top of page

లేడిపిల్ల


'Ledipilla' written by Kotamarthi Radhahimabindu

రచన : కోటమర్తి రాధాహిమబిందు

"అమ్మా.. మాస్కూల్ కు టీవీ వచ్చింది" ఆరు సంవత్సరాల దుర్గ ఎగురుకుంటూ వచ్చి ఇంటి ముందు మాట్లాడుకుంటున్న తల్లితండ్రులతో తాతతో చెప్పింది.

"అవునా.. ఇదేందే.. పిల్లలకు సినిమాలు చూపిస్తరా ఏంది? చదువు ఏమైద్ధి" చిరాగ్గా అన్నాడు బలరాం.

"సినిమాలు చూపించరు తాతా.. కార్టూన్ ఛానల్, డిస్కవరీ ఛానల్ అంతే.. ఇవాళ బోలెడంత హోమ్వర్క్ ఇచ్చారు. నేను చేసుకోవాలి" అంటూ లోపలికి వెళ్ళిపోయింది దుర్గ.

"బంగారు తల్లి.. మీరు ఎట్టా కష్టపడతరో నాకు తెలియదు కానీ దాన్ని మాత్రం కలేకటెర్ చేయాలి" ప్రేమగా అన్నాడు బలరాం.

రాములు మంగల గారాలపట్టి దుర్గ.. గుట్టమీద ఉండే అమ్మవారి పేరు పెట్టుకున్నారు.. చదువుకోవడం అంటే చాలా ఇష్టం దుర్గకు.. వాళ్లకు కొంచెం పొలం వుంది.. వర్షాలు పడి చెరువులోకి నీళ్ళు వచ్చినప్పుడు ఒక వారం పది రోజులు ఇద్దరు కలిసి పొలం నాటు వేసుకుంటారు. మిగతా రోజుల్లో కూలీ పనికి వెళ్తుంది మంగ.. రాములు ఊరికి దగ్గరగా ఉన్న టౌన్ లో రైస్ మిల్లులో పని చేస్తున్నాడు.. నెలలో ఇరవై రోజులు నైట్ డ్యూటీలే ఉంటాయి..

బలరాం ఊరు పెద్ద. అతనికి డెబ్బయి సంవత్సరాలు ఉంటాయి. భార్య ఎప్పుడో చనిపోయింది.. భార్య ఉన్నప్పుడే కూతురు పెళ్లి చేశాడు. తర్వాత తర్వాత మనవరాలి పెళ్లి చేశాడు. ముత్తాత కూడా అయ్యాడు.. బలరాంకు ఐదెకరాల పొలం ఉంది. దాన్ని చూసుకుంటూ ఖాళీ సమయాల్లో ఊరంతా తిరుగుతూ అందరినీ పలకరిస్తూ బాగోగులు కనుక్కుంటూ వుంటాడు.

అదో అందమైన చిన్న పల్లెటూరు.. నూటయాభై ఇళ్లు ఉంటాయి.. ఊరికి ఒకవైపు కాస్త దూరంలో దుర్గ చదువుకునే ప్రైమరీ స్కూల్.. అలా అయిదు కిలోమీటర్ల దూరం వెళ్తే టౌను.. ఊరికి ఇంకోవైపు కిలోమీటర్ దూరం నడిస్తే చిన్న గుట్ట.. గుట్ట మీద కనకదుర్గ అమ్మవారి చిన్న గుడి.. గుట్ట క్రింద పెద్ద వాగు.. ఊరి జనం పండుగలప్పుడు వెళ్లి మొక్కులు చెల్లించుకుంటారు.

*** ***

ఆ రోజు ఆదివారం.. "తాతా"అంటూ పరిగెత్తుతూ బలరాం దగ్గరికి వచ్చింది దుర్గ.

"మా బంగారుతల్లే.. మా బంగారుతల్లే.. వచ్చినవా.. వచ్చినవా"? అంటూ దుర్గని ఎత్తుకొని ముద్దు పెట్టుకున్నాడు బలరాం.

"మీసాల గుచ్చుకుంటున్నాయి తాతా"

"మీసాలు అంటే గుచ్చుకుంటాయే"

"దుర్గ వచ్చిందా మామా" అంటూ వచ్చింది మంగ.. దుర్గ ను ఎత్తుకునే బలరాం మరింత ఠీవిగా నిలబడ్డాడు.

"తెగ సతాయిస్తుంది మామా"

"అదేం సతాయిస్తుందే. వజ్రాలతల్లి అయితే.. నువ్వే దాన్ని సతాయిస్తున్నవ్.. మీ ఇద్దరిలో దీన్ని ఎవరేమన్నా నేను ఊరుకోను.. అసలు దాన్ని ఎట్టా అనబుద్ధి అయితదే.. అది క్లాసులో ఫస్ట్.. దాని గురించి సార్లు ఎంత బాగా చెప్తున్నరు? చూస్తుండగానే మూడో క్లాసులోకి వచ్చిందది"

"ఏడాది ఏడాది తరగతులు పెరుగుతయ్.. తరగతులతో పాటు వయసు పెరగట్లే..ఎంతైనా ఆడపిల్ల కదా! పెళ్లి చేయాలి, అత్తారింటికి పంపాలి"

"అప్పుడే అట్టా ఆలోచిస్తున్నవా? ముందు దాన్ని బాగా చదివించు.. ఒక్క బిడ్డ.. ఇద్దరి సంపాదన. బాగా కూడా పెట్టండి"

ఇంటికి పోదాం రమ్మంటే రానంటే రానంది దుర్గ.."నువ్వు పోవే నేను తీసుకొస్తా" అంటూ "దుర్గా నీ స్కూల్ సంగతులు ఏంటే" అంటూ దుర్గను ముద్దు చేస్తూ మాటల్లోకి దింపాడు బలరాం.

*** ***

చిన్నారి దుర్గ పెరిగి పెద్దదయింది. పదకొండుఏళ్ళు వచ్చాయి. అప్పుడే వికసిస్తున్న మందారంలాగా మంచులో విచ్చుకుంటున్న గులాబీమొగ్గలాగా అయింది.. టౌను దగ్గరగా ఉండేసరికి ఊరిలో నాగరికత పెరిగి కొద్ది కొద్ది తేడాలు వచ్చాయి.. జీన్స్ ప్యాంట్లు టీ షర్ట్ ఒంటిమీదికి.. సెల్ ఫోన్లు చేతిలోకి వచ్చాయి..

పిల్లల తల్లిదండ్రులు ఎక్కువ చదువుకోకపోవడంవల్ల పిల్లలమీద పూర్తి శ్రద్ధ పెట్టలేదు.. మా అంత గొప్ప వాళ్ళు లేరు అన్నట్లు స్టైల్ కొడుతూ ఆకతాయి చేష్టలు చేయటం మొదలు పెట్టారు.. రకరకాల కటింగ్ లతో జుట్టు కత్తిరించుకొని నోట్లో గుట్కాలాంటివి నముల్తూ బజార్లో చేరి కామెంట్లు చేయడం కొంతమంది పిల్లలకు అలవాటైపోయింది అప్పుడప్పుడు బలరాం వాళ్లను మందలిస్తూ ఉండేవాడు.

*** ***

బలరాం మనవరాలు రాణి తాతయ్యకు సెల్ ఫోన్ కొనుక్కొని వచ్చింది.. ఉన్న రెండు రోజులు సెల్ గురించి చెప్పింది కానీ ఏమీ అర్థం కాలేదు బలరాంకు.. ఊర్లో సెల్ ఫోన్ పట్టుకుని తిరిగే నరేష్ దగ్గర వారం రోజులు కష్టపడి సెల్ ఎలా వాడాలో నేర్చుకున్నాడు.. వాడు బెస్ట్ ఫ్రెండ్ అయ్యాడు బలరాంకు..

నరేష్ ను కలిసినప్పుడు రెండు మూడు సార్లు సెల్లు దాచుకోవటంతో బలరాంకు అనుమానం వచ్చి పదేపదే అడిగాడు.. చెప్పక తప్పింది కాదు నరేష్ కు.

"తాతా..మా అమ్మానాన్న తో చెప్పనంటే చూపిస్తాను.. నాకు ప్రామిస్ చెయ్" అంటూ చేతిలో చేయి వేయించుకుని సెల్ ఆన్ చేసి చూపించాడు బలరాంకు.. అన్నీ బూతు బొమ్మలు..

"ఏందిరా" అంటూ దిమ్మెరపోయాడు.

"ఇంకా చూడు" అంటూ అలాంటివి చాలా చాలా చూపించాడు.. బలరాంలో కొత్త ఉత్సాహం మొదలైంది.. హుషారు ఎక్కువైంది.. అవి ఎట్లా చూడాలో నేర్పించమని నరేష్ ను బ్రతిమాలి నేర్చుకున్నాడు.. తను నేర్చుకున్నట్లుగా నరేష్ కు చూపిస్తూ విజయం సాధించినట్లు గర్వంగా తలెత్తుకొని దర్భంగా మీసాలు సవరించుకున్నాడు.

*** ***

ఈమధ్య బలరాం వైఖరి కొంచెం మారింది.. ఆడవాళ్లను తేరిపార చూస్తున్నాడు.. వాళ్లతో సరసంగా మాట్లాడుతున్నాడు.. తాను యేదో పోగొట్టుకున్నట్లు బాధపడుతూ 'ఏంది ఈ జన్మ' అనుకుంటున్నాడు.. ఇంట్లో ఒక్కడే.. ఇదివరకు ఎక్కువగా టీవీ చూసేవాడు.. ఇప్పుడు సెల్ ఫోన్ చూడటమే పనైపోయింది బలరాంకు.

"తాతా.. ఇదిగో అమ్మ నీకు ఇవ్వమంది" అంటూ బాక్స్ తో వచ్చింది దుర్గ.. మంచం మీద నుండి ఒక్క ఉదుటున లేచాడు బలరాం.

"ఏందే దుర్గా ఎన్నాళ్ళయిందే నిన్ను జూడక తాతను మర్చిపోయినవా"?

"అయ్యో తాత అదేం లేదు" అంటూ బలరాం నడుమును తన చిట్టి చేతులతో చుట్టేసింది దుర్గ..

బలరాం మనసు ఝల్లుమంది.

"కోపంపడకు తాతా.. రోజూ వస్తాలే" తలెత్తి పైకి చూసింది.. బలరాంలో ఏదో కోరిక.. ఏదో జలదరింపు..

మరి ఏదో తపన..

"హుప్" అంటూ దుర్గని ఎత్తుకొని పస పస మంటూ బుగ్గల మీద ముద్దులు పెట్టుకున్నాడు.

"ఇంత బరువయినవేందే" అంటూ ఒళ్ళంతా తడిమాడు.

"స్నానం చేసినావే.. సబ్బు వాసన వస్తుంది"?

"బడి నుంచి వచ్చి స్నానం చేసే ఇట్లా వచ్చినా.. నీ దగ్గర చెత్త వాసన వస్తుందేంది"? ముక్కు చిట్లించింది.

"చుట్ట తాగినా.. అబ్బో.. అన్ని వాసనలు అప్పుడే తెలుస్తున్నయేందే నీకు"?

"నేనుపోతా" జారిపోతున్న దుర్గను బిగించి పట్టుకున్నాడు బలరాం.

"గడ్డం చేసుకున్న.. మీసం కూడా కాస్త సన్నగా జేసిన.. నీకు గుచ్చుకోదులే" అంటూ మరి నాలుగు ముద్దులు పెట్టుకుంటుంటే గింజుకుంది దుర్గ.

"దుర్గా" అంటూ పిలుస్తూ మంగ వస్తుంటే గభాలున దుర్గని దింపాడు బలరాం.

ఈసారి వర్షాలు బాగా పడ్డాయి.. పంటలు బాగా పండాయి..కూలీలకు చేతినిండాపని..మిల్లుల్లోనే ధాన్యం.. పుష్కలంగా పని.. ఇరవైనాలుగు గంటలు ఆగకుండా మిల్లు నడుస్తోంది.. రాములుకి డబుల్ డ్యూటీలు పడుతున్నాయి.. ఇలాంటప్పుడే నాలుగు రాళ్ళు వెనక్కి వేస్తే దుర్గకు మంచి భవిష్యత్తు ఇవ్వవచ్చని ఉద్దేశంతో భార్య భర్త పనుల్లో మునిగిపోయారు.. దుర్గ సంరక్షణ బాధ్యత బలరాంను చూసుకోమన్నారు..

బలరాంకు మంచి అవకాశం దొరికింది. దుర్గను వీలైనంత వరకు తన పక్కనే ఉండేట్లు చేసుకుంటూ అప్పుడప్పుడు తనతో పడుకోబెట్టుకుని కథలు చెప్పటం.. వళ్లంతా తడమటం చేస్తుంటే దుర్గకు ఏమీ అర్థంకాలేదు.. అయినా బలరాంలో ఓకొత్త తాతకనపడుతున్నాడు అనుకుంది.

"అమ్మా.. తాత ఎట్లనో చేస్తుండే" తల్లితో చెప్పలేక చెప్పింది దుర్గ.

"తాతేం చేస్తడే..నోర్మూసుకో.. నిన్ను పసిపిల్లకాడి నుండి చూసిండు.. నువ్వంటే ఎంత ప్రేమ మామకి.. అప్పుడు మీద ఎంత మంచిగైండు మామ.. నరేష్ దగ్గర చదువు కూడా నేర్చుకుంటుండట.. అందుకే నరేష్ అప్పుడప్పుడు మామ ఇంటికి వస్తుండు.. నీకు తెలియనివి ఏమైనా ఉంటే నరేష్ నడుగు నేను వాడికి చెప్తలే"

"నాకేం తెలవనివి లేవు.. అన్నీ మా బళ్ళో నేర్పిస్తున్నరు" ముఖం గంటు పెట్టుకొని తల్లి తన మాటలు పట్టించుకోకుండా ఇంకేదో చెబుతుంటే చిరాగ్గా చూసింది.

"నేను పోత.. తాత కాడ ఉండు"

"నేను పోను.. కాసేపు చదువుకుని ఇంట్లో టీవీ చూస్తా"

"ఏందే? మరీ వినకుండఅయినవ్! వీప్పలగ్గొడతా"

"అమ్మా!"

"మాతల్లివికదా..చెప్పినట్లువినాలి..ఆడపిల్లవు.. బయట ఎన్ని వినట్లేదు.. తాత అయితే జాగ్రత్తగా చూసుకుంటడు..ఈయాల బడికి సెలవు కదా.. తాతకు కూడా ఇక్కడే అన్నం వండినా.. తాతతో చెప్పినలే.. ఇద్దరు కలిసి అన్నం తినండి.. తాళం చెయ్ ఎక్కడైనా పడేసేవ్ భద్రం" అంటూ వెళ్ళిపోయింది మంగ. అరగంట తర్వాత బలరాం వచ్చాడు.. పాత తాతలాగా మాట్లాడుతుంటే మంచిగా అనిపించింది దుర్గకి..ఇద్దరు కలిసి అన్నం తిన్న తర్వాత అమ్మ దగ్గరికి పోదామా అంటూ పొలానికి తీసుకెళ్లాడు.. మంగ చాలా సంతోషపడింది.. దుర్గ తాతతో ఎప్పటిలా మాట్లాడుతూ అతను తెచ్చిన మైసూర్ పాక్ ముక్కలు తిన్నది.

*** ***

రోజులు గడుస్తున్నాయి..ఆరోజు స్కూలుకు సెలవు. అమ్మ దగ్గరకి తీసుకు పొమ్మని తాతను అడిగింది దుర్గ.

“పొలానికి ఎందుకు? గుట్ట మీద గుడికి పోదాం!” అన్నాడు బలరాం.. సరే అంది దుర్గ.. మైసూర్ పాక్ పొట్లం.. బాటిల్లో మంచినీళ్లు ఒక సంచిలో వేసుకొని బయల్దేరారు ఇద్దరు.. అటువైపు ఎక్కువగా ఎవరు వెళ్లరు కాబట్టి ఇద్దరే ఇద్దరు ఉన్నారు.. కాస్త దూరం నడిచిన తర్వాత అడిగాడు బలరాం.

"ఎత్తుకోనా"

"బరువైన అన్నవుగా! వద్దులే"

"సరదాగా అన్నాలే..రా..ఎత్తుకుంటా"

"వద్దులే.. నేను పరిగెత్తుకుంటూ పోయి అక్కడ కూర్చుంటా.. నువ్వు నడుచుకుంటూ వచ్చేసరికి నాకు రెస్ట్ ఉంటది"

"సరే" అన్నాడు బలరాం.. పరిగెత్తుతూ వున్న దుర్గను కామంతో చూశాడు.. గుట్ట దాక చేరారు ఇద్దరు.. రాత్రి పడిన వర్షానికి అంతా బురదగా వుంది.

"వాగు కాడ కాసేపు ఉందామా.. ఈ నీళ్ళన్నీ దగ్గర్లో ఉన్న రిజర్వాయర్లో కలుస్తాయట? మా సారు చెప్పిండ్రు"

"ముందు గుట్ట ఎక్కుదాం"

"దుర్గమ్మ దేవతను చూసుకొని వద్దామా"

"నువ్వే దుర్గమ్మవి ఇంకోదేవత మనకు ఎందుకే" దుర్గ భుజాల చుట్టూ చేయి బిగించి గుట్ట ఎక్కాడు.

"అబ్బ.. ఎంత గాలి.. ఇక్కడ బాగుంది కదా తాతా"

"అదంతా చూపిస్తా పద" అంటూ గుడి వెనక్కు దుర్గను తీసుకుపోయాడు.. ఆ ప్రదేశమంతా చూపించాడు. గుడి ముందుకు తీసుకొని వచ్చాడు "రా.. ఇట్టా కూసుందాం" అంటూ సిమెంటు చేసి నున్నగా వున్న గచ్చు మీద కూర్చుని దుర్గను వడిలో కూర్చోబెట్టుకున్నాడు. గచ్చుచుట్టూ రాళ్ళు రప్పలు నిండి వున్నాయి.. ఇద్దరు మైసూర్ పాక్ తిని నీళ్ళు తాగారు. సంచీలోంచి సీసా తీశాడు.

"ఛీ..ఇదేంటి"

"నీకెందుకే"

"నువ్వు తాగుతావా" అంటూ లేవబోయింది దుర్గ

ఎడంచేత్తో దుర్గ ఒంటిని బిగించి పట్టుకున్నాడు.

"నువ్వు అట్టా అడుగుతుంటే నా పెండ్లాం గుర్తొస్తుందే" అంటూ బుగ్గల మీద ముద్దులు పెట్టుకుంటూ సీసా అంతా ఖాళీ చేశాడు. అతని చేష్టలకు గుంజుకోసాగింది దుర్గ.

"ఏందే గింజుకుంటవ్? నిన్ను ఎట్టా జేయాలో అట్ట జేసిన.. మంచోడుగా ఉంటూ ఈ ప్లాన్ జేసిన.. నా కళ్ళ ముందు పుట్టి పెరిగి ఎంత దానివైనవే..నిన్ను వదుల్తనా"? అంటూ పైశాచిక చేష్టలు చేస్తుంటే దుర్గకు ఏదో జరగకూడనిది జరుగుతున్నట్లు అర్థమైంది.. అటు ఇటు పెనుగులాడుతూ తప్పించుకోవడానికి ప్రయత్నంచేసింది కానీ బలరాం వదిలిపెట్టలేదు. ఇంకా గట్టిగా పట్టుకున్నాడు.

బలరాం కింద ఉన్న దుర్గ చేతికి ఒక రాయి దొరికింది అది గమనించిన బలరాం ఆరాయిని పట్టుకుని అంత దూరాన విసిరాడు..

"నువ్వు ఇట్టా గింజుకుంటే నాకు మహా చెడ్డ ఆనందంగా ఉందే.. మామిడిపండులా ఎంత ఊరించినవే"

బూతులు తిడుతూ ఫోన్లో రోజు చూసే బూతుబొమ్మల వీడియోల తాలూకు ఆనందాలను గుర్తు తెచ్చుకున్నాడు. దుర్గకు ఇంకో రాయి చేతికి తగిలింది దాన్ని చేత్తో పట్టుకుంది.. బలరాం కోపంగా దుర్గ చెంప మీద ఈడ్చి కొట్టాడు.

"ఏందే..ఏమో నకరాలు జేస్తవ్" అంటుండగానే పదునైన రాయి బలరాం ముఖానికి బలంగా తాకింది. కంటిమీద దెబ్బ తగిలి రక్తంతో కళ్ళు బైర్లు కమ్మాయి.. అసలే మద్యం మత్తు.. ఆ క్షణంలో దుర్గకు స్కూల్ లో టీవీలో చూసిన డిస్కవరీ ఛానల్ లో వేటాడుతున్న పులి తప్పించుకోవాలని చూసే జింక గుర్తుకు వచ్చాయి. బలరాం పక్కకు పడిపోగానే పదే పదే ముఖం మీద రాయితో కొట్టి బలం కొద్దీ వెనక్కు తోసింది. కళ్ళు మూతలుపడుతుంటే రౌద్రంగా దుర్గ గొంతు పట్టుకుని నులిమాడు బలరాం. డిస్కవరీ ఛానల్ లో జింక పరిగెత్తడం దుర్గ కళ్ళముందు నిలిచింది.. దుర్గకు ఊపిరి ఆడలేదు.. అయినా తెగింపు తెచ్చుకుంది.. ఉన్న బలాన్ని అంతా ఉపయోగించి బలరాంను గట్టిగా తోసింది.. అంత చిన్న పిల్ల తన మీద తిరగబడుతుందని ఊహించలేదు బలరాం.. కాలితో తన్నింది.. పల్టీకొడుతూ బురద మీదకి జారాడు.. గుట్ట చివర గావటంతో బలరాంకు పట్టుతప్పింది.. దొర్లుకుంటూ వాగులో పడిపోయాడు.. ఉదృతంగా వున్న వాగు నీళ్ళలో పడి కొట్టుకుపోయాడు.

*** ***

దుర్గ ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చింది.. బలరాం తాత తనను ఎట్లా చేసింది తల్లితో చెప్పింది.. రాములు, మంగ కోపంతో ఊగిపోయారు.. బలరాంను తను తోసినట్లు దుర్గ మంగతో చెప్పలేదు.. తాత గుట్టదిగి పారిపోయాడని మాత్రమే చెప్పింది. ఊరంతా పాకిపోయింది ఈ విషయం.. పారిపోయిన బలరాం వచ్చాక అతనికి తగిన శిక్ష పడేలా చూడాలని ఎదురు చూస్తున్నారు అంతా.

ఓ వారం తర్వాత ఆ ఊరి దగ్గర్లోని రిజర్వాయర్లో గుర్తుపట్టలేకుండా కుళ్ళిపోయిన శవం ఒకటి బయటపడింది.. పోలీసులకు ఎవరూ తప్పిపోయినట్లుగా కంప్లైంట్ రాకపోవడంతో ఓసారి ఊరికి వచ్చి ఎవరైనా తప్పిపోయినవారు ఉన్నారా అని అడిగారు.. ఊరిలో ఎవరూ లేరనే సమాధానం వచ్చింది.. ఊరిలోఅందరూ బలరాం పారిపోయాడని నమ్మకంతోనే ఉన్నారు.. పోలీసులు కేసు మూసివేశారు.

ఒక్క దుర్గకే తెలుసు.. 'ఆ శవం బలరాంది' అని.

** సమాప్తం **

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత్రి పరిచయం :

పేరు : కోటమర్తి రాధాహిమబిందు

నేను జన్మించింది నల్లగొండ జిల్లా కోదాడ.. మావారి ఉద్యోగరీత్యా ఖమ్మం జిల్లా మణుగూరులో ఉండి జిల్లాకి సాహితీ సేవలు అందించాను.. ప్రస్తుతం కె ఎల్ ఆర్ ఎవెన్యూ.. కోమరబండ కోదాడలో నివాసం ఉంటున్నాము.


నా రచనా వ్యాసంగం ప్రారంభించి రెండుదశాబ్దాలు పూర్తయ్యింది.నా సాహిత్య ప్రస్థానంలో ఇప్పటివరకు 150 పైగా కథలు నాలుగు నవలలు వ్రాశాను.అందులో రెండు ఎమెస్కో వారు ప్రచురించారు. తెలుగు భాషలో వెలువడుతున్న అన్ని దిన వార పక్ష మరియు మాసపత్రికల్లో నా కథలు, నవలలు ప్రచురింపబడ్డాయి. చిన్నపిల్లలు అమితంగా ఇష్టపడే చందమామ అయినా కార్మికుల పత్రిక కార్మిక లోకం అయినా అన్ని వర్గాలకు సంబంధించిన సమస్యలు సృజించి అక్షర రూపంలో పాఠకులకు అందజేశాను.


నా కథల్లో ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు ఎదుర్కొనే సమస్యలు ప్రస్తావిస్తూ ఉంటాను. కడుపుబ్బ నవ్వించే హాస్య కథలూ కన్నీళ్లు తెప్పించే హృద్యమైన కథలూ వ్రాశాను. నేను రచయిత్రిగా ఎన్నో అవార్డులు, సత్కారాలు పొందాను.


2005, 2006, 2007 సంవత్సరాలలో జివిఆర్ కల్చరల్ ఫౌండేషన్ హైదరాబాద్ వారు నిర్వహించిన రాష్ట్రస్థాయి కథల పోటీల్లో మూడుసార్లు ఉత్తమ రచయిత్రిగా గెలుపొంది శ్రీ త్యాగరాయ గానసభలో సన్మానం పొందాను. 2006 ఆంధ్రప్రదేశ్ యువజన సర్వీసుల శాఖ ఉత్తమ రచయిత్రి గా గుర్తించి సత్కరించింది.


2007 లో ప్రభుత్వం నిర్వహించిన స్తంభాద్రి సంబరాలలో ఉత్తమ రచయిత్రి గా అప్పటి కేంద్ర మంత్రి శ్రీమతి రేణుకాచౌదరి గారి ద్వారా అప్పటి రాష్ట్ర మంత్రి శ్రీ వనమా వెంకటేశ్వరరావు గారు అప్పటి కలెక్టర్ శశిభూషణ్ కుమార్ గారు మరియు శాసన సభ్యుల సమక్షంలో అవార్డు, సన్మానం పొందాను.


2008లో సుప్రసిద్ధ రచయిత శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు నది మాస పత్రికలో రాసిన 'వీళ్లనేం చేద్దాం' అనే నవలకు ముగింపు రాసి


ప్రథమ బహుమతి పొందాను. 2010 వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికావారు నిర్వహించిన అంతర్జాతీయ కథల పోటీలో ఉత్తమ రచన అవార్డు పొంది జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా అవార్డు, సన్మానం అందుకున్నాను. 2011లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సింగరేణి కాలరీస్ 'సేవా' ద్వారా సన్మానం పొందాను.

ఇవి కాకుండా ఈనాడు ఆదివారం లో అనేక కథలు ప్రచురితమై బహుళ ప్రజాదరణ పొందాయి. స్వాతి, నది ఇంకా ఇతర పత్రికలు నిర్వహించిన కథల పోటీలలో పలుమార్లు బహుమతులు గెలుచుకున్నాను.


నేను రేడియో మాధ్యమం ద్వారా అనేక కథలు, కథానికలు, నాటకాలు నాటికలు రచించాను. ఇవన్నీ ఆకాశవాణి హైదరాబాద్ విజయవాడ కొత్తగూడెం కేంద్రాల నుండి ప్రసారం అయ్యాయి. మహిళల కోసం "ఆడవాళ్ళు మీకు జోహార్లు" అనే 16 వారాల ధారావాహిక నాటికను రచించాను. ఆకాశవాణి రేడియో నాటికల సప్తాహం సందర్భంగా 'ప్రేమా నీ పేరు మార్చుకో' అనే నాటకం 2007 లో ప్రసారం అయింది. ఈ నాటకాన్ని ప్రశంసిస్తూ ఎన్నెన్నో ఉత్తరాలు రావడం విశేషం. నేను రచయిత్రినే కాక గాయనినీ కూడా. నేను పాడిన పాటలు కొత్తగూడెం విజయవాడ కేంద్రాల నుంచి ప్రసారం అయ్యాయి. ప్రస్తుతం 'బి' గ్రేడ్ కళాకారిణిగా ఆకాశవాణి, దూరదర్శన్ లోనూ కొనసాగుతున్నాను.


సింగరేణి కాలరీస్ కంపెనీ వారు నిర్మించిన రెండు లఘు చిత్రాలకు కథ, మాటలు సమకూర్చును. కార్మికుల శ్రేయస్సు కోరుతూ నిర్మించిన "గులాబీ ముళ్ళు" మరియు అనుకోని ప్రమాదం వల్ల భర్త లేవలేని స్థితిలో ఉన్నప్పుడు తన సమస్యలను ఎలా అధిక మించిందో తెలిపే ఓ మహిళ కథ "గమ్యం".. ఈ రెండు కూడా కార్మిక కుటుంబాలలో బహుళ ప్రజాదరణ పొందాయి.


2012 డిసెంబర్లో ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఖమ్మంలో జరిగిన జిల్లాస్థాయి సన్నాహక కార్యక్రమంలో జిల్లా ఉత్తమ రచయిత్రి గా గజల్ శ్రీనివాస్ గారి ద్వారా సన్మానం అందుకున్నాను.


2015, 2019 ఫిబ్రవరి, డిసెంబర్ లలో విజయవాడలో జరిగిన మూడవ నాలుగవ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు హాజరయ్యాను. 2018 డిసెంబర్ లో

ఈనాడు ఆదివారం అనుబంధం లో ప్రచురించిన కథలను "ఆరిళ్లలోగిలి" పేరుతో కథా సంకలనం వెలువరించాను.1,814 views0 comments

Comentarios


bottom of page