top of page

ముత్తెపు ముక్కర


'Mutthepu mukkara' New Telugu Story


Written By Ch. C. S. Sarma




(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

గొప్ప మనసున్న కొందరు మహనీయులు తమ పరివారాన్నికూడా తమ బంధువులుగా ఆత్మీయులు గా చూచు కొంటారు. ఆపని వారికి దైవ సమానం.. వారే సర్వస్వం.


శివాలయంలో జగన్మాత సన్నిధిలో ఎంతో భక్తితో మోకరిల్లారు రంగమ్మ రాముడు. వారివురూ ఆ జగన్మాతా పితలను కోరింది తమ యజమాని కాళేశ్వర రావు, వారి అర్ధాంగి శ్యామలాంబ కొడుకు ప్రతాపరావు ఎప్పుడూ.. నిండు నూరేళ్ళు చల్లగా వుండాలని, ఆ ఇంటి చాకిరి చేస్తూ తమ జీవితాలు వారి ఉప్పూ పులుసు తింటూ, వారి మన్నలను పొందుతూ ఆనందంగా సాగిపోవాలని.


అర్చకుడు మంగళ హారతిని వెలిగించి, ఆ తల్లి కి చూపించి ఆ అమ్మను వీక్షిస్తున్న ఈ ఇరువురికి చూపించాడు. తీర్ధప్రసాదాలను ఇచ్చాడు.


మరోసారి ఆ మాతాపితలకు నమస్కరించి రంగమ్మ రాముడు ఆలయం బయటికి నడిచారు. పద్ధతి ప్రకారం ఆలయం ముందున్న మండపంలో కూర్చున్నారు. కొన్ని క్షణాలు ఆ దేవ దేవీలను ధ్యానించారు. కళ్ళను తెరిచిన రంగమ్మ..


“బావా!.. ”

“ఏం.. రంగా!.. ”

“అమ్మతల్లి ముక్కెర చూచావా?.. ఎంత అందంగా వుందో.. ”

“ఓసి.. పిచ్చిదానా!.. ఆ తల్లి ముక్కెర అందంగా లేకపోతే.. ఇంకెవరిది వుంటదే !.. ” నవ్వాడు రాముడు.


“బావా.. నాకో చిన్న ఆశ.. ”

“ఎంటే రంగా.. ”

“ఆ ముక్కెర ఎంతవుద్దంట”..


రాముడు వెంటనే లేచి ఆలయంలో ప్రవేశించాడు. రంగమ్మ ఆశ్చర్యంతో అతన్ని అనుసరించింది. రాముడు పూజారిని సమీపించాడు.

“సామీ!.. ”

“ఓ.. చిన్న మాట.. ”

“ఏందిరా.. ”

“ ఆ అమ్మ ముక్కుకు వున్న ముక్కెర ఎంతవుద్ది సామి.. ” వినయం నిండివున్న రామూ ప్రశ్న,


“ఒరేయ్.. రామూ.. అది ముత్తెపు బంగారు ముక్కెర రా.. ఈనాటి వెల ప్రకారం దాని విలువ యాభై వేలకు పైనేఉంటుందిరా. !.. ”

రాము రంగి ఒకరి ముఖాలు ఒకరు ఆశ్చర్యంతో చూచుకొన్నారు.

“అవునురా! ఆ ముక్కెర వెలతో నీకేం పనిరా.. !” నవ్వుతూ అడిగాడు అర్చకుడు.

“సామీ.. ఈ రంగీ అలాంటి ముక్కెర కావాలని అడిగింది. ఎంతవుద్దో తెలుసు కోవాలని అడిగినా”.. క్షణం సేపు పూజారి కళ్ళలోకి చూచి.. లజ్జతో తల దించుకున్నాడు రాముడు. రంగి దీనంగా అతని ముఖంలోకి చూచింది.


రాము బాధను గమనించిన పూజారి.. “అమ్మకు వుండే ముక్కెర చాలా పెద్దదిరా.. రంగికి అంత పెద్దది ఎందుకు.. పది పదిహేను వేలల్లో చిన్నది చిక్కుతుంది. దాన్ని కొని ఇవ్వరా!.. ”


మనస్సును నొప్పించడం అందరూ చేయగలరు. మెప్పించడం కొందరే చేయగలరు. అదే.. పూజారిగారు చేసారు.

రాము మనస్సున ఆనందం.. ”పదివేలకు చిక్కదా సామీ!.. ” ఆనందంగా అడిగాడు రాము.

“చిక్కుతుందిరా.. పిండి కొద్ది రొట్టె.. నీకు తెలిసిన విషయమే!.. ” అనునయంగా చెప్పాడు పూజారి.


వారికి నమస్కరించి.. ఇరువురూ ఆలయం నుండి బయటికి నడిచారు.

రంగికి పెండ్లి జరిగి తొమ్మిది నెలలు. రంగి ఇంతవరకు అతన్ని ఏమి కోరలేదు.. ఈనాడు.. ముక్కెర కావాలని కోరింది. యజమానిని అడిగి పదిహేను వేలు తీసుకొని రంగికి ముక్కెర కొని ఇవ్వాలని నిశ్చయించుకొన్నాడు రాము. “రంగీ!.. పదిరోజుల లోపల నీకు ముక్కెర కొనిస్తానే.. !.. ” ఆనందంగా చెప్పాడు రాము.


“అబ్బో!.. అంత డబ్బు మనకాడ ఏడ వుంది బావా!.. ” దీనంగా ఆకాశాన్ని చూస్తూ అంది రంగి.

ఇద్దరు వారి గుడిసె వైపుకునడుస్తున్నారు. రాము రంగి చేతిని తన చేతిలోకి తీసుకొన్నాడు. “మనసుంటే మార్గం కనబడి తీరుతుందే.. నీకెందుకు.. నే చూసుకొంటా.. ”


రంగి చేతిని ప్రీతిగా నొక్కాడు. ఆమె వొళ్ళు జలదరించింది. నయనాల్లో ఎంతో.. సంతోషం. ఆప్యాతతో రాము కళ్ళల్లోకి చూచింది. రంగి భుజంపై చేయి వేసి దగ్గరకు తీసుకొన్నాడు రామూ నవ్వుతూ.

&&&&& &&&&& &&&&&

ఆ గ్రామానికి.. హైవేకి నాలుగు కిలో మీటర్లు హైవే ప్రక్కకు కాళేశ్వరరావుకు పెద్ద రైస్ మిల్లు వుంది. ఆ చుట్టుప్రక్కల పది గ్రామాల నుంచి ఎడ్లబండిలో ధాన్యాన్ని తెచ్చి.. వారు మిషన్ ఆడించుకొని బియ్యాన్ని తీసుకొని వెళుతుంటారు గ్రామస్తులు.


ఆ మిషన్ కు సంబంధిన భాధ్యత లన్నింటిని రాము నిర్వహిస్తుంటాడు. రంగమ్మ వారింట్లో పనిమనిషి. శ్యామలాంబకు అన్ని పనుల్లో సాయంగా.. దినానికి ఎనిమిది గంటలు ఆ ఇంట్లోనే వుంటుంది.


కూటికి.. గుడ్డకు రంగి రాములు పేదవారైనా వారి నిజాయితీ.. మంచి మనస్సుతో వారు ఆ చిన్న గ్రామ వాసు లందరికి.. ఈ పెద్దింటి పెద్దలకు ఎంతో ప్రియులు. రామూ తండ్రి తన జీవితాంతం ఆ పెద్ద ఇంట పాలేరుగా గడిపి రెండు సంవత్సరాల క్రిందట కన్ను మూశాడు. తనకు వూహ తెలిసినప్పటి నుంచీ రాము తండ్రికి, ఆయన విధి నిర్వహణలో సాయంగా నిలిచాడు. ఆ కారణంగా కాళేశ్వర రావు గారికి రాము అంటే ఎంతో నమ్మకం.. ప్రీతీ.


కాళేశ్వరరావు కుమారుడు ప్రతాప్ రావు పట్నంలో తన మేనమామగారి ఇంట్లో ఉంటూ బి. టెక్., చదువుతున్నాడు. ఒక్కగానొక్క కొడుకై నందున ఆ దంపతులు అతన్ని ఎంతో గారాబంగా పెంచారు. ఫలితంగా ప్రతాప్ పరమ పెంకివాడుగా తయారైనాడు.


తాను తలచుకొన్నది సాధించే వరకు ఊరుకోడు. మూడు నెలల క్రిందట సెలవుల్లో ఇంటికి వచ్చిన ప్రతాప్ రంగిని చూచి.. ముగ్దుడైనాడు. తనకున్న విద్యాజ్ఞానంతో రంగితో సరస సంభాషణ చేసి ఆమెను ముగ్గు లోకి దించాలని విశ్వప్రయత్నం చేసాడు. కానీ ఏ ప్రయత్నం ఫలించలేదు. కానీ.. అతని మనస్సులో ఆ ఆశ చావలేదు. ఈసారి వచ్చినపుడు ఏరీతిగానైనా సరే.. తన లక్ష్యాన్ని సాధించాలనుకొన్నాడు.. సైరంద్రిని చూచిన కీచకుని వలే. లీవుల కోసం రోజులులెక్క పెట్టుకొంటూ రోజులు గడిపాడు పట్నంలో.


ప్రక్క వూర్లో బంధువుల ఇంటి పెండ్లికి కాళేశ్వర రావు శ్యామలాంబ బయలు దేరు తున్నారు. అదే సమయానికి ప్రతాప్ ఇంటికి వచ్చాడు. తెల్లవారి వేకువన పెండ్లి కాబట్టి తను కొంతసేపు విశ్రాంతి తీసుకుని రాత్రికి వస్తానని తల్లిదండ్రులకు చెప్పాడు. ప్రతాప్ ‘ఇంట్లో ఎవ్వరూ లేని ఈ తరుణం.. రంగితో తన కోర్కె తీరేటందుకే.. ’ అని సంబరపడ్డాడు.


అదే సమయానికి.. రామూ అక్కడికి వచ్చాడు.. రంగి ముక్కేరకు డబ్బును అడిగే దానికి. అతని వాలకాన్ని చూచిన కాళేశ్వర రావు “ఏదైనా కావాలా రామూ!”.. అడిగాడు.

ఎంతో భయంతో.. ”నాకు పదిహేనువేలు కావాలి సామి. రంగికి ఒక ముక్కెర కొని ఇవ్వాలి.. ” మెల్లగా తల వంచుకొని చెప్పాడు.


ఆ భార్యా భర్తలు ఒకరి ముఖాలు ఒకరు చూచు కొన్నారు.. నవ్వుకొన్నారు.

“కార్లో కూర్చో.. ” ప్రీతిగా చెప్పాడు కాళేశ్వర రావు. ఆనందంగా కారు ముందు సీట్లో కూర్చున్నాడు రాము. ఆ దంపతులు వెనుక సీట్లో కూర్చున్నారు. డ్రైవర్ కారు స్టార్ట్ చేసాడు.


పట్నంలో వారు నగలు తీసుకొనే షాపులో తను సెలెక్ట్ చేసి.. రామూకు నచ్చిన ముత్తెపు ముక్కెరను పదహారు వేలకు కొని, రామూకు ఇచ్చి వారు పెండ్లికి వెళ్ళారు. రాము బస్సులో వూరికి బయలుదేరాడు

&&&&&& &&&&&

రాము తన ఇంటికి చేరాడు. ముత్తెపు ముక్కెర ను రంగికి చూపించాడు. ఆమె ఆనందానికి హద్దులు లేవు. రామూని గట్టిగా చుట్టుకొంది. నొసటన ముద్దు పెట్టుకొంది.


ఇరువురు శివాలయానికి వెళ్ళారు. ముక్కెరను మాత పాదాల చెంత పెట్టి, ఇరువురిని ఆశీర్వదించి ముక్కెరను రంగి చేతులో ఉంచాడు పూజారి. ముక్కున వున్న వేప పుల్లను తీసి ఆ జగన్మాత ఎదుట రామూ చెప్పినట్లుగా రంగి ముక్కెరను ముక్కుకు పెట్టుకొంది. పూజారి పాదాలను, రాము పాదాలను తాకి వారి దీవెనలను అందుకొంది. ఆ ఇరువురు ఆనందంగా ఇంటివైపుకు నడిచారు. రాము రైస్ మిల్లుకు వెళ్ళిపోయాడు. రంగి పెద్ద ఇంటికి పనికి వెళ్ళింది. రంగిని చూచిన ప్రతాప్ మనస్సులో ఎంతగానో సంబరపడి పోయాడు.


మనుష్య మాంసాన్ని తినమరిగిన పులి ఒంటరిగా తన కంటికి కనిపించిన మనిషిని వెంటాడి వేటాడి చంపి తినేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంది.


ముఖద్వారానికి వున్న తలుపు బిగించాడు ప్రతాప్. వంటింట్లో పనిచేస్తున్న రంగిని సమీపిం చాడు. చతురతతో మాట్లాడాడు. తాక బోయా డు. ఆమె దీనంగా అర్ధించింది. తను అలాంటిదాన్ని కాదని చెప్పింది. బెదిరించింది. ప్రతాప్ అభిమానం దెబ్బతింది. మానవత స్థానంలో అమానుషత్వం ఆవరించింది. తన కబంధ హస్తాలతో ఆమెను పట్టుకొన్నాడు. చేతిని కొరికి ఆమె పారిపోను ప్రయత్నించింది. వంటగది తలుపు బిగించాడు ఆ కామాంధుడు ప్రతాప్. రంగి చీరను వూడతీసాడు. రవికను వెనుక వైపున చించి వేసాడు. పులిలా ఆమెపైకి లంఘించాడు.


రంగి ఆవేశంతో భద్రకాళి లా మారింది. ప్రతాప్ ను ప్రక్కకు తోసింది. ఆతను తూలి క్రింద పడ్డాడు. వెంటనే లేచాడు. రంగి కాలును పట్టుకొని ఆమెను పడదోయ బోయాడు. స్టవ్ అరుగుమీదవున్న కత్తిపీటను రంగి చేతికి తీసుకొంది. నేలన పడబోతూ కత్తిపీటను ప్రతాప్ వైపు బలంగా విసిరింది. అది అతని మెడకు తగిలింది. క్షణాల్లో రక్తం చిమ్మింది. ప్రతాప్ రంగి కాలు వదలి నేలకు ఒరిగాడు. కంఠం తెగిన కారణంగా విపరీతంగా రక్తస్రావం గాయంనుండి వెలువడింది. ఆ రక్తాని చూచి.. రంగి భయపడింది. కత్తిపీటను విసరి పరుగున ఇంటి ముఖద్వారాన్ని చేరి తెరచి వీధిన పరుగు ప్రారంభించింది బోరున ఏడుస్తూ.

&&&&& &&&&& &&&&&

ప్రతాప్ చచ్చిపోయాడు. రంగికి రెండు సంవత్సరాలు జైలు శిక్ష పడింది. అమ్మణ్ణి పాదాల చెంత పెట్టి, ముక్కుకు ముక్కెరను పెట్టుకొన్న రంగి కాళిగా మారి ఆ నరరూప రాక్షసుణ్ణి సంహరించిందని కొందరు గ్రామస్తులు అనుకొన్నారు.


గుణహీనుడైన తనయుడు పోయినందుకు కొంతసేపు ఆ తల్లిదండ్రులు చింతించినా.. వాడి క్రతువులు ముగించాక సాక్షాత్ శ్రీరామచంద్రుడి వంటి రామూను తమ బిడ్డగా దత్త స్వీకారం చేసుకొన్నారు.


చాతక పక్షి వర్షం రాకకు వేచియున్నట్లు రామూ.. రంగి జైలునుండి విడుదలయ్యే రోజు కోసం ఎదురు చూస్తున్నాడు. అతనే కాదు.. అత్తా మామలు కూడా.

&&&&& &&&&& &&&&&

//సమాప్తి//

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



Twitter Link


Podcast Link

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


రచనా వ్యాసంగం: తొలి రచన ‘లోభికి మూట నష్టి’ విద్యార్థి దశలోనే రాశాను, అప్పట్లో మా పాఠశాల బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ నుండి ఈ శ్రవ్య నాటిక అన్ని తరగతులకు ప్రసారం చేశారు.

అందులోని మూడు పాత్రలను నేనే గొంతు మార్చి పోషించాను.

మా నాయనమ్మ చెప్పిన భారత భాగవత రామాయణ కథలు నన్ను రచనలకు పురికొల్పాయి.

ఇప్పటి వరకు 20 నవలలు, 100 కథలు, 30 కవితలు రాశాను.






47 views0 comments
bottom of page