top of page

మమతల మధువు ఎపిసోడ్ 1


'Mamathala Madhuvu Episode 1' New Telugu Web Series


Written By Ch. C. S. Sarma




(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ గారి ధారావాహిక మమతల మధువు ప్రారంభం

“అమ్మా!.. నీవు వ్రాసిన వుత్తరం చేరిందని ఫోన్లో చెప్పాను. కానీ యీ నా పదిహేను నెలల జీవితాన్ని గురించి ఫోన్లో వివరంగా మాట్లాడలేక పోయానమ్మా!..” అందుకే యీ లేఖ వ్రాస్తున్నాను.


నాకు నీవు చిన్నతనంలో రోజూ చెప్పేదానివి.. 'అబద్ధం చెప్పకూడదు.. అన్యాయాన్ని చూస్తూ వూరుకోకూడదు, ఎదిరించాలి. ఆపదలోవున్న వారిని ఆదుకోవాలి. వున్నంతలో.. పేదవారికి దానం చేయాలి. మంచి మనిషిగా సంఘంలో బ్రతకాలి. కన్న తల్లిదండ్రులకు ఆనందం కలిగించాలి. మనం చచ్చిపోయిన తర్వాత.. పదిమంది మనలను గురించి గొప్పగా చెప్పుకోవాలి' అని.


యీ మాటలను నీవు నాకు చిన్న తనంలో చెప్పేటప్పుడు వినడానికి బోరుగా తోచేది. కానీ.. ఎదిగే కొద్ది ఆ నీ మాటలు మామూలు మాటలు కావని.. జీవిత సత్యాలని, నీవు వాటన్నింటినీ నాలో చూడాలని కలలు కంటున్నావని నాకు అర్థం అయింది. నీ మాటల మీద నాకు నమ్మకం కలిగింది. నీ నుండి విన్న ఆ సత్య సూక్తులు నా గుండెనిండా నిండి వున్నాయమ్మా!..


వూహ తెలిసిన నాటి నుంచీ.. ఆచరణలో పెట్టేదానికి ప్రయత్నించాను. కానీ, అవి నేటి యీ సమాజంలో, ఆచరణకు అందని ఆశయాలుగా.. మన చుట్టూ వున్న చిత్రమైన వ్యక్తుల కారణంగా మారాయమ్మా!.. కానీ, వాటిని నేను నా మనోదర్పణం నుంచి చెరిపి వేయలేదమ్మా!..

అవమానాల పాలైనా ఆచరించే దానికి ప్రయత్నం చేస్నూనే వున్నానమ్మా!..


ఆ కారణంగా.. పదమూడేళ్ళ ప్రాయంలో.. పది సంవత్సరాల క్రిందట.. మీ అందరి దృష్టిలో నేరస్థుణ్ణి అయినాను. నీకు నాన్నకు తాతయ్యకు తలవంపులు కలిగించాను. ఫలితంగా మీరు అందరూ కలసి నాకు వేసిన శిక్ష.. నన్ను మీ నుంచి దూరంగా చదువు నెపంతో పంపివేయడం జరిగింది.


చిన్న వయస్సులో.. మీ అందరి మీద కోపం వుండేదమ్మా!.. కానీ ఎదిగేకొద్ది, మీరు నా పట్ల చేసింది కరక్టు అనిపించేది. నీవు చెప్పిన మాటలను జ్ఞాపకం చేసికొనేవాణ్ణి. మంచి మనిషిగా ఎదిగి.. నీకు నాన్నకు తాతయ్యకు సంతోషాన్ని కలిగించాలనుకొనేవాణ్ణి.


వూరికి వస్తే నన్ను ద్వేషించే వారిని చూడవలసి వస్తుందని, ఆ పాతజ్ఞాపకాలు గుర్తుకు వస్తాయని.. వూరిజనాన్ని చూడవలసి వస్తుందని.. వారు అనే మాటలు వినవలసి వస్తుందని. మీరు పిలిచినప్పుడు శలవుల్లో కూడా.. వూరికి రావడానికి అంగీకరించేవాణ్ణి కాదు. నా ఆ నిర్ణయం.. ఆచరణ.. నీకు నాన్నకు తాతయ్యకు ఎంతో బాధ కలిగించి వుంటుందన్న విషయం నాకు తెలుసు. తెలిసినా.. నా నిర్ణయాన్ని మార్చుకోకుండా.. ఎంతో కష్టం మీద అమలుపరిచాను. యీ పది సంవత్సరాలు మీతో కలసి వుండలేనందుకు నేను ఎంతో బాధను.. ఆవేదనను అనుభవించానమ్మా!..


బాలనేరస్థుడిగా జైలుపాలు కావలసిన నన్ను మీరు రక్షించారు. నా మేలు కోసం.. నన్ను మీకు దూరంగా వుంచారు. యీ విషయాన్ని చాలా లేటుగా.. అర్థం చేసికొన్నానమ్మా.!.. మీరు చేసిందంతా నా శ్రేయస్సు కోసం.. వుజ్వల భవిష్యత్తు కోసమేనని.. నీకు అర్థం అయిందమ్మా. నీకు.. యిప్పుడు ఎవ్వరి మీద కోపం లేదు. నీవు చెప్పిన మాటలను మననం చేస్తూ.. చుట్టూ వున్న వ్యక్తులను చూస్తూ.. చాలా నేర్చుకొన్నానమ్మా.. నీ ఆశయాన్ని తప్పక నెరవేరుస్తానమ్మా. మన ప్రేమ వ్రాసిన లెటర్లనూ.. పంపుతున్నాను. చదువు. నీవు ఆనందంగా నవ్వుకొంటావు.


యీ రోజు డిసెంబర్ 31 తేదీ. యీ రాత్రి పన్నెండు గంటలకు కొత్త సంవత్సరం వస్తుంది. ఆ సంవత్సరంతో నా ఎం.టెక్. చదువు పూర్తవుతుంది. నా 2010 సం॥ డైరీని నీకు పంపుతున్నాను. నేను వ్రాసిన, ప్రతి అక్షరము సత్యం. అందులో నీకు గోచరించేది నేను యీ తొమ్మిది సం॥ల్లో నేర్చుకొని, నమ్మి, ఆచరించే దినచర్య. సాంతం చదివి నాతో మాట్లాడమ్మా!.. నీకు.. నాన్నగారికి.. తాతయ్యగారికి.. నేను ఎంతగానో ఋణపడివున్నానమ్మా.. ఆ ఋణాన్ని తీర్చుకొనేటందుకు నా యీ జన్మ చాలదనిపిస్తూవుంది. మరుజన్మ అంటూ వుంటే.. నేను మరలా నీ కడుపున పుట్టాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. మీ అందరికీ నా పాదాభివందనాలు.”


ఇట్లు.. మీ ఆదిత్య


వుత్తరం సాంతం చదివేసరికి.. గౌరి నయనాలు.. అశ్రుపూరితాలైనాయి. దుఃఖం అవధులు దాటింది. పొంగి పొరలి వస్తున్న ఆవేదనను ఎంతో కష్టంతో హృదయంలో అణచుకొంది. పవిట చెంగుతో కన్నీటిని తడుచుకొంది.

గదిలోకి వచ్చిన పనిమనిషి వీరమ్మ.. యజమానురాలి స్థితిని చూచింది. ఆశ్చర్యపోయింది. మెల్లగా గౌరిని సమీపించింది.

"అమ్మా!..”


గౌరి తల ఎత్తి వీరమ్మ ముఖంలోకి ప్రశ్నార్థకంగా.. చూచింది.

“ఎందుకమ్మా బాధ పడతుండారు?..” వికలమైన మనస్సుతో అడిగింది వీరమ్మ.


"ఏం లేదు. నీవు వంటింట్లోకి వెళ్ళి చక్కబెట్టు. నేనూ వస్తాను.'

"అలాగే అమ్మగోరూ!..”


వీరమ్మ మౌనంగా వెళ్ళిపోయింది. పాతిక సంవత్సరాలుగా ఆ యింట్లో పనిచేస్తూ వుంది వీరమ్మ. గౌరికంటే వయస్సులో పదేళ్ళ పెద్ద. ఎప్పుడూ నవ్వుతూ.. ఎంతో ఆనందంగా వుండే గౌరి.. కళ్ళల్లోని కన్నీటిని చూచి వీరమ్మ బాధపడింది. గౌరి ఆజ్ఞ ప్రకారం వంటిట్లోకి ప్రవేశించింది.


గౌరి.. లెటర్ను కవర్లో వుంచింది. అందులో వున్న డైరీని బయటికి తీసింది. పేజీలు త్రిప్పిచూచింది. ఇంగ్లీష్.. తెలుగులో కూడా అది వ్రాసి వున్నాడు. సెల్ మ్రోగింది. అది తన భర్త గోపాల్గారి కాల్.

ఆనందంగా.. “హలో!..” అంది.

"గౌరీ నేను..”

"ఆ.. ఆ.. చెప్పండి."

"నేను యీ రోజు రావడం లేదు. రెండు రోజుల తర్వాత వస్తాను. పని పూర్తికాలేదు.”


"అలాగే!.. అవును.. యిప్పుడు ఎక్కడ వున్నారు?..”

"వైజాగ్”

"నేను యీ రోజు మీరు వస్తారనుకొన్నాను.”

"రాలేను గౌరీ.. నాకు తెలుసు నీవు నా రాక కోసం ఎదురు చూస్తూ వుంటావని. అందుకే ఫోన్ చేశాను." అనునయ పూర్వకమైన జవాబు.


“సరే!.. ఆరోగ్యం జాగ్రత్త.” ఆప్యాయతా పూరిత సందేశం.

"నాన్నగారు ఎలావున్నారు?”

"బాగున్నారు. ఆఫీస్కు వెళ్ళివున్నారు. మన ఆది.. జాబు వ్రాశాడు."


"జాబా!..”

“అవును.”


"ఏం వ్రాశాడు?.. బాగున్నాడు కదా!..” తనయుడి మీద వున్న వాత్సత్యం ధ్వనించింది ఆ పలుకులలో,


“ఆఁ.. ఒక్క సంవత్సరంలో తన చదువు పూర్తవుతుందని వ్రాశాడు. చాలా నేర్చుకున్నానమ్మా అని వ్రాశాడు. వాడు..” కంఠం బొంగురు పోయింది. చెప్పలేకపోయింది గౌరీ.

"గౌరీ!..”.

"ఊం..”

“బాధపడకు. నేను రావడంతోటే.. మనం వెళ్ళి వారం రోజులు వాడితో కలసివుండి ఆనందంగా తిరిగి వద్దాం. అయినా.. వాడు వ్రాసినట్టు, చదువు పూర్తి కావడానికి మిగిలివుంది ఒక్క సంవత్సరమేగా!.. ఆ తర్వాత వాడు మన దగ్గరకు వచ్చేస్తాడుగా!.. బాధపడకు గౌరి!..” ఓదార్పును వ్యక్తం చేసే గోపాల్ పలుకులు.


"ఎల్లుండి మీరు తప్పక వస్తారు కదూ!..”

"వస్తాను గౌరీ!.. నీవు ఏ విషయానికీ దిగులు పడకు. అన్నింటికీ నీకు తోడుగా నేను వున్నానుగా!.. కట్ చేయనా!..”


“ఆ.. మీరు జాగ్రత్త.”

"థాంక్యూ గౌరీ.”


గోపాల్ కట్ చేశాడు. గౌరి సెల్ టేబుల్పై పెట్టి వంట గది వైపు వెళ్ళింది. ఆమె మదినిండా ఆదిత్యను గురించిన తలపులే. లేఖలోని చివరి మాటలు ఆమెను ఎంతగానో కలవర పరిచాయి. తమకు దూరంగా వుండి ఆదిత్య ఎంతగానో బాధ పడుతున్నాడని ఆమె గ్రహించింది. భర్త గోపాల్ తిరిగి రాగానే.. మణిపాల్కు వెళ్ళి ఆదిత్యను కలిసి కనీసం ఒక వారం రోజులు ఆనందంగా గడపాలని నిర్ణయించుకొంది.


పనిమనిషి వీరమ్మకు రాత్రి భోజనానికి కావలసిన చపాతీలు కుర్మాను గురించి వివరించి.. అశురసంధ్య వేళ అయినందున.. పూజా మందిరంలో ప్రవేశించి.. దీపారాధన వెలిగించి, క్షీర నివేదన జరిపి భగవత్ ధ్యానంలో కూర్చుంది గౌరి.


వైజాగ్లో గోపాల్.. గౌరితో ప్రసంగం ముగించి తనకు ఎంతో ముఖ్యమైన వ్యక్తి హాస్పటిల్లో వున్నందున వేగంగా హెూటల్ గది నుంచి బయటికి వచ్చి కార్లో హాస్పటల్ వైపుకు బయలుదేరాడు. అతని వదనంలో అప్రసన్నత.. మదిలో కలవరం.. మస్థిష్కంలో అశాంతిని కలిగించే భావాలు. కారు వేగాన్ని హెచ్చించాడు. తండ్రి భీమారావుకు ఫోన్ చేసి పనికాలేదని గౌరికి చెప్పినట్లుగా, రెండు రోజుల తర్వాత వస్తానని చెప్పాడు.

*****

కారు హాస్పటల్ ఆవరణంలో ప్రవేశించింది. పార్కింగ్ స్థలంలో కారును వుంచి వేగంగా వార్డు వైపుకు నడిచాడు గోపాల్, మురారి ఎదురైనాడు. అతని వదనం ఎంతో విచారంగా వుంది.


“మురారీ!.. ఆపరేషన్ అయిందా!..” ఆత్రంగా అడిగాడు గోపాల్.

"అయింది. ఐ.సి.యు.లో వుంచారు.”

"డాక్టర్ ఏమన్నారు?..”

“యిరవై నాలుగు గంటలు గడవాలన్నారు.” మురారి కళ్ళల్లో నీళ్ళు.


గోపాల్ హృదయంలో ఎంతో ఆందోళన. బాధ. పైకి గంభీరంగా నటిస్తూ..

“మురారి!.. ఏం కాదు. భయపడకు” కానీ.. అతని నయనాలూ అశ్రుపూరితాలైనాయి. మనస్సులో ఏదో అపశృతి. తలను ప్రక్కకు త్రిప్పుకొన్నాడు.


తన శరీరంలో శక్తి సన్నగిల్లుతున్నట్లు.. భావన. 'భగవాన్!.. నా తప్పులను మన్నించు. శాంతిని రక్షించు.. శాంతిని రక్షించు.' మనస్సులో వేడుకొన్నాడు తాను ఎంతగానో నమ్మే.. భగవాన్ రమణశ్రీని.


యిరువురూ బెంచీపై కూర్చున్నారు. ఒకరి దృష్టిలో మరొకరు చూపులు కలపలేని దుస్థితి. వారిరువురి మనోవేదన ఒక్కటే.

నర్స్ బయటికి వచ్చింది. ఆమెను చూచి యిరువురూ లేచారు. ఆమె ఏమైనా చెబుతుందనే ఆశతో. ఆమె వీరితో ఏమీ మాట్లాడకుండా వేగంగా ప్రక్కగదిలోకి వెళ్ళిపోయింది. ఐదు నిముషాల్లో బయటికి వచ్చి వేగంగా ఐ.సి.యు.లో ప్రవేశించింది.


పది నిముషాల తర్వాత.. డాక్టర్, నర్స్ బయటికి వచ్చారు. గోపాల్, మురారీ.. ఆత్రుతతో డాక్టర్ని సమీపించారు.


“డాక్టర్!.. శాంతి..”

గోపాల్ పూర్తి చేయకముందే..

“ఆపరేషన్ జరిగింది. స్పృహ వచ్చేదానికి ఏడెనిమిది గంటలు అవుతుంది. డ్యూటీ డాక్టర్.. నర్స్ వున్నారు. వారు పేషెంట్ను జాగ్రత్తగా చూచుకొంటారు. మీరు ఎవరో ఒకరుంటే చాలు. ఒకరు యింటికి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి, రేపు ఉదయం రండి. అప్పుడు మీరు పేషెంట్తో మాడ్లాడవచ్చు." ఎంతో సహనంతో చెప్పాడు డాక్టర్.


నర్స్.. డాక్టర్ ముందుకు వెళ్ళిపోయి మరో గదిలో ప్రవేశించారు.


“బావా!.. మీరు వెళ్ళండి. నేను యిక్కడ వుంటాను." మెల్లగా చెప్పాడు. మురారి.


గోపాల్ మురారి ముఖంలోకి పరీక్షగా చూచాడు. గోపాల్ చిరునవ్వుతో.. “నేనున్నానుగా బావా!.. మీరు వెళ్ళి.. వుదయాన్నే రండి.” వినయం.. సహనం.. నిండి వున్న మాటలవి.


“ఆనంద్ కి ఫోన్ చేసి చెప్పావా?..”

“చెప్పాను.”

“వస్తానన్నాడా!..”

“ఆ..”


“సరే మురారి!.. నే వెళతాను. ఏదైనా అవసరమైతే.. వెంటనే ఫోన్ చెయ్యి, వస్తాను.”

“అలాగే బావా!..”


యిరువురూ లిఫ్టులో క్రిందికి వచ్చి కార్ పార్కింగ్ను సమీపించారు. గోపాల్ కార్లో కూర్చున్నాడు.

“మురారీ!.. డబ్బువుందా!..”

“మీరు యిచ్చిన దాంట్లో యింకా పాతికవేలు మిగిలివుంది బావా!..”


“సరే!.. క్యాంటిన్లో ఏదైనా తిని నీవూ విశ్రాంతి తీసుకో. నేను వుదయం ఆరున్నర కల్లా వస్తాను.”

“సరే బావా!..”


కారు కదిలి వెళ్ళిపోయింది. మురారి లిఫ్టు వైపుకు నడిచాడు. ఎక్కి.. మూడవ అంతస్థులో వున్న.. ఐ.సి.యు వార్డు వైపుకు వెళ్ళాడు.


గోపాల్.. యాంత్రికంగా కారునడుపుతున్నాడే కానీ.. అతని మదినిండా శాంతిని గురించిన ఆలోచనలే. మనస్సులో.. దిగులు.. బాధ.. ఆవేదన. వీటినన్నింటినీ మరచే ప్రశాంతతను కోరుతూ వుంది మనస్సు. కారును బీచ్ రోడ్డు వైపు త్రిప్పాడు. సమయం.. రాత్రి ఎనిమిది గంటల ప్రాంతం. కారు ప్రక్కగా నిలిపి బీచ్లో ప్రవేశించాడు.


నియాన్ దీపకాంతులతో యిసుక బంగారంలా మెరిసిపోతూవుంది. యిసుకలో అక్కడక్కడా.. ఆడమగ జంటలుగా కూర్చొని వున్నారు. 'ప్రేమికులు కాబోలు' మనస్సున అనుకొన్నాడు గోపాల్.


తనూ ముందుకు నడిచి.. యిసుకలో కూర్చున్నాడు. అలలు ఒక దాని వెనుక ఒకటి వచ్చి తీరాన్ని తాకుతున్నాయి. క్షణాల్లో వెనక్కు వెళ్ళిపోతున్నాయి. అలల పరుగులో లయబద్ధమైన సవ్వడి.

దూరాన సాగరంలో రెండు నావలు బర్తత్ కాల్ కోసం వేచి వున్నాయి. ల్యాండ్ సిగ్నల్ అందగానే అవి ఒడ్డుకు చేరుతాయి.హాస్పటల్లో శస్త్రచికిత్సకులోనై.. సాగరంలో వున్న నావలా చలన రహితంగా వున్న శాంతి గుర్తుకు వచ్చింది. మనస్సులో మరలా కలవరం. 'భగవాన్!.. నా శాంతి క్షేమంగా యింటికి చేరాలి. తను నిండు నూరేళ్ళు.. ఆరోగ్యంగా.. ఆనందంగా బ్రతకాలి.' నమ్మిన దైవాన్ని మనసారా కోరుకొన్నాడు.


సాగర పవనాలు శరీరానికి తగలడంతో అంత వరకూ రక్తంలో వున్న వేడి తగ్గి.. శరీరం చల్లబడింది.


సెల్ మ్రోగింది. చేతికి తీసుకొని చూచాడు. గౌరి..

“హలో!..”

“ఆఁ.. చెప్పు గౌరీ!..”

"భోంచేశారా!..”


"లేదు. చేయాలి.”

"ఏదో శబ్దం వినిపిస్తూవుంది.”

"అవును. సాగర కెరటాలశబ్దం.”

"బీచ్లో వున్నారా!..”

"అవును.”


“ఒంటరిగానా లేక..” నవ్వింది గౌరి.

గౌరికి తనంటే ఎంతో ప్రేమ. గౌరవం. అభిమానం. తనకోసం ఏం చేయమన్నా చేసేదానికి ఎల్లప్పుడూ సిద్ధం. అంతటి అనురాగవతికి.. ఒక ముఖ్య విషయం చెప్పకుండా యిరవై నాలుగు సంవత్సరాలుగా దాచాడు. ఆమెకే కాదు, తన కన్న తండ్రికి కూడా చెప్పలేదు. అది తను చేసిన మహానేరం. ఆ విషయాన్ని వారికి చెపితే.. వారు ఏమౌతారో. తన్ను ఎలా చూస్తారో తనతో వుంటారో లేక తన్ను వదిలేసి దూరంగా.. వెళ్ళిపోతారేమో.. అనే భయం.


“నా ప్రశ్నకు జవాబు చెప్పరా!..” ఆమె హృదయంలో తన పట్ల వున్న అభిమానం అంతా నిండి వుంది ఆ చిరునగవుతో నిండిన ప్రశ్నలో.


గోపాల్ తనువు పులకించింది. ఆలోచనలు.. చెదిరిపోయాయి. నవ్వుతూ..

"లేదు గౌరీ!.. నేను వంటరిగానే వచ్చాను.”


“అలాగా!..”

"అవును.”


"యీ సమయంలో సాగర తీరంలో ఎందుకున్నట్లు?.."

"మానసోల్లాసానికిగౌరీ.. నీకు తెలుసుగా యీ చల్లగాలి మనస్సుకు.. తనుపుకు ఎంతో శాంతిని కలిగిస్తుందనీ.”


“అవునవును. మీరు చెప్పే మాటలను వినగలనే కాని.. దృశ్యాన్ని కనలేనుగా!..”


"టాపిక్ ని మార్చాలి. లేకపోతే.. గౌరి ప్రశ్నలకు నేను జవాబు చెప్పడం కష్టం.” అనుకొన్నాడు గోపాల్.


“నీవు, నాన్నా భోంచేశారా గౌరీ!..”

“అయింది. ఆస్వాదించిన చల్లగాలి చాలు. యిక లాడ్జికి బయలుదేరి భోంచేసి పడుకోండి. కల్లో కలుసుకుందాం.” గౌరి ముసిముసి నవ్వులు గోపాల్ చవులకు వినిపించాయి.

"అలాగే, బయలుదేరుతున్నాను.”


"జాగ్రత్త. ఎల్లుండి మీరు తప్పకుండా రావాలి. ఎదురుచూస్తూ వుంటాను.”

“వస్తాను గౌరీ.” సెల్ ఆఫ్ చేసి, లేచి.. కారువున్న వైపుగా నడక సాగించాడు గోపాల్. గౌరీ ప్రసంగం అతనికి కొంత ఆనందాన్ని కలిగించింది.


=================================================================


ఇంకా వుంది



=================================================================

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



Twitter Link


Podcast Link

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


రచనా వ్యాసంగం: తొలి రచన ‘లోభికి మూట నష్టి’ విద్యార్థి దశలోనే రాశాను, అప్పట్లో మా పాఠశాల బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ నుండి ఈ శ్రవ్య నాటిక అన్ని తరగతులకు ప్రసారం చేశారు.

అందులోని మూడు పాత్రలను నేనే గొంతు మార్చి పోషించాను.

మా నాయనమ్మ చెప్పిన భారత భాగవత రామాయణ కథలు నన్ను రచనలకు పురికొల్పాయి.


ఇప్పటి వరకు 20 నవలలు, 100 కథలు, 30 కవితలు రాశాను.


60 views0 comments
bottom of page