top of page

కొస మెరుపు పార్ట్ 1


'Kosa Merupu Part 1/2' - New Telugu Story Written By Surekha Puli

Published In manatelugukathalu.com On 30/10/2023

'కొస మెరుపు పార్ట్ 1/2' పెద్ద కథ మొదటి భాగం

రచన: సురేఖ పులి

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

త్రివేణి మధుపర్కం కట్టుకొని ముత్తైదువుల మధ్య సన్నాయి మేళంతో గుడి కెళ్ళి వస్తున్నది. పెళ్లి వారు వీధి అంతా మారుమ్రోగేలా సినిమా పాటలు పెట్టారు. రంగు రంగుల చిన్ని లైట్ల బల్బ్లతో పెళ్లింటిని అందంగా అలంకరించారు. వివిధ వాహనాలపైన, ఖరీదైన బట్టల్లో వచ్చిన బంధువులు, స్నేహితులు సంతోషంతో హడావిడిగా వున్నారు.


ప్రక్కింట్లో వున్న స్నేహ మేడపైన కిటికీలో నుండి పెళ్లి పందిరి వైపు చూసింది. స్నేహకు తెలియకుండానే కన్నీరు వుబికి వస్తున్నాయి. శాస్త్రోక్తంగా వివాహం జరుగుతున్నది. పెళ్ళికూతురి త్రివేణి మొహంలో కాగడా వేసి వెదికినా ‘పెళ్ళికళ’ లేదు.


పెళ్లికొడుకు మొదటి కళత్రంకు పుట్టిన పదేళ్ల కొడుకు, పదిహేనేళ్ళ కూతురు కూడా పెళ్లి ఆహ్వానంలో భాగమే. వీధి వారంతా ‘ఈడు-జోడు’ బాగా కుదిరిందని మెచ్చుకున్నారు.


త్రివేణి అన్నావదినలు కాళ్ళు కడిగి కన్యాదానం చేసే కార్యక్రమంలో నిమగ్నమైనారు. త్రివేణి తండ్రి కాలు గాలిన పిల్లిలా తిరుగుతున్నాడు. అతన్ని చూడగానే స్నేహకు వెన్నుముకలో వణుకు మొదలయింది. గుండె చప్పుడు వేగం పెరిగింది.


పెళ్లి బట్టలతో బయటకు వచ్చిన త్రివేణీ దంపతులకు పురోహితుడు ఆకాశం వైపు అరుంధతీ నక్షత్రం చూడమని చెప్పాడు. దంపతులు దండం పెట్టుకున్నారు.


సూర్యుని తేజస్సుకు పూర్తిగా కళ్ళు తెరచి ఆకాశాన్ని చూడలేము, అయినా నవదంపతులు మిట్ట మధ్యాహ్నం వేళ అరుంధతీ నక్షత్రం చూడగలుగుతారు. అదెలా సాధ్యమో!? అబద్ధాల బతుకులే!


కాదు. ఆ వైపున చూస్తే చాలు, అరుంధతీ దేవి ఆశీర్వాదం యిచ్చినట్టే.


ఠపీమని కిటికీ తలుపులు మూసేసింది.


*****


కిటికీ తలుపులు తెరిచేసరికి త్రివేణి వాళ్ళ మేడ పైన ఖాళీగా వున్న వాటాలోకి తెలుగు వాళ్ళు అద్దెకు వచ్చారు. ఆ వీధిలో తెలుగు వారు చాలా తక్కువ. తెలుగు వారనే సరికి స్నేహకు ఉత్సాహం పట్టలేక సాయంత్రానికల్లా వాళ్ళింటికి వెళ్ళింది. శాంతారంగనాథం గారికి

ఎన్నో నోముల, పూజల ఫలితంగా కూతురు, కొడుకు పుట్టారు. అదేమిటో కర్మ, ఇద్దరూ మూగ. ఆరేళ్ల కూతురు శారద బొద్దుగా, ముద్దుగా వుంది. నాలుగేళ్ల కొడుకు సారథి; కొంచెం మందకొడిగా, అదేదో లోకంలో వున్నట్టు వుండే వాడు.


అల్లరి చేసే శారదనే అందరూ ఇష్టపడే వాళ్ళు, కానీ స్నేహకు మాత్రం సారథి మౌనం, అమాయకత్వం చూస్తుంటే జాలి మిళితమైన ప్రేమ కలిగేది. సారథి కూడా స్నేహను చూడగానే రెండు చేతులు చాచి, ఎత్తుకోమని సైగ చేస్తూ ఆత్రుత పొంగే కళ్ళల్లో కాంతులు నింపుకునే వాడు.


రోజు రోజుకూ స్నేహ, సారథిల మధ్య అనుబంధం పెరిగి, యశోధాకృష్ణుల ఆప్యాయతను తలపించేది. అప్పుడప్పుడు సారథి అన్నం తినకుండా మారాం చేస్తే, స్నేహ వద్ద భోజనం చేసి రాత్రుళ్లు పడుకునేవాడు. స్నేహ తల్లిదండ్రులు కూడా సమ్మతించేవారు.


స్నేహ బి. ఎస్సి. ఫైనల్ ఇయర్ వుండగా శారదని, సారథిని ఇంటికి దగ్గర్లో వున్న మూగ పిల్లల స్కూల్లో జాయిన్ చేశారు. అందుకే మూగ పిల్లల స్కూల్ ఆవరణలోనే ఇల్లు అద్దెకు తీసుకున్నారట. సంతానం గురించి తల్లిదండ్రులు ఎన్ని పాట్లు పడుతారు, పాపం!


ఇంట్లో పెళ్లి ముచ్చట్లు మొదలు కాగానే, స్నేహ విడమర్చి చెప్పేసింది, “నేను సారథిని దత్తత తీసుకుంటాను, ప్లీజ్, నా పెళ్లి గురించిన ఆలోచనుల మానుకోండి. ” ఆ సమయానికి సరే, అన్నారే గాని స్నేహ తల్లిదండ్రులు పెళ్లి వేటను కొనసాగిస్తునే వున్నారు.


దత్తత విషయం చూచాయగా సారథి అమ్మానాన్నల నడిగితే, ససేమిరా ఒప్పుకోలేదు. అంతే మరి, ఎవరి పిల్లలు వాళ్ళకు ముద్దు.


*****


శీతాకాలం త్వరగా చీకటి పడుతుంది. అనుకోకుండా కెమిస్ట్రీ ప్రాక్టికల్స్ క్లాస్లో ఆలస్యమైంది. స్నేహ కాలేజీ నుండి బస్సు దిగి అడ్డదారిన ఇంటివైపు నడుస్తూ చలిగా వుందని తలపై నుండి చీర కొంగును లాగి త్వర త్వరగా అడుగు లేస్తుంది. ఆ ప్రదేశం అంతా తాటివనంలా వుంది. వీధి దీపాలు లేవు. చీకటికి ఒంటరితనం తోడుగా వుంటే భయం! వణుకు!!


స్నేహ ఉలిక్కిపడ్డది. అవును, అనుమానం లేదు; అది సారథి గొంతుక.. ఆక్రందన!! అత్యంత ప్రయత్నించి అమ్మా! అంటున్నాడు. స్నేహ చాలా ప్రయాసపడి నేర్పించిన మొదటి పదం 'అమ్మ'.


చుట్టూ చూసింది, కొద్ది దూరంలో త్రివేణి నాన్నగారు ఇంద్రకర్, ‘గ్రామదేవత’ విగ్రహం ముందు అలికి ముగ్గులు పెడుతున్నాడు. త్రివేణి అన్నగారు సుఖేందర్ సారథిని ఎత్తుకున్నాడు, మరొకతను తులుతూ టార్చ్ లైట్ పట్టుకున్నాడు. ఆ ప్రక్కగానే ఆగిన ఆటోలో ఓ స్త్రీ కూర్చుని వుంది.


స్నేహకు వళ్ళంతా చెమటలు పట్టాయి, గుండె చప్పుడు డప్పులా వుంది. తాటి చెట్టు మాటున, ఎవరికి కనబడకుండా నిలబడింది. ఇంద్రకర్ మంత్రాలు చదువుతూ దేవత విగ్రహం ముందు దీపం వెలిగించి, తెల్లటి వస్త్రాన్ని సారథి పైన కప్పి దేవత ముందు కూర్చో బెట్టారు. స్నేహ తల దిమ్మెక్కింది. నోరు తడారి పోయింది.


సారథి గిలగిల్లాడి పోతున్నాడు. సారథీ.. అంటూ గట్టిగా అరిచింది స్నేహ. కానీ తన స్వరంలో మూగ; చెవిలో వినికిడి లోపం. పూజ అనంతరం సారథిని సాష్టాంగ నమస్కారం పెట్టించి, నోట్లో ఏదో ద్రవం లాంటిది పోశారు. వెంటనే ఒరిగిపోయాడు. సారథి మెడ చుట్టూ తాడు బిగుసు కుంది. టార్చ్ పట్టుకున్నతను ముక్కు వద్ద చేతి వేళ్ళను పెట్టి ఇంద్రకర్, సుఖేందర్ ముఖాలు చూసి ఓ మందహాసం చేశాడు. సారథి పడుకునే వున్నాడు.


తెల్లటి వస్త్రం, పూజ సామగ్రి మూట కట్టి తులుతూ, ఏవో పిచ్చిగా వాగుతూ మూడో వ్యక్తి ఆటో డ్రైవరు సీట్లో కూర్చున్నాడు. ఇంద్రకర్, సుఖేందర్ చుట్టూ ఒకసారి చూసి, ఎవరు లేరనే నమ్మకం కుదిరాక, ఆటో ఎక్కారు. ఆటో కదిలింది. ఆశ్చర్యం! ఆటోకు నెంబర్ ప్లేట్ లేదు.


ఆటో పూర్తిగా కనుమరుగు అయ్యాక స్నేహ తాటిచెట్టు మాటు నుండి మెల్లిగా అడుగులు వేస్తూ గ్రామదేవత కేసి నడిచింది. సారథి దగ్గరగా వెళ్ళి శరీరం పట్టుకుంది. శరీరం చల్లబడ్డది. అంత చలిలోనూ స్నేహ రక్తం వేడెక్కింది.


దారి పొడుగునా వెక్కి వెక్కి ఏడుస్తూ ఇంటికి చేరి స్నేహ అమ్మకు వివరించింది.


“అమ్మా, పోలీస్ రిపోర్ట్ ఇద్దాం, నేను సాక్ష్యం. ”


“సరే, ఇద్దాం. ముందు నువ్వు స్నానం చేసి వేడి పాలు గాని కాఫీ గాని తాగు. నువ్వు, నేను, నాన్న కలసి పోలీస్ స్టేషన్ వెళ్దాము. ” కరుణ నిదానంగా, ఓపిగ్గా సమాధానం యిచ్చింది.


“నాకు స్ట్రాంగ్ కాఫీ కావాలి, తలంతా భారంగా వుందమ్మా. ”


స్నేహ స్నానం చేసే సమయంలో కాఫీ కలిపి, అందులో ప్రతీ రోజు భర్త ఆనందరావు వేసుకునే ఒక నిద్ర మాత్రకు బదులు రెండు నిద్ర మాత్రలు కల్పింది కరుణ.


*****


స్నేహ నిద్ర లేచే సరికి కరుణ ఫలహారం ప్లేటుతో గదిలోనికి వచ్చింది.


“స్నేహ, నువ్వు వూరు వెళ్ళావని, అడిగిన వాళ్ళకు నేనూ, నాన్న అబద్ధం చెప్పాము. ”


“అబద్ధమా, ఎందుకు? అయినా, నేనేంటి, నాకేమిటి ఇంతలా నిద్ర మత్తు?”


“సారథి విషయం నువ్వు చూసింది నిజమే కావచ్చును, కానీ నువ్వు ఎక్కడా, ఎప్పటికీ, ఎవ్వరితోనూ ఆ విషయమై ప్రస్తావించ వద్దు. ”


“అమ్మా, ఇంత దారుణం నేను దాచుకోలేను. ”


ఆనందరావు అందుకున్నారు: “స్నేహా, ఈ వీధి అంతా ఒక్క మాట మీద వున్నారు, నువ్వు ఒక్క దానివి అందరికీ విరుద్ధంగా చెప్పినా, ఎవ్వరూ నమ్మరు. అనవసరంగా వుచ్చులో ఇరుక్కోవద్దు. ”


“నాన్నా.. ” అని స్నేహ తండ్రిని పట్టుకొని ఏడ్చేసింది. అల్లారుముద్దుగా పెరిగిన కూతురే ఐనా తల్లిదండ్రులను ఎదిరించే ధైర్యం లేదు.


చాలా సేపు గడిచిన తరువాత అమ్మ చెప్పింది.


‘శాంతారంగనాథం వాళ్ళింట్లో సారథి కనబడుట లేదని ఆదుర్దా పడుతున్న సమయంలో తాటి కల్లు తీసే ఒకతను తాటి తోపుల్లో కనబడిన సారథి శవాన్ని పోలీసులకు అప్పచెప్పాడుట. పోలీస్ పంచనామా చేసి సారథిని వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించారట. ’


ఇరుగు పొరుగు “అటల” వైర్లెస్ న్యూస్:


‘మాటలు రావు కానీ చాలా మొండి ఘటం, ఎంత చెప్పినా వినక గాలిపటం ఎగురవేయాలని తాటితోపుల వైపు వెళ్ళాడు. గాలిపటం తెగి అక్కడే వున్న దిగుడు బావిలో పడింది. తెగిన గాలిపటం కోసం సారథి కూడా దిగుడు బావిలోకి దిగబోయి కాలు జారి పడిపోయి ప్రాణాలు కోల్పోయాడట. ’


‘సంక్రాంతి పండక్కని కొత్త బట్టలు కుట్టించారట, ఆ పిల్లోడు పండుగ వరకు ఆగక ఇప్పుడే వేసుకుంటానని పంతం పట్టాడుట. తల్లి రెండు దెబ్బలు వేసిందిట. అందుకే ఇంట్లో నుండి పారిపోయి తాటితోపుల్లో యిలా ప్రాణాలు పోగొట్టుకున్నాడుట. పాపం ఆ ఇంటి ఓనర్స్ ఎంత మంచి వాళ్ళు, స్వంత ఇంటివాళ్ళ వలె సమయానికి నిలబడ్డారు. ’


‘యమధర్మరాజు కూతురు సంక్రాంతి పండుగ ముందు వేయి మానవ తలల్తో నోము చేస్తుందిట. అందుకే ఈ పండుగ ముందు తప్పకుండా యే రోగమూ, రొచ్చు లేకున్నా ఎవరో ఒకరో, ఇద్దరో ప్రాణాలు పోవల్సిందేనట. '


అయ్యో, పాపం! మూగనో, గుడ్డో, కుంటో ఎవరైనా కొడుకు కొడుకే కదా, తల్లికి ఎంత రంపపు కోత! సంఘం యిచ్చే సానుభూతులు శాంతారంగనాథంలకు ఎన్నో.. కానీ ఏం లాభం! యే ఒక్కటీ పనికి వచ్చేవి కావు.


వింటూన్న స్నేహకు ముల్లు కర్రతో గుచ్చి నట్లుంది.


జరిగింది ఒకటైతే, ప్రచారం జరిగేది మరొకటి!


స్నేహ నొచ్చుకుంది, “కాదు, నేను మూగదాన్ని, నా మీద నాకే అసహ్యం వేస్తుంది. నోరు విప్పి నిజం ఎందుకు చెప్పలేక పోతున్నా?” తన్ను తాను ప్రశ్నించు కోవాడమే గాని జవాబు లేదు. సాక్ష్యాలు లేవు.


కొన్ని రోజులు గడిచాయి.


స్నేహ నీరసంతో నడుం వాల్చింది. సైగల భాషలో ఇల్లు ఖాళీ చేస్తున్నామని శారద విశదీకరిచింది.


మర్నాడు కరుణ, స్నేహ కల్సి శాంత ఇంటి కెళ్లారు.


“అంతా సారథి తప్పెనట. ” కరుణ, శాంత పరస్పరం మాట్లాడుకుంటున్నారు. కరుణకు నిజం తెల్సినా, సారథి తప్పెనని వంత పాడుతుంది.


చేదు నిజం, తీపి అబద్దంతో కప్ప బడుతుంది! స్వీట్ కోటేడ్.


టులెట్ బోర్డ్ త్రివేణీ వాళ్ళ గేట్కు వెళ్ళాడ తీశారు.


*****


తీపి కబురు కడుపులో మోసుకొని త్రివేణి అత్తింటి నుండి పుట్టింటికి వచ్చింది. మళ్ళీ సంబరాలు!


గర్భిణీ నోటికి యెప్పుడు యే రుచి కావాలో తెలియదు. కరుణ వూరగాయలకు, పచ్చళ్ళకు డిమాండ్ పెరిగింది.


అప్పుడప్పుడూ వచ్చే త్రివేణి, తరుచూ వస్తూంది, కరుణ చేతి పచ్చళ్ళకు, పొళ్లకు, వంటలకు దాసోహం అయింది నవమాసాలు నిండిన గర్బిణి. పైగా ఆవురావురుమని తినే వారుంటే సరి; కోరిన వల్లా వండి, వడ్డించడము కరుణకు మహా సరదా.


“స్నేహా, నువ్వు కూడా త్రివేణితో పాటే భోజనం చేయమ్మా, పాపం ఒక్కత్తీ మోహమాట పడుతున్నది. ” అమ్మ మాటను కాదనలేక కలిసి భోజనానికి కూర్చున్నది.


హల్లో-హల్లోల పరిచయం మరింత వేగంగా ముందుకు నడిచింది.


“నీకు పుట్టబోయే బిడ్డకు బహుమతి ఏం యివ్వాలి?” పసిపిల్లలంటే ఆప్యాయత కల్గిన స్నేహా అడిగింది స్నేహితురాలిని.


“స్నేహా, మంచి మనసున్న మీ ఫ్యామిలీ పరిచయం చాలు, మీ తెలుగు వాళ్ళ రుచులు నాకు, నాలోని బిడ్డకు అందిస్తున్నారు. ఇంత కంటే నాకేం కావాలి? ఈ ప్రేమ చాలు. ” అంటూ త్రివేణి తన చేతుల్లోకి స్నేహా చేతులను వాత్సల్యంతో పట్టుకుంది.


కొద్దిసేపటికే, ఆ వాత్సల్య ప్రసరణ సమయం పూర్తి కాకుండానే తట్టుకోలేని బాధగా మారి “అమ్మా” అంటూ త్రివేణి గావుకేక పెట్టింది. కడుపులో బిడ్డకు బయట ప్రపంచం చూసే తొందర మొదలయింది.


“త్రివేణీ! ఏమైందీ” అంది కంగారుగా స్నేహా.


“భరించలేని నొప్పి, పొత్తి కడుపులో నొప్పి!! నాకు.. నేను.. ”


“నువ్వు మాట్లాడుకు, అమ్మను పిలుస్తాను. ”


“మేరే మాతాజీ కో భి.. ”


“అలాగే, ఆంటీకి కూడా చెబుతాను. నువ్వు రిలాక్స్ గా వుండు.. ” అంటూ గబాల్న అందరికీ త్రివేణి నొప్పుల విషయం చెప్పేసింది.


సెలవు రోజు కావడం మంచిదయింది. ఇంట్లోనే వున్న ఆనందరావు కారులో మెటర్నిటీ హాస్పిటల్కు వెళ్లారు.

========================================================================

ఇంకా వుంది...

========================================================================

సురేఖ పులి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:

పేరు :సురేఖ

ఇంటి పేరు: పులి

వయసు: 68 సంవత్సరాలు

భర్త పేరు: స్వర్గీయ పి. అరుణ్ కుమార్

ఎంఏ (సోషియాలజీ&ఇంగ్లీష్) చేశాను. ఇద్దరు అమ్మాయిల వివాహమైంది.

పుట్టి, పెరిగింది హైదరాబాద్ లో.

ప్రస్తుత నివాసం బెంగళూర్ లో.

మా నాన్న స్వర్గీయ అర్జున్ రావు గారు నా మార్గదర్శకులు.

స్కూల్, కాలేజీ మ్యాగజైన్ కు రాయడంతో నా రచనా వ్యాసంగం ప్రారంభమైంది.

HMT Hyd లో నా ఉద్యోగం, 2008 లో స్వచ్ఛంద పదవీ విరమణ తర్వాత

ఒక డైలీ న్యూస్ పేపర్ కోసం పనిచేసాను.

చందమామ, యువ, స్వాతి, ఈనాడు, నెచ్చెలి, మన తెలుగుకథలుడాట్కాంల లో నా కథలు, కథానికలు ప్రచురితమయ్యాయి.

ప్రస్తుతం విశ్రాంత సీనియర్ సిటిజన్ను. కధలు రాయటము, చదవడం నా హాబి. చిత్ర లేఖనం, పెన్సిల్ డ్రాయింగ్ ఇష్టపడతాను.

మీ ప్రోత్సాహమే నా బలం 🤝

మరిన్ని రచనలతో పాఠకులకు దగ్గర కావాలన్నదే నా ఆశయం.

సురేఖ పులి69 views0 comments

Comentarios


bottom of page