top of page

కొస మెరుపు పార్ట్ 2


'Kosa Merupu Part 2/2' - New Telugu Story Written By Surekha Puli

Published In manatelugukathalu.com On 02/11/2023

'కొస మెరుపు పార్ట్ 2/2' పెద్ద కథ

రచన: సురేఖ పులి

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ:

స్నేహ పక్కింట్లో త్రివేణీ వాళ్ళు ఉంటారు. వాళ్ళ పై ఇంట్లో చేరిన వాళ్ళ నాలుగేళ్ళ బాబు సారధితో అనుబంధం ఏర్పడుతుంది స్నేహకు.


నరబలి ఇస్తేగానీ త్రివేణి పెళ్లి జరగదన్న మూఢ నమ్మకంతో సారధిని బలి ఇస్తాడు త్రివేణి తండ్రి. ఆ దృశ్యం చూసినా, తల్లి బలవంతం మీద ఎవరికీ చెప్పదు స్నేహ.


త్రివేణి పెళ్లి జరుగుతుంది. డెలివరీ కోసం హాస్పిటల్ లో అడ్మిట్ అవుతుంది త్రివేణి.


ఇక కొస మెరుపు పెద్ద కథ రెండవ భాగం చదవండి.


“తల్లి ప్రేగు మెడకు బిగుసుకొని బాబు పుట్టాడు, కాన్పు కష్టం కావడమూ, ప్రేగు బిగుతు హెచ్చి గట్టిగా బిగుసుకొని, బాబు వూపిరాడక చనిపోవటమూ, అన్నీ ఒకే సారి జరిగాయి. ” కాన్పు చేసిన డాక్టరమ్మ చల్లగా చెప్పింది.


శుభ వార్త కోసం ఎదిరిచూస్తున్న ఇరు కుటుంబాలు ఒక్క సారిగా ఘోల్లుమన్నాయి!


“సర్.. మేడమ్.. ప్లీజ్ మీరు రూమ్కు వెళ్ళండి. పేషెంట్ ఒక అర గంటలో రూమ్కు వస్తుంది. ”


కర్ర చేతిలో లేకుండానే నర్సమ్మ అందరినీ తరిమే ప్రయత్నంలో గెలిచింది.


రూమ్లోకి వెళ్ళి ఐదు నిముషాలు కూడా కాలేదు. రెండో నర్సమ్మ వచ్చి “అమ్మలూ.., సార్లు.. నమస్తే.. రూంకి ఒక్క అటెండెంట్ మాత్రమే వుండాలి, మిగితా అందరూ బయట రెసిప్షెన్ లో వెెేట్ చేయండి. ”


“పుట్టిన బిడ్డ పోయి మేము ఏడుస్తూన్తే వున్నాము, పేమెంట్ ఇస్తాము కదా.. ” ఇంద్రకర్ అడ్డుకున్నాడు.


“సార్, మా డ్యూటి మేము చేస్తున్నాము, మీరు ఈ ఆసుపత్రి గదిని మీ ఏడుపుల కోసం పేమెంట్ యిచ్చుట లేదు. ప్లీజ్, పెద్ద డాక్టర్ రౌండ్స్ వచ్చే టైమ్ అయింది. అంతా పోవాలి. ఊ.. అమ్మగారు, బయటికు పోవాలి. ”


ఎవరి రాజ్యంలో వారిదే పై జండా! త్రివేణి అమ్మగారు మాత్రమే వుండి, మిగితా అందరూ రెసిప్షెన్ వైపు దారి తీశారు.


“మేము శివ భక్తులము కదూ, అందుకే బిడ్డ మెడ చుట్టూ నాగాభరణం వేసుకొని పుట్టాడు. ” సుఖేందర్ సౌఖ్యంగా చెప్పాడు.


త్రివేణి భర్త ఆతృతగా వచ్చాడు. దుఃఖాన్ని అల్లుడు గారితో పంచుకున్నారు.


కరుణానందరావులు ఇంటికి వెళ్ళే ప్రయత్నంలో వున్నారు. స్నేహకు మాత్రం త్రివేణిని కలిసి, ఓదార్చాలని వుంది.


ఇంద్రకర్ అన్నాడు, “రావు గారు, కొద్ది సేపు ఆగండి, ఈ రోజే డిశ్చార్జ్ చేస్తారా అని కనుక్కొని వస్తాను, ఈ రోజే అయితే అందరమూ కల్సి కార్లో ఇంటికి వెళ్లొచ్చు. ”


ఆనంద్రావుకు చిరాకేసింది. మొహమాటం కొద్దీ సరే అన్నాడు. గంట తరువాత ఇంద్రకర్ చెప్పాడు, “ఈ రోజు కాదుట, మనం వెళ్ళి పోదాం. ”


“పెద్ద కారు కాబట్టి సరి పోయింది, లేకుంటే ఇరుకున నలగాల్సిందే. ” చెప్పకనే చెప్పాడు కారు ఓనర్ ఆనంద్రావు.


త్రివేణి ఆరోగ్యం తేడాగా వుందని, మర్నాడు సాయంత్రం డిస్చార్జి చేశారు.


“అమ్మా, ఒకసారి త్రివేణిని పరామర్శించి వస్తానమ్మా. ”


“వద్దు, పురిటి స్నానము అయ్యాక వెళ్ళు. ”


ఏ రోజు వెళ్లాలో చెప్పమ్మా. ”


ఆనందరావు అన్నారు “స్నేహా, ఇరవై ఒక్క రోజు తరువాత వెళ్ళు, మీ అమ్మ కూడా తోడు వస్తుంది. ”


“సరే నాన్నగారు. ” తండ్రి మాట రామబాణం!


*****


త్రివేణి పురిటి స్నానం అయ్యాక, ఇంటిల్లిపాది పంచముఖి ఆంజనేయస్వామి గుడికి వెళ్ళి పూజలు చేయించుకుని వచ్చారు.


త్రివేణి గుడి ప్రసాదం తీసుకొని స్నేహ వాళ్ళింటికి వచ్చింది.


“కూర్చో త్రివేణీ, స్నేహ కంప్యూటర్ క్లాస్ కెళ్లింది. ” టీవిలో పాటలు వింటున్న కరుణ ఎంతో ఆదరణ చూపించింది. వద్దన్నా వినకుండా కమ్మని కాఫీ యిచ్చింది.


“ఆంటీ, నా బాబు పోయినందుకు చాలా బాధగా వుంది. ” త్రివేణి మాటలు మొదలు పెట్టింది.


“మన చేతిలో ఏమీ లేదు. అవన్నీ మర్చిపో, నీకు టీవిలో యే ఛానెల్ కావాలో చెప్పు, అదే చూద్దాం. ” అంది కరుణ.


“అది కాదు ఆంటీ.. ”


కరుణ ఛానెల్స్ మారుస్తూ ఏదో లోకం వుంది.


కరుణ వినే ధోరణిలో లేదని త్రివేణి అర్థం చేసుకుంది. ఇక వుండాలని లేదు.


“ఆంటీ, నేను మళ్ళీ కలుస్తాను, స్నేహతో చెప్పండి నేను వచ్చానని.. ”


కరుణ మారు మాట్లాడలేదు. అలాగేనని త్రివేణి బయట కాలు పెట్టగానే తలుపేసుకుంది.


తలుపు తరువాత కార్ పార్కింగ్, చుట్టూ వివిధ పూల మొక్కలు; ఆ పిమ్మటే రంగు రంగుల భోగన్విల్లా పూలమొక్కతో అల్లుకు పోయిన పెద్ద గేటు. తలవంచుకుని త్రివేణి మెల్లిగా గేటు వరుకు వచ్చి ఆగిపోయింది. గేటుకు అటు వైపు స్నేహా వస్తుంది.


గేటు బయట స్నేహితురాళ్లుద్దరూ ఒకరినొకరు చూసుకొని ఆనంద పడ్డారు.


“త్రివేణీ బావున్నవా?”


“నేను బావున్నా, మరి నువ్వు?


“నాకేమయింది, నేను ఎప్పుడూ ఫైన్. ” నవ్వుతూ చెప్పింది, స్నేహ.


“మరి హాస్పిటల్ నుండి వచ్చాక ఒక్కసారి కూడా నన్ను కలవటానికి మాఇంటికి రాలేదేం? మీ పేరెంట్స్ వద్దన్నారా?”


“మా పేరెంట్స్ అలా ఎందుకు అంటారు, మా అమ్మ నిన్ను ఎంత బాగా చూస్తుందో నీకు వేరే చెప్పాలా, సరే ఇంట్లోకి వెళ్దాము పద. ”


“వద్దు, స్నేహా, ఇంట్లోకి వద్దు. నేను నీతో కొంచెం సీక్రెట్గా మాట్లాడాలి. వేరే ఎక్కడైనా పోదామా?”


“అలాగే, అమ్మతో ఒక్క మాట చెప్పి వస్తాను. ”


“తరువాత చెబుదూ గాని, బాలింతనని ఎక్కువ సేపు బయటికి వెళ్ళే అనుమతి నాకు లేదు. మా అమ్మ ఒప్పుకోదు. అందుకే పద.. కొద్ది సేపు.. ”


“మీ ఇంట్లో ఒప్పుకోరు అంటున్నావు, మరి.. ”


“నేను మీ ఇంట్లో వున్నానని అమ్మ అభిప్రాయం. మీపైన ఎంతో నమ్మకం. "


“సరే, నడుస్తూ మాట్లాడదామా.. ” స్నేహితురాళ్లుద్దరూ ఏకాభిప్రాయనికి వచ్చారు.


*****


జాతక రీత్యా పుట్టుక దోషిని. అందుకే గంగా, యమునా, సరస్వతీ నదుల త్రివేణి సంగమంలో పూజలు చేయించి నామకరణం చేశారు. ఆడపిల్లకు పెద్ద చదువు అనవసరం అనుకుని నా చదువు పదవ క్లాస్తోనే ముగిసింది.


ఇక పెళ్ళి!


వచ్చిన సంబంధాల లిస్టితో పేజీలు నిండి, కాపీ పుస్తకాలు మారుతున్నాయి గాని, పెళ్లి కుదిరే మార్గల్లేవు.


పూజించని దేవుడు లేడు. దర్శించని గుళ్ళు లేవు. క్షుద్రపూజల పిచ్చి పట్టింది. డబ్బు ఖర్చు తప్ప, ఒరిగేది ఏమీ లేదు. చివర్న గ్రామ దేవతకు ఐదేళ్ల లోపు బాల ప్రాణాన్ని త్యాగబలి చేస్తే వివాహం జరుగుతుందని మరో క్షుద్రుడి మాటలను అనుసరించి ఇంట్లో వాళ్ళు సారథిని అపహరించి, గ్రామ దేవతకు బలి యిచ్చి, రెండో సంబంధం పెళ్లి జరిపించారు.


పెళ్ళైన నాటి నుండి మావారు పిల్లలు వద్దని పోరు. తన మొదటి భార్య పిల్లల్ని నేను బాగా చూడనని అపోహ! కానీ తల్లిని కావాలనే నా కోరిక తీర్చుకున్నాను.


నా కడుపులో ప్రాణం పోసుకొని, నా ప్రేగునే మెడకు చుట్టుకొని, నన్ను చూడకుండానే నాకు దూరమైనాడు. శిక్ష వేసింది దేవుడు కాదు, సారథి నాకు శిక్ష వేశాడు. అట్టి శిక్షకు నేనెంత వరకు అర్హురాలిని?


ఎందుకని పేరెంట్స్ పిల్లల పెళ్లి విషయంలో చెడు దార్లు ఎన్నుకుంటారు.


ఏదో ఒక సంబంధం.. ఎవరో ఒకరిని కట్టిపెట్టి.. పెళ్లి చేశామని గొప్పలు చెప్పుకోవాలి!!


ఆడపిల్లలు అవివాహితలుగా వుంటే జీవించలేరా? వాళ్ల బతుకులు వాళ్లు బతక లేరా?


అమ్మాయిలకు భర్త అనే ఐడి మెడలో వెళ్లాడక పోతే సమాజంలో స్త్రీ కి విలువ లేదా?”


ప్రశ్నలతో విరామం తీసుకుంది త్రివేణి. జవాబు లేని ప్రశ్నలను విని మౌనంగా వుండిపోయింది స్నేహ.


“ప్లీజ్, స్నేహా, మాట్లాడు.. ”


“త్రివేణీ! ఇప్పుడు నీకు రెస్ట్ కావాలి. నీ ప్రమేయం లేదు. నువ్వు ఏమీ చేయలేదు. జరిగినవి మర్చిపో. మీ ఇంట్లో వాళ్ళ మనస్తత్వం గురించి నీ మనసునూ, జీవితాన్నీ ప్రశ్నల మయం చేసుకోవద్దు. ”


“మరి నేనేం చేయాలి, చెప్పినంత సులువు కాదు మర్చిపోవడము. ”


“ట్రై చేయి. నీ ధ్యానం మళ్లించు. మీ అత్తగారింటికి వెళ్ళి, డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చదువు మొదలు పెట్టు. అలా కుదరక పోతే ఏవైనా ఫైన్ ఆర్ట్స్ వైపు మొగ్గు చూపెట్టు. చాలా మార్పు వస్తుంది. అంతే గాని నాకేదో జరగరానిది జరిగిందని మూలుగుతూ కూర్చుంటే యింకా క్రుంగి పోతావు. ”


మాట్లాడుకుంటూ నడుస్తుంటే తాటివనం వచ్చింది. “ఇదిగో ఇక్కడే” చటుక్కున ఆగి అంది త్రివేణి.


సారథి జ్ఞాపకాలతో స్నేహ కళ్ళ నీళ్ళు తుడుచుకుంది. తన కథ విన్నందుకే స్నేహాకు కన్నీరను కొని, “సారీ, ఇంటికి వేళదాం పద, నా మూలంగా నువ్వెందుకు బాధ పడాలి?”


తిరుగు నడకలో మాటలు కరువైనాయి. ఎవరింటికి వారు చేరుకునే సమాయమాసన్నమైంది.


"ఈ విషయం మన వీధిలో, మీ పేరెంట్స్ తో బాటు, యింకో రెండు ఇళ్ళల్లోని పెద్దలకు మాత్రమే తెలుసు. ”


“మా పేరెంట్స్ కు తెల్సా?” కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్య పోయింది స్నేహ.


“అవును తెల్సు, కానీ క్షుద్రపూజలు అని ఇరుగు పొరుగు మాఇంటికి రావడం మానేశారు.


స్నేహితురాళ్లురివురూ ఇళ్లు చేరుకున్నారు.


“స్నేహా, నీ కోసం త్రివేణి వచ్చి ఆంజనేయస్వామి ప్రసాదం యిచ్చి వెళ్ళింది. ”


జవాబు లేదు.


“దేవుడి గదిలో పెట్టాను, చేతులు-కాళ్ళు కడుక్కొని ప్రసాదం తీసుకో. ”


స్నేహ మౌనం నచ్చలేదు కరుణకు.


“త్రివేణి కల్సిందా?” స్వరంలో సౌమ్యత తగ్గింది.


“లేదమ్మా. ” మొదటి సారి అమ్మతో అబద్ధం చెప్పింది, వినయం ఒలుకుతుంది.


“ఒక వేళ కలవాలని ప్రయత్నం చేసినా ఎక్కువ మాటలు పెంచకు లేదా నా సమక్షంలోనే కలవాలి. ” ఆర్డినెన్సు పాస్ అయింది.


చేతులు-కాళ్ళు కడుక్కొని ప్రసాదం కళ్ళకు అద్దుకొని నోట్లో వేసుకుంది.


“స్నేహా, నీతోనే మాట్లాడుతున్నా, నేను చెప్పింది అర్థమైందా?” కరుణ స్వరం కటువుగా వుంది.


“అవునమ్మా, త్రివేణితో ఎక్కువ మాట్లాడను, ఒక వేళ మేము కలిసినా, నువ్వూ కూడా నావెంటే వుంటావు. ఇదే కదా నువ్వు చెప్పిందీ, నేను విన్నదీ. ”


‘నా కూతురు బుద్దిమంతురాలు’ అని మురిసి పోయింది కరుణ.


"రేపు కృష్ణాష్టమి, పూజగది, ఉయ్యాల అలంకరణ; చల్ల చిలికి వెన్న తీయాలి, కాయమ్ పొడి, శొంటి పొడి, దద్దోజనం వంటి ముఖ్యమైన ప్రసాదాల్లో నువ్వు సాయపడాలి, గుర్తుంది కదూ”


"గుర్తుందమ్మా, చిన్నప్పుడు నువ్వు నేర్పిన 'చేత వెన్న ముద్ద' పద్యం కూడా గుర్తుంది. " తల్లిదండ్రులు పంచి యిచ్చిన గారాబాన్ని ప్రతిబింబ జేసింది.


స్నేహ తన గదికి వెళ్లి బ్యాగ్లోని సారథి ఫోటో తీసుకుంది.


“సారథీ.. నా శ్రీకృష్ణుడివి నువ్వు. నా కొడుకై మళ్లీ పుట్టాలి. " ఆశ యధార్థం కావాలని కోరుకుంది స్నేహ.


ఎన్ని మార్లు కంసుడు పసికందులను అంతమొనరించినా, అచ్యుతుని ఆగమనం ఆగలేదు.


========================================================================

సమాప్తం

========================================================================

సురేఖ పులి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:

పేరు :సురేఖ

ఇంటి పేరు: పులి

వయసు: 68 సంవత్సరాలు

భర్త పేరు: స్వర్గీయ పి. అరుణ్ కుమార్

ఎంఏ (సోషియాలజీ&ఇంగ్లీష్) చేశాను. ఇద్దరు అమ్మాయిల వివాహమైంది.

పుట్టి, పెరిగింది హైదరాబాద్ లో.

ప్రస్తుత నివాసం బెంగళూర్ లో.

మా నాన్న స్వర్గీయ అర్జున్ రావు గారు నా మార్గదర్శకులు.

స్కూల్, కాలేజీ మ్యాగజైన్ కు రాయడంతో నా రచనా వ్యాసంగం ప్రారంభమైంది.

HMT Hyd లో నా ఉద్యోగం, 2008 లో స్వచ్ఛంద పదవీ విరమణ తర్వాత

ఒక డైలీ న్యూస్ పేపర్ కోసం పనిచేసాను.

చందమామ, యువ, స్వాతి, ఈనాడు, నెచ్చెలి, మన తెలుగుకథలుడాట్కాంల లో నా కథలు, కథానికలు ప్రచురితమయ్యాయి.

ప్రస్తుతం విశ్రాంత సీనియర్ సిటిజన్ను. కధలు రాయటము, చదవడం నా హాబి. చిత్ర లేఖనం, పెన్సిల్ డ్రాయింగ్ ఇష్టపడతాను.

మీ ప్రోత్సాహమే నా బలం 🤝

మరిన్ని రచనలతో పాఠకులకు దగ్గర కావాలన్నదే నా ఆశయం.

సురేఖ పులి


78 views4 comments

4 Comments


@prabhavathykolluru3821 • 3 days ago

ముగింపు...చాలా బాగుంది... పులి సురేఖ గారు

Like
Surekha Arunkumar
Surekha Arunkumar
Nov 14, 2023
Replying to

Thank you very much 🙏

Like


@swarnaputta5792 • 1 day ago Good story mam

Like
Surekha Arunkumar
Surekha Arunkumar
Nov 04, 2023
Replying to

Thank you very much Swarna🌹

Like
bottom of page