top of page
Writer's picturePenumaka Vasantha

మానసిక వికలాంగులు


'Manasika Vikalangulu' - New Telugu Story Written By Penumaka Vasantha

'మానసిక వికలాంగులు' తెలుగు కథ

రచన: పెనుమాక వసంత

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

సరితా వాళ్ల అబ్బాయి పెళ్లి ఇన్విటేషన్ వచ్చింది. మొన్న ఫోన్ కూడా చేసింది, పెళ్లికి తప్పక రావాలని. శుభలేఖతో, పాటు చిన్న స్లిప్ కూడా పెట్టింది.


ఆ స్లిప్ లో "వసుధా! పెళ్లికి రావే, మనం ఎన్నాళ్ళో అయింది కదా కలిసి! నీతో చాలా.. కబుర్లు చెప్పాలే! రెండు రోజుల ముందు రా! మనం ఫ్రెండ్సే కాదు, చుట్టాలము కూడా. మా అబ్బాయి పెళ్లి, హైద్రాబాద్ లోనే చేస్తున్నాము. మన చుట్టాలు, అందరూ వస్తున్నారు. అన్నట్లూ మన ఊరి నుండి మన ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు. అందరం ఎంజాయ్ చేద్దాం, రావే త్వరగా! మీ ఆయన, పిల్లల్ని కూడా తీసుకునిరా!" అని ఉంది.

అవును! సరితను చూసి చాలా ఏళ్లు అవుతుంది. అది ఇపుడు ఎలా ఉందో చూడాలి. దాని పెళ్లి అవటంతో వాళ్ల ఆయనకు ముంబైలో జాబ్ వచ్చి అక్కడే సెటిల్ అయ్యారు.


ఇక్కడ.. సరిత గూర్చి చెప్పాలి. అది పుట్టినప్పుడు, బాగానే ఉంది. ఐదవ యేట, టైఫాయిడ్ లో పోలియో వచ్చి, దాని కాళ్లు చచ్చుబడి పోయాయి. చిన్నప్పుడు మేమందరం ఆడుకుంటుంటే సరిత గడపలో కూర్చొని.. మమ్ములను చూస్తూ ఉండేది. అప్పుడు మాకు ఎంతో గర్వంగా మేము ఆడుతున్నాం చూడు.. అన్నట్లు, తన వైపు చూసేవాళ్ళం.


వాళ్ళ నాన్న ఇంట్లోనే కాన్వెంట్ పెట్టటం వల్ల అది మాతోపాటు చదువుకుంది. చదువులో బాగా మార్క్స్ తెచ్చుకునేది. కాళ్ళు లేకపోవటం వల్ల పాకుతూ.. అంతా పని చేస్తుండేది. మా అమ్మా వాళ్ళు, సరిత ను చూసి బుద్ది తెచ్చుకొండి..! అని తిడుతూ ఉండే వాళ్ళు. కాళ్లు లేకపోతే ఏం? అంట్లు, కడగటం, ఆఖరికి వంట కూడా చేస్తుంది. ఆ దేముడు మంచి పిల్లకి ఇలా చేయటం ఏంటి? ఖర్మ కాకపోతే.


సరిత పనితనాన్ని, మంచితనాన్ని పొగుడుతూ.. "మీరు ఉన్నారు ఎందుకు?” అంటూ.. మా ఫ్రెండ్స్ వాళ్ల అమ్మలందరూ మమ్మల్ని తిడుతూ వుండేవాళ్లు. సరిత మీద జాలి తో పాటు కచ్చగా ఉండేది, మాకు తిట్లు పడుతున్నందుకు.

మేమందరమూ కాలేజ్ కి వెళ్లి చదువుకుంటే, అది ప్రైవేట్ గా, పరీక్షలకి కట్టి డిగ్రీ పూర్తి చేసింది. దానికి పెళ్లి ఎలా అవుతుంది? ఎవరు చేసుకుంటారు. అని వాళ్ల అమ్మా, నాన్న దిగులు పడేవాళ్లు.


"మేము ఉన్నన్నాళ్లు.. పర్లేదు, తర్వాత, ఎవరు చూస్తారు" అని బాధపడుతుండే వాళ్ళు. నాకూ, మా ఫ్రెండ్స్ కూ, పెళ్ళిళ్ళు అయి అత్తారింటికి వెళ్లిపోయాం.

ఒకసారి మా అమ్మ ఫోన్ చేసి "సరిత కి పెళ్ళీ!" అనీ చెప్పింది.


నేను "అవునా! ఎవరు? చేసుకుంటున్నారు” అని ఆశ్చర్యపోతూ! అడిగాను.


"వాళ్ల బావ రాజేష్!"


రాజేష్, నాకూ తెలుసు. చిన్నప్పుడు సెలవులకి వచ్చేవాడు, సరితా వాళ్లఇంటికి.


"ఆ అబ్బాయిదీ ఎంత మంచి మనసు అనుకున్నావూ! వాళ్ల అమ్మ వాళ్ళు పెళ్లి చేస్తామంటే ‘సరితను చేసుకుంటాను..’ అన్నాడుట. వాళ్లు ‘అవిటి పిల్ల వద్దు, రా!’ అంటే ‘మీరు సరిత కు పోలియో రాకముందు అది నీ పెళ్ళాం, అనేవాళ్లు. దానికీ పోలియో రాకపోతే మంచి పిల్ల, దాన్ని చేసుకునే వాళ్లం అన్నారుగా.!? ఇపుడు నేను చేసుకొంటానంటే మీకు అభ్యంతరం ఏంటి. ? నేను చేసుకుంటే సరిత ను పెళ్ళి చేసుకుంటాను. లేదంటే బ్రహ్మచారిగా ఉంటా!’ అన్నాడు. ‘వద్దులేరా!’.. చేసేదిలేక, ‘నీ ఇష్టం’ అన్నారు వాళ్లు”


పెళ్లి అయి రాజేష్ కి ముంబై లో జాబ్ అవ్వటం వల్ల అక్కడికి వెళ్ళింది. నాకు, అపుడు సరిత, అదృష్టం కన్నా రాజేష్ మీద జాలి కలిగింది. అమ్మా, సరిత వాళ్ల అమ్మ ఫ్రెండ్స్ అవ్వటం వల్ల సరిత న్యూస్ అమ్మ ద్వారా నాకు తెలిసేవి. రాజేష్ సరిత కాళ్ళు బాగవటం కోసం చాలా డబ్బులు ఖర్చు పెట్టాడనీ, ప్రయోజనం లేకపోయినా డాక్టర్స్ సలహాతో వీల్ చైర్లో కూర్చొని, ఆమె పనులు ఆమే చేసుకొనే విధంగా చేయించాడు.

ఆ వీల్ చైర్ లో, సరిత ఇల్లంతా తిరగటానికి వీలుగా సదుపాయాలు చేశాడు. వంటగది లో స్టౌ గట్టు కూడా సరిత, వంట చేయటానికి వీలుగా కట్టించాడుట. మా ఆయన ‘ఇంట్లో ఏమన్నా మారుద్దాం’ అంటే.. ఒకవేళ ఏమన్నా నేను మారిస్తే అది మళ్ళీ సరిగా పెట్టేదాక, నస పెడుతుంటాడు. అందుకని నా ఇష్టాలు అనేవాటిని, ఎపుడో గంగలో కలిపేశా.


ఆ తర్వాత, సరితకి ఇద్దరు అబ్బాయిలు పుట్టారని తెలిసింది.


సరిత, పిల్లాడి పెళ్లికి, ఒక రోజు ముందు వెళ్ళాను. చాలా రోజుల తర్వాత కలవటం, వల్ల ఇద్దరం చిన్నప్పటి సంగతులు నెమరువేసుకున్నాం. సరిత ‘సంతోషమే సగం బలం’ అన్నట్లు, మొహం వెలిగిపోతుంది. మంచి చీరల్లో సొమ్ముతో చాలా బావుంది మనిషీ. వీల్ చైర్ లో ఉందన్న మాటే కానీ అన్నీ దగ్గరుండి, చూసుకుంటుంది, పెళ్లిపనులు.


"సరూ!" అంటు రాజేష్ లోపలికి వచ్చాడు.


నన్ను చూసి "బాగున్నావా వసుధా!" అని పలకరించాడు.


"బావున్నా!" అని తలవూపాను.


సరు "అది ఎలా చేద్దాం! ఇది ఎలా చేద్దాం!" అని అడగటం. "సరూ! పన్లు సరే! ముందు మీల్స్ చేసి టాబ్లెట్స్ వేసుకో" అని వెళ్ళాడు. ఇంతవరకు మా ఆయన, "నువ్వు తిన్నావా! అని ఒక్కసారి కూడా అడగలేదు!

పిల్లలు కూడా "అమ్మా! ఇంకా ఏమి చేయాల”ని సరితను అడిగి చేయటం చూసి చాల పద్ధతి గా పెంచారు వీళ్లు, అనుకుంది వసుధ. మా పిల్లలు నాకు ఏమన్నా చెపితే, మా ఆయన ఆయనకు ముందు చెప్పలేదని అలిగి ఎవరితో పలకడు. అందుకని ఇంట్లో ఎందుకు గొడవలనీ పిల్లలు, నాకు ఏమి చెప్పరు.


పెళ్లి లో తన ఒక హారం తీసి నా మెళ్ళో వేసింది సరిత. "ఎందుకే సరితా! అంటే “నాకు ఇంకోటి ఉంది లేవే? వేసుకో.!" అంది.


నేను ఎపుడైనా "నాకు ఏదన్నా నగ చేయించండీ" అంటే "మా ఇంట్లో నగలు చేయించటం అచ్చిరాదు! అనే డైలాగ్ వస్తుంది, మా ఆయన నోట్లో నుండి. సరిత ముఖంలో ఎపుడూ చిరునవ్వు, అదీ మనసు లో నుండి వచ్చినట్లుగా ఉంది.

ఆ రాత్రి ఇద్దరం ఒకే బెడ్ పై పడుకుని, చిన్నప్పటి కబుర్లు చెప్పుకున్నాము. అపుడు, సరిత "అవిటిదీ.. దీనికి పెళ్ళవుతుందా!? అనుకునేవాళ్లు నన్నందరూ! అందరూ చూసే జాలిచూపులు.. రాజేష్ వల్లే నేనిట్లా సంతోషంగా ఉన్నానే! అవిటితనం, నాకు వరం అనుకుంటున్నా.! నాకు పోలియో లేకపోతే అందం, తక్కువగా ఉన్న రాజేష్ నీ చేసుకునేదాన్ని కాదేమో.!?


"అందం, కాదే ముఖ్యం! మంచి బుద్ది. "అన్నాను నేను.


"అవునే వసుధా! మీ ఆయన చాలా అందం గా ఉంటాడు కదా!" అనీ అడిగిన సరితతో "అందం ఉంది, కానీ మంచి మనసు లేదే” అన్నా బాధగా.


ఇంతలో రాజేష్ వచ్చి "ఇంకా పడుకొలేదా ఫ్రెండ్స్ ఇద్దరూ! పడుకోండి, పొద్దునే పెళ్లి పనులు ఉన్నా”యనీ నవ్వుతూ, లైట్ తీసి వెళ్ళాడు.

పెళ్లిలో రెండో కొడుకు, సరిత వీల్ చైర్ పక్కనే ఉండీ అమ్మకు అన్నీ అందిస్తూ ఉన్నాడు. రాజేష్ సరేసరి! అన్నీ, సరితని అడుగుతున్నాడు.


పెళ్లి అయి.. వస్తుంటే “చాలా థాంక్స్, వసూ!” అంటూ పట్టుచీర పెట్టింది సరిత.


“ఎందుకే ఇవన్నీ” అంటే “అది పద్ధతి. వద్దనకూడదే" అంది.


ఇంతలో మా ఆయన వచ్చాడు. ఆయనకి బట్టలు పెట్టింది సరిత.


"ఇంక ఇంటికి వచ్చేది ఏమన్నా ఉందా! మీ ఫ్రెండ్ దగ్గరే, ఉంటావా?” అని వెటకారంగా! అన్నాడు మా ఆయన.

అది తెలియని సరిత ఇంకో "రెండు రోజులు ఉండనివ్వండి" అంది.


రాజేష్ కూడా "మా సరితకు తను ఉంటే హాయిగా ఉంది” అన్నాడు నవ్వుతూ.


"ఎటు మేము రెండురోజుల్లో ముంబై వెళ్తాం. అప్పటి వరకు ఆంటీనీ ఉండనివ్వండి అంకుల్" అన్నాడు సరిత వాళ్ళ అబ్బాయి.


"కుదరదు. ఇంట్లొ మాకు ఇబ్బంది. మా అబ్బాయి ఆఫీసుకి వెళ్తాడు, బాక్స్ ఇవ్వాలి. ఈమె ఎక్కడకు వెళ్తే అక్కడ తిష్ట వేస్తుంది. మీరు ఉండమంటే, ఇంక ఇంటికి రాదు.!?"

"మీకు ఇబ్బంది అయితే.. వద్దూ. వస్తుంది లేండి" అంది సరిత.


ఇంటికి వెళ్ళే దారిలో, “ఈమేనా నీ అవిటి ఫ్రెండ్!” అని వ్యంగ్యం గా అన్నాడు. “ కానీ బాగా చేశారే పెళ్లి"

నేను మనసులో, ‘సరితకు, కాళ్ళకే అవిటితనం. మీకూ.. మనసుకు, అవిటితనం. సరిత వికలాంగురాలు కాదు. మీరూ.. మానసిక వికలాంగులు. నా దృష్టిలో మనసు లేని ప్రతి.. వారూ వికలాగుంగులే..! వాళ్ల మీద జాలి పడటం, తప్పా వాళ్ళనీ మార్చలేము! మరేమీ చేయలేము’ అనుకున్నాను.


ఇపుడు, నామీద నాకే జాలిగా ఉంది.

***


పెనుమాక వసంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:

పేరు వసంత పెనుమాక, గృహిణి. రచనలు చేయటం, పాటలు వినటం హాబీస్. మన తెలుగు కథలకు కథలు రాస్తున్నాను. ధన్యవాదములు.




73 views1 comment

1 Comment


ajayparu1959
Jul 05, 2023

Very nice story

Like
bottom of page