top of page

కుమ్మరి సారె


Kummari Sare New Telugu Story

Written By C. Jagapathi Babu



(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


మట్టిని నమ్ముకుని బ్రతుకుతున్న మట్టి మనిషి కథ ఇది.

ఎండిన బావిని పూడ్చకుండా అలాగే ఉంచితే, ఎప్పటికైనా ఊట వస్తుందన్నది ఎంత నిజమో- మన చేతిలో పని ఉంటే, దాన్ని నమ్ముకుని బ్రతుకుతుంటే, ఆ పని ద్వారా మనకి ఎప్పటికైనా గౌరవం లభిస్తుందన్నది కూడా అంతే నిజమని నిరూపించిన ఓ మట్టి మనిషి కథ ఇది.


మట్టిని ముద్దగా చేసి ఆకట్టుకునే ఆకారాలు తీర్చిదిద్దడం ఈయన వృత్తి (కుమ్మరి వృత్తి). సారే (చక్రం)ను తిప్పుతూ అద్భుతమైన ప్రయోగాలు చేయడం ఈయనకు అలవాటే. ప్రతి ఒక్క ఇంట్లో కుమ్మరి వస్తువులే ఉండేవి ఒకప్పుడు. వాటిలో వండుకొని తింటుంటే ఆరోగ్యం మనకు, ఆయనకు చేతునిండా పని రెండూ ఉండేవి ఒకప్పుడు. ఈ ప్లాస్టిక్ మరియు స్టీల్ వస్తువులు ఎక్కడి నుంచి వచ్చాయో కానీ కుమ్మరి కడుపుల మీద కొట్టాయి. కూటికి లేకుండా చేశాయి. వృత్తిని వదిలి పట్నాలకు, విదేశాలకు వలసలు వెళ్లేలా చేశాయి.


‘అందరూ ఎలాగైనా కొట్టుకుపోండి. నేను మాత్రం నా వృత్తికి అన్యాయం చేయలే’నని మొండిపట్టుతో ఎక్కడికీ పోకుండా కూర్చున్నాడు నలబై సంవత్సరాల సారయ్య.


"ఏంటయ్యా నువ్వు? నావృత్తి.. నావృత్తి.. అంటావు? ఏ రోజైనా నీకు కడుపునిండా బువ్వ పెట్టిందా నీ వృత్తి? లేదు కదా! అలాంటప్పుడు కూటికి చాలని కులవృత్తిని వదలాలయ్యా! కాలం ఎటు వెళ్తుందో నీకు అర్థం కావట్లేదు?" అంటూ సారయ్యను నిలదీస్తోంది సారమ్మ.


"నువ్వు ఎన్నైనా చెప్పవే, నేను మాత్రం పట్నానికి రానంటే రాను. నీ కొడుకు నా మాట వినకుండా పోయాడు కదా! నువ్వు కూడా వాడితో పాటు వెళ్ళిపో, నా చావు నేను చస్తాను" అన్నాడు సారమ్మతో కుండలను బట్టీలో (కుండలను కాల్చడం కోసం ) పెడుతూ సారయ్య.


"ఉన్నది ఒక కొడుకు, ఒక కూతు”రని కమల వైపు చేయి చూపిస్తూ... “దీనికి వయసొచ్చింది, పెళ్లి చేయాలి?. కొడుకు సంపాదన ఏం సరిపోతుంది?. అందరం వెళ్లి, ఏదో ఒక పని చేసుకుంటే, నెల అయ్యేసరికి కొంచెం డబ్బు చేతికి వస్తుంది. కమల పెళ్లి చేసిన తరువాత కొడుకు పెళ్లి చేయచ్చయ్య" అంది సారమ్మ.


"నీకు నేను ఒక్కసారే చెప్పేది. పదేపదే చెప్పలేను. నన్ను వదిలేయ్. నా మానాన నేను బతుకుతాను" అన్నాడు కొంచెం విసుగ్గా సారయ్య.


"ఏంటి సారమ్మ పెద్దమ్మ.. ఉదయాన్నే మా పెద్దయ్య మీదికి రగడకు వేసుకున్నావ్?" అంటూ సాలెమ్మ అక్కడికి వచ్చింది.


"నువ్వన్న కాస్త గడ్డి పెట్టమ్మా.. మీ పెద్దయ్యకు పట్నం వెళ్దామంటే రానంటున్నాడు. మీ బావ వాళ్ళు పట్నానికి వెళ్లి సంవత్సరం కూడా కాలేదు. అప్పుడే వాళ్ల పెద్దమ్మాయికి పెళ్లి చేస్తున్నారంట. నా కూతురు కంటే ఆరు నెలలు చిన్నదది. అందరి పెళ్లిళ్లు అయిపోతున్నాయి. నా కూతురికి, కొడుక్కి పెళ్లి చేద్దామంటే చేతిలో చిల్లి గవ్వ కూడా లే”దని సారమ్మ తన బాధను సాలెమ్మతో వ్యక్తపరిచింది.


"మేము కూడా వారం రోజుల్లో పట్నానికి వెళ్ళిపోతున్నాం. మాతోపాటు రాకూడద పెద్దయ్య? మట్టి వస్తువులను వాడే వాళ్లే కరువయ్యారు?. అన్ని ఇబ్బందులు పడి తయారు చేస్తే, కింద వేస్తే పగిలి పోయేదానికి అమ్మో! అంత డబ్బా అంటున్నారు?. వచ్చేటట్టుగా అయితే రండి, మాతో పాటు వెళ్దాం” అని, “పాప ఒక్కటి ఇంట్లో ఉన్నద”ని వెళ్లిపోయింది సాలెమ్మ.


"ఒసేయ్ ముదునష్టపు ముఖము దాన.. నువ్వైనా చెప్పవే మీ నాన్నకు పట్నానికి వెళ్దామని" కూతుర్ని పొడిచి పొడిచి చెప్పింది సారమ్మ.


కమల ఏడ్చుకుంటూ గుడిసె లాంటి ఇంట్లోకి వెళ్లిపోయింది.

"ఆఖరి సారిగా అడుగుతున్నానయ్యా! నువ్వు వస్తావా? రావా? నేను మాత్రం నా బిడ్డను తీసుకొని నా కొడుకు దగ్గరికి వెళ్లి పోతాను" అంది కోపంగా సారమ్మ.


"ఆరు నూరు, నూరు ఆరైనా నా మాట ఒక్కటే, నేను రా”నని సారమ్మతో అన్నాడు సారయ్య.

"ఆ కుండలతో పాటు, నువ్వు కూడా ఆ బట్టీలోనే తగలబడిపో" అని శాపనార్థాలు పెడుతూ... ఏడ్చుకుంటూ... ఇంట్లోకి వెళ్లిపోయింది సారమ్మ.

సారయ్య బట్టీలో... తయారుచేసిన వస్తువులన్నీ అమర్చి, కట్టెలు పేర్చి ,బట్టీకి నిప్పు పెట్టేసరికి సాయంకాలం అయింది. అలసిపోయి నెమ్మదిగా ఇంట్లోకి వచ్చి ఒక మంచం మీద వాలిపోయాడు.


అంతగా సారయ్య మీద ఆడిపోసుకున్న సారమ్మ అలా భర్తను చూసేసరికి, మనసు చెలించి పోయి, వెంటనే కుండలో మంచి నీళ్లు తీసుకుని వచ్చి ఇచ్చింది. సారయ్య లేచి కూర్చుని నీళ్లు తాగేసి క్రింద మట్టికుజాను పెట్టాడు.


"సారమ్మ, సారయ్య పక్కన కూర్చుంటూ... ఊర్లో అందరూ సారయ్య కూతురికి జీవితంలో పెళ్లి చేయలేడు అంటున్నారు?, అందుకోసమైనా మాతోపాటు రాకూడదయ్యా?" అని ఆశగా అడిగింది సారమ్మ.


"అది కాదు సారు నాకు మాత్రం కూతురు పెళ్లి, కొడుకు పెళ్లి చేయాలని ఉండదా ఏంటి?. ప్రభుత్వం మన కోసం పథకాలు ప్రవేశపడుతున్నాదంట. త్వరలోనే ప్లాస్టిక్ వస్తువులను నిషేధించే ప్రయత్నం చేస్తున్నాదంట.


ఈ కాలానికి అనుగుణంగా, ఆకర్షణీయంగా మట్టి వస్తువులు ఎలా తయారు చేయాలో అవగాహన కల్పిస్తారంట. ఇవన్నీ కానీ జరిగితే మన బ్రతుకులు బాగుపడతాయేమోనని ఒక చిన్న ఆశ, నా మాట విను" అని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తాడు సారయ్య.

"నువ్వు మారవయ్య?. నువ్వు ఒక బండరాయివి?. నిన్ను అడిగినందుకు నన్ను నేను కొట్టుకోవాలి." అంటూ అక్కడి నుంచి లేచి కోపంగా వెళ్ళిపోయింది సారమ్మ.


కూతురు కమల అక్కడికి వచ్చి "అమ్మ మాటలు ఏమి పట్టించుకోకు నాన్న, నీకు నేను తోడుంటాను. అమ్మనే పోనీలే పట్నానికి. బువ్వ తిందువురా నాన్న" అని పిలిచింది ప్రేమగా కమల.


"పోనీలేమ్మ.. నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నావు. నాకు ఆకలిగా లేదని" మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు సారయ్య.

సారయ్య ఉదయాన్నే లేచి, బట్టీ పెట్టిన దగ్గరికి వెళ్లి, ఆ బట్టివైపు పరిశీలనగా చూస్తున్నాడు.


ఒక అతను దండోరా కొడుతూ వచ్చి ఆపి, "యావత్ ప్రజానీకానికి తెలియజేయడమేమనగా.. శాలివాహన కుమ్మరులందరూ మన గ్రామ పంచాయతీ కార్యాలయం దగ్గరికి రావలసిందిగా కోరుచున్నాము. పెద్దలు ముఖ్యమైన సభను ఏర్పాటు చేస్తున్నారని" చెప్పి వెళ్ళిపోతాడు అతను.


గ్రామ ప్రజలందరూ పెద్ద ఎత్తున సభకు హాజరయ్యారు. "ఇక్కడికి వచ్చిన శాలివాహన కుమ్మరులందరికీ నమస్కార”మని, “ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మనల్ని తరుముతున్న ప్లాస్టిక్ మీద దండెత్తడం" అని చెప్పి

విషయానికి వచ్చాడు.


“నెలరోజుల పాటు ఈ కాలానికి అనుగుణంగా మట్టి వస్తువులు ఎలా తయారు చేయాలో నేర్పిస్తారు. ఆసక్తి ఉన్నవాళ్లే కాకుండా ప్రతి ఒక్కరు పాల్గొని, ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాము.

నెలరోజులపాటు అన్ని సౌకర్యాలు ప్రభుత్వమే భరిస్తుంది” అని చెబుతుండగానే... “ఇలాంటి మీటింగులు ఎన్ని చూడలేదు? మాకు ఏ న్యాయము జరగ”దని చాలామంది అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఉన్న కొంతమందిలో సారయ్య అక్కడే ఉండి, చెప్పే ప్రతి ఒక్క విషయాన్ని ఆసక్తిగా వింటున్నాడు.


ఐదు గంటల పాటు జరిగిన ఈ మీటింగ్ లో చివరిగా ఈ మాటతో ముగిస్తున్నానని “ఆసక్తి ఉన్న వాళ్ళందరూ ఇంకో రెండు రోజుల్లో కోచింగ్ (శిక్షణ) తీసుకోవడానికి పట్నానికి వెళ్లి నేర్చుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ అవకాశం భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుం”దని ముగించారు సభను.


సారయ్య ఇంటికి వచ్చి కుండలన్నింటినీ బట్టిలో నుంచి తీసి, జాగ్రత్తగా ఒక దగ్గర భద్రపరుస్తున్నాడు. ఇంతలోనే కమల వచ్చింది అక్కడికి.

“అమ్మకానికి తీసుకు వెళ్లలేదా నాన్న?” అని అడిగింది. “లేదమ్మా కమల.. ఇంకో రెండు రోజుల్లో పట్టణంలో ఏదో శిక్షణ ఇస్తారంట. అక్కడికి వెళ్లాలి” అని చెప్పాడు.


ఈ మాటలు చాటు నుంచి విన్న సారమ్మ, తెగ సంతోష పడిపోయింది. పట్నం వచ్చిన తర్వాత ఈయన్ని తిరిగి ఇక్కడికి పంపించకూడదు అనుకుని తనలో తాను మురిసిపోయింది.

*********

రెండు రోజుల తర్వాత అందరూ పట్నం చేరుకున్నారు. సారయ్య ఉండే పంచాయతీకి గాను సారయ్య ఒక్కడే కోచింగ్ (శిక్షణ) తీసుకోవడానికి వచ్చాడు. కమలను, సారమ్మను కొడుకు దగ్గరికి వెళ్ళమని చెప్పి, కోచింగ్ ఇచ్చే ప్రభుత్వం కార్యాలయం దగ్గరికి వచ్చాడు సారయ్య. అక్కడ రాష్ట్రం మొత్తం మీదుగా 1500 మంది హాజరయ్యారు. వంద మందికి కలిపి ఒక కోచ్ ని నియమించుకొని, 1500 మందికి 15 మంది కోచింగ్ ఇస్తున్నారు. మనం ఏంటో, మన మట్టి విలువేంటో, తెలియజేద్దాం అంటూ... సారే( చక్రం) మీద నేటి తరానికి సంబంధించిన రకరకాల వస్తువులు, తయారు చేసి చూపిస్తున్నారు. అందరూ చాలా శ్రద్ధతో గమనిస్తున్నారు.

సారయ్య కూడా ప్రతి ఒక్క విషయాన్ని జాగ్రత్తగా రెప్పవాల్చకుండా గమనిస్తున్నాడు.


సాయంకాలం కావడంతో "మీరు ఇక్కడే ఉండండి, ఫుడ్ పెడతారు, తినేసి ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్లాస్ రేపు మొదలెడదాం" అంటూ ఆ కోచింగ్ ఇచ్చే వాళ్ళు వెళ్ళిపోయారు. కాసేపు అందరూ ప్రాక్టీస్ చేసి వరండాలో పడుకున్నారు.


సారయ్య మాత్రం పడుకుని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. ఇంతలోనే కొడుకు రాజశేఖరం సారయ్య దగ్గరికి వచ్చి, "ఏంటి నాన్న ఇక్కడ పడుకున్నావ్? రూమ్ కి వెళ్దాం రా అన్నాడు." సారయ్య కోపంగా అక్కడినుంచి లేచి పక్కకు వెళ్ళిపోయాడు. సారయ్య కొడుకు రాజశేఖరం చేసేదేమీ లేక నాన్న ఇంకా నా మీద కోపంగానే ఉన్నట్టున్నాడు అని మనసులో అనుకుంటూ... వెళ్లిపోయాడు.


కొంచెం గతంలోకి వెళ్తే

రాజశేఖరం ను సారయ్య చాలా పద్ధతిగా పెంచాలనుకున్నాడు. కుమ్మరి పనులన్నీ చాలా శ్రద్ధగా నేర్పించేవాడు. మన వృత్తిని మరిచితే కన్న తల్లిని మరిచినట్టే రా అంటూ పదేపదే చెప్పేవాడు. రాజశేఖరం మాత్రం తండ్రిని నొప్పించకుండా తండ్రి చెప్పినట్లే పై పైన మాత్రమే నటించే వాడు. మనస్సులో మాత్రం కూడు పెట్టని ఈ వృత్తి అంటే పరమ అసహ్యం రాజశేఖరం కు. సంపాదన కోసం ఎటో దూరంగా వెళ్లిపోవాలని ఆలోచిస్తుండేవాడు.

ఒక్కరోజు సంపాదన కోసం తన స్నేహితులు పట్నానికి వెళ్తున్నారని. రాజశేఖరం కూడా వెళ్లాలనుకున్నాడు. కానీ తండ్రికి చెప్పేకి ధైర్యం సరిపోలేదు. తల్లి దగ్గరికి వెళ్లి, నాకు ఇక్కడ ఉండే ఇష్టం లేదని, నాన్నను బాధ పెట్టకూడదని అలా నటిస్తున్నానని తన బాధనంత తన తల్లి సారమ్మతో వ్యక్తపరిచాడు.


తల్లి సారమ్మ చేసేదేమీ లేక కొడుక్కి వత్తాసు పలికింది. రాజశేఖరం తండ్రి సారయ్య దగ్గరికి వెళ్లి, “నా ఫ్రెండ్ పెళ్లి పట్నంలో జరుగుతుంది, వెళ్లాలి” అనగా సారయ్య కాదనలేక పొమ్మన్నాడు. “తొందరగా వచ్చేయ్.. ఇక్కడ చాలా పనులు ఉన్నాయి. ఇద్దరం బాగా కష్టపడి చెల్లెలు పెళ్లి చేయాలి” అన్నాడు.

ఇక్కడ ఉంటే చెల్లి పెళ్లి కాదు కదా తినడానికి తిండి కూడా దొరకదని మనసులో అనుకుని పట్నానికి వచ్చేసాడు రాజశేఖరం. (అప్పటినుంచి ఇప్పటివరకు అంటే సుమారు ఆరు నెలలు కావొస్తుంది పట్నానికి వచ్చి రాజశేఖరం).


ఇంకా గతంలో నుంచి బయటకు వస్తే

"మీ నాన్న ఎక్కడ్రా? రాజశేఖరం, పిల్చుకోస్తానని పోయావు రాలేదా?" అంది ఆత్రంగా సారమ్మ.

"నాన్న నాతో మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదమ్మ, నేను ఆరోజు అలా చేయకుండా ఉండాల్సింది" అన్నాడు రాజశేఖరం బాధపడుతూ..


"నాకు తెలుసు రా.. మీ నాన్న ఎక్కడికి రాడని.. ఏదో లోపల చిన్న ఆశ ఉండేది. అది కూడా ఇప్పటినుంచి చచ్చిపోయింది" అంటూ నేలకు ఒరిగిపోయింది సారమ్మ.


కమల, రాజశేఖరం తల్లి సారమ్మకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.

అక్కడ అందరి నెల కోచింగ్ పూర్తయింది. ఒక చిన్న మీటింగ్ లాంటిది ఏర్పాటు చేసి, " ఇక్కడికి వచ్చిన మీ అందరికీ, బ్యాంకులో వడ్డీ లేకుండా రుణం ఇస్తారు. మట్టిని చేతులతో కాళ్లతో పిసికి, సారే (చక్రం) తిప్పుతూ.. పనిచేయాలంటే చాలా ఆలస్యం అవుతుందని, ప్రభుత్వం రెండు యంత్రాలను తయారు చేయించింది. మీ గ్రామీణ బ్యాంకు దగ్గర తీసుకోవాల్సిందిగా కోరుచున్నా”మని ఆ సభను ముగించి, “అప్పుడప్పుడు ఇక్కడికి పిలుస్తుంటాము, అప్డేట్ ఇవ్వటానికి” అని చెప్పి అందరిని వాళ్ల స్వగ్రామానికి పంపించేశారు.


సారయ్య నెల కోచింగ్ పూర్తి కావడంతో కొడుకు రాజశేఖరం అద్దెకు ఉంటున్న రూమ్ దగ్గరకు వచ్చాడు. భార్య సారమ్మ, కొడుకు రాజశేఖరం చాలా సంతోషించారు. ఆ సంతోషాన్ని క్షణం పాటు ఉండనీయకుండా వెంటనే కమలను పిలుచుకొని తన స్వగ్రామానికి వచ్చేసాడు.


*********

సారయ్య చెరువు మట్టి కోసం కబురు పెట్టాడు. బ్యాంకు దగ్గరికి వెళ్లి, కొంచెం రుణం తీసుకున్నాడు.


మట్టిని ముద్దగా కలుపుకోవడం కోసం ఒక యంత్రాన్ని, మట్టి వస్తువులు తయారు చేయడానికి ఒక యంత్రాన్ని సారే (చక్రం), విద్యుత్ మోటార్ సహాయంతో పనిచేసే రెండు యంత్రాలను ఇచ్చారు. వాటిని తీసుకొని, తన ఇంటి దగ్గరికి వచ్చి, పని మొదలుపెట్టాడు సారయ్య. పని సులువుగాను, త్వరగాను జరుగుతున్నది.


కమల కూడా మట్టిని శుభ్రం చేయడం. మట్టిని ఎండలో ఎండబెట్టడం. తడిగా నానబెట్టడం మరియు తండ్రి తయారుచేసిన వస్తువులన్నింటిని ఎండలో ఆరబెట్టడం లాంటి తనకు చేతనైన సాయం చేస్తుంది.


సారయ్య నేటి తరానికి అనుగుణంగా అద్భుతమైన ప్రయోగాలు చేస్తున్నాడు. వాటర్ బాటిల్స్, బిర్యానీ కడాయిలు, ప్లేట్స్, వాటర్ గ్లాసులు, కుండలు టీ కప్పులు ఇలాంటి మొదలైనవి( శిక్షణలో నేర్పించిన) ఎన్నో ప్రయోగాలు చేస్తున్నాడు సారయ్య. అవి ప్లాస్టిక్ వస్తువులు కంటే అందంగానూ, ఆకర్షణీయంగానూ ఉన్నాయి.


మొదట్లో కొంచెం వాటిని మార్కెట్ చేసుకోవడంలో ఇబ్బంది పడ్డాడు. మట్టి వస్తువులు వినియోగించడం వలన మనిషి ఆరోగ్యంగా జీవిస్తాడని, ప్రభుత్వం కూడా తన తరపున ప్రచారం చేసింది. అందువల్ల మట్టి వస్తువులకు మెల్లగా ఆదరణ పెరుగుతోంది.


విదేశాలకు, పట్నాలకు వెళ్లిన వాళ్లు తిరిగి తన స్వగ్రామాలకు వచ్చి పనిలో నిమగ్నం అయిపోయారు. చాలామంది సారయ్య దగ్గరికి పని నేర్చుకోవడం కోసం వస్తున్నారు. సారయ్య కూడా ఉచితంగానే అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ శ్రద్ధగా పని నేర్పిస్తున్నాడు.


చుట్టూ ఉండే వాళ్లకు పొగతో ఇబ్బంది కలగకూడదని బట్టీ పెట్టుకోవడం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఆరు బయట బట్టీలు ఏర్పాటు చేయించింది. త్వరలోనే కరెంట్ బట్టీల యంత్రాలు తయారు చేపించే పనిలో ఉన్నామని, ప్రభుత్వం హామీ ఇచ్చింది.


కొడుకు రాజశేఖరం, భార్య సారమ్మ ఇద్దరు కూడా తమ తప్పులను తెలుసుకొని తన స్వగ్రామానికి తిరిగి వచ్చారు. సారయ్యను చూడగానే ఇద్దరు కన్నీటి పర్యంతం అయ్యారు. నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను నాన్న అని గట్టిగా వాటేసుకుని మనస్ఫూర్తిగా ఏడ్చేశాడు రాజశేఖరం. సారమ్మ తన బాధను వ్యక్తపరచలేక నువ్వు చాలా గొప్పోడివయ్యా అంటూ పొగడ్తలతో ముంచెత్తింది.


మెల్లగా ప్లాస్టిక్ వినియోగం పడిపోయి, మట్టి వస్తువుల వినియోగం పెరిగింది. వాతావరణం కాలుష్యం కూడా తగ్గుముఖం పట్టింది. కుమ్మర లందరికీ చేతినిండా పని, ప్రజలందరూ కాస్త ఆరోగ్యంతో జీవిస్తున్నారు.


సారయ్య కూడా బ్యాంకులో తీసుకున్న రుణాన్ని తీర్చేశాడు. కూతురు పెళ్లి చేశాడు. త్వరలోనే కొడుకు పెళ్లి చేయాలని సంబంధాలు చూస్తున్నాడు.


సారయ్య తన అస్తిత్వాన్ని కోల్పోకుండా అన్ని సమస్యలను ఎదుర్కొని ఇప్పుడు మట్టి పువ్వులు పూయిస్తున్నాడు.

///సమాప్తం////

(నోట్: కుమ్మరాయనది, మనది పేగు బంధం. వీళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పిస్తే నేటి ఆధునిక యుగానికి అనుగుణంగా వస్తువులు తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక్కటి మాత్రం నిజం. కుమ్మరి లేనిదే మనం లేము. ఈమధ్య కాలంలో పుట్టేటప్పుడు మాయ తీయడానికి, పోయేటప్పుడు కర్మ కాండలకు, అప్పుడప్పుడు శుభకార్యాలకు కుమ్మరిని తలచుకుంటున్నాం. కానీ ముందు తరంలో అయితే ఇంటి నిండా మట్టి వస్తువులే ఉండేవి. ప్రజలందరూ ఆరోగ్యంతో జీవించేవారు. పర్యావరణం కూడా పరిశుభ్రంగా ఉండేది. కానీ ఇప్పుడు ఈ ప్లాస్టిక్ వల్ల పర్యావరణం మొత్తం కలుషితమైపోతున్నది. అందుకే ప్రభుత్వం కూడా వీటిపై దృష్టి పెట్టింది. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించండి. మట్టి వస్తువులను ఉపయోగించండి అని ప్రచారం చేస్తుంది ప్రభుత్వం. అలాగే కుమ్మరులందరికీ అన్ని సౌకర్యాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నది.)

C. జగపతి బాబు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



Twitter Link


Podcast Link

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: C. జగపతి బాబు

కథలు రాయడం అన్నా, చదవడం అన్నా నాకు చాలా చాలా ఇష్టం. కొన్ని కారణాలవల్ల ఇంటర్మీడియట్ తో చదువు ఆపేసి ప్రస్తుతం ఫార్మర్ గా కొనసాగుతున్నాను. ఈ వేదిక ద్వారా నా టాలెంట్ ఏంటో నలుగురికి తెలియాలని, అలాగే సమాజానికి ఉపయోగపడే కథలు మరెన్నో వ్రాయాలని తపిస్తున్నాను.




272 views1 comment

1 commentaire


Mana Telugu Kathalu
Mana Telugu Kathalu
17 janv. 2023

Lvj Creations • 6 hours ago

తెలుగు కథలు. కామ్ వారికి నా హృదయపూర్వక అభినందనలు. అలాగే కథను చాలా చక్కగా చదివి వినిపించిన మల్లవరపు సీతారాం కుమార్ గారికి ధన్యవాదాలు. మరెన్నో ఇలాంటి కథలు రాయడానికి ప్రయత్నిస్తాను అండి. ఎల్లవేళల మీ ఫుల్ సపోర్ట్ మా రచయితలకు ఇలాగే ఉండాలని ఆశిస్తున్నాను.

J'aime
bottom of page