top of page

నామకరణం

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి




'Namakaranam' Written By Bharathi Bhagavathula

రచన : భాగవతుల భారతి

"పీతిగారూ! మీకు కొడుకు పుట్టాట్ట. అంటే వంశపారంపర్యా మీ నాన్నగారి పేరే మీ అబ్బాయికి పెడతారా? బాలసారె ఎప్పుడనుకుంటున్నారూ?"

దానయ్యగారు క్వశ్చన్ మార్క్ ఫేసేసుకుని అడిగిన ప్రశ్నకు ఉలిక్కిపడి "బామ్మా! ఓసీ ! చచ్చి బతికిపోయావే! లేకపోతే ఇప్పుడైనా నాచేతిలో చచ్చుండే దానివే. పెద్దదానివై కూడా బ్రతికి పోయావే, లేకపోతే బండబూతులు తిట్టేవాణ్ణే "

‘.... అవునూ.. బామ్మంటే పెద్దదే ఉంటుంది గానీ, నా కంటే చిన్నగా ఉంటుందా ~ మతికూడా పోతోందా నాకూ !’ మళ్ళీ ఇందులో స్వగతాలూ ...

"బామ్మా! " … పిడికిలి బిగించి మోరపైకెత్తి కసిగా మరోసారి అరిచి ఆక్రోశంలో ఆయాసం వచ్చి, రొప్పుకుంటూ అరుగుమీద కూలబడ్డాడు పీతాంబరధరరావు.

అతని ఆక్రోశానికీ అర్ధం ఉంది. తనకు బామ్మ ఆపేరు పెట్టటమే దీనికంతటికీ కారణం.

పిల్లాడు పుట్టగానే " ఓరే కూర్మం! నీకు మెుగపిల్లడురా! వంశోద్దారకుడురా! ఏమైనా సరే నీ కొడుక్కి మీనాన్న పేరు పెట్టాల్సిందే . పీతాంబరధర రావు అని ఎంతచక్కటి పేరూ! తాతపేరు మనవడికి మంచిదిరా "అంది కూర్మాంగదరావు తల్లి, పీతాంబరధర రావు బామ్మ.

"అదేం పేరే అమ్మా! ఈ రోజుల్లో బాగుండదే! " నసిగాడు కూర్మాంగదరావ్

తల్లి ఏడుస్తూ ముక్కుచీదేసి "అంతేలేరా! నువ్వు ఇంతున్నప్పుడు మీనాన్న పోయాడు. అప్పట్నించీ, నిన్ను గుండెల్లో,కళ్ళల్లో పెట్టుకుని పెంచారా " (అందరూ ఎందులో పెట్టుకుని పెంచుతారో.. అఘాయిత్యపు మాటలు) ఇవాళ నా మాటా, మీ నాన్న పేరూ నీకు మోటయినాయ్ రా భడవా! నేను బ్రతకటం ఎందుకూ! కాశీకి వెళ్ళి అటునుండి కాటికి పోతా! " అనేసరికి

'డైరెక్ట్ గా పోయిచావచ్చుగా, ఇన్ని మలుపులెందుకో ...' అనుకొని,

"సరేలేవే నాన్న పేరే ఖాయం సరేనా" ~ కూర్మాంగద రావ్ మాటనేసాడు.

ఆపేరు పెట్టినప్పటినుండీ , మెుదలయింది అసలు వ్యధ పీతాంబరధర రావు కి

ఈ పేరుగలవాణ్ణి ఏమని పిలవాలీ? ఎలా పిలవాలీ "పీతాంబరధరా" అనా? పోనీ 'రావు' అనా?" ఏం రావు? ఎందుకు రావు? ఎలారావు?" అని సన్నిహితుల వెటకారం.

ముందు 'పీతాంబరం' అని పిలిచారు .

తర్వాత పిలవలేక "పీతయ్య" అన్నారు.

విసుగులో 'పీతిగాడా' అని పిలుస్తున్నారు.

ఇప్పుడు 'పీతిగారు' అని పిలుస్తున్నారు.

'వా' ~ ఎందుకు ఈఖర్మ దేవుడా!

అంటే మా నాన్న పేరు కూర్మాంగదరావ్

పిలవలేని వారికి 'కూర్మం, కుర్మా'... మళ్ళీ స్వగతంలోకి....

నామకరణం చేసేటప్పుడే, విరిచినా అరిచినా, మెురిగినా, ఎటునుండి ఎటుపలికినా సంగీతమంత వినసొంపైన పేరు ఆలోచించే పెడతా నా కొడుక్కి ~

అంతేగానీ ~ ~

"పీతిగారూ ఏమిటాలోచిస్తున్నారూ ?"మళ్ళీ రెట్టించాడు దానయ్య.

తన పేరు వినబడగానే మళ్ళీ అరికాలి మంట నెత్తి కొచ్చి

" బామ్మా! నిన్నూ..” మళ్ళీ పిడికిలి బిగిసింది.

ఈ పీతాంబరధరుని ముఖకవళిక లు దానయ్యకు నవ్వు తెప్పించి కిసుక్కు మన్నాడు, దానయ్య.

వినాయకుణ్ణి చూసి వికటంగా నవ్విన చంద్రుడు గుర్తుకువచ్చి ~

“నో ~అలా జరగడానికి వీల్లేదు” అని గట్టిగా అరవాలను కున్నాడు పీతాంబరధర రావు. అరిచాననీ అనుకున్నాడు. కానీ గొంతు పెగల్లేదనీ, తన ఎదురుగా నిలుచున్న దానయ్య అనబడే శాల్తీ ముఖకవళికలను బట్టి అనుకున్నాడు.

ఇంతలో భార్య జాంబవతి కేకేసింది.

తిక్కమీద ఉన్నాడేమో పీతయ్య

"దీనిదుంపతెగ! దీనికి జంబూకం అని పెట్టాల్సింది జాం- బ-వ-తీ అని పెట్టి చచ్చాడు వీళ్ళ నాన్న" స్వగతంలో అన్నాడనుకుని పైకే అన్నాడు.

ఎదురుగానే ఉన్న దానయ్య పుసుక్కున నవ్వి "భలేవారు పీతిగారూ మీరూ! పైకి అనాల్సినవి, మనసులోనే అనుకుని కుమిలిపోతారూ! మనసులో అనుకోవాల్సినవి పైకే అనేసి తెగనవ్వు తెప్పించేత్తారు. "

"భలే సరదా మనిషండీ బాబోయ్ మీరు. మీకాడుంటే నా! నా పొట్ట చెక్కలైపోవాల్సిందేనండీ. హబ్బ, హబ్బ.. ఇక నవ్వలేనండీ," అంటూ ఆగి పీతయ్య ముఖంలోకి చూసి కొడతాడేమోనని భయంవేసి పారిపోయాడు.

లోపలికొచ్చిన పీతయ్యకి "ఏమండీ! ఎవరోపెంటయ్యట.. లైన్లో ఉన్నాడు" ఫోన్ ఇచ్చింది జాంబవతి.

"పెం ~ ఇదేంపేరు ?" చిరాకు పడుతూ ఫోన్ తీసుకున్నాడు.

"హలో! నేను పెంటయ్యనండీ! మీ ఇంట్లో బాలసారెంటగా! షామియానా యేయాలని మీ బామ్మర్దిగారు చెప్పారు. ఏరోజూ, ఎన్నిటికీ? వివరాలు~" అడిగాడు పెంటయ్య.

వివరాలన్నీ చెప్పి పీతయ్య నోరూరుకోక పీతయ్య "అవునూ! పెంటయ్య! ఇదేం పేరూ ఛండాలంగా ~" అన్నాడు.

"ఏండోయ్! నన్నేమన్నా అనండీ! నాపేరునేం అనకండీ! అది మాతాతపేరు . అందుకే నాపేరంటే నాకు దేవుడితో సమానం. పూర్వం పిల్లలు పుట్టీ పోతుంటే ఇలా పీటా, సాటా, పెంటయ్య అని పెట్టేవారట. మరి నేను మనవణ్ణి కదండీ. మరి ఆస్థికే కాక పేరుకే వారసుణ్ణి కదండీ! ఆస్థి కావాలి గానీ పేరు వద్దంటే ఎలా ఆయ్.. " అని ఇంత పొడుగు దండకం చదివి ఫోన్ పెట్టేసాడు.

////////

"బాలసారె పూర్తికావస్తోంది. బియ్యంలో పేరు రాయండి పీతయ్యగారూ " అన్నాడు పురోహితుడు .

అందరూ ఆసక్తి గా చూసారు.

పేరు రాస్తూ "కూర్మేష్" అని పిల్లవాడి చెవిలో మూడుసార్లు చెప్పాడు, పీతయ్య.

~శుభం~

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత్రి పరిచయం : నావివరములు.... పేరు భాగవతుల భారతి Double M.A., B. Ed భర్త... శ్రీనివాస్ గారు (లెక్చరర్) వృత్తి... గృహిణి, నిత్యాగ్నిహోత్రము, వేదాధ్యయనము, స్వాధ్యాయం

ప్రవృత్తి... రచనలు.. పద్యాలూ, వ్యాసాలు, కథలు, కవితలు, వచనకవితలు.

ప్రచురణలు.... అనేక ప్రముఖ పత్రికలలో

బహుమతులు... ప్రైజ్ మనీ తో కూడిన అనేక బహుమతులు.



296 views1 comment

1 комментарий


Ravali RamSarma
Ravali RamSarma
23 июн. 2021 г.

వెరీ నైస్..అభినందనలు భారతి గారు


Лайк
bottom of page