top of page

మంచి కోరేది.. మంచినే..


'Manchi Koredi Manchine' New Telugu Story

Written By Ch. C. S. Sarma

'మంచి కోరేది.. మంచినే' తెలుగు కథ

రచన: సిహెచ్. సీఎస్. శర్మ


(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


మంచి మనుషుల మనస్సులు.. వున్నతమైన మానవ సముదాయ.. నిలయానికి.. మూలస్తంభాలు. దాదాపు పధ్నాలుగు సంవత్సరాల తర్వాత.. శివతేజా.. తన స్వగ్రామానికి వచ్చాడు. శివతేజా మనస్సు నిండా, రామాచారిగారి తలపులే.. వారు తనను బియ్యంపై వుంగరంతో తనచేత శ్రీకారం చుట్టించి అ-ఆ లు దిద్దించిన ఆదిగురువు. తాను హైస్కూల్లో ప్రవేశించేసరికి.. మాస్టారుగారు ఏం. ఏ. , బి. ఇడి. పూర్తి చేసి హైస్కూల్ మాస్టర్ గా మారి పోయారు. వారికి తనంటే ఎంతో ఇష్టం. కారణం.. తను ఎల్లప్పుడూ క్లాస్ ఫస్ట్. తన తల్లి శకుంతల, తన చదువు విషయంలో చాలా శ్రద్ధ తీసుకొనేది. తండ్రి నారాయణ కాశ్యప తనకు కావలసినవన్నీ అడగగానే సమకూర్చేవాడు. తన సెకండరీ స్కూల్ జీవితం ఎంతో ఆనందంగా ముగిసింది. ఆపై.. ఇంజనీరింగ్ కాలేజీ జీవితం.. తనకు భవిషత్తు పై ఆశలు లక్ష్యాలు కలిగాయి. భాధ్యతలు తెలిశాయి. శ్రమిం చాడు. తన లక్ష్యాన్ని సాధించాడు. పి. హెచ్. డి. అమెరికాలో చదివి, మూడు సంవత్సరాలు అక్కడ పని చేసి.. పబ్లిక్ హెల్త్ ఇంజనీరుగా మంచి అనుభవంతో.. రెండు వారాల క్రిందట స్వదేశానికి తిరిగి వచ్చాడు శివతేజా. అతని వుద్దేశ్యం.. తన జ్ఞానాన్ని, సామర్ధ్యాన్ని కేవలం డబ్బుకోసం విదేశంలో వినియోగించకుండా.. తన వారికి.. తాను పుట్టిపెరిగిన ప్రాంతానికి తన దేశ వున్నతికి వినియోగించాలన్నది. తన చర్యలవలన తన తల్లిదండ్రులు ఆనందిచాలన్నది. ఆవూరు.. ఎంతగానో మారిపోయింది. ఎదురైన వ్యక్తిని అడిగి.. కారును మాస్టారుగారి ఇంటిముందు ఆపి శివతేజా దిగాడు. ఆ ఇంటికి ముందు వెనుక ప్రక్కలా రంగులతో ఎత్తైన భవంతులు వున్నాయి. మాస్టారుగారి ఇంటి ముందున్న కాంపౌండు గోడ మూడు చోట్ల సగంవరకు కూలిపోయి వుంది. అది మాస్టారుగారి ప్రస్తుత స్థితికి నిదర్శనం.. శివతేజా.. మెల్లగా గృహప్రాంగణంలో ప్రవేశించి ఇంటిముందున్న వరండాను సమీపించాడు. అదే సమయానికి.. మాస్టారుగారి అమ్మాయి శారద వరండాలోకి వచ్చింది. వరండాను సమీపించిన శివతేజాను చూచింది. పవిటను సరిచేసుకొని.. “ఎవరండీ మీరు.. ?” ఎంతో సౌమ్యంగా అడిగింది. “నా పేరు శివతేజ.. మాస్టారుగారిని కలవాలని వచ్చాను. వున్నారా?” “వున్నారు.. రండీ.. కూర్చోండి.. ” చెప్పి శారద ఇంట్లోకి వెళ్లిపోయింది. వరండాలో.. ఒక వాలు పట్టా కుర్చీ, ఒక నాలుగు అడుగుల పొడవు చెక్క బెంచీ వున్నాయి. పెంకుటింటి గోడల రంగు వెలిసిపోయింది. ఆ ఇంటి స్థితి.. మాస్టారుగారి ఆర్ధిక పరిస్థితులను తెలియజేస్తూ వుంది. శారద తిరిగి వరండాలోకి వచ్చింది. పరిసరాలను నిలబడి చూస్తూవున్న శివతేజాను చూచి.. “నిలబడే వున్నారే!.. కూర్చోండి. నాన్నగారు పూజ చేస్తున్నారు. పదినిముషాల్లో వస్తారు.. ” అంది. శివతేజా బెంచీపైన కూర్చున్నాడు. “మంచినీళ్లు తేనా!.. ” అడిగింది శారద. “వద్దండీ.. ” శివతేజా జవాబు. శారద లోనికి వెళ్లిపోయింది. ఆ వరండాలో.. నేలమీద తాను, స్నేహితులతో కలసి కూర్చొని మాస్టారుగారి వద్ద పాఠాలు నేర్చుకొన్నాడు. మాస్టారుగారిని ప్రభుత్వం మూడు సార్లు ఉత్తమ అధ్యాపకునిగా గుర్తించి సత్కరించింది. శివతేజా మనస్సునిండా చిన్ననాటి జ్ఞాపకాలు. మాస్టారుగారి ప్రస్తుత స్థితిని గురించిన ఆలోచనలు. మాస్టారుగారు కళ్ల అద్దాలను సవరించుకొంటూ.. వరండాలోనికి వచ్చారు. శివతేజాను చూచారు. శివతేజా లేచి నిలుచున్నాడు. “నమస్కారం మాస్టారుగారు! నేను మీ శిష్యుడిని.. నారాయణ కాశ్యప గారి అబ్బాయిని.. నాపేరు..” “శివతేజా.. అవునా!.. ” నవ్వుతూ శివతేజను పరీక్షగా చూస్తూ అడిగారు రామాచారిగారు. “అవును మాస్టారు.. ” చిరునవ్వుతో చెప్పాడు శివతేజ. “కూర్చో శివా!.. అమ్మా నాన్నా అన్నయ్యా చెల్లెలు బాగున్నారా!.. ” పట్టా కుర్చీలో కూర్చుంటూ అడిగారు మాస్టారు. “అందరూ బాగున్నారు మాస్టారు” చెప్పి, బెంచీ పైన కూర్చున్నాడు శివతేజ. “మీ చెల్లి.. వందనకు వివాహం అయిందా!.. ” “సంవత్సరం క్రిందట అయింది. మా బావగారు.. అడ్వకేట్. నెల్లూరులోనే ఉంటున్నారు. ఇక నేను.. కెమికల్ ఇంజనీర్ చదివి.. అమెరికా వెళ్ళి పి. హెచ్. డి. చేసి.. మూడు సంవత్సరాలు అక్కడ పని చేసి రెండు వారాల క్రిందటే తిరిగి వచ్చాను మాస్టారు. ” వందనంగా చెప్పాడు శివ. “మీ అన్నయ్య విజయకాశ్యప ఎక్కడవున్నాడు!.. ఏం చేస్తున్నాడు!.. వివాహం అయింది కదూ!.. ” “అన్నయ్య మెకానికల్ ఇంజనీర్. వివాహం మూడేళ్ళ క్రిందట అయింది. వారికి ఇద్దరు పిల్లలు. అమెరికాలో వుంటున్నాడు. వదిన సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆమె అక్కడే పని చేస్తూ వుంది. పిల్లల్ని చూచేదానికి వదినగారి అమ్మగారు అక్కడే వున్నారు.. ” “ఓహో!.. అందరూ బాగా వృద్ధిలోకి వచ్చారన్నమాట. చాలా సంతోషం శివా! మీ అమ్మా నాన్నా చాలా మంచివారయ్యా!.. ” చిరునవ్వుతో చెప్పారు రామాచారి. “అంతా మీ ఆశీర్వాద బలం మాస్టారు.. ” “శివా!.. నీకు వివాహం అయిందా?.. ” “కాలేదు.. ” “ఈ సంవత్సరం చేసుకో.. నన్ను పిలువు.. వస్తాను. ” “అలాగే మాస్టారు గారూ!.. నేను ఈ ప్రాంతంలో ఒక ఇంజనీరింగ్ కాలేజీని నిర్మించాలను కొంటున్నాను. ఆ విషయంలో నాకు మీ సలహా కావాలి.. ” అతని మాటల్లో ఎంతో వినయం. “శివా!.. నీది మంచినిర్ణయం. ఈ చుట్టుప్రక్కల వున్న గ్రామాల విధ్యార్ధులకు మంచిని చేసిన వాడివి అవుతావు. నీ ప్రయత్నాన్ని సాగించు. ఆ సర్వేశ్వరుడు నీ ఆశయాన్ని తప్పక నెరవేరుస్తాడు. ” “ఐదు యెకరాల భూమి కావాలి మాస్టారు. దాన్ని మీరు గ్రామస్తులతో మాట్లాడి కొనేదానికి యేర్పాటు చేయాలి. ” “తప్పకుండా చేస్తాను. నాన్నగారికి తెలుసు. మాలకొండయ్య అనే ఓ రైతు. ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేయాలను కొంటున్నాడు. దానికోసం తనకున్న కొంత భూమిని అమ్మాలను కొంటున్నాడు. అతనితో మాట్లాడుతాను.. సరేనా!.. ” “అలాగే మాస్టారు. వారం రోజుల తర్వాత వస్తాను. ఇక నేను బయలుదేరుతాను. ” బెంచీపైనుండి లేచాడు శివ. “కూర్చో.. కూర్చో.. ” ఇంటి ద్వారం వైపు చూస్తూ.. “అమ్మా!.. శారదా!.. ” రామాచారిగారు పిలిచారు. శివతేజా కూర్చున్నాడు. శారద వచ్చింది. “ఏం నాన్నా !.. ” అంది. “ఇతను నా ప్రియ శిష్యుడు. శివతేజ. వీరి కుటుంబం ఈ వూళ్ళో వున్నదే. అమ్మనడిగి ఒక గ్లాసు మజ్జిగ తీసుకొని రా!.. ” శారద క్షణం సేపు శివతేజా ముఖంలోకి చూచి.. తల ఆడించి లోనికి వెళ్లిపోయింది. రామాచారిగారు ఏదో ఆలోచనతో కళ్ళు మూసు కొన్నారు. వారి ముఖంలోకి కొన్నిక్షణాలు పరీక్షగా చూచి శివతేజ.. “మాస్టారుగారూ!.. ” రామాచారి కళ్ళు తెరచి.. “ఏమిటి శివా?.. ” అడిగారు. “మీ అబ్బాయి మాధవ్.. ” శివ పూర్తి చేయకముందే మాస్టారు గారు.. “వాడు బి. యీ. సి. యెస్. చదివాడు. మా ప్రమేయం లేకుండా వేరే కులం పిల్లను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని.. మామగారి సాయంతో అమెరికా వెళ్లిపోయాడు. వాడి బ్రతుకు వాడిది. వాడివలన నాకు ఎలాంటి ప్రయోజనం లేదు. పక్షి తన పిల్లల రెక్కలు ఆరేవరకూ తన రెక్కల క్రింద వాటిని వుంచుకొని తన ప్రాణసమానంగా చూచుకొంటూ సాకుతుంది. రెక్కలు విచ్చిన ఆ పిల్లలు.. ఆ తల్లిని మరచి తమకు తోచిన దిశకు గూటిని వదలి ఎగిరిపోతాయి. వాడూ అంతే.. ” విచారంగా చెప్పాడు రామాచారి. శారద మజ్జిగ గ్లాసుతో వరండాలోకి వచ్చింది. గ్లాసును శివతేజాకు అందించింది. లోనికి వెళ్లిపోయింది. శివతేజా మజ్జిగ త్రాగాడు. గ్లాసును బెంచీ కింద వుంచాడు. లేచి నిలబడి.. “మాస్టారుగారూ!.. శలవు. నన్ను మీరు ఆశీర్వ దించండి. ” వంగి తన చేతులతో గురువుగారి పాదాలను తాకాడు. శివతేజా.. వినయ విధేయతలకు మాస్టారుగారు ఆశ్చర్యపోయారు. “శివా.. నా శుభాశీస్సులు నీకెప్పుడూ వుంటాయి. ” అభిమానంతో మనసారా దీవించాడు రామాచారి. “వెళ్లొస్తాను మాస్టారు.. ” “మంచిది శివా!.. ” ఇరువురు కారును సమీపించారు. శివతేజా వారికి నమస్కరించి కార్లో కూర్చున్నాడు. కారు కదిలింది. మాస్టారుగారు.. కుడిచేతిని గాలిలో కదిలించారు. కిటికీగుండా శారద వెళ్లుతున్న కారును చూస్తూ నిలబడింది. కారు మలుపు తిరిగింది. &&&&& ఇంటికి చేరిన శివను తల్లిదండ్రులు ఆ గ్రామస్తులను గురించి.. రామాచారి మాస్టారును గురించి అడిగారు. “అమ్మా!.. రామాచారి మాస్టారుగారు చాలా కష్ట పరి స్థితుల్లో వున్నారు. మాధవ్ వేరేకులం పిల్లను పెండ్లి చేసు కొని అమెరికా వెళ్లిపోయాడు. వారి కూతురు శారదకు ఇంకా పెండ్లి కాలేదు. నేను బాగా ఆలోచించి.. ఒక నిర్ణ యానికి వచ్చాను. ” “ఏమిటది?.. ” ఆత్రంగా అడిగింది శకుంతల. “రేపు మనం వెళ్లదలచుకొన్న ఆ పెళ్ళిచూపులకు మనం వెళ్లొద్దమ్మా!.. ” “వారికి మనం వస్తున్నట్లుగా చెప్పాము కదరా!.. ” నిష్టూరంగా అడిగాడు నారాయణ కాశ్యప. “అమ్మ!.. నాన్నా!.. ఆడపిల్లలను.. పెండ్లిచూపుల పేరుతో ఇబ్బంది పెట్టడంనాకు ఇష్టంలేదు. అందుకే వద్దంటున్నాను.. ” వినయంగా చెప్పాడు శివ. “ఏదో నిర్ణయించుకొన్నాను అని అన్నావే.. అదేమిటి?.. ” అడిగాడు నారాయణ కాశ్యప శివను సందేహంగా చూస్తూ.. “నాన్నా!.. నీవు ఎవరినైనా ప్రేమించావా!.. ” అనునయంగా అడిగింది శకుంతల. “అలాంటిదేమీ లేదమ్మా!.. ” “ఐతే రేపటి పెళ్ళిచూపులను ఎందుకు వద్దంటున్నావు?.. ” చిరాకుగా అడిగాడు నారాయణ కాశ్యప. “కట్నకానుకలు లేకుండా.. నేను మాస్టారుగారి అమ్మాయి శారదను వివాహం చేసుకోదలిచాను. మీరు వెళ్ళి మాస్టారుగారితో మాట్లాడాలి. నాకు శారదకు వివాహం జరిపించాలి. రేపు మేము రావడంలేదని ఆ అమ్మాయి వారికి నేనే ఫోన్ చేసి చెబుతాను. నేను చెప్పిన విషయాన్ని గురించి మీ వుభయులూ ఆలోచించి.. శారదను యీ ఇంటి కోడలిగా ఎలా చేసుకోవాలనే నిర్ణయానికి రండి.. ” శివతేజ.. తల్లి తండ్రి ముఖాల్లోకి కొన్ని క్షణాలు చూచి.. చిరునవ్వుతో తన గదికి వెళ్లిపోయాడు. శివతేజ తత్వాన్ని.. బాగా ఎరిగిన తల్లిదండ్రులు అతని ఆదర్శ భావాలను ఆదరించారు. మంచిరోజు చూచుకొని ఆ గ్రామానికి వెళ్లి రామాచారిగారిని కలసి మాట్లాడి రావాలని నిర్ణయించుకొన్నారు. &&&&& “నా చిన్నకొడుకు శివతేజా.. ఏనాడూ.. నాన్నా నాకు యిది కావాలని అడగలేదు. కాల క్రమంగా వాడికి ఏది అవసరమో.. దాన్ని నేనే సమకూర్చే వాణ్ని. పద్ధతిగా పది మంది మెచ్చేలా భవిష్యత్తును తీర్చి దిద్దుకోవాలని చెప్పేవాణ్ణి. వాడు మా మాటలను తు. చ. తప్పకుండా పాటించేవాడు. వాడి ప్రతి చర్య ఇంతవరకూ మాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. ప్రస్తుతంలో.. వాడి వివాహం, వాడికి నచ్చిన అమ్మాయితో జరిపించడం మేము మా ధర్మంగా భావించాం. వాడికి మీ అమ్మాయి నచ్చింది. ఇక్కడికి వచ్చి ఆమెను చూశాక మా వుభయులకూ మీ అమ్మాయి ఎంతగానో నచ్చింది. ఆమెను మా ఇంటి కోడలిగా చేసుకోవాలని మా ఉద్దేశ్యం. మన రెండు కుటుంబాల మధ్యన తెగల బేధం వుంది. ఆ విషయంలో మాకు ఎలాంటి పట్టింపు లేదు. ఈ విషయంలో మీరు మాతో ఏకీభవించగలరని నా నమ్మకం.. మీరు.. మీ అర్ధాంగిగారితో, అమ్మాయితో సంప్రదించి.. మీ నిర్ణయాన్ని మాకు తెలియజేయవలసిందిగా మిమ్ములను కోరుతున్నాను. ” ఎంతో సౌమ్యంగా తన అభిప్రాయాన్ని చెప్పాడు నారాయణ కాశ్యప. అంతా విన్న రామాచారిగారు.. కొద్ది నిముషాలు కళ్ళు మూసుకొని మౌనంగా వుండిపోయారు. తర్వాత.. “నారా యణ కాశ్యపగారూ!.. మీరాక, మీ మాటలు నాకు ఎంతో ఆనందాన్ని కలిగించాయి. నా ఇల్లాలిని బిడ్డను సంప్రదించి రెండు రోజుల్లో నా నిర్ణయాన్ని మీకు.. తెలియజేస్తాను”.. చిరునవ్వుతో చెప్పాడు రామాచారి. వారి మాటల్లో.. వారికి వున్న స్వాభిమానం.. గోచరించింది నారాయణ కాశ్యపకు అతని ఇల్లాలికి. మాస్టారుగారి భార్య పావని.. శకుంతల నొసటనా సింధూరాన్ని దిద్ది తాంబూలాన్ని చేతికి అందించింది. ఆ దంపతులకు నమస్కరించి నారాయణకాశ్యప, శకుంతల బయలుదేరారు. &&&&& “వారు వచ్చి వెళ్ళి రెండు రోజులయింది. వారు చెప్పిన విషయంలో మీరు ఏ నిర్ణయానికి వచ్చారు? నాకు శారదకు.. వారి నిర్ణయం.. పరిపూర్ణ సమ్మతం.. ” రామాచారి ముఖంలోకి పరీక్షగా చూస్తూ చెప్పింది పావని. భార్య ముఖంలోకి విచారంగా చూచాడు రామాచారి. పోస్ట్ మెన్ వచ్చి.. వారి చేతికి ఒక కవర్ అందించి వెళ్లి పోయాడు. పరిశీలనగా దాన్ని చూచి.. అది విదేశీవుత్తరం అని గ్రహించి రామాచారి సంశయంతో విప్పాడు. వ్రాసింది వారి తనయుడు మాధవ్. భార్య వినాలని పైకి పెద్దగా చదివాడు. ‘నాన్నా!.. శివతేజా మూలంగా నాకు మీ సమా చారాలు తెలిసాయి. నేను మీపట్ల గొప్ప నేరం చేశాను. నన్ను క్షమించండి. శివ నా కళ్ళను తెరిపించాడు. నేను.. మీ కోడలు, మనవడు రాము, శారద వివాహాన్ని శివాతో ఘనంగా జరిపించేదానికి వస్తున్నాము. మీరు ఎంతో విశాల హృదయులు. నన్ను క్షమించగలరని నా నమ్మకం. ఇట్లు, మీ.. మాధవ్. ఆ.. ఆలూమగల ముఖాల్లో ఎంతో ఆనందం. కళ్లనుండి ఆనంద భాష్పాలు రాలాయి. పరవశంతో ఒకరినొకరు చూచుకొన్నారు. గడప దగ్గర నిలబడి అంతా వీక్షించిన శారద వదనంలో ఎంతో ఆనందం. “పావనీ!.. ‘మంచి కోరేది.. మంచినే.. ’ అనేదానికి మన అల్లుడు శివతేజా సాక్షి. వెళ్ళి.. నారాయణ కాశ్యప గారికి నా నిర్ణయాన్ని తెలియజేసి వస్తాను. ” వేగంగా లేచి.. టెలిఫోన్ బూత్ వైపు వెళ్ళాడు రామాచారి. పావని.. శారద ముఖంలోకి చూచింది. ఆమె సిగ్గుతో నవ్వుతూ తల దించుకొంది. &&&&& //సమాప్తి//

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


రచనా వ్యాసంగం: తొలి రచన ‘లోభికి మూట నష్టి’ విద్యార్థి దశలోనే రాశాను, అప్పట్లో మా పాఠశాల బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ నుండి ఈ శ్రవ్య నాటిక అన్ని తరగతులకు ప్రసారం చేశారు.

అందులోని మూడు పాత్రలను నేనే గొంతు మార్చి పోషించాను.

మా నాయనమ్మ చెప్పిన భారత భాగవత రామాయణ కథలు నన్ను రచనలకు పురికొల్పాయి.









30 views0 comments
bottom of page