top of page

మహారాజ వైభోగ యోగం

Writer: Nallabati Raghavendra RaoNallabati Raghavendra Rao

'Maharaja Vaibhoga Yogam' New Telugu Story

Written By Nallabati Raghavendra Rao

'మహారాజ వైభోగ యోగం' తెలుగు కథ

రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

నా వయసు 70 సంవత్సరాలు. గత పది పదిహేను సంవత్సరాల నుండి నా జీవితంలో అన్నీ నిరాశలే. పెళ్లి అయ్యాక నలుగురు కొడుకులు పుట్టారు. దూరంగా బ్రతుకుతున్నారు. వాళ్లు ఎక్కడున్నారో తెలుసుకుంటే నాకు తెలుస్తుంది కానీ నేను మాత్రం ఎక్కడ ఉన్నానో తెలుసుకునే అవకాశం వాళ్లకు లేదు. అంటే సమయం లేదు వాళ్లకు పాపం! అసలు నేనంటూ ఉన్నానన్న ఆలోచన కూడా వాళ్లకు ఉండి ఉండదు.


ఇది తప్పు, ఆధర్మం, అన్యాయం, అని నేను అనడం లేదు. ఎందుకు అంటే నేటి సమాజంలో ఎక్కువ కుటుంబాలలో ఎక్కువ పాళ్లు జీవన విధానాలు ఇలాగే గడుస్తున్నప్పుడు నడుస్తున్నప్పుడు... నా ఒక్కడి విషయంలో మాత్రం కొడుకులు ప్రత్యేకంగా ఎలా ప్రేమగా చూసుకుంటారు.. ఒకవేళ చూసుకున్నా సమాజం వాళ్ళను చిత్రంగా చూస్తుంది కదా. అప్పుడైనా నన్ను మళ్లీ తన్ని తగిలేస్తారు కదా.


ఇంతకీ కొడుకుల గురించి మాత్రం చెప్పుకునే కథ ఏ మాత్రం కాదు ఇది. నాకు ఆడపిల్లలు కూడా ఇద్దరు ఉన్నారు. వాళ్లకు నేను గుర్తున్నాను కానీ వాళ్లు భర్త చేతుల్లో బంధువులు కదా మరి. అంటే బందీలు అన్నమాట. స్వాతంత్య్రం కోల్పోయిన వాళ్లను ఇప్పుడు అనవసరంగా నా గత స్మృతులలో ఇరికించడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు.


నాకు మనవలు మనవరాళ్ళు చాలామంది ఉన్నారు.

కొందరికి మైనారిటీ తీరింది, కొందరికి తీరలేదు. యవ్వ నంలో ఉన్న ఆ కుర్రకారు జీవితంలో వాళ్లు పైపైకి ఎదగ డానికి అభివృద్ధి గురించి ఆలోచించుకుంటారు గాని.. ఎక్కడో తాత అనే ప్రాణమున్న పదార్థం ఒకటి ఉంది దానిని చూసుకునే బాధ్యత మనది అన్న ఆలోచన, ధైర్యం వాళ్లకి ఎక్కడ ఉంటుంది? పాపం చిన్న పిల్లలు.. వాళ్ళ ఊసు ఎత్తితేనే మహా పాపం.


వీళ్ళందర్నీ అనుకునే ముందు నా ఇంటి దాని గురించి చెప్పాలి. వేదమంత్రాల సాక్షిగా, అగ్నిదేవుడి సాక్షిగా ఆ రోజు ప్రమాణం చేసిన మాట మరిచిపోయింది. ఆవిడ ఎప్పుడూ పోటీలో ముందే ఉండేది. చివరికి కూడా తన మాట, తన పంతమే నెగ్గించుకునేది. నా గురించి ఏ మాత్రం ఆలోచించకుండా నా కన్నా ముందుగానే దూరంగా.. నాకు ఏ మాత్రం కనిపించకుండా.. నా మాట కూడా వినబడనంత దూరంగా ఉండిపోవాలని ఎప్పుడో నిశ్చయం చేసుకుంది.


నేను చాలా సంపాదించాను కానీ, నా శక్తి బాగా ఉన్న ప్పుడే నా సంతానం అందరినీ పిలిచి సమానంగా తాయిలాలు పెట్టి నట్టు పంచిపెట్టేసాను. ఎందుకంటే నాకు ఆస్తిపాస్తులు అంటే అంత ఆశ లేదు మరి.. అందుకనే నేను ఇప్పుడు ఎవరిని ప్రత్యేకంగా గుర్తు చేసుకొని, వాళ్ళ మీద ఆబాండాలు వేయడం లేదు.


మిగిలింది నేను, నా నేస్తం టామీ వైజాగ్ లోనే ఉంటున్నాం. ఊరి పేరు వైజాగ్ అని ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే ఇన్నాళ్లు వైజాగ్ లో ఉన్న నేను, ఒక్క సారి కూడా బుర్ర గుహలు చూడలేకపోయాను.


ఇప్పుడు ఒంటరి బ్రతుకు కాదు, జంట బ్రతుకే.. నాకు టామీ ఉంది కదా. అందుకనే బుర్ర గుహల అంద చందాలు కళ్ళతో చూడాలని, తన్మయము చెందాలని టామీని ఎవరికైనా అప్ప చెప్పి వెళదామంటే అది ఒప్పుకోదు కనుక, ఊరుకోదు కనుక దానిని కూడా ఉదయమే నా వెంట తీసుకువెళ్లాలని.. వైజాగ్ లో ట్రైన్ ఎక్కి, బుర్ర గుహల దగ్గరలో దిగాలని నిశ్చయించు కొని, రాత్రి తుంగచాప మీద పడుకున్నాను. వెధవ ముండ.. అది ఒక్క క్షణం కూడా నన్ను వదిలి ఉండ లేదు మరి.


టామీ కి చాలా నేర్పాను. కానీ ఒక్కటి అలవాటు కావటం లేదు. ఎంత చెప్పినా అలవాటు చేసుకోవడం లేదు. ‘తుంగ చాప మీద పడుకున్నప్పుడు విసన కర్రతో విసరవే పిచ్చి ముండా.. వేసవికాలం కదా.. ఉక్క పెట్టి చస్తుంది’ అని దానికి ఎన్నిసార్లు చెప్పినా, గంటల తరబడి నేర్పినా, బండ తిట్లు తిట్టినా.. అర్థమయి చావడం లేదు.

ఆ ఒక్క విషయంలోనే దానికి నాకు అసలు పడటం లేదు. మనలో మన మాట, మీరే ఆలోచించండి.. చాలా కాలం నుండి నా ఉప్పు పులుసు తింటుంది.. ఆ మాత్రము విశ్వాసం ఉండాలి కదా పాడుముండకి! చి.. చి.. కుక్క బ్రతుకని, కుక్క బ్రతుకు..


ఇంకేం చేయగలను.. దాన్ని తిట్టుకొని ఆ రాత్రి పడు కోవడానికి ప్రయత్నించాను. నిద్రపడితే కదా.. వేసవి కాలం చాలా వేడిగా ఉంది. నాలుగు సార్లు లేచి చూశాను. అది హాయిగా ఓ మూలన పడుకుని ఉంది. నా గురించి అది పట్టించు కోనప్పుడు దానికి నేను తిండి పెట్టడం దేనికి..


ఇన్నేళ్లు నేను తిండి పెట్టిన వాళ్ళ లో ఒక్కరైనా ఇప్పుడు నాకేమైనా మహారాజు వైభవం చూపిస్తున్నారా? అలాంటప్పుడు టామీ కి కూడా నేను ఇప్పుడు తిండి పెట్టడం శుద్ధ వేస్ట్.


అలా ఆలోచిస్తుండగా నిద్ర పట్టకపోవడంతో అనుకోకుండా నాకు నా జాతకం చూసిన సిద్ధాంతి గారు ఎప్పుడో చెప్పిన విషయాలు గుర్తుకు వచ్చాయి. నా చిన్నప్పుడు ఒకాయన చూసి, 70 ఏళ్ల తర్వాత వార్థ క్యంలో మహారాజ వైభవం అనుభవిస్తావు అని చెప్పా డు. పది రూపాయలు అతనికి ఇచ్చి ఆ మాటలు పక్కన పెట్టిస్తాను.


ఆ తర్వాత పెళ్లయ్యాక 30 ఏళ్లు వయసులో ఏదో విషయం గురించి నా జాతకం ఒకసారి చూపించు కుంటే మళ్లీ ఆ సిద్ధాంతి కూడా అదే విషయం చెప్పాడు. దాంతో నాకు ముందుగా ‘70 బ్రతుకుతామన్నమాట..’ అనే ఆశ మొలకెత్తింది. యవ్వనములో అనుభవించక పోయినా వార్ధక్యంలో అనుభవించడమే కదా గొప్ప. చూద్దాం.. ఆ వయసులో కుటుంబ వ్యక్తులు అందరూ కలిసి వచ్చి బాగా చూసుకుంటారేమో అనుకున్నాను.


తర్వాత 60 ఏళ్ల వరకు నేను జాతకాలు కూడా చూపిం చుకోలేదు కానీ నాకు ఆ విషయం మనసులో గుర్తు ఉండిపోయింది. ఆ మధ్య పుష్కరాలకు వెళ్లినప్పుడు రాజమండ్రిలో పెద్ద సిద్ధాంతిగారు ఉన్నారు అని తెలిసి అక్కడికి వెళ్లి 200 రూపాయల ఆయనకు సమర్పించి నా జాతక చక్రం చూపించాను. ఆయన కూడా 70 ఏళ్ల తర్వాత నువ్వు మహారాజు వైభవం అనుభవిస్తావయ్యా అని చెప్పాడు.


నా పిండాకూడు.. నా శ్రాద్ధం. నేను అన్ని విధాలా శిధిలావస్థలో ఉన్నాను. మరి ఇది ఎలా సాధ్యం.. నా జాతకం చూసినవారు అందరూ అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ కూడా ఒకేలా చెప్తున్నారు అంటే కొంచెం కొంచెం నిజం ఉండి తీరాలి కదా. ప్రస్తుతం నా వయసు 70 సంవత్సరాలు దాటింది కదా. కానీ వాళ్లు చెప్పిన జాతక ఫలాలకు పూర్తి విరుద్ధంగా ఉంది.


ఇంక చాప మీద పడుకున్న నాకు నిద్ర పట్టకపోవడం వల్ల ఎలా జ్ఞాపకం వచ్చిందో అందరూ చెప్పిన ఆ జాతక ఫల విషయాలు అలా అలా జ్ఞాపకం వచ్చి ఆ సిద్ధాంతులు అందర్నీ కడుపారా తిట్టిపోసుకుని నిద్ర పోవాలని ప్రయత్నించాను... అయినా నిద్ర పడితే కదా.


***

ఆలోచనలతో తెల్లవారిపోయింది. మొత్తానికి టామీ నేను తయారై రైల్వే స్టేషన్ కి వెళ్లి ట్రైన్ ఎక్కాం అర కులో దిగాం. కంకర రాళ్ల మీద గుట్టల మీద నడిస్తేనే కానీ బుర్ర గుహలు చేరలేము.. చాలా దూరం నడవాలి. ఎండ నడి నెత్తిని కాల్చి పడేస్తుంది. ఆయాసము, ఒగుర్పు.. చెమటకు బట్టలన్నీ తడిచిపోయాయి. ఎండవేడికి నడవలేక నీరసం కూడా వచ్చేసింది. అయినా నేను నా జీవితంలో బుర్రగుహలు అంటూ చూడాలి అంటే ఈ ఒక్కరోజే అవకాశం తర్వాత వెళ్ళగలనో లేదో. టామీ నా వైపు చూసి నేనేదో బాధ పడిపోతు న్నట్టు గ్రహించి వాటర్ బాటిల్ అందించింది. వెర్రి ముండ దాని సాయం ఇలా చిన్నచిన్నగా కొద్దికొద్దిగా ఉండబట్టే నేను ఇలా బ్రతికున్నానేమో.


మొత్తానికి బుర్ర గుహలోపలికి ప్రవేశించాం. చాలా చిత్రం విచిత్రం. బయట ఎంత అగ్ని వేడిగా ఉందో లోపల అంతా మంచులా ఉంది. నాకు ముక్కోటి దేవుళ్ళు ప్రత్యక్షమై కొత్త ప్రాణం పోసినట్టు అనిపించింది. లోపల అన్ని తిరిగి చూడటం మాట అటు ఉంచి ముందుగా అక్కడున్న బల్లమీద నేను మేను వాల్ చేశాను నీరసంగా. అంతా చూసి కనిపెడుతూ పక్కనే ఉన్న చిన్న గట్టుమీద టామీ కూడా కూర్చుంది. సమయం మధ్యాహ్నం 12 గంటలు అయింది. కాసేపు రెస్టు తీసుకొని గుహ అంతా తిరుగుదామని సాయంత్రం 6 గంటలకు అయినా లాస్ట్ బస్సు ఎక్కి తీరాలి అనుకొని నిద్రలోకి జారిపోయాను.


ఎంత ఆనందమైన జీవితం! గత 70 ఏళ్లుగా నేను ఎప్పుడూ ఇంత ఆనందదాయకమైన నిద్ర సుఖం అనుభవించి ఉండలేదు.


ఎప్పుడో మెలకువ వచ్చింది. టైము అడిగితే సాయంత్రం 6 అయ్యిందన్నారు. నాకు చిరాకు ఎత్తి చిర్ర ఎత్తు కొచ్చింది టామీ మీద.


''గడ్డి తింటున్నావా? పడుకున్నాక ఒక గంట పోయాక నన్ను లేపాలి కదా. గుహలన్నీ సరదాగా తిరిగి చూసి 6 గంటల బస్సుకి అందుకోవాలని అనుకున్నాము కదా.. అంటూ తిడుతూ అక్కడ ఉన్న జూకతో రెండు తగిలిద్దాం అనుకున్నాను. ఎప్పుడైనా కోపం వస్తే గతంలో అలాగే చేసేవాడిని. కానీ అది మునుపు ఎప్పుడూ నేను చూడనంత మహదానందంగా రకరకాల డ్యాన్సులు, నాట్యాలు చేసి తెగ ఆనందించేస్తుంది తనలో తాను. ఏమిటి విషయం.. దీనికి ఏమైనా మదపిచ్చెక్కిందా అనుకున్నాను ముందు. తర్వాత అది నా మొఖం వైపు చూసి నవ్వుతూ ఆనంద భాష్పాలు రాలుస్తున్నట్టు కనబడడంతో నేను హాయిగా నిద్ర పోయినందుకు అది సంతోషించిందేమో అన్న ఫీలింగ్ కలిగి దానిని ఏమీ అనకుండా ఉండిపోయాను.


మొత్తానికి బుర్రా గుహలు చూడకుండా ఇంటికి వచ్చే సాం రాత్రి 8 గంటలకి. ఉన్నది తిని దానికి కూసంత పెట్టి తుంగచాప మీద మళ్లీ మేను వాల్చాను.బయట చాలా వేడిగా ఉంది మా ఇంటి కప్పు రేకుల షెడ్డు లాగా ఉండడం వల్ల అగ్ని గుండంలా ఆవిరి కిందకు దిగిపో తుంది. ఏం చేస్తాం మహారాజు యోగం అంటే ఇదే మరి.. ఈ సిద్ధాంతాల శాస్త్ర గ్రంథాలు వేస్ట్ అన్నమాట.. డబ్బులు దోచుకోవడానికి నాలుగు కాకరకాయ మాట లు చెప్తారు అంతే.


వాతావరణం అలా ఉన్నా చాలా చిత్రం జరిగింది.

నాకు చాలా హాయిగా నిద్ర పట్టేసింది. ఇప్పుడు నిద్రలో నా మనసుకు ఎలా అనిపిస్తుంది అంటే బుర్రా గుహల లో మధ్యాహ్నం ఆ వాతావరణం లో అనుభవించిన ఆనందం మళ్ళీ ఇప్పుడు నా మనసుకు కలుగుతుంది. ఏంటి గమ్మత్తు. బుర్ర గుహల నుండి ఇంటికి వచ్చేసాం కదా.. ప్రస్తుతం ఇంటి దగ్గరే కదా ఉన్నాను.. మరి ఇంత హాయిగా నిద్ర ఎలాపట్టింది.. అని మనసులో అనుకుంటు న్నాను ఆ నిద్రలో.


ఇది వరకు రాత్రిపూట నిద్ర పట్టక అటుఇటు దొర్లు తూనే ఉండేవాడిని. తీరా కునుకు పడితే మళ్లీ నాలు గైదు సార్లు మెలకువ కూడా వచ్చేది. ఈ ముసలి వయసులో మహాఖర్మ అనుభవించే వాడిని. అనుభ విస్తూనే ఉన్నాను కానీ ఈరోజు ఈ స్వర్గ సుఖం ఏమిటో అర్థం కాలేదు.. అని మనసులో నిద్రలో అనుకుంటూనే కళ్ళు తెరిచి చూసేసరికి తెల్లవారి పోయింది. సూర్యుడు కిటికీలోంచి లోపలికి తన్నుకొస్తున్నాడు పక పక నవ్వుకుంటున్నట్టు.


తుంగచాప మీద కూర్చుని బుర్ర పక్కకు తిప్పి చూస్తే టామీ తన చేతిలో విసన కర్ర తో నాకు అలా విసు రుతూ ఉంది కునికిపాట్లు పడుతూ. అంటే రాత్రి 9 దగ్గర నుండి ఇప్పటివరకు తెల్లవారే వరకు ఒక్క నిమిషం కూడా పడుకోకుండా అలా విసురుతూనే ఉందా.? దాని ఉద్దేశం బుర్ర గుహలలో నేను అనుభవించిన ఆనందం చూసి అలాంటి ఆనందం నేను మళ్లీ అనుభవించడానికి అలాంటి చల్లగాలి కావాలని అనుకుని ఇలా విసురుతూ ఉందా. అలవాటు లేకపోయినా నేర్చుకుని మరీ విసిరిందన్నమాట. పిచ్చి ముండ.. కాదు కాదు తింగర ముండ.


''నీ కెందుకే నామీద అంత పిచ్చి ప్రేమ. అమాయకపు ముఖం దాన వెర్రిబాబుల దాన. ఏం పెట్టాను నేను నీకు. పంచభక్ష పరమాన్నాలు పెట్టలేదు కదా.. మిగిలి పోయిన కాస్తంత ఉప్పు పులుసు. ఎంత నా ఉప్పు పులుసు తింటే మాత్రం ఇంత విశ్వాసమా. ప్రతిగా సేవలు చేయాలని ఎక్కడైనా రాసి ఉందా? ఎవరైనా చేస్తున్నారా ఈ ప్రపంచంలో. విశ్వాసం చూపిస్తున్నారా మరి నీకెందుకే..దొంగ ముండా.''


అంటూ దాన్ని తీసుకుని ఒళ్ళు కూర్చోబెట్టుకుని కసురుకున్నాను కానీ నా కళ్ళలోంచి కన్నీళ్లు కారి అవి దాని నుదురు మీద పడినట్టు గ్రహించలేకపోయాను. కాసేపు పడుకోవే.... అంటూ జో కొడితే..... నా ఒడి చల్లదనంలో అది అలా వెంటనే మైమరచి పడుకుండి ఉంది.


అప్పటినుండి ప్రతిరోజు నేను తుంగచాప మీద పడు కున్నాక నాకు బాగా విసరి నేను హాయిగా పడుకున్నాక మాత్రమే తను పడుకోవాలని ప్రయత్నం చేస్తున్నట్టు దాని దినచర్య మార్చేసుకుంది.


ఈ 70 ఏళ్ల వయసులో నాకు కావలసింది హాయిగా పడుకోవడమే కదా. ఈ వృద్ధాప్యంలో హాయిగా మై మరచి నిద్రపోయే మహోన్నత యోగం ఎంతమందికి పడుతుంది.ఈ వయసుకి ఇంకేం కావాలి.


మహారాజు వైభోగ యోగం అంటే బంగారంతో కట్టిన ఇంట్లో ఉండడం..బంగారం కంచంలో బంగారపు బిస్కెట్లు పెట్టుకుని తినడం.. బంగారంతో దుస్తులు కుట్టించుకుని..బంగారం కారు కొనడం కాదు.


ఎవరికైనా వృద్ధ జీవితంలో తనవాళ్ళు చేసే సేవలతో సపర్యలతో మైమరచి హంసతూలికాతల్పం మీద పడుకున్నట్టు పడుకోవడమే మహారాజ వైభోగ యోగం అంటే..

నా విషయంలో అది నిజంగా నిజమైంది మరి.


నాకు మహారాజ వైభోగ యోగం ప్రవేశించింది.

***

నల్లబాటి రాఘవేంద్ర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.







రచయిత పరిచయం: నల్లబాటి రాఘవేంద్ర రావు


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


ముందుగా  " మన తెలుగు కథలు"  నిర్వాహకులకు నమస్సులు..

"రచయిత పరిచయం"..... ఇది చాలా ముఖ్యం.

రచయిత తన  గొప్పలు చెప్పుకోవడం కాదు గాని తన గతచరిత్ర వివరాలు అందరికీ తెలియ చేయటం అవసరమే. ఈ చర్య ఆ రచయితకు మానసికంగా ఎంతగానో ఉపయోగపడి అతను మరిన్ని మంచి మంచి రచనలు చేసి సమాజానికి అందించే అవకాశం ఉంది.. ఎంతో పెద్ద ఆలోచనతో అలాంటి 'మహా ప్రయత్నం'.. చేస్తున్న 'మన తెలుగు కథలు' కు మరొక్కసారి అభినందనలు.

పునాది....

-----------

ఏడు సంవత్సరాలు వయసు నాది. మా తండ్రి సుబ్బారావు గారు  ప్రోత్సాహంతో శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే 10 నిమిషాల నాటకాన్ని నేనే రాసి కృష్ణుడి వేషం  నేనే వేసి దర్శకత్వం నేనే చేసి పెద్ద స్టేజి మీద  దసరా నవరాత్రులకు ప్రదర్శించాము.


ఆ తర్వాత భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గా.. మరో నాటకంలో శ్రీరాముడుగా..   రచన దర్శకత్వం నాదే.. ఏడు సంవత్సరాల వయస్సు.


తర్వాత పదిహేను సంవత్సరాల వయసులో

టెన్త్ క్లాస్ యానివర్సరీ కి  15 మంది నటులతో నా దర్శకత్వం లో పెద్ద స్టేజి మీద నాటకం వేసాము.

అప్పుడే నేను రచయితను కావాలన్న

ఆశయం   మొగ్గ తొడిగింది.

నా గురించి..

---------------

50 సంవత్సరాల సుదీర్ఘ సాహితీ ప్రయాణం.

450  ప్రచురిత కథల రచన అనుభవం.

200 గేయాలు  నా కలం నుండి జాలువారాయి

200 కవితలు నా మేధస్సు నుండి ఉద్భవించాయి

20 రేడియో నాటికలు ప్రసారం.

10 టెలీఫిల్మ్ ల నిర్మాణం.

200 కామెడీ షార్ట్ స్కిట్స్

3  నవలలు దినపత్రికలలో


" దీపావళి జ్యోతి "అవార్డు,

"రైజింగ్స్టార్" అవార్డు

" తిలక్ స్మారక" అవార్డు... మరికొన్ని అవార్డులు.


ప్రస్తుత ట్రెండ్ అయిన  ఫేస్బుక్ లో  ముఖ్యమైన 15 గ్రూపుల్లో... ఇంకా అనేక వెబ్ సైట్లు, బ్లాగులు,ఆన్లైన్ పత్రికలలో యాక్టివ్ గా తరచు  నాకథలు,  కవితలు,గేయాలు, ముఖ్యంగా కామెడీ షార్ట్ స్కిట్స్ ప్రతి రోజూ దర్శనమిస్తూ ఉంటాయి..

రమారమి 75 అవార్డులు, రివార్డులు అందు కున్నాను... అని గర్వంగా చెప్పుకునే అవకాశం  కలగటం... ఆ చదువులతల్లి అనుగ్రహమే!

ఇదంతా ఒక్కసారిగా  మననం చేసుకుంటే...  'పడని సముద్ర కెరటం' లా... నూతనశక్తి మళ్లీ పుంజుకుంది.

ఇక నా విజయ ప్రయాణగాధ....

------+------------------------------

పేపర్లెస్ రచయితగా... ఒక కుగ్రామం లో పేరు ప్రఖ్యాతులు పొందిన  నా తండ్రి సుబ్బారావు గారు నా ఆలోచనలకు, రచనలకు ప్రాణప్రతిష్ట చేసిన ప్రథమగురువు. తల్లి వీరభద్రమ్మ  నాకే కాదు నా కథలకూ ప్రాణదాతే!!


తదుపరి రమారమి 50 సంవత్సరాల క్రితమే.. మా ఊరివాడైన నా జూనియర్ క్లాస్మేట్... నా స్నేహితుడు ఇప్పటి సినీ దర్శకుడు " వంశీ "... కథలు రాస్తూ...   నన్ను కూడా కథలు రాయ మని... చెప్తుండేవాడు. అప్పటి నుండి  ఎక్కువగా రాయడం మొదలు పెట్టాను.ఆ తర్వాత మా ఊరి  వారైన  సినీ గేయరచయిత

" అదృష్టదీపక్".. నా కథలు.. చదివి.. మెచ్చు కునే వారు.. దాంతో ఇంకా విరవిగా కథలు రాయడం మొదలు పెట్టాను.


1. మొదటి రచన 1975 నాటి ప్రఖ్యాత పత్రిక "ఆంధ్రసచిత్రవారపత్రిక" లో బుద్ధిలేనిమనిషి  కథ.


2. రేడియో నాటికలు  గొల్లపూడి మారుతీ రావు    గారి సమకాలంలో విరవిగా వచ్చాయి.


3. సినిమాకథలపోటీ లో అలనాటి "విజయచిత్ర"  ద్వితీయబహుమతి కథ..  "డిసెంబర్ 31 రాత్రి"


4. ఉగాది కథలపోటీ "ఆంధ్రభూమి" బహుమతి కథ


5. ఉగాది కథల పోటీలో "ఆంద్రజ్యోతి" బహు మతి కథ


6.  దీపావళి కథలు పోటీలో  "ఆంధ్రజ్యోతి" బహుమతి కథ.


7. అప్పాజోస్యుల( అమెరికా) నిర్వహించిన కథల పోటీలో "నలుగురితో నారాయణ".. ఆంధ్రప్రభ విశిష్ట కథ ప్రచురణ


8. అల్లూరి స్మారక జయంతి "కళావేదిక " కరప తిలక్ స్మారక అవార్డు కథ " బ్రతుకు జీవుడా"


9. "స్వాతి "   తానా అమెరికా కథల పోటీలో ప్రచురణ కు ఎన్నికైన కథ..." వైష్ణవమాయ."


10. రాష్ట్రస్థాయి కథలపోటీ హైదరాబాద్  "నిమ్స్"ద్వితీయ బహుమతి కథ..న్యాయనిర్ణేత శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి." బంగారు పేకమేడ"


11. "అనిల్ అవార్డ్" స్వాతి కన్సోలేషన్ బహు మతి..." అమృతం  కురిసింది"


12. సస్పెన్స్ కథల పోటీ "స్వాతి" లో ఎన్నికైన కథ


13. "పులికంటి సాహితీ సంస్థ" రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన కథ..


14. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆరాధన" హైదరా బాద్ ద్వితీయ బహుమతి కథ.." అదిగో స్వర్ణ యుగం"  న్యాయనిర్ణేత   జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.. శ్రీ రావూరి భరద్వాజ గారు.


15. "అభ్యుదయ ఫౌండేషన్" కాకినాడ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ కథ.. " ఐదేళ్ల క్రితం " .


16. సి.పి.బ్రౌన్ "సాహితీ స్రవంతి".. ప్రత్యేక కథ

" ఇంద్రలోకం".


17.  కొమ్మూరి సాంబశివరావు స్మారక  సస్పెన్సు కథల పోటీలో  "నవ్య' ప్రచురణకు ఎన్నికైన కథ.


18. "వేలూరు పాణిగ్రహి" విజయవాడ "  గాంధీ తాత"  రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి కథ.


19. 'కదలిక'... సర్వశిక్షఅభియాన్  రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మింపబడిన అత్యున్నత టెలీ ఫిల్మ్... చిన్న సినిమా.


20. "అల కమ్యూనికేషన్" హైదరాబాద్ కథల పోటీలో ఎంపికైన కథ...." హృదయానికి శిక్ష".


21. రాష్ట్రస్థాయి కథలపోటీ "మైత్రేయ కళాసమితి" మెదక్.. పుస్తక సంకలనానికి ఎన్నికైన కథ. "బిందెడు నీళ్లు".


22. రాష్ట్ర స్థాయి కథల పోటీలు "జాగృతి" కన్సోలేషన్ బహుమతి  కథ "ఆలస్యం అమృతం విషం"


23. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ  "ఆంధ్ర ప్రదేశ్" పత్రిక ప్రత్యేక బహుమతి హాస్య కథ.


24. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్రప్రభ" ప్రచురణకు ఎంపికైన కథ.


25. దీపావళి కథల పోటీ "ఆంధ్రభూమి" ప్రచురణ కు ఎన్నికైన కథ.


26.  రాష్ట్రస్థాయికథల పోటీ "ఆప్కో ఫ్యాబ్రిక్స్" హైదరాబాద్ నిర్వహణ  పోటీ లో ఎన్నికైన కథ.


27. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆంధ్రప్రదేశ్పత్రిక" కు ఎన్నికైన హాస్యకథలు." చంద్రమండలంలో స్థలమును అమ్మబడును".


28.దీపావళి కథల పోటీ "జాగృతి" పత్రిక కు ఎన్నికైన కథ.


29. "హాస్యానందం" విశేష స్కిట్స్ కొరకు.. "రైజింగ్ స్టార్".. అవార్డు.


30 ఆంధ్రజ్యోతి "భావ తరంగం"  వారం వారం 30 కథలు.


31. "కళా దర్బార్"  రాజమండ్రి.. రాష్ట్రస్థాయి  కవితలపోటీలలు... 4 సంవత్సరాలు ఉత్తమ  కవిత్వానికి ప్రథమ బహుమతి...మూడుసార్లు.. ఉత్తమ కవిత్వానికి ద్వితీయ బహుమతి.


32.."హాసం" మాస పత్రిక లో ప్రచురింపబడిన  "చిరాకు దంపతులు చింతకాయ పచ్చడి"    కథ చదివిన చాలా మంది సినీ ప్రముఖులు  ఫోన్ కాల్స్ చేసి అభినందించడం.


33. ప్రఖ్యాత సిరివెన్నెల పత్రికలో  సిరివెన్నెల సీతా రామశాస్త్రి గారి నిర్వహణలో జానపద పాటల పోటీలో  ప్రథమ బహుమతి  పాటకు వారి నుండి  పత్రికాముఖంగా ప్రత్యేక ప్రశం సలు.. తదుపరి ఆ పాట అనేక   రంగస్థల ప్రదర్శనలు పొందడం.


34. విశేష కథలుగా  పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కథలు

  నలుగురితోనారాయణ

  కొరడా దెబ్బలు

  అమృతం  కురిసింది.

  వైష్ణవమాయ

  ఐదేళ్ల క్రితం

  ఇంద్రలోకం

  బిందెడు నీళ్లు

  చంద్రమండలంలో స్థలములు అమ్మబడును

  డిసెంబర్ 31 రాత్రి

  మహాపాపాత్ముడు

 

35. రాజమండ్రి ,కాకినాడ ,విజయవాడ, విశాఖ పట్నం ,రామచంద్రపురంలో.. విశేష సన్మానాలు.


ప్రస్తుతం...


1. ఒక పరిశోధన నవల.. ఒక చారిత్రక నవల రాసే ప్రయత్నం


2. పరిషత్ నాటికలు జడ్జిగా..


3.  కొందరు సినీప్రముఖుల ప్రోత్సాహంతో..

సినిమాలకు కథ మాటలు స్క్రీన్ప్లే అందించే ప్రయత్నం.


4. ..  4 కథల సంపుటిలు... రెండు కవితా సంపుటిలు.. 1గేయ సంపుటి.. 2 కామెడీ షార్ట్ స్కిట్స్.. రెండు నాటికల సంపుటిలు..ఒక నవల ప్రచురణ తీసుకొచ్చే ప్రయత్నం.


5. ఒక ప్రింటెడ్ పత్రిక  ప్రారంభించే ఉద్దేశ్యం.


భార్య.. గోవిందీశ్వరి... హౌస్ వైఫ్.

కుమారుడు... వెంకట రామకృష్ణ .. బి.టెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్... మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్.

కోడలు... మాధురీ లత..... ఎం ఫార్మసీ.

కుమార్తె.. సౌభాగ్య.. స్టూడెంట్.

మనుమరాలు.. ఆద్య... యాక్టివ్ బేబీ.

నా కథలను ఆదరించి తమ అమూల్య అభి ప్రాయాలు తెలియజేస్తున్న... రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ... వినమ్ర నమస్సులు.

నల్లబాటి రాఘవేంద్ర రావు



 
 
 

Comments


bottom of page