top of page

కస్తూరి రంగ రంగా - ఎపిసోడ్ 1

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.







Youtube Video link

'Kasthuri Ranga Ranga Episode 1' New Telugu Web series

Written By Ch. C. S. Sarma




సిహెచ్. సీఎస్. శర్మ గారి కొత్త ధారావాహిక కస్తూరి రంగ రంగా ప్రారంభం


“బ్రహ్మయ్యా..”

పుండరీక పిలుపు…


ఇరువురూ ఇరుగుపొరుగులు.... స్నేహితులు.... బంధువులు... సహెూపాధ్యాయులు...

భార్య కుసుమ అందించిన కాఫీ త్రాగి గ్లాసును ఆమెకు అందించి ఇంటి వరండాలోకి వచ్చాడు బ్రహ్మయ్య.


వరండా మెట్లముందు నిలబడివున్న మిత్రుడు పుండరీకను చూచాడు. "పుండరీకా!... రా.. రా!..." ప్రీతిగా పిలిచాడు.


పుండరీక వరండా మెట్లు ఎక్కి తన చేతిని బ్రహ్మయ్య చేతితో కలిపాడు....

"మిత్రమా... నీ అల్లుడు మిలిటరీ సర్వీసు సెలక్టు అయ్యాడు. ఆర్డర్ వచ్చింది. ట్రైనింగ్ నిమిత్తం డెహ్రాడూన్ కు పైవారం బయలుదేరాలి..." ఆనందంగా నవ్వుతూ చెప్పాడు పుండరీకయ్య.


"చాలా చాలా సంతోషంరా!...అంతా నీ ఆశీర్వాద బలం.."


తృప్తిగా నవ్వాడు పుండరీకయ్య....

"నాదేం లేదురా!... వాడి పంతం... పట్టుదల... క్రమశిక్షణ... కారణంగానే వాడు అనుకొన్నదాన్ని సాధించాడు..."


ఇరువురూ కూర్చున్నారు. ఆనందంగా ఒకరి ముఖాన్ని ఒకరు చూచుకొంటూ నవ్వుకొన్నారు.


పుండరీక గారి కంఠస్వరాన్ని విన్న కుసుమ కాఫీ గ్లాసుతో వరండాలోకి వచ్చింది. నవ్వుతూ గ్లాసును పుండరీకయ్య గారికి అందిస్తూ...

"అన్నయ్యగారూ... తీసుకోండి...” అంది.


పుండరీకయ్య కుసుమ అందించిన గ్లాసును చేతికి తీసుకొన్నాడు. "అమ్మా!... నీ అల్లుడికి మిలటరీ సెలక్షన్ ఆర్డర్ వచ్చింది..." సంతోషంగా చెప్పాడు పుండరీకయ్య.


“అలాగా!... చాలా చాలా సంతోషం అన్నయ్యా!... ఆ దేవుడు వాడి కోర్కెను తీర్చాడు..." ఆమె ముఖంలో ఎంతో ఆనందం...


పోస్ట్ మేన్ వీరయ్య...

వండాలోకి వచ్చి బ్రహ్మయ్యగారికి నమస్కరించాడు... "సార్.... పెద్దాయన దగ్గరనుంచి పుత్తరం!..." అందించి వెళ్లిపోయాడు.


బ్రహ్మయ్య ఆ కవర్ ను రెండువైపులా త్రిప్పి చూచి... ఏదో సందేహంతో...

ఒకవైపు చించి లోని కాగితాన్ని బయటికి తీశాడు.


"ఎవరండీ వ్రాసింది?...” అడిగింది కుసుమ.


`బ్రహ్మయ్య సెల్ మ్రోగింది...

“హలో!...” మెల్లగా అడిగాడు.


"సార్!... మీరు ఒక తప్పు చేశారు... మీరు అందరికీ చెప్పే సామెతే!... 'కాంచనం... ఖర్మ విమోచనం...' మీ మనుమడు ఇపుడు మా స్వాధీనంలో వున్నాడు... మీకు వాడు ప్రాణాలతో కావాలంటే ఇరవైనాలుగు గంటల లోపల ఇరవై లక్షలు.... క్యాష్ ను మాకు అందివ్వాలి... అపుడు వాడిని ప్రాణాలతో వదులుతాం... అలస్యం చేస్తే... మీ మనుమడిని మీరు మరచిపోవాల్సిందే.... అరగంటలో మరలా కాల్ చేస్తాను...” కాల్ కట్ అయింది.


బ్రహ్మయ్యగారి చేతిలోని లెటర్ జారిపోయింది. వారి ముఖంలో విచారం... ఆందోళనతో కుసుమ క్రింద పడ్డ కాగితాన్ని చేతికి తీసుకొని టీపాయ్ పై వుంచింది. భర్త స్థితిని చూచి...

“ఎవరండీ!... ఎందుకు అంత ఆందోళన... చెప్పండి...." ప్రాథేయపూర్వకంగా అడిగింది కుసుమ.


"రేయ్!... బ్రహ్మా!... ఫోన్ చేసింది ఎవరురా!..." అసహనంగా అడిగాడు పుండరీకయ్య....


ఫోన్ లో తాను విన్న సమాచారాన్ని పైపంచెతో ముఖాన పట్టిన చమటను తుడుచుకొని... మెల్లగా చెప్పాడు బ్రహ్మయ్య.


పుండరీక... కుసుమ ఆశ్చర్యపోయారు.

వారి ముఖాల్లో విషాదం!!!...


"అవునా... ఇప్పుడు ఏంచేయాలనుకొంటున్నావ్?..." మెల్లగా అడిగాడు పుండరీకయ్య...


“అరగంటలో ఫోన్ చేస్తానన్నాడురా!... అపుడు ఏం చెబుతాడో విని... డబ్బుకు ప్రయత్నించాలి...”


"డబ్బు ఎంతండీ?...”

“ఇరవై లక్షలు...”

"ఆ..."

"అవును... అదేవాడు చెప్పిన మాట!..."


“ఇప్పటికిపుడు ఇరవై లక్షలు మనకు ఎవరు ఇస్తారండీ?..." దీనంగా అడిగింది కుసుమ... ఆమె కళ్లల్లో కన్నీరు...


బ్రహ్మయ్య సాలోచనగా మౌనంగా వుండిపోయాడు. ముఖంలో విచారం..


"బ్రహ్మా!..”

"ఆ.. చెప్పు... పుండరీక...”,


"నేను అమ్మాయి పెండ్లికి పొలం అమ్మానుగా... దాని తాలూకా... ఆరు లక్షలు నాదగ్గర వున్నాయి. దాన్ని నీకు ఇస్తాను..."


బ్రహ్మయ్య ఆశ్చర్యంతో పుండరీకయ్య ముఖంలోకి చూచాడు.


"ఏరా... అలా చూస్తావ్!...” అడిగాడు పుండరీకయ్య.


"అమ్మాయి పెండ్లికి ఎత్తిపెట్టిన డబ్బును నాకు ఇస్తావా?..." కన్నీటితో అడిగాడు దీనంగా...


"అవును... పెండ్లివారికి విషయాన్ని చెప్పి మరో ముహూర్తాన్ని కొంత కాలం తర్వాత నిర్ణయించుకోవచ్చు. ఇపుడు ఆ కిరాతక కిడ్నాపర్స్ చెప్పినట్లుగా వారికి డబ్బులు ఇచ్చి... మీ మనుమడిని రక్షించుకోవడం మన కర్తవ్యంరా!..." అనునయంగా చెప్పాడు. పుండరీకయ్య...


సయ్యద్...

బ్రహ్మయ్య, పుండరీకయ్యల తోటే స్కూల్లో పనిచేసే ఉపాధ్యాయుడు.

ముగ్గురూ... మంచి మిత్రులు... ఆవూరివారే...

సైకిల్ పై వెళుతూ బ్రహ్మయ్యగారి ఇంటి వైపు చూచాడు.


పుండరీకయ్య... బ్రహ్మయ్యగారి భార్య కుసుమ... వరండాలో వుండడాన్ని గమనించి... సైకిల్ గోడకు ఆనించి గృహ ప్రాంగణంలోకి ప్రవేశించి వరండాను సమీపించాడు... ఆ ముగ్గురిలో వయస్సున పెద్దవాడు బ్రహ్మయ్య. హెడ్మాస్టర్. మరో సంవత్సరంలో రిటైర్ కాబోతున్నాడు...


బ్రహ్మయ్య మనుమడు శాలివాహన... టిఫిన్ తిని కలసి చదువుకొనేటందుకు ప్రక్కవీధిలోని స్నేహితుడు రమణ ఇంటికి గంట క్రితం వెళ్లాడు.


అందరి విషాద వదనాలను చూచిన సయ్యద్...

"సార్!... ఏమయింది?... అందరూ చాలా విచారంగా వున్నారు..." ఆశ్చర్యంతో అడిగాడు సయ్యద్.


పుండరీకయ్య... విషయాన్ని సయ్యద్ కు తెలియచేశాడు...


ఈసారి ఆశ్చర్యం... ఆవేదన... సయ్యద్ గారి వంతు అయింది. అతని కొడుకు సుల్తాన్ ఆవూరి సబ్ ఇనస్పెక్టర్... "సార్!... ఫోన్ చేసి ఎంతసేపయింది?..." అడిగాడు సయ్యద్...


“ఇరవై నిముషాలయింది..." చెప్పాడు బ్రహ్మయ్య.

సయ్యద్ తన కొడుకు సుల్తాన్ కు ఫోన్ చేశాడు. వెంటనే బ్రహ్మయ్య ఇంటికి రావాల్సిందిగా చెప్పాడు.

ఆరోజు ఆదివారం....

కొంతమంది టెన్త్ విద్యార్థులు ట్యూషన్ కు వచ్చారు.


బ్రహ్మయ్య... పుండరీకయ్య....సయ్యద్ లను చూచి నమస్కరించారు.

"మేము ఒక సమస్యలో వున్నాము. ఈ రోజు క్లాస్ జరుగదు. ఇండ్లకు వెళ్లండి...." మెల్లగా చెప్పాడు బ్రహ్మయ్య.


పిల్లల ముఖంలో కూడా.... విచారం... మెల్లగా అందరూ వెళ్లిపోయారు.

బుల్లెట్ పై సయ్యద్ కుమారుడు సబ్ఇనస్పెక్టరు సుల్తాన్ వచ్చాడు.


పెద్దవారు తమ గురువులు... అయిన బ్రహ్మయ్య... పుండరీకయ్యలకు సెల్యూట్ చేశాడు.

"సార్!... ఏంజరిగిందో కాస్త వివరంగా చెప్పండి!...” అడిగాడు సుల్తాస్.

బ్రహ్మయ్య తాను ఫోన్లో విన్న సమాచారాన్ని సుల్తాన్ కు వివరంగా చెప్పాడు.


"సార్!...”

"ఆ... సుల్తాన్ .... అడుగు....’’

“వాడు ఇంకా ఫోన్ చేయలేదుగా!..."

“లేదు... అరగంట కావచ్చింది... ఏ క్షణంలోనైనా ఫోన్ చేయవచ్చు!...”. ఆందోళనగా చెప్పాడు బ్రహ్మయ్య....


బ్రహ్మయ్యగారి సెల్ మ్రోగింది...

సుల్తాన్ వారి చేతిలోని సెల్ ను తన చేతికి తీసుకొన్నాడు. చెవిదరికి చేర్చాడు... గొంతు మార్చి బ్రహ్మయ్యగారిలా...

"సార్!... చెప్పండి....” అన్నాడు.


‘కొత్తగా చెప్పేది ఏం లేదు... ఇరవై లక్షలు రేపు సాయంత్రం... గోదావరి నుండి మీ వూరు పంట పొలాల వైపుకు దక్షిణంగా వస్తున్న పంటకాలువ నది నుండి ప్రారంభం అయ్యే చోట... కాలువ తూర్పువైపున రేపు సాయంత్రం ఏడుగంటలకు ఇరవై లక్షలతో రావాలి. క్యాషన్ ను మాకిచ్చి... మీపిల్లవాడిని తీసుకెళ్లాలి. పోలీస్ కంప్లెయింట్ ఇచ్చి ఎలాంటి రభసను సృష్టించినా... మీ మనవణ్ణి చంపి గోదావరి నదిలో పారేస్తాం... చేపలకు ఆహారమైపోతాడు జాగ్రత్త!....”. బెదిరించాడు.


"సార్!... సార్!... అంతపని చేయకండి సార్!.. రేపు డబ్బుతో మీరు చెప్పిన ప్రకారం ఖచ్చితంగా... సాయంత్రం మీరు చెప్పిన చోటికి వస్తాను.....” బ్రహ్మయ్యగారి గొంతుతో సుల్తాన్ జవాబు.


“ఒంటరిగా రావాలి!..." గద్దించినట్టు చెప్పాడు...

"అలాగే సార్!..." ఎంతో వినయం.

సెల్ ఆవలివైపున కట్ అయింది.

"సార్!... ఈ విషయాన్ని గురించి మీరు ఎవరితోను చర్చించకండి. డబ్బును సిద్ధం చేయాలి” సాలోచనగా చెప్పాడు సుల్తాన్.... క్షణం తర్వాత...

“బాబా!...”


"క్యా బేటా!..."

"ఆప్కా అకౌంట్ మే కితనా పైసా హై!..."


"ఖరీబ్ దోలాక్...”

"సార్ మీ దగ్గర..." బ్రహ్మయ్య ముఖంలోకి చూస్తూ అడిగాడు సుల్తాన్....


“నాలుగు లక్షలు..”

"పుండరీకయ్య సార్... మీదగ్గర?..."


"నా దగ్గర ఆరు లక్షలు ఉన్నాయి.... "

“సో... రెండు నాలుగు ఆరు... పన్నెండు లక్షలు వుంది. ఇక కావాల్సింది. ఎనిమిది లక్షలు... " సాలోచనగా చెప్పాడు సుల్తాన్.


“అవును” అన్నాడు సయ్యద్...

“సార్!!..” బ్రహ్మయ్యగారి ముఖంలోకి చూస్తూ పిలిచాడు సుల్తాన్.


"ఏమిటి సుల్తాన్?...

"మీరు తప్పుగా అనుకోకండి !... ప్లీజ్....”


"ఆ... విషయం ఏమిటి?..."

"మీకు ఐదు ఎకరాల భూమి వుందికదా!...”


“ఆ... వుంది...”


"ఆ పట్టా పత్రాలను తీసుకొనిరండి... ఆంధ్రాబ్యాంక్ మేనేజర్ నా క్లాస్మేట్ డిగ్రీలో... పేరు పరంజ్యోతి. పత్రాలను బ్యాంక్ లో వుంచి... పదిలక్షలు లోన్ తీసుకొందాం... ఈరోజు ఆదివారం కదా.... వాడు ఇంట్లోనే వుంటాడు. మనం వెళ్లి విషయం వాడికి చెప్పి పత్రాలను వాడికి ఇచ్చి రేపు వుదయం బ్యాంకు ఓపెన్ చేయగానే డాక్యుమెంటేషన్ పూర్తిచేసి... మనకు పన్నెండు గంటల లోపల పదిలక్షలు ఇవ్వాలని అడుగుదాం... మీరు ధైర్యంగా పత్రాలు తీసుకురండి. మనం పరంజ్యోతి ఇంటికి వెళ్లి వాడితో మాట్లాడుదాం..." చెప్పాడు సుల్తాన్.


"సార్!... పత్రాలను తీసుకురండి.. వెళదాం..." అనునయంగా చెప్పాడు సయ్యద్.

బ్రహ్మయ్య, కుసుమ ఇంట్లోకి వెళ్లారు.


"సుల్తాన్ సార్..." పుండరీకయ్య పిలుపు.

"సార్.. మీరు నన్ను సుల్తాన్ అనే పిలవాలి సార్.. మా నాన్నగారెంతో మీరూ, బ్రహ్మయ్య సార్ నాకు అంతే... చెప్పండి..." నవ్వుతూ అడిగాడు.


“ఆ... నాయనా!... నీవు మీనాన్న వచ్చి మా వాణ్ణి కాపాడారు... వాడు... నేను... కుసుమ ఎంతగానో భయపడిపోయాం... ఏం చేయాలో తోచక... ఆ సర్వేశ్వరుడు... అల్లా... మీకుటుంబాన్ని చల్లగా చూస్తాడయ్యా.." ఆనందంగా చెప్పాడు పుండరీకయ్య.


బ్రహ్మయ్య భూమి పట్టా పత్రాల కవరుతో వరండాలోకి వచ్చాడు... వెనకాలే కుసుమ... ఆమె వదనంలో విచారం చూచిన సుల్తాన్... “అమ్మా!... భయపడకండి.... బాబును వాళ్లు ఏమీ చేయలేరు... వాళ్లకు కావాల్సింది డబ్బు.. దాన్ని ఇచ్చేసి రేపు మన బాబును మనం తెచ్చుకొందాం!... సార్ పదండి...” ముందు సుల్తాన్ వెనకాల బ్రహ్మయ్య... వారితోటే సయ్యద్ వీధిలోకి నడిచారు....


"అమ్మా వాడు తిరిగి వచ్చే వరకు నీకు తోడుగా నేనుంటా..." చెప్పాడు పుండరీక.


కుసుమ.... తల ఆడించింది... "సరే అన్నయ్యా!..." అంది.


బ్రహ్మయ్య... సయ్యద్.. సుల్తాన్ లు వెళ్లిపోయాక కుసుమ టీపాయ్ పైన వున్న కాగితాన్ని చేతికి తీసుకొంది. పరీక్షగా చూచింది. వ్రాసింది ఢిల్లీలో వుండే పెద్ద కొడుకు శశాంక్... అతని భార్య పేరు నిర్మల, అతనికి ఇద్దరు ఆడపిల్లలు కవలలు. దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత ఒక మొగ బిడ్డ, వాడిపేరే శాలివాహన, వయస్సు ఎనిమిది సంవత్సరాలు. ఆడపిల్లల పేరు కవిత... కమల....


తాతగారు బ్రహ్మయ్య హెడ్మాస్టర్... ఎంతో అనుభవం... పరిజ్ఞానం వున్న గొప్ప వ్యక్తి అయినందున.... శశాంక్ నిర్మలలు శాలివాహనను... తాతయ్య నానమ్మల వద్ద వుంచి చదివిస్తున్నారు. ముఖ్యంగా మహమ్మారి కరోనా భయం... రేపల్లె ప్రశాంతమైన వూరు. చుట్టూ పైరు పొలాలు... స్వచ్ఛమైన గాలి... నీరు. ఆ కారణంగా శాలివాహనను వారు బ్రహ్మయ్య... కుసుమల దగ్గర వుంచారు.


'అమ్మా నాన్నలకు నమస్కారములు. మీరు వుభయులు, శాలివాహన కుశలమని తలుస్తున్నా. ఇచ్చట నిర్మల... పిల్లలు కవిత కమలలు కుశలం... పిల్లల స్టడీస్ ఆన్లైన్లో సాగుతున్నాయి. శాలివాహన చదువు విషయాన్ని అక్కడ.... అమ్మా... మీరు బాగా చూచుకొంటారని మాకు నమ్మకం. మీరు బయటకు వెళ్లేటపుడు మాస్క్ వేసుకొని వెళ్లండి. మీ ఆరోగ్యాన్ని... శాలివాహనను జాగత్తగా చూచుకోండి. యావత్ విశ్వాన్ని కమ్ముకొనివున్న ఆ కరోనా... ఉధృతం తగ్గితే వూరికి వచ్చి పదిరోజులు మీతో కలసివుండాలని మనస్సున కోరిక... అది ఎప్పుడు కుదురుతుందో వూహకందని విషయం. మా గురించి దిగులు పడకండి... మీరు జాగ్రత్త.



ఇట్లు

మీ శశాంక్'


ఇంకా వుంది...

కస్తూరి రంగ రంగా రెండవ భాగం త్వరలో..


సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం



మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.



మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


రచనా వ్యాసంగం: తొలి రచన ‘లోభికి మూట నష్టి’ విద్యార్థి దశలోనే రాశాను, అప్పట్లో మా పాఠశాల బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ నుండి ఈ శ్రవ్య నాటిక అన్ని తరగతులకు ప్రసారం చేశారు.

అందులోని మూడు పాత్రలను నేనే గొంతు మార్చి పోషించాను.

మా నాయనమ్మ చెప్పిన భారత భాగవత రామాయణ కథలు నన్ను రచనలకు పురికొల్పాయి.

ఇప్పటి వరకు 20 నవలలు, 100 కథలు, 30 కవితలు రాశాను.





114 views0 comments

Comentários


bottom of page