top of page

నా బిడ్డకి తండ్రి దొరికాడు!


'Naa Biddaki Thandri Dorikadu' written by Vasundhara

రచన : వసుంధర

‘‘స్త్రీ శక్తిస్వరూపిణి అని ఆడవాళ్లకంటే మగవాళ్లే ఎక్కువ నమ్ముతారు. అది ఒప్పుకుందుకు అహం అడ్డొస్తుంది. అట్నించి నరుక్కు రావాలని వాళ్లు ఆడదాన్ని అణచుంచడానికి ఎన్నో నియమాలు, సంప్రదాయాలు ఏర్పరిచారు. అది ఆడవాళ్లకి తెలుసు. కానీ వాళ్లది ప్రేమ, జాలి నిండిన గొప్ప మనసు. అందుకని మగాడి అహానికి అణగి మణగి ఉండడానికి వీలైనంత ప్రయత్నం చేస్తారు’’

ఇది చెప్పింది అమ్మ. తన విషయంలో నాన్న, నా విషయంలో అన్న - అందుకు తిరుగులేని ఉదాహరణలు. అలాగని వాళ్లేం చెడ్డవాళ్లు కారు. మా ప్రేమకీ, జాలికీ నిరంతరం పని కల్పిస్తూ మమ్మల్ని ఉద్ధరిస్తూంటారంతే!

చదువై ఉద్యోగంలో చేరేక - ప్రేమిస్తున్నామంటూ ఐదుగురబ్బాయిలు నా వెంటపడ్డారు. ఐదుగురూ నాకు నచ్చడంతో - ఎంపికకు అమ్మ సలహా అడిగాను.

‘‘నువ్వు సాధారణ మహిళవి కాదు. నీ ఆలోచన, తెలివి చాలామంది ఊహకందవు. నీకు నేను చెప్పగలిగిందేమిటంటే - నేడు నీ అందానికి ఆకర్షించబడ్డవాడు రేపు నీ తెలివికి తట్టుకోలేకపోవచ్చు. ఎందుకంటే మగాళ్లలో ఎక్కువమందికి ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్స్‌ ఉంటుంది. బయటివాళ్లకి తెలియనివ్వకుండా ఆ కాంప్లెక్సుని భార్యల ముందే ప్రదర్శించడం మగాళ్ల నైజం. అది భరించడం ఏ ఆడదానికైనా కష్టం. మీ పెళ్లిళ్లు మీరే చేసుకుంటే మీ కాపురాల్ని మీకు మీరే నిలబెట్టుకోవాలి. పెద్దలు మీ పెళ్లి చేస్తే, మీ కాపురాల్ని నిలబెట్టే బాధ్యత వాళ్లదౌతుంది. భార్యతో ఐతే అహం కానీ, పెద్దలతో ఆ సమస్య రాదు కాబట్టి - మగాడు కూడా రాజీ పడతాడు’’ అంది అమ్మ.

అమ్మకి ప్రేమ పెళ్లిళ్లు నచ్చవని అర్థమై, ‘‘కానీ అరేంజ్డ్‌ మారేజెస్‌లో ముక్కూ మొహం ఎరుగని వాడితో అడ్జస్టు కావాలి కదమ్మా!’’ అన్నాను.

‘‘ప్రేమపెళ్లిలోనైనా - మగాడి ముక్కూ మొహం నిజంగా తెలిసేది పెళ్లయ్యాకనే తల్లీ’’ అని నవ్వి, ‘‘ఇలాంటి విషయాలు మన పురాణాల్లోనే గోప్యంగా తెలియబర్చారు. ఒకరికి మించి భార్యలున్న ఏ మగాడూ సవతులమధ్య గొడవ లేకుండా మానేజ్‌ చెయ్యలేకపోయాడు. అవతార పురుషుడైన శ్రీకృష్ణుడికే అష్టభార్యలతో ఎన్నో చిక్కులొచ్చాయి. అదే ద్రౌపదిని తీసుకుంటే, ఆమె ఐదుగురు భర్తలూ అమె కారణంగా ఒక్కసారైనా కలహించుకున్నట్లు తోచదు. అదీ ఆడవాళ్ల మేనేజ్‌మెంట్’’ అంది అమ్మ.

అలా నేను ముక్కూ మొహం తెలియని ఇంద్రకుమార్‌ని, కేవలం నాన్న ఓకే చేశాడని పెళ్లి చేసుకున్నాను.

అమ్మ చెప్పిన చేదునిజాల్ని స్వానుభవిస్తూ, తనిచ్చిన సలహాలు పాటిస్తూ, నాలోని ప్రేమకీ జాలికీ తరచుగా పని చెబుతూ - చుట్టుపక్కలవాళ్లకే కాక, నా భర్త దృష్టిలోనూ ఉత్తమ ఇల్లాలినయ్యాను. కానీ, రెండేళ్లు గడిచేసరికి తనతో గొడవ తప్పలేదు.

పిల్లలొద్దంటాడు తను. అందుకు తన కారణాలు తనకున్నాయి. కానీ తల్లిని కావాలని నా ఆకాంక్ష. అందుకు కారణాలేముంటాయ్‌, ఆడదాన్ని కావడం తప్ప!

మగాడికి ఆడతోడు కావాలి. ఆడదానికి అమ్మతనం కావాలి, తన బిడ్డకి తండ్రి కావాలి. అలా మేమిద్దరం దంపతులమయ్యాం. కానీ అతడికి నేను కావాలి. తండ్రి కాకూడదన్న తన ఇష్టమే నా ఇష్టం కావాలి. నా మనోభీష్టానికి ప్రాధాన్యమివ్వకుండా, పిల్లలు పుట్టకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించాడు. పాటించమని శాసించాడు. పాటించకపోతే దూరం పెడతానని బెదిరించాడు.

అతడంటే ఇష్టమే. అయిష్టశాసనం చేసినా అతడిపై కోపం రాదు. అదతడి బలహీనత అనుకుంటాను. దాన్ని నా బలంగా మార్చుకోవా లనుకుని - అతడి శాసనాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నట్లు మభ్యపెట్టాను. మూడోనెలొచ్చేక కడుపొచ్చిందని చెప్పాను. అందరు ఆడవాళ్లలా చిరుసిగ్గులు ఒలికిస్తూ, వగలు పోతూ కాదు. ఏదో తప్పు చేసిందానిలా భయం నటిస్తూ, పొరపాటుకి సారీ చెబుతూ.....

అతడికి కోపమొచ్చింది. మాట్లాడ్డం మానేశాడు. వేరే గదిలో పడుకోసాగాడు. ఒకటి రెండు నెల్లు గడిచేక, కంపెనీవాళ్ల నడిగి మలేసియాలో అసైన్మెంటు తీసుకుని మకాం మార్చేశాడు. నాల్రోజుల క్రితమే ఇండియా వచ్చాడు. ఇంటికి రాకుండా కంపెనీ గెస్ట్‌హౌసులో ఉంటున్నాడు.

తొందరలోనే విడాకులిస్తానని మెసేజ్‌ పంపాడు. నా బిడ్డకి నేనెంతో తనూ అంతే ముఖ్యమన్న వివేకం నాకుంది. ఐనా అప్పటికి బదులిచ్చాను - బిడ్డ పుట్టగానే నేనే తనకి విడాకుల నోటీసు పంపుతానని.

నాకు తెలుసు. విడాకులకి సరైన కారణం చెప్పాలి. తనకున్న కారణం మావాళ్లకీ, తనవాళ్లకీ, కోర్టుకీ కూడా సబబనిపించదు. మరి నేను తనకి విడాకులిస్తే, అతడి అహం దెబ్బ తింటుంది. కాబట్టి తెగేదాకా లాగడు.

అందుకే ప్రస్తుతం మామధ్య జరుగుతున్న కోల్డ్‌వార్‌ గురించి నేనే కాదు, తనూ ఎవరికీ తెలియనివ్వలేదు.

నేను గర్భవతినని అమ్మకి చెప్పలేదు. భర్త అభీష్టానికి వ్యతిరేకంగా బిడ్డని కంటున్నాను కాబట్టి పురిటికి ఎవరి సాయం వద్దనుకున్నాను.

నెలలు నిండగానే ప్రమీలా నర్సింగ్‌ హోంలో చేరాను. అక్కడ గైనకాలజిస్ట్‌ సుశీల , నా బాల్యమిత్రురాలి అక్క. చిన్నప్పట్నించీ బాగా తెలుసు. ఇప్పుడూ నా గురించి అన్నీ ఆమెకి తెలుసు. బిడ్డ పుట్టేక నా మనోభావాలెలాగుంటాయో మాత్రం నాకే ఇంకా తెలియదు....

- - - - -

ఆరో తరగతిలో స్కూల్లో జరిగిన పరుగుపందెంలో - మగపిల్లల్ని ఓడించి మొదటి స్థానం దక్కించుకున్నాను. పదో తరగతిలో పాటల పోటీలో, సంగీతశిక్షణ లేని నేను, సంగీతమొచ్చినవాళ్లతో పోటీపడి విజేతనయ్యాను. ఇంజనీరింగ్‌ ఫైనలియర్లో ఓ ఎమ్మెన్సీ మా కాలేజిలో నిర్వహించిన కాంపస్‌ ఇంటర్వ్యూల్లో ఎంపికైన ఒకేఒక్క వ్యక్తిని నేనయ్యాను.

ఉద్యోగంలో చేరేక ఏ టీం లీడరైనా తన ప్రాజెక్ట్‌లోకి కావాలనే పేరు అరుణ. అది నేను.

ప్రతి సందర్భంలోనూ చెప్పలేనంత సంతోషం కలిగేది. కానీ ఇప్పుడు ప్రమీలా నర్సింగ్‌ హోంలో ఓ బెడ్‌మీద నీరసంగా పడుకుని ఓ పక్కకు ఒత్తిగిలి చూస్తుంటే కలుగుతున్న సంతోషానికి అవేమీ దీటు రావు. నేను చూస్తున్న వైపు ఓ ఉయ్యాల. ఉయ్యాల్లో ఇంకా కళ్లువిడని పసిగుడ్డు. ఆ పసిగుడ్డు నేను కన్నబిడ్డ. ఆ బిడ్డకోసం -

నాజూకైన శరీరంలో వంపులూ సొంపులూ కోల్పోయాను. నా రక్తాన్ని పంచాను. నవమాసాలు మోసాను. కడుపులో తన్నులు భరించాను. ఆర్నెల్లుగా మెదడులో భర్త గురించిన ఆలోచనల బరువునీ, కడుపులో బిడ్డ బరువునీ మోస్తున్నాను.

ఇప్పుడు బిడ్డ భూమ్మీదకొచ్చి పొట్టభారం తగ్గిపోవడం అదో అనుభవం. క్యేరుమన్న బిడ్డ స్వరం వినడం అదో అనుభవం. ఆ బిడ్డని మొదటిసారి చూడ్డం అదో అనుభవం, తాకడం అదో అనుభవం. ఒక్కమాటలో చెప్పాలంటే జ్ఖానేంద్రియాలన్నింటికీ అన్నాళ్లెరుగని అలౌకికానందం. వేదాంతపరంగా చెప్పాలంటే - ఘోరతపస్సు చేసిన మునికి భగవంతుడు ప్రత్యక్షమైనప్పుడు కలిగిన అద్భుతానుభూతి.

ఆడదానికి పతియే ప్రత్యక్షదైవమంటాయి మన పురాణాలు. కానీ – దేవకీ యశోదలకే కాదు. ఉయ్యాల్లో పసిగుడ్డు ఏ తల్లికైనా ప్రత్యక్షమైన దేవుడే!

ఆ తృప్తిలోనూ ఓ బాధ - ఆ అనుభూతిని బిడ్డ తండ్రితో పంచుకోలేకపోతున్నానని, ఆ బిడ్డకి తండ్రిని దగ్గర చెయ్యలేనేమోనని!

అలసటతో కన్నులు అరమోడ్పులయ్యాయి. చిన్న కునుకు పట్టింది. తర్వాత - పెద్ద గొడవతో మెలకువొచ్చింది. కళ్లు తెరిచి చూస్తే -

‘‘ఈ బిడ్డ నాది’’ అంటోంది ఒకామె.

ఆమెని గుర్తు పట్టాను. పేరు రమ. తనది నా పక్క గదే! తనూ నాకులాగే అయినవాళ్లెవ్వరూ లేకుండా వారం రోజుల క్రితం హాస్పిటల్లో చేరింది. ఒక రోజు ఇంత పొట్టేసుకుని తనే నా గదికొచ్చి నాతో కబుర్లు మొదలెట్టింది.

ఆడపిల్ల పుడితే మొగుడొదిలేస్తానన్నాడని తెగ టెన్షన్ పడుతుంటే, ‘‘టెన్షనెందుకూ - బిడ్డ పుట్టేక, ఆ పుట్టింది మగబిడ్డయినాసరే - నువ్వే నీ మొగుణ్ణొదిలేయ్‌. ఇంతకుముందు అలాగన్నందుకు సారీ చెప్పేదాకా కాపురానికెళ్లకు’’ అన్నాను.

‘‘పెద్దుద్యోగంలో ఉన్నావ్‌ - నీకేం, ఎన్ని కబుర్లయినా చెబుతావ్‌! నీకులా నాకు సాగదు’’ అందామె.

‘‘కబుర్లే కాదు. పరిష్కారమూ చెబుతాను. నేను మొగుణ్ణొదిలెయ్యాలని ముందే నిర్ణయించుకున్నాను. నువ్వు నీ మొగుణ్ణొదిలేసి నా దగ్గరకొచ్చేయ్‌. ఇంటి పనులు నువ్వు చెయ్‌. ఉద్యోగం నేను చేస్తాను. ఇద్దరం పిల్లల్ని చక్కగా పెంచుదాం’’ అన్నాను.

‘‘భలే తమాషాగా మాట్లాడుతావమ్మా! నీతో మాట్లాడితే భయం పోయింది. నాకిప్పుడెంతో ధైర్యంగా ఉంది’’ అంది రమ.

ఇద్దరికీ స్నేహం కుదిరింది. అరమరికలు పోయి నిజాల్ని నిర్భయంగా ఒకరికొకరు చెప్పుకున్నాం. మేము మాత్రమే ఉన్నప్పుడొకలా, పక్కన నర్సు కానీ, మరెవరైనా కానీ ఉన్నప్పుడు మరొకలా ఉండేవి ఆ నిజాలు. అలా మా మధ్య ఓ అవగాహన కుదిరింది. చిత్రమేమిటంటే ఇద్దరిదీ ఒకే సమస్య.

రమకి చెప్పాను. ‘‘నాకు మగపిల్లాడు, నీకు ఆడపిల్ల పుడితే - పిల్లల్ని మార్చేసుకుందాం. నేను మొగుణ్ణొదిలేసి నీ పిల్లని పెంచి పెద్ద చేస్తాను. నువ్వు పిల్లని నాకొదిలేసి నా బిడ్డని తీసుకెళ్లి నీ కాపురం నిలబెట్టుకుందువుగాని’’ అని.

‘‘మరి నీకు ఆడబిడ్డ, నాకు మగపిల్లాడు పుడితే...?’’ అంది రమ.

‘‘గాలీ వానా వాస్తే కథే లేదు. నీ సమస్య అలా తీరిందనుకుందాం’’ అన్నాను.

రమ ఒప్పుకోలేదు. ‘‘నిన్ను చూసేక నాలో కొత్త ధైర్యమొచ్చింది. ఆత్మగౌరవం లేని బ్రతుకూ బ్రతుకేనా అనిపిస్తోంది. నాకు మగపిల్లాడు పుట్టినా సరే, మనం బిడ్డల్ని మార్చేసుకుందాం. మొగుళ్లని మర్చిపోయి కొత్త జీవితం మొదలెడదాం’’ అంది.

అక్కడే ఉన్న నర్సు సుజాత మా సంభాషణని కుతూహలంగా వింటూ, మమ్మల్ని ఆశ్చర్యంగా చూసి, ‘‘ఎలాగోలా కాపురాలు నిలబెట్టు కోవాలనుకునే ఆడాళ్లని ఇంతమందిని చూసాను. చెడగొట్టుకోవాలనే వాళ్లని మిమ్మల్నే చూస్తున్నాను’’ అంది.

‘‘మాలాంటివాళ్లూ ఇంతమందున్నారు. ప్రపంచాన్ని సరిగ్గా చూడాలంతే!’’ అన్నాను.

సుజాతలో కుతూహలం పెరిగి, ‘‘మీ కథేంటో వివరిస్తారా?’’ అని మళ్లీ ఏమనుకుందో, ‘‘మీకభ్యంతరం లేకపోతేనే....’’ అని నసిగింది.

‘‘ఇందులో దాచడానికేముందిలే కానీ చెప్పడానికి కొంచెం మొహమాటం. కానీ పురుడు పోసుకుందుకొచ్చినవాళ్లం - డాక్టర్ల దగ్గరా, నర్సుల దగ్గరా మొహమాటం ఎలాగూ కుదరదు’’ అని రమవంక తిరిగి, ‘‘నువ్వు చెబుతావా, నేను చెప్పనా’’ అన్నాను.

‘‘నువ్వే చెప్పు’’ అంది రమ వెంటనే.

‘‘ఐతే నీ కథ చెబుతాను’’ అని ప్రారంభించాను.

రమ భర్తకి ఆడపిల్ల తండ్రి కావడం ఇష్టం లేదు. అది చాటుగా భార్యకి చెబుతాడు తప్ప పైకెవరిదగ్గరా అనడు. ఎందుకంటే అతగాడు సమాజంలో ఆదర్శవాదిగా చెలామణీ ఐపోతున్నాడు. పుట్టేది ఆడబిడ్డయితే ముందుగా తెలుసుకుని గర్భస్రావం చేయించాలన్నా, ఆ కుహనా ఆదర్శవాదమే అడ్డొస్తోంది. అందుకని, భార్య తపనని పట్టించుకోకుండా, తమకసలు పిల్లలే వద్దనీ, బంధువుల పిల్లాణ్ణి తెచ్చుకుని పెంచుకుందామనీ నిర్ణయించాడు.

‘‘ఈ కథలో రమ బదులు అరుణ ఉంటే - మిగతాదంతా సేమ్‌ టు సేమ్‌’’ అని కథ పూర్తి చేశాను.

ఇదంతా పెద్ద కళ్లు చేసుకుని వింటున్న సుజాత, ‘‘ఆడపిల్ల పుడుతుందన్న భయంతో పిల్లలే వద్దనుకునే మగాళ్లున్నారా ఈ లోకంలో’’ అంది ఆశ్చర్యంగా.

‘‘ఉన్నారు. కానీ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆడదాని సహకారం కూడా అందుకు ముఖ్యమని తెలియని మూర్ఖులు వాళ్లు. కడుపొస్తే విడాకులని బెదిరిస్తే చాలనుకునే అహంకారులు వాళ్లు. అమ్మతనం కోసం ఆడది విడాకులకైనా సిద్ధపడగలదని తెలియని వివేకశూన్యులు వాళ్లు’’ అన్నాను.

సుజాతకి విషయం అర్థమైంది. ఇంకా అర్థం కానిదల్లా, అలాంటి మగాళ్లూ, మాలాంటి భార్యలూ ఇంతమందుంటే ఈ ప్రపంచం ఇంత మామూలుగా ఎలాగుందీ అని. అదే ఆమె చెబితే నేను నవ్వాను. అప్పుడు రమా నవ్వింది....

ఇప్పుడదే రమ పచ్చి బాలెంతగా నడిచి నా గదికొచ్చి - నా బిడ్డని తనదంటోంది.

‘‘ఈ బిడ్డ నీది కాదు, నాదే’’ అన్నాను.

రమ స్వరం పెంచింది, ‘‘నాకు పుట్టింది మగబిడ్డ. కనేముందు కబుర్లు చాలా చెప్పావు కానీ, మొగుడొదిలేసిన ఆడదానికీ సమాజంలో గౌరవముండదని తెలుసు. నిజంగా ఆడపిల్ల పుట్టేసరికి, బిడ్డల్ని మార్చేశావ్‌’’ అంది.

‘‘నేను బిడ్డల్ని మార్చలేదు. కావాలంటే సుజాతనడుగు’’ అన్నాను.

నాకు పుట్టింది మగబిడ్డేననీ, రమకి ఆడబిడ్డ పుట్టిందనీ సుజాత రూఢి చేసింది.

‘‘నీ దగ్గర డబ్బు బాగా ఉంది. సుజాతని కొనేసుంటావ్‌’’ అంది రమ.

సుజాతకి కోపమొచ్చింది, ‘‘ఎవర్నీ కొనక్కర్లేకుండా బిడ్డల్ని మార్చుకుందానుకున్నది మీరు. మధ్య నా ఊసు తేకండి’’ అంది.

‘‘ఆవేశంలోనో, ఉక్రోషంలోనో లక్షనుకుంటాం. కానీ పేగు తెంచుకుని పుట్టిన బిడ్డని పరాయివాళ్లకప్పజెప్పడానికి ఏ కన్నతల్లికి మనసొప్పుతుంది?’’ అంది రమ.

‘‘కదా! నేనూ సేమ్‌ టూ సేమ్‌! నా బిడ్డని పరాయి మనిషికి అప్పజెబుతానా?’’ అన్నాను.

సుజాత అక్కణ్ణించి వెళ్లి డాక్టర్‌ సుశీలని పిల్చుకొచ్చింది. కొంచెం అసహనంగానే ఆమె మేమిద్దరం చెప్పేది వింది.

‘‘మా నర్సింగ్‌ హోంపై ఇలాంటి ఆరోపణలింతవరకూ లేవు. ఇప్పుడైనా ఇది సైకలాజికల్‌ ప్రోబ్లమే తప్ప తప్పేం జరుగలేదని నా నమ్మకం. అది నిరూపించడానికి డిఎన్‌ఎ పరీక్ష ఉండనే ఉంది’’ అందామె.

‘‘సరే - ఆ పరీక్ష జరిపించండి’’ అన్నాను దృఢంగా. రమ కూడా తడబడలేదు, ‘‘నేనూ ఒప్పుకుంటున్నాను’’ అంది.

సుశీల క్షణమాలోచించి, ‘‘ఈ సంఘటన మా నర్సింగ్‌ హోం ప్రతిష్ఠని దెబ్బతీస్తుంది. కాబట్టి ఓ పని చేద్దాం. విషయాన్ని బయటికి పొక్కనివ్వద్దు. పక్కా పరీక్షకిగానూ, బిడ్డ జీన్సుని తలిదండ్రులిద్దరి జీన్సుతోనూ సరిపోల్చిచూస్తాం. బిడ్డలు మారిపోయుంటే, మీకు భారీగా నష్టపరిహారం చెల్లిస్తాం. లేదూ, మీరు మాకు భారీ పరిహారం చెల్లించాలి’’ అంది రమతో. రమ తడబడినా చివరికి సరేనంది.

డిఎన్‌ఎ పరీక్షకి శాంపుల్స్‌ కోసం నా భర్త ఇంద్రకుమార్‌కీ, రమ భర్త దిలీప్‌కీ ఫోన్లు వెళ్లాయి.

మామూలుగా మేము పిలిస్తే వచ్చేవారు కారేమో! కానీ కన్నబిడ్డని చూడాలని వాళ్ల పితృహృదయాలు మాత్రం తపించవా? వంక దొరికింది కాబట్టి, అహం తృప్తిపడి, క్షణాలమీద అక్కడ వాలారు. వస్తూనే అక్కడున్నవాళ్లకి అనుమానం రాకుండా, అంతవరకూ రాలేకపోయినందుకు కుంటిసాకులు చెప్పి - పిల్లల్ని చూడ్డానికి మహా కుతూహలపడ్డారు.

సుశీల వాళ్లిద్దరికీ జరిగినదంతా మరోసారి వివరించి, ‘‘మీరు సహకరిస్తే ఇప్పుడే డిఎన్‌ఎ పరీక్షకి అందరి శాంపిల్సూ తీసుకుంటాం. ఏ పిల్ల ఎవరి బిడ్డో మూణ్నాలుగు రోజుల్లో తేలిపోతుంది. మా నమ్మకం నిజమైతే - మామీద ఆరోపణ చేసినవారు భారీ మూల్యం చెల్లించాలి కాబట్టి, మరోసారి మీ దంపతులు చర్చించుకుని ఓ నిర్ణయానికి రండి’’ అంది.

‘‘ఇంతవరకూ వచ్చేక వెనక్కి తగ్గేది లేదు. రమ నర్సింగ్‌ హోం మీదేకాదు - నామీదా నిందేసింది. నా నిర్దోషిత్వాన్ని నిరూపించడానికి డిఎన్‌ఎ పరీక్ష చేసి తీరాల్సిందే! ఒకవేళ మూల్యం చెల్లించాలని తను భయపడితే - అదీ నేనే చెల్లిస్తాను. నాకు పరువు ముఖ్యం’’ అన్నాను దృఢంగా.

రమ, ఆమె భర్త దిలీప్‌ ముఖముఖాలు చూసుకున్నారు. దిలీప్‌ ఓ క్షణమాగి, ‘‘ముందోసారి మా పాపని చూడాలి’’ అన్నాడు. అతడి చేతికి పాప, నా భర్త చేతికి బాబు అందారు.

దిలీప్‌ పాపని తేరిపార చూసి, ‘‘అరే, ఇది అచ్చం మా అమ్మే! చూస్తే తనెంత సంబర పడిపోతుందో! దీనికింకా పరీక్షలెందుకు?’’ అని ఓసారి రమని చూసి, ‘‘ఆడపిల్లని కాదంటానని భయమా? అలాంటిదేం లేదు. నిజం చెప్పు. నువ్వు.....’’ అని ఏదో అనబోతూ - రమ వెక్కి వెక్కి ఏడ్వడంతో ఆగిపోయాడు.

సమస్య అలా తీరిపోయినా నేనుమాత్రం డిఎన్‌ఎ పరీక్షకి పట్టుబట్టాను.

అప్పుడు నా భర్త కలగజేసుకుని, ‘‘తనొప్పుకుందిగా, ఇప్పుడీ డిఎన్‌ఎ టెస్టు ఎవరికోసం? బ్లడ్‌ శాంపిల్‌కని, నా బిడ్డ వంటిమీద కత్తి పడ్డా, పుట్టగానే తండ్రి రక్తం కళ్లజూశాడన్న నింద నా బిడ్డకొచ్చినా నేను భరించలేను’’ అన్నాడు.

ఆశ్చర్యంగా ఏదో అనబోయి అతణ్ణి చూస్తే, తను బిడ్డని ముద్దాడుతున్నాడు. చూడ్డానికా దృశ్యం బాబు అంత మనోహరంగానూ ఉంది....

ఆ సాయంత్రం సుశీల నా దగ్గరకొచ్చి, ‘‘నీకోసం చాలా హడావుడే చెయ్యాల్సొచ్చిందమ్మా! చివరికి నీ భర్త డిఎన్‌ఎ టెస్టు వద్దనడంతో అంతా తుస్సుమంది. ఉయ్యాల్లో పిల్లాణ్ణెట్టుకుని ఊరంతా వెదికినట్లు - నీ బిడ్డ ఇంద్రకుమార్‌ బిడ్డేనని ఋజువు చెయ్యడానికి నువ్వనవసరంగా డిఎన్‌ఎ టెస్టుదాకా వెళ్లావు. అతగాణ్ణపార్థం చేసుకున్నావని నాకిప్పుడనిపిస్తోంది’’ అంది.

‘‘డిఎన్‌ఎ టెస్టు వద్దంటాడని నేనూ అనుకోలేదు కానీ - అతగాణ్ణి అపార్థం చేసుకోలేదని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను’’ అన్నాను.

ఇంద్రకుమార్‍కి జాతకాల పిచ్చి. ఆ ప్రకారం అతడికి పిల్లలు పుట్టరు. ఆమేరకి తనలో లోపముందనీ అతడి అనుమానం. వైద్యపరీక్షతో ఆ విషయం నిర్ధారించుకోవచ్చు. కానీ తన అనుమానమే నిజమని రిపోర్టొస్తే తట్టుకోలేడు. అందుకని పిల్లలుట్టకుండా జాగ్రత్తలంటూ డ్రామాలాడేవాడు. ఆ విషయం ఎప్పుడో గ్రహించినా, నేను బయటపడలేదు. ఆతర్వాత పొరపాటు జరిగిందనీ నేను గర్భవతినయ్యాననీ చెబితే, పుట్టబోయే బిడ్డకి తండ్రి తనేనా అని అతడికి అనుమానం. ఆ మాట పైకనడానికి కుహనా సంస్కారం అడ్డొచ్చింది. డిఎన్‌ఎ టెస్టుకీ అదే సంస్కారం అడ్డయింది. అనుమానంతో నాకు దూరమై, కారణంమాత్రం వేరే చెబుతూ, నన్ను మభ్యపెడుతున్నాననుకుంటూ, తనని తాను మభ్యపెట్టుకుంటున్నాడు. నా బిడ్డకి తనే తండ్రి అని ఋజువు చేసి అతడి అపోహని తొలగించడానికి - డిఎన్‌ఎ టెస్టు ఒక్కటే మార్గం. అయితే అదతడి ప్రమేయం లేకుండా, అనుకోకుండా అవసరపడినట్లుండాలి. అప్పుడే అతడి కుసంస్కారం బయటపడదు. డాక్టర్‌ సుశీలకిదంతా దాచకుండా చెప్పి సాయమడిగాను. ఆమె పరిస్థితినర్థం చేసుకుంది. నా పథకానికి సానుకూలపడాలని తన వంతు కృషిగా రమని వెదికిపట్టుకుని కథ నడిపించింది. ఇంతా జరిగి కథ క్లైమాక్సుకొచ్చేక, నా భర్త డిఎన్‌ఎ టెస్టు వద్దనేశాడు.

ఎందుకు?

ఆలోచిస్తూనే ఉన్నాను. అంతలో సుశీల అంది, ‘‘ఇప్పుడు నాకంతా అర్థమయిందమ్మా!’’ అని. ‘‘ఏమని?’’ అన్నాను ఆశ్చర్యంగానూ, కుతూహలంగానూ.

‘‘ఏముందీ - డిఎన్‌ఎ రిపోర్టు నెగిటివ్‌గా వస్తుందేమోనని భయపడ్డాడు’’ అందామె.

తల అడ్డంగా ఊపి, ‘‘భయమెందుకూ - అలా జరిగితే, విడాకులివ్వడానికి తనకి సరైన కారణం దొరికినట్లేగా!’’ అన్నాను.

సుశీలా తల అడ్డంగా ఊపి, ‘‘తనతో కాపురం చేస్తున్న భార్యకి పుట్టినవాడు తన బిడ్డ కాదని నిర్ధారించడం ఏ మగాడికీ ఇష్టముండదు. ఆ అవమానంకంటే ఆ బిడ్డని భరించడమే మేలనుకుంటాడు’’ అంది.

నేనొప్పుకోలేదు, ‘‘మీ లాజిక్‌ బాగుంది. ఐతే తనిక్కడికొచ్చినప్పుడు మీరు గమనించారో లేదో కానీ, టెస్టు గురించి మాట్లాడుతూ - నా బిడ్డ, నా బిడ్డ అని రెండుసార్లన్నాడు. అనడంలో ఆత్మీయానుబంధం ధ్వనించింది. అంటే ఆ బిడ్డ తన బిడ్డేనని అతడికి నమ్మకం కుదిరింది’’ అన్నాను.

‘‘కావచ్చు. కానీ ఉన్నట్లుండి అంత నమ్మకమెలా వచ్చింది?’’

‘‘అతడికి నేనంటే ఎంత కాంప్లెక్సుందో అంతిష్టమూ ఉంది. ఎన్నోసార్లు నా కళ్లలో నిజాయితీని చూసి తను వెనక్కి తగ్గిన సందర్భాలు చాలా ఉన్నాయి. బిడ్డ విషయంలో మాత్రం - గుడ్డిగా జాతకాన్ని నమ్మడంవల్ల పుట్టిన - అనుమాన పిశాచానికి లొంగిపోయాడు. ఇక్కడికొచ్చేక డిఎన్‌ఎ టెస్టు గురించి నేనెంత గట్టిపట్టు పట్టానో గమనించేక, అతడిలో అనుమానపిశాచం తొలగిపోయింది. నా పట్టుదలలో అతడికి డిఎన్‌ఎ పరీక్ష ఫలితంతో పాటు, నాలో తనని దక్కించుకోవాలన్న ఆరాటమూ స్పష్టమయింది’’ అన్నాను.

సుశీల నా భుజం తట్టి, ‘‘నీ పాజిటివ్‌ థింకింగ్‌ నచ్చింది. నువ్వన్నదే నిజం కావచ్చు. కానీ ఈ కాంప్లెక్సు మనిషితో ఎన్నాళ్లు వేగుతావో, ఎలా వేగుతావో’’ అని నిట్టూర్చింది.

‘‘ఎన్నాళ్లయినా వేగుతాను. ఎలాగైనా వేగుతాను. ఎందుకంటే నేనిప్పుడు బిడ్డతల్లిని. నా బిడ్డకి తండ్రి లేకుండా ఎలా అని వ్యథ చెందాను కానీ ఇప్పుడు నా బిడ్డకి తండ్రి దొరికాడు. అతణ్ణి నేనొదులుకోలేను’’ అన్నాను అసలు సిసలు ఆడదానిలా..

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.



వసుంధర పరిచయం మేము- డాక్టర్‌ జొన్నలగడ్డ రాజగోపాలరావు (సైంటిస్టు), రామలక్ష్మి గృహిణి. రచనావ్యాసంగంలో సంయుక్తంగా ‘వసుంధర’ కలంపేరుతో తెలుగునాట సుపరిచితులం. వివిధ సాంఘిక పత్రికల్లో, చందమామ వంటి పిల్లల పత్రికల్లో, ‘అపరాధ పరిశోధన’ వంటి కైమ్ పత్రికల్లో, ఆకాశవాణి, టివి, సావనీర్లు వగైరాలలో - వేలాది కథలు, వందలాది నవలికలూ, నవలలు, అనేక వ్యాసాలు, కవితలు, నాటికలు, వినూత్నశీర్షికలు మావి వచ్చాయి. అన్ని ప్రక్రియల్లోనూ ప్రతిష్ఠాత్మకమైన బహుమతులు మాకు అదనపు ప్రోత్సాహాన్నిచ్చాయి. కొత్త రచయితలకు ఊపిరిపోస్తూ, సాహిత్యాభిమానులకు ప్రయోజనకరంగా ఉండేలా సాహితీవైద్యం అనే కొత్త తరహా శీర్షికను రచన మాసపత్రికలో నిర్వహించాం. ఆ శీర్షికకు అనుబంధంగా –వందలాది రచయితల కథలు, కథాసంపుటాల్ని పరిచయం చేశాం. మా రచనలు కొన్ని సినిమాలుగా రాణించాయి. తెలుగు కథకులందర్నీ అభిమానించే మా రచనని ఆదరించి, మమ్మల్ని పాఠకులకు పరిచయం చేసి ప్రోత్సహిస్తున్న మనతెలుగుకథలు.కామ్ కి ధన్యవాదాలు. పాఠకులకు మా శుభాకాంక్షలు.



108 views1 comment
bottom of page