
Bahumathi written by Lakshmi Sarma B.
రచన : B. లక్ష్మీ శర్మ
ఉరుకులు పరుగులు ఎక్కడ చూసిన జనాలు,ఒకవైపు ఏడుపులు ఆత్రుతలు, ఇంకోవైపు వెర్రిచూపులు, మరోవైపు ఆనందం. ఇవి చాలవన్నట్టు డాక్టర్ల హంగామ , వార్డులో నుండి ఈ వార్డులోకి, అక్కడనుండి ఆపరేషన్ థియేటర్ లోకి. ఇక నర్సులైతే మేమే పెద్ద డాక్టర్లమన్నంత బింకం, ఎవరేది అడిగిన విసుక్కోవడం. వీళ్ళకు దగ్గట్టుగా ఆయాలు, మేము నర్సులకు తీసిపోము అన్నట్టుగా వాళ్ళు. ఇక అటెండరులు మీరుందరు ఇక్కడెందుకున్నారు ఇంతమంది ఇక్కడుంటే మా పెద్ద డాక్టర్ వచ్చి మమ్మల్ని తిడతారు. పేషంట్ కు ఒక్కొక్కరే వుండాలి మిగతావాళ్ళంత బయటకూర్చోండి నడవండి అంటూ మెడలమీద చేతులువేసి బయటకు తోసివెయ్యడం. ఎవరైనా పదో పరకో చేతిలో పెడితే గమ్మున వాళ్ళను వదిలిపెట్టయ్యడం. ఇంకా ఎవరైన రెకమెండేషన్ వాళ్ళు వుంటే కూర్చోండి మేడమ్ , సార్ అంటూ గౌరవంగా మాట్లాడడం. ఎటొచ్చి డబ్బలేని వాడి పరిస్తితి దండుగ.
ఇవన్ని చూస్తు తనలో తానే అనుకున్నాడు. ఏమిటో కార్పోరేట్ హాస్పిటల్లో అలానే వుంది, గవర్నమెంటు హాస్పిటల్లో అలానే వుంది. ఈ మనుష్యలకు డబ్బు పిచ్చి పోయేదెపుడు , ఈ మనుషులు మారేదెపుడు బీదవారికి చక్కటి వైద్యం అందేదెపుడో అన్యమనస్కంగ ఆలోచిస్తూ కూర్చున్నాడు.
"హాలో సార్ అరవింద్ గారంటే మీరేనా" అంటూ ఒక సిస్టర్ వచ్చి అడిగింది.
'అవును నేనే" అంటూ గబాల్న లేచాడు అరవింద్.
'మీరొకసారి నాతో రండి, డాక్టర్ గారు మిమ్మల్ని రమ్మన్నారు" అంటూ వెళ్ళింది. అనుసరించాడు అరవింద్ సిస్టర్ ను.
"రండి అరవింద్ కూర్చోండి. మీతో ఒక విషయం మాట్లాడాలి" అన్నాడు డాక్టర్ మహేష్.
"చెప్పండి డాక్టర్" ,అంటూ కూర్చిలో కూర్చున్నాడు.
"నేను చెప్పేది మీరు కాస్త జాగ్రత్తగా వినండి. మీ అవిడ అరుణకు యాక్సిడెంట్లో పొత్తికడుపు బాగా దెబ్బతిన్నది , అంతే కాదు ఇక ఆమె ఎప్పటికి తల్లి అయ్యే అవకాశం లేదు. గర్భసంచిని తొలిగించాల్సి వచ్చింది! ఆమె సంసార సుఖానికి కూడా పనికిరాదు, చాల దెబ్బతిన్నాయి ఆమె నరాలన్ని. కాలు ఒకటి విరిగింది కట్టుకట్టాము బాగుపడడానికి చాలా కాలం పడుతుంది. కాని ఈ విషయాలు ఆమెకు తెలియనివ్వకపోవడం మంచిది. ఎందుకంటే ఆమె మెంటల్ గా అయ్యే అవకాశం వుంది. అంతే కాదు ఆమె ఆవేశంలో ఆత్మహత్య చేసుకునే ప్రమాదం కూడా వుంది. అందుకే కొన్నాళ్ళపాటు ఆమెను జాగ్రత్తగా చూసుకోవటం అవసరం" అంటూ చెప్పడం ఆపాడు డాక్టర్ మహేష్.
"ఓకే డాక్టర్ మీరు చెప్పినట్టుగానే నడుచుకుంటాను తన మనసుకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటాను. తను నా ప్రాణం తను లేకుండా నేను లేను డాక్టర్" చెప్పాడు అరవింద్ కళ్ళల్లో కన్నీరు ఉబికివస్తుండగా.
"అరవింద్ మీ బాధను నేను అర్ధం చేసుకోగలను కాని ఏమి చేయ్యలేను , మీరు వెళ్ళి మీ ఆవిడను చూడొచ్చు" చెప్పాడు డాక్టర్ మహేష్.
మనసులోనే బాధను దిగమింగుకుంటు అరుణ దగ్గరకు వెళ్ళాడు. మగతనిద్రలో
వున్నట్టుంది. రెండుసార్లు పిలిచినా పలకలేదు. నుదుటి మీద చేయ్యివేసి అరుణా అని ఆప్యాయంగా పిలిచాడు.
ఆ ఆప్యాయమైన పిలుపుకు కళ్ళు తెరవకుండా వుండలేకపోయింది. ఎదురుగా మసక మసకగా కనిపిస్తున్న భర్తను చూసి "నేను బ్రతికే వున్నానా , మీకేం కాలేదు కదా !" అడిగింది మాటలు తడబడుతుండగా ఇంకా మత్తునుండి పూర్తిగా కోలుకోలేదు.
"అరుణ ...నాకేం కాలేదు. నేను బాగానే వున్నాను. నీకు కూడా పెద్ద ప్రమాదం తప్పింది. ఆ దేవుడి దయవలన ఇద్దరం బ్రతికి బయటపడ్డాం. నిన్ను వారం రోజుల్లో ఇంటికి పంపిస్తారట నువ్వు హాయిగా రెస్ట్ తీసుకో దేని గురించి ఆలోచించకు" అంటూ అరుణ తల నిమురుతు పక్కనే కూర్చున్నాడు లోపల నుండి తన్నుకు వస్తున్న బాధను అణిచిపెట్టుకుంటూ.
"ఏమండి నా కాలు తీసివేసారు నేనెలా నడవాలి, మీకు ఎలా చెయ్యాలి" అని అరవింద్ చేతులు పట్టుకొని బావురుమంది.
"అరుణ.. నువ్విప్పుడు అవన్నీ ఆలోచించవద్దు. హాయిగా కళ్ళుమూసుకుని పడుకో, తరువాత ఆలోచిద్దాము నేనిక్కడే వుంటాను" అన్నాడు అరవింద్ అరుణను ఊరడిస్తూ.
బలవంతంగా కళ్ళుమూసుకుంది. "అరవింద్... హాయిగా రెస్ట్ తీసుకోవాలా, ఇక నాకు మిగిలింది ఇదే కదా ! నీకు తెలియదు అరవింద్ నాకు ఆపరేషన్ చేసేటప్పుడు డాక్టర్లు మాట్లాడిన మాటలు నేను విన్నాను నాకు మొత్తం మత్తు రాలేదు. నీకు ఎందుకు పనికి కాని నన్ను ఆ భగవంతుడు ఎందుకు కాపాడాడో నా కర్ధం కావడం లేదు. మన మన పెళ్ళైనా నాటి నుండి నన్ను నువ్వు నిన్ను నేను ఎలా సంతోష పెట్టాలా అని ఆలోచించుకుని అంత ఆనందంగా వుండేవాళ్ళం. మన ఆనందాన్ని విధి ఓర్వలేకపోయాడు. ఇప్పుడేం చెయ్యను, నీ నుండి దూరంగా వెళ్ళాలా అమ్మో తలుచుకుంటేనే గుండె ఆగినట్టవుతుంది. పోని నీతోనే వుందామంటే, ఏవిధంగా నిన్ను సుఖపెట్టలేని నేను నిన్ను ఎలా భరించగలను. తనలో తానే కుమిలిపోతుంది అరుణ.
అరుణ కనుకొనలనుండి నీరు చూసి ఉలిక్కిపడ్డాడు అరవింద్. "అరుణ... ఏమైంది? ఆ కన్నీరెందుకు.." కళ్ళుతుడుస్తూ అరుణ చెంపకు తన చెంప చేరుస్తూ లాలనగా అడిగాడు.
ఏం లేదు అన్నట్టు తల అడ్డంగా వూపి, అరవింద్ చెయ్యి గట్టిగా పట్టుకుంది కళ్ళు
తెరవకుండానే. వారం రోజులకు డిశ్చార్జి చేసారు అరుణను. వీల్ చైర్ లో ఇంటికి తీసుకవచ్చాడు. ఇంటికి రావడంతో భర్తను పట్టుకుని బావురుమంది అరుణ.
" అరవింద్ నాకు చచ్చిపోవాలనుంది నీకు ఎందుకు పనికిరాని ఈ మోడును నువ్వేం చేసుకుంటావు." అని బోరుబోరుమని ఏడుస్తుంటే, అరవింద్ కూడా ఇక ఆగలేకపోయాడు తన మనసులోవున్న వేదనంతా ఒక్కసారిగా బయటకు వెళ్ళబుచ్చాడు
అరవింద్ వెంటనే తేరుకున్నాడు డాక్టర్ చెప్పింది గుర్తుకువచ్చి. అరుణను ఊరడించి
జరిగిన విషయమంతా ఒకరికొకరు చెప్పుకున్నారు.
"ఏమండి మీరు మళ్ళి పెళ్ళి చేసుకుంటారా" అడిగింది ఒకరోజు ఉన్నట్టుండి అరుణ.
ఆ ఒక్క ప్రశ్నలో ఎన్ని ప్రశ్న లో ఉన్నాయి. 'నన్ను వదిలేస్తారా , నాకు మీరు దూరం
అవుతారా,నన్ను ఒంటరి దాన్ని చేస్తారా , మీరు లేకుండా నేను బ్రతుకగలనా ,' ఇలాంటివి ఆ ఒక్క ప్రశ్నలో ఉదయించాయి.
అరవింద్ కు అర్థమైంది ఆ ప్రశ్న ," అరుణా" అంటూ ఆత్రంగా దగ్గరకు తీసుకుని గుండెలకు
అదుముకున్నాడు గట్టిగా. "నాకు ఇలానే జరిగి వుంటే నీవు నన్ను విడిచి వెళ్ళేదానివా , మరో
పెళ్ళి చేసుకుని హాయిగా వుండేదానివా చెప్పు" అని అరుణ చుబుకం పట్టుకుని అడిగాడు.
"ఏమండి" అంటూ ,అతని నోటికి చేతిని అడ్డంగా "మీరు అలాంటి మాటలు అనకూడదు. మీకు
ఏమైనా జరిగితే నేను ప్రాణాలతో ఉండగలనా" అంది అరుణ. ఆర్తిగా అతని తలను
నిమురుతూ.
"చూసావా నీకొక న్యాయం నాకొక న్యాయమా. చూడు అరుణ మన పెళ్ళిలో నీ మెడలో
మూడు ముళ్ళు వేసినప్పుడే , వేదపండితులు నా చేత నాతి చరామి అని మూడు సార్లు చెప్పించారు. అంటే దాని అర్ధం, కష్టమైనా సుఖమైనా నీకు జీవితాంతం తోడునీడగా, నీకు ఏ కష్టం రానీయకుండా కంటికిరెప్పలా కాపాడుకోమ్మని. అంతే కాదు జీవితం చరమాంకం వరకు ఒకరి చేయి ఒకరు వదలకుండా ఒకరినొకరు అర్ధం చేసుకుని ఆ ఆదిదంపతులు శివపార్వతుల్లా
వుండాలని ప్రమాణం చేయిస్తారు. భర్తకు కాని భార్యకు కాలు చెయ్యి విరిగిందనో లేక పిచ్చిదయిందనో సంసార సుఖానికి పనికి రాలేదనో వదిలి పెడ్డడమనేది ఆ మంత్రాలకున్న విలువ ఏమిటిచెప్పు, మనిషన్న వాడికి వ్యామోహాలు ఉండాలే కాని! అవి ఎంతవరకు , తన ఒంట్లో శక్తి వున్నంత వరకే, కాళ్ళు చేతులు బాగున్నంతవరకు. కాలు విరిగిందని చెయ్యివిరిగిందని కృత్రిమంగాపెట్టుకోలేము, ఒకవేళ పెట్టుకున్నా! అవి శరీరంలో ఇమడలేవు. అలాంటప్పుడు వాటి గురించి ఆలోచించడం ఎందుకు చెప్పు , నీ మనసులో అలాంటి ఆలోచనలు రానివ్వకుండా నా అరుణలా వుండు. నేను ఎప్పటికి నీ అరవింద్ నే అరుణా అంటూ ఆమె రెండు చేతులు పట్టుకుని ఆమె కాళ్ళదగ్గర కూర్చున్నాడు మోకాళ్ళమీద.
అతని రెండు చేతులును తన చెంపలకు ఆనించుకుని , "ఏమండి నేనెంత అదృష్టవంతురాలను" అంటూ పొంగిపోయింది.
"నువ్వే కాదు, నేను అదృష్టవంతుడినే మనకు పెళ్ళయి ఐదు సంవత్సరాలు అయినా
పిల్లలు పుట్టలేదన్న బెంగ ఏనాడు పడలేదు. సమయం వచ్చినప్పుడు పుడతారులే అనుకున్నాము. లేకున్నా పోనిలే , మనం ఒకరికొకరం తోడున్నాము అనుకున్నాము. అందుకే భగవంతుడుఅలా చేసాడు. ఇంకెప్పుడు దేనిగురుంచి ఆలోచించకుండా హాయిగా వుండడం నేర్చుకో" చెప్పాడు అరవింద్. ప్రశాంతం అయినాయి ఇద్దరి హృదయాలు.
ఒకరోజు ఆఫీస్ నుండి వస్తూనే "అరుణా మనింటికి ఎవరొచ్చారో చూడు పిలిచాడు లోపలికి వస్తూ.
ఈమధ్యనే అరుణ కొంచెం తిరుగగలుగుతుంది వీల్ చైర్ లో ,అందుకే అరవింద్ ఆఫీస్ కు
వెళ్ళగలుగుతున్నాడు.
"ఎవరండి ఈ అమ్మాయి? చిన్న బాబుతో వచ్చింది. నాకైతే ఎప్పుడు చూసిన గుర్తురావడం
లేదు" అంది ఆ అమ్మాయిని చూస్తూ.
"మన ఇంటిముందు కూర్చొని ఏడుస్తుంది నేను ఆఫీస్ నుండి వచ్చేవరకు ,ఎవరో నాకు తెలియదు. ఏడుస్తుంటే ఎవరు పట్టించుకోవడం లేదు. నాకెందకో బాధనిపించి దగ్గరకు వెళ్ళాను. ఆమె నా కాళ్ళు పట్టుకుని, సార్ నాకు ఏదైనా పని ఇప్పించండి తిండి లేక నాలుగు రోజులు అవుతుంది.
చిన్న పిల్లాడు ఆకలి మాడిపోతున్నాడు. గిన్నెలు తోముతాను బట్టలుతికిపెడతాను మీరే పని
చెప్పినా చేస్తాను నా బాబుకు నాకింత తిండి పెడితే చాలు మాకు డబ్బులు కూడా వద్దు మీ
ఇంటిలోనే చిన్న జాగ ఇస్తే అక్కడే పడుకుంటాము. దిక్కులేని వాళ్ళం మాకు మీరే దిక్కు సార్ అంటూ కాళ్ళా వేళ్ళా పడి బ్రతిమిలాడుతుంటే నేను ఆలోచించా, మనకు ఎలాగు ఒక మనిషి అవసరం కావాలి కదా !అని ఏమంటావు" అన్నాడు అరవింద్.
"ఏమండి అవిడ అలా బురఖాలో వుంది , ముస్లిమ్ వాళ్ళు మనకెందుకు వద్దండి. నాకెందుకో
భయంగా వుంది, ఎవరు వద్దు ఎలాగోలా మనమే కష్టపడదాము" అంది.
"అమ్మా నేను ముస్లిమ్ కాదు, గత్యంతరం లేక ఇలా బురఖా వేసుకున్నా. ఒంటరి ఆడదాన్ని
కదా ! అంతే కాదు నా ముఖం మీద వేడి నీళ్ళు పడి ముఖమంతా వికారంగా తయారైంది.
నా ముఖం చూస్తే ఏవరైనా అసహ్యించుకుంటారని ముఖం దాచుకోవడానికని బురఖా
వేసుకుంటాను. మీరేం భయపడనక్కరలేదు. నేను గొప్ప కులంలో పుట్టినదాన్నే, విధి ఆడిన
నాటకంలో ఓడిపోయాను. కన్నకడుపుకోసం పని వెతుక్కుంటున్నాను నన్ను నమ్మండి" అంది
ఆ వచ్చినావిడ అరవింద్ వైపు చూస్తూ.
అరుణకు మనసులో కలుక్కుమన్నది. "సరే సరే. ఇంతకు నీ పేరు చెప్పలేదు" అడిగింది
అరుణ.
"నా పేరు అమృత, బాబు పేరు గోవిందండి. వాళ్ళ నాన్న పేరు కలుస్తుందని అలా
పెట్టుకున్నాను. "
"ఓహో. బావున్నాడు మీ బాబు , చూస్తుంటే ముద్దుపెట్టుకోవాలనుంది. సరే మరి నీ గురించి.."
"చూడండి, నా గురించి మీరేమి అడగకండి, సమయం వచ్చినప్పుడు నేనే చెబుతాను. మీరేమి
నా గురించి దిగులుపడద్దు , నాకు ఎవరు లేరు మీకెలాంటి అపకారం జరగదు నా వలన" అంది
అరుణ మాటలకు మధ్యలోనే అడ్డువస్తూ.
అరవింద్ కు బాగా నచ్చింది ఆమె నిజాయితీ. ఎందుకో అరవింద్ మనసులో ఏదో తెలియని
అలజడి జరుగుతోంది.
"ఏమండి నాకైతే పరవాలేదనిపిస్తోంది మీరేమంటారు "అడిగింది భర్తనుద్దేశిస్తూ.
"నాకు అలానే అనిపిస్తుంది. పైగా నీకు మంచి కాలక్షేపం కూడ వుంటుంది" అన్నాడు.
"చాలా సంతోషంగా వుందమ్మా. నువ్వు ఒప్పుకుంటావో లేదోనని చాలా భయపడ్డాను,
నీకు అరవింద్ మీద పీకలవరకు కోపం వుంటుందని , పైగా ఎంత గొడవా చేస్తావేమోనని నిన్ను
మోసం చేసినందుకు అని చాలా వేదన చెందాను. నీకు జరిగిన అన్యాయానికి నాకు దేవుడు ఎంతపెద్దశిక్ష వేసాడో చూసావా, " అని అమృత రెండు చేతులు పట్టుకుని బావురుమంది అరుణ.
అరవింద్ ఆఫీస్ కు వెళ్ళాక.
"ఏమండి మీరు అలా బాధపడడం ఏమి బాగాలేదండి. విధి ఆడే నాటకంలో మనం
పాత్ర ధారులం మాత్రమే, నాకు అలా జరగాలి అని రాసి పెట్టాడు. మీకు ఇలా జరగాలి అని రాసి పెట్టాడు. అయినా చూసారా మళ్ళి మనందరిని ఒకే గూటికి చేర్చాడు. ఇదంతా భగవంతుని లీలా
విలాసం మనం నిమిత్త మాత్రులం "అంది అమృత.
అరుణ గురించి అరవింద్ అంతా చెప్పాడు అమృతకు. ఆమెకు ఏ మాత్రం మనసుకు తాకే
విషయాలు రాకూడదని వస్తే ఆమె తట్టుకునే శక్తి వుండదని మెంటల్ గా మారే అవకాశం
వుందని. అందుకే అమృత ఆమె దగ్గర మాములుగానే వుంటుంది.
"ఏమండి బాబు ఎంత ముద్దొస్తున్నాడు చూడండి. నాకు బాబును చూస్తుంటే అన్ని
మరచిపోతున్నాను హాయిగా వున్నాను. వాడిని చూస్తుంటే మీ పోలికలే కనిపిస్తున్నాయి చూడండి" అంది బాబును ముద్దాడుతూ.
"ఏయ్ అరుణ ఏమిటి నువ్వు మాట్లాడుతున్నది. వాడిలో నా పోలికలేమిటి. ఆమె గాని వింటే
ఏమనుకుంటుంది" అంటూ ఆ బాబును ఎత్తుకుని "ఏరా బాబు మీ నాన్న కూడా నాలాగే వుండే
వాడా చెప్పు" అంటూ చెంపలమీద ముద్దుపెట్టుకున్నాడు.
ఇదంతా చాటునుండి గమనిస్తున్న అమృత అనుకుంది తండ్రి పోలిక రాక వేరే వాళ్ళ పోలిక
ఎందుకొస్తుంది అని.
వాడు కిలకిలానవ్వాడు ఏదో అర్ధమైనట్టుగా. అరవింద్ మనసులో ఏదో తియ్యని అనుభూతి
కలిగింది.
అమృత వచ్చినప్పటినుండి బురఖాతోనే వుంది. ఆమె సమీపంలో వుంటే అరవింద్ తనను
తాను మరచిపోతున్నాడు. ఎక్కడో విన్నట్టుగా వుంది ఆ గొంతు. తనకు బాగా కావలసిన మనిషి అని హృదయం రొద పెడుతుంది. బాబును చూస్తే అచ్చంగా నా పోలికలే కనిపిస్తున్నాయి ఏమిటి విచిత్రం. ఆమెను చూస్తుంటే గతం తాలుకు జ్ఞాపకాలు పదేపదే గుర్తుకు వస్తున్నాయి.
"ఏయ్ పిల్లా ఒక ప్లేట్ ఇడ్లీ వడ ఇవ్వు" అడిగాడు అరవింద్ హోటల్ కు వచ్చి, అదొక
పల్లెటూరు హోటల్ దూరపు చూట్టాల పెళ్ళికి వస్తూ మధ్యలో ఆకలి వెయ్యడంతో బైకును
అక్కడ ఆపి లోపలికి వెళ్ళాడు.
"ఏయ్ ఏవర్నువ్వు , వూరికి కొత్తనా కాస్తా మర్యాద మాట్లాడడం నేర్చుకో పిల్లా గిల్లాఅన్నావంటే
వూరుకునేది వుండదు " అంటూ దబాయించింది ఆ అమ్మాయి.
"అరే నేనిప్పుడు ఏమన్నాని మీకు అంతకోపం అబ్బో కోపంలో మీరు మరీ అందంగా
వున్నారు. ఇంత అందమైన వాళ్ళను చూస్తుంటే మాటలు తడబడి అలా అడిగాను. ఇంతకు నాకు టిఫిన్ ఇస్తారా! లేకా నాతో మాట్లాడుతుంటారా" అన్నాడు.
"అబ్బో ఇంతోటి గొప్ప అందగాడు వచ్చాడని చూస్తు కూర్చుంటాను' మూతి మూడుదిక్కులా
తిప్పి వెళ్ళింది.
పిల్ల జాంపండులా వుంది. అందమైన ఆ ముఖవర్చసు చూస్తుంటే కళ్ళు తిప్పుకోనివ్వనంటూ
న్నాయి. ఆ కళ్ళళ్ళల్లో మిడిసిపడే భావాలు, కోటేరులాంటి ముక్కు, దొండపండులాంటి ఆ
పెదవి నునుపుదేలిన మేని చాయ , చక్కని శరీరాకృతి చూడగానే మతి పోయేట్టున్న
పదహారుప్రాయాల పడుచుపిల్ల. ఆమె అందాన్ని చూస్తూ తనను తాను మర్చిపోయాడు.
టేబుల్ పైన టకటక సౌండ్ కు ఈ లోకంలోకి వచ్చాడు అరవింద్.
"హలో పగటిపూటనే కలలు కంటారా మీ పట్నం వాళ్ళు. చూస్తేనే అర్ధమౌతుంది మీ ఫోజులు.
ఇంద టిఫిన్ తిని మా డబ్బులు మాకిచ్చేసి ఇంటికి వెళ్ళి తీరుబడిగా కనండి కలలు"
అంటూ టక్కున టిఫిన్ అక్కడ పెట్టివెళ్ళింది.
"ఏయ్ పిల్లా సాంబార్ లేదా , ఎలా తింటారనుకున్నావు" అన్నాడు. వయ్యారంగా నడిచి వెళుతుంటే ఆమెనే చూస్తూ.
"ఏయ్ నీకొకసారి చెబితే అర్ధం కాదా! పిల్ల ఏంటి పిల్ల , ఎలా కనబడుతున్నాను నీ కంటికి"
అంటూ మీద మీదకు వచ్చింది పెదాలు అదురుతుండగా.
ఆమెను మరింత రెచ్చగొట్టాలనిపించి, "పిల్ల అనక నీ పేరు పెట్టిపిలవడానికి నేనేం నీ ప్రెండ్
నా లేక నీ బావనా, అయినా నాకు తెలియక అడుగుతాను. ఇంత కోపం వున్న వాళ్ళు ఇలా
హోటల్ నడిపించే బదులు పెళ్ళి చేసుకుని వుంటే సరిపోతుంది కదా!" చురక అంటించాడు
"హలో మర్యాదగా మాట్లాడుతావా లేదంటే నా హోటల్ నుండి వెళ్ళిపోతావా. వూరుకున్నా
కొద్ది మాటలు ఎక్కువౌతున్నాయి" అని గయ్యిమని లేచింది.
"బాగుంది వరస నీ పేరు చెబితే నిన్ను అలానే పిలుస్తా కదా ! ఏదో ఆకలి మీదున్న కదాని
వస్తే బాగానే పెడుతున్నావు మాటలు. నేనేమి వట్టిపుణ్యానికి తిని పోవట్లా నీ డబ్బు నీకిచ్చే
వెళతాను. ఛీ ఛీ నాదే బుద్దితక్కువ పట్నం నుండి వస్తూ, ఈ పల్లెటూరిలో టిఫిన్
తినిడమేంటి ఇన్ని మాటలు పడడమేంటి. అయినా ఎవరింటికి పడుతుందో కాని కట్టుకున్నోడిని రాచి రంపాన పెడుతుంది" గునుగుతూ ఆమెకు వినిపించేలా అని లేవబోయాడు.
గుర్రుగా ఒక్క చూపు చూసి, అంతలోనే తనను తాను సంబాళించుకుని " పాపం మాంచి
ఆకలి మీదున్నాడు ,అయినా నా పేరు తెలియనిది నన్ను ఏమని పిలుస్తాడు. చూస్తే
గొప్పింటి వాడిలాగే వున్నాడు నేనే అనవసరంగా గొడవేసుకున్నాను" అని మనసులో అనుకుని అతనికి సాంబారు ఇచ్చి "నా పేరు వర్షిణి" అంటూ గిర్రున వెనక్కి వెళ్ళిపోయింది.
మనిషిలాగా అందమైన పేరు అనుకున్నాడు. ఎంత చూడొద్దనుకున్నా పదేపదె కళ్ళు
అటువైపే తిరుగుతున్నాయి. అనుకోకుండానే నాలుగు కళ్ళు కలుసుకుని విడిపోతున్నాయి. ఇద్దరి హృదయాలలో అలజడి మొదలయ్యింది. టిఫిన్ తినడం ముగించి డబ్బులు ఇస్తూ చెప్పాడు "నా పేరు అరవింద్ బ్యాంక్ మేనేజర్ని వుండేది పట్నంలో. మిమ్మలను ఇబ్బంది పెట్టి వుంటే క్షమించండి" అని చెప్పి వెళుతున్నాడు.
"మళ్ళి ఎప్పుడు వస్తారు, నన్ను కూడా మీరు క్షమించాలి" అని వెనకనుండి వినిపించింది.
నవ్వుతూ వెనక్కి తిరిగి చూసి "తప్పకుండా మళ్ళి వస్తాను మీ కొరకు" అంటూ గబగబా
వెళ్ళిపోయాడు
తన మనసంతా ఎవరో దోచుకపోయినట్టు బాధపడసాగింది వర్షిణి.
ఏమైంది నాకు ఎన్నడూ లేనిది ఈ రోజు ఇలా అయిందేమిటి. అతన్ని చూడగానే నా మనసేందుకు అలా వుక్కిరిబిక్కిరి అయింది. రోజు ఎంతో మంది వస్తూపోతుంటారు. అతన్ని చూడగానే నా హృదయానందం పొంగింది. అతను నావాడైతే ఎంత బాగుండు. చక్కటి రూపం అరడుగుల అందగాడు. చూడగానే ఆకట్టుకునే రూపం, ఆ కళ్ళల్లో ఏదో ఆకర్షణ. అతను మళ్ళి వస్తాడా ,వస్తే ఏం చెయ్యాలి”నన్ను పెళ్ళి చేసుకుంటావా అని అడగనా , అమ్మో అలా అడిగితే
చులకన అయిపోను, ఒకవేళ ఆయనకు ఇదివరకే పెళ్ళై వుంటే ,అమ్మో అతను నాక్కావాలి మనసులో భయపడుతూ, దేవుడా నాకు అతను భర్తగా చెయ్యి తండ్రి అని వేడుకుంది ఆ రోజంతా రాత్రి నిద్రపట్టక.
"హలో బావా ఏమిటి ఇంత లేటు , ఎంత ఎదురు చూస్తున్నానో తెలుసా నీ కోసం" అంటూ
గబగబా పరుగెత్తుతుకుని వచ్చింది అరుణ. అరవింద్ బైక్ దిగడంతో.
'ఎవరు.. చిన్నప్పుడు రెండు జడలు వేసుకుని ముక్కు కారుతుంటే పైకి ఎగబీల్చుకుంటూ ,
ఎప్పుడు ఎడుపు ముఖంతో వుండే అరుణవా నువ్వు" అన్నాడు ఆమెను ఏడిపించాడానికి.
"ఫో బావా ఇంకా చిన్నపిల్లలాగానే వుంటానేమిటి. ఇప్పుడు చూడు ఎలా వున్నానో" అని
వయ్యారాలు పోయింది అరుణ.
"అబ్బో , ఏమో అనుకున్నా ఆడపిల్లవే అన్నమాట. చిన్నప్పుడు అన్ని మగరాయుని
లక్షణాలు చేసేదానివి బాగామారిపోయావు సుమా" అని అరుణ ముక్కుపట్టుకుని ఆడించాడు అరవింద్.
"అదేమిటమ్మా. బావను వాకిట్లో నిలబెట్టే మాట్లాడుతావా , లోపలికి రానివ్వవా ఏంటీ" అంటూ
వచ్చాడు అరుణ తండ్రి నాగభూషణం.
"చూడండి మామయ్య ! కనీసం ఇంట్లోకి రమ్మనకుండానే ఇటునుండి ఇటే పంపించేట్టుగా
వుంది. మనిషి ఎదిగింది కాని మనసు ఎదగలేదు" అన్నాడు ఆమె అందాలను పైనుండి
క్రిందకు చూస్తూ. అరుణకు సిగ్గేస్తుంది అరవింద్ అలా తనను ఎగాదిగా చూస్తుంటే.
పెళ్ళి హాడావుడి తగ్గాక అరవింద్ ను అడిగాడు నాగభూషణం. "బాబు ఇక మీ పెళ్ళి గురించి
మాట్లాడుదాము ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాము" అని అడిగాడు.
అరవింద్ కు ఒక్కనిమిషం నోట మాటరానట్టు వూరకున్నాడు.
"అదేమిటి బాబు ఏమి మాట్లాడం లేదు. అరుణకు నువ్వంటే పంచ ప్రాణాలు. ఎన్ని
సంబంధాలు వచ్చిన నిన్ను తప్పా ఎవరిని చేసుకోనని భీష్మించుకుని కూర్చుంది. అందుకే నువ్వు ఎక్కడున్నదీ కనుక్కుని నిన్ను పిలిపించాను ఈ పెళ్ళికి". చెప్పడం ఆపాడు నాగభూషణం.
చాటుగా నిలబడి అంతా వింటున్నది అరుణ.
అరవింద్ కు ఇక్కడకు రాకముందు వరకు తనకు ఎలాంటి ఆలోచనలు లేవు. వస్తూ వస్తూ
హోటలుకు వెళ్ళడం అక్కడ వర్షిణి పరిచయం మనసులో ముద్ర వేసుకుంది. క్షణక్షణానికి
ఆమె గుర్తుకువచ్చి మనసు నిలువనీయడం లేదు. ఆమెతోటిదే జీవితం అన్నట్టు గా మది అంతా
ఆక్రమించింది. వర్షిణి పరిచయం కాకుండా వుండి వుంటే, టక్కున సమాధానం చెప్పేవాడేమో
మీ ఇష్టం అని. కాని ! ఇప్పుడు మనసంతా వర్షిణి నిండి పోయింది. తొలి చూపు తొలిప్రేమ
అంటే ఇదేనేమో. మనసులో అనుకుంటూ. "నన్ను క్షమించడి మామయ్యా. నేను అరుణను
చేసుకోలేను. "అంటూ జరిగిన విషయమంతా చెప్పాడు.
అరుణకు తను అల్లుకున్న ఆశా సౌధం కళ్ళముందే కుప్పకూలిపోతున్నట్టుగా అయింది.
దభేల్న కిందపడిపోయింది.
కంగారుగా లోపలికి వచ్చి అరుణను రెండు చేతులతో ఎత్తి మంచం మీద పడుకోబెట్టాడు
అరవింద్. తొలి స్పర్శ ఏదో గిలిగింతలు పెట్టింది.
"చూడు నీ మీద ఇన్ని ఆశలు పెట్టుకున్నా నా కూతురును కాదని నువ్వు ఎలా సుఖపడతావో
నేను చూస్తా. నాకున్నది ఒక్కతే కూతురు , నాకున్న ఆస్తి అంతా తనకే , దాని అందానికి
దాని ఆస్తికి రాజాలాంటి సంబంధం తెచ్చి దర్జాగా పెళ్ళి చేస్తా , అది కళ్ళు తెరిచిలోగా నా
కళ్ళముందు నుండి వెళ్ళిపో , ఇంకొక క్షణం కూడా వుండడానికి లేదు" అంటూ గట్టిగా కేకలేసాడు.
"చూడండి మామయ్య, నేనేం ఇక్కడ వుండిపోవడానికి రాలేదు. మీరు పిలిచారు కాబట్టి ఇన్ని
రోజులకైనా నేను నీ కళ్ళకు కనిపించానని, నాకు తల్లి తండ్రులు ఎలాగు లేరు వున్న
మేనమామ పిలిచాడు కదా ! గతమంతా మరిచిపోయి నన్ను పిలిచాడు అనుకున్నానే గాని నీలో ఇంకాపాత పగ పోలేదని గుర్తించలేకపోయాను. నీలాటోడి ఇంటికి అల్లుణ్ణి అయ్యేకంటే
బిచ్చమెత్తుకునే వాని ఇంటికి అల్లుడయితే చాలా అనందంగా వుంటుంది వస్తా" అంటూ గబగబా బ్యాగుతీసుకుని వెళ్ళిపోయాడు అరవింద్.
కళ్ళల్లో వత్తులు వేసుకున్నట్టుగా అరవింద్ రాక కోసం వెయ్యి కళ్ళతో ఎదిరి చూడసాగింది
వర్షిణి.
వస్తాడో లేదో కూడా తెలియని మనిషి కోసం తపించి పోతుంది. పరిచయమైంది రెండు
రోజులేగాని, ఎన్నో ఏళ్ళ అనుబంధంగా అనిపించసాగింది. ఒకచోట నిలబడలేకపోతుంది మాటిమాటికి హోటల్ బయటకు లోపలకు వస్తుపోతుంది. ఆమె ఆరాటం గమనించిన ఆమె అన్న అడిగాడు.
"ఏమైందమ్మ ఎన్నడూ లేనిది ఈ రెండు రోజులుగా చూస్తున్నాను. నువ్వు దేనీకోసమో ఆరాట
పడుతున్నావు. ఏమైంది ఎవరి కోసం అలా కాలుకాలిన పిల్లిలా తిరుగుతున్నావు" అని.
"అన్నా నాకు నువ్వు గాక ఎవరున్నారు. నీకు చెప్పకుండా నేను ఏది దాచను. కాకపోతే
అతను వస్తాడా , లేదోనని అనుమానంగా వుండి నీకు చెప్పలేదు" అంటూ జరిగిందంత చెప్పి.
"ఆయన వస్తే నాకు ఆతనితో పెళ్ళి జరిపిస్తావా అతను ఒప్పుకుంటే " బేలగా అడిగింది వర్షిణి.
"చూడమ్మా ! నిన్ను ఒక అయ్యా చేతిలో పెడితే, నాకు ఒక బాధ్యత తీరుతుంది. నిన్ను
కోరుకున్నవాడు నువ్వు కోరుకున్నవాడైతే నాకింత కంటే ఇంకా ఏం కావాలి. కాని కోరికలకు హద్దుండాలి,ఎందుకంటే అతనేమో బ్యాంక్ మేనేజర్ అంటున్నావు పట్నం మనిషి ,అసలు అతనికి పెళ్ళి అయిందో లేదో తెలియదు. ఒకవేళ కాకున్నా పల్లెటూరు పిల్లను అందులో హోటల్ లో పనిచేసే పిల్లను చేసుకుంటాడని ఎలా నమ్ముతున్నావమ్మ "అన్నాడు తల నిమురుతూ.
"హలో సార్ ఏమిటి, మీకు పట్నం వాళ్ళంటే మోసగాళ్ళలాగా కనపడుతున్నారా. మాకు
మంచి చెడు తెలుసు." అంటూ అప్పటివరకు వీళ్ళ మాటలువిన్న అరవింద్ ఎదురుగా వచ్చాడు.
నోటమాటరానట్టుగా అలానే నిలబడిపోయారు అన్నాచెల్లెలు. అరవింద్ ను చూడగానే.
సిగ్గుతో తలవంచుకుంది వర్షిణి తపించిపోతున్న మనసుకు తోడు దొరికిందన్నఆనందంతో.
"బాబు మీ గురించే మాట్లాడుకుంటున్నాము. ఇంతలోనే మీరోచ్చారు మరి , మా చెల్లెలు
అన్నది విన్నారు కదా మీరేమంటారు. మాది అత్యాశే కావొచ్చు. కాని ఏ పుట్టలో ఏ పాముంటుందో
ఎవరికి తెలుసు. ఆ బ్రహ్మ దేవుడు ఎవరికెవరిని రాసిపెట్టాడో ఎవరికి తెలుసు తప్పుగా అర్ధం
చేసుకోకండి " అన్నాడు వర్షిణి అన్న.
"చూడండి. నాకు వర్షిణి నచ్చింది. నేను ఒక అనాథనే నాకంటూ ఎవరులేరు. ఇక నా
వుద్యోగం చూసి మీరేమి భయపడనవసరం లేదు. ఎందుకంటే నేనేదో గొప్పగా వున్నవాణ్ణి కాను.
మీరన్నట్టుగా బ్రహ్మ దేవుడు నాకు తనకు రాసి పెట్టినట్టున్నాడు. అందుకే నన్నింత దూరం
తీసుకవచ్చాడు. మీకు అభ్యంతరం లేకపోతే వర్షిణి కి నాకు పెళ్ళి చెయ్యండి. అని తన విజిటింగ్ కార్డు తీసి చూపించాడు అరవింద్.
"బాబు మీకు అభ్యంతరం లేకపోతే మీ ఇద్దరికి పెళ్ళి చేద్దామనుకుంటున్నాను. నాకు ఉన్నది
ఆ దేవుడు ఇచ్చిన ఈ చెల్లెలు మాత్రమే. నాకంటూ ఎవరూ లేరు , మీరిద్దరూ హాయిగా వుంటే
చూడాలని" వుంది అన్నాడు వర్షిణి అన్న.
"బావ మీ ఇష్ట ప్రకారమే జరగినివ్వండి నాకేం అభ్యంతరం లేదు" చెప్పాడు అరవింద్.
అనుకున్నట్టుగానే కొంచెం దూరంలో వున్న దేవాలయానికి వెళ్ళి పూలదండలు మార్చుకుని
వచ్చారు.
"బాబు నా చెల్లిని నీ చేతిలో పెడుతున్నా కంటికి రెప్పలా కాపాడుకో" అంటూ వర్షిణి
చేతిని అరవింద్ చేతిలో పెట్టాడు వర్షిణి అన్న.
ఆనందంతో పరుగులుపెడుతుంది వర్షిణి మనసు. ఆనందడోలికలలో వుయ్యాలలూగుతోంది.
బరువైన కనురెప్పలతో తలెత్తి చూసింది అరవింద్ వైపు.
సినిమాలలో లాగా శోభనం గదిని అలంకరించిండం, పట్టు పరుపులు పందిరి మంచాలు
హంగు ఆర్భాటాలు ఏవి లేకపోయినా,హృదయాన్నే మల్లె పందిరి మంచాన్ని చేసుకుని,
అనురాగాన్నంత పట్టుపరుపులుగా మలుచుకుని , తొలిరేయిని తీపి గుర్తుగా గుండె గుడిలో
పదిలపరచుకోవడానికి సిద్దమయ్యారు కొత్త దంపతులు.
అందానంత ఒకచోట పోగు చేసినట్టుగా , సాదా సీదా పట్టుచీరలో తలవంచుకుని.
నిలుచున్న వర్షిణి దగ్గరకు వచ్చి. ఇదంతా సిగ్గే అంటూ ఆమె చుబుకం పట్టుకుని తల పైకెత్తాడు.
సిగ్గులమొగ్గయంది. తమకంగా గట్టిగా కౌగిలించుకున్నాడు. అలానే పొదివి పట్టుకుని
గుసగుసగా మాట్లాడుతూ పక్క మీదకు చేర్చాడు. కిటికీ గుండా చూస్తున్నా చంద్రుడికి సిగ్గనిపించి
చప్పున మబ్బుల చాటుకు వెళ్ళిపోయాడు. కొత్త జంటను ఏకాంతంగా వదిలి పెట్టి. మూడు రాత్రులు ఊపిరి సలపకుండా మూడు క్షణాలుగా గడిచిపోయాయి.
"బావా నేను వెళతాను. ఇప్పుడు నేను వుంటున్న ఇల్లు చాలా చిన్నది. ఇన్ని రోజులు ఒంటరి
వాణ్ణి కదా ! ఇప్పుడు డబుల్ బెడ్ రూం ఇల్లు చూసుకుని వర్షిణి ని మిమ్మల్ని కూడా తీసుక
వెళతాను. వారం రోజుల్లో వస్తాను" అన్నాడు అరవింద్.
"బాబు! మాకు నీ మీద నమ్మకమే కానీ ! ఎక్కడో చిన్న అనుమానం. నువ్వు మమ్మల్ని
మోసం చెయ్యవు కదా ! ఎందుకంటే వర్షిణి తల్లి అలానే మోసగించబడింది. వర్షిణి
వాళ్ళమ్మ చనిపోతూ నా చేతిలో పెట్టి చనిపోయింది. అందుకే బాబు నా భయమంతా"
అంటూ కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు వర్షిణి అన్న.
"ఛ ఛ మీరలా బెంబేలు పడితే ఎలా ? నేను అలాంటి వాడిని కాను. ప్రాణానికి ప్రాణమైన వర్షిణి
లేకుండా నేను లేను. మీకు అంతా అనుమానంగా వుంటే సరిగ్గా వారం వరకు నేను వస్తాను
ఒకవేళ నేను రాకపోతే ఇదిగో నా విజిటింగ్ కార్డ్. మీరు పోలీస్ కంప్లయింట్ ఇవ్వచ్చు" అని
చెప్పి" ఇంతకు వర్షిణి వాళ్ళమ్మ ఎవరో చెప్పలేదు. ఆహ ఏదో వూరికే తెలుసుకుందామని"
అడిగాడుఅరవింద్.
"సమయం వచ్చినప్పుడు చెబుతాను. మీరు మాత్రం తొందరగా వచ్చి నా చెల్లెలిని తీసుకపొండి."
వర్షిణి కి నల్లని మబ్బులు కమ్ముకున్న ఆకాశం కురవడానికి సిద్దంగా వున్నట్టు, కళ్ళు
వర్షించడానికి వుబికివస్తున్నాయి. మనసంతా శూన్యమయిపోతుంది. అరవింద్ ను ఒక్క క్షణం కూడా విడిచి వుండలేకపోతుంది.
వర్షిణి ని గట్టిగా హృదయానికి హత్తుకుని" ఏడుస్తున్నవా ఇటు చూడు" అని కళ్ళనీరు తుడిచి
"నిన్ను విడిచి నేను మాత్రం వుండగలనా, వీలయినంత తొందర్లోనే వస్తా. నా మనసంతా
ఇక్కడే వుంటుంది. పైకి కనపడే ఈ మనిషి వెళుతుంది. ఏది ఒకసారి నవ్వు ఏయ్ పిల్లా ఇడ్లీ ఇస్తావా"అని జోక్ చేసాడు. గలగలా నవ్వింది వర్షిణి.
"అమ్మయ్య ముత్యాలన్ని రాలిపడ్డట్టున్నాయి ఏది ఏరుకోనివ్వు" అని క్రిందకు వంగాడు.
"ఏరుకున్నవి దోచుకున్నవి చాల్లేగాని. పట్నం వెళ్ళాక నన్ను మర్చిపోకుండా వస్తావు కదూ,
ఈ పేదపిల్లను అన్యాయం చెయ్యొద్దు" అని గొంతులో బాధ సుడి తిరిగితుండగా అతనిని
విడువలేక హృదయానికి హత్తుకుంది. ఇద్దరికి అలానే వుంది వదిలి వెళ్ళాలంటే.
అనుకున్నవి అన్నీ జరిగితే ఈ ప్రపంచంలో దేవుడికంటే నేనే గొప్ప అనుకుంటారనేమో
దేవుడు ప్రతివాళ్ళకు ఎక్కడో ఓ చోట బ్రేక్ వేస్తాడు. అదే విధి విలాసమంటే.
అనుకున్నట్టుగానే కష్టపడి తిరిగి తిరిగి డబుల్ బెడ్ రూం ఇల్లు దొరికించుకున్నాడు. ఇంట్లోకి కావలసిన సామానంత తెచ్చి ఇల్లంత సర్దివేశాడు. మంచాలు పరుపులు కర్టెన్ లు సోపాలు కొత్త సంసారానికి కావలసిన వస్తువులన్ని తెచ్చిపెట్టాడు. స్నేహితుడి భార్యను తీసుకవెళ్ళి వర్షిణి కి కావలసిన చీరలు బ్లౌజులు అన్నీ తెచ్చిపెట్టాడు. ఇంట్లో ఆడవాళ్ళు లేకున్న అంత నీట్ గా పొందికగా సర్దాడు.
వర్షిణి వచ్చాక ఇల్లు చూసి మురిసిపోవాలని , పదిలంగా కట్టుకున్న మన పొదరిల్లు అని చెప్పాలని ఉవ్విళ్ళూరుతూ తిరుగు ప్రయాణం అయ్యాడు అరవింద్.
తానొకటి తలిస్తే దైవమొకటి తలచినట్టుగా , అక్కడ హోటల్ లేదు మొత్తం కాలి బూడిదై
పోయింది. ఒక్క క్షణం ఊపిరాడనట్టయింది. వర్షిణి వాళ్ళు ఏమయ్యారు? ఇంతలోనే ఏం
జరిగింది ఎవరిని అడుగుదామన్న అక్కడ ఎవరు కనిపించడం లేదు. బోరుబోరున దుఃఖం
ముంచుకొస్తుంది. గుండెలవిసిపోతున్నాయి. వర్షిణి వర్షిణి అంటూ ఎలుగెత్తి పిలుస్తున్నాడు. పిచ్చివాడిలాఅటూ ఇటూ పరుగెడుతున్నాడు." నన్ను అన్యాయం చెయ్యకు మోసం చెయ్యకు అని నువ్వే నన్ను మోసం చేసావా ? నువ్వు లేకుండా నేనెలా వుంటాననుకున్నావు." అంటూ హృదయవిదారకంగా ఏడుస్తున్నాడు. అటుగా వస్తున్న ఒక పెద్దమనిషి వచ్చి, "బాబు ఎవరు నువ్వు ఎందుకింతగా బాధపడుతున్నావు. వాళ్ళకు నీకు ఏమిటి సంబంధం?" అడిగాడు ఆయన అరవింద్ ను ఓదారుస్తూ.
"తాతా! వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలుసా. అసలు ఏమైంది హోటల్ ఎలా కాలిబూడిద అయింది.
వాళ్ళిద్దరు క్షేమంగా ఉన్నారా, ఎక్కడున్నారు చెప్పు తాతా? అని ఆత్రంగా అడిగాడు.
"ఏం చెప్పమంటావు బాబు? వాళ్ళు గత మూడు సంవత్సరాలుగా తెలుసు. చాలా మంచి
వాళ్ళు ఇద్దరుఇద్దరే ఎవరితో ఎప్పుడు గొడవపడగా చూడలేదు. ఎక్కడనుంచి వచ్చారు తెలియదు. చెల్లి కోసం అన్న, అన్న కోసం చెల్లి ప్రాణానికి ప్రాణంగా వుంటారు. నేను ప్రతి రోజు
ఉదయాన్నేవచ్చి టిఫిన్ చేసి అదిగో అక్కడ దూరంగా కనిపిస్తుంది చూడు, నా పొలం అక్కడికి
వెళ్ళిపోతా. గత మూడు రోజుల క్రితం నేను యథాప్రకారం వచ్చేటప్పటికి హోటల్ కాలి బూడిదైపోయి వుంది.
పోలీసులు వచ్చారు. పాపం ఆ అమాయకులు కాలి బూడిదైపోయారు. ఇది ఎలా జరిగింది
ఏమిటి అనేది ఎవరికి తెలియదు. దీపం ఏమైనా అంటుకుందేమోనని నిర్దారించుకుని
వెళ్ళిపోయారు.
బాబు వాళ్ళ గురించి ఇంతగా అడుగుతున్నావు వాళ్ళకు నువ్వు చుట్టమా , అప్పులవాడివా?
సందేహంగా అడిగాడు ఆ పెద్దమనిషి.
"నేను వాళ్ళకు చాలా కావలసిన వాడిని" అని జరిగినందంతా చెప్పాడు ఆవేదనతో.
"అయ్యొ ఎంత ఘోరం జరిగిపోయింది బాబు. ఆ దేవుడు వాళ్ళకు అంతే రాసిపెట్టాడు.
జరిగినదానికి నువ్వు ఎంత వగచినా లాభం లేదు బాబు. ఇదంతా ఒక పీడ కలలాగా నువ్వు
మరిచిపోయి హాయిగా ఇంకో పెళ్ళి చేసుకో ఇంతకంటే ఏమి చెయ్యలేము కదా" అన్నాడు
ఆయన.
"తాతా ఎలా మరచిపోగలను, తనతో వున్నది నాలుగు రోజులే అయినా ఏన్నో ఏళ్ళుగా
పెనవేసుకున్న బంధంలా ముడిపడిపోయింది. ఎన్నో కలలు కన్నాము ఏవేవో
వూహించుకున్నాము. అన్నీ మూన్నాళ్ళ ముచ్చటలే అయ్యాయి. ఏడడుగుల బంధం ఏడు జన్మల వరకు అన్నారు కాని!
నా వర్షిణి మాత్రం కాళ్ళపారణి ఆరకముందే నిండు నూరేళ్ళు నిండాయనుకొని
వెళ్ళిపోయింది నన్ను ఒంటరివాణ్ణి చేసి" అన్నాడు అరవింద్. భళ్ళున పగిలిన మేఘం వర్షిస్తున్నట్టుగా కళ్ళుధారలు కట్టాయి.
"బాబు వూరుకో, పోయినవాళ్ళతో మనము పోలేము కదా. గుండె రాయి చేసుకుని బంగారం
లాంటి నీ బ్రతుకును చక్కదిద్దుకో. ఆమె ఏ జన్మలోనో నీకు ఋణపడి వుంటుంది. తన
ఋణం తీర్చుకొని వెళ్ళిపోయింది' అంటూ అరవింద్ కు స్వాంతవచనాలు చెప్పి వూరడించి.
నన్ను కాస్తా నీ బండిమీద నా పొలం దగ్గర దింపి వెళ్ళు అన్నాడు.
చేసేది ఏమి లేక వెనుదిరిగాడు అరవింద్. కాలం ఎవరికోసం ఆగదు అన్నట్టుగా తన పని
తాను చేసుకుని వెళ్ళిపోతుంది. రోజులు గడిచిపోతున్నాయి. జ్నాపకాలు మెల్ల మెల్లగా
చెదిరిపోతున్నాయి పని వత్తిడిలో పడి. ఇంచుమించు రెండు నెలలైపోయింది.
"సార్ మీ కోసం ఎవరో పెద్దాయన వచ్చారు అర్జంట్ గా మిమ్మల్ని కలవాలట పంపించ
మంటారా" అటెండర్ వచ్చి అడిగాడు.
"సరే. పంపు" అన్నాడు తన పనిలో నుండి తల ఎత్తకుండానే అరవింద్.
అతను లోపలకు వస్తూనే 'బాబు నా బిడ్డను కాపాడు' అని గట్టిగా అరుచుకుంటూ వచ్చి
అరవింద్ కాళ్ళు పట్టుకున్నాడు.
ఆ హడావుడికి అక్కడున్న అందరు ఒక్కసారిగా ఏమై వుంటుందోనని ఇటు వైపు తిరిగారు.
అరవింద్ కు ఏమి అర్ధం కాలేదు. వచ్చినతన్ని పైకి లేపుతూ , "మామయ్య ఏమిటిది ఏమైంది
మీకు ? ఎందుకు కంగారుపడుతున్నారు. అరుణకు ఏమైంది చెప్పండి'.
"బాబు నన్ను క్షమించు. అరుణ ప్రాణాలు కాపాడు , అదీ నీ ఒక్కడివల్లనే అవుతుందట
డాక్టర్లు చెప్పారు. నీవు తొందరగా రావాలి' అని హడావుడి చేస్తున్నాడు నాగభూషణం.
"సరె సరె పదండి వెళుతూ అన్ని మాట్లాడుకుందాము" అంటూ గబగబా బయటకు వచ్చి ,
పి.ఏ కు చెప్పి బయలుదేరాడు. ఇంకా అక్కడే వుంటే ఆయన గోలకు అందరు వస్తారేమోనని.
నాగభూషణం కారులోనే వెళ్ళారు.
"ఆ ఇప్పుడు చెప్పండి అరుణకు ఏమైంది, హాస్పిటల్ కు ఎందుకు తీసుకవచ్చారు. ఏమిటి
ప్రాబ్లం
డాక్టర్లు ఏమన్నారు" అడిగాడు అరవింద్.
"ఏం చెప్పమంటావు బాబు అరుణ పరిస్తితి. నువ్వు ఆ రోజు తనను పెళ్ళి చేసుకోను అని
చెప్పినప్పటి నుండి ఇప్పటి వరకు మనిషి కోలుకోలేదంటే నమ్ముతావా? ఒకమాట ముచ్చటలేదు ,మంచి నీళ్ళు తాగి పస్తులుంటుంది. నాలుగు రోజులకో సారి బాగా ఆకలి అవుతుంటే పాలో పండో తింటుంది. ఇలా అయితే ఎలాగమ్మ అంటే , ఏం చెయ్యాలి నాన్న నా అనుకున్నవాళ్ళు నాకు దూరం అయ్యాక ఇంకా ఎవరికోసం బ్రతుకుండాలి అని బోరుబోరునా ఏడిచింది. ఆ రోజు నుండి అదే వరస. రోజు రోజుకు క్షీణించి పోతుంది ఎంతో మంది డాక్టర్లకు చూపించాను. అందరు ఒకే మాట చెబుతున్నారు ఇది మానసిక వ్యాధి కనుక మానసిక వైద్యుడి దగ్గరకు తీసుకవెళ్ళమంటే తీసుకవచ్చాను. ఆయన దగ్గర తన మనసులో మాటలు చెప్పింది" అని చెప్పడం ఆపి మంచినీళ్ళు తాగాడు నాగభూషణం.
'అరుణ ఏం చెప్పింది మామయ్య "ఆత్రుత అణుచుకోలేక అడిగాడు అరవింద్.
"ఇంకేం చెబుతుంది నువ్వు వద్దనుకుని వెళ్ళిపోయినా , తను నిన్నే కోరుకుంటుంది. నువ్వు
లేకుండా తను బ్రతకలేనన్నది. నువ్వు వేరే ఎవరిని చేసుకున్నా తను నీ కొరకు అలానే
వుంటుదట చచ్చేవరకు. ఇక నన్నేం చెయ్యమంటావు, నాకేం చెయ్యాలో తోచలేదు. డాక్టర్
చెప్పాడు ఒకసారి నిన్ను తీసుకవస్తే తన పరిస్తితి చూసి నువ్వే అరుణకు చెప్పి ఒప్పిస్తావని నిన్ను తీసుకరమ్మన్నాడు. బాబు నా బిడ్డను కాపాడు" అంటూ కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు.
"మామయ్య మీరు ధైర్యంగా వుండాలి కాని ఏమిటి చిన్న పిల్లాడిలా ఏడుస్తున్నారు" అని
కళ్ళు తుడిచాడు.
"మీరేం కంగారు పడకండి అరుణకు నచ్చచెబుతాను "అన్నాడు.
అరవిరిసిన మందారంలా వుండే అరుణ వాడిన తోటకూర కాడలా అయింది. ఒక్కసారీగా
హృదయం ద్రవించిపోయింది అరవింద్ కు. పచ్చటి పసిమి చాయ స్తానంలోరంగు తగ్గిపోయ
కలలన్ని కరిగిపోయినట్టుగా కళ్ళక్రింద గుంటలు పడి , మందహాసానికే మధుమాసంలా
గలగలపారే సెలయేటిలాంటి ఆ మోము కళ తప్పిన గతిలా వుంది. అరవింద్ కళ్ళు అశ్రుపూరిత
నయనాలయ్యాయి అరుణను చూడగానే.
"అరుణా అరుణ చూడు నీ బావనొచ్చాను. నీ కోసం వచ్చాను ఒకసారి కళ్ళు తెరిచి చూడు"
అంటూ చెవిలో గుసగుసగా చెప్పాడు. కొద్దిగా కదలిక వచ్చింది.
" అరుణా చూడు అచ్చంగా నీ కోసం వచ్చా కళ్ళు తెరువు. నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళను ఇక నీతోనే వుంటా" అంటూ అరుణ చేతిని తన చేతిలోకి తీసుకుని ముద్దుపెట్టుకున్నాడు. ఆ స్పర్శకు ఆ వెచ్చదనానికి చెవిలో విన్న మాటలకు మెల్లగా కళ్ళుతెరచి చూసింది. మసక మసకగా కనిపిస్తున్న అరవింద్ ను కళ్ళు నులుపుకుని మళ్ళి చూసి
"బావా నువ్వు నిజంగా వచ్చావా ! నా కళ్ళు చెవులు నన్ను మోసం చెయ్యడం లేదు కదా"
అంది.
ఎక్కడో నూతిలోనుండి వచ్చినట్టుగా ఆ మాటలు.
"లేదు అరుణా ! నిన్ను మోసం చెయ్యడం లేదు నేను నిజంగా నీ కోసం వచ్చాను" అని
ఆర్తిగా ఆమెను లేపి గుండెలకు అదుముకున్నాడు. ఎదలోపల పదిలంగా కొట్టుకుంటున్న అరుణ గుండె లబ్ డబ్ కంటే బావ బావ అంటూ కొట్టుకుంటున్నట్టనిపించింది అరవింద్ కు.
"బావా నన్ను నీ దానిగా స్వీకరిస్తావా , నువ్వు లేకుండా నేను వుండలేను. మన చిన్నప్పుడు
చేసుకున్న బొమ్మలపెళ్ళి నువ్వు మరిచిపోయావేమో గాని నేను మరిచిపోలేదు. నిన్నే నా
భర్తగా వూహించుకున్నా. ఎందుకు దూరమయ్యామో తెలియదు." అంటూ అరవింద్ గుండెలమీద తలవాల్చి అంది.
అంగ రంగ వైభవంగా పెళ్ళి చేసాడు నాగభూషణం. "ఏది ఏమైనా నా బిడ్డ నాకు దక్కింది.
మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే పోతారు. నాగుపాము పగ అంటే ఏమిటో రుచి చూడని వాళ్ళునాతో పెట్టుకుంటారా" అని ఎవరితోనో అంటూ వుండగా అరవింద్ విన్నాడు.
"ఎవరు మామయ్య మీతో పెట్టుకున్న వాళ్ళు. ఏమయ్యారు వాళ్ళు" అడిగాడు అరవింద్.
తడబడ్డాడు నాగభూషణం చెప్పడానికి.
" ఆ ఎవరోలే బాబు నీ కెందుకులే ఈ పల్లెటూరు ముచ్చట్లు" అని దాటవేసాడు. అరవింద్ మనసు ఏదో కీడు శంకించింది ఎందుకో అర్ధం కాలేదు.
గతమంతా గుర్తుకు రాగా, పక్కనే పడుకుని వున్న అరుణను గట్టిగా గుండెలకు అదుముకుని
వర్షిణి నన్నొదిలి ఎక్కడకు వెళ్ళకు. ఇన్నాళ్ళు ఎక్కడున్నావు, నీ కోసం ఎంత తపించిపోయానో
తెలుసా! ఇంకెప్పడు నన్న వదిలి పోవు కదా అంటూ అరుణను వూపిరాడకుండా చేస్తున్నాడు.
"ఏమండి ఏమండి ఏమైందండి మీకు, ఎందుకు అంతగా కలవరిస్తున్నారు. నేను వర్షిణి ని కాను
అరుణను" అంటూ అతన్ని గట్టిగా లేపి కూచోపెట్టింది.
దిగ్గున లేచి కూర్చున్నాడు , తప్పుచేసినవాడిలా తలవంచుకుని బాత్రూంకు వెళ్ళాడు.
అరుణ ముసిముసిగా నవ్వుకుంది మనసులో. ఇంకా దూరంగా వుంచడం మంచిది కాదు
అరవింద్ ను అమృతవర్షిణి ని. అరవింద్ గుండెలో గుడి కట్టుకుని వున్న ఆ దేవత తన కళ్ళ
ఎదుటనే వుంది అంటే ఎంత ఆనందపడతాడో. నా వల్ల సుఖపడలేని నా భర్తకు నేనిచ్చే
బహుమానం ఇదే అనుకుంది. అరవింద్ వచ్చే వరకు కళ్ళుమూసుకుంది నిద్ర
పోయినట్టుగా.
గమ్మున వచ్చి పడుకున్నాడు అరవింద్ ఆవేశం చల్లారిపోయింది. ఛీ ఛీ ఎందుకలా
ప్రవర్తించాను
అరుణ ఎంతగా బాధపడుతుందో , ఆవేశంలో ఏం చేస్తుందో ఏమిటో. రేపంతా సెలవుపెట్టి
తనతోనే వుండాలి. తన మనసుకు ఎలాంటి ఆలోచనలు రాకుండా చూసుకోవాలి అని
మనసు
సమాధానపరచుకొని నిద్రలోకి జారిపోయాడు.
"ఏమండోయ్ శ్రీవారు లేవండి. ఇంకా కలల నుండి బయటపడతారా ఇంకా అక్కడే
విహరించుకుంటూ వుంటారా. ఈ రోజు ఆఫీస్ కు వెళ్ళేది లేదా !" అరవింద్ చెవిలో గుసగుసగా అంది అరుణ.
కలవరపాటుగా లేచి లక్ష్మీదేవిలా తయారై వచ్చిన అరుణను చూసి , గబుక్కున దగ్గరకు
లాక్కుని నుదుటన ముద్దుపెట్టాడు. "ఇంత అందంగా తయారయ్యావు ఏమిటి విశేషం. ఈ రోజు మన పెళ్ళిరోజు కాదే?" అన్నాడు ఆశ్చర్యంగా.
"అబ్బ వదలండి. అన్నీ మరచిపోతారు మీరు. ఈ రోజు మీ పుట్టిన రోజు కాదా !" అంది.
"ఓ అవును కదా. నేను మరిచిపోతే ఏం నా నువ్వు వున్నావుగా అందుకే అంత ధీమా"
అన్నాడు అరవింద్ అరుణ ముక్కుపట్టుకుని వూపుతు.
"సరేలెండి సంబరం. ఇంకా కొన్నాళ్ళాగితే మిమ్మల్ని మీరే మరచిపోయేట్టుగున్నారు గాని.
ఈ రోజు మీరు ఆఫీస్ కు సెలవుపెడుతున్నారు. ఎందుకంటే నాకు మీకు చాలా ఆత్మీయులైనవారు వస్తున్నారు. మీకోసం నేను ఒక మంచి బహుమతి తెప్పిస్తున్నాను" అంది అతని కళ్ళల్లోకి చూస్తు.
"నిజంగా ! ఎవరబ్బా మనకు అంత ఆత్మీయులైనవారు" అడిగాడు అరవింద్.
"చెప్పను మీరే చూద్దురుగాని లేచి చకచకా తయారవ్వండి. ఆ అది మన పెళ్ళిరోజు
కట్టుకున్న పట్టుపంచెలు కట్టుకొండి" అంది.
తయారై కూర్చున్నాడు అరవింద్. అతని పక్కనే వచ్చి కూర్చుంది అరుణ. ఏమిటోయ్
ఇంకా తేవట్లేదు అమృత. కడుపులో ఆకలిగా వుంది అడిగాడు.
ఆగండాగండి, కాఫీ కాదు స్వీట్లతో వస్తుంది." అని "అమృతవర్షిణి త్వరగా రావాలి" అని
పిలిచింది.
"అదేమిటి కొత్త పేరుతో పిలుస్తున్నావు" అంటూ బాబుతో వస్తున్న ఆమెను చూసి దిగ్గున
లేచి నిలుచున్నాడు. అరుణ వైపు ఆమె వైపు మార్చి మార్చి చూస్తున్నాడు ఏమి అర్థంగాక.
అమృతవర్షిణి వచ్చి అరవింద్ పాదాలకు నమస్కారం చేసింది.
మాటరానట్టు చేష్టలుడిగిపోయినట్టుగా నిలబడిపోయాడు అరుణను చూస్తూ.
"ఏమండి ఏమిటలా అయిపోయారు. నేను మీకు ఇస్తానన్న బహుమతి ఇదిగో స్వీకరించండి
మీ బాబుతో సహా" అని అమృత చేతిని అరవింద్ చేతిలో పెట్టింది.
"అరుణా నీకు వర్షిణి తెలుసా' మాటలు తడబడుతుండగా అడిగాడు.
"అమృతగా తెలుసండి. మీ డైరీ చదివాక అమృతవర్షిణిగా తెలిసింది." నవ్వుతూ చెప్పింది
అరుణ.
అప్పుడు గుర్తుకొచ్చింది అరవింద్ కు తన డైరీ దొరకలేదని,దాని కోసం అరుణ మీద కోపానికి
వచ్చిన విషయం. అంటే నా డైరీ చదివి వర్షిణి ని తీసుకవచ్చిందా. అసలు వర్షిణి ఆ రోజే
చనిపోయిందనుకున్నాను కదా మరి, ఇదెలా సాధ్యం అనుకుని ఆ మాటే పైకి అనేశాడు.
"చెబుతానుండండి, నాకు కాలు కొంచెం నయమయ్యాకా ఒకరోజు మా ఫ్రెండ్ ఇంటిదగ్గర
దింపమన్నాను గుర్తుందా మీకు" అని అరవింద్ వైపు చూసి అడిగింది.
ఆహా ఎందుకు గుర్తుకులేదు నా డైరీ కోసం మనం పోట్లాడుకున్నాము కదా! అందుకే నీ
మనసు బాధతో ఫ్రెండ్ కు చెప్పుకోవాలని వెళ్ళావు అవునా "అన్నాడు
"కరెక్ట్. అదే కదా విచిత్రం. నాకు ఇంట్లో ఏమీ తోచక ఎప్పుడు మీ బుక్స్ ముట్టని నాకు
ఎందుకో మీ షెల్ఫ్ సర్దాలనిపించింది. అవి సర్దుతుంటే మీ డైరీ జారి క్రిందపడి అందులోనుండి
ఒకమ్మాయి ఫోటో బయటపడింది. అది చేతిలోకి తీసుకుని చూసాను. ఎంతైనా నేను ఆడదానినే కదా. చాలా అందమైన అమ్మాయి. వణుకుతున్న చేతులతో డైరీ తీసాను. పరాయి వాళ్ళ డైరీ
చదవకూడదని తెలుసు కానీ, మనసుపడే ఆత్రుత ఆపుకోలేక చదివాను. ఇంత బడాబాగ్ని
గుండెలో దాచుకుని నా కోసం నన్ను మనిషిని చెయ్యాడానికి తన మనసులో వున్న ఆరాధ్య
దేవతను మరుగునపరచి నన్ను సంతోషపెట్టిన మనిషికి నేనేమి ఇవ్వలేకపోతున్నానన్న బాధ
నన్ను నిముషం నిలబడనీయలేదు. నేనేం చెయ్యాలో ఎంత ఆలోచించినా తోచడం లేదు. నా
ఫ్రెండ్ దగ్గరకు వెళితే ఏదైనా ఉపాయం చెబుతుందని మిమ్మల్ని దింపమన్నాను ఆ రోజు. అదిగో అక్కడ చూసాను అమృతను. వెదకబోయిన తీగ కాలుకు తగిలినట్లు, నా సమస్యకు
పరిష్కారందొరికిందనట్టుగా , అచ్చంగా నేను చూసిన ఫోటో లోని అమ్మాయిలాగే వుంది.
నా ఫ్రెండ్ నుఅడిగాఆమె ఎవరని , తనకు ఎవరు లేరట పనికోసం వచ్చిందట. అప్పుడు కడుపుతో వుందటజాలి అనిపించి ఇంట్లో పెట్టుకుందట. నెలలు నిండిన మనిషి కదా అని చిన్న చిన్న పనులు చేయించుకునేదట. పిల్లవాడు పుట్టాక అన్ని పనులు తనే చేస్తుంది అని చెప్పింది. నేను తన గురించి అడిగా, జరిగిన విషయాలన్ని చెప్పింది. అప్పుడు నేను తనను అక్కున చేర్చుకుని నాకు జరిగిన విషయాలు చెప్పాను. అరవింద్ ను క్షమించి అతని జీవితంలోకి రమ్మన్నాను.సహృదయంతో ఒప్పుకుంది. కానీ మీ పుట్టిన రోజునాడు మీకు బహుమతిగా అప్పచెబుతానన్నాను.
అందుకే ఇన్నాళ్ళుగా ఆ బురఖాతో వుంది. ఏమండి ఇదిగో మీ జీవితసహచరిణి, మీ కన్న కొడుకు"అంటూ అప్పచెప్పింది అరుణ.
"అరుణ ఇదంతా నమ్మలేకపోతున్నా. ఎటునుండి ఎటు తిరుగుతున్నాయి మన జీవితాలు.
వర్షిణి ఇన్నాళ్ళు ఏమైయి పోయావు? నీ కోసం ఎంతగా తపించిపోయానో తెలుసా. నువ్వు
బ్రతికేవున్నవా? వుంటే నన్ను కలవకుండా ఎందుకు దూరమైపోయావు. భర్త నుండి నువ్వు,
తండ్రి వుండి బాబు ఇద్దరు అనాథలుగా వుండాల్సిన అవసరం ఏమొచ్చింది". ప్రశ్నల
మీద ప్రశ్నలు వేసాడు. ఒకవైపు ఆనందం మరో వైపు ఆత్మఘోష ఇన్నాళ్ళు ఇంత కష్టపడ్డార అని.
"ఆగండాగండి, మీ ప్రశ్నలన్నిటికి జవాబు చెప్పవలసిన వాడిని. శిక్ష అనుభవించవలసిన
వాడిని.' అంటూ రంగప్రవేశం చేసాడు నాగభూషణం.
"నాన్నా మీరు", "మామయ్యా మీరంటున్నదీ" అని ఇద్దరు ఒకేసారి తిరిగారు నాగభూషణం వైపు.
వర్షిణి భయం భయంగా చూస్తూ నిలుచుంది.
"అవునర్రా ! మీ జీవితాలు ఇలా కావడానికి కారణం నేనే. నేను చేసిన పాపమే నా బిడ్డకు
చుట్టుకుంది అని. వర్షిణి ఇలా రామ్మా ! అంటూ పిలిచి, మీ జీవితంలో అమృతం
కురిపించడానికి వచ్చిన ఈ అమృతవర్షిణి నేను ప్రేమించిన కళ్యాణి కూతురు. ఏదో ఇబ్బందుల వల్ల ఆమెను పెళ్ళి చేసుకోలేకపోయాను. తన వునికిని కూడా తెలియనివ్వకుండా దూరంగా
పంపించివేశాను. చాలా రోజులకు తెలిసింది పాప పుట్టాక కొన్ని రోజులకు తను చనిపోయిందని.
చాటుమాటుగా చాలాసార్లు పాపను చూసివచ్చాను. పాప పోషణకు డబ్బుకూడా ఇచ్చాను. కొన్నళ్ళకువాళ్ళు వేరే వూరు వెళ్ళిపోయారు నేను పట్టించుకోవడం మానేసాను. మళ్ళి అరవింద్ వచ్చి నా బిడ్డను కాదని వేరే అమ్మాయిని పెళ్ళి చేసుకుంటాను అన్నప్పుడు చాలా కోపంవచ్చింది. అరుణ పుట్టినప్పటి నుండి ఆడింది ఆట పాడింది పాటగా పెరిగింది.చిన్నప్పుడే కోపంతో ఇంట్లోనుండి వెళ్ళిపోయిన బావ అరవింద్ అంటే పంచ ప్రాణాలు అరుణకు. చిన్నప్పుడే తల్లి తండ్రిని పోగొట్టుకున్నఅరవింద్ ఇప్పుడున్న ఆస్తికి వారసుడు. ఎలాగు ఇంట్లోనుండి వెళ్ళిపోయాడు కదా అని ఆస్తి మొత్తం నా పేరు మీద రాయించేసుకున్న. కొన్నాళ్ళ కిందట తెలిసింది అరవింద్ మంచి వుద్యోగంలో స్తిరపడ్డాడని. ఎలాగు అరుణకు ఇష్టమే కదా అని పిలిపించాను.
అరుణను కాదని వేరే అమ్మాయిని పెళ్ళి చేసుకుంటా అనే సరికి , నాలో దురాలోచన మొదలైంది. నా కూతురుని కాదన్నవాడు రేపు ఈ ఆస్తి నాది అని గొడవా చేస్తాడేమోనని భయం
వేసింది. అలా ఆస్తిపోతుంది , నా కూతురు కోరుకున్నవాడు దక్కడు. అందుకని “ ఆ
అమ్మాయి ఎవరాని ఆరా తీసాను. అరవింద్ ను విడిచి వెళ్ళకపోతే ప్రాణాలతో వుండడు అని
బెదిరించాను
ఎక్కడికైన వెళ్ళిపొమ్మన్నాను. మళ్ళి అరవింద్ ను కలిసినట్టు తెలిస్తే ఎవ్వరిని వదిలిపెట్టను
మర్యాదగా ఇక్కడనుండి వెళ్ళిపొమ్మన్నాను. అంతే ఉన్నపళంగా వాళ్ళను ఖాళి చేయించి
దానికి నిప్పు పెట్టించాను. ఇది జరిగిన సంగతి. నేను చేసిన పాపానికి నా కూతురు జీవితం
బూడిదలో పోసిన పన్నీరైంది. బాబు నాకే శిక్ష వేసినా అనుభవించడానికి సిద్ధంగా వున్నాను". అంటూ అరవింద్ చేతులు పట్టుకుని బ్రతిమాలాడు.
"మామయ్య మా కర్మ కు మీరేం చేస్తారు. మాకు ఇదంతా జరగవలసి వుంది జరిగింది.
అయినా! జరగవలసిందంతా జరిగిపోయాక ఇప్పుడు బాధపడి ఏమి ప్రయోజనం. పోనీలే
ఇప్పటికైనా అందరం కలిసాము అంతే చాలు" అంటూ ఒకచేత్తో బాబును మరో చేత్తో
అమృతవర్షిణి ని దగ్గరకు తీసుకున్నాడు.
"నాన్న పదండి మనం వెళదాము మన పని అయిపోయింది. మీరు చేసిన పొరపాటుకు
కనీసం నన్నైనా చక్కదిద్దుకునే అవకాశం వచ్చింది" అంది తండ్రి దగ్గరకు వచ్చి.
"అరుణా ఇదేనా నన్ను నువ్వు అర్ధం చేసుకున్నది. ఇన్నాళ్ళు నా ప్రాణంలో ప్రాణంగా
మెదిలావు నన్ను విడిచివుండగలవా ? ఏమో నువ్వుండగలవేమో కానీ నావల్ల సాధ్యం కాదు.
నీ కంటే ముందు అమృతే అయినా తనతో నా భాంధవ్యం మూడునాళ్ళ ముచ్చటగానే
గడిచిపోయింది. ఇప్పుడు నిన్ను కాదని తనను, తనను కాదని నిన్ను ఎవరినీ వదులుకోలేను.
ఇకనుండి మనమందరం కలిసే వుంటాము. నువ్వేక్కడికి వెళ్ళడానికి లేదు" అని అరుణ
దగ్గరకు వచ్చి గట్టిగా గుండెలకు అదుముకున్నాడు.
"అవునక్కా నువ్వు ఎందుకు వెళ్ళిపోవాలి మధ్యలో వచ్చినదాన్ని వెళితే నేను వెళ్ళాలి. అక్కా
ఆయన చెప్పినట్టు అందరం కలిసేవుందాము. నాన్న చెప్పేంతవరకు మనమెవరికి
ఎవరమో కానీ ! ఇప్పుడు మనం ఒక తండ్రి పిల్లలం. అంతే కాదు ఒకే భర్తకు భార్యలం కూడా" అంటూ అమృత వచ్చి అరుణను దగ్గరకు తీసుకుంది నవ్వుతూ.
అరుణ చిరునవ్వు ముఖంతో అభినందన పూర్వకంగా చూసింది అమృతవర్షిణి వైపు.
అరవింద్ వైపు ఆరాధనగా చూసింది ఆ చూపులో కోటి వీణలు మీటిన ప్రేమలు, జన్మజన్మకు
సరిపడా అభినందనలు కనిపించాయి అరవింద్ కు.
బాబుతో కలిసి అరుణారుణిమ దాల్చిన అమృతానందంతో అరవింద సమేతంగా ఆనందడోలికలో మునిగిపోయారు.
॥॥॥ ॥॥ శుభం ॥ ॥
గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి.

రచయిత్రి పరిచయం : B.లక్ష్మి శర్మ
నా గురించి కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను, నేను సికింద్రాబాద్ లాలాపేటలో వుంటాను,
నాకు చిన్నప్పటి నుండి కథలు రాయడంమన్న చదవడంమన్న చాలా ఇష్టం, 1991 నుండి రాయడం మొదలుపెట్టాను, ఎక్కడ ఏ పేపర్ కనిపించినా రాసాను, కానీ ఎవరికి చూపలేదు చెప్పుకోలేదు, ఈమధ్యనే మా అమ్మాయిలు మావారు చూసి కథలు బాగున్నాయి కదా ఏదైనా పత్రికకు పంపమంటే పంపంస్తున్నాను, కర్నూలు గణేశ్ పత్రిక లో నేను రాసిన కవితలు కథలు చాలా వచ్చాయి, నాకు ఇద్దరమ్మాలు ఒక బాబు, అందరూ విదేశాల్లోనే వున్నారు,ప్రస్తుతం నేను మావారు కూడా అమెరికాలోనే వుంటున్నాము
Comments