top of page

మదన్ మథనం తీరిన వేళ

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Video link

'Madan Madhanam Thirina Vela' written By Pendekanti Lavanya Kumari

రచన: పెండేకంటి లావణ్య కుమారి

మదన్ కి మౌనిక అంటేఇష్టం.

ఆమె కూడా తనని ఇష్టపడుతోందని అనుకున్నాడు.

అయితే అది నిజంగా ఇష్టమా లేక అతని డబ్బుమీద ప్రేమా తెలుసుకోవాలంటే యువ రచయిత్రి పెండేకంటి లావణ్య కుమారి గారి ఈ కథ చదవండి.

మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్మదన్ ! మదన్! అంటూ వచ్చిన మౌనిక అక్కడే బస్టాప్ దగ్గర తన కోసం బైక్ మీద మొబైల్ చూస్తూ నిల్చున్న మదన్ వీపు మీద ఫడేల్మని ఒక్కటిచ్చింది.


ఆ దెబ్బకి ఉలిక్కిపడి, ఏంటి!? నీకెన్ని సార్లు చెప్పాలి, అలా కొట్టకు నా కిష్టముండదనీ!! అన్న మదన్తో, నా కిష్టమై కొట్టానన్నది మౌనిక.

అస్సలు నీవు ఇతరుల ఇబ్బందిని పట్టించుకోవా అన్నాడు మదన్.

కేర్లెస్గా నవ్వేసి, సరే ఏంటి? ఐస్క్రీమ్ పార్లర్ కెళ్దామా అంది మౌనిక.


సరే పదా అన్న మదన్ బైక్ మీద ఇద్దరూ దగ్గర్లోని ఐస్క్రీమ్ పార్లర్ కెళ్ళి మాట్లాడుకుంటూ ఐస్క్రీమ్ తినసాగారు.


ఏంటి మీ కాలేజీలో ఏదో కల్చరల్ మీట్ జరుగుతుందట కదా, దేంట్లోనైనా పార్టిసిపేట్ చేస్తున్నావా అని అడిగింది మౌనిక...


నేనా! నాకవేమీ ఇంట్రస్ట్ లేదన్నాడు...


ఇంట్రస్ట్ లేదనకుండా నీకేమీ రావంటే బాగుంటుందేమో అంది మౌనిక కొంచెం ఒకలాంటి హేళన ధ్వనిస్తున్న నవ్వుతో...


అసలు నాకిష్టమో, లేదో తెలీకుండా అలా, ఎలా అంటావన్నాడు మదన్...


చూస్తున్నాను కదా ఏదాంట్లో కూడా పెద్దగా నాలెడ్జ్ లేదు నీకు అంది. నిజమే మదన్ పెద్ద తెలివైన వాడు కాదు కానీ బాగా డబ్బున్న వాడు. అయినా మదన్కు మనసెక్కడో కళుక్కుమంది. ఆలోచిస్తూ ఇంకేమీ మాట్లాడలేదు మదన్. తర్వాత మౌనికే తను కాలేజీ ఫాషన్ షోలో పాల్గొంటున్నట్టు, తనే కచ్చితంగా గెలుస్తానని ఫ్రెండ్సందరూ అంటున్నట్టూ, తన అందం, తెలివి ముందు ఎవరూ పనికి రారని గొప్పగా చెప్పుకోసాగింది.


ఇంతలో ఐస్క్రీమ్ తినటం అయిపోగానే ఇంక బయల్దేరుదామా అని లేవబోతూ అన్నాడు మదన్, మౌనికతో. అప్పుడేనా ఇంకాసేపు కూర్చుందాము, అయినా నీవు వెలగబెట్టే గొప్ప పనులేముంటాయంటూ అలాగే కూర్చున్న మౌనికతో ఏమీ చెప్పలేక మదన్ అలాగే మాట్లాడకుండా కూర్చున్నాడు. కూర్చున్నాడే కానీ మదన్ అన్యమనస్కంగానే వుండి పోయాడు. కాసేపయ్యాక మౌనిక ఏంటి ఏమీ మాట్లాడటం లేదు, సరే అయితే పోదాం పద అని లేచింది.


మదన్, మౌనికను వాళ్ళింటికి కొద్ది దూరంలో దింపి తను తనింటికి వెళ్ళిపోయాడు. ఇంటికెళ్ళాక కూడా మదన్కు మనసులో ఏదో అర్థం కాని బాధ. ఏమిటిదని ఆలోచించ సాగాడు.


అప్పుడర్థమయ్యింది మదన్కు తన ఈ మథనానికి, ఈ కలతకు కారణం ఇందాక ఐస్క్రీమ్ పార్లర్లో మౌనికతో జరిగిన సంభాషణే అని. అసలు మౌనిక నన్ను ప్రేమిస్తుందా లేక నా డబ్బును చూసి ప్రేమిస్తుందా? అన్న ప్రశ్న తలెత్తింది...


తనకు మౌనికతో పరిచయమైనప్పటి నుండి జరిగినవి గుర్తుకు తెచ్చుకోసాగాడు.


తను నన్ను చాలా తీసిపారేస్తుంది, నేనేమీ గొప్పవాడ్ని కాదని తెల్సినప్పుడు నన్ను ప్రేమించటం దేనికి. నన్ను ఎగతాళి చేయటం దేనికి. నా చేత కావాల్సిన వాటికంతా బాగానే ఖర్చు పెట్టిస్తుంది. మొన్నటికి మొన్న నాకేదో పరీక్షుంది ప్రిపేర్ కావాలన్నా, తన ప్రాజెక్టు వర్కుకు ఏవో కొనాలని రావాల్సిందేనని ఎంత పట్టుబట్టింది. పైగా నీవు ఎంత ప్రిపేరయినా వచ్చే మార్కులంతే కదా అని నవ్వుతూ ఎత్తిపొడుపొకటి. ఏంటో మౌనిక అందం చూసి తను పడిపోయాడు కానీ ఇప్పుడు ఆమె మెంటాలిటీ అస్సలు నచ్చటం లేదు. నా అవసరాన్ని కానీ, నా ఇబ్బందిని కానీ అర్థమే చేస్కోదు.


అలాగే అంతకుముందొకసారి నాకు చాలా ఇష్టమై ఒక షర్ట్ తీస్కోబోతే, అది చాలా చెత్తగా, ఏమీ బాగోలేదని వేరే షర్ట్ తీయించింది. నాకు చాలా నచ్చిందంటున్నా అస్సలు నా ఇష్టానికి విలువివ్వలేదు. ఎప్పుడు చూసినా, ఎక్కడైనా తన ఇష్టమే నెగ్గాలని చూస్తుంది, ఇతరుల ఇష్టానికస్సలు విలువివ్వదు. ఈ కొన్ని నెలల పరిచయానికే తనని నేను భరించలేకపోతున్నా, ఇంక తనని పెళ్ళి చేస్కుంటే జీవితాంతం భరించగలనా అనే ఆలోచన మదన్ను వేదిస్తూ ఆలోచించుకునేలా చేసింది. అంతేకాక మౌనికకు తను ఎంతో అందగత్తెననే పొగరు కూడా ఎక్కువే. నాకిప్పుడు బాగా అర్థమయ్యింది అందం కంటే అణకువే మనశ్శాంతిని, ఆనందాన్నిస్తుందని.


ఆలోచిస్తే తను మౌనికకు తగడు, ఎలాగైనా మౌనికతో రేపీ విషయం చెప్పెయ్యాలని నిర్ణయించుకున్నాక కానీ మదన్ మనసు కుదుట పడలేదు.


మరుసటిరోజు కూడా యథాప్రకారంగా మౌనిక, బస్టాప్ దగ్గరున్న మదన్ దగ్గరికొచ్చి ఇవాళ కాఫీడే కెళ్దామని మదన్ను బయల్దేరదీసింది.


ఇద్దరూ కాఫీడేకెళ్ళి కూర్చుని వారికి కావాల్సినది ఆర్డరిచ్చాక మదన్ మౌనికతో ఒక ముఖ్యమైన విషయం మన జీవితాలకు సంబంధించినది చెప్పాలన్నాడు. చెప్పమన్న మౌనికతో


చూడు మౌనికా నేను నీతో చెప్పబోయేది చాలా బాధ కల్గించవచ్చు కానీ నాకు మాత్రం అంత్య నిష్టూరం కన్నా ఆది నిష్టూరం మేలనిపిస్తుంది. ఇప్పటికీ ఇది నీతో చెప్పటానికి ఆలస్యం కాలేదనే నేననుకుంటున్నాను. నీతో ఈ కొన్ని నెలల పరిచయంతో 'నేను నీకు సరిపోనని' అర్థమయ్యింది. అందుకే ఈ రోజటితో నేను మన ప్రేమకు బ్రేకప్ చెప్పాలనుకుంటున్నాను అని స్థిరంగా చెప్పాడు మదన్.


ఆ మాటను ఊహించి వుండని కారణంగా మౌనిక హతాశురాలయ్యి ఏంటి మదన్ ఇలా అంటున్నావు, ఏమి అప్పుడే నీకు నా మీద మోజు తీరిందా? ఇంకొకరితో ఏమన్నా కుదిరి నన్నొదిలించుకోవాలనుకున్నావా? అంది లేని కోపంతో.


దానికి మదన్ నేను నీ మీద ఏ మోజూ పడలేదు, ఏ మోజూ తీర్చుకోలేదు కూడా. అది నీకూ తెలుసు. నేను కేవలం నీ అందాన్ని చూసి నీ మనసు కూడా అంతే అందంగా వుంటుందనుకుని నిన్ను ప్రేమించాను. అలాగే నన్ను ప్రేమించే వారు కావాలనుకున్నాను. కానీ నీలాగా నా డబ్బును ప్రేమిస్తూ నామీద ప్రేమ నటించే వాళ్ళు నాకక్కరలేదు.


అరె! అదెలా అంటావు నేను నీ డబ్బుని ప్రేమించానని అన్న మౌనికతో.


దానికి నీవు డబ్బును ప్రేమించావో, లేదో నాకనవసరం. కాకపోతే నీవు నన్ను ప్రేమించటం లేదన్నది నేను బల్ల గుద్ది చెప్పగలను. నీవు ఏనాడూ నా ఇష్టాన్ని కానీ, నా ఆలోచనలను కానీ గౌరవించలేదు. పైగా ఎప్పుడూ నన్ను చులకన చేసి మాట్లాడుతుంటావు. నేను నన్ను ప్రోత్సహించి నా ఎదుగుదలకు దోహదపడే జీవిత భాగస్వామిని కోరుకుంటున్నానే కానీ నీలాగా నన్ను కృంగుబాటుకు గురి చేసే వారిని కాదని చెప్పాడు. భగవంతుడికి మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి ఇంతటితో మన బంధానికి బ్రేక్ చెప్పించినందుకు. ఎందుకంటే ఒకవేళ మనం పెళ్ళి చేస్కునుంటే కొంత కాలం కూడా కలిసి వుండగలిగే వాళ్ళము కాదు. మనం పెళ్ళి చేస్కోకముందే నీ గురించి నాకర్థమయినందుకు సంతోషించమని చెప్పి, నేను వెళ్తున్నాను, నిన్ను మీ ఇంటి దగ్గర దింపి వెళ్తాను రమ్మన్నాడు. కానీ మౌనికనే కోపంతో నేను రాను నీవెళ్ళిపో అని చెప్పి ఆటో మాట్లాడుకుని ఇంటికెళ్ళిపోయింది.


తర్వాత మదన్కు తను చేసింది ఎనబై శాతం సరైనదే అనిపించినా ఎక్కడో ఇరవై శాతం తప్పు చేసానేమో అన్న అనుమానం వుండిపోయింది.


ఇంక తర్వాత మదన్ ప్రేమపెళ్ళి గురించి ఆలోచించలేదు. పెళ్ళి చేస్కోటానికి అందమైన అమ్మాయే కావాలనీ అనుకోలేదు. వాళ్ళమ్మానాన్న వెతికి మరీ చేసిన సంబంధం చేస్కున్నాడు. మదన్ భార్య ఆరతి. అందమైనది అనక పోయినా, బాగలేదని ఎవ్వరూ అనలేరు. అయినా చాలా అణకువైన అమ్మాయి, అందరితో ఇట్టే కలిసిపోవటం వల్ల ఆరతిని ఇష్టపడని వాళ్ళుండరు. అంతేకాక భర్తంటే చాలా ప్రేమ, గౌరవం కూడా. దానికి కారణం కూడా లేకపోలేదు. పెళ్ళైన మొదటిరాత్రే మౌనికతోటి ప్రేమ గురించి నిజాయితీగా చెప్పాడు మదన్. దానితో ఆరతికి వెంటనే మదన్ మీద ఇంకా మంచి అభిప్రాయం, ప్రేమ కలిగాయి. అంతే ఆరతి మదన్తో, ఓ మదనా! నా మానస చోరా! అంటూ అల్లుకు పోయింది.


ఇప్పుడు మదన్, ఆరతి ప్రేమలో మునిగి తేలుతూ తను మౌనికకు బ్రేకప్ చెప్పటం నూరుశాతం కరెక్టే అనుకుని మనశ్శాంతిగా వుంటున్నాడు.


***శుభం***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత్రి పరిచయం:

నేను చదివింది ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కానీ గృహిణిగా స్థిరపడ్డాను. కవితలు, కథలు వ్రాయటం నా ప్రవృత్తి. పదవతరగతి ఆటోగ్రాఫ్లో వ్రాయటంతో మొదలయ్యింది. ఏదైనా శుభాకాంక్షల్లాంటివి చెప్పటానికి, ఎవరైనా అడిగితేనో వ్రాయటం చేసేదాన్ని. నేను అప్పుడప్పుడూ వ్రాసుకున్న కథలను చదివిన మా అమ్మాయి నన్ను కథలు బాగా వ్రాయగలవని ప్రతిలిపిలో వ్రాసేలా ప్రోత్సహించింది. కొన్ని నెలల నుండి కథలు, కవితలు ప్రతిలిపిలో వ్రాస్తున్నాను. నేను నా కథలు సమాజానికి ఉపయోగ పడేలా వుండాలి అనే ధోరణిలోనే చాలా మటుకు వ్రాసాను. ఇప్పటికి హాస్యం, హారర్, డిటెక్టివ్ లాంటి అన్ని రకాలలో కథలు వ్రాసాను. రకానికొక్క కథైనా వుండాలని అన్ని రకాల కథలను ప్రతిలిపిలో వ్రాసాను.


74 views5 comments
bottom of page