top of page

ఎదవ బతుకు

గమనిక : ఈ కథ మనతెలుగుకథలు.కామ్ వారు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన సంక్రాంతి 2021 కథల పోటీలో తృతీయ బహుమతి రూ : 2,000 /- గెలుచుకుంది. ఎంపికలో పాఠకుల అభిప్రాయం కూడా పరిగణనలోకి తీసుకున్నాం.

'Edava Batuku' written by Vasundhara

రచన : వసుంధర


రాత్రి ఎనిమిది. నేను, నా మొగుడు వీరేశు, కూతురు లాస్య టివిలో కాంతి ఛానెల్ చూస్తున్నాం. మామూలుగా ఐతే - ఆ సమయంలో వేరే ప్రోగ్రామ్సు చూస్తాం. కానీ సునందమ్మ చెప్పిందని తప్పలేదు. ‘ఉత్తినే చూస్తే కుదరదు. చూసి నా కేమర్థమైందో, ఏమర్థం కాలేదో వివరంగా చెప్పాలి. చెబితేనే - నేనడిగిన అప్పు ఇస్తా’నని ఫిటింగ్ పెట్టిందా అమ్మ. తప్పుతుందా – డబ్బవసరం నాది! ప్రోగ్రాం సునందమ్మ మొగుడు చలం చేసేట్ట. ఎక్కువమంది చూస్తే రేటింగులొస్తాయని అలా చెప్పిందని వీరేశు అంటాడు. కానీ వాడూ చూడ్డానికొప్పుకున్నాడు. ఎందుకంటే ఆ ప్రోగ్రాం సమీరమ్మ, సూరిబాబుల గురించి. ఒకప్పుడు వాళ్లవీ మావిలా ఎదవ బతుకులే. సమీరమ్మ కూడా నాకులాగే నాలుగిళ్లలో పాచిపనులు చేసి, అంట్లు తోమి, బట్టలుతికేది. సూరిబాబు కూడా వీరేశు లాగే రోడ్డుపక్క మిర్చిబజ్జీలు వేసి అమ్మేవాడు.

మేమింకా అలాగే ఉన్నాం కానీ వాళ్లు కోటీశ్వరులు. ఏంచేస్తే మేమూ వాళ్లకిలా ఎదగొచ్చో తెలుస్తుందని సునందమ్మ చెప్పింది. ఎదగాలని కాక, ఆమె చెప్పిందనే చూస్తున్నామిప్పుడు. ప్రోగ్రాం మొదలయింది. ముందు సునందమ్మ మొగుడు చలం బాబొచ్చాడు. ఎదగాలన్న పట్టుదలుంటే - ఏ పని చేసినా ఎదగొచ్చని ఓ మాట చెప్పి, “ఇది వట్టి మాట కాదని తెలుసుకుందుకు ఈ రోజు ఇద్దరు గొప్ప మనుషుల్ని పరిచయం చేస్తున్నాను. వాళ్లకి ప్రచారం కిట్టదు. గుర్తింపు గురించిన తాపత్రయం లేదు. రమ్మన్నా మన స్టుడియోకి రారు కాబట్టి మేమే వాళ్ల దగ్గరకు వెళ్లాం. ముందుగా శ్రీమతి సమీర....” అన్నాడు.

అప్పుడో డాబా ఇల్లు కనబడింది. లోపల రెండు పడకగదులు, ఓ హాలు, వంటిల్లు ఉన్నాయి. పెద్ద పెరడుంది. ఆ పెరట్లో రకరకాల మొక్కలు, చెట్లు ఉన్నాయి. ఓ చెట్టు దగ్గర ఒకామె అటు తిరిగి నిలబడుంది. కొమ్మలు కత్తిరిస్తున్నటుంది, చేతిలో కత్తెరుంది. “అక్కడ తోటపని చేస్తున్న ఆమే సమీర. ఆమె గురించి ఆమె మాటల్లోనే వినండి” అన్నాడు చలం బాబు. అప్పుడామె ఇటు తిరిగింది. కనకాంబరం రంగు చీర కట్టింది. అదే రంగు రవిక తొడిగింది. నుదుట ఎర్రటి బొట్టు. చెవులకి దుద్దులున్నాయి. చేతులకి గాజు గాజులున్నాయి. మెడలో ఒంటిపేట గొలుసుంది. గొప్పామెలా అనిపించదు కానీ ఒకప్పుడు పనిమనిషంటే కూడా నమ్మలేం! చూడగానే దణ్ణం పెట్టాలనిపించింది. ఆ అమ్మ చిన్నగా నవ్వింది. ఆ నవ్వు ఎంతో బాగుంది.

“నేను సమీర. చిన్నప్పుడే అమ్మా నాన్నా పోయారు. చదువు లేదు. కొన్నేళ్లు చుట్టాలిళ్లలో ఉన్నాను. వాళ్లు నాచేత వెట్టిచాకిరీ చేయించుకుని తిండి కూడా సరిగ్గా పెట్టేవారు కాదు. తిట్టేవారు, కొట్టేవారు. స్వతంత్రంగా బ్రతకాలనుకుని బయటికొచ్చేశాను. అడుక్కోవే, డబ్బులొస్తాయని కొందరు సలహాలిచ్చారు. చావనైనా చస్తాను కానీ అడుక్కోడం మాత్రం నావల్లకాదని చెప్పేశాను. అప్పటికి నాకు చేతనైనది అంట్లు తోమడం, బట్టలుతకడం లాంటి పనులే. ఓ ఇంట్లో పనికి కుదిరాను. శ్రద్ధగానూ, బాగానూ చేస్తున్నానని పేరొచ్చి మరో నాలుగిళ్లు దొరికాయి. అందులో ఓ ఇంటివాళ్లు వాళ్ల ఔట్హౌసులో ఫ్రీగా ఉండడానికి ఇల్లిచ్చారు. తిండి యజమానుల ఇళ్లలోనే ఐపోయేది. వాళ్లిచ్చిన పాతబట్టలు కట్టుకునే దాన్ని. జీతం డబ్బు మిగిలిపోయేది. దాంతో నాకు లేనివన్నీ సమకూర్చుకోవాలనుకున్నాను. కష్టపడి చదివి మెట్రిక్ ప్యాసయ్యాను. నాబోటి పనివాళ్లకి తక్కువ వడ్డీలకి అప్పులిచ్చి ఆదుకునేదాన్ని. అలా నాదగ్గర అప్పు తీసుకున్న సూరిబాబు మిర్చి బజ్జీ వ్యాపారం మొదలెట్టి జీవితంలో పైకొచ్చాడు. మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. క్రమంగా నేను మైక్రో ఫైనాన్సియర్ని అయ్యాను. అతను ‘సమీరా ఫుడ్స్’ సంస్థను స్థాపించి విస్తరింపజేశాడు” అంది సమీర.

“మీ జీవితకథ అసామాన్యం. దాన్ని మీరు పుస్తకంగా వ్రాయాలి. అది ఈ దేశంలో పేద శ్రామికులకి గొప్ప ప్రేరణ కాగలదు” అన్నాడు చలం బాబు.

సమీర తల అడ్డంగా ఊపి, “ఎవరూ ఎవరికీ ప్రేరణ కాలేరు. ఎవరికి వారే ప్రేరణ కావాలి. ఇది తెలుసుకుంటే - జీవితంలో ప్రతిఒక్కరూ గొప్ప గొప్ప లక్ష్యాల్ని సాధించగలరు” అందామె. “మాటలు చెప్పడం సులభం. చేతల్లో అదెలాగో కాస్త వివరించి చెప్పగలరా?” అన్నాడు చలం బాబు.

“ఆ విషయం నాకంటే బాగా మా ఆయన సూరిబాబు చెబుతాడు” అంది సమీర.

“ఒక చిన్న బ్రేక్ తర్వాత మనం శ్రీ సూరిబాబుని కలుసుకుంటాం” అన్నాడు చలం బాబు. ప్రకటనలు మొదలయ్యాయి. “చూడ్డానికి చాలా బాగుందే! కానీ మన బతుకులెప్పటికైనా వీళ్లకిలా ఔతాయంటావా?” అన్నాడు వీరేశు. నేను బదులివ్వలేదు. ఉదయం జరిగిందంతా గుర్తు చేసుకుంటున్నాను.....

- - - - -

వళ్లు నొప్పులుగా ఉంది. పనికి వెళ్లాలని లేదు. సునందమ్మకి ఫోన్ చేద్దామనుకుంటుండగా - “అమ్మా! బెంగళూరు టూరెళ్లాలి. రేపటికల్లా వెయ్యి రూపాయలు కట్టాలి” అంది నా కూతురు లాస్య. ఇంటరు చదువుతోంది. బాగా చదువుతోంది. ఇంజనీరింగ్ చదవడానికి ఫ్రీ సీటు వస్తుందంటున్నారు.

నేను జవాబిచ్చేలోగా, “ఏం చదువులో, రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించేదంతా వీటికే ఐపోతోంది. మొన్నే ఐదొందలు కట్టాం. మళ్లీ వెయ్యంటే ఎక్కణ్ణించి తెచ్చి చచ్చేది? మానేసేయ్” అన్నాడు నా మొగుడు వీరేశు. ఆయ్యనుంచి ఈ మాటలు లాస్యకి కొత్త కాదు. అది వాడి మాటలు పట్టించుకోకుండా జవాబుకోసం నాకేసి చూసింది.

“మానేయాల్సింది దాని చదువు కాదు. నీ తాగుడు. నువ్వు మందు మానేస్తే, పిల్లదాన్ని బస్సులో కాదు - స్వంత కార్లో రోజూ బడికి పంపేవాళ్లం” అన్నాను.

“ఆఁ మన ఎదవ బతుకులకి కారొక్కటే తక్కువ” గొణిగాడు వీరేశు చిరాగ్గా. వీరేశు ఉదయం ఎనిమిది నుంచి పన్నెండు దాకా ఓ టిఫిన్ సెంటర్లో పని చేస్తాడు. అవసరాన్నిబట్టి అక్కడ ఇడ్లీపిండి రుబ్బాలి, బజ్జీలకి పిండి కలపాలి, కస్టమర్సుకి టిఫిన్ సరఫరా చెయ్యాలి, పొట్లాలు కట్టివ్వాలి. అప్పుడప్పుడు ప్లేట్లు కూడా కడగాలి. ఆ అనుభవాన్ని ఉపయోగించి సాయంత్రం జంక్షన్లో బండి పెట్టి నడుపుతున్నాడు. వేడివేడిగా మిర్చిబజ్జీ, వడ, మైసూర్ బజ్జీ వేసి అమ్ముతాడు. మామూలుగా ఐతే సాయంత్రం ఐదు నుంచి తొమ్మిది దాకా ఉంటాడు. గిరాకీ ఎక్కువైతే ఒకోసారి పదింటిదాకా ఉంటాడు. తర్వాత చుక్కేసుకుందుకెడతాడు. మిగిలిన డబ్బుతో ఇంటికొస్తాడు. అదీ వాడి ‘ఎదవ’ బతుకు.

“రేపటికన్నావుగా, ఎలాగో తెచ్చిస్తాలే” అన్నాను లాస్యతో. ఎలాగో అంటే సునందమ్మనే అడగాలి. పిల్ల చదువుకంటే తడుముకోకుండా డబ్బిచ్చేది ఆ అమ్మొక్కత్తే! డబ్బవసరపడ్డప్పుడు సెలవెడతానని ఫోనెలా చేస్తాను - ఇక వళ్లు నొప్పుల విషయం మర్చిపోవాలి. ఏదో కోప్పడ్డాను కానీ - మావి ఎదవ బతుకలని వీరేశు ఊరికే అనలేదు. నాలుగిళ్లలో పాచిపని చేస్తున్నాను. అంటగిన్నెలు తోముతున్నాను. కుళ్లు బట్టలుతుకుతున్నాను. ఎదవ బతుక్కాక మరేంటి? మెడకో సంచీ తగిలించుకున్నాను. అందులో మూడు ప్లాస్టిక్ డబ్బాలు పెట్టుకున్నాను. అవి నా యజమాన్లవి. వాళ్లు తిండానికి ఆర్డరిచ్చినప్పుడు - పెద్ద హొటలువాళ్లు - ఇలాంటి డబ్బాల్లో పెట్టి పంపుతారు. నా యజమాన్లు వాటిని నాచేత కడిగించి దాచి, నాకు ఏదైనా ఇవ్వడానికి వాడతారు. ఎప్పుడైనా డబ్బా నా దగ్గరుండిపోతే విసుక్కుని - ఇచ్చేది ఇవ్వడం మానేస్తారు. ఒక విధంగా బిచ్చగాడి బొచ్చెలాంటివీ డబ్బాలు. ఎదవ బతుకు....

సునందమ్మ ఇంటికెళ్లేసరికి పావుగంట లేటయింది. ఆ యమ్మ కోప్పడింది. అర్థం చేసుకోగలను. వాళ్లు ఇద్దరు. వాళ్లకిద్దరు. వాళ్లిద్దరికీ ఆఫీసు. పిల్లలిద్దరికీ బడి. తొమ్మిదయ్యేసరికి ఇంట్లో ఒక్కరుండరు. ఆ సరికి టిఫిన్లవ్వాలి. పిల్లల్ని తెమిల్చి బాక్సులు కట్టివ్వాలి. వాళ్లకి బాక్సులు కట్టుకోవాలి. ఆ బాక్సులు నింపడానికి వంట చెయ్యాలి. ఇవన్నీ జరగడానికి ఆ మొగుడూ పెళ్లాలకి నా సాయం కూడా అవసరం. నాకూ కూతురుంది. అదీ చదువుకుంటోంది. పొద్దుటే ఇంట్లో ఎంత హడావుడుంటుందో నాకూ తెలుసు. ‘వళ్లు నొప్పులమ్మా - లేచేసరికి ఆలస్యమైపోయింది’ అని సంజాయిషీ ఇచ్చాను. ఆ అమ్మ వినూరుకుంది. వళ్లు నొప్పుల గురించి ఒక్క మాటడగలేదు. పనోళ్లం కదా - మాకు రోగాలొచ్చాయన్నా కుంటి సాకనుకుంటారే తప్ప ఎవరూ నమ్మరు. ఎదవ బతుకు... పనులు చేస్తూ, మధ్యలో అమ్మకీ చెయ్యందిస్తూ - వీలు చూసుకుని, వెయ్యి రూపాయలు కావాలని చెప్పేశాను. అంతా మామూలే! ముందు సునందమ్మ తిట్టింది - చీటికీ మాటికీ డబ్బెక్కణ్ణించి తెస్తామని.

తర్వాత కారణమడిగి - “టూరుకి బెంగళూరెళ్లాలా? ఇప్పుడు విడియోలూ స్కైపులూ వచ్చేసాయి. ఇక్కడే క్లాసులో అన్నీ చూపించొచ్చుగా! డబ్బు దండుకుందుకు ఇదో మార్గం” అని కాలేజిమీద విసుక్కుంది. అమ్మ విసుక్కునే పద్ధతిని బట్టి నాకు తెలిసిపోయింది - బహుశా డబ్బిస్తుందని. అందుకని తెచ్చిపెట్టుకున్న నవ్వుతో చెప్పేవన్నీ విన్నాను. సునందమ్మలో నాకు నచ్చిందదే. 'అంత డబ్బు ఖర్చుపెట్టి పిల్లని అలాంటి కాలేజిలో చదివించడమెందుకూ' - అని మాటవరసక్కూడా అనదు. పైగా చదివిస్తున్నామని మెచ్చుకుంటుంది.

“నేను డబ్బిచ్చాననుకో. బాకీ ఎలా తీరుస్తావ్?” అంది సునందమ్మ.

“ఎలా తీరుస్తానో చెప్పడానికి మావేమన్నా గవర్నమెంటు ఉద్యోగాలా అమ్మా! కానీ ఎలాగో అలా తీరుస్తాను. ఆ విషయం నీకూ తెలుసు” అన్నాను.

“ఆఁ తీరుస్తావ్! పాత బాకీ ఇంకా ఐదొందలుంది. జీతంలో తగ్గించుకుంటానంటే ఘొల్లుమంటావ్” అని ఓ క్షణమాగి, “బాకీ తీరడానికి నీకో ఉపాయం చెబుతాను. పాటిస్తావా?” అంది. ఆ ఉపాయం నాకు తెలియంది కనుకనా! వాళ్లింట్లో కంప్యూటరుకీ, టివికీ బల్లలున్నాయి. ఫ్రిజ్జుంది. వాష్ మెషినుంది. ఫాన్లున్నాయి. గోడలున్నాయి. వాటినలా వదిలేస్తే వారం రోజుల్లో వాటిమీద దుమ్ము పేరుకుంటుంది. ఎంతంటే - ముట్టుకుంటే వేలిముద్రలు పడేలా! వాటిని నెలకో రెండుమూడుసార్లు శుభ్రం చెయ్యాల్సుంటుంది. గుడ్డతో తుడవాలంటే - మీటలమీద వేలు పడకుండా చూసుకోవాలి. వాక్యూం క్లీనరుతో చెయ్యాలంటే, కొంచె సున్నితంగా ఉండాలి. నాకు సున్నితం తక్కువనడానికి ఆ అమ్మ కారణాలు ఆ అమ్మకున్నాయి. అవుండడం వల్ల ఆ పన్లు తప్పేయని నాకు సంతోషమే!

ఆ పనులకని సునందమ్మ వేరే మనిషిని పెట్టుకుందామనుకుంది. నాకైతే ఆ పనికి - తనింక కట్టడం మానేసిన పాత చీరో, వాడ్డానికి విసుగనిపించిన పాత గిన్నో ఇస్తే చాలు. కానీ ఓ మనిషి ఆ పనికి రోజుకి రెండొందలడిగింది. సునందమ్మ యాబైకి పైసా ఎక్కువివ్వనంది. ఆ మనిషి వెళ్లిపోయినా, చివరికో మనిషొచ్చి ఆ రేటుకి పని చేస్తానంది. సునందమ్మ సంబరపడింది కానీ అది కాసేపే! ఆ మనిషి ఓ రోజొచ్చి గంట సేపు ఇల్లంతా కలయదిరిగి చూసొచ్చి, యాబై రూపాయలిమ్మని కూర్చుంది.

సునందమ్మ వెళ్లి చూసి, “ఎక్కడి దుమ్మక్కడే ఉంది. నువ్వు చూడ్డానికొచ్చేవా, పని చెయ్యడానికొచ్చేవా?” అంది.

“అదేంటమ్మా, గంటసేఫు వళ్లొంచి పని చేస్తే అలాగంటావ్! అనుమానముంటే నువ్వు పక్కనుండి చూడాల్సింది” అందా మనిషి.

“ఏం పని చేశావ్! ఎక్కడా దుమ్ము మిల్లీగ్రాము కూడా తగ్గలేదు” ఆంది సునందమ్మ. “మీ ఇంట్లో కాస్తా కూస్తా దుమ్మటమ్మా! నువ్విచ్చే యాబైకి దుమ్ము అంతకంటే తగ్గదు” అందా మనిషి. సునందమ్మ ఆ మనిషిని పది రూపాయలిచ్చి వదుల్చుకుంది. ఆ తర్వాత టివిలో ఓ హెచ్చరిక వచ్చింది - తక్కువ జీతానికి పని చేస్తామంటూ ఇళ్లలోకొచ్చి, ఆనుపానులు తెలుసుకునే ఓ ముఠా ఊళ్లొకొచ్చిందని. అప్పట్నించీ సునందమ్మ ఇంట్లో దుమ్ముతో సద్దుకుపోతోంది తప్ప ఎవర్నీ ఆ పనికి పిలవలేదు. నాకు తెలుసు. ఆ అమ్మ కన్ను మా లాస్య మీదుందని.

“తెలిసినవాళ్లకి ఎంతిచ్చినా బాధుండదు. సెలవు రోజుల్లో అప్పుడప్పుడైనా మీ లాస్యని మా ఇంటికి పంపొచ్చుగా. నీకూ వేణ్ణీళ్లకి చన్నీళ్లుగా సాయముంటుంది” అనేసిందా అమ్మ ఓ రోజున. నా కూతుర్ని ఇలాంటి పనికి అడిగినందుకు చాలా కోపమొచ్చింది. పేదవాళ్ల కోపం పెదవికి చేటు కదా, అందుకని ఎలాగో అణచుకుని, “చదువుకునే పిల్ల, ఇలాంటి పనులెలా చెయ్యమంటానమ్మా” అన్నాను.

దానికా అమ్మ, “పనులు ఇలాంటివీ అలాంటివీ అని వేరే ఉండవు. విదేశాల్లో ఐతే పిల్లల్ని తలిదండ్రులు చదివించరు. వాళ్లు హొటల్లో కప్పులు కడిగో, షాపుల్లో టాయిలెట్లు క్లీన్ చేసో, పెట్రోలు బంకుల్లో పని చేసో - నాలుగు డబ్బులు సంపాదించుకుని దాంతో చదువుకుంటారు. అలాగని చదువులో ఎవరికీ తీసిపోరు. మనం చూసే సినిమాలూ, టివిలూ, వాడే మొబైల్సూ - ఒకటేమిటి - నిత్యావసర సదుపాయాలన్నీ వాళ్లు కనిపెట్టినవే” అంది.

నాకుక్రోషమొచ్చి, “ఈ మాట మన పాపా, బాబూకి చెప్పావామ్మా?” అన్నాను.

సునందమ్మ తడుముకోలేదు, “మా సంగతి నీకెందుకు? మాకు పని అవసరం. నీకు డబ్బవసరం. మా పన్లు మేం చేసుకుంటే - మీలాంటోళ్లకి డబ్బెలాగొస్తుంది?” అంది.

అది నిజమే! నన్నెవరూ పనిలో పెట్టుకోకపోతే - నేనెలా బతుకుతాను? అప్పటికి ఊరుకున్నాను కానీ మా లాస్య చేత పని చేయించుకోవాలని ఆ అమ్మకి మహా ఇదిగా ఉంది. అందులో దురుద్దేశ్యమేం లేదని నాకు తెలుసు. ఎందుకంటే సునందమ్మ నన్ను పనిమనిషిలా చూడదు. సాటిమనిషిలా గౌరవిస్తుంది. పొరపాటున కూడా ఏమేవ్, ఒసేయ్ అనదు. నా పేరు రేణుకైతే, నన్ను రేణూ అని ముద్దుగా పిలుస్తుంది. ఆ చనువుతోనే ఆ అమ్మని ఒకోసారి ఎంత మాటైనా అనగలను నేను. లాస్య వాళ్లకి తెలిసిన మనిషి. ఎవరికో ఇచ్చే డబ్బు దానికే ఇవ్వాలని ఆ అమ్మ ఆలోచన. ఒకటి రెండుసార్లు మళ్లీ నా దగ్గర లాస్య ప్రసక్తి తెచ్చింది. కానీ నేను మాటలు పెంచలేదు. ఈరోజు ఆ అమ్మ చెప్పే ఉపాయం ఇదేనని నాకు తెలుసు.

అందుకని, “ఏ జన్మలోనో మహాపాపం చేసుకుని, ఈ జన్మలో ఇలాంటి ఎదవ బతుకొచ్చింది మాకు. నా కూతురికి ఇలాంటి కర్మ పట్టకూడదనే దాన్ని చిన్నప్పట్నించీ మహారాణిలా పెంచాను. కానీ డబ్బవసరం అడుగడుగునా అడ్డు పడుతూనే ఉంది. ఇన్నాళ్లూ ఎలాగో నెట్టుకొచ్చాను. ముందు కూడా అలాగే సాగిపోయే మంచి ఉపాయమేదైనా చెప్పమ్మా!” అంటూ ముందరి కాళ్లకి బంధమేశాను.

ఏమనుకుందో ఆ అమ్మ లాస్య ఊసెత్తలేదు. “మాటిమాటికీ నీది ఎదవ బతుకని ఎందుకనుకుంటావ్ రేణూ! విదేశాల్లో వాళ్లు ఏ పనీ తక్కువనుకోరని చెప్పానుగా” అంది.

“అక్కడ ఆ పనులకి గౌరవముండొచ్చు. కానీ ఎక్కడో నీబోటిగాళ్లు తప్ప - ఇక్కడ మమ్మల్ని అంతా తక్కువగా చూస్తారమ్మా! అదీ నా బాధ!” అన్నాను.

“అది నీ భ్రమ! నీకు సమీర తెలుసా - ఆరుతో చదువాపేసి పొట్టకూటికి పనిమనిషి అయింది. ఇప్పుడు తను పేరున్న మైక్రో ఫైనాన్సియర్. అంటే - చిన్న చిన్న మొత్తాలు అప్పులిస్తుందన్న మాట! అలాగే వాళ్లాయన సూరిబాబు మీ ఆయనలాగే మిర్చిబజ్జీలు అమ్ముకుంటూ - ఇప్పుడు ‘సమీరా ఫుడ్స్’ అనే సంస్థ స్థాపించాడు. వాళ్లిద్దరూ కూడా ఇప్పుడు కోటీశ్వరులు” అంది సునందమ్మ.

“చాలామంది పెద్దోళ్ల గురించి ఇలాంటి కథలు చాలా విన్నానమ్మా! అలాంటివాళ్లని వేళ్లమీద లెక్కెట్టొచ్చు. మాలాంటోళ్లు ఎన్నేళ్లు గడిచినా ఇలాంటి పన్లు చేసి ఎదవ బతుకునుంచి బయటపడలేరు” అన్నాను.

“అలా నిరాశ పడకు. ఒక్కసారి వాళ్లెలా పైకొచ్చారో తెలుసుకునే ప్రయత్నం చెయ్యి. ఈ రాత్రి ఎనిమిదికి కాంతి టివిలో వాళ్లిద్దర్నీ పరిచయం చేసే ప్రోగ్రామొకటుంది. అది మా ఆయన చేసిందేలే. చూసి నీకేమనిపించిందో రేపు చెప్పు. చూడాలిసుమా! చూస్తేనే రేపు నీకు డబ్బు అప్పిచ్చేది” అంది సునందమ్మ.

చలంబాబుకి టివి ఛానెల్లో ఉద్యోగమని నాకు తెలుసు. ఆ అమ్మ రేపనగానే కంగారు పడి, “నాకు డబ్బు ఇప్పుడే కావాలమ్మా! కాలేజిలో కట్టడానికి రేపే ఆఖరు రోజు” అన్నాను.

“కంగారు పడకు. రేపు పనిలోకొస్తూ లాస్యని కూడా తీసుకురా. ఇక్కడే టిఫిన్ చేస్తుంది. దాన్ని కాలేజిలో మేం దిగబెడతాంలే” అంది సునందమ్మ. ఆ అమ్మ మాట తప్పదని నాకు తెలుసు. కాబట్టి నేనూ మాట తప్పకూడదు. అందుకే ఆ రాత్రి ఎనిమిదికి ఇంటిల్లపాదీ టివి ముందు కూర్చున్నాం....

- - - - -

కాంతి ఛానెల్లో ప్రకటనలు ఐపోయాయి. సిటీలో ఓ జంక్షన్. అక్కడో మిర్చిబజ్జీ బండి. జనం బాగా ఉన్నారు. ఓ కుర్రాడు కస్టమర్సుకి చకచకా ప్లేట్లు అందిస్తున్నాడు. ఓ కుర్రాడు జనాలకి బజ్జీలు పొట్లాలు కట్టి ఇస్తున్నాడు. ఆ బండికి పక్కగా ఓ బల్ల. బల్లమీద గ్యాస్ స్టవ్. దానిమీద పెద్ద మూకుడు. బల్లమీదే ఓ పక్క సెనగపిండి, కోసి మసాలా పెట్టిన పచ్చిమిర్చితో ఓపెద్ద గిన్నె. ఒకాయన మిర్చిని పిండిలో ముంచి మూకుట్లో వేస్తున్నాడు.

“ఆయనే మన సూరిబాబు. బజ్జీలు వేస్తూ బిజీగా ఉన్నాడు కదా - ఒక్క నిముషమాగి ఆయన్ని పలకరిద్దాం” అన్నాడు చలం బాబు. తర్వాత గుడ్డతో చేతులు తుడుచుకుంటున్న సూరిబాబు తెరమీద కనిపించాడు. పొట్టి లాగుమీద చేతుల బనియన్ వేసుకున్నాడు. జుట్టు చెదిరి ఉంది. ముఖంలో చిరుచెమటలు.

“నా పేరు సూరిబాబు. చిన్న హొటళ్లలో క్లీనరుగా జీవితం మొదలెట్టి సర్వరుగా ఎదిగాను. నాకు వంటలంటే చాలా ఆసక్తి. హొటళ్లలో పని చేస్తూ - వంటలకు సంబంధించి ఎన్నో సులువులు, చిట్కాలు తెలుసుకున్నాను. సమీరతో పరిచయమయ్యేక స్వంతంగా మిర్చిబజ్జీ బండి పెట్టాను. సంపాదించే డబ్బునెలా జాగ్రత్త చేసుకోవాలో సమీర దగ్గరే నేర్చుకున్నాను. అలా సమీరా ఫుడ్స్ స్థాపించి ధనవంతుణ్ణయ్యాను” అన్నాడు సూరిబాబు.

చలంబాబు వెంటనే, “మీరిప్పుడు కోటీశ్వరులు కదా! ఇంకా ఇలా బండి దగ్గర ఎందుకు పని చేస్తున్నారు?” అన్నాడు.

“నాకిది ఇష్టమైన పని! నేను వేసిన బజ్జీలు బాగున్నాయని మెచ్చి జనం ఎగబడి కొనుక్కు తింటుంటే అదో కిక్కు నాకు. అందుకని వారానికో రోజు ఇందుకు కేటాయించాను. జనాలు నన్ను పసి కట్టకుండా - వారం వారం చోటు మార్చేస్తుంటాను” అన్నాడు సూరిబాబు.

“ఒకప్పుడైతే బ్రతుకుతెరువుకోసం ఈ పని చేశారు. ఇప్పుడు సమాజంలో మీకు హోదా ఉంది. మరి ఇలా రోడ్డు పక్కన నిలబడి బజ్జీలు వెయ్యడం చిన్నతనంగా అనిపించదా?” అన్నాడు చలంబాబు.

“బజ్జీలు వెయ్యడం చిన్నతనం ఎందుకనిపించాలి?” ఎదురడిగాడు సూరిబాబు.

“మీ హోదాలో మిమ్మల్ని అంతా గౌరవిస్తారు. కానీ ఇప్పుడీ వేషంలో మీకు గౌరవం లభించదు. అంతా చిన్నచూపు చూస్తారు. అది చిన్నతనం కాదా?” అన్నాడు చలంబాబు.

“మీరన్నది కొంతవరకూ నిజం. కూలిపని చేసేవాళ్లు, అంట్లు తోమేవాళ్లు, రోడ్డుపక్కన ఫలహారాలు అమ్మేవాళ్లు - ఇలాంటివాళ్లు తమవి ఎదవబతుకులని వాపోవడం నాకు తెలుసు. మనకి తిండి పెట్టే పనిని ముందు మనం గౌరవించాలి. మనం గౌరవిస్తేనే మిగతావాళ్లూ గౌరవిస్తారు. నా భార్య పనిమనిషిగానూ, నేను మిర్చిబండీ సూరిబాబుగానూ ఉన్నప్పుడే - జనాలు మమ్మల్ని చిన్నచూపు చూడకుండా గౌరవించారని గర్వంగా చెప్పగలను” అన్నాడు సూరిబాబు. - - - - -

మర్నాడు లాస్యని తీసుకుని సునందమ్మ ఇంటికెళ్లాను. “ఏం రేణూ - నిన్న ప్రోగ్రాం చూశావా, నీకేమనిపించింది” అంది సునందమ్మ. నేనేదో అనేలోగా లాస్య, “మీకు వీలవుతుందంటే, వచ్చేవారం మీ ఇంట్లో డస్టింగ్ చేస్తానమ్మా!” అంది.

---0---




వసుంధర పరిచయం

మేము- డాక్టర్‌ జొన్నలగడ్డ రాజగోపాలరావు (సైంటిస్టు), రామలక్ష్మి గృహిణి. రచనావ్యాసంగంలో సంయుక్తంగా ‘వసుంధర’ కలంపేరుతో తెలుగునాట సుపరిచితులం. వివిధ సాంఘిక పత్రికల్లో, చందమామ వంటి పిల్లల పత్రికల్లో, ‘అపరాధ పరిశోధన’ వంటి కైమ్ పత్రికల్లో, ఆకాశవాణి, టివి, సావనీర్లు వగైరాలలో - వేలాది కథలు, వందలాది నవలికలూ, నవలలు, అనేక వ్యాసాలు, కవితలు, నాటికలు, వినూత్నశీర్షికలు మావి వచ్చాయి. అన్ని ప్రక్రియల్లోనూ ప్రతిష్ఠాత్మకమైన బహుమతులు మాకు అదనపు ప్రోత్సాహాన్నిచ్చాయి. కొత్త రచయితలకు ఊపిరిపోస్తూ, సాహిత్యాభిమానులకు ప్రయోజనకరంగా ఉండేలా సాహితీవైద్యం అనే కొత్త తరహా శీర్షికను రచన మాసపత్రికలో నిర్వహించాం. ఆ శీర్షికకు అనుబంధంగా –వందలాది రచయితల కథలు, కథాసంపుటాల్ని పరిచయం చేశాం. మా రచనలు కొన్ని సినిమాలుగా రాణించాయి. తెలుగు కథకులందర్నీ అభిమానించే మా రచనని ఆదరించి, మమ్మల్ని పాఠకులకు పరిచయం చేసి ప్రోత్సహిస్తున్న మనతెలుగుకథలు.కామ్ కి ధన్యవాదాలు. పాఠకులకు మా శుభాకాంక్షలు.

316 views1 comment
bottom of page