'Kantlo Nalaka' - New Telugu Story Written By Kasivarapu Venkatasubbaiah
'కంట్లో నలక' తెలుగు కథ
రచన : కాశీవరపు వెంకటసుబ్బయ్య
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
కొలవలి గ్రామంలో కొండారెడ్డిది చాల పెద్ద కుటుంబం. కొండారెడ్డికి ఏడుగురు కొడుకులు, ఏడుగురు కూతుర్లు. అల్లుళ్ళు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళతో ఇల్లు కళకళలాడుతూ ఉంటుంది. కడగొట్టువానికి పెళ్లి కాలేదు.
ఆ ఊరిలో ఎత్తైన మేడ అతనిదే. వందెకరాల భూస్వామి. ఏడుకాండ్ల సేద్యం. ఎద్దులు, పాడి ఎనుములు, జీతగాళ్ళు, జీతగత్తెలతో ఆ యిల్లు ఎప్పుడు సందడి సందడిగా ఉంటుంది.
కొండారెడ్డి ఇంట్లో ఏదైనా వేడుక జరిగితే ఊరంతటికి వేడుకే. ఊరంతా వారింటి దగ్గరే ఉంటారు. ఊరికి ఏ సమస్య వచ్చినా ఏ కష్టం వచ్చినా కొండారెడ్డి ముందుండి ఆదుకుంటాడు. అందుకే కొలవలి ప్రజలు కొండారెడ్డిని దేవుడిలా గౌరవిస్తారు.
కొండారెడ్డి చిన్న కొడుకు మనోహరరెడ్డి. స్ఫురద్రూపి, చక్కని అవయవ సౌష్టవంతో, దేవతా వర్చస్సుతో, సూర్య తేజస్సుతో ప్రకాశిస్తుంటాడు. చూసిన వారు చూపు త్రిప్పుకోలేని అందం అతనిది. మనోహరరెడ్డి మంచి సేద్యగాడు కూడ.
ఆటపాటలలో సాటిలేని మేటి. కోలాటం, జడకోపు, పండరి భజన, చెక్క భజన, కర్ర త్రిప్పడంలో జగజెట్టి. పండుగ పబ్బాల వేళల్లోను, తిరుణాల, జాతర సమయంల్లోను అతని ఆటపాటలను చూడటానికి ఉండూరివాల్లే కాకుండా పక్కూరివాళ్ళు కూడా వచ్చేవాళ్ళు.
మనోహరరెడ్డికి ఇరవైఐదేంళ్లుంటాయి. కుటుంబంలో చిన్నోడైన మనోహరరెడ్డంటే అందరికీ ప్రేమనే. పెళ్లి చేయాలని అమ్మానాన్నలు, అక్కాబావలు, అన్నావదినెలు సరైనా సంబంధాలు కోసం వెతుకుతున్నారు. కొమ్మద్ది గ్రామంలో చక్కదనాల చుక్కలాంటి అమ్మాయి ఉందని తెలిసి మధ్యవర్తుల ద్వారా ఫోటో చూపించి అడిగించారు.
ఫోటో చూసిన కొమ్మద్దోళ్ళు పిల్లోడి రూప లావణ్యాలకు మురిసి, పిల్లా పిల్లోడు సరిజోడని తలచి పిల్లను చూడడానికి రాండని కొలవలివాళ్ళకు కబురంపారు.
దగ్గర్లో మంచి రోజులేదని మూడు నెలల తర్వాత వస్తామని పెద్దమనిషి ద్వారా చెప్పించారు కొండారెడ్డివాళ్ళు.
మనోహరరెడ్డి ఫోటో చూసిన తిప్పారెడ్డి కూతురు రూపావతి కుతికల్లోతు ప్రేమలో పడిపోయింది. "పెళ్లి చేసుకుంటే ఇతన్నే చేసుకోవాలి. లేదంటే ఈ జన్మనే వదిలేయాలి" అని ధృడమైన నిశ్చయాని కొచ్చింది రూపావతి. ఆమె వంటి అందమైన స్త్రీ ఈ ఇరవైనాలుగు పరిగణాలలో లేదని వినికిడి.
రూపావతి ఎంత సౌందర్యవతో అంత సుగుణాలరాశని, దయామయురాలని, దానశీలియని పేరుంది. ఆమెకు ఇంకొక కళా కూడా ఉంది. కంట్లో నలక పడితే సులువుగా తీసే విద్య తెలుసు ఆమెకు. ఆ చుట్టూ ప్రక్కల ఎవరికి కంట్లో నలక పడినా రూపావతి దగ్గరకు వచ్చి తీయించుకుని పోయేవాళ్ళు. కంట్లో నలక పడి కన్ను ఎంత ఎర్రబడిన, పుండైన రూపావతి అంత్యంత చాకచక్యంగా తీసివేసేది.
"మనోహరరెడ్డిని ఎప్పుడెప్పుడు చూస్తానా! కలిసి ఎప్పుడు మాట్లాడుతానా!" అని తీవ్రమైన కాంక్షతో అనుకుంటూ, కలలు కంటూ సమయం కోసం ఎదురుచూసింది రూపావతి.
ఈ మధ్యలో చుట్టాల పెళ్లికి కారులో కడుపకు పోయేస్తూ కొలవలి పొలిమేరలో ఉండే మర్రిమాను వద్ద మలుపు తిరుగుతూ భారీ యాక్సిడెంటై కుటుంబంతో సహా చనిపోయింది రూపావతి.
రూపావతి చనిపోతూ " మనోహరరెడ్డిని పెళ్లి చేసుకోకుండానే చనిపోతున్నానే! అయ్యో! మనోహరా! మనోహరా!" అని మనోహరనే తలుచుకుంటూ, కలవరిస్తూ అసువులు బాసింది రూపావతి.
అమ్మాయితో పాటు కుటుంబమంతా యాక్సిడెంట్ లో చనిపోయారని కొండారెడ్డివాళ్ళకు తెలిసి విపరీతంగా బాధ పడ్డారు " ఇంత మంచి అమ్మాయి మాకు కోడలు కాకుండానే చనిపోయింద" ని తీవ్ర నిరాశకు గురయ్యారు.
***
వర్షాకాలం వచ్చింది. వానలు కురిశాయి. భూములు పదునైయ్యాయి. కొలవలి రైతులు తమ తమ పొలాలను దుక్కి దున్ని, గుంటికతో పాపనం చేసుకుని, విత్తనం విత్తుకోవడానికి సిద్దపడుతున్నారు. ఆరోజు మనోహరరెడ్డి కూడా తమ పొలాల్లో మధ్యాహ్నాం వరకు సేద్యం చేసి ఇంటికి వస్తున్నాడు. ప్రతి సంవత్సరం పొలంలో ఈశాన్య మూల పూజ చేసి పొలంలో కాడి దింపి ముందుగా మడక మేడి పట్టుకుని భూమిని దున్నేది మనోహరరెడ్డినే. అది కొండారెడ్డి కుటుంబానికి ఆనవాయితీగా వస్తున్నది.
ఆ ఆనవాయితీలో భాగంగా మనోహరరెడ్డి పొలంలో సేద్యం చేసి ఇంటికి మర్రిమాను ప్రక్కనబడి వస్తుంటే - మిట్టమధ్యాహ్నం దిగుడుబావి ప్రక్కన మర్రిమాను అరుగుమీద ఒక స్త్రీ తెల్లచీర, తెల్లోటు పసుపు రయిక ధరించి ఒల్లు నిండా నగలతో ఏడుస్తూ కూర్చుని ఉండడాన్ని మనోహరరెడ్డి చూశాడు. కాడికి కట్టిన ఎద్దులను ఆపి " ఇంత మిట్టమధ్యాహ్నం సమయంలో ఒంటరిగా ఉన్న స్త్రీ ఎవరై ఉంటుంది" అనుకుంటూ ఆమెను సమీపించాడు మనోహరరెడ్డి.
ఆమె దేవతా స్త్రీ లాగా, చెట్టు క్రింద కూర్చున్న వన దేవతలా, ఆకాశం నుండి దిగివచ్చిన గంధర్వ కన్యలా కనిపించింది మనోహరరెడ్డికి.
"ఎవరు మీరు? మిట్టమధ్యాహ్నం వేళ ఇక్కడ ఎందుకు ఉన్నారు. ఈ మబ్బు ఊడల మర్రిమాను దగ్గర ఈవేళప్పుడు దెయ్యాలు ఉంటాయని అందరూ అంటుంటారు. చూడబోతే మీరు ఈ ప్రాంతానికి కొత్తలా ఉన్నారు. ఏదైనా సహాయం కావాలా? చెప్పండి చేస్తాను* అన్నాడు మనోహరరడ్డి నిస్సహాయురాలైన స్త్రీకి సహాయం చేయాలన్న సదుద్దేశంతో..
"నా పేరు చంద్రావతి, ఏ దిక్కు లేని దాన్ని. అనాథను. మా వారందరూ ఒక ప్రమాదంలో చనిపోయారు. నేనొక్కదాన్నే బ్రతికాను. మా బంధువులు రాబంందులై మా ఆస్తి నంతా దోచుకుంది చాలక నన్నుగూడా చెరబట్టబోయారు. నేను వారి నుండి తప్పించుకొని ఇటువచ్చాను. నన్ను ఎవరైనా మంచి మనస్సుతో ఆదరిస్తే నేను వారి జీవిత భాగస్వామిగా వారి సేవ చేసుకుంటూ వారితో కలిసి జీవిస్తాను" అని పలికింది.
ఆమె మాటల్లో నమ్మకమూ, వినయము ఉట్టి పడింది.
"అయ్యో! మీకు ఎంతటి కష్టం వచ్చిందండీ? సరే ఏదొక నిర్ణయం తీసుకుందాం. మీరు నా వెంటరాండి!" అంటూ కాడిమానుకు కట్టిన ఎద్దులను తోలుతూ ఊరి వైపు కదిలాడు. రూపావతి అతడిని అనుసరించిపోయింది.
అపరిచితురాలైన అమ్మాయితో కలిసి వచ్చిన మనోహరరెడ్డిని చూసి కుటుంబమంతా తెల్లబోయి చూసింది. మనోహరరెడ్డి కుటుంబ సభ్యులందరినీ సమావేశపరిచి
"ఈమె పేరు చంద్రావతి. ఈమె చాల కష్టాల్లో ఉన్నది. ఈమె కుటుంబ సభ్యులందరూ ఒక ప్రమాదంలో చనిపోయారట. ఈమె బంధువులు రాక్షసులై ఆస్తిని తమ పరం చేసుకుని ఈమెను కూడా చేరసబోయారట. వారినుంచి తప్పించుకొని ఇటు వచ్చింద"ని చెప్పుతూ ఆమె ఉద్దేశాన్ని కూడా తెలిపాడు మనోహరరెడ్డి.
మనోహరరెడ్డి చెప్పిందంతా విన్న కుటుంబ సభ్యులు " అమ్మాయి పేరుకు తగ్గట్టే మంచి రూపవతి. ముఖంలో శభలక్షణాలు కనబడుతున్నాయి. ఈమెతో మన చిన్నోడి పెళ్లి జరిపిస్తే అపురూపమైన జంటవుతుందని. అన్యోన్యంగా కాపురం చేసుకుంటారని భావించారు.
"అమ్మా! చంద్రావతి! నీకు నచ్చితే మా మనోహరుని పెళ్లి చేసుకో! నీకు ఇష్టమైతే ఈ ముహూర్తాలలోనే పెళ్లి అంగరంగ వైభవంగా జరిపిస్తాము" అని కొండారెడ్డి చెప్పాడు.
"ఇంత మంచివాడని, ఇంత అందంగాడిని ఎవరైనా కాదంటారా? నా అదృష్టంగా భావిస్తాను. "అని చెప్పి మనోహరరెడ్డితో వివాహానికి అంగీకరించింది చంద్రావతి
ఆ నెలలోనే అత్యంత విలాసవంతంగా మనోహరరెడ్డికి చంద్రావతికి పెళ్లి జరిపించాడు కొండారెడ్డి. ఆ వివాహ మహోత్సవంలో ఊరి ప్రజలంతా అత్యుత్సాహంతో పాల్గొన్నారు.
చూడముచ్చటైన ఆ జంట ఊరిలోను, పంటపొలాల్లోను తిరుగుతుంటే చూడడానికి రెండు కళ్లు చాలడం లేదు ఆ ఊరి జనానికి. నిద్రలేస్తునే చంద్రావతి ముఖం చూస్తే ఆరోజంతా మంచే జరుగుతుందన్నట్లు, ఏ పని మీదైనా పోతూ ఆమె ఎదురొస్తే ఆ పని విజయవంతం అవుతుందన్నట్లు అందరూ ప్రగాఢంగా నమ్ముతున్నారు.
ఊరిలో గృహనిర్మాణానికి పునాదిరాయి పూజలో టెంకాయను ఈ జంటతోనే కొట్టిస్తున్నారు. ఏ శుభకార్యాన్నైనా వీరితోనే మొదలు పెట్టిస్తున్నారు. ఎవరు ఏ వ్యాపారాన్ని మొదలు పెట్టిన వీరితోనే ప్రారంభిస్తున్నారు. అతికొద్ది కాలంలోనే చంద్రావతి ఊరందరి మన్ననకు, ప్రేమకు పాత్రురాలైంది.
చంద్రావతి మెట్టింట్లో అడుగు పెట్టిన వేళావిశేషమేమో గానీ, పాడిపంటలు రెట్టింపు అయ్యాయి. ధనం మూడింతలు అయ్యింది. సంపాదన పెరిగింది. అందరి ఆరోగ్యాలు చక్కబడినాయి. ఊరు కూడ తగాదాలు, సమస్యలు ఉత్పన్నం కాకుండా ప్రశాంతంగా ఉంది. చంద్రావతి సాక్షాత్తు దేవుతే మా ఊరు వచ్చి మమ్మల్ని ఉద్దరిస్తున్నది అనుకున్నారు ఊరిజనం.
ఆ ఊరిలో కాలం సుఖసంతోషాలతో ఐదేండ్ల ముందుకు వెళ్ళిపోయింది. ఐదేండ్లైనా ఆ జంటకు ఇంకా సంతానం కలగక పోయేసరికి ఆలోచనలు మొదలయ్యాయి. వారికన్నా వెనుక పెళ్లి చేసుకున్న వారు పిల్లాపాపలతో ఉంటే వీరికి పిల్లలు పుట్టక పోవడం ఏమిటీ అనుకున్నారు అందరూ. ఊర్లోని నాటు వైద్యుడికి చూపించాలని కొందరూ, లేదు ప్రొద్దుటూరులో ఇంగ్లీష్ డాక్టరుకు చూపించాలని మరికొందరూ చెబుతున్నారు. ఇవేవీ పట్టనట్టు చంద్రావతి మనోహర్లు ఒకరిపై ఒకరు గాఢ అనురక్తితో క్షణమైనా ఎడబాటు లేకుండా ప్రేమైక జీవులై గడుపుతున్నారు.
ప్రతి రోజూ చంద్రావతి భోజనాలు వండివార్చి, కుటుంబంలో అందరికీ భోజనాలు వడ్డించి అందరూ తిని బయటకు పోయాక, బోకులు కడిగి అన్నీ సర్దిపెట్టి అందరూ నిద్రపోయారని తెలుసుకొని వాకిలి వేసుకుని భోజనం చేసేది. "అందరితో పాటు నువు భోజనానికి కూర్చో చంద్రా! అందరం కలిసి కబుర్లు చెప్పుకుంటూ ఖుషీగా తిందాం!" అని బ్రతిమిలాడినా వినేది కాదు.
"మీరు కానీయండి. నేను తర్వాత తింటాను. నాకు చాల పనులుండాయి. బోకులు తోమాలి, ఉదయానికి టిఫిన్ కు రెడీ చెయ్యాలి. అన్నీ సర్దుకోవాలి. అప్పుడు గానీ తినను. అంతే కాదు ఇంటి యిల్లాలు అందరూ తిన్నాకనే చివరగా తినాలి. ముందుగా తినకూడదు అని మా అమ్మ చెప్పింది. అందుకే నేను అమ్మ చెప్పింది పాటిస్తున్నాను" అని చెప్పి మాట దాట వేసేది.
ఆలా కొంత కాలం గడిచింది. చంద్రావతి బావల్లో ఒకడైన జోగిరెడ్డికి ఆమె అన్నం తినే విషయంలో మొదట్నుంచీ అనుమానంగానే ఉంది. అది మొలకై, మానై ఒల్లంతా వ్యాపించిది.
"ఏమిటి ఈమె అందరూ అన్నం తిని నిద్రపోయాక వాకిలి వేసుకుని భోజనం చేస్తుంది. ఎందువలన ఇలా చేస్తుంది. ఏమైనా రహస్యం ఉందా? " అని నిరంతరం ఆలోచించేవాడు. అదేమిటో ఈరోజు తెలుసుకోవాలి. విషయం తేలిపోవాలి" అని నిర్ణయించుకున్నాడు.
ఆరోజు ఎప్పటిలాగే అందరూ భోజనాలు చేసి నిద్రపోయాక చంద్రావతి మిగిలిపోయిన పనులు పూర్తి చేసి అన్నీ సర్దేసి వాకిలి వేసింది. ఆ సమయం కోసమే కాసుకుని కూర్చున్న బావ జోగిరెడ్డి ఇంటి ప్రక్కగా వెళ్లి కిటికీ గుండా చంద్రావతిని చూడసాగాడు.
చంద్రావతి తిన్న బోకులన్నీ కడిగేసి, ఎక్కడివక్కడ సర్దేసి, రేపటి ఉదయానికి టిఫిన్ కు అన్నీ సిద్ధం చేసి భోజనానికి నేలపై కూర్చుంది. జోగిరెడ్డి ఆసక్తిగా, భీతి భీతిగా కండ్లు ఇంత పెద్దవి చేసుకుని చూస్తుండిపోయాడు. చంద్రావతి నేలను నీటితో అలికి అందరూ తినగా మిగిలిపోయిన అన్నానంతా కుమ్మరించుకుని మిగిలిన కూరలన్నీ అందులో వేసుకుని, అన్నమూ కూరలూ కలయ పిసికి, వెండ్రుకలు విరబోసుకుని, నాలుకను పెద్దగా బయటికి చాపి భోజనాన్ని నాలుకతో నాక్కోసాగింది.
ఈ దృశ్యాన్ని చూసిన జోగిరెడ్డి బెదిరిపోయి, పరుగున వచ్చి మందిలో పడ్డాడు. అందరిని పిలిచి తాను చూసిన విషయాన్ని భయంభయంగా, అదురుతున్న శరీరంతో చెప్పి "చంద్రావతి మనిషి కాదనీ దెయ్యమ" ని తేల్చేశాడు.
కుటుంబం సభ్యులు గుమిగూడి ఆశ్చర్యంతో మాన్పుపడిపోయారు, విపరీతమైన ఆందోళనలో పడ్డారు. కొండారెడ్డి విషయం ఉదయం తేల్చుదామన్నాడు. మనోహరరెడ్డి నమ్మలేక అయోమయంలో పడి అంతులేని ఆవేదనకు గురయ్యాడు.
ఈ వార్తా దావానలంలా ఊరంతా వ్యాపించింది. ఉదయాన్నే జనం తిరుణాల మాదిరిగా కొండారెడ్డి ఇంటి ముందు జమకూడారు. జనం ముఖాలలో పెను విషాదం నెలకొంది. అంతులేని ఆవేధన అములుకుంది. దేవతలాంటి మనిషి దెయ్యమా! అనుకుంటూ వేదనా భరితహృదయాలతో అందరూ ఉత్కంఠగా వేచి ఉన్నారు.
కుటుంబ సభ్యుల్ని, ఊరిజనాన్నీ, వారిలో చోటుచేసుకున్న విషాదాన్ని చూసిన చంద్రావతికి విషయం పూర్తిగా అర్థమైపోయింది. "ఇంతటితో ఈ ఇంటితో నాకు రుణం తీరిపోయిందని అనుకుంది. ఇక దాచడం ఎందుకు?, ఉన్నది ఉన్నట్లు చెప్పాల" ని నిర్ణయించుకుంది చంద్రావతి.
మామ కొండారెడ్డి పిలుపుతో ఇంటి బయటకు వచ్చింది చంద్రావతి. భర్త మనోహరరెడ్డి చింతాక్రాంతుడై నిలబడి ఉన్నాడు.
"చంద్రా! ఎవరమ్మా నీవు? ఇంత శోభస్కరంగా ఉన్న నీవు దెయ్యం కావడం ఏమిటి ? నిజం చెప్పు తల్లీ!" అడిగాడు కొండారెడ్డి.
"ఇంతవరకు వచ్చిన తరువాత నిజమే చెపుతాను మామయ్యా! నేను దెయ్యాన్ని కాదు. దెయ్యాలు మనుషులకు హాని కలిగిస్తాయి. నేను ప్రేతాత్మను. తీరని కోరికలతో చనిపోయినవారు ప్రేతాత్మలు అవుతారు. ప్రేతాత్మలు మనుషులకు ఎటువంటి బాధ కలిగించవు. వీలైతే తమ కోరికలు తీర్చుకుని మరుజన్మకు పోతారు.
నా పేరు రూపావతి. మా ఊరు కొమ్మద్ది. కొమ్మద్ది గ్రామంలో తిప్పారెడ్డి కూతురుని. మీ చిన్న అబ్బాయికి పెళ్లి సంబంధాలు వెతుకుతూ మాకు మీ అబ్బాయి ఫోటో పంపించారు. మాకు ఫోటో నచ్చి, నన్ను చూడడానికి మిమ్మల్ని రమ్మని మానాన్న కబురు పంపారు. మీరు దగ్గర్లో మంచి రోజు లేదని పెళ్లి చూపుల్ని వాయిదా వేశారు. నేను మీ అబ్బాయి ఫోటోను చూసిన తరువాత పెళ్లి చేసుకుంటే ఇతన్నే చేసుకోవాలి లేదంటే తనువు చాలించాలని ప్రగాఢంగా అనుకున్నాను.
దేవతలు తథాస్తు అన్నారేమో, అన్నట్లే బంధువుల పెళ్ళికి కడపకు పోయేస్తూ మీ ఊరి సమీపంలో ఉన్న మర్రిమాను వద్ద మలుపు తిరుగుతూ మేము ప్రయాణిస్తున్న కారు పెద్ద యాక్సిడెంట్ గురై నాతో సహా అందరం చనిపోయాం. నాకు మీ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలన్న కోరిక తీవ్రంగా ఉండడం వల్ల నేను ప్రేతాత్మగా మారాను. తరువాత జరిగిన కథంతా మీకు తెలిసిందే”.
"అమ్మా! మీకు యాక్సిడెంట్ అయిందని తెలిసి మేము ఆరోజు చాల బాధ పడినాం. నీ జీవితంలో ఇంత విషాదం జరిగికున్నందుకు మాకు చాలా బాధగా ఉందమ్మా! నీవు మా ఇంటికి వచ్చాక మాకు మా ఊరికి ఊహించనంతగా మేలు జరిగింది. నీకు మేమూ, మా ఊరి ప్రజలు రుణపడి ఉన్నాం. ఎప్పటికీ నీ మేలు మర్చిపోలేం" అన్నాడు కొండారెడ్డి బరువైన హృదయంతో.
"లేదు మామయ్య! నేనే మీ ఇంటిలో అంతులేని ఆనందాన్ని, మీ ఊరిలో మరువలేని ఆదరణను పొందాను. అందుకు నేను కృతజ్ఞురాలును. ఇంత జరిగాక ఇంకా ఇక్కడ నేను ఉండలేను. మీకు నాకు రుణం తీరిపోయింది" అని చెప్పి మనోహరరెడ్డి వైపు చూసింది. అతని కండ్లు ధారాపాతంగా కన్నీటిని శ్రవిస్తున్నాయి.
మనోహరరెడ్డిని సమీపించి
"మనోహర్! నువ్వు నాకు మహోపకారం చేశావు. నన్ను ఆదరించి, తీరవనుకున్న కోరికలు తీర్చి శాశ్వతంగా ప్రేతాత్మగా ఉండిపోకుండా చేశావు. ఎన్ని జన్మలు ఎత్తినా నీ ప్రేమను, నీవు ఇచ్చిన సుఖాన్ని మరువను. నీవు మళ్లీ పెళ్లి చేసుకొని కుటుంబానికి వారసులను అందించు!" మనోహరునికి ఆత్మీయంగా చెప్పింది.
"నీవులేని జీవితాన్ని ఊహించలేకున్నాను చంద్రా! నువ్వు లేకుండా నేను ఉండలేను. నువ్వు నాతో ఉండిపో చంద్రా!" విలపించాడు మనోహరరెడ్డి.
"లేదు మనోహర్! నేనెవరో బయట పడగానే నాకు భూమి మీద గడువు తీరిపోయింది తీరని కోరికలు తీరినందున. నీకు ఆయుష్ప్రమాణం చాల ఉంది. దేవుడు ఎవరిని ఎంత కాలం భూమిపై ఉంచుతాడో అంత కాలం ఉంచి తర్వాత తన వద్దకు రప్పించుకుంటాడు. అయితే మనమిద్దరం వచ్చే జన్మలో భార్యాభర్తలుగా జన్మిస్తాము. పిల్లాపాపలతో ఆనందంగా గడుపుతాము. కాబట్టి ఆవేదనను వీడి ఈ జన్మలో నీ కర్తవ్యాన్ని నువ్వు నెరవేర్చు!" అని చెప్పి, "నా గుర్తుగా నీకు ఒక చిన్న విద్య, కంట్లో నలక పడితే అత్యంత సులువుగా ఎలా తియ్యాలో నేర్పుతాను" అని భర్త చెవిలో కంట్లో నలకను తీసే వైనాన్ని చెప్పింది రూపావతి.
భర్తను చివరిసారిగా గుండెలకు హత్తుకుని "నువ్వు సంతోషంగా ఉండి నాకు ఆనందంగా వీడ్కోలు చెప్పు. లేకపోతే నాకు బాధగా ఉంటుంది" అన్నది అనునయంగా భర్త కన్నీటిని తుడుస్తూ.
అతికష్టం మీద మనోహరరెడ్డి చేతులు ఊపాడు. రూపావతి కుటుంబ సభ్యుల వైపు, ప్రజల వైపు తిరిగి "అందరికీ కడసారి వందనాలు, సెలవు" అంటూ వీడ్కోలు పలికి పదడుగులు ముందుకు వేసి అందరూ చూస్తుండగానే గాలిలో కలిసి అదృశ్యమైపోయింది.
కుటుంబ సభ్యులు నిర్ఘాంతపోయారు. జనం దుఃఖ సముద్రంలో మునిగిపోయారు. మనోహరరెడ్డి దిగ్భ్రాంతుడై శిలా విగ్రహంలా నిలిచిపోయాడు.
అప్పటి నుండి ఆ చుట్టుపక్కల ఎవరికి కంట్లో నలక పడినా ఆ ఇంటికే వచ్చి నలక తీయించుకుని పోతుండేవారు.
-------+--
కాశీవరపు వెంకటసుబ్బయ్య గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
పేరు: కాశీవరపు వెంకటసుబ్బయ్య
చదువు: B.com
పుట్టిన తేది: 1960
తల్లిదండ్రులు: వెంకటసుబ్బయ్య
రచనలు: ఎద మీటిన రాగాలు కవితా సంపుటి.
అముద్రితాలు: తుమ్మెద పదాలు మని కవితలు సంపుటి, పినాకిని కథలు కథల సంపుటి.
సాహిత్య సేవ: చైతన్య సాహిత్య కళా వేదిక సంస్థను స్థాపించి అనేక సాహిత్య కార్యక్రమాలు నిర్వహించడం.
సన్మానాలు సత్కారాలు: అనేక సాహితీ సంస్థల నుంచి సన్మానాలు సత్కారాలు పొందడం.
コメント