top of page

మబ్బులు వీడిన ఆకాశం


'Mabbulu Vidina Akasam' written by Lakshmi Sarma B

రచన : B. లక్ష్మీ శర్మ

“శారదా! ఏమిటి ఆలోచిస్తున్నావు? బాబు ఎప్పుడు వస్తాడనా.. పిచ్చిదానా! ఎందుకే అంతపిచ్చి ప్రేమ పెట్టుకున్నావు?” అంటూ భార్య పక్కన కూర్చున్నాడు సీతారామయ్య.

“నన్నంటారు కానీ మీకు మాత్రం లేదేమిటి? రోజూ పోస్టుమాస్టరు వాళ్ళింటికి వెళ్ళి రావడం నాకు తెలీదా! ఒకసారి మీ ముఖం అద్దంలో చూసుకోండి తెలుస్తుంది! కొడుకుమీది ప్రేమతో మీలో మీరే ఎలా బాధపడుతున్నారో అర్థమవుతుంది. అసలు వాడి నుండి ఉత్తరం వచ్చిఉంటే ఇంత బెంగ ఉండేది కాదు మనకు” భర్త గుండెల మీద తలపెడుతూ అంది శారద.

“శారదా! నువ్వేం బాధపడకు. వాడు త్వరలోనే వస్తాడు. అందుకే ఉత్తరం రాయడం లేదేమో” అంటూ భార్యను సముదాయించాడు. కానీ, అతని మనసులో కూడా కొడుకుని చూడాలనే తపన రోజు రోజుకు పెరిగిపోతోంది. వెళ్ళినవాడు వెళ్ళినట్టే! ఇంతవరకు రాలేదు. వెళ్ళి కూడా ఎనిమిది సంవత్సరాలవుతుంది. ఇన్నాళ్లూ ఉత్తరాలు రాసేవాడు. ఏమైందో ఏమో ఈమధ్య అసలు ఉత్తరాలు రావడం లేదు. ఏమైయ్యిందోనని భయం పట్టుకుంది. ఎవరినైనా అడుగుదామన్నా ఎవరికి తెలుసని చెప్పడానికి? అందుకే భగవంతుని మీద భారం వేసి ఎదురుచూస్తున్నారు కొడుకు రాక కోసం!

సీతారామయ్య, శారద లకు దేవుణ్ణి కోరగా దక్కిన ఏకైక సంతానం మధు. ఎంతో అల్లారుముద్దుగా పెంచారు. కొడుకు పెద్ద చదువులు చదివి ప్రయోజకుడు కావాలని పట్టుబట్టి పై చదువుల కోసం విదేశాలకు పంపారు. వెళ్ళాక ఉత్తరాలు రాయడం మొదలుపెట్టాడు. బాగానే ఉన్నాను, మంచిగా చదువుకుంటున్నాను అని చెప్పేవాడు. అలా అలా చదువైపోయి, వుద్యోగం వచ్చింది. 'ఇప్పట్లో రావడానికి లేదు. వీలుచూసుకొని వస్తాను' అని రాసేవాడు. ఆ వుత్తరాలను చూసుకొని ఎంతో సంబరపడిపోయేవారు. డబ్బు పంపిస్తున్నాడు కానీ దాని తరువాత వుత్తరం రాలేదు. అందుకే వాళ్ళ మనసు మనసులో లేదు. అలా ఎదురు చూస్తూ ఆరు నెలలు గడిచిపోయాయి.

ఒకరోజు పోస్టుమాన్ వచ్చి వుత్తరం తెచ్చిచ్చాడు. దాన్ని చూడగానే కొడుకు వచ్చినంతగా సంబరపడిపోయాడు సీతారామయ్య. శారద చూడలేదు. ఆమెను వుడికించాలని “శారదా! ఒక మంచి వార్త. ఏమిటో చెప్పుకో చూద్దాం?” వంటింటి గడపలో నిలుచొని అడిగాడు .

“చెప్పనా! ఈ రోజు ఉదయం మీ స్నేహితుడు రాఘవన్నయ్య వచ్చి తన కూతుర్ని మన మధుకు ఇవ్వటానికి అడగటానికి వచ్చాడు. మీరు లేరని మళ్ళీ వస్తానని చెప్పాడు. అదే కదా మీరు చెప్పాలనుకున్నది?” అంది శారద.

“అవును. నువ్వు చెప్పింది అక్షరాల నిజం. వాళ్ళమ్మాయి మన మధుకు తగిన జోడి అవుతుంది. అది సరే! నేనడిగిన దానికి జవాబు చెప్పవోయ్” అన్నాడు వూరిస్తూ.

***

అనుకున్న సమయానికి వెళ్ళి, అమ్మాయిని చూసి, తాంబూలాలు పుచ్చుకున్నారు. అమ్మాయి పద్మ, కుందనాల బొమ్మ లాగా వుంది. ’లక్ష్మీ కళ ఉట్టిపడుతుంది’ అనుకున్నారు దంపతులు. అదే మాట వాళ్ళతో అన్నారు. వాళ్ళు ఆనందపడుతూ “మా అమ్మాయి చాలా అదృష్టవంతురాలు. మీలాంటి అత్తమామలు దొరకడం అది ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యం” అన్నారు. లగ్నానికి ముహూర్తాలు కూడా చూసుకుని మరీ కదిలారు శారద, సీతారామయ్య. కొండెక్కినంత సంబరంగా వుంది శారదకు. పెళ్ళికి ఏమేమి చెయ్యాలో, ఏవరెవరిని పిలవాలో, అమ్మాయికి నగలు ఏమి చేయించాలో అన్నీ సీతారామయ్యకు చెబుతోంది. కానీ సీతారామయ్యకి మనసులో ఏదో అనుమానం పట్టిపీడిస్తోంది. ‘మధు ఒప్పుకుని ఆ అమ్మాయిని చేసుకుంటే వాడంత అదృష్టవంతుడే వుండడు. ఒకవేళ ఒప్పుకోకపోతే ఏమి చెయ్యాలో ఎంత ఆలోచించినా బుర్రకు తోచడం లేదు’ బాధపడుతూ అనుకున్నాడు. ఎదురు చూస్తుండగానే మధు వచ్చే రోజు రానే వచ్చింది. శారద కాలు కాలిన పిల్లి లాగా ఇంట్లోకి బయటకు తిరుగుతోంది. మధుకు ఇష్టమైన వంటకాలన్నీ చేసింది. భోజనం కూడా చెయ్యకుండా ఎదురు చూస్తూ కూర్చున్నారు ఇద్దరూ.

మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఇంటి ముందు టాక్సీ ఆగింది. పరుగు పరుగున వచ్చింది శారద టాక్సీ దగ్గరకు. ఎంత వేగంగా వచ్చిందో అంత వేగంగా వెనక్కి వెళ్ళింది. సీతారామయ్య కి అర్ధం కాలేదు ఎందుకలా వెనక్కి వచ్చిందోనని అనుకుంటున్నాడు. చాలా నెమ్మది స్వభావం కలవాడు కనుక ఓపికతో చూస్తున్నాడు. మధు టాక్సీ నుండి దిగాడు, చంకలో చిన్నబాబుతో. ఆ వెనకాలే చిన్నపాపను ఎత్తుకుని దిగింది ఒకమ్మాయి. టాక్సీ వెళ్ళిపోయింది. నోట మాట రాక అలాగే చూస్తుండిపోయిన తల్లితండ్రుల వద్దకు వచ్చి. “ఏమిటి నాన్నా! అలాగే నిలబడిపోయారు? పదండి లోపలకి” అంటూ ముందుకు నడిచాడు మధు. అతని వెనకాలే వెళ్ళింది వచ్చిన ఆ అమ్మాయి. చివరగా వెళ్ళారు శారద, సీతారామయ్య. ఎవరికోసం ఇన్నాళ్ళు కళ్ళల్లో వత్తులువేసుకుని ఎదురుచూశారో, అతనే వచ్చి ఎదురుగా నిలుచున్నా పరాయివాడిలా కనిపిస్తున్నాడు. వాళ్ళ సంతోషమంతా ఆవిరయిపోయింది. జీవంలేని బొమ్మలుగా చూస్తూ నిలుచున్నారు.

“నాన్నా! బాగున్నారా! ఏమిటి ఎవరో పరాయివాడిని చూస్తున్నట్టు చూస్తున్నారు? అమ్మా! ఏమిటమ్మా నువ్వుకూడా మౌనంగా వున్నావు. కోపంగా వుందా నా మీద మీకు చెప్పకుండా పెళ్లి చేసుకొని వచ్చానని?” అడిగాడు మధు.

ముందుగా సీతారామయ్య తేరుకొని “అదేమిటి బాబూ! మాకెందుకుంటుంది నీమీద కోపం? చాలా రోజుల తరువాత చూస్తున్నాము కదా ! అందుకే ఆనందంతో నోట మాట రావడం లేదు. అంతేకదూ! “ అన్నట్టుగా భార్య వైపు చూసాడు. ‘అవును’ అన్నట్టుగా తలవూపింది శారద.

“ అమ్మా! ఇదిగో నీ కోడలు సవిత, మనవరాలు, మనవడు” పరిచయం చేసాడు మధు. విషయం ఎప్పుడో బోధపడింది. అందుకే నోరు మూత పడిపోయింది వాళ్ళకు. “మీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నందుకు మీకు కోపం వచ్చినట్టుంది. కానీ చెప్పేంత వ్యవధి లేకుండా జరిగిపోయింది మా పెళ్ళి” సంజాయిషీ చెప్పకున్నాడు.

“అవున్రా! మాకు చెప్పేంత తీరిక నీకెక్కడుంటుంది? ఇద్దరు పిల్లలు పుట్టే వరకు కూడా నీకు చెప్పాలనిపించలేదన్న మాట. చాలా బాగుందిరా! అసలు మేమంటూ నీకు జ్ఞాపకం వున్నామా”? అంది ఆవేశంగా.

“శారదా! ఎందుకే అలా బాధపడతావు? అడ్డాలనాడు బిడ్డలుగానీ గడ్డాలు వచ్చాక బిడ్డలా! పిచ్చి భ్రమలు పెట్టుకోవద్దని నీకు ఏనాడో చెప్పాను. వాడు పెద్దవాడయ్యాడు. వాడికి నచ్చినట్టుగా వాడుండాలనుకున్నాడు. దాని గురించి నువ్వు ఆలోచించి మనసు పాడుచేసుకోకు. పిల్లలు తెలిసీతెలియక తప్పు చేస్తే క్షమించే పెద్ద మనసు మనకుంది చాలు. అయినా ఇందులో మధు కొత్తగా చేసింది ఏముంది? లోకంలో జరిగేది వాడు చేసాడు. ఇది లోక సహజం శారదా!” అన్నాడు సీతారామయ్య. పైకి అలా చెప్పాడే కానీ ఆయనకు చాలా బాధగా వుంది. నిండుకుండలా తొణకడు.

“అదికాదు నాన్నా! ఇంత చిన్న విషయానికే అంతగా బాధపడుతున్నారు. నేనేం కాని పని చెయ్యలేదు కదా!?” అన్నాడు మధు .

“అవునవును. నువ్వు కాని పని ఎందుకు చేస్తావు? చాలా మంచి పని చేసావు. శారదా! నువ్వు లోపలకు వెళ్ళి కాఫీ తీసుకురా” శారద మాటలకు మధ్యలోనే అడ్డువస్తూ అన్నాడు సీతారామయ్య.

“అది కాదండీ1 మనం తాంబూలాలు పుచ్చుకున్నాము. మరి వాళ్ళకు ఏం సమాధానం చెబుదాము?” అంటూ కళ్ళల్లో నీళ్ళు స్రవిస్తుండగా ఆపుకోలేక లోపలకు వెళ్ళిపోయింది.

“ఏమిటి నాన్నా! అమ్మ ఏవో తాంబూలాలు అంటుంది.. ఎవరికి?” అడిగాడు మధు.

“ఆహా! ఏమీ లేదు! ఈ మధ్య మీ అమ్మకు మతిమరుపు ఎక్కువయింది. అందుకని ఏవేవో అంటుంద”ని చెప్పాడే కానీ, మనసు గిలగిలా కొట్టుకుంది శారద గురించి అలా చెప్పినందుకు.

రెండు రోజులు గడిచిపోయాయి కానీ ఎవరికి వారు ముక్తసరిగా మాట్లాడుకున్నారు. గాయత్రి అసలు మాట్లాడనేలేదు పెద్దవాళ్ళతో. పిల్లలకు ఇంకా మాటలురావు కాబట్టి వాళ్ళను కనీసం ఎత్తుకోమని కూడా అనలేదు. మనవడు మనవరాలిని దగ్గరకు తీసుకోవాలని వున్నా, మనసు పడే వేదనతో వాళ్ళను ప్రేమగా గుండెలకు హత్తుకోలేకపోయారు శారద, సీతారామయ్య.

“నాన్నా! నేను మీతో కొంచెం మాట్లాడాలి. నాకు ఎక్కువ రోజులు సెలవులు లేవు. మూడువారాలే ఇచ్చారు. సవితావాళ్ళ అమ్మావాళ్ళింటికి కూడా వెళ్ళాలి. అందుకని.." అంటూ నసగసాగాడు మధు.

"ఏమిటి బాబూ సందేహిస్తున్నావు ఏదో అడగడానికి? చెప్పు విషయమేమిటో!” అన్నాడు.

ఒక్క క్షణం ఆగి చెప్పడం మొదలుపెట్టాడు మధు. "నేను ఎలాగు అమెరికాలోనే సెటిల్ అవ్వాలనుకున్నాను. అందుకని అక్కడే పెద్ద ఇల్లు కొనుక్కోవాలని అనుకుంటున్నాను. మరి ఇక్కడ ఇంత ఆస్తి వేస్ట్ చేసుకోవడం ఎందుకు? ఇది తీసివేస్తే నాకు అప్పులు చెయ్యవలసిన అవసరం వుండదనుకుంటున్నాను. ఏమంటారు?" అడిగాడు మధు తల్లిదండ్రుల నుద్దేశించి.

పరిస్థితి అర్థం కావడానికి ఎంతోసేపు పట్టలేదు సీతారామయ్య కి. కానీ శారదకు అర్థం కాలేదు.

“అదేమిట్రా.. మాకున్నది నువ్వేకదా! ఈ ఆస్తంతా నీదే. అయినా మేము మాత్రం ఇక్కడే వుండి చేసేది ఏముంది గనుక? అందరం ఒకే దగ్గర వుందాము” అన్నది శారద సంతోషంతో.

“అయ్యో అత్తయ్యగారూ! అక్కడ అందరం వుండడానికి కుదరదు. అందుకే మా వాటా మాకు ఇస్తే తీసుకుని వెళతాము. అయినా మీరు అక్కడ వుండలేరు” అంది సవిత.

అప్పటి వరకు నోరు మెదపని ఆమె, భర్త ఎక్కడ ఒప్పేసుకుంటాడోనని ”అయితే మమ్మల్ని ఇక్కడే వదిలేసి మీ ఆస్తి మీరు తీసుకుని పోతారా? ఏమండీ విన్నారా వాళ్ళు ఏమంటున్నారో!” గొంతు బాధతో పూడుకు పోగా అంది శారద భర్తతో.

“శారదా! నీకు నేనున్నాను కదా! నీకు ఎప్పుడో చెప్పాను పిచ్చి భ్రమలు పెట్టుకోవద్దని” అంటూ ఆ..మధూ! ఈ ఆస్తి మొత్తం నీపేర ఎప్పుడో రాసాను. కానీ మా తదనంతరం అది నీకు వస్తుంది. నాకు తెలుసు ముందు ముందు ఇలాంటి పరిస్థితి వస్తుందని. అప్పుడు ఈ ఆస్తిని చూసైనా ఎవరైనా గుప్పెడు మెతుకులు పెట్టకపోతారాని అనుకున్నాను నేను. అనుకున్నదే జరిగింది” అన్నాడు నిష్టూరంగా సీతారామయ్య .

ఒకవైపు భార్యను ఓదారస్తూనే “ఓరేయ్ మధు! నీ వాటా నీకిస్తే వెళ్ళిపోతావా? నీ కోసం ఎంతగా తపించిపోయామో తెలుసా! కళ్ళల్లో వత్తులు వేసుకున్నట్టుగా నీ కోసం చూడని రోజు లేదు. నీమీద ఎన్ని ఆశలుపెట్టుకున్నాము! చివరి రోజుల్లో మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతావనుకున్నాము. చివరకు మాకు నచ్చిన సంబంధం చేస్తే ఇక ఇక్కడే వుండిపోతావని, తాంబూలాలు కూడా పుచ్చుకుని వాళ్ళకు మాట కూడా ఇచ్చాము. ఇప్పుడు నీ మూలంగా మాట తప్పినవాళ్ళము కూడా అయ్యాము” అంటూ తన ఆవేశాన్నంతా వెళ్లగక్కింది. తల్లిగా తట్టుకోలేకపోతోంది.

“శారదా! నువ్వు లోపలికి వెళ్ళు. నేను మాట్లాడుతున్నాను కదా!” అంటూ శారదను గదమాయించాడు. ఇంకా అక్కడే వుంటే బాధతో ఏమేమి మాట్లాడుతుందోనని అన్నాడు. అయినా శారద వెళ్ళలేదు.

“మధూ! నువ్వు మమ్మల్ని విడిచివెళ్ళకురా! నువ్వు లేకుండా మేము వుండలేము. ఆస్తి మొత్తం నువ్వే తీసుకో. మాకు చిల్లిగవ్వ కూడా వద్దు. కానీ… మమ్మల్ని దిక్కులేని వాళ్ళను చెయ్యకు” అంటూ అతని పాదాలు పట్టుకోబోయింది బోరుబోరున ఏడుస్తూ. దూరంగా జరిగాడు మధు!

“అమ్మా! ఇక్కడ ఉండడం నా భార్యకు ఇష్టం లేదు. పైగా పిల్లల చదువులకు అక్కడే బాగుంటుంది. అందుకని..” అంటూ నీళ్ళు నములుతూ చెప్పడం ఆపాడు.

ఇక సీతారామయ్య ఆగలేకపోయాడు. భార్య దీనస్థితి చూడలేక “అవును బాబూ! మీ ఆవిడకు ఇష్టమైన దగ్గరే వుండు. మేమెవరమని మా దగ్గరవుంటావు? తొమ్మిది నెలలు మోసి కనిపెంచిన తల్లిదండ్రుల కంటే రెండేళ్ల కింద వచ్చిన నీ భార్య నీకు గొప్పదయిపోయింది కదూ! మాకు చాలా బాగా గుణపాఠం చెప్పావు శారదా! నీకేమైనా పిచ్చి పట్టిందా ! అడ్డమైన వాళ్ళ కాళ్లు పట్టుకోవడానికి?నీ మొగుడు లేడనుకున్నావా” అన్నాడు కఠినంగా.

“ ఏమండీ! ఏం మాటలవి? వాడి మీద ఉన్న ప్రేమను చంపుకోలేక పోతున్నాను. మీరైనా చెప్పండి వాడికి వెళ్ళిపోవద్దనీ..” అంటూ భర్త చేతులు పట్టుకుని అడిగింది బేలగా.

“పిచ్చిదానా ! ఎందుకు బ్రతిమాలాలి? అసలు మనకు పిల్లలే లేరనుకుందాము. వాడు తిరుగు ప్రయాణానికి టికెట్లు కూడా తెచ్చుకున్నాడు. వాడికి కావాలసింది మన ఆస్తి కానీ మనం కాదు. నేను నీకున్నాను, నువ్వు నాకున్నావు. అంతేచాలు శారదా! ఎవరికోసమో విలపించాల్సిన అవసరం లేదు” అంటూ పొదివి పట్టుకుని ఓదార్చాడు.

“అబ్బబ్బా! ఏంటండీ వీళ్ళ ఏడుపులు? మనమేదో గతిలేక తేరగా తీసుకు వెళ్తున్నట్టు బాధపడుతున్నారు” అంది సవిత ఫిర్యాదు చేస్తున్నట్టుగా.

మధు మాట్లాడేలోగా అన్నాడు సీతారామయ్య “మధూ! నీకు రావలసిన ఆస్తి పంచిస్తాను. తీసుకుని వెళ్ళిపో. ఇంకెప్పుడూ నీ ముఖం మాకు చూపెట్టకు. పెద్దమనుషులను తీసుకు వస్తాను” అంటూ బయటకు వెళ్ళిపోయాడు.

ఎవరి పనుల్లో వాళ్ళు ఉండిపోయారు. ఓ గంట తరువాత తిరిగొచ్చాడు సీతారామయ్య. వస్తూనే శారద కోసం వంటగదిలోకి వెళ్ళాడు. అక్కడలేదు. పూజ మందిరంలో చూసాడు. పెరటిలో చూసాడు. ‘ఎక్కడికి వెళ్ళినట్టు ?’అనుకుంటూ బెడ్ రూం లోకి వెళ్ళాడు. మంచం మీద పడుకుని వుంది.

‘వేళగాని వేళ పడుకుందేమిటి?’

“శారదా! శారదా! “ అంటూ తట్టి లేపాడు. చల్లగా తగలడంతో ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టినవాడిలాగా చెయ్యి వెనక్కి తీసుకున్నాడు. ‘శారదా!’ అంటూ గావుకేక పెట్టాడు. కొడుకు కోడలు పరుగెత్తుకు వచ్చారు.

“ఎంతపని చేశావు శారదా! నన్ను ఒంటరివాణ్ణి చేసి నీ దారి నువ్వు చూసుకున్నావా? ఇది నీకు న్యాయమా చెప్పు? నువ్వు కూడా నన్ను మోసంచేసావు” అంటూ గుండెలవిసేలా భార్య మీద పడి ఏడుస్తున్నాడు. ప్రేక్షకులలాగా చూస్తూ నిలుచున్నారు కానీ దగ్గరకు వెళ్ళలేదు మధు, సవితలు.

శారద చేతిలో ఏదో కాగితం రెపరెపలాడుతుంటే తీసి చూసాడు సీతారామయ్య. వచ్చీరాని అక్షరాలతో రాసి వుంది “ఏమండీ ! నాకు తలకొరివి మీరే పెట్టండి” అని!

చుట్టుప్రక్కల వాళ్ళందరూ వచ్చారు. జరుగవలసిన కార్యక్రమాలన్నీ సీతారామయ్యగారే దగ్గరుండి చూసుకున్నారు. ఎంతోమంది ఎన్ని రకాలుగా చెప్పినా భార్య మాట జవదాటలేదు మధు. నలుగురూ నాలుగు విధాలుగా తిట్టిపోశారు. అయినా రవ్వంత కూడా చలించలేదు.

'తల్లికి చివరిదశలో కూడా సేవ చేయలేని ప్రబుద్ధుడు'అనుకున్నారు అంతా.

ఎక్కడిదక్కడ అయిపోయాక ఒకరోజు మధును పిలిచి “ఇదిగో నీకు రావలసిన వాటా!” అంటూ కాగితాలు ఇచ్చాడు ఎవరికో పరాయివాడికి చెపుతున్నట్టుగా చెప్పి. ఎగిరి గంతేసినట్టుగా అందుకున్నాడు తండ్రి చేతిలోని పేపర్లు. చదివి చూసాక ముఖం పాలిపోయింది. తల క్రిందకు వంచుకున్నాడు తప్పు చేసినట్టుగా.

“చూడు! మాకు తలకొరివి పెట్టే కొడుకే లేనప్పుడు ఆస్తి మాత్రం ఎందుకివ్వాలనిపించింది. కోట్ల విలువ చేసే ఆస్తి నా స్వార్జితం. నా ఇష్టమొచ్చినట్టుగా చేసుకునే హక్కు నాకుంది. అందుకే ఈ ఇల్లుతో సహా అనాధ శరణాలయానికి రాసిచ్చా. రేపు నేను పోయినా, వాళ్ళే తీసివేసేలా వీలునామా కూడా రాయించేసాను. ఇక నేను బ్రతికినన్నాళ్ళు అక్కడే హాయిగా బ్రతుకుతాను. ఇక మీరు వెళ్ళొచ్చు” అంటూ తన బట్టలు సర్దుకోసాగాడు సీతారామయ్య .

“నాన్నా! నన్ను క్షమించండి” అంటూ తండ్రి రెండు పాదాలను పట్టుకుని కన్నీటితో కడుగసాగాడు. "నాన్నా! అహంకారంతో కన్నుమిన్ను కానక మిమ్మల్ని బాధపెట్టాను. నామీదే పంచప్రాణాలు పెట్టుకున్న అమ్మను పోగొట్టుకున్నాను. ఉన్న మిమ్మల్ని వదులుకోను. నాకళ్ళకు పట్టిన మబ్బులు విడిపోయాయి. మీరు ఎక్కడికీ వెళ్ళొద్దు . నాకు ఆస్తి అక్కరలేదు. మీరే కావాలి!” అంటూ తండ్రిని చుట్టేసుకున్నాడు.

విరక్తిగా నవ్వాడు సీతారామయ్య. "బాబూ! నీకళ్ళకు పట్టిన మబ్బులు విడిపోయాయేమోగానీ నా ప్రాణంలో ప్రాణమైన నా శారదను నానుండి దూరం చేసావు. నా శారద లేకుండా నేను ఎవరి దగ్గరా వుండదలచుకోలేదు. నా నిర్ణయానికి తిరుగులేదు. నీలాంటి కొడుకును కన్నందుకు నాకీ శాస్తి జరగవలసిందే. నా శేష జీవితం అక్కడే గడిచిపోతుంది. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో! రేపు నీ కొడుకు నీలాగా తయారవకుండా చూసుకో. ఎందుకంటే మేము అనుభవించిన బాధ నువ్వు పడకుండా ఉండాలని కన్నతండ్రిగా కోరుకుంటున్నా. వస్తా!” అంటూ “ఇదిగో! ఇవి మీ అమ్మ నగలు! ఇవి ఎవరో పెట్టుకోవడం నాకిష్టముండదు. అందుకే కోడలిని పెట్టుకొమ్మను” అవి అందించి ఒక చేత్తో బ్యాగు, ఇంకో చేత్తో శారద ఫోటో తీసుకుని భారమైన గుండెతో బయటకు నడిచాడు. వెనక్కి చూడకుండా గబగబా ముందుకు సాగిపోయాడు కొత్త ప్రపంచం వైపు.

మధు పిచ్చివాడిలా చూస్తున్నాడు తండ్రి వెళ్ళిన వైపే. ‘తను ఎంత దుర్మార్గంగా ఆలోచించాడు?తన పాపానికి నిష్కృతి లేదు అటు కన్నతల్లిని పొట్టన పెట్టుకున్నాను. ఇటు కన్నతండ్రిని అనాథను చేసుకున్నాను. భార్య మాటలు విని అందలంలో వూరేగాలనుకున్నాను. నా పాపానికి ప్రాయశ్చిత్తం కావాలంటే నేను ఇక్కడే వుండిపోవాలి. మధ్య మధ్యలో వెళ్లి నాన్నను చూడాలి. అమ్మ ఆత్మకు శాంతిని చేకూర్చాలి. కష్టపడితే కానీ నాకు విలువ తెలిసి రాదు’ అనుకుంటూ తన ప్రయాణం మానుకున్నాడు. అతని అవతారం చూసి సవిత కిక్కురుమనకుండా వుండిపోయింది.

॥॥ అయిపోయింది॥॥

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.



రచయిత్రి పరిచయం : B.లక్ష్మి శర్మ నా గురించి కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను, నేను సికింద్రాబాద్ లాలాపేటలో వుంటాను, నాకు చిన్నప్పటి నుండి కథలు రాయడమన్నా,చదవడమన్నా చాలా ఇష్టం. 1991 నుండి రాయడం మొదలుపెట్టాను. ఎక్కడ ఏ పేపర్ కనిపించినా రాసాను. కానీ ఎవరికి చూపలేదు, చెప్పుకోలేదు. ఈమధ్యనే మా అమ్మాయిలు, మావారు చూసి కథలు బాగున్నాయి కదా, ఏదైనా పత్రికకు పంపమంటే పంపిస్తున్నాను, కర్నూలు గణేశ్ పత్రికలో నేను రాసిన కవితలు, కథలు చాలా వచ్చాయి. నాకు ఇద్దరమ్మాలు, ఒక బాబు. అందరూ విదేశాల్లోనే వున్నారు. ప్రస్తుతం నేను, మావారు కూడా అమెరికాలోనే వుంటున్నాము




174 views0 comments
bottom of page