రాఘవకేమయిందబ్బా, ఇవ్వాళ్ళ రానని చెప్పలేదే?" అని పదోసారి అనుకుంటున్నాడు మురళి.

\"నిన్నవెళ్ళేటప్పుడు బాగానే ఉన్నాడు...ఆరోగ్యం బాగా లేదా? సాయంత్రం ఇంటికెళ్ళేటప్పుడు ఓ సారి తొంగి చూస్తే పోలా" అనుకుని పనిలో పడ్డాడు.

రాఘవ ఈ ఆఫీసుకి వచ్చినప్పటి నించి మురళితో స్నేహం కలిసింది. ఎన్నో ఏళ్ళ నించి కలిసి తిరుగుతున్నంత ఆత్మీయత, అనుబంధం ఏర్పడ్డాయి వారిద్దరి మధ్య!

‘వీరిద్దరూ కృష్ణార్జునులే అయ్యుంటారు! ..ఈ జన్మలో రాఘవ, మురళిలుగా పుట్టారు. అంతే!’ అనుకుంటుంటారు వీరిని చూసిన వారు.

***

రాఘవ చదువులో బాగా చురుకైన వాడు, తెలివైనవాడు. ఎప్పుడు క్లాస్ ఫస్టే! అలా అలవోకగా స్కూల్ చదువు పూర్తి చేసి, ఇంజనీరింగ్ కూడా పూర్తి చేశాడు.

అమెరికా వెళ్ళి పై చదువులు చదువుకోవాలని ఆశపడ్డాడు. ఆశలే తప్ప అవి తీర్చుకోగలిగిన వనరులు లేని మధ్య తరగతి జీవి రాఘవ తండ్రి శంకర్రావు.

"నిన్ను అమెరికా పంపించి చదివించే స్తోమత మాకు లేదు. నీ తర్వాతి పిల్లల పెంపకం, చెల్లి పెళ్ళి....నాకొచ్చే జీతంతోనే అన్నీ గడవాలి. గవర్నమెంట్ ఉద్యోగంలో చేరితే నీ జీవితం ప్రశాంతంగా గడిచిపోతుంది. పెన్షన్ వస్తుంది. ఆ పరీక్షలకి రెడీ అవ్వు" అని ఉచిత సలహా ఒకటి పడేశాడు.

రాఘవ ఆశల చెట్టు మొదలంటా నరికేయబడింది.

గత్యంతరం లేక రాఘవ, తండ్రి ఆజ్ఞ మేరకు పరీక్షలు వ్రాసి "జెన్ కో" లో అసిస్టెంట్ ఇంజనీర్ గా ఉద్యోగంలో చేరాడు.

ఉద్యోగంలో చేరాడన్న మాటే కానీ, మనసులో ఏదో అసంతృప్తి! ఆఫీస్ లో ఉండే బ్యూరోక్రాటిక్ విధానాలు, మందకొడితనం రాఘవకి నచ్చేవి కావు.

అందరూ ఏ సీట్ లో పై సంపాదనకి అవకాశాలెక్కువ, ఎక్కడ పదోన్నతులకు అవకాశాలెక్కువ అని ఆలోచిస్తూ ఆ ధ్యాసే కానీ, దైనందిన పని మీద ధ్యాస ఉండేది కాదు.

నాగార్జున సాగర్ లో కొంత కాలం, శ్రీశైలంలో కొంతకాలం పనిచేసి "ఏఇ" నించి "ఏడిఇ" అయ్యాడు. పిల్లలు ఎదుగుతున్నారు. సిటీ వాతావరణం అయితే వాళ్ళ చదువులకి అవకాశాలు ఎక్కువని బదిలీ చేయించుకుని హైదరాబాద్ వచ్చాడు.

ఇదొక మహాసముద్రం. మరీ బొత్తిగా తెలియని వాడేం కాదు కానీ, ప్రభుత్వ పెద్దలు దగ్గరగా ఉండటం అనేది పాము నీడలో బ్రతికినంత సుఖం అని ప్రత్యక్షంగా అనుభవంలోకి వచ్చింది రాఘవకి.

పైరవీలు, రాజకీయాలు...అదంతా ఒక విచిత్ర వాతావరణం! ఇక్కడ ఆఫీసు ప్యూన్ దగ్గర నించి అందరూ అన్ని విషయాల్లో, ముఖ్యంగా ఆఫీస్ రాజకీయాల్లో, రాటుదేలిన అనుభవజ్ఞులే!

తప్పో, ఒప్పో సిటీకి రావాలనే నిర్ణయం తీసుకున్నాక, నిప్పుల్లో పడిన శలభంలాగా మాడిపోవాలి..లేదా పరిస్థితులకి తగ్గట్టు తనని తను మలచుకుని, బ్రతకనేర్చిన తెలివి తేటలతో నెట్టుకు రావాలి!

ఇప్పుడు రాఘవ అసంతృప్తికి అలాంటి సంఘటనే ఒకటి కారణం!

***

ఆఫీసులో పదోన్నతుల ప్రక్రియ జోరుగా సాగుతున్నది. ఈ సారి ఖచ్చితంగా రాఘవ ‘డి ఇ’ అవుతానని ఆశగా ఉన్నాడు. అందుకు అతను అర్హుడే!

తలవని తలంపుగా ఆ జోన్ కి వీరభద్రరావు ఆ ఆఫీస్ హెడ్ గా వచ్చాడు. రాఘవకి అంతకు ముందు బాసులు ఇచ్చిన టెస్టిమోనియల్స్, సెల్ఫ్ ఎసెస్మెంట్స్ అన్నీ అనుకూలంగా ఉన్నాయి. పదోన్నతి ఖాయం అనుకుంటూ ఉండగా, రిజర్వేషన్ వర్గం వారు ఇంతకు ముందు పదోన్నతుల మీద కోర్టుని ఆశ్రయించిన కారణంగా, తీర్పు వచ్చేవరకు అన్నట్టు ఈ సారి ఇంటర్వ్యూలు అయిపోయినా ఫలితాలు బయటపెట్టలేదు.

ఆరు నెలల తరువాత ఫలితాలను ప్రకటించారు. అందులో రాఘవ పేరు లేదు. ఈ హఠాత్పరిణామం తట్టుకోలేక మానసికంగా బాగా కృంగిపోయాడు. తనకంటే అర్హత, వర్క్ నాలెడ్జ్ తక్కువ ఉన్న వారి క్రింద పని చేసే దౌర్భాగ్యాన్ని ఊహించుకోలేకపోతున్నాడు.

ఆఫీసుకి వెళ్ళాలనిపించక ఇంట్లో ఉండిపోయాడు.

***

మురళి వస్తూనే "ఏమిటిది రాఘవా! ఇంత వయసొచ్చాక నేను చెప్పాలా? నా కంటే పెద్దవాడివి. ఎన్నో ఆటుపోట్లు తట్టుకుని నిలబడ్డవాడివి! ఇలాంటి ఫలితాలు, నిరాశలు నీకు కొత్తా? ఏం జరిగిందో తెలియక వదిన గారు కంగారు పడుతున్నారు చూడు!" అన్నాడు.

"నా బ్యాచ్ లో నాతో పాటు చదివిన వాళ్ళు అమెరికా వెళ్ళి ఎంత బాగా సెటిల్ అయ్యారో! వాళ్ళేం నా కంటే తెలివయిన వారూ కాదు. సమర్ధులూ కాదు. నా గతే ఇలా కాలింది" అన్నాడు విరక్తిగా!

" మీ నాన్నగారు చెప్పారని ప్రైవేట్ లో అప్లై చెయ్యకుండా, గవర్నమెంట్ సర్వీస్ కి వెళ్ళావు. పోనీ అక్కడయినా నిజాయితీగా పని చెయ్యటమే కానీ, నిన్ను నువ్వు ప్రమోట్ చేసుకోవటం చేత కాదు. ఈ రోజుల్లో పనితో పాటు ఆ విద్యలు కూడా వచ్చి ఉండాలి! బాసుల దృష్టిలో పడే తెలివితేటలు కానీ, లౌక్యం కానీ నీకు లేవు" అని "అసలేం జరిగుంటుందంటావ్" అన్నాడు.

"ఇప్పుడు మన బాస్ వీరభద్ర రావు పని చేసిన పాత ఆఫీసులో అతని బంటు లాంటి సత్యనారాయణకి ఈ సారి ఎలాగయినా ప్రమోషన్ ఇప్పిస్తానని వాగ్దానం చేశాట్ట. తనకి వాగ్దాన భంగం కలగకూడదని, లిస్టులో సత్యనారాయణ పేరు ఉన్నదో లేదో కనుక్కోవటానికి పోయిన నెల మన హెచార్ శాఖ వారికి ఫోన్ చేసి ప్రమోషన్ లిస్ట్ గురించి అడిగాడుట. అతని పేరు లేదని చెప్పగానే, మన వీరభద్రం పై వాళ్ళకి అవసరమయిన పని చేసి పెడతానని, ఎలాగయినా ఇతని పేరు ఈ సారి ప్రమోషన్ లిస్టులో ఉండేట్లు చూడమని ప్రాధేయపడ్డాడుట. ఉన్నట్టుండి పోస్టులు పెంచలేరు కనుక, చేతికి అడ్డొచ్చే నా బోటి వాడు బలవుతాడు. దాని పర్యవసానమే, నన్ను లిస్టులో నించి తీసేసి సత్యనారాయణ పేరు చేర్చబడింది. ఈ విషయం నిన్న క్యాంటీన్ లో రహస్యంగా మన వెంకట్రావు, అదే.....అటు వార్తలు ఇటు, ఇటు సమాచారాలు అటు మోస్తుంటాడే....అతను, ఎవరితోనో చెబుతుంటే విన్నాను" అన్నాడు.

"జరిగింది కరెక్ట్ అనను కానీ, నువ్వు ప్రాయోపవేశం చేసినంత మాత్రాన సమస్య పరిష్కారం అవదు కదా! ఇప్పుడు నీ

మానసిక స్థితి నీ భవిష్యత్తుని పాడు చెయ్యకూడదు. టైం రాఘవా..అన్నిటి కంటే టైం చాలా బలమైనది. కాకపోతే, ఇప్పుడు ఆ వీరభద్రంగారు ఇక్కడికి బదిలీ మీద రావటమేంటి.. ఆయనకి కావలసిన మనిషిని లిస్ట్ లో ఇరికించడం కోసం, నిన్ను తీసెయ్యటమేంటి!" అన్నాడు.

"అలా రేపు నాగార్జున సాగర్ పిక్నిక్ కి వెళ్ళొద్దాం, కాస్త మార్పుగాను, ఊరటగాను ఉంటుంది" అని చెప్పి వెళ్ళాడు మురళి.

అనుకున్నట్టు మరునాడు ఇద్దరూ భార్యలతో కలిసి సాగర్ వెళ్ళారు. తిరుగు ట్రిప్పులో యాక్సిడెంట్ అయి రాఘవ భార్య శైలజ కాలు విరిగి స్టీల్ రాడ్ వేసి ఆపరేట్ చెయ్యవలసి వచ్చింది.

పులి మీద పుట్రలాగా ఈ సమస్య ఒకటి వచ్చి పడింది ఇప్పుడు రాఘవకి. హాస్పిటల్ కి వచ్చిన మురళితో "నాకు టైం బాగా లేదురా! ఒక దాని మీద ఒకటి నా సహనాన్ని పరీక్షిస్తున్నాయి" అన్నాడు.

"అవును రాఘవా...మొన్నామధ్య పేపర్ లో చూడలేదా.. ఏభయ్యేళ్ళు ఒక హాస్పిటల్లొ డాక్టర్ గా లక్షల మందికి తన సేవలు అందించిన వ్యక్తికి కోవిడ్ సోకి, వెంటిలేటర్ దొరక్క అదే హాస్పిటల్లో ప్రాణాలు వదిలాడు!"

"మహాభారతంలో పాండవుల జీవితంలో ఇలాంటి సంఘటనలు కోకొల్లలు. ధర్మం తప్పని వారు, యుద్ధ విద్యల్లో ఆరితేరిన వారు, సాక్షాత్తూ శ్రీ కృష్ణుని అండదండలు ఉన్నవారు.. పాండవులకి ఎదురయిన పరిస్థితులు తలచుకుంటే, సామాన్య మానవులం మనమెంత అనిపిస్తుంది. ఉదాహరణకి,

"రాజట ధర్మజుండు, సుర రాజ సుతుండట ధన్వి

శాత్రవోద్వేజకమైన గాండీవము విల్లట

సర్వ భద్ర సమ్యోజకుడయిన సారధి చక్రియట

ఉగ్ర గదాధరుండు భీముడై యాజికి తోడు వచ్చునట

వీరికి ఆపద కల్గుట కేమి చిత్రమో

"కాలోహి దురతిక్రమః"

అని, అశ్వత్థామ ఉపపాండవులందరిని వధించినప్పుడు భీష్ముడు అన్న మాటలివి.

“ధర్మానికి మారుపేరైన ధర్మరాజు రాజు గా పరిపాలిస్తున్నాడు. మహా వీరుడైన అర్జునుడు, యోద్ధ శత్రు భయంకరమైన గాండీవము అతని ధనుస్సు. సర్వ సౌభాగ్యాలనూ ప్రసాదించే శ్రీకృష్ణుడు వాళ్లకు తోడు. ప్రచండ గదాధారి యైన భీమసేనుడు కొండంత అండ. యింతటి సహాయ సంపత్తి కలిగినా పాండవులకు అరణ్య, అజ్ఞాత వాసాలనే కష్టాలు తప్పలేదు. ఇది చాలా ఆశ్చర్యం. ఎంతటి వారికైనా పూర్వకర్మ ఫలితాలు అనుభవించక తప్పదు. ఏ ఒక్కరూ కాలనియమానికి అతీతులు కారని మనకు నలుడు,హరిశ్చంద్రుడు,శ్రీరాముడు మొదలైన వారి జీవితాలు రుజువు చేస్తున్నాయి" అని భీష్ముడు తాత్వికంగా అంటాడు.

"అలా మనని మనం సమాధాన పరుచుకుని, జీవిత ప్రయాణం ముందుకు సాగించాలే కానీ, నిస్పృహతో చతికిలపడితే ఆరోగ్యాలు పాడవటం తప్ప సాధించేదేం లేదు."

"ఎవరి జీవితంలోను ఎప్పుడూ చీకటే ఉండదు. చీకటి తరువాత వెలుగు రాక తప్పదు. కాకపోతే వేచి చూచే ఓపిక మనిషి నేర్చుకోవాలి. బహుకొద్ది మందికే జీవితం వడ్డించిన విస్తరిలాగా నడుస్తుంది".

"చూస్తుండు, మీ అబ్బాయికి ఐ ఐ టి లో సీట్ వచ్చి, వాడు అక్కడికి చదువుకోవటానికి వెళతాడు. ఏదో ఒక ఆశ మనిషిని నడిపించాలి, నడు సినిమాకెళ్ళొద్దాం" అని రాఘవని బయలుదేరదీశాడు.

‘నిరాశలో కృంగి పోయే వాడికి నిస్వార్ధంగా, బేషరతుగా చెయ్యందించి నడిపించే మురళి లాంటి స్నేహితుల అవసరం ఎంతో ఉంది’ అనుకుంది రాఘవ భార్య శైలజ తృప్తిగా.

***

తరువాతి ప్రమోషన్స్ టైం కి రాఘవతో పాటు జెన్ కో లో పని చేసిన విష్ణుమూర్తి హెడ్డాఫీసులో ప్రమోషన్స్ ప్రక్రియలో ముఖ్యమైన వ్యక్తిగా ఉన్నాడు. ఇప్పటికీ సంస్థలో రాఘవకి రావలసిన గుర్తింపు రాలేదని, అతనికి అన్యాయం జరిగిందని పై అధికారులతో మాట్లాడి రాఘవకి ఎలాగయినా ప్రమోషన్ రావాలని గట్టిగా వాదించాడు.

ప్రమోషన్ తో రాఘవ జోనల్ హెడ్ అయ్యాడు.

కూతురు వసుధకి మంచి సంబంధం కుదిరింది.

మబ్బులు విడిపోయినట్టు సమస్యలు తీరాయి. కష్టాలు వచ్చినా శాపం పెట్టినట్టు మూకుమ్మడిగా వస్తాయి. అవి తీరినా అలాగే తీరిపోతాయి కదా అనుకున్నాడు, సాయంత్రం ఆఫీసు నుంచి వచ్చి వాలు కుర్చీలో విశ్రాంతి తీసుకుంటున్న రాఘవ. మురళి చెప్పినట్టు అంతా కాల మహిమ అనుకున్నాడు.

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.


రచయిత్రి పరిచయం : మద్దూరి బిందుమాధవి


నేనొక రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్ ని.

నాలుగేళ్ళ క్రితం ఒక స్నేహితురాలి ప్రోద్బలంతో "ముఖ పుస్తకం" లో కధలు వ్రాయటం మొదలుపెట్టాను.

ఇప్పటికి 300 కధలు వ్రాశాను. ఎక్కువగా సామెతల మీద, శతక పద్యాల మీద..సమకాలీన సామాజిక అంశాలతో అనుసంధానం చేస్తూ వ్రాశాను. కొన్ని కధలు సైన్స్ నేపధ్యంతో కూడా వ్రాయటం జరిగింది. ఇప్పుడిప్పుడే రామాయణ, భారత, భాగవత, ఇతిహాసాల్లో సమకాలీన అంశాలకి అన్వయమయ్యే పద్యాలు, శ్లోకాల మీద పిల్లల కధలు వ్రాస్తున్నాను.

"తెలుగు వెలుగు" లోను, వెబ్ పత్రికలయిన "గో తెలుగు", "నెచ్చెలి", "తెలుగు తల్లి కెనడా", "మొలకన్యూస్", "కౌముది", "కధా మంజరి" లోను నా కధలు ప్రచురించబడ్డాయి.

ముఖ పుస్తకం లో 7-8 బృందాల్లో కధలు వ్రాస్తున్నాను.

సరదాగా ప్రారంభించిన ఈ వ్యాపకం నాకు ఎంతో విజ్ఞానదాయకంగా ఉన్నది.

నన్ను ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు.




136 views0 comments

Kommentare


bottom of page