'Nanna' written by Madduri Bindumadhavi
రచన : మద్దూరి బిందుమాధవి
మహేందర్ మధ్యాహ్న భోజనం అయ్యాక హాస్పిటల్ లో మంచం మీద పడుకుని చూరుకేసి చూస్తూ ఆలోచిస్తున్నాడు.
నాన్న గుర్తు రాగానే గుండె బరువెక్కినట్టు అనిపించింది.
కళ్ళు మూసుకున్నాడు. ఆర్ద్రమైన మనసు, కంటి చెమ్మగా మారింది.
కొడుకు అరుణ్ లోపలికొచ్చి, "నాన్నా!" అని మీద చెయ్యేశాడు. తెరిచిన తండ్రి కనుకొలకుల్లో నీరు చూసి "ఎందుకు నాన్నా కంగారు? అంతా బాగానే జరుగుతుంది. మిగిలిన పారామీటర్స్ అన్నీ బాగానే ఉన్నాయని డాక్టర్ గారు చెప్పారు. ఎంత! ..ఆపరేషన్ అయ్యాక రెండు రోజులకి డిశ్చార్జ్ చేస్తారు" అని తన ధోరణిలో తను మాట్లాడేస్తున్నాడు.
"ఛా..ఛా! నా ఆరోగ్యం గురించి కానీ, ఆపరేషన్ గురించి కానీ నాకే భయమూ లేదు నాన్నా! తాతయ్య గుర్తొచ్చారు. ఇప్పుడు నాకు వచ్చినట్లే ఆయనకి హార్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు నేనేమీ చెయ్యలేకపోయాను. ఇప్పుడున్నన్ని వసతులూ అప్పుడు లేవు. నేను చేసిన చిన్న ఉద్యోగంతో ఆయనకి ఆపరేషన్ చేయించి, ఆయన్ని బ్రతికించుకోలేక పోయాను" అని కళ్లు తుడుచుకుంటూ అన్నాడు మహేందర్.
అరుణ్ కి ఉద్యోగ రీత్యా వచ్చే అనేక సదుపాయాల్లో, జీతాలతో పాటు సదరు ఉద్యోగికి, వారి తల్లిదండ్రులకి కూడా ఆరోగ్య బీమా సౌకర్యం ఉన్నది. ఆ సదుపాయాన్ని ఉపయోగించుకుంటూ, ఇప్పుడు తండ్రికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఆపరేషన్ చేయిస్తున్నాడు.
***
మహేందర్ తండ్రి యాజులు గారికి ఇద్దరు కూతుళ్ళ తరువాత మహేందర్ పుట్టాడు. కొడుకంటే మహా ప్రేమ యాజులుగారికి. పిల్లలని లాలనగా దగ్గరకి తియ్యటమే కానీ, దండించే అలవాటు లేని మృదు స్వభావి ఆయన.
మహేందర్ కి ఎప్పుడూ ఆటల ధ్యాసే! చిన్నప్పుడయితే ఫరవాలేదు కానీ, ఎదుగుతూ ఉన్నా కూడా, చదువు మీద శ్రద్ధ ఏర్పడలేదు. స్కూల్ కి వెళ్ళినప్పుడు తప్ప, ఇక పుస్తకం తియ్యటం అనేది అతని దినచర్యలో లేదు.
గట్టిగా మందలిస్తున్నానన్న భావనలో పక్కన కూర్చోబెట్టుకుని, "నాన్నా! చదువు లేకపోతే ఎందుకూ పనికి రావు. "చెట్టు పేరు చెప్పి కాయలెంతకాలం అమ్ముకోగలవు? నోట్లో అక్షరం ముక్క ఉంటే, ప్రపంచాన్ని చుట్టి రావచ్చు. నాన్న పేరు, అమ్మ మంచితనం, మనకున్న ఆస్తి నీకు ఎక్కువ కాలం కూడు పెట్టవు. నీతోటి వారంతా చదువుకుని, పెద్ద ఉద్యోగాలు చేస్తూ నీ కళ్ళ ముందరే తిరుగుతుంటే, అప్పుడు నీకు నీవే కించపడతావు" అని చెప్పేవాడు.
"మగ పిల్లల విషయంలో మరీ మెతక తనం పనికి రాదు. కాస్త కరుకుదనం...చూపించకపోయినా ఉన్నట్టు నటించాలి బావా" అని బావమరిది నెత్తీ నోరు కొట్టుకుని చెప్పేవాడు.
"వాడే తెలుసుకుంటాడులే" అనే వాడే కానీ దండించేవాడు కాదు యాజులు గారు.
అలా పెద్దగా చదువు అంటని మహేందర్ అత్తెసరు ఉద్యోగంతో సరిపెట్టుకుని, తండ్రితో పాటు ఆ ఊళ్ళో తండ్రి కట్టించిన ఇంట్లో భార్యా పిల్లలతో కాపురం చేస్తున్నాడు.
రాత్రి అన్నం తిని పడుకున్న యాజులు గారు గుండె నొప్పితో మెలికలు తిరిగిపోతున్నారు. నాన్నని ఆ స్థితిలో చూసిన మహేందర్ కాలూ చెయ్యి ఆడక, కాలు కాలిన పిల్లి లాగా అటూ ఇటూ తిరుగుతున్నాడు. తల్లి మహాలక్ష్మి గారి సలహాతో యాజులు గారి ఫ్రెండ్ డా. కృష్ణ మూర్తి కి ఫోన్ చేశాడు. ఆయన వచ్చి చూసి, ఇంజక్షన్ చేసి రేపు తీసుకొచ్చి తన హాస్పిటల్లో ఎడ్మిట్ చెయ్యమని, ధైర్యం చెప్పి వెళ్ళాడు.
మరునాడు హాస్పిటల్ కి వెళ్ళాక, కృష్ణ మూర్తి గారు ప్రాధమిక పరీక్షలన్నీ చేసి, ఆపరేషన్ చెయ్యాలని, లక్ష రూపాయలు ఖర్చవుతుందని చెప్పారు.
మహేందర్ అంత డబ్బు ఎక్కడ తేగలనని బిక్క మొహం వేశాడు. తేలేకపోతే నాన్న దక్కడు.
భార్య, కొడుకు ఇంటికెళ్ళాక, ఒంటరిగా ఉన్నప్పుడు డాక్టర్ స్నేహితుడిని పిలిచి..."నా ఆరోగ్యం మందులతో నడిపిద్దాం! ఇప్పుడు ఆపరేషన్...అవి ఇవి అంటూ హడావుడి చెయ్యకు! అసలు ఆపరేషనే అక్కర్లేకుండా మందులతో మేనేజ్ చెయ్యలేమా? ఒక వేళ అలాంటి సదుపాయం ఉంటే ఎన్నాళ్ళు అలా నడిపించచ్చు" అనడిగాడు యాజులు గారు.
"మహా అయితే రెండేళ్ళు మేనేజ్ చెయ్యచ్చు. ఆపరేషన్ అయితే పది పన్నెండేళ్ళు ఢోకా లేదు. కానీ ఈ సారి నొప్పి ఈ స్థాయిలో వస్తే మాత్రం ప్రాణం దక్కదు" అని చెప్పారు కృష్ణ మూర్తి గారు.
మధ్యాహ్నం కాఫీ తీసుకొచ్చిన కొడుకుతో "ఎల్లుండి నన్ను ఇంటికి పంపించేస్తానంటున్నాడు కృష్ణమూర్తి మామయ్య. ఊరికే కంగారు పడ్డారు కానీ, నా ఆరోగ్యం భేషుగ్గా ఉన్నదని ఇప్పుడే చెప్పాడు" అన్నారు యాజులు గారు.
లోకజ్ఞానం తక్కువగా ఉన్న మహేందర్ "హమ్మయ్యా అని ఊపిరి తీసుకుని...రాత్రి చాలా కంగారు పడ్డాం నాన్నా! డాక్టర్ మామయ్య ఉండబట్టి సరిపోయింది, లేకపోతే ఏం చెయ్యాలో తెలియక గాభరా వచ్చేది" అని "అమ్మా...నాన్న రేపు ఇంటికొచ్చేస్తారుట. నేను చెప్పలా...నాన్న లాంటి మంచి మనుషులకి దేవుడు అన్యాయం చెయ్యడని" అని తండ్రి చెయ్యి పట్టుకుని మంచం పక్కనే కూర్చున్నాడు.
***
అప్పటికి యాజులు గారు ఇంటికొచ్చి పదిహేను రోజులయింది. కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవలు వచ్చి పలకరించారు.
మాటల్లో పెద్దల్లుడు "మామయ్యా! ఆపరేషన్ ఎందుకు వద్దన్నారు? మందులతో గుణాత్మకమయిన (క్వాలిటీ) జీవితం ఉండదు. ఆపరేషన్ అంటే భయం వల్ల వద్దన్నారా?" అనడిగాడు.
"ఆపరేషన్ అంటే ఎంత లేదన్నా రెండు లక్షలు ఖర్చు! ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేసేశాను. మీలాంటి గుణవంతుల నీడన వారి జీవితాలు బాగానే గడిచిపోతాయి. ఇక మహేందర్ చివరికి పుట్టాడు. వాడు పెద్దగా చదువుకోలేదు. అందుకే పెద్ద ఉద్యోగం రాలేదు. తలదాచుకునేందుకు ఈ గూడు ఉన్నది కనుక తక్కువ జీతంతోనే నెట్టుకు రాగలుగుతున్నాడు."
"నా దగ్గరా, పిల్లల బాధ్యతలయ్యాక పెద్దగా డబ్బేమి మిగలలేదు. అప్పు చెయ్యాలి, లేదా ఉంటున్న ఇల్లు అమ్మాలి. అలా అయితే తప్ప డబ్బు సమకూర్చలేను. అప్పు చేసి ఆపరేషన్ చేయించుకుంటే, రేపు కాలం కలిసిరాక నాకేమయినా అయితే ఆ అప్పులు వాడి నెత్తిన పడతాయి. మీ అత్తగారు అమాయకురాలు. నే వెళ్ళిపోయినా ఆవిడ ఆయుర్దాయం ఉన్నంతకాలం బ్రతకాలి కదా! ఇప్పుడు ఈ ఇల్లు అమ్మి ఆపరేషన్ చేయించుకుంటే, వాడిని రోడ్డున పడేసినట్టవుతుంది."
"పుట్టిన ప్రతివాడు ఏదో ఒక రోజు పోవలసిందే! కాస్త ముందూ..వెనక అంతే! అందుకే కృష్ణమూర్తితో చెప్పాను...ఆపరేషన్ లేకుండా మందులతో వైద్యం చెయ్యమని" అన్నారు.
"తప్పు చేస్తున్నారేమో మామయ్యా! వాడికి ఈ విషయం తెలిసిన నాడు తట్టుకోగలడా?" అని "అందరం తలా కాస్తా వేసి ఆపరేషన్ చేయించేవారం కదా" అన్నాడు.
"అంత మాటన్నావు చాలు నాయనా! ఆడపిల్లలకి చేతనయితే పెట్టాలి కానీ వారి దగ్గర పుచ్చుకోకూడదు. నాకేదైనా అయితే మహేందర్ ని కనిపెట్టి ఉంటానని మాటివ్వు" అని చేతిలో చెయ్యి వేసి వాగ్దానం చేయించుకున్నారు.
ఆ తరువాత ఆరు నెలలకే యాజులు గారు భగవత్సన్నిధికి చేరిపోయారు.
***
"అదేం నాన్నా? తాతయ్యకి పెద్ద ఇల్లు ఉండేది కదా! అది అమ్మే కదా నువ్వు అక్క పెళ్ళి చేసి, ఫ్లాట్ కొన్నావు" అన్నాడు.
"అవును అరుణ్.....అలా నాకు అది అక్కరకి రావాలని, వస్తుందని ఆ రోజుల్లో తాతయ్య తన జీవితాన్ని పణంగా పెట్టి అమ్మకుండా నాకు అది మిగిల్చి వెళ్ళారు."
"ఇప్పుడు నీ ఉద్యోగం ద్వారా వచ్చిన సదుపాయాల్లో నాకు వైద్యం చేయిస్తున్నావు. నేను నీలాగా చదువుకోలేదు. అందుకే పెద్ద ఉద్యోగం చెయ్యలేకపోయాను. తాతయ్య ఎంత చెప్పినా వినకుండా ఆ రోజుల్లో చదువుకోకుండా గాలికి తిరిగాను. పాపం మా నాన్న నన్ను ఎన్నడూ కోప్పడటం కానీ, మీద చెయ్యి చేసుకోవటం కానీ చెయ్యలేదు. అటువంటి తండ్రికి నేను ప్రతిఫలంగా ఏమీ ఇవ్వలేకపోయాను. ‘అప్రయోజకుడిగా ఎదురుగా తిరుగుతుంటే పాపం ఆయన మనసు ఎంత క్షోభ పడిందో!’ అనే ఆలోచన వచ్చి కళ్ళు చెమర్చాయి" అన్నాడు.
"తాతయ్యా చాలా గ్రేట్ నాన్నా! నీ గురించి ఎంత ముందు చూపుతో ఆలోచించారో! గతాన్ని తలచుకుని బాధపడటంలో ప్రయోజనం లేదు. అవన్నీ మనసులో పెట్టుకుని నీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దని మాత్రం చెప్పగలను. మన బంటీకి తాతయ్య గొప్పతనం గురించి కధలుగా చెప్పు. ఆయన గురించి పిల్లలతో మాట్లాడితే నీకు ఊరటగా, ఆనందంగా అనిపించచ్చు."
"ఈ రోజుకి హాయిగా విశ్రాంతి తీసుకుని, రాత్రికి ప్రశాంతంగా నిద్రపో. మామ్మ కబుర్లు నిమ్మికి అమ్మ చెబుతూనే ఉంటుంది. అవి విని పిల్లలు సంస్కారం, జీవిత విలువలు నేర్చుకుంటారు. మనం వారికివ్వగలిగినవి అవే!" అని తండ్రి నుదుటి మీద ముద్దు పెట్టి వెళ్ళాడు అరుణ్.
"గుండెల్లో పెట్టి దాచుకున్న తండ్రిని, కళ్ళల్లో పెట్టి చూసుకుంటున్న కొడుకుని పొందిన నేను అదృష్టవంతుడిని" అని పక్కనున్న వారపత్రిక చేతిలోకి తీసుకున్నాడు మహేందర్.
***శుభం***
రచయిత్రి పరిచయం : మద్దూరి బిందుమాధవి
నేనొక రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్ ని.
నాలుగేళ్ళ క్రితం ఒక స్నేహితురాలి ప్రోద్బలంతో "ముఖ పుస్తకం" లో కధలు వ్రాయటం మొదలుపెట్టాను.
ఇప్పటికి 300 కధలు వ్రాశాను. ఎక్కువగా సామెతల మీద, శతక పద్యాల మీద..సమకాలీన సామాజిక అంశాలతో అనుసంధానం చేస్తూ వ్రాశాను. కొన్ని కధలు సైన్స్ నేపధ్యంతో కూడా వ్రాయటం జరిగింది. ఇప్పుడిప్పుడే రామాయణ, భారత, భాగవత, ఇతిహాసాల్లో సమకాలీన అంశాలకి అన్వయమయ్యే పద్యాలు, శ్లోకాల మీద పిల్లల కధలు వ్రాస్తున్నాను.
"తెలుగు వెలుగు" లోను, వెబ్ పత్రికలయిన "గో తెలుగు", "నెచ్చెలి", "తెలుగు తల్లి కెనడా", "మొలకన్యూస్", "కౌముది", "కధా మంజరి" లోను నా కధలు ప్రచురించబడ్డాయి.
ముఖ పుస్తకం లో 7-8 బృందాల్లో కధలు వ్రాస్తున్నాను.
సరదాగా ప్రారంభించిన ఈ వ్యాపకం నాకు ఎంతో విజ్ఞానదాయకంగా ఉన్నది.
నన్ను ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు.
Comments