top of page

చైతన్య జ్యోతి


Chaithanya Jyothi written by Lakshmi Sarma B

రచన : B. లక్ష్మీ శర్మ

'జ్యోతీ! నువ్వు నిజంగా నిరంతరం వెలిగే జ్యోతివే. నా జీవితానికి జీవం పోసిన జీవనజ్యోతివి. నీ కోసం నా ప్రాణాలు ఇవ్వగలను. అంతకంటే నేనేమిచ్చి నీ ఋణం తీర్చుకోగలను? బహుశా అది ఈ జన్మకు సాధ్యం కాని పని అని నాకు తెలుసు.

అందుకే మరు జన్మంటూ వుంటే, నీ ఋణం తీర్చుకునేలా చెయ్యమని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను.' నా దేవత నా హృదయకవాటాలను తెరుచుకుని వచ్చినవేళ తన జ్ఞాపకాలను తలచుకుంటూ గతంలోకి వెళ్ళాడు చైతన్య.


చైతన్య పుట్టుకతోనే అవిటివాడుగా ఉన్నత కుటుంబంలోనే పుట్టాడు.

కానీ! పుట్టుకతోనే తల్లి చనిపోయింది. చైతన్యకు నలుగురు అన్నలున్నారు. ఎవరుండి మాత్రం ఏం చెయ్యగలరు.

అందరితో సమానంగా చూసాడు చైతన్యను చైతన్య తండ్రి నాగభూషణం. ముగ్గురుకొడుకుల పెళ్ళిళ్ళు చేసాడు.నాలుగవ వాడు ఎలాగైనా పైకిరాగలడు. ఇక మిగిలింది చైతన్య.

అంగట్లో అన్నీ వున్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు. ఆస్తికేం లోటులేదు కానీ. ఈ అవిటివాణ్ణి చూసే వాళ్ళెవరు అన్న బెంగతో మంచం పట్టాడు నాగభూషణం.చైతన్యను చూసుకోవడానికి

ఒక మనిషిని పెట్టాడు. ఆమె ఆలనాపాలనలోనే పెరిగిపెద్దవాడవుతున్నాడు. ఆ సమయంలోనే నాగభూషణం హరీ అన్నాడు. ఆస్తి పంపకాలు కానేలేదు. ఆ ఇంట్లో తండ్రి తప్ప చైతన్యకు ఆత్మీయులే లేరు. వున్న కన్నతండ్రి చనిపోయాడు.

ఆదరించేవారే కరువయ్యారు. వేళకింత కుక్కకు పడేసినట్టు పడేసేవారు వదినలు అదీ పోట్లాటలమీద. తండ్రి వుండగానే చైతన్య కు గీరలబండి చేయించాడు. ఇక అన్నలకైతే తమ్ముడనేవాడు ధ్యాసే లేదు. చైతన్య పరిస్థితి రోజు రోజుకు నరకం కాసాగింది. ఊహ తెలియక ముందైతే వాళ్ళు తిట్టినా కొట్టినా అవిటివాడని వెక్కిరించినా ఏమీ తెలిసేది కాదు. కానీ ఇప్పుడు నవ యువకుడు. అన్నీ అర్ధం కాసాగాయి. చైతన్య అవిటివాడే కావచ్చు కానీ! అతనికీ మనసుంది. కోర్కెలున్నాయి. నలుగురితో కలిసి తిరగాలని. చదువుకోవాలని మనసు ఆరాటపడుతుంది. చిన్నప్పుడు అడిగితే నీవే చక్కగా లేవు. కోరికలకేం తక్కువలేదని హేళన చేసారు వదినలు.

ఏది ఏమైనా చైతన్య లో చైతన్యం వచ్చింది. వాళ్ళ దృష్టిలో చైతన్య ప్రాణం వున్న ఒక బొమ్మ. ఇంత తిండి పడేస్తే కిక్కురుమనకుండా పడివుంటాడని వాళ్ళ నమ్మకం. కానీ ! ఇప్పుడు చైతన్య ఎదురుతిరిగే వయసువాడయ్యాడు. అందుకే ఇక వూరుకోదలచుకోలేదు.


ఒకరోజు అన్నయ్యా! పిలిచాడు చైతన్య ఆఫీస్ కు వెళుతున్న పెద్దన్నయ్యను. ఈసడింపుగా వెనుతిరిగి చూసి. ఏమిటి పిలిచావు అడిగాడు కటువుగా. అన్నయ్యా నేను చదువుకుందామనుకుంటున్నాను అందుకని చెప్పడం ఆపాడు చైతన్య. పకాలున నవ్వి, ఏమిటీ నీకు చదువా! చాలు చాలు ఎవరైనా వింటే నవ్వి పోగలరు. నీ బ్రతుక్కి చదువొకటే తక్కువయిందా అంటూ హేళన చేసాడు పెద్దన్న సురేష్.


చైతన్య మనసు చివుక్కుమంది. ఆవేశం కట్టలు తెంచుకుంది. కానీ. తమాయించుకున్నాడు. అదికాదన్నయ్యా. నాకు నా వాటా పంచివ్వు. నేను ఎలాగోలా కష్టపడి చదువుకుంటాను. నా బ్రతుకు నేను బ్రతుకుతాను. నేనూ మనిషినే. మీలో ఒకడినే . నేను మీలాగ అందంగా పుట్టకపోయినా. నాకు చదువుకోవాలని వుంది. నన్నర్ధం చేసుకోండి అన్నయ్యా. నేను అవిటి వాడినే కావచ్చు. నా మనసుకు అవిటితనం వుండదు కదా. ఇన్నాళ్ళు మీరేమి చెప్పినా విన్నాను.

ఈసడించుకుంటూ వదినలు శాపనార్థాలతో పాటు పెట్టిన తిండి తిన్నాను. ఇక నా వల్ల కాదన్నయ్యా అంటూ అతని కాళ్ళు పట్టుకుని బావురుమన్నాడు చైతన్య .


సురేష్ మనసు కరిగిపోయింది. పైకి లేపి గుండెలకదుముకున్నాడు. అంతలోపే సురేష్ భార్య ఆహా! అబ్బో ఈయనగారి బ్రతుక్కు ఇదొక్కటే తక్కువయిందా? మీకేం భార్యా పిల్లలున్నారనా. నీకెందుకు ఆస్తి? చేతులు తిప్పుతూ వెటకారంగా అంది.


వదినా పెద్దదానివని గౌరవిస్తున్నా. ఈ విషయంలో నీ ప్రమేయం అవసరంలేదు. నేను అన్నయ్యతో మాట్లాడుతున్నాను అన్నాడు చైతన్య. చైతన్యాా ఇప్పుడు నీకు వేరే వుండవలసిన అవసరం ఏమొచ్చింది. ఇక్కడ తిండికి బట్టకు దేనికి లోటు లేదు కదా!

అడిగాడు సురేష్ చైతన్య ను భార్యకు భయపడుతూ.


అన్నయ్య ఇందులో అర్ధం కాకపోవడానికి ఏముంది. నీకొక అవిటి తమ్ముడున్నాడని, వాడికి ఇంత ప్రేమ ఆప్యాయత అనురాగంతో కూడిన పలకరింపు ఇవ్వాలని ఏనాడైనా ఆలోచించావా. కనీసం కట్టుకోవడానికి మంచి బట్టలు, మీతో కలిసి తినే అదృష్టాన్ని ఇచ్చావా. అయినా నా పిచ్చి కాకపోతే, కన్నతల్లే నా అవిటితనానికి భయపడి పురిటిలో నన్ను వదిలిపెట్టింది. కన్నతండ్రి నా అవస్థ చూడలేక తన దారి తాను చూసుకున్నాడు. వాళ్ళకే పట్టని నన్ను మీరెందుకు ప్రేమలు కురిపిస్తారు. అన్నయ్యా నన్ను క్షమించు. నిన్ను అనవసరంగా బాధపెడుతున్నాను. నా వాటా మొత్తం ఇవ్వమనటం లేదు. నాకు వచ్చేదానిలో సగం ఇవ్వండి చాలు అన్నాడు చైతన్య .


ఏమనుకున్నారో ఏమో మొగుడుపెళ్ళాలు ఒకరికొకరు సైగ చేసుకున్నారు. అలాగే చైతన్యా! నీ ఇష్టప్రకారమే చేద్దాం. నేను లాయరుతో మాట్లాడుతాను అంటూ వెళ్ళిపోయాడు.


చైతన్య కూడా తన మూడు చక్రాలబండిని తోసుకుంటూ బయటకు వచ్చాడు. రోడ్డుమీద ఎదురుగా వస్తున్న కారును గమనించలేదు. మనసంతా బాధతో ఏవో ఆలోచనలలో ధ్యాసలేకుండా వుండడంతో, కారు చిన్నగా డాష్ ఇచ్చివెళ్ళింది. చక్రాలబండి బోర్లాపడిపోయింది పెద్ద ప్రమాదం ఏమి కాలేదు. పరుగు పరుగున ఒకమ్మాయి వచ్చి చైతన్య ను లేవదీసింది.ఆమె వైపు చూసాడు కృతజ్ఞతగా ఇద్దరి కళ్ళు కలుసుకుని విడివడినాయి. ఎందుకండి అంత పరధ్యానంగా వెళుతున్నారు అడిగింది ఆ అమ్మాయి. బ్రతుకుమీద విరక్తి వున్నవాడికి పరధ్యానం కాక ఇంకేం వుంటుంది చెప్పండి నిరాశగా అన్నాడు చైతన్య. అంటే మీకు బ్రతుకు మీద విరక్తి కలిగిందన్నమాట. బ్రతుకుమీద విరక్తి కలిగినవాళ్ళందరూ మీ లాగా చావుకు సిద్దపడలన్నమాట. ఏం పాపం! ఏవరైనా మోసం చేసారా, లేక ప్రేమలో ఓడిపోయారా చెప్పండి అడిగింది.


ప్రేమ! నవ్వాడు చైతన్య . ఏమండి నన్ను చూస్తే మీకు హేళనగా అనిపిస్తుందా. లేకపోతే ఏంటండి? నాలాటివాడిని కూడా ప్రేమించే వాళ్ళుంటారా చెప్పండి అడిగాడు చైతన్య.

ఆమె మనసు చివుక్కుమంది. సారీ అండి మిమ్మల్ని హేళన చెయ్యడంలేదు. మీకేం తక్కువయింది? అందమైన మిమ్మల్ని ప్రేమించకూడదా. మీకు అవిటితనం వున్నంతమాత్రాన మీకు మనసుండదా. అడిగింది. చూడండి మీ పేరు చెప్పలేదు అడిగాడు చైతన్య . నా పేరు జ్యోతి. నేనూ నిరాశ నిస్పృహలతో బ్రతుకుతున్న దానినే. అందమైన శరీరం కప్పుకున్నానే కానీ, ఆప్యాయత అనురాగాలకు నోచుకోలేదు. ఏ క్షణంలోనైనా, కనురెప్ప మూతపడినా, కాటువేసే కాలనాగులున్నారు. ఇప్పుడు చెప్పండి నేను మీలాగే పిరికితనంతో ఆలోచించానా. నేను బ్రతకడం లేదూ. మీలా వెర్రిమొర్రి ఆలోచనలతో నిండు జీవితాన్ని నాశనం చేసుకున్నానా చెప్పండి అంది జ్యోతి. నువ్వన్నది నిజమే ఒప్పుకుంటాను. కానీ నన్ను పెళ్ళిచేసుకునేందుకు ఎవరు ముందుకు వస్తారు. నాలాంటి అవిటివాణ్ణి చేసుకున్న వాళ్ళను నేను సుఖపెట్టగలనా! చెప్పు జ్యోతీ.


ప్లీజ్! మిమ్మల్ని మీరు కించపరుచుకోవద్దు. మిమ్మల్ని పెళ్ళిచేసుకునేందుకు ఎవరు ముందుకురారు అన్నారు కదా! మీకు అభ్యంతరం లేకపోతే నేనే ముందుకు వస్తాను. అంది సిగ్గుపడుతూ.

జ్యోతీ! నా మీద జాలిపడుతున్నావు కదూ అడిగాడు చైతన్య.

చూడండి! నేను మీకు ఈ రోజు తెలుసు కానీ, గత రెండు సంవత్సరాలుగా మిమ్మల్ని చూస్తున్నాను. ప్రతిరోజు మీరు ఇక్కడకు రావడం, నేను అదే సమయానికి బస్సుకోసం రావటం జరిగేది. ఎందుకో మిమ్మల్ని చూస్తే నేను పడేబాధలన్నీ మరచిపోయేదాన్ని. ఏ ఒక్కరోజైన మీరు కనిపించకపోతే నామనసు విలవిలలాడేది. మీ గురించి తెలుసుకోవాలనుకున్నాను. పెళ్ళి అయిందా, పిల్లలున్నారా అని .ఇన్నాళ్ళకు నా అదృష్టం పండింది. అందుకే మిమ్మల్ని ఆదుకోవడం చాలా గమ్మత్తుగా జరిగిపోయింది అంది నవ్వుతూ.


ఆమెనే కన్నార్పకుండా చూస్తున్నాడు చైతన్య. జ్యోతీ! నీకెందుకు నామీదింత ప్రేమ? నిన్ను సుఖపెట్టగలనుకున్నావా. నాకు చదువురాదు, నయాపైసా సంపాదనలేదు. ఏం చూసి నన్ను

చేసుకోవాలనుకుంటున్నావు అడిగాడు బాధగా.

చిన్నగా నవ్వింది జ్యోతి. చైతన్యా! మీకు ఏం లేకున్నా సరే మిమ్మల్నే చేసుకుంటాను. చదువు సంధ్యలుండి సంపాదనవున్న వాళ్ళకులేని అమృతహృదయం మీ దగ్గరుంది. అంతకంటే ఏం కావాలి ఏ స్త్రీ కైనా అడిగింది ఎంతో ఆనందంగా.

నిజంగా చెబుతున్నావా జ్యోతీ, అడిగాడు చైతన్యా . ఇంకా నమ్మకం కుదరక. మిమ్మల్ని ఎలా నమ్మించాలో నాకు తెలియడం లేదు . అంటూ గబుక్కున అతని తలపట్టుకుని గాఢంగా నుదిటిమీద చుంబించింది. చైతన్య చేతులు జ్యోతి వీపునునిమిరాయి ఆప్యాయతగా. తమకంగా గుండెలకదుముకున్నాడు జ్యోతిని. ఒకరినొకరు మైమరచిపోయారు ఒక్క క్షణం. ఇప్పుడైనా నామీద నమ్మకం కలిగిందా మీకు అంది. నమ్మకం కాదు జ్యోతీ, నా మనసు పరుగులు తీస్తోంది ఇలాంటి ఉత్తమురాలు నాకోసం వచ్చినందుకు. అంటూ అమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు ఆప్యాయంగా.

జరిగిన విషయం అంతా చెప్పాడు సురేష్ తో. చాలా సంతోషపడ్డాడు సురేష్ . మీ ఇద్దరికి రేపే గణపతి గుడిలో పెళ్ళికి ఏర్పాటు చేస్తాను అని చెప్పాడు. గడియారం అర్ధరాత్రి రెండు గంటలు కొట్టడడంతో మెలకువ వచ్చింది చైతన్యకు. తెల్లవారితే నాకు జ్యోతితో వివాహం. తలచుకుంటేనే మనసు పరవళ్ళుతొక్కుతుంది.చైతన్యా! త్వరగా తయారవు మనం వెళ్ళాలి, తొందరచేసాడు సురేష్. ఇంట్లో ఎవరికీ చెప్పదలుచుకోలేదు. తన మనసుకు తగిలిన గాయాన్ని వాళ్ళ పెళ్ళిచేసి మాన్చుకోవాలి అనుకున్నాడు. అందుకే ఎవరికీ చెప్పలేదు. అవిటి వాడైన తమ్ముణ్ణి అన్ని బాధలకు గురిచేసారు.

చైతన్య క్షణంలో తయారై వచ్చాడు. ఇద్దరుకలిసి బస్ స్టాప్ దగ్గరకు వచ్చేసరికి జ్యోతి కూడ వచ్చేసింది. ముగ్గురు కలిసి ఆటోలో గుడికి వెళ్ళారు. ముందే చెప్పి వుండడం వలన పూజారి కూడా వచ్చాడు. పెళ్ళి అయిందనిపించుకున్నారు. పట్టుబట్టలతో పాటుగా తండ్రి ఇచ్చిన తల్లి నగలు జ్యోతి చేతిలో పెట్టాడు. అంతేకాదు చైతన్యకు రావలసిన డబ్బుతోపాటుగా, చైతన్య చేతిని జ్యోతి చేతిలో పెడుతూ, చూడమ్మా జ్యోతీ! మా తమ్ముడిని నీ చేతిలో పెడుతున్నాను. లోకంపోకడ తెలియనివాడు. వాణ్ణి ఎలా చూసుకుంటావో నీ ఇష్టం . వాణ్ణి నీకు అప్పగిస్తున్నాను అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు సురేష్.

అన్నయ్యా! అంటూ గట్టిగా వాటేసుకున్నాడు చైతన్య .

బావగారూ, చైతన్య ఒక్కడేకాదు నేనూ మీదాన్నే ఇప్పుడు. చైతన్యను కంటికి రెప్పలా కాపాడుకుంటాను. ఆ విషయంలో మీరేమి దిగులుపడకండి అంది. సురేష్ కాళ్ళకు ఇద్దరు నమస్కారం చేసారు.

ఇదిగో చైతన్యా! మీకోసం హోటల్ బుక్ చేసాను. ప్రస్తుతానికి అందులో వుండండి. రేపు ట్రైన్ టికెట్స్ తెస్తాను, మీరెక్కడికైనా వెళ్ళి హాయిగా బ్రతకండి చెప్పాడు సురేష్.


మంచి మాట చెప్పారు బావగారూ. ఇక్కడే వుంటే మా వాళ్ళు నన్ను బ్రతకనివ్వరు. మా స్నేహితురాలు విజయవాడలో వుంటుంది. మేము అక్కడికే వెళతాము అంది జ్యోతి.


జ్యోతీ! సిగ్గుపడుతున్నావా, చూడు అంటూ జ్యోతి చుబుకం పట్టుకుని ముద్దుపెట్టుకున్నాడు. సిగ్గులమొగ్గలా ముడుచుకుపోయింది జ్యోతి.

లతలా ఆమెను అల్లుకుపోయాడు చైతన్య .


టక టక చప్పుడవడంతో సిగ్గుపడుతూ లేచి వెళ్ళి తలుపుతీసింది. సురేష్ వచ్చాడు. టికెట్స్ ఇచ్చి వాళ్ళకు కావలసిన సరంజామా అంతా తెచ్చాడు. చక చక బయల్దేరండి ట్రైన్ కు టైం అవుతుంది అంటూ తొందర చేసాడు.అందరు కలిసి రైల్వే స్టేషన్ కు వచ్చారు. ట్రైన్ రడీగా వుంది. చైతన్యా! నిన్ను ఇలా విడిచిపెడుతున్నందుకు చాలా బాధగా వుంది. కానీ ఏం చెయ్యను? మీ అన్నలు, వదినలు మంచివాళ్ళు కారు . అందుకే నీకు ఒక తోడు దొరికింది. ఇకనైనా ప్రశాంతమైన జీవితం గడుపుతావన్న ఆశతో పంపిస్తున్నాను అన్నాడు సంతోషంతో.

అన్నయ్యా! మమ్మల్ని ఆశీర్వదించండి అన్నాడు ట్రైన్ ఎక్కుతూ.

అవును బావగారూ! మీ ఆశీర్వచనం వుంటే కలకాలం హాయిగా జీవితం గడిపేస్తాం అంది జ్యోతి. అలాగే మీరిద్దరూ పిల్లపాలతో కలకాలం హాయిగా వుండండి. ఈ అన్నయ్యను మరచిపోకండి

అని దీవించాడు సురేష్ .


రైలు కదలి వెళ్ళిపోయింది. కల్మషాలకు కుటిలాలకు దూరంగా చైతన్యజ్యోతి ని వెలిగించుకోడానికి కొత్త జీవితానికి పునాదివేసుకోవడానికి వెళ్ళిపోయారు ఆనందంగా చైతన్య, జ్యోతి .


॥॥ శుభం॥॥


గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి.

రచయిత్రి పరిచయం : B.లక్ష్మి శర్మ

నా గురించి కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను, నేను సికింద్రాబాద్ లాలాపేటలో వుంటాను,

నాకు చిన్నప్పటి నుండి కథలు రాయడంమన్న చదవడంమన్న చాలా ఇష్టం, 1991 నుండి రాయడం మొదలుపెట్టాను, ఎక్కడ ఏ పేపర్ కనిపించినా రాసాను, కానీ ఎవరికి చూపలేదు చెప్పుకోలేదు, ఈమధ్యనే మా అమ్మాయిలు మావారు చూసి కథలు బాగున్నాయి కదా ఏదైనా పత్రికకు పంపమంటే పంపంస్తున్నాను, కర్నూలు గణేశ్ పత్రిక లో నేను రాసిన కవితలు కథలు చాలా వచ్చాయి, నాకు ఇద్దరమ్మాలు ఒక బాబు, అందరూ విదేశాల్లోనే వున్నారు,ప్రస్తుతం నేను మావారు కూడా అమెరికాలోనే వుంటున్నాము

144 views0 comments
bottom of page