top of page
Writer's pictureNeeraja Prabhala

నాన్నా! నన్ను దగ్గరకు తీసుకోవూ..


'Nanna Nannu Daggaraku Tisukovuu' New Telugu Story

Written By Neeraja Hari Prabhala

'నాన్నా! నన్ను దగ్గరకు తీసుకోవూ' తెలుగు కథ

రచన: నీరజ హరి ప్రభల

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


భార్య సరోజ పురిటికని పుట్టింటికి వెళ్ళి రెండు నెలలైంది. ఇన్నిరోజులు వంట చేతకాకపోయినా ఎలాగో చేతులు కాల్చుకుంటూ ఆఫీసుకు వెళ్లి వస్తున్నాడు రాము. ఇంకో రెండు రోజుల్లో డెలివరీ డేట్ అని డాక్టరు చెప్పిందని రాత్రి సరోజ చెప్పింది. ఆ తీయని కబురు కోసం ఎదురు చూస్తున్నాడు తను. శెలవు పెట్టి సరోజ వద్దకు వెళదామంటే ఆఫీసులో శెలవు దొరకలేదు.


ఆ మరుసటిరోజు మామగారు ఫోన్ చేసి 'సరోజకు లేబర్ పెయిన్స్ మొదలయ్యాయి' అంటే తన మససంతా టెన్షన్. తొలిచూలు. పాపం సరోజ ఎంత బాధ పడుతోందో? ఈ సమయంలో తను దగ్గర ఉండి కాస్త ధైర్యం చెపితే ఎంత బాగుండునో కదా!' అని పరిపరి విధాలా మదన పడుతుండగా మళ్ళీ అత్తగారు ఫోన్ చేసి " నీకు ఆడపిల్ల పుట్టింది. శుక్రవారం శ్రీ మహాలక్ష్మి నీ ఇంటికి వచ్చింది" అని చెప్పగానే పట్టరాని ఆనందంతో స్వీట్లు తీసుకెళ్లి ఆఫీసులో పంచి శెలవు పెట్టి వెంటనే బస్సు ఎక్కి అత్తారింటికి వెళ్ళాడు రాము.


హాస్పిటల్ కు వెళ్లి భార్యను చూసి పలకరించి పాపను చేతుల్లోకి తీసుకుని ఒక్కసారిగా తృళ్ళిపడ్డాడు. తను ఎంతగానో ఊహించుకుని, కలలు కన్న తన కలల పంట ఇలా కనపడేటప్పటికి ఒక్క సారిగా నిరుత్సాహం ఆవరించింది. నల్లగా ఉండి, రూపురేఖలు కూడా బాగా లేదు. చూడడానికి మనసొప్పక భార్య చేతికి పాపను ఇచ్చి వెళతానని వెంటనే ఊరికి బయలుదేరి వచ్చాడు రాము. భర్త ప్రవర్తనకు చాలా బాధ పడింది సరోజ.


పాపకు మూడవవనెల వస్తోంది. బారసాలకు రమ్మని మామగారు చెపితే మొక్కుబడిగా వెళ్ళి అయిందనిపించాడు రాము. పాపకు 'విద్య ' అని పేరు పెట్టి భార్యను, పాపను తనతో ఇంటికి తీసుకుని వచ్చాడు. సరోజతో చాలా ప్రేమగా ఉండే రాము కూతురి విషయంలో చాలా నిర్దయగా ఉండటం చూసి సరోజ భర్తను మార్చ ప్రయత్నించి విఫలురాలైంది. ' అందుకు కాలమే తగిన సమాధానం చెపుతుంది' అని మిన్నకున్నది. సరోజ.


విద్య పెరుగుతూ మాట, నడక వచ్చి అన్నిట్లో చలాకీగా, చురుకుగా ఉంటూ తల్లి ప్రేమను పొందుతోంది. విద్యకు 5 సం. వచ్చాయి. తండ్రి దగ్గరకు. వెళితే ఆయన తనను పట్టించుకోకుండా ఉండటం ఆ పసిమనసుకు అర్థంకాక ఏదోగా అనిపిస్తోంది. ఈలోగా సరోజ మళ్ళీ నెలతప్పి 9నెలు నిండగానే మరో ఆడపిల్లను కన్నది. ఆ పాపను చూసి రాము ఆనందానికి అవధుల్లేవు. చాలా అందంగా, చూడముచ్చటగా ఉన్న ఆ పాపకు 'రూప' అని పేరు పెట్టి చాలా గారాబంగా పెంచుతున్నాడు.


తనకు చెల్లి పుట్టిందని ఎంతో సంబరంగా ఆ పాప దగ్గరకు వచ్చిన విద్యను తాకనివ్వకుండా కోపడి ఇంకెప్పుడూ ఆమె వద్దకు రావద్దని గట్టిగా గదమాయించాడు రాము. పాపం బిక్క మొహం వేసుకుని తల్లి చీర చెంగులో తల దాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తున్న విద్యను సరోజ ఎత్తుకుని ముద్దాడి ప్రేమతో సముదాయించింది. గోరుచుట్టు మీద రోకటి పోటు లాగా విద్యకు 12 సం. నిండగానే కాలికి పోలియో సోకింది. జరిగిన దానికి విద్య, సరోజ చాలా బాధ పడ్డారు.


విద్య ఎదుగుతున్న కొలదీ తండ్రి నిరాదరణ అర్థం అయి ఒక రోజున తల్లి వద్దకు వెళ్లి

"ఎందుకమ్మా నాన్న నన్ను ప్రేమగా దగ్గరకు పిలవరు? నేను చేసిన తప్పేంటి? " అని అడిగింది. దానికి సరోజ ఇందులో "నీ తప్పేం లేదు తల్లీ! నీవు బాగా చదివి మంచిగా వృధ్ధిలోకి వస్తే నాన్న లాంటి వ్యక్తులందరూ నీ వద్దకు వస్తారు. ఇంక నుంచి నీ ధ్యేయం అంతా నీ చదువు మీదే. నీవెప్పుడూ కలెక్టర్ అవ్వాలని అనేదానివి కదా. నీకు నేను ఉన్నాను. ఏం కావలసి వచ్చినా నన్ను ఆడుగు" అని విద్యను వెన్ను తట్టి ధైర్యాన్ని నూరిపోసింది సరోజ.


సరోజ కూతుళ్ళిద్దరినీ ఒకేరీతిగా ప్రేమతో పెంచుతోంది. పిల్లలిద్దరూ పెద్దవాళ్ళయ్యారు. కాలం ఆగదు కదా!. తండ్రి అతి గారాబంతో పెద్దగా చదువు అబ్బక ఎలాగోలా ముక్కుతూ MBA పూర్తి అయిందనిపించింది రూప. తను ప్రేమించిన అబ్బాయిని పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయింది. రూప చేసిన పనికి చాలా బాధపడ్డారు తల్లి తండ్రులు.


విద్య PG లో ఫస్ట్ క్లాసు తెచ్చుకుని, పోటీ పరీక్షలకు ప్రిపేరయి కష్టపడి IAS చదివి మంచి రాంకు తెచ్చుకుని పోస్టింగ్ ఆర్డర్స్ తెచ్చి తల్లికి చూపిస్తే సరోజ ఆనందానికి హద్దుల్లేవు. దగ్గరకు తీసుకుని ముద్దిచ్చి విద్యను భర్త వద్దకు తీసుకెళ్లి "చూశారా! మన విద్య కలెక్టర్ అయింది " ఆని ఆర్డర్స్ చూపిస్తే వాటిని ముభావంగా చూసి ఊరుకున్నాడు రాము. తండ్రి ప్రవర్తనకు బాధతో చిన్నబుచ్చుకున్న విద్య ముఖాన్ని చూసి సరోజ తన మూడ్ మార్చే ప్రయత్నం గా "విద్యా ! పద పద. ఇప్పుడు. మనం షాపింగ్ కు వెళ్ళి నీక్కావల్సిన బట్టలు, వస్తువులు తీసుకోవాలి. నీవు డ్యూటీ లోకి జాయినవ్వాలి కదా! "అని బజారుకు తీసుకెళ్లి విద్యకు కావల్సినవన్నీ కొనిపెట్టింది సరోజ.


ఆరోజు విద్య కలెక్టర్ గా వేరే జిల్లాకు వెళ్ళాల్సిన రోజు. తల్లి తండ్రుల పాదాలకు నమస్కరించి తల్లిని కౌగలించుకొని వెక్కి వెక్కి ఏడ్చి "ఇదంతా నీ చలవేనమ్మా! నీవే నన్నింతదాన్ని చేశావు. నీవే లేకపోతే నేనేమయిపోయేదాన్నో నమ్మా!" అన్న విద్యను మ‌రింతగా తన గుండెలకు హత్తుకొని " ఇంక అన్నీ నీకు మంచిరోజులే తల్లీ!. నీ కర్తవ్య దీక్షతో నిజాయితీగా పనిచేసి మంచి పేరు తెచ్చుకో! వస్తూ ఉండమ్మా" అని ఉబికి వస్తున్న కన్నీళ్ళను రెప్పల మాటున దాచి నవ్వుతూ కూతురిని. సాగనంపింది సరోజ.


కొన్నాళ్ళకు రాముకు హార్ట్ ఎటాక్ వచ్చి హాస్పిటల్ లో చేరగా డాక్టర్లు ఆపరేషన్ చేసి స్టంట్ వేశారు. విషయం తల్లి ద్వారా విన్న విద్య పరుగు పరుగున వచ్చి వైద్య ఖర్చులు అన్నీ దగ్గరుండి చూసుకుని మంచి ట్రీట్మెంట్ ఇప్పించి, సపర్యలు చేసి కంటికి రెప్ప లాగా తండ్రిని కాపాడుకుని ఇంటికి తీసుకుని వచ్చింది. మరికొన్ని రోజులు శెలవును పొడిగించుకుని "నాన్నా! ఎలా ఉంది మీకు ఇప్పుడు? అది త్రాగు, ఇది తిను. " అని దగ్గరుండి ఆయనను చాలా ప్రేమగా చూసుకుంటోంది.


విద్య చూపిస్తున్న ప్రేమాదరణలకు చాలా త్వరగా కోలుకున్ళాడు రాము. విద్య పట్ల చిన్నప్పటి నుండి తను చేసిన తప్పు, ప్రవర్తించిన తీరు అన్నీ గుర్తొచ్చి సిగ్గుతో, పశ్చాత్తాపంతో కుమిలిపోతూ విద్య రెండు చేతులు పట్టుకుని "చిన్నదానివి. నిన్ను క్షమించమనకూడదు. అయినా క్షమించమని అడుగుతున్నాను. ఈ నాన్నను క్షమిస్తావా తల్లీ!" అని బాధతో ఏడుస్తున్న తండ్రిని హత్తుకొని "అయ్యో! నాన్నా! మీరిలా బాధ పడకూడదు. మీ ఆరోగ్యం జాగ్రత్త!. మన మధ్యన క్షమాపణలు ఏంటి నాన్నా! నేను మీ అమ్మాయిని. ' అన్న విద్యను మరింత సంతోషంగా గుండెలకు హత్తుకున్నాడు రాము.


ఇదంతా తృప్తిగా చూస్తూ కన్నులనిండా ఆనంద భాష్పాలు రాలగా సంతోషంతో

"ఇంక ఈ పూట భోజనాలు చేస్తారా? సంతోషంతో మీ తండ్రీ కూతుర్లకు కడుపు నిండిందా! ఇద్దరూ భోజనాలకు లేవండి. " అన్న తల్లి మాటలకు ఇద్దరూ పకపకా నవ్వుతూ డైనింగ్ టేబుల్ వద్దకు వచ్చి సరదాగా కబుర్లతో భోజనం చేశారు ముగ్గురూ.


.. సమాప్తం.

నీరజ హరి ప్రభల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


Podcast Link:


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం :


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు



"మన తెలుగు కధలు " వేదిక మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నీరజ ప్రభల. నాది చాలా చిన్న కుగ్రామంలో చాలా సాంప్రదాయ కుటుంబంలో జననం. అగ్రహారం. నాన్న గారు బాలకృష్ణ మూర్తి గారు బ్రాంచి పోస్ట్ మాస్టర్, వ్యవసాయ దారుడు, పంచాయతీ ప్రెసిడెంట్. అమ్మ కమల గృహిణి . మేము ఆరుగురం సంతానం. నాకు ముగ్గురు అక్కయ్యలు, ఇద్దరు అన్నయ్యలు. అందరిలోకీ నేనే ఆఖరిదాన్ని. చిన్న దాన్ని. నాకు చిన్న వయసులోనే వివాహం. మేము విజయవాడలో ఉంటాము. నేను గృహిణిని. మా వారు వాసుదేవశర్మ. రిటైర్డ్ లెక్చరర్. మాకు ముగ్గురు అమ్మాయిలు. మా కూతుళ్ళు, అల్లుళ్ళు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా డెన్మార్క్ , అమెరికాలలో సెటిలయ్యారు. మా ముగ్గురు అమ్మాయిలు చిన్నప్పటి నుంచీ కర్ణాటక సంగీతం నేర్చుకుని అనేక పోటీలలో గెలుపొంది , ప్రతి సం.. త్యాగరాజ ఉత్సవాలలో కచేరీలు చేసి ప్రముఖ విద్వాంసుల ప్రశంసలు పొందటం నా అదృష్టంగా ఎల్లప్పుడూ భావిస్తాను. అంతేకాకుండా పాడుతా తీయగా, పాడాలనుంది, రాగం- సంగీతం మొ.. ప్రోగ్రాములలో పాల్గొని పెళ్ళైనాక కూడా విదేశాల్లో కచేరీలు చేస్తూ అందరిచే ప్రశంసలు పొందుతున్నారు. ప్రస్తుతం మాకు ఇద్దరు మనవరాళ్ళు, ఒక మనవడు. నాకు చదువంటే చాలా చాలా ఇష్టం. పిల్లలు సెటిలయ్యాక B.Com, MA సంస్కృతం, MAఇంగ్లీష్, MA తెలుగు చేశాను. సంగీతం - సాహిత్యం నాకు ప్రాణం. సంగీతం నేర్చుకున్నాను. ఇప్పుడు వీణ కూడా నేర్చుకుంటున్నాను. టైపు, షార్ట్ హాండ్ ప్రధమ శ్రేణి లో ఉత్తీర్ణత. కధలు-కవితలు వ్రాస్తాను. మీ అందరి ప్రోత్సాహంతో కధలు, కవితలు వ్రాస్తున్నాను . నాకధలు లోగడ పత్రికలలో కూడా ప్రచురితమైనవి. గార్డెనింగ్, స్టిచింగ్, అల్లికలు, సాఫ్ట్ టాయ్స్ బొమ్మలు, డ్రాయింగ్ , ఫాబ్రిక్ పెయింటింగ్, రంగవల్లులు, క్రియేటివ్ ఆర్టికిల్స్ తయారీ మొ.. నా హాబీ. అమ్మ , నాన్న గారు స్వర్గస్ధులయ్యి 10 సం.. అయినది. నాకు నా మాతృభాష తెలుగు అంటే చాలా చాలా ఇష్టం, అభిమానం‌, గౌరవం. ఈ వేదిక మీద మిమ్మల్నందరినీ పరిచయం చేసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నా కధలను ఆదరించి ప్రోత్సాహిస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు.🙏🙏



85 views0 comments

Commentaires


bottom of page