top of page

నాన్న వీలునామా


'Nanna Vilunama' Written By Bharathi Bhagavathula

రచన : భాగవతుల భారతి

"ఏంటండీ ఇదీ?! ఇంత అన్యాయం ఎక్కడైనా ఉందా? ఏ తండ్రైనా ఇలా ప్రవర్తిస్తాడా? " చంద్రం లాయర్ తో వాదిస్తున్నాడు, ఫోన్ లో

మళ్లీ ఫోన్ మ్రోగింది. లాయర్ ఫోన్ తీసాడు.

"ఏమండీ! లాయరుగారూ, నాన్నకి మతిలేక పోతే మీ మతి ఏమయిందీ? ఆఖరిక్షణాల్లో మీరు ఆయన దగ్గరే ఉన్నారుగా. మీరైనా చెప్పవచ్చు కదా! నాన్సెస్. " సూర్యం ఫోన్లో తిడుతున్నాడు.

లాయర్.... ఎడమచేతిలో చంద్రం ఫోన్, కుడిచేతిలో సూర్యం చేసిన ఫోన్ పట్టుకుని, రెండిటినీ మార్చి మార్చి చూస్తూ, రెండు వైపుల నుండి వచ్చే తిట్ల పరంపర వింటూ,

దేవుడా! మంత్రసానితనం ఒప్పుకున్నాక, పిల్లవచ్చినా భరించాలి, దుర్గంధం వచ్చినా భరించాలంటారు ఇదే కాబోలు. అనుకుని

"అయ్యా! సూర్యచంద్రాలూ! మీ నాన్నగారు మీకీ పేర్లు ఎందుకు పెట్టారో తెలీదు. కానీ ఒకరికొకరు ఎదురుపడకుండానే నన్ను, ఆకాశరామన్న లాంటి లాయర్ని పట్టుకుని ఇలా ఆడుకోటం బాగుండలేదు. మీ నాన్నగారు వీలునామా లో కచ్ఛితంగా రాసారు. ఆయన పెట్టిన షరతు పాటించక పోతే ఆస్థిని ...... మీకు చెప్పాగా.... నాదేం లేదు. వచ్చి ఆయన చెప్పిన పని చేసేయండి .... లేదంటే... " అర్ధోక్తితో ఆపేసి రెండు ఫోన్ లూ పెట్టేసి, చేతులు దులుపుకున్నాడు లాయర్.

హైదరాబాదు నుండి చంద్రం, భద్రాచలం నుండి సూర్యం , రెక్కలు కట్టుకుని ఆ పల్లెటూరికి చేరారు. కళ్ళలో పుట్టెడు కన్నీళ్ళతో శవం దగ్గర కనిపించారు, తల్లీ, పెళ్ళి కాకుండా ఇంట్లోనే ఉన్న కుంటి చెల్లెలు.

సూర్యం, చంద్రం చచ్చిపోయిన నాన్న అంత్యక్రియలు జరిపించారు ఇద్దరూ , ఒకరితో ఒకరు మాటాముచ్చటా లేకుండానే. గతం ఇద్దరి మనస్సులోకి తొంగిచూస్తూనే ఉంది. పదేళ్ళ క్రితం చక్కటి ఉమ్మడి కుటుంబంగా ఉన్నారు,ఆ అన్నదమ్ములు. కానీ తోటికోడళ్ళ మథ్య చిచ్చురాజుకుని, విడిపోయి, ఎవరిదారిన వారు, దూరమై ,బద్దశత్రువులుగా తయారై ఈ పదేళ్ళల్లో ఒక్కసారి కూడా, ఆ పల్లెటూరికి రాలేదు.నాన్న ఎన్నిసార్లు ఫోన్ చేసినా, "వాడు వస్తాడేమో, వాడి ముఖం నేను చూడను " అని, ఇద్దరూ ఎంత ఎదురుచూసినా రాకపోవటం రాజుగారికి తీవ్ర మనస్థాపం కలిగించింది.

ఇదిగో ఇప్పుడు నాన్న పోయాక కలవాల్సివస్తుందని ఇద్దరూ ఊహించలేదు. గతంలోకి తొంగి చూస్తూనే, ఎడముఖం, పెడముఖం గానే రెండు రోజులు నిత్యకర్మ చేసారు. మూడోరోజున చూపులు కలిసినాయ్. తోటికోడళ్ళు కూడా చూపులు కలిపారు. ఐదో రోజు చిన్న చిన్నమాటలు కలిపారు.ఇంకారోజులు జరిగాక, కష్టసుఖాలు పంచుకోవటం, పదోరోజున స్వర్గపాదేయం ఐపోయి, పన్నెండో రోజు ఆశీర్వచనాలకు కూర్చోబోతూ, అన్నదమ్ములిద్దరూ, పరస్పరం కౌగిలించుని,

"ఒకే కొమ్మకు పూసిన మనం కనుచెమ్మల పూలు పూయిస్తున్నాం! నీకూ నాకు మధ్య ఎందుకింత దూరం? ఏం మూటకట్టుకు పోదామనీ! వద్దురా! వద్దు! ఈ మౌనం మనమధ్య వద్దు. " అంటూ భోరున ఏడ్చారు.

చూసిన తోటికోడళ్ళూ,కన్నీళ్ళ పర్యంతమైపోయారు. లాయర్ వీలునామా వారిచేతిలో పెట్టాడు. అది చదివి అన్నదమ్ములిద్దరూ ముఖముఖాలు చూసుకున్నారు,ఇది లాయర్ నోటి నుండి విన్నదేగా, అనుకుంటూ. వీలునామాలో రాజుగారు

" నా తదనంతరం అన్నదమ్ములు ఇద్దరూ ఒకరితో ఒకరు కలిసి ఇదే ఇంట్లో, నాఅంత్యక్రియలు జరిపించాలి. పన్నెండు రోజులూ ఇద్దరూ ఇక్కడే ఉండాలి. అలా జరిపించితేనే, నా ఆస్థిలో మూడువాటాలు చేస్తున్నాను. ఒకటి సూర్యకి, రెండు చంద్రకి మూడవది అంగవైకల్యం కలిగిన నా కూతురు, కీర్తనకి. ఓ వేళ అంత్యక్రియలు

వేరువేరుగా చేసినా, ఇందులో ఎవరైనా అంతక్రియలకు హాజరు కాకపోయినా రెండో వారికి ఆస్థి దక్కదు. పెళ్ళి కాక, తల్లిమీద ఆధారపడిన ,కీర్తనకు చెందుతుంది . " అని రాసారు. ఈ వీలునామా చదివి, కళ్ళలో నీళ్ళు నింపుకున్నారు, అన్నదమ్ములిద్దరూ.

"నాన్న మనిద్దరినీ కలపటానికే ఇలా వీలునామా వ్రాసారు. కానీ అమ్మ ఉన్నంతవరకూ ఈ ఆస్థి అమ్మే అనుభవించాలి. ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. అప్పటివరకూ మనం మన కష్టార్జితం తోనే బ్రతకాలి. ఈ పల్లెటూరికి వచ్చిపోతుండాలి " అనిపెద్దవాడైన సూర్యం నిర్ణయం ఆమోద యోగ్యంగా, అంగీకార సూచకంగా చంద్రం కూడా తలాడిస్తే , మన:స్ఫూర్తిగా , ఆత్మీయ ఆప్యాయతలతోనే అందరూ వెనుదిరిగారు.

///////////////////

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.


రచయిత్రి పరిచయం : నావివరములు.... పేరు భాగవతుల భారతి Double M.A., B. Ed భర్త... శ్రీనివాస్ గారు (లెక్చరర్) వృత్తి... గృహిణి, నిత్యాగ్నిహోత్రము, వేదాధ్యయనము, స్వాధ్యాయం

ప్రవృత్తి... రచనలు.. పద్యాలూ, వ్యాసాలు, కథలు, కవితలు, వచనకవితలు.

ప్రచురణలు.... అనేక ప్రముఖ పత్రికలలో

బహుమతులు... ప్రైజ్ మనీ తో కూడిన అనేక బహుమతులు.


241 views1 comment
bottom of page