top of page

మామయ్య ఇంకా రాలేదు


'Mamayya Inka Raledu' - New Telugu Story Written By Penumaka Vasantha

'మామయ్య ఇంకా రాలేదు' తెలుగు కథ

రచన: పెనుమాక వసంత

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


"ఏంటి కిష్టయ్య గారు, మీ అబ్బాయీ.. పట్నంలో, జాబ్ వదిలేసుకుని ఇక్కడే...ఉండటానికి వచ్చేస్తున్నాడా!?" కిష్టయ్య గారు రచ్చబండ, దగ్గరకు, రాగానే అడిగారు. అక్కడ కూర్చున్నవాళ్ళు.


"అవును! నాకూ పెద్ద వయసయిందీ! నాకున్నదీ ఒక్కడే కొడుకు. ఉన్నదాంట్లో, కలో, గంజో తాగుదామనీ.. రమ్మన్నాను. రేపో...మాపో వచ్చేస్తాడు” అన్నాడు కిష్టయ్య.



"అవును లే! చివరి దశలో మనం వాళ్ల కాడకు పోయే కన్నా వాళ్ళు, ఈడకు వస్తేనే...సుకంలే” అని చుట్ట కాలుస్తూ రామయ్య అన్నాడు.

"మా అబ్బాయీ.. ఇక్కడకి రండి, మీ ఇద్దరు అక్కడెందుకూ? అంటే.. ఎగేసుకొని పట్నం పోయాం. నాలుగు రోజులు, బానే ఉన్నాం, మా కోడలు, దానిమీద, దీనిమీద, పెట్టీ ఒకటే సూటిపోటి మాటలు. అరే ఒద్దు రా బాబు.. అని మళ్ళీ ఇక్కడికే... చేరాం. మావాడు, ‘ఉండండీ!’ అంటే ఊరి మీదకు, గాలి మళ్ళిందనీ చెప్పొచ్చాము” అన్నాడు సుబ్బయ్య.


"అవును. ఈడ అయితే పలకరించేవాళ్ళు ఉన్నారు. ఆడ ఎవరూ ఇళ్ళల్లోంచి బయటకు రారు. మనం పలకరిస్తే పల్లెటూరోళ్ళు అని ఎగతాళి.." మధ్యలో అందుకుని వెంకయ్య అన్నాడు.


"మా వాడు, ఈ కాలం పిల్లాడు కాదు. నేను ఏది చెపితే అదే” అని చెప్పి, గర్వంగా ఇంటికి కదిలాడు కిష్టయ్య.


"సుబ్బులూ! ఎక్కడా?" అంటూ కిష్టయ్య పిలిచాడు.


"మామా.. వచ్చావా! ఇక్కడే ఉన్నా నంటూ బయటకు వచ్చింది. సుబ్బులు కిష్టయ్య అక్క సోమమ్మ కూతురు. కిష్టయ్య అక్కను కూడా మేనరికం ఇచ్చారు. మేనరికం వల్ల సుబ్బులు, పుట్టిన దగ్గర నుండే ఏదో అమాయకంగా, పెద్ద తెలివితేటలు లేకుండా ఉండేది.


సోమమ్మ, బయటి వాళ్లకు, దీన్ని ఇస్తే దీనికీ తాటాకులు కడతారురా...! అంటూ బతిమాలి తమ్ముడికిచ్చి చేసింది. అక్కమాట కాదనలేక, సుబ్బులుని పెళ్ళిచేసుకున్నాడు కిష్టయ్య.

మొన్నటిదాకా, తల్లే అన్నీ సుబ్బులుకు అమర్చి పెట్టేది. సుబ్బులుకు, ఇద్దరు అమ్మాయిలు, ఒక పిల్లాడు. సోమమ్మ, పోయినా ఆ ఇద్దరు ఆడపిల్లలు, వాళ్ల పెళ్ళిళ్ళు అయ్యేదాకా అమ్మను చూసుకున్నారు. అందువల్ల సుబ్బులుకు లోకం పోకడ, ఏమీ తెలియదు. వంటపని, ఇంటిపని చేస్తూ ఇంట్లోనే ఉండేది.

తోచక పోతే బయట అరుగు మీద కూర్చుని ఉంటుంది.


ఎవరైనా "బావున్నావా సుబ్బులూ!" అంటే "బావున్నా!" అనేది. అంతవరకే. తనకి ఏమీ తెలియదని అమ్మా, పిల్లలు, చెప్పటం వల్ల అవును కదా అనీ, తనచుట్టూ ఒక గిరి గీసుకొని, దానిలో ఉంటుంది సుబ్బులు.

పిల్లల, పెళ్ళిళ్ళయిన తర్వాత, ఆమెను ఒక పసిపిల్లలాగా చూసుకుంటున్నాడు కిష్టయ్య. ఏమి కావాలన్నా "మామయ్య.. ఇది తెచ్చిపెట్టు, అది తెచ్చిపెట్టు," అంటూ... ప్రతి దానికి కిష్టయ్య మీద ఆధారపడింది సుబ్బులు. పిల్లలను చుట్టాల్లో ఇవ్వకుండా దూరపు సంబంధాలు చేశాడు. తెలివిగల పిల్లని కోడలు గా తెచ్చాడు కొడుకు శేషుకి.


వూళ్లో, ఉన్న పది ఏకరాలలో ఒక ఐదు ఎకరాలు, పిల్లల పెళ్ళిళ్ళకు కరిగింది. ఇక మిగిలిన ఐదు ఎకరాలు, కౌల్ కిచ్చి, తింటున్నాడు కిష్టయ్య. ఇప్పటివరకు... కొడుకు, నాన్న మీద నమ్మకం తో, లెక్కలు అడగకుండా ఉన్నాడు.


కొడుకుకు ప్రైవేట్ ఉద్యోగమని కిష్టయ్య గారు డబ్బు పంపేవారు. కొడుకు పిల్లలు, పెద్ద వాళ్ళయి, వేరేచోట చదువులకి, వెళ్ళారు. అద్దెలు కట్టలేక, ఊరిలో సొంత ఇంటిలో, ఉంటూ... పొలం చూసుకుంటూ... ఉండవచ్చని వచ్చారు కొడుకు శేషు, కోడలు సుధ. వచ్చిన ఒక పది రోజులు బాగానే గడిచాయి.


సుధా ఇరుగు...పొరుగు తో మాట్లాడుతూ ఉండేది. వాళ్ళు చెప్పిన మాటల్ని బట్టి ఆస్తి అంతగా లేదనీ, ఆడపిల్లలు, పొద్దస్తమానం... పుట్టింట్లోనే తిష్టవేసి తిన్నారనీ, మిగతా ఐదయినా చేతిలో పెట్టుకోకపోతే చేతికి చిప్పెననీ, గ్రహించింది. అందువల్ల, కిష్టయ్యను సుబ్బులును ఏదో దాని మీద పెట్టి విసుక్కోవడం మొదలెట్టింది.

ఇంతలో... శేషు కొడుకుకు, అమెరికా లో ఇంజనీరింగ్ సీట్, వచ్చింది. దానికి షూరిటిగా పొలం గాని, ఇల్లుగాని, పెట్టాలనీ, లోన్ కోసం ఇంటికి వచ్చాడు, మనవడు కృష్ణ. తీరా చూస్తే పొలం మీద, ఇంటి మీద, అప్పటికే అప్పులు ఉన్నాయని తెలియటంతో కోడలు సుధ గొడవ చేసింది. పొలాలు పండక, అల్లుళ్ళు వచ్చి అప్పుగా ఇవ్వండని తీసుకున్నారు కొంత డబ్బు. వాళ్ల ని అడగలేదు కిష్టయ్య, మొహమాటంతో.

ఇంకా... గుడి ధర్మకర్త గా కొంత డబ్బు ఇవ్వటం,... ఇలాంటివాటి తో అప్పులు అయిన మాట నిజమే.! ఇవన్నీ తెలిసినా నాన్న మీద ఉండే, ప్రేమ, వూళ్లో నాన్నకు ఉన్న మంచితనంతో, నాన్నను ఎపుడూ లెక్కలు అడగలేదుశేషు.


చిన్నప్పుడు, గుళ్లో విన్న సూక్తుల వల్ల తల్లితండ్రులను ప్రేమించాలనీ, పిల్లలుగా, అది తమ కర్తవ్యమనీ నాన్నను, వెన్నంటే ఉండేవాడు.

కొడుకు పిల్లలు, వచ్చి “మనకు ఊరి లో ఆస్తి ఉందన్నావూ!? మా చదువులకి, తాత, ఆస్తి ఏ మాత్రం ఉపయోగపడటం లేదని వాళ్ళు శేషుని అడిగారు. దీనికి తోడు సుధ అంతా మీ చెల్లెళ్ళకు దోచి పెట్టాడని సాధించటం..


వీటితో మొదటి సారి, తండ్రిని విసుక్కున్నాడు శేషు.


"అదికాదురా..” అని కిష్టయ్య చెప్పేలోపే "నాన్నా! ఎరక్కపోయి, ఇక్కడికి వచ్చాను. ఇక నీ నీతులు పోయీ.. రచ్చ బండలో చెప్పూ! ఇక్కడ కాదు... నీవల్ల పిల్లల దగ్గర, పెళ్ళాం దగ్గర, చులకన అయ్యాను!” అంటూ విసుగ్గా బయటకు వెళ్ళాడు.


ఒకరోజు, రచ్చబండ దగ్గర దిగులుగా ఉన్న కిష్టయ్యని పలకరించారు, ఊరి జనాలు.


“ఏందీ!? మనవడి చదువు కోసమా ఆలోచిస్తాన్నావు!?” అంటే అవుననీ అట్లాగే మాట్లాడుతూ ఉండిపోయాడు అక్కడ.

కాసేపటికి, శేషు వచ్చి "ఏంటి నాన్న నువ్వూ! ఇక్కడ కబుర్లు, చెపుతూ కూర్చొంటే, అక్కడ అమ్మ నీ కోసం అరుగు మీద కూర్చుంది” అన్నాడు.


"వస్తున్నారా!" అని లేచాడు కిష్టయ్య.

“"ఎంత దాకా వచ్చింది మీవాడి లోన్ శేషూ!" అని అక్కడి వాళ్ళు అడిగితే "ఈయన దయవల్ల మా పిల్లల చదువు అటకెక్కింది. కొందరూ.. ఎందుకు పుడతారో, తెలీదు! సిగ్గులేని జన్మ?” కిష్టయ్య వైపు చూస్తూ అన్నాడు.


కిష్టయ్య, అంతవరకూ ఎంతో మంది పిల్లలకు "మీ తండ్రులని కష్టపెట్టకండ”ని చెప్పేవాడు.


పెద్దవాళ్ళకు "నా కొడుకు బంగారం, నన్ను కష్టపెట్టడు, వాడికి నా మాటే వేదం!?" అనేవాడు.


శేషు మాటలు విని అందరూ ముక్కున వేలేసుకున్నారు.


‘మా పిల్లలకి శేషునీ చూపించీ.. అలా ఉండాలని చెప్పేవాళ్ళం. ఇపుడు చూస్తే, మేమే నయంగా! మా పిల్లలు, మమ్మల్ని! బజార్లో తిట్టలేదు’ అని లోలోపల ఆనందపడ్డారు. సిగ్గు తో, నోట మాటరాక, తలదించుకుని, ఇంటికి వెళ్ళాడు కిష్టయ్య.

“మామయ్యా! ఎక్కడికి వెళ్ళావు! ఇంతసేపు రాలేదు"అంది సుబ్బులు.


"కాటిలోకి" అంటూ లోపలికి, నడిచాడు విసుగ్గా.


ఒక వారం రోజులు, పక్కన ఉన్న, సిటీ కి ఏవో కాగితాలు, తీసుకుని, తిరిగాడు కిష్టయ్య.

సుబ్బులుని అన్నం తినమంటే "మామయ్యని రానీ..." అంటూ బయట కూర్చొనేది.

అదిచూసి, శేషూ కిష్టయ్య రాగానే "మీ ఆవిడను, కూడా తీసుకెళ్ళు. ఈవిడ నీ కోసం బయట అరుగు మీద పడిగాపులు, కాస్తుంటే చూడలేక చస్తున్నాము" అన్నాడు.


ఇంట్లో కొడుకు, కోడలు, మాట్లాడటం లేదు కిష్టయ్యతో. కిష్టయ్య బాగా దిగులు పడ్డాడు.


"నాన్నా! మేము, మళ్ళీ, సిటీకి వెళ్దాం అనుకుంటున్నాము" అన్నాడు శేషు.


ఏమీ మాట్లాడకుండా మౌనంగా బయటకు వెళ్ళాడు కిష్టయ్య.

మరుసటి రోజు, పొద్దున సుబ్బులు “మామయ్య గుడికెళ్ళీ.. ఇంకా రాలేదు?" అని శేషు కి చెప్పింది..


బయట ఎవరో "కిష్టయ్య గారు" అని కేక వేస్తున్నారు.

‘ఎక్కడికి వెళ్లాడు నాన్నా.. గదిలో... ఏవన్నా ఉన్నాడా ! అనీ వెళ్లి చూసాడు శేషూ.


కాగితం పైన, పెన్ను పెట్టిఉంది. పెన్ తీసి, చూసాడు.


దానిపై... "నీ పిల్లాడి, లోన్ కోసం బ్యాంక్ వాళ్ల తో మాట్లాడి ఏర్పాటు చేశా. నీకు వచ్చే ఐదు ఏకరాలు నీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేశా. మీ చెళ్ళల్లకు మీ అమ్మ పుట్టింటి ఆస్తితో పెళ్ళి చేశాను. మీ చెల్లెళ్ళకు, నీకు వచ్చేదానిలో నుండీ! ఏమీ తీసి ఇవ్వలేదు. చిన్న...చిన్న అప్పులుంటే, అవికూడా మీ అమ్మ, నగలు అమ్మి తీర్చేసాను. ఊళ్లో, తిరగాలంటే నాకు మొహం చెల్లటం లేదు. నా కోసం, వెతకవద్దు. మీ అమ్మ జాగ్రత్త.” అని వ్రాసి ఉంది.

“శేషూ! నాన్న ఎక్కడికి వెళ్ళాడు?” అన్న సుబ్బులుతో ఏమీ మాట్లాడ లేకపోయాడు. ఎంత తెలివితక్కువగా ప్రవర్తించాననీ బాధ పడ్డాడు. నాన్న నన్ను చిన్నప్పటి నుండీ ఎంత ప్రేమగా చూసాడు..


ఇంతలో సుబ్బులు, వచ్చి "నాన్న ఏడి?" అంది.


“బయటకు, వెళ్ళాడు, వస్తాడమ్మా!” అన్నాడు కానీ నాన్న తిరిగి రాడని అక్కడే ఏడుస్తూ, కూల పడ్డాడు శేషు.


పాపం సుబ్బులు.. ప్రతిరోజూ బయట కూర్చొని, మామయ్య వస్తాడని... ఎదురుచూస్తుంది. ఆ పిచ్చితల్లికీ ఏమి తెలుసు? గాయపడిన హృదయం అంత తొందరగా తిరిగిరాదనీ...!


మీకు ఎవరికన్నా ఎక్కడన్నా కిష్టయ్య కనబడితే, "సుబ్బులు నీ కోసం బయట అరుగు మీదే ఉంది. ఎదురు చూస్తోంది అని చెపుతారా.!?


ఆనవాళ్లు, కావాలా!? డెబ్బై సంవత్సరాలు.. బక్కపల్చగా, ఉండీ చామనచాయ, బట్టతల,నుదుటి పై నిలువుబొట్టు, మెళ్ళో సంచి, దానిలో రామకోటి పుస్తకం, మంచినీళ్ళ బాటిల్ ఉంటుంది. ఎవరికైనా...? కనపడితే కింది నంబర్ కూ! తెలియచేయండి.

ఇంట్లోనుండి, కిష్టయ్య ఎందుకు వెళ్ళాడో తెలీని సుబ్బులు "మామయ్య ఇంకా రాలేదు" అని అందరినీ అడుగుతూ... ఇంకా అరుగుమీదే ఉంది.

***

పెనుమాక వసంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:

పేరు వసంత పెనుమాక, గృహిణి. రచనలు చేయటం, పాటలు వినటం హాబీస్. మన తెలుగు కథలకు కథలు రాస్తున్నాను. ధన్యవాదములు.


35 views0 comments
bottom of page