top of page
Writer's pictureDinavahi Sathyavathi

కొత్త కెరటం! ఎపిసోడ్ 2


'Kotha Keratam Episode 2' - New Telugu Web Series Written By Dinavahi Sathyavathi

'కొత్త కెరటం! ఎపిసోడ్ - 2' తెలుగు ధారావాహిక

రచన: దినవహి సత్యవతి

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ:


అచ్యుతాపురం గ్రామంలోని ఒక మోతుబరి రైతు రామయ్య, ఆయన భార్య జానకి. వారి కుమారుడు రాజేంద్ర, కోడలు కళ్యాణి.


డెలివరీ కోసం అడ్మిట్ అయిన కళ్యాణి పరిస్థితి సీరియస్ అని చెబుతారు డాక్టర్లు.


హాస్పిటల్ లో సూరజ్ అనే వ్యక్తి తారసపడతారు రాజేంద్రకి. తాను రామయ్య గారి సహాయంతో చదువుకున్నానని చెబుతాడు అతను.



ఇక కొత్త కెరటం! ఎపిసోడ్ - 2 చదవండి


చేతులు తుడుచుకుంటూ థియేటర్ లోంచి బయటకి వచ్చిన డాక్టర్ కి ఆందోళనగా తనవైపే చూస్తున్న రాజేంద్ర కనిపించాడు.


“నా భార్య ఎలా ఉంది, బిడ్డ క్షేమమేనా, చెప్పండి డాక్టర్”


“తల్లి క్షేమమే. ఇంకా స్పృహలోనికి రాలేదు. ప్రసవానికి ముందే చాలా నీరసించి పోయినందువల్ల జనరల్ అనస్థీషియా ఇవ్వాల్సి వచ్చింది”


“మరి బిడ్డ?”


“ఆడబిడ్డ. బ్రతికించడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. వెరీ సారీ” అన్నాడు.


“అయ్యో!” పుట్టిన బిడ్డ మరణించిందని విని దుఃఖిస్తూ కుర్చీలో కూలబడ్డాడు రాజేంద్ర.


“ధైర్యంగా ఉండండి” ఓదార్పుగా రాజేంద్ర భుజం తట్టి, ప్రక్కనే సూరజ్ ని చూసి “ఓ హలో! మీరేమిటీ ఇక్కడ.. ” ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ కరచాలనం చేసారు డాక్టర్.


“హలో డాక్టర్ బాగున్నారా? చిన్న పనిమీద వచ్చాను. ఈలోగా వీరు కనిపించారు. వీరి కుటుంబమంతా నాకు అత్యంత ఆప్తులు. అదెలా అన్నది ఒక పెద్దకథ. తరువాత ఎప్పుడైనా చెప్తాను అవకాశమొస్తే” అనునయింపుగా రాజేంద్ర వీపు నిమురుతూ బదులిచ్చాడు.

“ఓ ష్యూర్! మరిక వస్తానూ మీ ఫ్రెండ్ కి ధైర్యం చెప్పండి” అని డాక్టర్ వెళ్ళిపోయారు.


“నువ్వే ఇలా అధైర్యపడితే చెల్లెమ్మనీ అమ్మానాన్నలనీ ఎవరు సముదాయిస్తారు, సంబాళించుకో” చనువుగా, సంభోదనని మీరునుంచి నువ్వులోకి మార్చి, ప్రక్కనే కూర్చుని భుజంపై చేయి వేసాడు సూరజ్.


“నీకు తెలీదు. పుట్టబోయే బిడ్డ గురించి శుభవార్త వినాలని అమ్మానాన్నా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు బిడ్డ మృతిచెందిందని తెలిస్తే తట్టుకోలేరు” విలపించసాగాడు.


“నేను అర్థం చేసుకోగలను. కానీ కొంతలో కొంత అదృష్టం చెల్లెమ్మ క్షేమంగా ఉంది. అందుకు సంతోషిద్దాము”


“నిజమే కనీసం కళ్యాణైనా నాకు దక్కినందుకు ఆనందంగానే ఉంది. కానీ.. ”


“బిడ్డ చనిపోవడం బాధాకరమే అయినా మున్ముందు మీకు మళ్ళీ బిడ్డలు పుట్టొచ్చునుగా. ఎందుకంత నిరాశ?”


“కళ్యాణికి ఇక పిల్లలు పుట్టే అవకాశం లేదన్నారు”


“అయ్యో అలాగా!” బాధగా అని సాలోచనగా రాజేంద్ర వైపు చూసి దేని గురించో ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా దీర్ఘశ్వాశ తీసుకుని “రాజేంద్ర! నాతో రా ఒకసారి” భుజాలు పట్టుకుని లేవదీస్తూ అన్నాడు.


“ఇప్పుడా! ఎక్కడికి? ఇంట్లో అమ్మానాన్నలు నా ఫోన్ కోసం ఎదురు చూస్తుంటారు. వాళ్ళకి ఈ విషయం ఎలా చెప్పాలో తెలియడం లేదు”


“వద్దు వద్దు.. తొందరపడకు. ముందు నేను చెప్పేది విని ఆ తర్వాత ఏ నిర్ణయమైనా తీసుకుందువుగాని.”


”ఏం చెప్పబోతున్నావు?”


“పద చెప్తాను”

సవాలక్ష సందేహాలు బుర్రను తొలిచేస్తుంటే మౌనంగా సూరజ్ ని అనుసరించాడు.


ఇరువురూ కలిసి ఎన్. ఐ. సి. యు. (నియో నేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్) అని వ్రాసి ఉన్న చోటుకి వచ్చారు.


అక్కడ డ్యూటీ నర్సు అనుమతి తీసుకుని, ఉయ్యాలలో నిద్రిస్తున్న ఒక పసికందు వద్దకు నడిచాడు సూరజ్.


“ఇక్కడికెందుకు తీసుకొచ్చావు?” అనుమానంగా ప్రశ్నించాడు రాజేంద్ర.


“ఈ బిడ్డని చూడు”


“ఎవరీ బిడ్డ? అసలు నాకెందుకు చూపిస్తున్నావు?”


“నా బిడ్డ. మగపిల్లవాడు”


“ఏమిటీ?” పరిసరాలు మర్చిపోయి అరిచాడు రాజేంద్ర.


“అవును”


“మరి ఇక్కడున్నాడేం?” ఇంకా ఏదో అడగబోయిన రాజేంద్రతో “ష్.. ష్.. గట్టిగా మాట్లాడొద్దు. పిల్లలకి ఇబ్బంది. అవతలికి వెళ్ళాక చెప్తాను వివరంగా” బిడ్డని ముద్దు పెట్టుకుని బయటకు నడిచిన సూరజ్ ని అనుసరించాడు రాజేంద్ర.


ఆస్పత్రి రిసెప్షన్ లోని కుర్చీలో నిస్త్రాణగా కూలబడిన సూరజ్ ప్రక్కనే కూర్చుంటూ “ఇప్పుడు చెప్పు అసలేమైందీ, బాబు తల్లి.. అదే నీ భార్య ఏదీ?” అడిగాడు.


“బిడ్డని కని పురిట్లోనే ప్రాణాలు విడిచింది”


“ఏమిటీ?” నిర్ఘాంతపోయాడు.


“అవును. నేనూ మైథిలీ ప్రేమించి పెళ్ళి చేసుకున్నాము. మా జీవితంలోని సంతోషాన్ని ద్విగుణీకృతం చేస్తూ నా భార్య ప్రెగ్నెంట్ అయింది. అయితే ప్రెగ్నెన్సీలో కొన్ని సమస్యలు రావడంతో ఆస్పత్రిలో చేర్పించాల్సి వచ్చింది. డాక్టర్ ఇచ్చిన నిర్థారిత సమయానికి ముందే మగ బిడ్డ పుట్టాడు. తల్లీ బిడ్డా కులాసాగానే ఉన్నారని ఆనందించేలోగానే బి. పి. బాగా ఎక్కువై అనుకోని క్లిష్ట పరిస్థితులు ఉత్పన్నమై గుర్రపు వాతం కమ్మి చనిపోయింది మైథిలి” చేతుల్లో ముఖం దాచుకుని విలపించాడు సూరజ్.


“అయ్యో ఎంత ఘోరం. ఎప్పుడు జరిగింది ఇదంతా?”


“మొన్ననే” అతి కష్టంమీద దుఃఖాన్ని దిగమింగి బదులిచ్చాడు.


“అంటే ఆ బిడ్డ పుట్టి రెండ్రోజులేనా అయింది?”


“అవును. అప్పుడే తల్లిలేని వాడయ్యాడు” నిట్టూర్చాడు.


“మరి అప్పుడే నువ్వు ఇక్కడ.. ”

“నీ సందేహం నాకర్థమైంది. ఇంట్లో కూర్చుంటే ఒంటరితనంతో, మైథిలి ఆలోచనలతో మతి భ్రమిస్తుందనిపించింది. అందుకే బిడ్డని ఇక్కడ నర్సుల సంరక్షణలో ఉంచి ఉద్యోగంలో చేరిపోయాను. ఆఫీసుకి వెళ్ళే ముందర చూసిపోదామని వచ్చిన నేను ఇలా నిన్ను కలవడం జరిగింది. ఇది దైవలీల అనే అనుకుంటున్నాను”

“అతి చనువు తీసుకుంటున్నానని అనుకోవద్దు. అసలు ఈ సమయంలో ఇలా అనవచ్చో లేదో కూడా నాకు తెలియదు..”


“ఫరవాలేదు చెప్పు”


“నీకిప్పుడు ఏమంత వయసైందని? మళ్ళీ పెళ్ళి చేసుకోవచ్చుగా! ఆ పసివాడికి తల్లీ నీకు జీవిత భాగస్వామి కూడా అమరుతారు”

“ఇక పెళ్ళన్న మాట తలపెట్టదల్చుకోలేదు. నా మనసులో, ఈ జీవితంలో నా భార్య, మైథిలి, స్థానం మరెవ్వరికీ ఇవ్వలేను” ఎన్నో ఏళ్ళ తరువాత కలుసుకున్నా రాజేంద్రలో ఒక ఆత్మీయుడిని చూసిన భావనతో మనసు విప్పి మాట్లాడుతున్నాడు సూరజ్.


“అలా అంటే ఎలాగ కనీసం ఆ పసిగుడ్డు గురించైనా ఆలోచించు” తన బాధనూ, అక్కడ తల్లిదండ్రులు తన ఫోన్ కోసం ఎదురు చూస్తుంటారనే విషయమూ తాత్కాలికంగా మర్చిపోయి సూరజ్ ని ఓదార్చాడు.

“బాబు క్షేమం ఆలోచించానుగనకనే ఇక పెళ్ళి చేసుకోదల్చుకోలేదు. సవతి తల్లిని తెచ్చి నా బిడ్డని క్షోభకి గురిచేయలేను”


“సవతి తల్లులందరూ చెడ్డవారుగా ఉంటారని ఎందుకనుకుంటున్నావు?”


“కాకపోయినా కానీ ప్రయోగం చేయలేను”


“మరిప్పుడేం చేద్దామని?”


“అదే ఆలోచిస్తున్నాను రెండ్రోజులనించీ. ఇవాళ నిన్ను కలిసాక, చెల్లెమ్మ బిడ్డని కోల్పోయిందని తెలిసాక నా మనసులో ఒక ఆలోచన మొలకెత్తింది. నువ్వు అన్యథా భావించనంటే చెప్తాను”


“చెప్పు, నా దగ్గర సందేహించడమెందుకూ?”


“నా బిడ్డకా తల్లి లేదు. చెల్లెమ్మా బిడ్డనీ, ఇకపై బిడ్డలు పుట్టే అవకాశాన్నీ కూడా కోల్పోయింది. అందుకనీ..”


“ఊ.. అందుకని.. ఫరవాలేదు చెప్పు నిస్సంకోచంగా” సూరజ్ చెప్పబోతున్నది చూచాయగా గ్రహించగలిగినా అతడి నోటనే విందామని అడిగాడు.

“నా బిడ్డని నీ బిడ్డగా భావించి పెంచుకోగలవా?” స్నేహితుడి చేతులు పట్టుకుని బ్రతిమిలాడాడు.


“సూరజ్” ఆశ్చర్యానందాలతో ఉక్కిరిబిక్కిరయ్యాడు రాజేంద్ర.


“అవును అలా నా బిడ్డకి తల్లీ దొరుకుతుంది. ఆ తల్లికి బిడ్డా దొరుకుతుంది. ఈ విధంగానైనా పుణ్యదంపతులు నీ తల్లిదండ్రుల ఋణం తీర్చుకునే మహధ్భాగ్యం నాకు కలుగుతుంది”


“అంతకంటే అదృష్టమా! కానీ..”


“నీ సందేహం నాకు తెలుసు. భవిష్యత్తులో ఎప్పుడైనా నా బిడ్డ తిరిగి నాకు కావాలని అడుగుతానేమోననేగా?”


“.. ”


“నీకు ఎటువంటి అనుమానమూ అక్కర్లేదు. మైథిలి చనిపోయాక నాకింక ఇక్కడ ఉండాలని లేదు. అమెరికా వెళ్ళి స్థిరపడాలని నిశ్చయించుకున్నాను. కానీ బాబుని ఎక్కడ ఉంచాలో ఏమి చేయాలో తెలియక ఆలోచిస్తున్నంతలో భగవంతుడు పంపించినట్లుగా నువ్వు కనిపించావు”


“కానీ కళ్యాణికీ, అమ్మానాన్నలకీ చెప్పాలి కదా”


“కళ్యాణికి తప్పకుండా చెప్పు. కానీ అప్పుడే కాదు. ముందు బిడ్డని చూసుకుని ఆ తల్లిని సేదదీరనీ. అయితే అంకుల్ ఆంటీకి తెలియాల్సిన అవసరమేముంది? ఏమిటిలా అంటున్నాడని అనుకోకుండా కొంచం ఆలోచించు. అసలు నువ్వు ఎవరికీ చెప్పకపోయినా ఏమీకాదు. ఈ విషయం నీకూ నాకూ మధ్యనే ఉంటుంది.”


“కళ్యాణికీ నాకూ మధ్య రహస్యాలేమీ లేవు. ఉండనివ్వను”


“నీ ఇష్టం. అయితే సరైన సమయం చూసి నెమ్మదిగా చెప్పు”


“ఊ..” సాలోచనగా తలూపాడు రాజేంద్ర.


“ఇందులో నా స్వార్థం కూడా ఉందిలే”


“స్వార్థమా?” కొంపదీసి డబ్బులు కానీ అడుగుతాడా కొడుకు బదులుగా అనుకున్నా అంతలోనే ‘ఛ! ఛ! సూరజ్ అలాంటివాడు కాదు’ అనిపించింది.


“మీ అమ్మా నాన్నగారూ ఎంతో ఉదార హృదయులు, ఉత్తములు. అటువంటి పెద్దల నీడన వారి మనవడిగా, మీ బిడ్డగా నా కొడుకు పెరగటం, ఇంత దురదృష్టంలోనూ వాడు చేసుకున్న అదృష్టం అనుకుంటాను. వాడు మంచి సంస్కారవంతుడు అవుతాడనడంలో నాకేమాత్రం సందేహం లేదు. నేను నిశ్చింతగా అమెరికా వెళ్ళగలను. అయితే..”


“ఏమిటో చెప్పు”


“ఎప్పుడైనా ఇక్కడికి రావడం సంభవిస్తే ఒకసారి వాడిని చూసి వెళ్ళడానికి అనుమతిస్తావా?”


“నిస్సందేహంగా. మా దగ్గర పెరిగినా వాడు ఎప్పటికీ నీ బిడ్డే”


“అదే ఆ విషయంలోనూ నువ్వు నాకొక వాగ్దానం చేయాలి”


“వాగ్దానమా?”


“అవును. నేనే అసలు తండ్రినని ఎప్పటికీ వాడికి తెలియనివ్వ కూడదు”


“అయ్యో అదేమిటీ?”


“అదంతే. వాడు సుఖంగా ఉండాలని కోరుకునే వాడివైతే నువ్విది చెయ్యాల్సిందే”


“ఊ.. సరే నీకోరిక ప్రకారమే చేస్తాను. కానీ ఇదంతా నువ్వు చెప్పినంత తేలిక కాదేమో? ఆస్పత్రి రూల్స్ అవీ ఉంటాయి కదా?”


“అదీ ఆలోచించాను. ఇందాక నన్ను పలకరించారే ఆ డాక్టర్ దే ఈ ఆస్పత్రి. అతను నాకు బాగా తెలుసు. నేను ఈ అస్పత్రికి ఆడిటర్ ని. అతనితో మాట్లాడతాను.”


“నేనూ వస్తాను నీతో”


“సరే ఇద్దరం వెళదాము. థ్యాంక్స్ రాజూ! బాబు గురించి నాకిక ఏ దిగులూ లేదు”


“నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. నీ ఋణమెలా తీర్చుకోవాలో తెలియట్లేదు. మా అందరి జీవితాలూ అంధకారబంధురం కాకముందే వెలుగు రేఖలు నింపావు” కృతజ్ఞతాపూర్వకంగా చూసాడు.


“డాక్టర్ ని కలవడానికి వెళ్దామా మరి?”


“ఒకసారి రూం కి వెళ్ళి కళ్యాణి ఎలా ఉందో చూసీ, అలాగే నా ఫోన్ కూడా తీసుకునీ వెళదామా?”

ఇక్కడ వీళ్ళిలా సంభాషణలో తలమునకలయ్యుంటే అక్కడ ఇంటికి వెళ్ళిన రామయ్య దంపతులు భోజనం చేసి, కొడుకు ఫోన్ కోసం ఎదురుచూస్తూ, అలసిపోయున్నారేమో, నిద్రలోకి జారుకున్నారు.


కొంతసేపటికి గబుక్కున మెలకువ వచ్చి, ఇంకా కొడుకు వద్దనుంచి ఫోన్ రాలేదేమా అని తామే చేసారు.


అయితే సూరజ్ తో వెళ్ళేటప్పుడు, మర్చిపోయి తన ఫోన్ కళ్యాణి రూం లోనే వదిలి వెళ్ళడంతో తండ్రి ఫోన్ చేసిన విషయం తెలియనే లేదు రాజేంద్రకి.


అప్పటికే కొడుకు ఫోన్ కోసం ఎదురు చూసీ చూసీ ఇక లాభంలేదని ఆస్పత్రి రిసెప్షన్ కి చేసి రూం నంబరూ తదితర వివరాలు చెప్పి వార్త అందజేయమన్నారు రామయ్య.


డ్యూటి నర్స్, రూం కి వచ్చి ఎవరూ కనబడకపోయేటప్పటికి ఏం చేయలో అర్థంకాక అక్కడే తచ్చాడసాగింది.

========================================================================

ఇంకా వుంది..


========================================================================

దినవహి సత్యవతి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

Podcast:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: https://www.manatelugukathalu.com/profile/dsatya

పేరు: దినవహి సత్యవతి

విద్య : బి.టెక్., ఎం.సి.ఎ. ;

వృత్తి : విశ్రాంత కంప్యూటర్ సైన్స్ లెక్చరర్.

ప్రవృత్తి : రచనా వ్యాసంగం.

సాహితీ ప్రయాణంలో నేటివరకూ కథలు, కవితలు(వచన, పద్య, మినీ), నవలలు, గజల్స్, పంచపదులు, పద్యాలు, శతకములు, వ్యాసములు, పద ప్రహేళికలు, లఘు నాటికలు, పంచతంత్రం కథలు, నానీలు, హంసికలు, హైకూలు, సిసింద్రీలు, తెలుగు దోహాలు వంటి వివిధ ప్రక్రియలలో రచనలు చేయడం జరిగింది.


పలు దేశీయ, అంతర్జాల పత్రికలు, బ్లాగులు, ATA & NYTTA జ్ఞాపికలలో రచనలు ప్రచురితమైనవి.

గుర్తింపు : చైతన్య దీపికలు కథా సంపుటీలోని ‘దీక్ష’ కథ మహారాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో 12 వ తరగతి విద్యార్థులకు తెలుగు పాఠ్యాంశంగా తీసుకొనబడింది.

పలు కథా, కవితా, పద్య సంకలనములలో కథలు & కవితలు ప్రచురితమైనవి.

ఆటవెలది ఛందస్సులో ‘మధుర సత్య శతకం’ వ్రాయడం జరిగింది.

6 గొలుసుకట్టు నవలలలో భాగస్వామ్యం చేయడం జరిగింది.

ముద్రితములు: ‘చైతన్యదీపికలు’ (బాలల కథల సంపుటి) & ‘ఇంద్రధనుస్సు’ (సప్త కథా సంపుటి) &

గురుదక్షిణ (కథల సంపుటి ) ; ‘పంచతంత్రం కథలు’ (బొమ్మల బాలల కథల సంపుటి);

పంచామృతం!(సత్య! పంచపదులు)


స్వీయ బ్లాగు(My Blog) : “మనోవేదిక” : Blog – id: http://satya-dsp.blogspot.in




131 views0 comments

Comments


bottom of page