కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Video link
'Lalitha Sandesam' written By Pendekanti Lavanya Kumari
రచన: పెండేకంటి లావణ్య కుమారి
అదొక వర్షాధార భూములుండే చిన్న గ్రామం. వేసవికాలం కావటంతో రంగనాయకులు పొలం పనులకు వాడే పనిముట్లన్నింటినీ శుభ్రం చేసి, ఏవైనా బాగు చేయాల్సి వున్న వాటిని బాగు చేస్తున్నాడు.
అప్పుడే లలిత, “నాన్నా!” అంటూ వచ్చింది.
“ఏంటమ్మా!” అని అడిగాడు రంగనాయకులు.
“నాన్నా! నీతో నేనొక ముఖ్య విషయం మాట్లాడాలి” అంది.
“ఒక పది నిమిషాలాగు. ఈ కొంత పని పూర్తి చేసుకు వస్తా” అన్నాడు. అంతలో లలిత, వాళ్ళ నాన్నకు ఉప్పు, నిమ్మరసం కలిపిన మజ్జిగ తీసుకు వచ్చింది. వరండాలో నులుక మంచం వేసుకుని ఇద్దరూ కూర్చున్నాక, “ఇక చెప్పమ్మా!” అన్నాడు రంగనాయకులు.
“నాన్నా! నేను వ్యవసాయ విద్యలో డిగ్రీ చేస్తాను” అంది.
"అదేంటమ్మా! నీవు చాలా బాగా చదువుతావు, డాక్టరు కోర్సులో సీటు తప్పకుండా వస్తుందని మీ మాస్టరు కూడా చెప్పారు. అయినా నీకెందుకమ్మా ఈ మోటు పనులు... నీవు పుట్టగానే ఎంతో ముద్దుగా, నాజూకుగా వుంటే చూసి లలితా అని పేరు పెట్టుకున్నాను, నీకు మంచి చదువు చెప్పించాలనుకున్నాను. ఆదీకాక డాక్టరు సీటు వస్తుందని మీ మస్టారు కూడా చెప్పారు. ఇదేంటమ్మా! ఇప్పుడు ఇలా అంటున్నావు? అయినా నీకు తెలీదా తల్లీ, రైతుగా నేను పడ్డ కష్టం. ఇంక మీరు ఈ ఊబిలో ఉండకూడదనే కదా మిమ్మల్ని చదివిస్తున్నాను. దీంట్లో నేను పోగొట్టుకున్నదే కానీ మీకంటూ సంపాదించినది ఏమీ లేదు. నేను అన్నయ్యనే రైతుగా చూడాలనుకోలేదు. ఇంక నిన్ను ఈ రొంపి లోకి దింపుతానా తల్లీ!" అన్నాడు. "అయినా వ్యవసాయం మేము చేయటం లేదా? మేమేమన్నా చదువు కున్నామా! దానికి పోయి చదివేదేముంటుందమ్మా" అన్నాడు.
"నాన్నా! అదే చెప్పబోతున్నాను, నీకన్నీ వివరంగా చెప్పటానికే పిలిచాను. నేను నిన్న అన్నయ్యతో కూడా ఈ విషయంగా మాట్లాడి ఒప్పించాను. నేను చెప్పాక అన్నయ్య ఒప్పుకుని సహాయం చేస్తా అన్నాకే మీకు చెప్తున్నాను. ఇన్ని రోజులు మీరు డాక్టరు కోర్సు చదవమంటుంటే ఏమీ అనలేక పోవటానికి కారణం మన ఆర్థిక ఇబ్బందులు, అందుకే అదే చదవాలనుకున్నాను. కానీ ఇప్పుడు అన్నయ్య స్కాలర్షిప్పుతో యు.ఎస్ వెళ్ళి ఎమ్మెస్ చేస్తున్నాడు. ఇప్పుడు అక్కడ ఉద్యోగం చేస్తూ చదువుకుంటున్నాడు. ఇంకో సంవత్సరానికంతా తను ప్రాజెక్టు చేసే సంస్థలోనే మంచి ఉద్యోగము ఇస్తామని కూడా చెప్పారంట. అలా కాకున్నా అమెరికాలోనే ఎక్కడైనా తను చదివిన చదువుకు మంచి వేతనంతో ఉద్యోగం వస్తుందని చెప్పాడు. అందుకే నేను వ్యవసాయంలో డిగ్రీ చేసి ఏమేమి చేయాలనుకున్నానో వివరంగా చెప్పాను. నన్ను మెచ్చుకుని, నేను చేయాలనుకున్నది నీవు చేస్తానంటే ఎందుకు కాదంటానన్నాడు. అంతే కాక తనకు వీలైనన్ని విషయాలు కూడా తెలుసుకుని చెపుతానన్నాడు. నా డిగ్రీ అయిపోయేసరికి తను కొంచెమైనా సంపాదించగలిగి వుంటానని, దాని వల్ల ధనసహాయం కూడా చేయగలనని చెప్పాడన్నది. అంతే కాక యు.ఎస్ లో వుండే తన స్నేహితుల ద్వారా కూడా ధనసహాయం అందే అవకాశం వుందన్నాడు.
నాన్నా! మన దేశంలో ప్రస్తుతం రైతులుగా వుండటానికి ఎవ్వరూ ఇష్టపడటం లేదు. అందరూ ఒక స్థిర ఆదాయం వుండే ఉద్యోగాలకే మొగ్గు చూపుతున్నారు. డాక్టర్ కోర్సు చేయటానికెంతో మంది పోటీపడుతుంటారు. నేను దాన్ని చేయకున్నా పెద్ద వ్యత్యాసమేమీ వుండదు. అదే నాలాగా బాగా తెలివైనవారు వ్యవసాయానికి సంబంధించిన డిగ్రీ చేసి రైతులలోనూ, వ్యవసాయ రంగంలోనూ మార్పులు తీసుకు వస్తే ఎంతో మంది రైతులకు మేలు చేసిన వారమవుతాము. అంతే కాదు ప్రతి రైతుకు పంటలు పండినా, పండకున్నా ఒక స్థిరమైన నెలసరి ఆదాయం వుండేలా చూడాలన్నది నా చిరకాల కోరిక. దానివల్ల ఎంతో మంది రైతులు అప్పుల పాలు కారు, ఆత్మహత్యలు చేసుకోరు అంది. ఇంకా మనలా డబ్బు ఇబ్బందులు పడరు. మీ కాలమప్పుడు వ్యవసాయమనేది మీ పెద్దల నుండి మీరు నేర్చుకుని చేసారు. మీకు అది మాత్రమే తెలుస్తుంది. ఇప్పుడు వ్యవసాయంలో కొత్త వరవడి లెన్నో వచ్చాయి. ఎన్నో రకాల విత్తనాలు అంటే హైబ్రిడ్ అనీ, జన్యు పరంగా మార్చబడిన విత్తనాలు అనీ, అలాగే ఎన్నో రకాల ఎరువులు, రకరకాల క్రిమిసంహారకాలు వస్తున్నాయి. వాటిని ఎందరో వాడుతున్నారు. అవి ఎందుకు వాడుతున్నారో సరైన అవగాహన లేకుండానే ఎవరో చెప్పారనో, వేరేవారికి పంట బాగా పండిందనో వాడుతుంటారు. ఇలాంటివెన్నో విషయాలు ఎజి.బి.ఎస్సీ అనే వ్యవసాయానికి సంబంధించిన డిగ్రీ చదివితే తెలుసు కోవచ్చు నాన్నా" అంది.
"దాని వల్ల అన్నీ మనమే స్వయంగా నిర్ణయించు కోవడమే కాక మన చుట్టూ వున్న రైతులెందరికో సహాయపడ వచ్చు. మీరు నా పెళ్ళి గురించి కూడా దిగులు పడవద్దు. నేను పెళ్ళి కూడా ఒక రైతును, అంతే కాక నా ఆదర్శాలను గౌరవించే వ్యక్తినే చేసుకుంటా నాన్నా. మనది వ్యవసాయ కుటుంబం కాబట్టి దానిలోని సాధకబాధకాలు నాకు బాగా తెలుసు. మనకు పొలం కూడా వుండటం వల్ల, దాంట్లో నా ప్రణాళికలను ప్రయత్నించవచ్చు. మీ తాతముత్తాతల నుండి ఇక్కడే వున్నారు అందువల్ల గ్రామస్థులందరినీ ఏకీకృతం చేయడం మీకు పెద్ద కష్టమైన పని కాదు. అలా మనం ఒక ప్రణాళికతో పని చేసి చూపి ఈ గ్రామాన్నంతా అదే పద్ధతిని అవలంబించేలా చేసి మన గ్రామాన్ని ఒక మంచి వ్యవసాయ క్షేత్రంగా తీర్చిదిద్దాలనుకుంటున్నా"నంది.
"నాన్నా! మీ తాతముత్తాతలు ఈ గ్రామంలోనే వ్యవసాయం చేసుకు బ్రతికారు. ఎంత పెద్ద కుటుంబం మీది. అయినా చూడండి ఇప్పుడు గ్రామంలో మీరు తప్ప మీ వాళ్ళెవరూ లేరు. అందరూ తలో దిక్కుకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటూ బ్రతుకుతున్నారు. ఇప్పుడు అన్నయ్య కూడా విదేశాల్లో స్థిర పడబోతున్నాడు. ఇంక నేను కూడా వుండకపోతే ఇంతటితో వ్యవసాయానికి, ఈ గ్రామానికి వున్న మీ వంశ సంబంధం తెగిపోయినట్టే అంది. నేను ఇక్కడే వుంటే అన్నయ్య ఎప్పటికైనా ఇక్కడికొచ్చే అవకాశం వుంటుంది.
మీ తరానికి అంటే నీకూ, చిన్నాన్నకు కలిపి మీ నాన్న నుంచి వచ్చినది యాబై ఎకరాలు, అంటే నీకు పాతిక ఎకరాలు వచ్చాయి. అందులో వ్యవసాయ అప్పులకు కొంత అమ్మితే, ఇంకొంత అమ్మ వైద్యానికి అమ్మారు. అందులోని చాలా కొంత భాగం అన్నయ్య చదువుకు అవసరం అయ్యిందనుకో. కానీ అన్నయ్య కష్టపడి చాలామటుకు స్కాలర్షిప్ లతోనే చదివాడులే. కానీ ఇప్పుడు నీ వద్ద కేవలం పదహేను ఎకరాలు మాత్రమే మిగిలాయి, అందులోనూ ఐదు ఎకరాలు అప్పుల్లో వుంది. ఇలా వ్యవసాయం కోసం అప్పులు చేయటానికి, అమ్మ అనారోగ్యం పాలు కావటానికి కారణం ఎప్పుడైనా ఆలోచించావా నాన్నా?" అని అడిగింది...
"దాంట్లో ఆలోచించాల్సినంత ఏముందమ్మా! పొలంలో దిగుబడి రాను రాను తగ్గుతూ వచ్చింది, మీ అమ్మకు వయసు మీద పడి అనారోగ్యం పాలయ్యింది. ఇదంతా సహజమే కదమ్మా" అన్నాడు.
"సహజం కాదు నాన్నా, మీ తాతముత్తాతల నుండి అలా దిగుబడి తగ్గుతూ పోయుంటే నీ దగ్గరకు వచ్చే సరికి ఆ పొలంలో ఈ పాటికి పంటే పండకుండా వుండాలి కదా, మరైతే అలా దిగుబడి తగ్గుతూ పోవడం అప్పుడు జరగనిది ఇప్పుడెలా జరుగుతుంది నాన్నా?.."
"అవునమ్మా! నిజమే నేనెప్పుడూ ఆలోచించలేదు..."
"అందుకే నాన్నా చదువుకుంటే ఇలాంటి ఆలోచనలు కలుగుతుంటాయి... సరే నాన్నా! దిగుబడి తగ్గుతూ పోవటానికి కారణమేమంటే విరివిగా కృత్రిమ ఎరువులు, ధారాళంగా పురుగు మందులు వాడటం. దీని వల్ల భూసారం తగ్గి ఏటికి ఏడు పంట దిగుబడి తగ్గుతూ పోతుంది. దానికి తోడు నాసిరకం విత్తనాలు ఉపయోగించటం కూడా దిగుబడి తగ్గటానికి ఒక కారణం. పూర్వం సేంద్రియ ఎరువులు, ప్రకృతి సిద్ధమైన క్రిమిసంహారకాలు వాడేవారు. విత్తనాలను ఎవరికి వారు తయారు చేసుకునేవారు. అందుకే భూసారం ఎప్పుడూ ఒకేలాగా వుండి దిగుబడి అలానే వుండేది. వారు పండించిన పంటలోనే బాగా బలంగా, నాణ్యంగా వున్న వాటిని విత్తనాలుగా మార్చుకునే వారు. ఆ పద్దతి ద్వారా ఏటికి ఏడు ఇంకా నాణ్యమైన పంటను, దాని నుండి నాణ్యమైన విత్తనాలను సంపాదించగలిగేవారు.
ఇంక అమ్మ విషయానికి వస్తే, అమ్మకు వచ్చింది క్యాన్సర్. ఇది సామాన్యంగా పురుగు మందులు వాడిన ఆహారాన్ని తీసుకుంటూ వుండటం వల్ల , పండ్లను మాగబెట్టటానికి వాడే మందు వాడిన పండ్లు తింటూ వుండటం వల్ల వస్తుంది. అంతే కాకుండా భూమిలో చల్లిన క్రిమి సంహారక మందు వర్షం వల్లనో ఇంకో విధంగానో త్రాగునీటిలో కలిసి అవి మనం త్రాగటం వల్ల కూడా జరుగుతుంటుంది. మీరు అడగొచ్చు మనం ఏమి తిన్నామో మీ అమ్మ కూడా అదే తిన్నది కదా, మరి ఆమెకు మాత్రమే ఎందుకు వచ్చిందని?.. దానికి కూడా ఒక కారణం వుంది, ఒక్కొక్కరికి ఒక్కో శాతంగా రోగనిరోధక శక్తి వుంటుంది. మనకంటే అమ్మకు తక్కువగా వుండి వుండవచ్చు. అమ్మ ఎప్పుడూ మనందరికీ బలమైన ఆహారం పెట్టి మిగిలినవి తను తింటుంది దానివల్ల అమ్మకు రోగనిరోధక శక్తి తక్కువయ్యుండవచ్చు.
అంతే కాదు నాన్నా మీరు ఇలా పురుగు మందులు వాడటం వల్ల మీకు తెలియకుండానే మీరు ఎందరి అనారోగ్యాలకు కారణమవుతున్నారో తెలుసా?!! రైతులు నాణ్యమైన పంటలు పండిస్తేనే ప్రజలు ఆరోగ్యంగా వుంటారు నాన్నా. ఎక్కువ దిగుబడి కొరకు హైబ్రిడ్ విత్తనాలు వాడటం వల్ల వచ్చే పంటలో పోషకవిలువలు తగ్గిపోతున్నాయి. వాటిని తింటే కడుపు నిండుతుంది కానీ లభించవలసినన్ని పోషకాలు లభించవు. దానితో రోగనిరోధక శక్తి తగ్గి, పైగా క్రిమిసంహారకాలు ఒంట్లో చేరటం మూలాన, క్యాన్సర్ జబ్బు దేశంలో ఎంతగానో పెరిగి పోతుంది. నీకు అమ్మడానికి పొలం వుంది కాబట్టి అమ్మ బ్రతికింది కానీ దీని వల్ల ఎంతో మంది ప్రజలు ప్రాణాలు వదులుతున్నారు. దానికి నైతిక బాధ్యత రైతులదే. దాన్ని ఎంతమంది అంగీకరించగలరు. దీనికంతటికీ కారణం రైతులకు విద్య లేక పోవటమే. అందుకే నేను వ్యవసాయంలో డిగ్రీ తీసుకుని ఆ రంగంలో కృషి చేయాలనుకుంటున్నాను. చదువు కోవటం వల్ల ఏవి వాడాలి, ఏవి వాడకూడదనేది తెలుసు కోవటమే కాక, ప్రపంచంలో ఎక్కడెక్కడో జరిగే వ్యవసాయాభివృద్ధికి తోడ్పడే రీసెర్చ్ ల గురించి, పద్దతుల గురించి కూడా తెలుస్తుంది. ఎన్నో రకాలైన పనిముట్లు, అవి ఉపయోగించే విధానాలను తెలుసుకోవచ్చు. మనుషులు దొరకనప్పుడు యంత్రాలను వ్యవసాయ రంగంలో ఎలా ఉపయోగించాలో కూడా తెలుసు కోవచ్చు. తక్కువ నీటిని వృధా కానివ్వకుండా వుండే పద్దతులెన్నో తెలుసుకోవచ్చు. ఇలా ఎన్నెన్నో కొత్త విషయాలు తెలుసుకోవచ్చు. ఈ వేసవి సెలవుల్లో మొదట మీ నుంచి మీ పెద్ద వారు చేస్తున్న సేంద్రియ పద్దతుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. అంతే కాదు ఇప్పటి నుండి మీరు ఆ పద్దతులనే పాటించి భూసారాన్ని పెంచడమే కాకుండా మీ పంట తినే ప్రజల ఆరోగ్యానికి రక్షణగా వుండ బోతున్నారు" అన్నది.
అలానే వుండాలని అతనితో ప్రతిజ్ఞ కూడా చేయించుకుంది. ఇదంతా విన్న రంగనాయకులు తన కూతురి తెలివి తేటలకు సంతోషపడటమే కాక ఎజి.బీఎస్సీ డిగ్రీ చదవటానికి ఒప్పుకున్నాడు. ఎంతో అమాయకంగా వుండే నా చిట్టితల్లి ఇన్ని విషయాలు గ్రహించి ఆకళింపు చేస్కుందంటే వ్యవసాయంలో తనకెంతో ఆసక్తి వుందని అర్థమయ్యింది.
అనుకున్న ప్రకారం ఆ వేసవిలో నాన్న నుండి వాళ్ళ పూర్వీకుల సేంద్రియ పద్దతులను తెలుసుకుంది. అలాగే రైతుగా సేంద్రియ పద్దతుల గురించిన మెలకువలు నేర్పించే శుభాష్ పాలేకర్ గారి పుస్తకాలు నాన్నకు చదువుకొమ్మని తెచ్చిచ్చింది. అన్నట్టుగానే అగ్రికల్చర్ బి.ఎస్సీలో చేరింది. చదువుకునే సమయంలోనే వాళ్ళ నాన్న చేత భూమిని రసాయనాలు లేకుండా సారవంతంగా మార్పించింది. దానికి మూడేళ్ళ కాలం పట్టింది. అలాగే తన లెక్షరర్తో అంతవరకు ఎలాంటి ప్రకృతి సిద్ధమైన ఎరువులు, ఎలాంటి విత్తనాలను ఉపయోగించాలో తండ్రికి చెప్పించింది. చదువయ్యాక వచ్చి అన్నయ్య సహాయంతో రెండెకరాల పొలం కొనిపించి దాంట్లో శీతలగిడ్డంగిని కట్టించింది. తండ్రిని దాన్ని అవసరమైన వారెవరైనా ఉచితంగా ఉపయోగించుకునేలా చూడమంది.
ఇంతలో తనకు ఇష్టమైన దాని మీద రీసెర్చ్ చేయటానికి వెళ్ళింది. అయినా నాన్నగారికి అక్కడ నుండే అన్ని సలహాలు ఇచ్చేది. అప్పటికే రంగనాయకులు పాటించే సేంద్రియ పద్దతి, పండించిన నాణ్యమైన విత్తనాలు గ్రామంలోని ఎంతోమందిని బాగా ఆకర్షించి సేంద్రియ పద్దతికి మారేలా చేసింది. ఆ సంవత్సరం రంగనాయకులకు జిల్లాలోనే ఉత్తమ రైతు అవార్డు వచ్చింది. గ్రామంలోని వారంతా ఇప్పుడు రంగనాయకులు ఏది చెప్తే అదే. ఇంతలో లలిత రీసెర్చ్ పూర్తి చేసి మెడల్ తో తిరిగి వచ్చింది.
వచ్చాక గ్రామంలోని కొందరి చేత ఆవుల పెంపకం ప్రారంభింపచేసింది. గ్రామంలో అక్కడక్కడ వేప చెట్లు నాటించింది. ఆవు పేడ సేంద్రియ ఎరువుకు చాలా అవసరం. అలాగే వేపనూనె సహజ క్రిమి సంహారకాలు తయారు చేయటానికి ఉపయోగపడుతుంది. పంట వ్యర్థాలను, ఆహార వ్యర్థాలను వృధా కానివ్వకుండా సేంద్రియ ఎరువులో వాడేలా చేసింది. గ్రామంలో కృత్రిమ, రసాయన వస్తు వినియోగాన్ని పూర్తిగా మాన్పించింది. చెత్త రహిత గ్రామంగా మార్చింది. గ్రామంలో పెద్ద చెరువును తవ్వించింది. ప్రతి ఒక్కరూ వాళ్ళ భూముల్లో బావిని త్రవ్వుకునేలా చేసింది. ప్రతి ఒక్కరి భూమిని పరీక్షించి ఏ పంట వెయ్యాలి, ఎలాంటి జాగ్రత్తలు తీస్కోవాలో చెప్పేది.
ఇంతలో రంగనాయకులు లలితకు అనుకూలమైన, చదువుకున్న రైతునే తెచ్చి వివాహం చేసాడు. లలిత ఇంక తన భర్త వుండే గ్రామంలో తన భర్త చేత తను వాళ్ళ నాన్నతో ఏ విధంగా గ్రామాభివృద్ధి చేయించిందో అలానే చేయించనారంభించింది.
రంగనాయకుల గ్రామంలో చెరువులు, బావులు తవ్విన మూడు సంవత్సరాల కంతా భూగర్భజలాలు బాగా పెరిగాయి. దానితో అందరి బావుల్లో నీరు వూరి ఎండాకాలంలో కూడా పంటలు వేయటానికి నీరు సరి పోసాగింది. అలాగే రంగనాయకులు ఒక ట్రస్టును పెట్టి గ్రామ రైతులందరినీ సభ్యులను చేసాడు. లాభాలు వచ్చినప్పుడంతా ఆ ట్రస్టులో కొంత డబ్బుని వేసేలా చేసాడు. ఎప్పుడైనా గ్రామంలో ప్రకృతి విపత్తులు ఏర్పడి పంట నష్టం వాటిల్లితే కుటుంబ జరుగుబాటుకు, పొలంలో పెట్టుబడికి ఆ ట్రస్టు నుండి డబ్బు తీసుకునే వెసులుబాటు కల్గించాడు. ఆ సంవత్సరం రంగనాయకులకు రాష్ట్రంలోనే ఉత్తమ రైతు అవార్డు వరించింది, వారి గ్రామం ఆ సంవత్సరపు ఆదర్శ గ్రామంగా నిలిచింది.
ఆ అవార్డు నందుకున్న రంగనాయకులు ఇదంతా మా లలితా సందేశం తోటే సాధ్యమయ్యిందని చెప్పి లలితను స్టేజి పైకి పిలిచి, నిజానికిది లలితకే చెందాలని చెప్పి ఆమెకిచ్చాడు. లలితకు మైకిచ్చి అందరికీ తన సందేశము వినిపించమన్నారు. లలిత మైకు తీసుకుని
వచ్చేటి మాటలన్నీ
నచ్చేటి కవితలైతే
నొచ్చేటి మనస్సు కూడా
విచ్చేటి నవ్వు కాదా
నిత్యం నీవు కూడా
సత్యం గా వుండి చూడు
వచ్చేటి చావు కూడా
మెచ్చేసి వెళ్ళి పోదా
అని చెప్పి...
అంటే దానర్ధం, మనం సత్యంగా వుంటే కష్టాలే కాదు, చావు కూడా మనల్ని చూసి వెనక్కి వెళ్ళి పోతుందని నేనంటున్నాను. మనం మన పనులను ఎంత సత్య పూరితంగా, ఎంత బాధ్యతగా చేస్తామో, అంతగానే మన బ్రతుకులు కూడా బాగు పడతాయి. మా గ్రామంలోని వారమంతా ఎప్పుడైతే అధిక లాభాలను ఆశించక నిజాయితీగా మందులు లేకుండా పంటలు పండించటం, సహజంగా మాగబెట్టటం మొదలుపెట్టామో, అప్పటి నుండి మా జీవితాలు కూడా బాగు పడ్డాయి. మనం పండించే పంటను మనం తినటానికి సంశయించే పరిస్థితి ఎప్పటికీ రాకూడదు. ప్రజల ఆరోగ్యాలు, ప్రాణాలు రైతుల చేతుల్లోనే వుంటాయి, అంటే మన ఇంట్లోని వారి ఆరోగ్యాలు, ప్రాణాలు కూడా మన చేతిలోనే వుంటాయి. డాక్టరు చేతిలో కేవలం రోగుల యొక్క ఆరోగ్యాలు, ప్రాణాలు మాత్రమే వుంటాయని మీరు గుర్తుంచుకుంటే చాలు. ఆహారం బాగుంటే రోగాలెందుకు వస్తాయనేది ఆలోచించండి. ఆనక నిర్ణయం మీదే. ఇంకొక్క మాట, వ్యవసాయం చేయటానికి చదువెందుకనుకోకండి, మీ పిల్లలను తప్పకుండా చదివించండి. చదువు వారికి స్వయంగా నిర్ణయించుకునే శక్తి నిస్తుంది, ఎవరి దగ్గర మోసపోకుండా తమను తాము రక్షించుకోగల్లుతారు.
ఇక వుంటాను. జై కిసాన్! జై హింద్! అంటూ ముగించింది.
అప్పటి నుండి చుట్టుపక్కల గ్రామాలు సైతం రంగనాయకులు ఉపయోగించిన పద్దతులను ఆచరించ నారంభించారు. అవన్నీ 'లలితా సందేశం' గా ప్రాచుర్యం పొందాయి.
×-×-×-×-×-×-×-×
సమాప్తం
×-×-×-×-×-×-×-×
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.
రచయిత్రి పరిచయం:
నేను చదివింది ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కానీ గృహిణిగా స్థిరపడ్డాను. కవితలు, కథలు వ్రాయటం నా ప్రవృత్తి. పదవతరగతి ఆటోగ్రాఫ్లో వ్రాయటంతో మొదలయ్యింది. ఏదైనా శుభాకాంక్షల్లాంటివి చెప్పటానికి, ఎవరైనా అడిగితేనో వ్రాయటం చేసేదాన్ని. నేను అప్పుడప్పుడూ వ్రాసుకున్న కథలను చదివిన మా అమ్మాయి నన్ను కథలు బాగా వ్రాయగలవని ప్రతిలిపిలో వ్రాసేలా ప్రోత్సహించింది. కొన్ని నెలల నుండి కథలు, కవితలు ప్రతిలిపిలో వ్రాస్తున్నాను. నేను నా కథలు సమాజానికి ఉపయోగ పడేలా వుండాలి అనే ధోరణిలోనే చాలా మటుకు వ్రాసాను. ఇప్పటికి హాస్యం, హారర్, డిటెక్టివ్ లాంటి అన్ని రకాలలో కథలు వ్రాసాను. రకానికొక్క కథైనా వుండాలని అన్ని రకాల కథలను ప్రతిలిపిలో వ్రాసాను.
Narenderkumar K • 11 days ago
చాలా బాగా చెప్పావు.Study గురించి స్టోరీ వ్రాయి
Urmila Devi • 11 days ago
Concept is good
Lavanya Kumari • 1 day ago
Thank you... అవును, అలా ఆలోచన అందరిలో రావటానికే ఈ కథ వ్రాసింది. చూద్దాం ఎంత మంది ఇష్టపడతారో.
Darsha Alluri •10 hours ago
Andaru Lalitha la aalochiste baguntundi