top of page

నన్ను క్షమించవూ!..'Nannu kshaminchavu' - New Telugu Story Written By Padmavathi Divakarla

'నన్ను క్షమించవూ' తెలుగు కథ

రచన: పద్మావతి దివాకర్ల

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

ప్రశాంత్ హాస్పిటల్లో బెడ్పై విశ్రాంతి తీసుకుంటున్నాడు. అతనికి నిద్రాభంగం కలగకుండా నెమ్మదిగా కుర్చీని అతని బెడ్ పక్కకి లాక్కొని కూర్చుంది సుమతి. ఎంత నెమ్మదిగా ఆమె అలా చేసినా ప్రశాంత్కి మెలుకువ రానేవచ్చింది. కళ్ళెత్తి ఆమె వైపు చూసి బలహీనంగా నవ్వాడు. మరుక్షణం అతని కనుకొలుకుల్లో నీళ్ళు నిలిచాయి.


ప్రశాంత్ ని అలా చూసేసరికి సుమతికి మనసులో కలుక్కుమంది. ఎప్పుడూ జాలీగా, సరదాగా, హుషారుగా ఉండే ప్రశాంత్ పరిస్థితికి బాధ కలిగింది.


"ధైర్యంగా ఉండు ప్రశాంత్! నీకేమీ కాదు! త్వరలోనే నయమైపోతుంది. రెండంటే రెండే రోజుల్లో నయమై హాస్పిటల్నుండి తిరిగి వస్తావు. " ప్రశాంత్ తల నిమురుతూ అనునయంగా అంది సుమతి పెదవులపై నవ్వు తెచ్చుకుంటూ.


ఆమె వైపు జాలిగా చూసి జీవంలేని నవ్వు ఒకటి నవ్వాడు ప్రశాంత్. "నాకు తెలుసు సుమతీ, నాకు వచ్చిన జబ్బు ఎంత ప్రమాదకరమైనదో! నాకు బ్లడ్ క్యాన్సరని నాకు తెలుసు. నా ఆయువు కొన్ని నెలలేనని కూడా నాకు తెలుసు. నేను బతకనని, కొద్ది రోజుల్లోనే నిన్ను విడిచిపెట్టి వెళ్ళక తప్పదని కూడా తెలుసు నాకు. " అన్నాడు ప్రశాంత్.అతని మాటలు విన్న సుమతి నిరుత్తరరాలైంది. ఇన్నాళ్ళూ ప్రశాంత్ కి ఏ విషయమైతే తెలియకూడదని ఆరాటపడిందో ఆ నిజమే అతనికి తెలిసిపోయింది. అసలే అధైర్యంగా ఉన్న ప్రశాంత్ పరిస్థితి మరింత దిగజారుతుంది. ప్రశాంత్ ని చూసే డాక్టర్ వెంకట్ తనకేనాడో చెప్పాడీ విషయాన్ని. ప్రశాంత్ కి బ్లడ్ క్యాన్సర్ అని తెలియగానే ఆమె నవనాడులు కృంగిపోయాయి.


ప్రశాంత్ ని ప్రేమించి పెళ్ళి చేసుకొని ఏడాదైనా కాలేదు. తన జీవితం అర్ధాంతరంగా మోడుబారిపోతుందని తెలియగానే ఆమె దుఃఖానికి అంతేలేకుండా పోయింది. ఎంతోమంది స్పెషలిస్ట్ లకి చూపించింది. ధైర్యం కోల్పోకుండా విదేశాలనుండి వచ్చిన డాక్టర్లకి కూడా చూపించింది. రేపు అమెరికానుండి డాక్టర్ ప్రాన్సిస్ వస్తాడంటే అతన్ని కలసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంది. ఆమెలో ఇంకా ఆశ మిణుకుమిణుకుమంటూనే ఉంది.


ప్రశాంత్ ప్రాణం కాపాడటానికి, అతన్ని మృత్యుముఖం నుండి తప్పించడానికి అన్ని ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉందామె. ఆమెలో ఆత్మస్తైర్యం తగ్గలేదు. అయితే ఇప్పుడు ప్రశాంత్ కి తన జబ్బు విషయం తెలిసిందనగానే ఆమెలో ఏదో తెలియని భయం ప్రవేశించింది.


ప్రశాంత్ కి ఈ విషయం ఎలా తెలిసిందా అన్న విషయంకన్నా తెలిసిపోయిందన్న సంగతే బాధించిందామెకి. ముఖం చేతుల్లో దాచుకొని రోదించిదామె. ఆమెలో ఘనీభవించిన దుఃఖం అంతా కరిగేంతవరకూ ఆమెనే చూస్తూ ఉండిపోయాడు ప్రశాంత్. కొద్దిసేపు మౌనం అనంతరం, "నాకు ఈ విషయం ఎలా తెలిసిపోయిందని భావిస్తున్నావా?" అన్న ప్రశ్నకి తలెత్తి సజల నయనాలతో అతనివైపు చూసిందామె.


"నన్ను క్షమించవూ సుమతీ!.. నాకున్న జబ్బు సంగతి నాకు ఇంతకుమునుపే తెలుసు, ఎంత ముందంటే మనపెళ్ళికి మునుపే నాకీ సంగతి తెలుసు. తెలిసితెలిసీ కావాలనే నిన్ను పెళ్ళిచేసుకున్నాను. ఇప్పుడు అనిపిస్తోంది చాలా పెద్ద తప్పు చేసానని. " ఆయాసపడుతూ ఆగాడు.


పిడుగుపాటులా తోచాయామాటలు సుమతికి. దిగ్భ్రాంతిగా చూసింది ప్రశాంత్వైపు.


"అందుకే అడుగుతున్నాను సుమతీ! నన్ను క్షమించవూ?" అడిగాడు ప్రశాంత్ ఆమె చేతులు పట్టుకుని.


ఆమె ఇంకా తేరుకోలేదు. 'ఎందుకిలాంటి పని చేసావ్ ప్రశాంత్?' అని ఆమె మనసు ఆక్రోశిస్తోంది.


"నీ మౌనం నన్ను దహించివేస్తోంది. నన్ను నిలదీయ్ సుమతీ! ఎందుకిలా చేసానో తెలుసా! పగ, ప్రతీకారం! నేనెంత తప్పు చేసానో ఆ తర్వాత నాకు తెలిసింది, కాని నా తప్పు దిద్దుకొనే మార్గం మాత్రం నాకు కనబడటం లేదిప్పుడు. నా పగ, ప్రతీకారం కోసం నీ జీవితాన్ని నాశనం చేసినందుకు నేనిప్పుడు సిగ్గుపడుతున్నాను. " అవేదనతో అన్నాడు.


"పగ.. ప్రతీకారమా! నా మీద నీకెందుకింత ద్వేషం ప్రశాంత్! నేను నీకేమి ద్రోహం చేసాను?" ఆశ్చర్యంనుండి తేరుకున్న సుమతి అడిగింది.


"ద్వేషం నీ మీదకాదు. మీ నాన్న మీద. అందుకే నిన్ను వివాహం చేసుకున్నాను మీ నాన్నమీద ప్రతీకారం తీర్చుకోవడానికి. అయితే అమాయకురాలైన నువ్వు నా ప్రతీకారానికి బలికావడం మాత్రం నన్ను ఇప్పుడు తీవ్రంగా కలిచివేస్తోంది. నీ ప్రేమ నాలోని రాక్షసత్వాన్ని ఓడించింది. అయితే నేను ఇప్పుడు పశ్చాత్తాపం చెందినా ప్రయోజనంలేదు. నాకు కొద్దిరోజులు మాత్రమే గడువు ఉంది. ప్రతీకారం తీసుకోవడంలో నేను గెలిచినా నీ ప్రేమ ముందు ఓడిపోయాను సుమతీ!" అతికష్టం మీద తలగడపై చేరబడుతూ గతంలోకి వెళ్ళాడు ప్రశాంత్.

***

చిన్నతనంలో దుర్భరమైన జీవితం గడిపాడు ప్రశాంత్. ఊహ తెలిసేసరికే తండ్రి పోయాడు. తల్లి తెలిసినవాళ్ళింటో పాచిపనులు చేస్తూ అతన్ని పెద్ద చేసింది. పసితనంలో ఎన్నో కోరికలు! తన దరిద్రంతో కోరికలేవీ తీరేవి కావని తెలుసు. కోరుకున్న చదువు చదవడానికి కావలసిన డబ్బులు లేవు. అతని చదువు ఇంకా పూర్తికాకుండానే తల్లి చనిపోయింది.

అయితే ఆమె చనిపోయే ముందు తెలిపిన కొన్ని ముఖ్యమైన విషయాలు తెలియడంవల్ల ప్రశాంత్ వంట్లోని రక్తం మరిగింది. పగ, ప్రతీకారంకి ఆ రోజే బీజం పడింది. సుమతి తండ్రి గోపాలరావు, ప్రశాంత్తండ్రి రామచంద్రరావు కలిసి వ్యాపారం చేసి కోట్లు గడించారు. అంతులేని ఐశ్వర్యంలో పుట్టాడు ప్రశాంత్. వ్యాపారంలో మోసం చేసి వాళ్ళ సంపదంతా కాజేసాడు గోపాలరావు. అంతేకాక తను సాగించిన అనైతిక వ్యాపారాల్లో ఇరికించి జైలుపాలు చేసాడు. అవమానంతో ప్రశాంత్ తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు.


తమ దుస్థితికి కారణమైన గోపాలరావుపై ప్రతీకారం తీర్చుకోవాలని ఆరోజే శపథం చేసాడు ప్రశాంత్.

కాని తనవద్ద డబ్బులేదు, ఏ రకమైన మద్దతూ లేదు. ఎన్ని ప్లాన్లు వేసుకున్నా ఏదీ ఆచరణలోపెట్టే ధైర్యంలేదు. ఈ లోగా ఒంట్లోబాగా లేకపోవడంతో చాలా కాజువల్గా ఆస్పత్రిలో పరీక్ష చేసుకుంటే, దారుణమైన నిజం తెలిసింది. బ్లడ్కాన్సర్ సోకిందని, చికిత్స దాదాపు లేదని, ఉన్నా తన అందుబాటులో లేదని తెలిసింది. ఒక్కసారి నిరాశతో కృంగిపోయాడు.


ఒకదశలో ఆత్మహత్యకూడా చేసుకోవాలని తీవ్రంగా భావించాడు, కానీ గోపాలరావుపై ప్రతీకార వాంఛ అతన్ని చావనివ్వలేదు. అప్పుడే ఫ్లాష్లా ఒక ఆలోచన అతనిమదిలో రూపు దిద్దుకుంది.


తను మరణించేలోగా గోపాలరావుపై ప్రతీకారం తీర్చుకోవడానికి స్కెచ్ వేసాడు. గోపాలరావు ఒక్కగానొక్క కూతురు సుమతిని ఆకర్షించాడు. స్వతహాగా అందగాడైన ప్రశాంత్ ఆమెకి నచ్చాడు. అమె తనని ప్రేమించి వెంటపడేలా చేసుకున్నాడు. తండ్రిని ఎదురించి మరీ ప్రశాంత్ని వివాహం చేసుకుంది. తన గురించిన ఏ విషయం తెలియకుండా జాగ్రత్తపడ్డాడు ప్రశాంత్. త్వరలో తల్లికాబోతోంది అని తెలిసిన గోపాలరావు రాజీపడి ఇద్దర్నీ ఇంటికి పిలిపించాడు.


ఆ తర్వాత ప్రశాంత్ తన గురించిన నిజం గోపాలరావుముందు బయటపెట్టాడు. విషయమంతా చెప్పి తను ఎలా సుమతిని ఆకర్షించి పెళ్ళిచేసుకుందీ చెప్పాడు. తనో ఆర్నెల్లకన్నా బ్రతకడని, ఆ తర్వాత ఆమె జీవితం ఎలా మోడువారుతుందో వివరంగా చెప్పి తన కసి, ప్రతీకారం తీర్చుకున్నాడు. మామగారైన గోపాలరావు మొహంలో నిండిన భయాన్ని చూసి పైశాచికానందాన్ని పొందాడు.

కూతురి భవిష్యత్తు కళ్ళల్లో మెదలగా వచ్చిన గుండెపోటువల్ల తనువు చాలించాడు గోపాలరావు.


ఆ విధంగా తన శపథం నెరవేర్చుకున్న ప్రశాంత్ కొన్నాళ్ళు ప్రశాంతంగానే ఉన్నాడు. ఆ తర్వాతే మొదలైంది అతనిలో అంతర్మధనం. తన జబ్బు దాచిపెట్టి ఆమెని మోసం చేసాడుకాని, ఇప్పుడిప్పుడే ప్రశాంత్కి తను సుమతిని ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలిసొచ్చింది. పైగా ఆమె తనకి చేస్తున్న సేవలు అతని మనసుని పూర్తిగా కరిగించాయి. ఇప్పుడు ఆమెపై ఎలాంటి ప్రతీకార వాంఛాలేదు. ఇప్పుడు జబ్బు బాగా ముదిరి పరిస్థితి చెయ్యదాటిపోసాగింది. కావాలని ముందు వైద్యం చేయించుకోలేదు, కాని ఇప్పుడు బతకాలనే ఆశ జనిస్తోంది. ఆమె పట్ల తను చేసిన అపచారం గుండెల్ని దహించాగా ఎన్నోసార్లు నిజం చెప్పాలనుకున్నాడు కానీ ధైర్యం చాలలేదు.


ప్రశాంత్ చెప్పినదంతా కన్నీళ్ళతో విన్న సుమతి బుర్రతిరిగిపోయింది. తప్పు చేసింది తన తండ్రి అయితే ప్రశాంత్ ప్రతీకారానికి తను బలైంది.


"సుమతీ, నన్ను క్షమించవూ!.. "అని ఆమెని అర్ధిస్తూనే ఉన్నాడు ప్రశాంత్ కన్నీళ్ళతో. నోటమాట రాని సుమతి అలాగే అతన్ని చూస్తూ ఉండిపోయింది. ఆమె కళ్ళల్లో నీళ్ళు ఎప్పుడో ఇంకిపోయాయి.


-o000o-

***

పద్మావతి దివాకర్ల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

Podcast Link:

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం:


పేరు పద్మావతి దివాకర్ల. నివాసం బరంపురం, ఒడిషా. ఇప్పటి వరకు వంద కథల వరకూ వివిధ పత్రికలలో ప్రచురించబడ్డాయి. ఆంధ్రభూమి, సహరి, హాస్యానందం, కౌముది, గోతెలుగు అంతర్జాల పత్రికలలో కథలు ప్రచురించబడ్డాయి. బాల సాహిత్యం, హాస్య కథలు రాయటం చాలా ఇష్టం.


58 views1 comment

1 Comment


కథ బాగుంది ముగింపు మాత్రం పరిష్కారం చూపలేక పోయింది.

Like
bottom of page