top of page

అమృతత్వమానం

మనతెలుగుకథలు.కామ్ వారు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన విజయదశమి కథల పోటీలో ప్రథమ బహుమతి పొందిన కథ


'Amrutatvamanam' written by Madduri Bindumadhavi

రచన : మద్దూరి బిందుమాధవి

"అమ్మా! శ్యాం అంకుల్ వచ్చారు" అని లోపలికొచ్చి చెప్పింది మా అమ్మాయి దీప. దీప చదువుకునేటప్పుడు వాళ్ళ కాలేజిలో లెక్చరర్ ఆయన.

దీపకి లెక్చరర్ అయినా, మాకు కూడా పూర్వ పరిచయం ఉండటంతో అంకుల్ అనే పిలుస్తుంది.

"ఆ! వచ్చారా? పోయిన వారం ఫోన్ చేసి నువ్వెప్పుడొస్తున్నావని అడిగారు. నీతోనేట పని ఆయనకి" అన్నాను.

"నాతోనా!" అంటూ ముందుహాల్లోకి వెళ్ళింది దీప.

"ఆంటీకి అమెరికా వీసా తీసుకోవాలమ్మా. ఏమేం పేపర్స్ రెడీ చేయాలని మొన్న అమ్మనడిగితే, నువ్వొస్తున్నావని చెప్పారు" అన్నారు శ్యాంసుందర్.

మంచి నీళ్ళు, కాఫీ ఇచ్చి "ఆ! ఇప్పుడు చెప్పండంకుల్. ఆంటీ ఒక్కరికేనా? మీరు రారా" అనడిగింది.

“ ఇప్పటికి ఆంటీకి చాలు. నాకు కాలేజీ ఉంది కదమ్మా" అని చెప్పి వీసా కోసం కావలసిన పేపర్స్ లిస్ట్ వ్రాసుకుని, మళ్ళీ కలుస్తానని హడావుడిగా వెళ్ళిపోయారు.

***

శ్యాం సుందర్ గారి కోడలు HCL లో పని చేస్తున్నదిట. ప్రాజెక్ట్ పని మీద మూడేళ్ళు అమెరికా పంపిస్తున్నారుట. రెండేళ్ళ పసిపిల్లవాడితో అక్కడ ఒక్కర్తే ఉద్యోగానికి వెళ్ళటం కష్టమని, తన భార్యని కోడలికి సహాయంగా పంపటానికి ఏర్పాట్లు చేస్తున్నారాయన. భార్య వనజ చదువుకోలేదు. భర్త చాటున జీవించే సగటు భార్య..తెలుగు తప్ప వేరే భాషలేవీ రావు. మూడు రోజుల తరువాత డాక్యుమెంట్స్ తెచ్చారు. అన్నీ చూసి ఓకే చేసి, ఫీజ్ కట్టి ఆన్లైన్లో వీసా ఇంటర్వ్యూకి డేట్ బుక్ చేసింది దీప.

"మీకు ఈ వయసులో కాలేజీకి వెళ్ళొస్తూ, వంట చేసుకుంటూ ఒక్కరే అన్నీ మేనేజ్ చేసుకోవటం కష్టం కదా అంకుల్? అక్క(మీ కోడలు) ఆఫీసుకెళితే ఆంటీ ఒక్కరే భాష రాని చోట మేనేజ్ చెయ్యగలరా? ఇద్దరూ వెళితే బాగుండేదేమో కదా! మీకోడలి పుట్టింటి వాళ్ళెవరూ వెళ్ళరా? అయినా మీ అబ్బాయి-కోడలు కలిసి మేనేజ్ చేసుకోలేరా" అని దీప గుక్కతిప్పుకోకుండా అడుగుతూ ఉండగానే

"అర్జెంట్ పనుందమ్మా! వీసా ఫీజ్ డబ్బుతో నేను రేపు వచ్చి కలుస్తానమ్మా" అని చెప్పి కంగారుగా వెళ్ళారు.

తను ప్రశ్న అడగ్గానే ఆయన కళ్ళల్లో కదిలిన సన్నటి నీటి పొరకి కారణమేమిటో, ఏ జ్ఞాపకాలు ఆయన గుండెని కుదిపి కన్నీరుగా బయటికొచ్చిందో దీపకి అర్ధం కాలేదు.

"అమ్మా శ్యాం అంకుల్ నేను మాట్లాడుతుంటే సమాధానం చెప్పకుండా కంగారుగా వెళ్ళిపోయారు. అసలేం జరిగిందో నీకైనా తెలుసా? ఈ మధ్య కాలంలో మీరు కలవలేదా? ఏదో సీరియస్ విషయం జరిగిందనిపిస్తోంది" అన్నది దీప.

***

షర్మిల తమ కుటుంబానికి ఇస్తున్న ప్రమోషన్ కి తమ వంతు కానుకగా, "సాయంత్రం అందరం సరదాగా సినిమా కెళదాం నాన్నా" అన్నాడు విజయ్.

"మీరిద్దరూ వెళ్ళిరండి నాన్నా! నాకు పనుంది. మీరు సినిమా చూసొచ్చేసరికి అమ్మాయికి ఇష్టమైన స్వీట్ చేస్తానంది అమ్మ" అని కొడుకుని కోడలిని బయలుదేరదీశారు శ్యాం సుందర్ గారు. స్కూటర్ తీస్తున్న విజయ్ తో "కార్ మీద వెళ్ళండి. ఈ సమయంలో అమ్మాయికి కుదుపులు మంచివి కావు" అన్నారు ఆయన.

"ఫరవాలేదు నాన్నా! అందరం అంటే కారు తియ్యచ్చు. ఇద్దరమే కదా, జాగ్రత్తగా వెళ్ళొస్తాం. ఈ ట్రాఫిక్ లో స్కూటర్ అయితేవీలు" అని విజయ్, షర్మిల స్కూటర్ మీద బయలుదేరారు.

"తొమ్మిదవుతోంది...సినిమాకెళ్ళిన పిల్లలు వచ్చేస్తారు. కలిసి భోంచేద్దాం" అని డైనింగ్ టేబుల్ సిద్ధం చేసి ఎదురు చూస్తున్నారు శ్యాం సుందర్ దంపతులు.

ఫోన్ మోగింది. మాట్లాడుతున్న శ్యాం సుందర్ మొహంలో రంగులు మారుతున్నాయ్. ఆయన కళ్ళల్లో కనబడుతున్నఆదుర్దా చూసి వనజ మనసు కీడు శంకించింది.

"ఏమయిందండీ ? ఫోన్ ఎవరి దగ్గర నించి?" అని కుర్చీ దగ్గరకి లాగి ఆయన్ని కూర్చోమని తను కూడా ఓ కుర్చీ లాక్కుని కూర్చుంది వనజ.

"పిల్లల స్కూటర్ కి యాక్సిడెంట్ అయిందిట. వేగంగా రాంగ్ రూట్ లో వచ్చిన కార్ గుద్దేసిందిట. ఇద్దరూ కిందపడిపోయారుట. కారు వాడు ఆగకుండా వెళ్ళిపోయాడుట. బాబు విజయ్ తలకి గట్టి దెబ్బ తగిలి నెత్తురు చాలా పోయిందిట. అదృష్టం, ఆ దారిలో వెళుతున్న పోలీస్ చూసి హాస్పిటల్లో చేర్చాడుట. అతనే ఫోన్ చేశాడు" అని చేతుల్లోమొహం దాచుకుని భోరుమన్నాడు.

తల్లి ప్రాణం! వార్తని తట్టుకోలేక వనజ స్పృహ తప్పి పడిపోయింది.

శ్యాం సుందర్ గారు తేరుకుని గ్లాసుతో నీళ్ళు తెచ్చి భార్య మొహాన చల్లి, కూర్చోపెట్టి కొంచెం నీళ్ళు తాగించారు. "పద యశోద హాస్పిటల్ కి వెళదాం" అని కారు తీశారు.

వీళ్ళు అక్కడికి చేరేసరికే, ‘విజయ్ ఇంక లేడు’ అనే వార్త చెప్పారు. షర్మిల ఇంకా స్పృహలోకి రాలేదు.

"ఆ అమ్మాయి గర్భవతి అండి, మీకు తెలుసా? తనకి పెద్ద దెబ్బలు తగల్లేదు. షాక్ లో స్పృహ తప్పింది. చెయ్యి, కాలు దోక్కుపోయాయి. అదృష్టం! అబార్షన్ అవలేదు. తన భర్త విషయం ఆమెకు తెలియదు" అని తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్పి ఇతర లాంఛనాలు చూడమని అక్కడి స్టాఫ్ కి చెప్పి డాక్టర్ వెళ్ళారు.

***

ఆ షాక్ నించి కోలుకోవడానికి షర్మిలకి చాలా రోజులు పట్టింది. అసలే గర్భవతి, చిన్నపిల్ల! తల్లి మానసిక పరిస్థితి పుట్టే బిడ్డ మీద ఉంటుందని శ్యాం సుందర్ దంపతులు ఒక్క క్షణం కూడా వదలకుండా కోడలిని కంటికి రెప్పలాగా కాస్తున్నారు.

షర్మిల తల్లిదండ్రులు "పుట్టబోయే వాడు తండ్రిని మింగేశాడు, దురదృష్ట జాతకుడు" అంటూ "మా అమ్మాయిని మాతో తీసుకెళతాము. అక్కడ మా ఇంట్లో చెల్లెలితో కలిసి కబుర్లు చెప్పుకుంటూ కాస్త తేరుకుంటుంది" అన్నారు.

"కొడుకుని పోగొట్టుకుని జీవచ్ఛవాలమైనాము. అమ్మాయిని చూసుకుంటూ, రాబోయే మనవడి కోసం ఆశగా ఎదురుచూస్తున్నాం! ఈ ఆనందాన్నిమాకు దూరం చెయ్యకండి. మాకు మా అబ్బాయొకటి..కోడలొకటి కాదు! మాఅమ్మాయి మాకు బరువు కాదు" అని చెప్పి పంపించేశారు శ్యాంసుందర్ దంపతులు.

ఒంటరిగా వదలకుండా వీలైనంతవరకు ఎవరో ఒకరు తన దగ్గర ఉంటున్నారు. కొడుకుకి సంబంధించిన ఆలోచనల తాలూకు విషాదాన్ని తమ ముఖాన కనపడకుండా జాగ్రత్త పడుతున్నారు.

నెలలు నిండి షర్మిల పండంటి కొడుకుని కన్నది. బాబుతో ఆడుకుంటూ ముగ్గురూ అదే లోకంగా కాలం గడుపుతున్నారు. ఉద్యోగంలో చేరితే షర్మిలకి కొంత కాలక్షేపం అవుతుంది, జ్ఞాపకాల నించి ఊరటగానూ ఉంటుందని శ్యాంసుందర్ గారు కోడలి చేత అప్లికేషన్స్ పెట్టించారు.

అలా షర్మిల HCL లో చేరి రెండేళ్ళయింది. మనవడితో శ్యాంసుందర్ దంపతులకి పొద్దు తెలియట్లేదు. ప్రశాంతంగా సాగుతున్న జీవితంలో ఇప్పుడు ఈ అమెరికా ప్రాజెక్ట్ పేరు చెప్పి కొత్త మార్పులు అనివార్యమైనాయి! పసి వాడిని తమతో ఉంచుకుంటే అమ్మాయి ఒంటరిదవుతుంది. పసివాడితో ఒక్కదాన్నే పంపలేక, సహాయంగా భార్యని పంపే ప్రయత్నాల్లో పడ్డారు.

శ్యాంసుందర్ గారు చెప్పిన విషయాలు విన్నాక, దీప నేను కాసేపు నోట మాట రాక స్థాణువులైనాము.

***

వనజకి వీసా వచ్చిందని చెప్పి దీప చేసిన సహాయానికి కృతజ్ఞతలు చెప్పి వెళ్ళారు శ్యాంసుందర్ గారు.

దీప అమెరికా వెళ్ళే ముందు శ్యాంసుందర్ గారింటికి వెళ్ళి వనజని, షర్మిలని కలిసి వారికి ధైర్యం చెప్పి, అక్కడికి రాగానే తనకి ఫోన్ చేయమని నంబర్ ఇచ్చింది. "ఏమన్నా అవసరం ఉంటే మొహమాటపడకుండా నా సహాయం తీసుకోండి" అని చెప్పి వచ్చింది.

అనుకున్న ప్రకారం షర్మిల పిల్లవాడితో, అత్తగారితో కలిసి అమెరికా వెళ్ళింది. ఆరునెలలు ఉండి వస్తూ మనవడిని వెంటపెట్టుకొచ్చింది వనజ. షర్మిల తన ఆఫీస్ దగ్గర ఒక ఇండియన్ కుటుంబం దగ్గర పేయింగ్ గెస్ట్ గా చేరింది.

షర్మిల అమెరికా వెళ్ళి రెండేళ్ళయింది. ఈ మధ్యలో శ్యాంసుందర్ గారు కనబడలేదు.

ఒకరోజు దీప ఫోన్ చేసి "అమ్మా నిన్న శ్యాం అంకుల్ వాళ్ళ కోడలు షర్మిల అక్క ఫోన్ చేసింది. అంకుల్ వాళ్ళు ఇక్కడికి వచ్చారుట. ఆ అక్కకి పెళ్ళి చెయ్యటానికి వచ్చారుట, మా ఇంటికి అంకుల్ వాళ్ళని తీసుకురమ్మని చెప్పాను" అని చెప్పింది.

కోడలి పెళ్ళి అయిన తరువాత మనవడిని తీసుకుని దీప వాళ్ళ ఉంటున్న ఊరికి వెళ్ళారు శ్యాం సుందర్ గారు. అతిధి మర్యాదలయ్యాక పిచ్చాపాటీ మాటల్లో "పిల్లలున్న ఆడవాళ్ళు మళ్ళీ పెళ్ళి చేసుకోవాలంటే కొంచెం కష్టమే కదా అంకుల్! ఎవరి పిల్లలనో తమ స్వంత పిల్లలుగా ఆదరించే ఔదార్యం కొత్తగా వారి జీవితంలో ప్రవేశించే మగవారికి ఉంటుందా అనేది ఒక ప్రశ్నే! ఇప్పుడు షర్మిలక్క విషయంలో ఆ చేసుకున్నతను వీడిని సరిగా చూడడేమో అనే కదా మీరు తీసుకెళుతున్నారు?" అనడిగింది.

"కాదమ్మా! బాబుని మాతో పంపించటానికి అతను ఒప్పుకోలేదు. అమ్మాయి ఉద్యోగం చేసుకుంటూ తన కొడుకుతో ఒంటరిగా బ్రతికేస్తాను అని పట్టుదలగా ఉంటే నేనే పెళ్ళికి ఒప్పించాను. మాకు వయసొచ్చేస్తున్నది, రేపు మాకేమైనా అయితే తను ఒంటరైపోతుంది అని నచ్చచెప్పాను. అప్పుడు అమ్మాయి, తన కొడుకుని కూడా మనస్ఫూర్తిగా తన జీవితంలోకి ఆహ్వానించగలిగే వ్యక్తినే పెళ్ళి చేసుకుంటానని పట్టుదలగా చెప్పింది. ఈ అబ్బాయి చాలా మంచివాడమ్మా. బాబుని తమ దగ్గరే ఉంచమని ప్రాధేయపడి అడిగాడు."

"మాకు ఈ వయసులో తోడు కావాలని మేమే అతన్ని ఒప్పించి తీసుకెళుతున్నాం" అని చెప్పారు.

చెట్టంత కొడుకు చనిపోతే కోడలిని పల్లెత్తు మాట అనకుండా..ఆమె వల్ల తమకి దురదృష్టం చుట్టుకుందనే నిందలు ఆమె మీద వెయ్యకుండా...ఆడపిల్లని కడుపులో

దాచుకుని..ఆమె ఉన్నతి కోసం అహరహం పాటుపడుతూ...చివరికి తనే పూనుకుని ఆమెకి రెండో పెళ్ళి చేసిన శ్యాంసుందర్ గారి విశాల హృదయానికి, ఔన్నత్యానికి, అమృతత్వానికి చేతులు జోడించి నమస్కరించాను.

***శుభం***

రచయిత్రి పరిచయం : మద్దూరి బిందుమాధవి

నేనొక రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్ ని.

నాలుగేళ్ళ క్రితం ఒక స్నేహితురాలి ప్రోద్బలంతో "ముఖ పుస్తకం" లో కధలు వ్రాయటం మొదలుపెట్టాను.

ఇప్పటికి 300 కధలు వ్రాశాను. ఎక్కువగా సామెతల మీద, శతక పద్యాల మీద..సమకాలీన సామాజిక అంశాలతో అనుసంధానం చేస్తూ వ్రాశాను. కొన్ని కధలు సైన్స్ నేపధ్యంతో కూడా వ్రాయటం జరిగింది. ఇప్పుడిప్పుడే రామాయణ, భారత, భాగవత, ఇతిహాసాల్లో సమకాలీన అంశాలకి అన్వయమయ్యే పద్యాలు, శ్లోకాల మీద పిల్లల కధలు వ్రాస్తున్నాను.

"తెలుగు వెలుగు" లోను, వెబ్ పత్రికలయిన "గో తెలుగు", "నెచ్చెలి", "తెలుగు తల్లి కెనడా", "మొలకన్యూస్", "కౌముది", "కధా మంజరి" లోను నా కధలు ప్రచురించబడ్డాయి.

ముఖ పుస్తకం లో 7-8 బృందాల్లో కధలు వ్రాస్తున్నాను.

సరదాగా ప్రారంభించిన ఈ వ్యాపకం నాకు ఎంతో విజ్ఞానదాయకంగా ఉన్నది.

నన్ను ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు.



415 views2 comments

2 Comments


shahnaz bathul
shahnaz bathul
Jun 02, 2022

కథ చాలా బాగుందండి. శ్యాంసుందర్ గారులాంటి వారు ఈ భూమి మీద ఉన్నారు.

Like

drreddyks
Jan 06, 2022

మరోలా భావించకండి. తన స్వసుఖం కోసం బిడ్డను అత్తా మామలతో ఆ వయసులో పంపడం చాల దుర్మార్గంగా ఉంది. మాతృత్వం స్త్రీకి వరం.ఎదిగిన బిడ్డను వయసుపైబడిన వాళ్ళతో పంపి భాద్యతను గంగలోకలిపే స్త్రీ తల్లే కాదు. ఆ చిన్నారి, తల్లిక్ దూరమైనామనే బాధ మానసిక సంఘర్శణ తో ఎలా పెరిగి ప్రయోజకుడవుతాడు. రేపు ఆ పెద్ద వయసు వాళ్ళు ఎవరో ఒకరు చనిపోతే ఈ బిడ్డ గతేవిటి ? అప్పుడు ఈ బిడ్డను తను తీసుకెళితే అక్కడ ఇమడగలడా? రచయితగాని మీరుగాని ఆలోచించలేదు.

Like
bottom of page