top of page

ముసలోళ్లకు ఈ మాత్రం తెలివితేటలుండాలి



'Musalollaku Yee Mathram Telivitetalundali' - New Telugu Story Written By Nallabati Raghavendra Rao Published In manatelugukathalu.com On 07/09/2024 

'ముసలోళ్లకు ఈ మాత్రం తెలివితేటలుండాలితెలుగు కథ

రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్


మహాలక్ష్మమ్మ తన గదిలో నల్లకావడిపెట్టెకు రెండు తాళంకప్పలు వేసి గట్టిగా లాగి మరీ చూసుకుంది. 


వరండాలోకి వచ్చేసరికి కొడుకు మహదానందరావు రూపాయినోట్లు లెక్కపెట్టుకుంటూ.. 


''అమ్మా.. నీకో మాట చెప్పాలే.. ''.. అన్నాడు నసుగుతూ. 


''నా నీలిరంగువెండిజరీచీర ఊసు ఎత్తితే మాత్రం మర్యాదగా ఉండదురా.. ఇంకేదన్నా మాట్లాడరా'' అంది. 


''దాని గురించేనే బాబు.. ఇప్పుడు రేటు బాగుంది

అయిదారువేలు రావచ్చు.. నల్లకావడిపెట్టెలో పెట్టి ఎన్నాళ్ళు దాస్తావు? నువ్వెలాగూ కొట్టుకోవడం లేదు.. అలాంటప్పుడు అమ్మేయవచ్చు కదా. ''.. అన్నాడు కొంచెం విసుగ్గా. 


మహాలక్ష్మమ్మ కు కోపం.. ముక్కు దాటి నెత్తి మీద బ్రహ్మ రంధ్రం లో నుండి ఆకాశానికి చేరింది. పక్కనే బల్ల మీద ఉన్న పెద్ద ఇత్తడి పళ్లెం నేలకేసికొట్టి

''ఛీ నోర్ముయ్ వెధవా.. నేను దాన్ని అమ్మనని నీకు ఎన్నిసార్లు చెప్పాలిరా..'' అంటూ గట్టిగా అరిచింది. 


నడకలో ఓ రకం పరుగు మిళితం చేసి.. కంగారు పడి బయటకెళ్ళిపోయాడు.. మహదానందరావు. 


ఈ తతంగం ఆ ఇంట్లో ఆరున్నొక్క ఏళ్లుగా జరుగు తూనే ఉంది. అయినా ఒక కొలిక్కి రాలేదు అంటే.. అది మహాలక్ష్మమ్మ తప్పు కాదు. తన పేరున ఉన్న పంట చెక్క రెండెకరాలు కాకుండా తనకు ఏదైనా ప్రీతిపాత్ర మైన అతి విలువైనది ఉంది.. అంటే అది ఈ ఒక్క.. 'నీలిరంగు వెండిజరీ చీర'.. మాత్రమే!


వారం గడిచాక మహాలక్ష్మమ్మ వీధిలో మట్టిమెట్టు మీద కూర్చుంది. 


''వెండిజరీచీరలు కొంటాం.. వెండిజరీచీరలు కొంటాం..''

అంటూ గట్టిగా ఒక మనిషి తనకు మాత్రమే ప్రత్యేకం గా వినబడేటట్లు అరుస్తూ అటూ ఇటూ నాలుగైదు సార్లు తనను రాసుకుంటున్నట్టు అతి దగ్గరనుండి తిరగడం పసిగట్టేసింది. అసలు కథ కమామిషు అర్థం అయిపోయిన మహాలక్ష్మమ్మ కు. ఆ మనిషిని లోపలకు రమ్మని నెమ్మదిగా పిలిచిoది. 


వాడు లోపలికి వస్తూ 

''మహాలక్ష్మమ్మగారు మీరే కదా.. సిటీ నుండి వచ్చాను మామ్మగారు.. నేను పాత వెండిజరీ చీరలు కొంటాను.. ఎవరూ నా కన్నా డబ్బులు ఎక్కువ ఇవ్వరు. నాది హోల్సేల్.. పైగా ఈరోజు నుండే రేట్లు పెరిగాయండి ఒక చీరకు 10వేలు.. మంచి తరుణం మించిన దొరకదు.. '' అంటూ.. ఇంకా ఏదో చెప్పబోతున్నాడు. 


మహాలక్ష్మమ్మ ఆఅబ్బాయిని కొంచెం లోపలకు తీసు కెళ్ళి బల్ల మీద కూర్చోబెట్టి.. ''అసలు నా పేరు నీకు ఎలా తెలుసురా..'.. అంటూ మూలనున్న చింతజూక తీసి వీపు మీద ఒక్కటేసింది. 


''ఇది మా బడుద్దాయిగాడి ప్లాను కదూ..'' అంటూ మరొకటి వేసింది. 


లబోదిబోమన్న ఆ మనిషి.. ఆమె కొడుకే పంపిన ట్లుగా అసలు విషయం చెప్పేసి వీధిలోకి పరుగు పెట్టాడు. 


 *


ఆ సాయంత్రం మహాలక్ష్మమ్మ కబురు పెట్టగా పక్క వూరులోనే ఉన్న ఆమె తమ్ముడు.. చెంచురాముడు మోపెడ్ మీద వచ్చాడు. వస్తూ పెద్ద మిఠాయి పొట్లం పట్టుకొచ్చి మహదానందరావుకిచ్చి ఇంకొక చిన్న పొట్లం.. తన అక్క మహాలక్ష్మమ్మ కు అందించాడు ప్రేమగా. 


మహాలక్ష్మమ్మ తమ్ముడిని తన గదిలోకి తీసుకెళ్లి కూర్చోబెట్టి మంచినీళ్లు ఇచ్చి.. ''ఒరేయ్ తమ్ముడు.. మా బడుద్దాయిగాడు నా చేత ఎలాగైనా ఆ వెండిజరీచీర అమ్మిoచేయాలని ప్లాన్ వేస్తున్నాడు. సరే.. నేను వాడనప్పుడు అది ఎందుకు.. అమ్మి పాడేద్దాం. కానీ అసలు విషయం అదికాదురా.. ఈ వెండిజరీచీర ముందుగా అమ్మిoచేసి ఆ డబ్బులు నా నల్లకావడిపెట్టె లో దాచుకోమని నాకే ఇచ్చేసి ఆ తర్వాత తర్వాత నా పేరు మీద ఉన్న ఆ 2 ఎకరాల పంటచెక్క మాయమాటలు చెప్పి అమ్మిoచేసి డబ్బులు దొబ్బేయాలని చూస్తున్నాడా బడుద్దాయి. నేనుమాత్రం చచ్చేదాకా నా ఆస్తి వదిలిపెట్టను. ఆ వెండిజరీ చీర కూడా వదిలి పెట్టను. చేతిలో నాకు ఆ మాత్రం బలం లేకపోతే.. పట్టు లేకపోతే ఈ వెధవ నన్ను కడదాకా చూస్తాడoటావా?''.. 

చిర్రుబుర్రుగా ముఖం పెట్టి అంది మహాలక్ష్మమ్మ. 


''వాడు అంత దుర్మార్గుడు కాదు కదా. నువ్వు ఎందుకంత కంగారు పడతావు. వాడు వెండిజరీ చీర ఉప యోగం లేదు కనుక అమ్మేద్దాం అంటున్నాడు కానీ ఆ పంట పొలం మాట ఎత్తడం లేదు కదా.. నా దగ్గర ఎప్పుడూ అనలేదు. అయినా నీకు 90 ఏళ్ళు దాటాయి కదే. నీ మంచి చెడులు చూసేది వాడొక్కడే కదా ఇంకెవరున్నారు. కాస్త బలంగానే ఉన్నావు కదా. 


రామ.. కృష్ణ.. అనుకుంటూ ప్రశాంతంగా ఉండక ఈ గొడవెందుకే. ఆస్తి కూడా పట్టుకు పోతావా? ఎప్పటికైనా వాడిదే కదా.. పిల్లలున్నారు.. ఆ రెండెకరాల పంటచక్కె అమ్మేసి ఏదైనా పెద్ద వ్యాపారం పెడదామని అను కుంటున్నాడేమో ''.. అన్నాడు తమ్ముడు చెంచురాముడు. 


''నువ్వలాగ అనకు. డబ్బు కావాలంటే తల తాకట్టు పెట్టుకోమను.. లేదంటే గోదాట్లో దూకమను. మేనల్లుడిని వెనకేసుకుని వస్తావేంటిరా సన్నాసి. తల్లిని.. వాడి ప్లాన్ నాకు తెలుసా నీకు తెలుసా? కొడుకులున్న ఎంతోమంది తల్లిదండ్రులు రోడ్డు మీద పడి అడుక్కు తింటున్నారు. కొంతమంది ఉరిపోసుకొని చచ్చిపోతున్నారు. 


టీవీలో చూస్తున్నాం కదా. అదంతా అబద్ధం కాదు కదా. నెల రోజుల క్రితం అయితే.. రాజవరం లో ఒక కొడుకు 85 ఏళ్ల తనతల్లిని పింఛను డబ్బుల కోసం నేల మీద పడగొట్టి కాళ్లతో తన్నితన్న కర్రతో బాదీబాదీ ప్రాణం పోయేలా చేసాడు. అది కూడా చూసాం కదా. వారం క్రితం.. మన పక్క శ్రీరామ్నగర్లో ఒక కొడుకు.. 80 ఏళ్ల తన ముసలి తండ్రిని వంద రూపాయల కోసం మెడకు టవల్ చుట్టి చంపేశాడు.. 


ఇవన్నీ అబద్ధాలేనా.. కట్టుకథలేనా.. ఆ పంటచెక్క నా పేరును ఉంది కనుక సరిపోయింది.. లేకుంటే నా బతుకూ అంతే. బయటపడేవి రెండు అయితే బయట పడ నివి వంద ఉంటాయి. ఆ గొడవలన్నీ నేను పట్టించుకోవడం లేదు.. 

నా ఉద్దేశం నాది.. 


ఇదిగో.. ఇదంతా కాదు కానీ వాడి బుర్ర కు ఇంత పచ్చి గడ్డి పెట్టు. తినకపోతే నాలుగు తగిలించు. మేనమామవు నీకు ఆ అధికారం ఉంటుంది. నా జోలికి రావద్దని చెప్పు. '' తమ్ముడికి ఖరాఖండిగా చెప్పింది మహాలక్ష్మమ్మ. 


''సరే.. విషయం ఏమిటో అనుకుని కంగారుపడి వచ్చాను.. ఎక్కడో ఏదో జరిగిందని అనవసరం గా బెంబేలు పడిపోకే.. అయినా.. ఇది మీ కుటుంబ విషయం.. నేను మేనమామ అయినా నాకు హక్కు ఉన్న.. ఇప్పుడే డైరెక్టుగా అడిగితే బాగుండదు. వీలు చూసుకొని.. అడుగుతాలే. ''.. అంటూ నెమ్మదిగా జారుకున్నాడు.. తమ్ముడు చెంచురాముడు. 


 *


పదిహేను రోజుల తర్వాత.. 


ఊరి.. పెద్దమనిషి మహాబలేశ్వరయ్యగారు.. 


హూoదాగా కూర్చున్నారు తన మండువా లోగిలి సింహద్వార గుమ్మం బయట అరుగుమీద.. 


అదే.. ఆ వూరికి రచ్చబండలాంటి ప్రదేశం. ఓ చిన్న పాటి పోలీస్ స్టేషన్ ఉన్నప్పటికీ ఈ రచ్చ బండనే అందరూ ఆశ్రయిస్తారు. ఎవరెవరో వస్తూ తమ సమస్యలు చెబుతూ.. ఆ పెద్దాయన చెప్పింది విని వెళ్ళిపోతున్నారు. 


మహాదానందరావు ఓ పక్క చేతులు కట్టుకుని నిల బడ్డాడు దూరంగా.. పిలిచాడు మహాబలే శ్వరయ్య. 


''ఏరా ఆనందం.. మీ అమ్మ నీ మీద ఫిర్యాదు చేసిందిరా. దాని చేత పంటచెక్క అమ్మించేయాలని ప్లాన్ చేస్తున్నావట..?'' ప్రశ్నించాడు. 


''అదేంకాదు దొరగారు.. అది అలా అనుమానం పడుతుంది.. నేను ఆ పనికిరాని వెండిజరీచీర అమ్మెయ్య మన్నానంతే ''.. అన్నాడు వినయంగ మహదానంద రావు. 


''అలా కాదు కానీ ఆ పంటచెక్క అమ్మేస్తే వచ్చే డబ్బు ఏం చేస్తావు?''


''పెద్ద వ్యాపారం చేస్తానండి''


''నష్టం వస్తే''


''మీకు తెలియందేముంది దొరగారు.. అది దేవుని దయ కదా. అయినా మా అమ్మ ఇంత వయస్సు వచ్చాక ఏం చేసుకుంటుదండి ఆ పంటచెక్క''.. అన్నాడు.. పళ్ళు ఇకిలించి చూస్తూ మహదానంద రావు. 


''నీ కన్నా ముందే ఇక్కడకు వచ్చింది రా మీ అమ్మ.

మా ఇంట్లో ఉంది పిలుస్తానుండు.. ఆ విషయం మీ అమ్మనే అడుగు''.. అని మహాబలేశ్వరయ్య గారు అంటుండగానే ఆయన ఇంటి సింహద్వారం తలుపు వెనుక నుండి వచ్చింది ముందుకి మహాలక్ష్మమ్మ. 


''ఇదిగో మహాబలం.. నువ్వు, ఆడు కలిసి నా చేత ఎలాగోలా ఒప్పించి ఆ పంటచెక్క అమ్మించేయాలని ప్లాను వేస్తూన్నట్టు ఉంది. నీ దగ్గరకు నేను తీర్పు కోసం వస్తే ఆడికి నాలుగు చీవాట్లు పెట్టాల్సింది పోయి.. ఈ సాగదీయడం ఏమిటి అంట?.. 


ఇదిగో నా పంటచెక్క జోలికి వస్తే ఊరుకునేది లేదు. ఏం చేయాలో అది చేస్తానని చెప్పు. చాలా దూరం నడిచి నీ ఇంటికి వచ్చాను. నాకు నీరసంగా ఉంది ముందు రిక్షా కట్టించి నన్ను ఇంటికి పంపించమని చెప్పు.. ''.. 


చాలా కోపంగా అంటూ దూరంగా వెళ్లి రావిచెట్టు కింద మూతి ముడుచుకుని నిలబడింది మహా లక్ష్మమ్మ. 


 **


మరో పది రోజుల తర్వాత.. 


పోలీస్ స్టేషన్ లో చెక్కబల్ల మీద కూర్చుంది మహా లక్ష్మమ్మ. ఆమె ఎవరి చేతనో వ్రాయించి తెచ్చి ఇచ్చిన కంప్లైంట్ చదివి వెంటనే.. మహదానందరావు ని కబురు పెట్టాడు ఎస్ ఐ సర్వేశ్వరరావు. 


''ఏరా.. మీ అమ్మని ఆవిడ పేరు మీద ఉన్న ఆ రెండెకరాల పంటచెక్క అమ్మేయమని ఒత్తిడి తెస్తు న్నావట నిజమేనా?''.. అంటూ ప్రశ్నించాడు అప్పుడే వచ్చిన మహదానందరావు ని ఎస్ ఐ. 


''లేదు.. ఎస్ఐ గారు.. నాకు ఆ ఉద్దేశం ఏ కోశాన లేదు.. 12 ఏళ్ల నుండి ఆవిడ నల్లకావడిపెట్టెలో ఉపయోగం లేకుండా ఉన్న ఆ వెండి జరీచీర అమ్మే యమని అడుగుతున్నానoతే.. ఊర్లో ఎవరినైనా అడగండి. నేను ఆవిడ పంటచెక్క గురించి అసలు ఎవరి దగ్గర మాట్లాడలేదు. ''.. చేతులు కట్టుకుని నిలబడే వినయంగా చెప్పాడు.. మహదానంద రావు. 


''ఏమయ్యా ఎస్ ఐ.. నువ్వు ఆడు ఫ్రెండ్స్ అని నాకు తెలుసు. నాలుగు కూకలు వేసి ఆడిచేత నా పంట చెక్క జోలికి రానని.. నన్ను బెదిరించనని కాగితం ముక్క రాయించి సంతకం పెట్టించు. అంతేగాని.. ఈ నాన్చుడు బేరాలు పెట్టకు..'' అన్నది మహాలక్ష్మమ్మ తలపోటు వ్యవహారంగా. 


''అదికాదు మహాలక్ష్మమ్మగారు వాడు నాకు దోస్తు అవ్వచ్చు కానీ చట్టం చట్టమే కదా. మీ అబ్బాయి అసలు తను మీ పంటచెక్క ఊసు ఎక్కడ ఎత్త లేదు అని.. తనకు ఏమీ తెలియదు అంటున్నాడు కదా..''.. అన్నాడు ఎస్ ఐ కొంచెం ఆలోచిస్తున్న ట్లుగా. 


వెంటనే మహాలక్ష్మమ్మ తాచుపాము లాగా పైకి లేచి.. కొడుకు వైపు తిరిగి.. ''ఏరా బడుద్దాయి నా పంటచెక్క రెండెకరాలు నాకు తెలియకుండా నువ్వు ఆ కిరాణా వ్యాపారం చేసే రంగరాజు కి అమ్ముతానని చెప్ప లేదూ.. ఆఖరికి 4 రోజుల క్రితం ఆ ధాన్యం వ్యాపారం చేసే శేషగిరికి బేరం పెట్టి ఖాయం చేసుకున్నావు కదా'' అన్నది గర్జిస్తూన్నట్లు. 


''శేషగిరా.. ఆడెవడు.. నిజంగా నాకు తెలియదు ఎస్ఐ గారు..'' అన్నాడు భయపడుతూ మహదానందరావు. 


ఎస్సై విచిత్రంగా చూస్తున్నాడు. 


మహాలక్ష్మమ్మ పోలీస్ స్టేషన్లో చిందులేసినట్టు హడావిడి చేసి.. ''నీకు ఏమీ తెలియదురా. పాపం.. నువ్వు పాల సీసాతో పాలపీక చీకుతూ పాలు తాగే పిల్లోడివి. బొత్తిగా అమాయకుడివి'' అంటూ బయట ఓ మూలన కూర్చోబెట్టిన శేషగిరి ని లోపలికి పిలిచింది. 


శేషగిరి లోపలకు వచ్చి మహదానందరావు తనకు ఆ రెండు ఎకరాల పొలము అమ్మ చూపించాడని, బేరం కూడా ఖాయమయిందని ఈరోజు బయానా ఇచ్చి అగ్రిమెంటు రాసుకోవడానికి అనుకున్నామని చెప్తూ.. సంవత్సరం నుండి ఊర్లో ఈ వ్యవహారం జరుగు తోంది అని.. చాలా చాలా వివరంగా వివరాలన్నీ చెప్పేశాడు.. శేషగిరి. 


“అవేవో సరదాగా అనుకున్న మాటలు సార్.. నిజం కాదు''.. అంటూ మహదానందరావు.. కిమ్మనకుండా చేతులు కట్టుకుని తలకిందగా దించుకొని నిలబడి వుండిపోయాడు.. వెకిలిగా నవ్వుతూ. 


ఎస్సై తనలో తాను నవ్వుకుంటూ.. 

''సర్లే.. రేపో మాపో బాల్చీ తన్నేసే దానిలా ఉన్నావ్.. కూడా పట్టుకుపోతావా నువ్వు ఆ రెండెకరాలు''.. అన్నాడు మహాలక్ష్మమ్మ వైపు చిరునవ్వు నవ్వినట్టు చూస్తూ.. ఎస్సై సర్వేశ్వరరావు. 


''ఇదో.. ఎస్సై.. ఎవరు ఎప్పుడు చస్తారో ఎవరికి తెలుసు.. చచ్చేదాకా నా ధైర్యం నాకు ఉండాల. ఏ నిద్ర మత్తులోనో నేను పడుకున్నప్పుడు ఆ బడు ద్దాయిగాడు నా దగ్గరకొచ్చి..  ‘అమ్మా.. రేషన్ కార్డు పోయింది.. ఈ కాగితాల మీద సంతకం పెట్టు మళ్లీ కొత్త రేషన్ కార్డు ఇస్తారట’ అని దస్తావేజుల మీద సంత కాలు పెట్టించుకుని నా పంటచెక్క కాస్త అమ్మేస్తే మీరంతా ఏంచేస్తారు?.. నన్ను మీరందరూ కలసి ఆధారం లేని దాన్ని చేసి పడేస్తారా. అలా కుదరదంటే కుదరదు. నేను చాలా మొండి దాన్ని. వాడిచేత కాయితం రాయించి నాకు ఇస్తావా లేదా?.. ''.. అంటూ బలవంత పెట్టినట్టుగా అడిగింది.. మహాలక్ష్మమ్మ. 


ఎస్ ఐ వైట్ పేపర్ మీద ఏదో రాసి చదివి వినిపించి

 సంతకం పెట్టమన్నాడు మహదానందరావుని. 


''ఎస్సై.. నువ్వు రాసిన దాంట్లో నాకు బలం అంతగా కనిపించడం లేదు.. ఎందుకైనా మంచిదని ఇదిగో వచ్చేటప్పుడు నాకు తెలిసిన ప్లీడరు గారి చేత ఈ బడుద్దాయి నా పంటచెక్క జోలికి రాకుండా కాగితం రాయించాను. వాడిని చదువుకొమ్మని దీనిమీద ఆ బడుద్దాయి చేత సంతకం పెట్టించు లేకపోతే నీకన్నా పెద్దోళ్ళు దగ్గరికి వెళ్తాను.. ''.. అని గోలగోల చేసినట్లుగా మాట్లాడింది మహాలక్ష్మమ్మ. 


ఎస్సై చేసేది లేక ఆవిడ చెప్పినట్లే చేసి ''ఇది సివిల్ మేటరు.. మీరు మీరు కూర్చొని మాట్లాడుకుని సర్దుబాటు చేసుకోండయ్యా.. అయినా ఆ ముసలావిడ ఒప్పుకొని తనకుతానుగా అమ్మేయాలిగానీ నువ్వు మభ్యపెట్టి ఒప్పించ కూడదురా.. ''.. అంటూ మహాదానందరావుతో చెప్పి అందరినీ పంపించేశాడు.. 


సంతకం పెట్టించుకున్న కాగితం పట్టుకుని తను కూడా వెనుతిరిగింది మహాలక్ష్మమ్మ.. 


*** 

ఆ తర్వాత.. 


తన కొడుకు మహాదానందరావు ప్రవర్తనలో ఏదో చిన్నపాటి తేడా ప్రవేశించినట్టు కనిపెట్టింది మహా లక్ష్మమ్మ. 


అలా అలా నెమ్మదిగా నెల గడిచింది.. ఆలోచించి ఆలోచించి ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చేసింది ఆమె.. 


రెండు రోజులు గడిచాక.. 


ఆ రోజు గురువారం ఉదయం 9 గంటలయ్యింది. 


వీధిలో కారు ఆగడం అందులోంచి లాయరు సుగుణాకరరావు ఏవో పేపర్లు పట్టుకొని కిందకి దిగడం చూశాడు మహదానందరావు. 


సుగుణాకరరావు లోపలికి వచ్చి.. 


''ఏమయ్యా మహదానందం బాగున్నావా.. ?'' అంటూ తనే అక్కడున్న ఇనపకుర్చీ మీద కూర్చు న్నాడు. మహదానందరావు భార్య మంచినీళ్ళు తెచ్చి ఇచ్చింది. 


''నాకు కోర్టుకు టైం అవుతుంది.. వచ్చిన విషయం ఏమిటంటే.. మీ అమ్మగారు ఇకనుండి నీ దగ్గర ఉండటానికి ఇష్టపడటం లేదయ్యా. ఆ వెండిజరీ చీర.. ఆ రెండుఎకరాల పంటపొలం.. అమ్మదట. రెండు రోజుల క్రితం నా దగ్గరకు వచ్చి ఈ విషయా లన్నీ చెప్పింది. 90 సంవత్సరాలు పైబడ్డ ఈ వయసులో ఎందుకమ్మా ఇది.. ఉన్న ఒక్కగానొక్క కొడుకుతో సర్దుకుపోవచ్చు కదా అన్నాను. 


నేను చెప్పాల్సిందంతా చెప్పి కౌన్సిలింగ్ ఇచ్చాను. మహా లక్ష్మమ్మగారు ఒప్పుకోలేదయ్యా. నేను కాదంటే సిటీ వెళ్లి వేరే లాయర్ ను పెట్టుకుంటాను అన్నది. ఏం చేయను మీరంతా నాకు తెలిసిన వాళ్ళు కదా.. అందుకని నేనే ఒప్పుకుని రావలసి వచ్చింది. '' అంటూ తన చేతిలోని పేపర్లు మడత విప్పాడు. మహదానందరావు.. అతనిభార్య అతని చిన్నపిల్ల లు ఇద్దరూ దూరంగా ఉండి కళ్ళు ఆర్పకుండా చూస్తూ న్నారు.. 


మహాలక్ష్మమ్మ తన గదిలో నుండి వచ్చి తన గది గుమ్మం దగ్గరే నిలబడింది. 


''మహదానందం.. అంతా చదవాలంటే చాలా ఉంది. విషయం చెప్తా విను.. మీ అమ్మగారు తన రెండు ఎకరాల పంట పొలంలో ఒక ఎకరం తను ఇకముందు ఉండబోయే.. 'శాంతి నివాస్ '.. అదే మన ఊరి చివర నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది కదా. ఆ వృద్ధ ఆశ్రమానికి పూర్తిహక్కులు రాసేసిందయ్య. మిగిలిన ఎకరం.. ఆమె అనంతరం మాత్రమే నీకు చెందేటట్లు రాయించారు నాచేత. టూకీగా ఇదీ విషయం.. అదిగో.. మీ అమ్మగారు అంతా వింటున్నారు కదా.. వీలు చూసుకుని నీకు ఈ దస్తా వేజులు ఒక కాపీ పంపిస్తాలే. 


ఈరోజే ఆవిడ వృద్ధాశ్రమంలో చేరిపోయేలా నా చేత ఏర్పాట్లన్నీ చేయించారు.. అదిగో బయట మన ఆటో సత్తిబాబు కూడా వచ్చి రెడీగాఉన్నాడు మీ అమ్మగారి ని అక్కడకు తీసుకెళ్లడానికి.. నేను మీ అమ్మగారు కూడా.. 'శాంతి నివాస్ ' వృద్ధ ఆశ్రమానికి వెళ్ళి అక్కడ జాయిన్ చేసే ఏర్పాట్లు అన్నీ చూసి వస్తాను.. మీ ఫ్యామిలీ ఎప్పుడైనా వెళ్లి చూసి వస్తూ ఉండొచ్చు. '' అంటూ లాయర్ సుగుణాకరరావు చెప్తూ ఉండగానే.. ఆటో సత్తిబాబు వచ్చి.. మహాలక్ష్మమ్మ అందించిన మూడు బ్యాగులు ఆటోలో పెట్టాడు. 


మహదానందరావు అతనిభార్య దీనంగా ముఖాలు పెట్టి ఆ పెద్దావిడవైపు చూస్తూ ఉండిపోయారు. మహాలక్ష్మమ్మ మాత్రం కాస్త చిరుకోపంతోనే వాళ్ళ వైపు చూసి బయటకు వెళ్లి ఆటోలో కూర్చుంది. 


 **

 సంవత్సరం గడిచింది.. 


మహదానందరావు భార్యపిల్లలతో తల్లిని చూడడానికి రెండు సార్లు వెళ్లి వచ్చాడు. 


డిసెంబర్ నెల.. చలి ఎక్కువగా ఉంది. 


ఒక రోజు ఉదయం మహాదానందరావు కి వృద్ధా శ్రమం నుండి ఫోన్ వచ్చింది. అతని తల్లి ప్రాణం విడిచింది.. అని.. 


అదే సమయంలో తను కూడా ఫోన్ కాల్ అందు కున్న లాయర్ సుగుణాకరరావు వెంటనే మహదానందరావు ఇంటికి వచ్చి వాళ్ళందరిని తన కారు లో కూర్చోబెట్టు కొని.. అందరూ కలిసి వెంటనే శాంతినికేతన్ వృద్ధా శ్రమానికి చేరుకున్నారు. 


విషయం తెలిసిన మహదానందరావు మేనమామ చెంచురాముడు మిగిలిన బంధువులు.. మరో వ్యాన్ మీద అక్కడికి చేరుకున్నారు. 


మరో కారు మీద.. ఊరి పెద్ద మహాబలేశ్వరయ్య గారు.. ఎస్సై సర్వేశ్వరరావు కూడా అక్కడికి ఆ సమయానికి వచ్చారు. 


అందరూ కలిసి జరగవలసిన కార్యక్రమం అక్కడే జరిపించారు. 


మహదానందరావుని సముదాయించి ఎవరిదారిన వారు వెళ్ళిపోయారు. 


లాయర్ సుగుణాకరరావు.. మహదానందరావు ఫ్యామిలీ తో టాక్సీ మీద తిరిగి ఇంటికి బయలు దేరుతూ.. 


''ఇదిగోనయ్యా మహదానందం.. మిగిలిన ఒక ఎకరం తాలూకు ఒరిజినల్ దస్తావేజులు.. '.. అంటూ అందించాడు. 


వెంటనే కాగితం ప్యాకింగ్ కవర్ లో పెట్టిన చీరను కూడా అందిస్తూ.. ''ఇది మీ అమ్మగారి.. నీలిరంగు వెండిజరీచీర.. 

దీనిని ఇప్పుడు నువ్వు నిరభ్యంతరంగా అమ్ముకోవచ్చు.. '' అని చెప్పి.. చీర అతని ఒడిలో పెట్టి టాక్సీ డ్రైవ్ చేస్తూ పది నిమిషాలలో మహదానందరావు ఇంటికి చేరారు అంతా. 


మహాదానందరావుభార్య.. పిల్లలు టాక్సీ దిగి ఇంటిలోకి వెళ్లిపోయారు. చివరగా దిగిన మహదా నందరావు డ్రైవింగ్ సీట్లో కూర్చున్న లాయర్ గారి దగ్గరకు వచ్చి.. 


''లాయర్ గారు ఈ ఎకరం పంటచెక్క నాకు వద్దండీ.. ఇన్నాళ్ళు మా అమ్మ ఉన్న ఆ వృద్ధ ఆశ్రమానికే హక్కు లు చెందేలా.. తిరిగి రాయించే ఏర్పాటు చేయండి.. ''.. 

అంటూ బొంగురుస్వరం తో చెప్పి దస్తావేజు కాగితాలు ఇచ్చేశాడు. 


''మా అమ్మ కట్టిన చీర.. ఇది నాకు చాలు..” మొదటిసారిగా గట్టిగా ఏడుస్తూ చలించిపోతూ.. అన్నాడు.. మహదానందంరావు. 


టాక్సీలో కూర్చున్నoతసేపు గుండెలకు వదలకుండా హత్తుకొని ఉంచిన ఆ కాగితం కవర్లో పెట్టిన.. అతని కన్నీటితో తడిచి ముద్దయిన.. ఆ నీలిరంగు వెండిజరీ చీర.. చూశాడు.. లాయర్ సుగుణాకరరావు.. వెంటనే టాక్సీ దిగి.. 


''మహదానందం.. మీ అమ్మగారు నిజంగా చచ్చి పోలేదయ్యా.. ఈ చీర రూపంలో ఉన్నారు. నువ్వు ఎప్పుడు చూసుకుంటే అప్పుడే కనిపిస్తారు.. అదే ఆవిడ కోరిక కూడా..''

అంటూ.. మనస్ఫూర్తిగా ఓదార్చాడు. 


****

నల్లబాటి రాఘవేంద్ర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.







రచయిత పరిచయం: నల్లబాటి రాఘవేంద్ర రావు


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


ముందుగా  " మన తెలుగు కథలు"  నిర్వాహకులకు నమస్సులు..

"రచయిత పరిచయం"..... ఇది చాలా ముఖ్యం.

రచయిత తన  గొప్పలు చెప్పుకోవడం కాదు గాని తన గతచరిత్ర వివరాలు అందరికీ తెలియ చేయటం అవసరమే. ఈ చర్య ఆ రచయితకు మానసికంగా ఎంతగానో ఉపయోగపడి అతను మరిన్ని మంచి మంచి రచనలు చేసి సమాజానికి అందించే అవకాశం ఉంది.. ఎంతో పెద్ద ఆలోచనతో అలాంటి 'మహా ప్రయత్నం'.. చేస్తున్న 'మన తెలుగు కథలు' కు మరొక్కసారి అభినందనలు.

పునాది....

-----------

ఏడు సంవత్సరాలు వయసు నాది. మా తండ్రి సుబ్బారావు గారు  ప్రోత్సాహంతో శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే 10 నిమిషాల నాటకాన్ని నేనే రాసి కృష్ణుడి వేషం  నేనే వేసి దర్శకత్వం నేనే చేసి పెద్ద స్టేజి మీద  దసరా నవరాత్రులకు ప్రదర్శించాము.


ఆ తర్వాత భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గా.. మరో నాటకంలో శ్రీరాముడుగా..   రచన దర్శకత్వం నాదే.. ఏడు సంవత్సరాల వయస్సు.


తర్వాత పదిహేను సంవత్సరాల వయసులో

టెన్త్ క్లాస్ యానివర్సరీ కి  15 మంది నటులతో నా దర్శకత్వం లో పెద్ద స్టేజి మీద నాటకం వేసాము.

అప్పుడే నేను రచయితను కావాలన్న

ఆశయం   మొగ్గ తొడిగింది.

నా గురించి..

---------------

50 సంవత్సరాల సుదీర్ఘ సాహితీ ప్రయాణం.

450  ప్రచురిత కథల రచన అనుభవం.

200 గేయాలు  నా కలం నుండి జాలువారాయి

200 కవితలు నా మేధస్సు నుండి ఉద్భవించాయి

20 రేడియో నాటికలు ప్రసారం.

10 టెలీఫిల్మ్ ల నిర్మాణం.

200 కామెడీ షార్ట్ స్కిట్స్

3  నవలలు దినపత్రికలలో


" దీపావళి జ్యోతి "అవార్డు,

"రైజింగ్స్టార్" అవార్డు

" తిలక్ స్మారక" అవార్డు... మరికొన్ని అవార్డులు.


ప్రస్తుత ట్రెండ్ అయిన  ఫేస్బుక్ లో  ముఖ్యమైన 15 గ్రూపుల్లో... ఇంకా అనేక వెబ్ సైట్లు, బ్లాగులు,ఆన్లైన్ పత్రికలలో యాక్టివ్ గా తరచు  నాకథలు,  కవితలు,గేయాలు, ముఖ్యంగా కామెడీ షార్ట్ స్కిట్స్ ప్రతి రోజూ దర్శనమిస్తూ ఉంటాయి..

రమారమి 75 అవార్డులు, రివార్డులు అందు కున్నాను... అని గర్వంగా చెప్పుకునే అవకాశం  కలగటం... ఆ చదువులతల్లి అనుగ్రహమే!

ఇదంతా ఒక్కసారిగా  మననం చేసుకుంటే...  'పడని సముద్ర కెరటం' లా... నూతనశక్తి మళ్లీ పుంజుకుంది.

ఇక నా విజయ ప్రయాణగాధ....

------+------------------------------

పేపర్లెస్ రచయితగా... ఒక కుగ్రామం లో పేరు ప్రఖ్యాతులు పొందిన  నా తండ్రి సుబ్బారావు గారు నా ఆలోచనలకు, రచనలకు ప్రాణప్రతిష్ట చేసిన ప్రథమగురువు. తల్లి వీరభద్రమ్మ  నాకే కాదు నా కథలకూ ప్రాణదాతే!!


తదుపరి రమారమి 50 సంవత్సరాల క్రితమే.. మా ఊరివాడైన నా జూనియర్ క్లాస్మేట్... నా స్నేహితుడు ఇప్పటి సినీ దర్శకుడు " వంశీ "... కథలు రాస్తూ...   నన్ను కూడా కథలు రాయ మని... చెప్తుండేవాడు. అప్పటి నుండి  ఎక్కువగా రాయడం మొదలు పెట్టాను.ఆ తర్వాత మా ఊరి  వారైన  సినీ గేయరచయిత

" అదృష్టదీపక్".. నా కథలు.. చదివి.. మెచ్చు కునే వారు.. దాంతో ఇంకా విరవిగా కథలు రాయడం మొదలు పెట్టాను.


1. మొదటి రచన 1975 నాటి ప్రఖ్యాత పత్రిక "ఆంధ్రసచిత్రవారపత్రిక" లో బుద్ధిలేనిమనిషి  కథ.


2. రేడియో నాటికలు  గొల్లపూడి మారుతీ రావు    గారి సమకాలంలో విరవిగా వచ్చాయి.


3. సినిమాకథలపోటీ లో అలనాటి "విజయచిత్ర"  ద్వితీయబహుమతి కథ..  "డిసెంబర్ 31 రాత్రి"


4. ఉగాది కథలపోటీ "ఆంధ్రభూమి" బహుమతి కథ


5. ఉగాది కథల పోటీలో "ఆంద్రజ్యోతి" బహు మతి కథ


6.  దీపావళి కథలు పోటీలో  "ఆంధ్రజ్యోతి" బహుమతి కథ.


7. అప్పాజోస్యుల( అమెరికా) నిర్వహించిన కథల పోటీలో "నలుగురితో నారాయణ".. ఆంధ్రప్రభ విశిష్ట కథ ప్రచురణ


8. అల్లూరి స్మారక జయంతి "కళావేదిక " కరప తిలక్ స్మారక అవార్డు కథ " బ్రతుకు జీవుడా"


9. "స్వాతి "   తానా అమెరికా కథల పోటీలో ప్రచురణ కు ఎన్నికైన కథ..." వైష్ణవమాయ."


10. రాష్ట్రస్థాయి కథలపోటీ హైదరాబాద్  "నిమ్స్"ద్వితీయ బహుమతి కథ..న్యాయనిర్ణేత శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి." బంగారు పేకమేడ"


11. "అనిల్ అవార్డ్" స్వాతి కన్సోలేషన్ బహు మతి..." అమృతం  కురిసింది"


12. సస్పెన్స్ కథల పోటీ "స్వాతి" లో ఎన్నికైన కథ


13. "పులికంటి సాహితీ సంస్థ" రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన కథ..


14. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆరాధన" హైదరా బాద్ ద్వితీయ బహుమతి కథ.." అదిగో స్వర్ణ యుగం"  న్యాయనిర్ణేత   జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.. శ్రీ రావూరి భరద్వాజ గారు.


15. "అభ్యుదయ ఫౌండేషన్" కాకినాడ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ కథ.. " ఐదేళ్ల క్రితం " .


16. సి.పి.బ్రౌన్ "సాహితీ స్రవంతి".. ప్రత్యేక కథ

" ఇంద్రలోకం".


17.  కొమ్మూరి సాంబశివరావు స్మారక  సస్పెన్సు కథల పోటీలో  "నవ్య' ప్రచురణకు ఎన్నికైన కథ.


18. "వేలూరు పాణిగ్రహి" విజయవాడ "  గాంధీ తాత"  రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి కథ.


19. 'కదలిక'... సర్వశిక్షఅభియాన్  రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మింపబడిన అత్యున్నత టెలీ ఫిల్మ్... చిన్న సినిమా.


20. "అల కమ్యూనికేషన్" హైదరాబాద్ కథల పోటీలో ఎంపికైన కథ...." హృదయానికి శిక్ష".


21. రాష్ట్రస్థాయి కథలపోటీ "మైత్రేయ కళాసమితి" మెదక్.. పుస్తక సంకలనానికి ఎన్నికైన కథ. "బిందెడు నీళ్లు".


22. రాష్ట్ర స్థాయి కథల పోటీలు "జాగృతి" కన్సోలేషన్ బహుమతి  కథ "ఆలస్యం అమృతం విషం"


23. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ  "ఆంధ్ర ప్రదేశ్" పత్రిక ప్రత్యేక బహుమతి హాస్య కథ.


24. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్రప్రభ" ప్రచురణకు ఎంపికైన కథ.


25. దీపావళి కథల పోటీ "ఆంధ్రభూమి" ప్రచురణ కు ఎన్నికైన కథ.


26.  రాష్ట్రస్థాయికథల పోటీ "ఆప్కో ఫ్యాబ్రిక్స్" హైదరాబాద్ నిర్వహణ  పోటీ లో ఎన్నికైన కథ.


27. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆంధ్రప్రదేశ్పత్రిక" కు ఎన్నికైన హాస్యకథలు." చంద్రమండలంలో స్థలమును అమ్మబడును".


28.దీపావళి కథల పోటీ "జాగృతి" పత్రిక కు ఎన్నికైన కథ.


29. "హాస్యానందం" విశేష స్కిట్స్ కొరకు.. "రైజింగ్ స్టార్".. అవార్డు.


30 ఆంధ్రజ్యోతి "భావ తరంగం"  వారం వారం 30 కథలు.


31. "కళా దర్బార్"  రాజమండ్రి.. రాష్ట్రస్థాయి  కవితలపోటీలలు... 4 సంవత్సరాలు ఉత్తమ  కవిత్వానికి ప్రథమ బహుమతి...మూడుసార్లు.. ఉత్తమ కవిత్వానికి ద్వితీయ బహుమతి.


32.."హాసం" మాస పత్రిక లో ప్రచురింపబడిన  "చిరాకు దంపతులు చింతకాయ పచ్చడి"    కథ చదివిన చాలా మంది సినీ ప్రముఖులు  ఫోన్ కాల్స్ చేసి అభినందించడం.


33. ప్రఖ్యాత సిరివెన్నెల పత్రికలో  సిరివెన్నెల సీతా రామశాస్త్రి గారి నిర్వహణలో జానపద పాటల పోటీలో  ప్రథమ బహుమతి  పాటకు వారి నుండి  పత్రికాముఖంగా ప్రత్యేక ప్రశం సలు.. తదుపరి ఆ పాట అనేక   రంగస్థల ప్రదర్శనలు పొందడం.


34. విశేష కథలుగా  పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కథలు

  నలుగురితోనారాయణ

  కొరడా దెబ్బలు

  అమృతం  కురిసింది.

  వైష్ణవమాయ

  ఐదేళ్ల క్రితం

  ఇంద్రలోకం

  బిందెడు నీళ్లు

  చంద్రమండలంలో స్థలములు అమ్మబడును

  డిసెంబర్ 31 రాత్రి

  మహాపాపాత్ముడు

 

35. రాజమండ్రి ,కాకినాడ ,విజయవాడ, విశాఖ పట్నం ,రామచంద్రపురంలో.. విశేష సన్మానాలు.


ప్రస్తుతం...


1. ఒక పరిశోధన నవల.. ఒక చారిత్రక నవల రాసే ప్రయత్నం


2. పరిషత్ నాటికలు జడ్జిగా..


3.  కొందరు సినీప్రముఖుల ప్రోత్సాహంతో..

సినిమాలకు కథ మాటలు స్క్రీన్ప్లే అందించే ప్రయత్నం.


4. ..  4 కథల సంపుటిలు... రెండు కవితా సంపుటిలు.. 1గేయ సంపుటి.. 2 కామెడీ షార్ట్ స్కిట్స్.. రెండు నాటికల సంపుటిలు..ఒక నవల ప్రచురణ తీసుకొచ్చే ప్రయత్నం.


5. ఒక ప్రింటెడ్ పత్రిక  ప్రారంభించే ఉద్దేశ్యం.


భార్య.. గోవిందీశ్వరి... హౌస్ వైఫ్.

కుమారుడు... వెంకట రామకృష్ణ .. బి.టెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్... మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్.

కోడలు... మాధురీ లత..... ఎం ఫార్మసీ.

కుమార్తె.. సౌభాగ్య.. స్టూడెంట్.

మనుమరాలు.. ఆద్య... యాక్టివ్ బేబీ.

నా కథలను ఆదరించి తమ అమూల్య అభి ప్రాయాలు తెలియజేస్తున్న... రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ... వినమ్ర నమస్సులు.

నల్లబాటి రాఘవేంద్ర రావు 







50 views0 comments

Commentaires


bottom of page