'Oka Nuvvu Oka Nenu' written by Kotamarthi Radhahimabindu
రచన: కోటమర్తి రాధాహిమబిందు
బస్సు వేగంగా వెళుతుంది. నా ఆలోచనలు అంతకంటే వేగంగా మనసు పొరల నుంచి వస్తున్నాయి. చల్లటి గాలి.. కిటికీ నుండి బయటకు చూశాను. పచ్చటి పొలాలు.. పల్లె జీవితం.. తొలిప్రేమ పరవశం గుర్తొచ్చాయి.
పల్లె లో పుట్టాను. స్కూల్ దాకా నా చదువు పల్లెలోనే గడిచింది. డిగ్రీ పల్లెకు దగ్గరగా ఉన్న టౌన్ లో సాగింది. ఫైనల్ ఇయర్ లో ప్రేమ నా దృష్టిలో పడింది. సీఐ రామచంద్ర కూతురని, ట్రాన్స్ఫర్ మీద వచ్చారని తెలిసింది. కొన్ని నెలల్లోనే ఆమెపై అవ్యాజమైన ప్రేమను పెంచుకున్నాను. ఓ రోజు మనసులో మాట చెప్పాను.
"నీపై నాకు అలాంటి అభిప్రాయం లేదు" అంది.. అయినా వెంట పడ్డాను. బ్రతిమాలాను.
సారీ చెప్పింది. నేను మనసు తెలుపుకోవడం మానలేదు. ఎగ్జామ్స్ చివరి రోజున కళ్ళనీళ్ళు పెట్టుకున్నాను.
"ఎన్నిసార్లు అడుగుతావు గోపాల్.. నీపై నాకు అలాంటి అభిప్రాయం లేదని చెప్పాగా..
నువ్వు ఎందుకు అర్థం చేసుకోవు? నేను ఇక నీకు కనిపించను. హైదరాబాద్ వెళ్తున్నాను
అక్కడే పీజీ చేస్తాను".. అంటూ వెళ్ళిపోయింది.
అంతే
నేను నిద్రాహారాలు మాని ప్రేమ కోసం తపించిపోయాను.. నా తొలిప్రేమ
ముగిసిపోయింది. అమ్మా నాన్నకు నేను ఏకైక సంతానాన్ని. వాళ్లను బాధ పెట్టడం ఇష్టం
లేక పీజీ చేసి బిజినెస్ లోకి వెళ్ళిపోయాను. కొన్ని సంవత్సరాలు పెళ్లి వాయిదా వేశాను.
అమ్మా నాన్నని సంతోష పెట్టటానికి పెళ్లి చేసుకున్నాను. నా భార్య పేరు కాంచన. మనసున్న వ్యక్తి. నన్ను చాలా బాగా చూసుకునేది. అయినా నా ఏమూలో ఒక అసంతృప్తి.. ఇద్దరు పిల్లలు, వాళ్ల పెంపకాలు, బాధ్యతలలో ఇరవై సంవత్సరాలు గడిచాయి.. అమ్మాయి బీటెక్ ఫైనల్ ఇయర్ అబ్బాయి ఇంటర్ ఫైనల్లోకి వచ్చారు.
నా ఫ్రెండ్ కూతురు పెళ్లికి వెళ్లాను.. అక్కడ ప్రేమను చూసి శిలావిగ్రహంలా అయిపోయాను.
"ప్రేమా"
"బాగున్నావా గోపాల్"
"నువ్వు…. ఇక్కడ"....
"అబ్బాయి తరపు బంధువును"..మనోహరంగా నవ్వింది ప్రేమ.. నా గుండె లయ తప్పింది.. ఎంత అందం..ఎంత అణకువ
"నేను గుర్తున్నానా"?
"పలకరించాను కదా"
"నీకు అభ్యంతరం లేకపోతే కాసేపు మాట్లాడుకుందామా"?
"మాట్లాడు గోపాల్"
'ఏం మాట్లాడాలి తోచలేదు ఇన్ని సంవత్సరాలు ఎదురుచూపు.. హృదయంలో ప్రతిష్టించుకున్న రూపం.. ఎవ్వరితో చెప్పుకోలేని రహస్య ప్రేమ ఆ భావం'
"మీవారు"...
"సేమ్.. నాన్నగారి డిపార్టుమెంటు.. నాతో రాలేదు.. ఒక్కదాన్నే వచ్చాను.. ఇద్దరు పిల్లలు..అమ్మాయి పెళ్లి అయింది.. అమెరికాలో ఉంటుంది.. అబ్బాయి ఆస్ట్రేలియా.. ఇంకా పెళ్లి కాలేదు"
"మీ ఫ్యామిలీ ఫోటో చూపిస్తావా"? భర్త ఎలా ఉన్నా డో చూడాలని తపన.. భర్త ఫోటో చూపించమని అడిగితే బాగుండదని ఫ్యామిలీ ఫోటో అన్నాను... ఇప్పుడే అన్ని కనుక్కోవాలి.. ఏదో తెలుసుకోవాలి.. గుండె నిండా గుబులు.. ఎంత ఆపుకుందామనుకున్నా నా కళ్ళల్లో సన్నని తడి.
"ఇంకేంటి విశేషాలు"?
ఫోటో చూపించడం ఇష్టం లేదని అర్థం అయింది.. ఎవరో పిలిస్తే వెళ్ళిపోయింది.. పెళ్లి కాగానే వెళ్ళి పోవాల్సిన వాడిని వెళ్ళలేక అక్కడే ఉండిపోయాను.. ప్రేమను చూస్తూ గడిపాను.. ఏవో పనులు కల్పించుకొని నా ఫ్రెండ్ కు సహాయంగా నిలబడ్డాను.. ప్రేమ నన్ను తప్పించుకుంటూ తిరుగుతుందా అని కూడా అనిపించింది.. అలా ఎంతసేపు ఉండగలను? ఇంటికి రాక తప్పలేదు.. మొబైల్ నెంబర్ అడగలేని పిరికి వాడిగా నన్ను నేను చాలాసార్లు తిట్టుకున్నాను.. మానిపోతున్న గాయం మీద మళ్లీ గాయం.. అనుక్షణం ప్రేమ గుర్తుకురావడం.. డల్ గా ఉండటం.. అలా అలా చాలా రోజులు గడిచాయి.. తర్వాత తర్వాత నా సంసారబంధం లో చిక్కుకుపోయాను.
బస్ ఒక్క కుదుపుకుదిపింది.. ఆగిపోయింది ఆలోచనలనుండి తేరుకున్నాను.. టైరు పంచర్ అయిందట.. బిలబిలమంటూ బస్సులో ఉన్న ప్రయాణికులంతా దిగారు..
నా కళ్ళను నేను నమ్మలేకపోయాను.. ప్రేమ.. అదే చిరునవ్వు.. అదే అందమైన రూపం
"ప్రేమా".. ఆశ్చర్యపోయాను నేను...మైమరచి క్రింద పడిపోతానేమో అని కూడా అనుకున్నాను.
"బాగున్నావా గోపాల్"
"నువ్వు బస్సు ఎప్పుడు ఎక్కావు? ఎలా ఉన్నావ్?.. బాగున్నావా"? కళ్ళనిండా ప్రేమను నింపుకుంటూ అంతకంటే ఎక్కువగా ప్రేమగా చూసుకుంటూ ఆర్తిగా అడిగాను.
"ఏదైనా ఆలోచనలలో వున్నావనుకుంటా.. అందుకే నన్ను గమనించలేదు"..
"నువ్వు నన్ను చూసావా"?
. "లేదు.. చూడలేదు"
"నీకో విషయం చెప్పనా? నిరంతరం.. ప్రతిక్షణం నా హృదయం ఒక రూపం తో నిండి ఉంటుంది. మెదడు ఆలోచనలతో పొంగి పొర్లుతూ ఉంటుంది.. లాంగ్ జర్నీ లకు కారు వాడను. కారులో నేను ఒంటరిని.. ఇలా బస్సులో జనంలో ఎక్కడైనా నువ్వు కనిపిస్తావేమో.. కలుస్తావేమో అని ఆశ"
"నేను ట్రైన్ లో కూడా ప్రయాణం చేయవచ్చుగదా"
"అలా కూడా జరగవచ్చు.. కానీ ఆ భగవంతుడు కొన్ని సంవత్సరాల కో సారి మనల్ని కలపడా అని ఏదో నమ్మకం.. నిజానికి ఎనిమిది గంటల ప్రయాణం.. ట్రైన్లో వద్దాం అనుకున్నాను.. కానీ ఎందుకో బస్సులోనే బెటర్ కదా అనిపించింది"
ప్రేమ దూరంగా చూస్తూ ఉండిపోయింది
'ఏంటి ప్రేమా.. నాకు ఇంత అదృష్టం'.. అనాలని నా మనసు తహ తహ లాడింది.. కానీ అనలేక పోయాను.
"నీకు అభ్యంతరం లేకపోతే అలా వెళ్లి మాట్లాడుకుందామా"?
"పద"
బస్సు జనం అంతా అక్కడక్కడా నిలబడి ఉన్నారు.. మేము కాస్తా దూరం వెళ్లి నిల్చున్నాము.. టైర్ మార్చటం మొదలైంది..
"ఎక్కడ ఉంటున్నావు ప్రేమా"
"నేను వెళ్తున్న చోటుకి ఎనిమిది గంటల ప్రయాణం"
.. "అదే ఏ ఊరు"?
"ఏదో ఊరులే.. నువ్వు ఎక్కడుంటున్నావ్? ఏ ఊరు"?
"నాది ఏదో వూరులే.. మొత్తం మీద బ్రతుకుతున్నాను" కోపంగా అన్నాను.. ఒకసారి
నన్ను చూసి ముఖం తిప్పుకుంది ప్రేమ.
. "ఎక్కడికి"
"పెళ్లికి"
.. "వాట్.. ఏ పెళ్లి"
చెప్పింది ప్రేమ.. సేమ్.. అదే పెళ్ళికి నేను వెళుతుంది కూడా.. ఆనందంగా ఆ విషయం చెప్పాను ప్రేమతో.. ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వలేదు ప్రేమ.
"నీ విషయాలు ఇంకా చెప్పు ప్రేమా.. ప్లీజ్"
"పెద్దగా ఏం లేవు గోపాల్.. నీ విషయాలు చెప్పు"
ప్రేమతో మాట్లాడితే చాలు నా జన్మ ధన్యం అన్న రీతిలో ఏదో ఒకటి వాగుతూనే ఉన్నాను.. టైరు బాగయింది.. అంతా బస్సులో చేరి ఎవరి సీట్లలో వాళ్లు కూర్చున్నాం.. మళ్లీ మా మధ్య దూరం.. కిటికీ పక్కన కూర్చున్న నేను ప్రక్కన కూర్చున్న అతన్ని రిక్వెస్ట్ చేసి సీటు మారాను.. ఇక్కడైతే ప్రేమ కాస్తా కనిపిస్తుంది.. బస్సు నిండుగా ఉంది ఎవరినైనా రిక్వెస్ట్ చేసి ప్రేమకు దగ్గరగా సీటు మార్చుకుందా మనుకుంటే ప్రేమ ఏమనుకుంటుందో అన్న జంకు.. మళ్లీ ఇంత మంచి అవకాశం రాదని మనసు గుంజులాట.. అలా.. అలా.. దిగులుగా ప్రయాణం సాగుతుంటే నాకు ఏడుపు వచ్చినంత పని అయింది.. బస్టాండ్ లో బస్సు ఆగింది.
.. "ఆటో మాట్లాడతాను"అన్నాను
"నాకు కారు వస్తుంది"అంది
"అవునా" నీరసపడి పోయాను.' నేను కారు లో రావచ్చా' అని అడగాలనిపించింది..'ఆమె కదా నన్ను అడగాల్సింది'.. కారు వచ్చింది.. ప్రేమ వెళ్ళిపోయింది.. నేను అనామకుడి గా నిలబడి పోయాను..
** **
పెళ్లయింది.. నా వేదన బాధ ఎవరితోనూ చెప్పుకోలేనిది.. ప్రేమ ప్రేమ అంటూ నా మనసు తపించి పోయింది.. కళ్ళనిండా కన్నీళ్లు నిండుతున్నాయి.. ప్రేమను చూస్తూ నిగ్రహించుకొలేని బేలతనం. ప్రేమ కోసం నా కళ్ళు ఎంతసేపు వెతికినా ప్రేమ నాకు కనిపించలేదు.. మనసు ఆపుకోలేక విడిది ఇంటికి వెళ్లి చూశాను.. అక్కడ కనిపించలేదు. సరిగ్గా అదే సమయంలో కాంచన ఫోన్ చేసింది.. లిఫ్ట్ చేయలేదు నేను.. ఐదు నిమిషాల తర్వాత కాంచన మళ్ళీ ఫోన్ చేసింది.
కర్చీఫ్ తో కళ్ళు అద్దుకుంటూ "ఆ కాంచనా" అన్నాను నేను..
"ఏంటి ఫోన్ చేయలేదు మీరు?..అంతా ఒకే నా"
"ఏదో హడావుడిలో మర్చిపోయాను"..
"మర్చిపోయారా.. అదేంటి కొత్తగా.. నన్ను మర్చిపోవడం ఎంటి"?..నవ్వింది కాంచన.
"సారీ… ఏదో చెప్పబోయి మరేదో చెప్పాను లే.. ఉంటాను మళ్ళీ కాల్ చేస్తాను".. కట్ చేశాను..
అరగంట గడిచినా ప్రేమ నాకు కనిపించకపోవడం నాకెంతో చిరాకు తెప్పించసాగింది.
లేచి అటు ఇటు చాలాసేపు తిరిగాను.. ఎవరిని అడగాలో అర్థం కాలేదు ఆమె కోసం నేను
చేసిన రెండు మూడు ప్రయత్నాలు విఫలం అయ్యాయి.. కాంచన నుండి మళ్లీ ఫోను..
చిరాగ్గా చూశాను ఫోన్ వైపు.. సైలెంట్ లో పెట్టాను.. బయటకు వచ్చి ఎడమవైపున ఉన్న
లాన్ వైపు నడిచాను..ఆ లైట్ల వెలుగులో లాన్ నాకళ్లకుఎంతో అందంగా మనసుకు ఎంతో
హాయిగా అనిపించింది.. అలా అలా కాసేపు తిరిగాను..
'ఎటు వెళ్లి ఉంటుంది ప్రేమ.. ఊరికి వెళ్ళిపోయిందా? నాతో చెప్పకుండా వెళ్తుందా?..
ఎందుకు అలా తప్పించుకోవడం.. మాట్లాడితే ఏం పోయింది.. మళ్లీ మళ్లీ ఎందుకు
కలుస్తాం.. అయినా ప్రేమించింది నేను కదా.. ఆమెకు బాధ ఎందుకు ఉంటుంది? డబ్బు
హోదా వుండవచ్చు.. కానీ ఇలా ఏం బాగాలేదు'..
కాంచన నుండి మళ్లీ ఫోను.
అసహనంగా ఫీల్ అయ్యాను నేను.. తప్పదు అనుకుని లిఫ్ట్ చేశాను
"కాంచనా"
"ఏంటి.. వంట్లో బాగుందా.. మాట్లాడటం లేదేంటి"?
మౌనంగా వున్నాను నేను.
"సిగ్నల్ సరిగా లేదా.. నా భయం మీకు తెలుసు కదా..మీరు ఫోన్ చేయక పోతే నాకు ఎంత
కంగారుగా వుంటుంది"?
"ఫోన్ చేయాలని అనుకున్నాను.. నువ్వు ఊహించింది కరెక్టే సిగ్నల్ సరిగ్గా లేదు"..
అబద్ధం చెప్పక తప్పలేదు.
"నైట్ బయలుదేరుతున్నారు కదా"
"చెప్పానుగా.. మరికాసేపట్లో బయలుదేరుతాను"..
"జాగ్రత్త.. దూర ప్రయాణం బాగా అలసిపోయి ఉంటారు.. ట్రైన్ లో వెళ్తే బాగుండేది"
"వచ్చాను కదా.. ఇంకిప్పుడు ఎందుకు ఆ విషయం"
"వచ్చేటప్పుడు బస్సా ట్రైనా"?
"ఇంకేం అనుకోలేదు.. చూస్తా ఎలా వీలైతే అలా"
"ఎవరైనా తెలిసిన వాళ్ళు కనిపించారా"?
"లేదు.. నాకు తెలిసింది నా ఫ్రెండ్ ఫ్రెండ్ భార్య అంతే.. నిజానికి రాకున్నా
బాగుండేది"..
"ఇప్పుడు ఎందుకు అనుకోవటం.. వెళ్లారు గదా" నవ్వింది కాంచన.. నా మనసు మరోలా
ఉంటే కాంచన కు ఏదో సరదా సమాధానం చెప్పేవాడిని.. ఇప్పుడు నా మనసు మూగగా
ఉంది.. అందుకే ఏం మాట్లాడలేదు నేను..
"మీరు ఏదో దాస్తున్నారు.. ఎందుకు అదోలా ఉన్నారు"?
కాంచన అలా అడిగేసరికి నన్ను నేను తమాయించుకొన్నాను..
"మరేం లేదు కాంచనా.. నేను ఎందుకు వచ్చానా అని చిరాగ్గా ఫీల్ అవుతున్నాను..అంతే..
ఒకే.. డన్.. వెంటనే బయలుదేరుతాను.. బై" కాల్ కట్ చేసి మళ్లీ కాసేపు అటూ ఇటూ
నడిచాను…
చల్లటి ఆహ్లాద వాతావరణం.. ఎంత వద్దనుకున్నా ప్రేమ వైపే నా మనసు లాగింది..
అందమైన రూపం అణకువ నా కళ్ళముందు కనిపిస్తుంటే నా కళ్ళు మళ్ళీ చమర్చాయి.
అలా నడుచుకుంటూ రైట్ సైడ్ తిరిగాను...అంతే..ఒక్కసారిగా శరీరం
జలదరించింది..మనసు పులకించింది..ప్రేమ అటు తిరిగి నిలబడివుంది..
"ప్రేమా"ఆర్ద్రంగా పిలిచాను నేను..ఉలిక్కిపడి గభాలున వెనక్కితిరిగి చూసింది
ప్రేమ.
"నువ్వు కనిపించకపోతే వూరెళ్ళిపోయావేమో అనుకున్నాను"..
. . మాట్లాడలేదు ప్రేమ.
"ప్రేమా.. నాతో మాట్లాడవా.. ప్లీజ్ నేను నీ నుండి ఏదో ఆశించటం లేదు.. నేను.. నేను ఓ
మంచి ప్రేమికుడ్ని.. అంతేగాని చెడ్డవాడిని కాదు.. నీ మొబైల్ నెంబర్ ఇస్తావా"?
"ప్లీజ్.. ఆపు గోపాల్.. ఇప్పుడు ఏం కావాలి నీకు? నా జీవితం వేరు.. నీ జీవితం వేరు.. ఇలా
మాట్లాడుకుని ఏం ప్రయోజనం? నా నెంబర్ ఇచ్చి మాటలు పెంచుకుంటూ పోయి
ప్రేమలు పంచుకుంటూ జీవితాలను నాశనం చేసుకోవడం అంత అవసరమా"?
"ప్రేమా".. నిర్ఘాంత పోయాను నేను
"గోపాల్.. నువ్వు నన్ను ఎంతగా ప్రేమించావో నాకు తెలుసు.. నేను నిన్ను ఎంతగా
ప్రేమించానో నీకు తెలవదు.. మా నాన్న చండశాసనుడు మా అమ్మకే చాలా స్ట్రిక్ట్ రూల్స్
ఉండేవి.. ఒక్కగానొక్క కూతురు అన్న ప్రేమ అపురూపం నా పట్ల ఏమీ ఉండకపోయేవి..
నాకూ భయంకరమైన స్ట్రిక్ట్ రూల్స్.. మన ప్రేమను నాన్న ఒప్పుకోరని నాకు తెలుసు..
అదీగాక నిన్ను ఈ భూమ్మీద కనపడకుండా చేయగల కర్కశమైన మనసున్న మనిషి..
అందుకే నేను ఎలాంటి ఆశలు చూపలేదు.. ఓ విషయం చెప్పనా.. నాకు పెళ్లి అవలేదు"
. "ప్రేమా"
"ఓ జలపాతం నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తూ ముంచేసిన ఫీలింగ్.. ఓ పిడుగు నన్ను
నిలువునా చీల్చేసిన ఫీలింగ్
"అవును గోపాల్.. నాన్న హార్ట్ ఎటాక్ తో చనిపోయారు.. అమ్మకు నా మనసు తెలుసు.. నీ
గురించి ప్రయత్నించమని అమ్మ నన్ను ప్రోత్సహించింది"
.. "ప్రే….మా"..
"నీ అడ్రస్ సంపాదించటానికి చాలా సంవత్సరాలు పట్టింది.. అప్పటికే నీకు భార్య
ఇద్దరు పిల్లలు ఉన్నారు.. అమ్మతో చెప్పుకుని చాలా బాధపడ్డాను.. అమ్మ కన్నీళ్లు
పెట్టుకొని నన్ను ఓదార్చింది.. నా హృదయాన్ని రాయిలా చేసుకున్నాను.. కొన్ని జన్మలు
అంతే అని సర్ది చెప్పుకున్నాను"..
"మరి..మీవారు..నీకు పిల్లలు.అని"..
"ఏదో ఒకటి.. అలా చెబితేనే కదా నీకు కాస్త ప్రశాంతత"..
… "ప్రేమా"..
"నిజానికి ఇలా నీకు చెబుతానని అనుకోలేదు. ఎందుకో ఓసారి ఉన్న నిజం
చెప్పాలనిపించింది.. గోపాల్.. మంచి జీవితం గడుపుతున్నారు.. అలాగే సాగిపో.. ఇన్ని
సంవత్సరాలైనా నన్ను గుర్తుంచుకున్నావంటే నీ స్వచ్ఛమైన ప్రేమ గొప్పతనాన్ని నేను
అర్థం చేసుకోగలను.. అనుకోకుండా మరోసారి కలుసుకున్నాం. మనం బ్రతికి ఉంటే
ఇలాగే ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ మనం కలుసుకుంటామేమో.. చెప్పలేం..
నీ భార్యా పిల్లలతో హ్యాపీగా గడుపు. నన్ను మర్చిపో"..
"ప్రేమా" నాలో దుఃఖం పెల్లుబికింది
"సారీ గోపాల్.. నేను ఒకప్పుడు నీ గురించి తపించి ఇలాగే దుఃఖ పడ్డాను.. నా జీవితం
నీతో ముడి పడి లేదు అని తెలుసుకున్నాను"..
"నువ్వు పెళ్లి ఎందుకు చేసుకోలేదు"?
"ప్రేమ మనసు నీ ఒక్కడికే వుంటాయా? నాకు కూడా ఉంటాయి.. నా హృదయంలో ఏ
వ్యక్తికి స్థానం ఇవ్వొద్దని నా ప్రేమ నాకు చెప్పింది".. లైట్ల వెలుతురుకాంతిలో ప్రేమ
కళ్ళల్లో కన్నీటి వూట స్పష్టంగా కనిపించింది.
భూమిలో పెద్ద అగాధం ఏర్పడి అందులోకి జారిపోతున్న ఫీలింగ్ నాలో..
"గుడ్ బై గోపాల్.. ఇక వెళ్ళిపోతాను".. చేతులు జోడించింది ప్రేమ.
"ప్రేమా.. ప్లీజ్ వెళ్లి పోకు"దైన్యంగా అడిగాను
అదే నవ్వు.. అదే అందమైన రూపం.. అదే అణకువ..
"నా జీవితం వేరు.. నీ జీవితం వేరు వెళ్ళిపోవాలి గా"నవ్వింది ప్రేమ
"జాబ్ చేస్తున్నావా"?
"ఏదో..చేస్తున్నాలే.. నేను బ్రతకాలి.. అమ్మను అను బ్రతికించాలి గా"
"నీకు దండం పెడతాను ప్లీజ్.. నీ మొబైల్ నెంబర్ ఇవ్వు"
"నేనే నీకు దండం పెడతాను.. ప్లీజ్.. మొబైల్ నెంబర్ ఇవ్వను.. కొంతమంది దృష్టిలో
శత్రువుగా మిగల దలుచుకోలేదు.. నువ్వు ముడివేసుకున్న నీ బంధం చాలా
పటిష్టమైనది.. నీ జీవితం తో బిగుసుకున్న నీ వాళ్ళను బాధ పెట్టకు.. అలాగే నేనూ.. బాధ
పెట్టకూడదు.. ఆ పొరపాటు నేను చేయను"..
"ప్రేమా"..
"వెళ్తాను గోపాల్"
"ప్రేమా.. మనం మంచి స్నేహితుల్లా ఉండిపోదాం"ఆరాటంగా అడిగాను నేను..
పేలవంగా నవ్వింది ప్రేమ
"ప్రేమికులు స్నేహితుల్లా ఉండలేరు గోపాల్.. ఇది నా అభిప్రాయం.. నా ప్రేమ గాలిలో
దీపం లా అయిపోయింది.. నీ ప్రేమ గర్భగుడిలో దీపం లా నిలిచి పోయింది. మన తొలి
ప్రేమను గుండెలోతుల్లో ఇలాగే నిక్షిప్తంగా దాచుకుందాం.. వెళ్తాను గోపాల్".
"ప్రేమా.. ప్లీజ్"
"మనం విజ్ఞత గల మనుషులం.. చెడు మార్గం ఎంచుకోకూడదు కదా.. గుడ్ బై ఫరెవర్"..
అంటూ ముందుకుసాగిపోయింది ప్రేమ.. నిస్త్రాణగా అలాగే నిలుచుండి పోయాను నేను.
** సమాప్తం **
గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి.
రచయిత్రి పరిచయం :
పేరు : కోటమర్తి రాధాహిమబిందు
నేను జన్మించింది నల్లగొండ జిల్లా కోదాడ.. మావారి ఉద్యోగరీత్యా ఖమ్మం జిల్లా మణుగూరులో ఉండి జిల్లాకి సాహితీ సేవలు అందించాను.. ప్రస్తుతం కె ఎల్ ఆర్ ఎవెన్యూ.. కోమరబండ కోదాడలో నివాసం ఉంటున్నాము.
నా రచనా వ్యాసంగం ప్రారంభించి రెండుదశాబ్దాలు పూర్తయ్యింది.నా సాహిత్య ప్రస్థానంలో ఇప్పటివరకు 150 పైగా కథలు నాలుగు నవలలు వ్రాశాను.అందులో రెండు ఎమెస్కో వారు ప్రచురించారు. తెలుగు భాషలో వెలువడుతున్న అన్ని దిన వార పక్ష మరియు మాసపత్రికల్లో నా కథలు, నవలలు ప్రచురింపబడ్డాయి. చిన్నపిల్లలు అమితంగా ఇష్టపడే చందమామ అయినా కార్మికుల పత్రిక కార్మిక లోకం అయినా అన్ని వర్గాలకు సంబంధించిన సమస్యలు సృజించి అక్షర రూపంలో పాఠకులకు అందజేశాను.
నా కథల్లో ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు ఎదుర్కొనే సమస్యలు ప్రస్తావిస్తూ ఉంటాను. కడుపుబ్బ నవ్వించే హాస్య కథలూ కన్నీళ్లు తెప్పించే హృద్యమైన కథలూ వ్రాశాను. నేను రచయిత్రిగా ఎన్నో అవార్డులు, సత్కారాలు పొందాను.
2005, 2006, 2007 సంవత్సరాలలో జివిఆర్ కల్చరల్ ఫౌండేషన్ హైదరాబాద్ వారు నిర్వహించిన రాష్ట్రస్థాయి కథల పోటీల్లో మూడుసార్లు ఉత్తమ రచయిత్రిగా గెలుపొంది శ్రీ త్యాగరాయ గానసభలో సన్మానం పొందాను. 2006 ఆంధ్రప్రదేశ్ యువజన సర్వీసుల శాఖ ఉత్తమ రచయిత్రి గా గుర్తించి సత్కరించింది.
2007 లో ప్రభుత్వం నిర్వహించిన స్తంభాద్రి సంబరాలలో ఉత్తమ రచయిత్రి గా అప్పటి కేంద్ర మంత్రి శ్రీమతి రేణుకాచౌదరి గారి ద్వారా అప్పటి రాష్ట్ర మంత్రి శ్రీ వనమా వెంకటేశ్వరరావు గారు అప్పటి కలెక్టర్ శశిభూషణ్ కుమార్ గారు మరియు శాసన సభ్యుల సమక్షంలో అవార్డు, సన్మానం పొందాను.
2008లో సుప్రసిద్ధ రచయిత శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు నది మాస పత్రికలో రాసిన 'వీళ్లనేం చేద్దాం' అనే నవలకు ముగింపు రాసి
ప్రథమ బహుమతి పొందాను. 2010 వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికావారు నిర్వహించిన అంతర్జాతీయ కథల పోటీలో ఉత్తమ రచన అవార్డు పొంది జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా అవార్డు, సన్మానం అందుకున్నాను. 2011లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సింగరేణి కాలరీస్ 'సేవా'
ద్వారా సన్మానం పొందాను.
ఇవి కాకుండా ఈనాడు ఆదివారం లో అనేక కథలు ప్రచురితమై బహుళ ప్రజాదరణ పొందాయి. స్వాతి, నది ఇంకా ఇతర పత్రికలు నిర్వహించిన కథల పోటీలలో పలుమార్లు బహుమతులు గెలుచుకున్నాను.
నేను రేడియో మాధ్యమం ద్వారా అనేక కథలు, కథానికలు, నాటకాలు నాటికలు రచించాను. ఇవన్నీ ఆకాశవాణి హైదరాబాద్ విజయవాడ కొత్తగూడెం కేంద్రాల నుండి ప్రసారం అయ్యాయి. మహిళల కోసం "ఆడవాళ్ళు మీకు జోహార్లు" అనే 16 వారాల ధారావాహిక నాటికను రచించాను. ఆకాశవాణి రేడియో నాటికల సప్తాహం సందర్భంగా 'ప్రేమా నీ పేరు మార్చుకో' అనే నాటకం 2007 లో ప్రసారం అయింది. ఈ నాటకాన్ని ప్రశంసిస్తూ ఎన్నెన్నో ఉత్తరాలు రావడం విశేషం. నేను రచయిత్రినే కాక గాయనినీ కూడా. నేను పాడిన పాటలు కొత్తగూడెం విజయవాడ కేంద్రాల నుంచి ప్రసారం అయ్యాయి. ప్రస్తుతం 'బి' గ్రేడ్ కళాకారిణిగా ఆకాశవాణి, దూరదర్శన్ లోనూ కొనసాగుతున్నాను.
సింగరేణి కాలరీస్ కంపెనీ వారు నిర్మించిన రెండు లఘు చిత్రాలకు కథ, మాటలు సమకూర్చును. కార్మికుల శ్రేయస్సు కోరుతూ నిర్మించిన "గులాబీ ముళ్ళు" మరియు అనుకోని ప్రమాదం వల్ల భర్త లేవలేని స్థితిలో ఉన్నప్పుడు తన సమస్యలను ఎలా అధిక మించిందో తెలిపే ఓ మహిళ కథ "గమ్యం".. ఈ రెండు కూడా కార్మిక కుటుంబాలలో బహుళ ప్రజాదరణ పొందాయి.
2012 డిసెంబర్లో ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఖమ్మంలో జరిగిన జిల్లాస్థాయి సన్నాహక కార్యక్రమంలో జిల్లా ఉత్తమ రచయిత్రి గా గజల్ శ్రీనివాస్ గారి ద్వారా సన్మానం అందుకున్నాను.
2015, 2019 ఫిబ్రవరి, డిసెంబర్ లలో విజయవాడలో జరిగిన మూడవ నాలుగవ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు హాజరయ్యాను. 2018 డిసెంబర్ లో
ఈనాడు ఆదివారం అనుబంధం లో ప్రచురించిన కథలను "ఆరిళ్లలోగిలి" పేరుతో కథా సంకలనం వెలువరించాను.
Comments