top of page

నరుడికి న్యాయం లేదు!


'Narudiki Nyayam Ledu' - New Telugu Story Written By Kasivarapu Venkatasubbaiah

'నరుడికి న్యాయం లేదు' తెలుగు (బాలల) కథ

రచన : కాశీవరపు వెంకటసుబ్బయ్య

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

ఉగాది ఎండలు తీక్షణంగా కాస్తున్నాయి. ఎక్కడ చూసినా చుక్క నీరు లేదు. చెరువులు కుంటలు వంకలు వాగులు ఏర్లతో సహా అన్ని ఎండిపోయాయి ఒక కాళంగి మడుగు తప్ప.


అంత ఎండలో ఏదో పనిమీద ఒక రైతు చెరువు కట్ట మీద పోతున్నాడు. ఆ చెరువు మధ్యలో కొన్ని బురద నీళ్ళు ఉన్నాయి. ఆ చాలి చాలని నీటిలో ఒక మొసలి ఉంది. మొసలి కట్టమీద పోతున్న రైతును చూసింది.


మొసలి ఆ రైతుతో " ఓ రైతన్నా! ఓ రైతన్నా! నేను ఈ కొద్ది బురద నీటిలో ఎండకు ఎండి, తిండిలేక నీళ్ళులేక చచ్చిపోతున్నాను. నీకు పుణ్యం ఉంటుంది. నన్ను నీళ్ళు ఉండే చోట విడిచి పెట్టరాదా! చచ్నీ నీ కడుపున పుడుతాను" అని ఎంతో దీనంగా బతిమిలాడుతూ అడిగింది.

అయ్యో పాపం అని దయదలచి, మొసలిని భుజంమీద వేసుకుని ఎంతో దూరంలో ఉన్న కాళంగి మడుగుకు అతి కష్టమ్మీద చేరుకొని మొసలిని ఆ మడుగులో విడిచాడు. మొసలిని అంత కష్టపడి మోసుకొచ్చి మడుగులో విడిచినందుకు రైతుకు కృతజ్ఞత చెప్పాలి, చెప్పలేదు కదా! రైతు కాలు పట్టుకొని నీళ్ళల్లోకి లాగింది మొసలి.


"ఏం మొసలి బావా! బురద నీళ్ళల్లో ఎండకు ఎండి నీలక్కపోయి చస్తుంటే, అయ్యో పాపమని జాలిపడి, నిన్ను మోసుకొచ్చి మడుగులో విడిచినందుకు నా కాలే పట్టుకొని, నీళ్ళల్లోకి లాగుతావా! నీకు న్యాయం ఉందా!" రైతు అన్నాడు బాధపడి పోతూ.


"న్యాయం న్యాయమంటున్నావ్ కదా! ఎవరితోనైనా ఒకరితో ఇది న్యాయం కాదు అని చెప్పించు! అప్పుడు నిన్ను వదిలి పెడతాను" అంది మొసలి ధీమాగా.


"సరే ఉండు, ఎవరైనా ఇటు వస్తే న్యాయం అడుగుదాం. అంతవరకు నన్ను నీళ్ళల్లోకి లాగవద్దు" రైతు అన్నాడు.


"సరే అంటే సరే" అంది మొసలి.


ఇంతలోపల ఒక బక్కచిక్కిన గుర్రం చెరువు కట్ట మీద పోతూ కనిపించింది.

"ఓ గుర్రం బావా! నువ్వే న్యాయం చెప్పు! ఈ మొసలి బురద నీళ్ళల్లో ఎండకు ఎండి, చచ్చిపోతుంటే, నేను మోసుకొచ్చి ఈ మడుగులో విడిచిపెడితే, నా కాలే పట్టుకొని నీళ్ళల్లోకి లాగుతుంది. ఇది న్యాయమేనా! నీవే చెప్పు" రైతు అడిగాడు గుర్రం తనవైపే న్యాయం చెపుతుందని ఆశతో.


"నేను వయస్సులో ఉన్నప్పుడు రోజూ గుగ్గిళ్ళు పెట్టారు. రోజూ పైయ్ కడిగారు, బాగా అలంకరించారు. సవారు చేసి, దౌడు తీయించి నా వొంపు సొంపులు చూశారు. ముసిలిదాన్ని అవగానే భీటికి వదిలారు. నరుడికి న్యాయం లేదు, నడి నీళ్ళల్లోకి లాగు" అని గుర్రం వెళ్లి పోయింది మనిషి మీద కోపపడుతూ.


రైతును మరింత నీళ్ళల్లోకి లాగింది మొసలి.


"ఉండుండూ ముసలి బావా! ఎద్దు వస్తోంది. దాన్ని న్యాయం అడుగుదాం!" రైతు ఆందోళనగా చెప్పాడు.


"సరే అట్లే కానీ" ఒప్పుకుంది మొసలి.


"ఎద్దు బావ! ఈ ముసలి చాలిచాలని బురద నీళ్ళల్లో, ఎండకు ఎండి, చనిపోతుంటే, ఎత్తుకుని వచ్చి ఈ మడుగులో వదిలితే, కృతజ్ఞత లేకుండా నా కాలే పట్టుకొని నీళ్ళల్లోకి లాగుతుంది. ఇదిన్యాయమా! నీవే చెప్పు!" రైతు దీనంగా అడిగాడు.


"నేను యవనంలో ఉన్నప్పుడు పత్తి గింజలు దంచి తినిపించారు. తౌడూ, గానుగ చెక్క కలిపిన నీళ్ళు తాపారు. పచ్చి గడ్డి, వట్టి గడ్డి పెట్టి మేపారు. గొర్రుతో, గుంటికతో, మడకతో సేద్యం చేపించారు. మేడకు గంట కట్టారు. నడుంకు బొడ్డువారు కట్టారు. కొమ్ములకు పూలు చుట్టారు. తిరుణాలలో బండ లాగించి నా సోకు చూశారు. ముసిలిదాన్ని అవుతూనే ఊరెలుపల భీటికి తోలారు. నరుడికి న్యాయం ఉందా! నడి నీళ్ళల్లోకి లాగు" అంది ఎద్దు ఆగ్రహంగా. మొసలి మరి కొంచెం నీళ్ళల్లోకి లాగింది రైతును.


"తట్టుకో! తట్టుకో! అదిగో గాడిద ఇటే వస్తుంది. దాన్ని న్యాయం అడుగుదాం! " బతిమిలాడాడు రైతు.


"సరే అట్లే గానిలే" మొసలి తన వైపే న్యాయం చెపుతారని ధీమాలో.


గాడిద దగ్గరకు రాగానే, మొసలి బురద నీళ్ళల్లో ఉండి చచ్చి బతుకుతున్న విషయాన్ని, తాను దాన్ని మోసుకొచ్చి మడుగులో విడిచిన విషయాన్ని గాడిదకు చెప్పి న్యాయం చెప్పమన్నాడు రైతు.


గాడిద కూడా తనను మానవుడు ఎంతగా పని చేయించుకున్నాడో, ఎన్నెన్ని బరువులు మోదలు మోపించాడో చెప్పి, పని చేసినంత కాలం తిండి పెట్టాడని, వయస్సు మల్లగానే భీటికి తోలాడని, మనిషి మహా స్వార్థపరుడని, నరునికి న్యాయం లేదని, 'ఇగ్గు నడి నీళ్ళల్లోకి' అని ఆవేశంగా చెప్పి గాడిద వెళ్లి పోయింది.


మొసలి రైతును మరికొంత మడుగులోకి ఇగ్గింది.


"ఆగాగు మొసలి! ఇంకోక్కరిని న్యాయం అడుగుదాం! అతడు కూడా న్యాయం చెప్పకపోతే నీ ఇష్టమొచ్చినట్లు చెయ్యి! అడుగో నక్క బావ వస్తున్నాడు అతన్ని అడుగుదాం!" రైతు ఆదుర్దాగా చెప్పాడు..


"సరే ఇదే ఆఖరిసారి. మల్లేమి చెప్పిన వినను. నా పని నేను చేసుకుంటాను" అని మొసలి కరాఖండిగా చెప్పింది.


"అయ్యా! నక్క బావా! ఈ మొసలి చాలిచాలని బురద నీళ్ళల్లో ఎండకు ఎండుతూ, బతికి చస్తూ ఉండింది. కట్టమీద పోతున్న నన్ను పిలిచి, అయ్యా! నీకు పుణ్యం ఉంటుంది. దయచేసి నన్ను ఏదైనా నీటి మడుగులో విడిచిపెట్టు అని దీనంగా ప్రాధేయపడింది. నేను జాలిపడి, నా భుజం మీద మోసుకొచ్చి ఈ కాళింగి మడుగులో వదులుతే అందుకు కృతజ్ఞత చెప్పకుండా నా కాలే పట్టుకొని నీళ్ళల్లోకి ఇగ్గుతుంది. ఇది న్యాయమేనా! నక్క బావా!" బెదురుతూ నక్కను అడిగాడు రైతు.


"ఒరే పిచ్చోడా! మొసలి పట్టుకుంది నీ కాలు కాదురా! కానుగ వేరును" అంది నక్క విరగబడి నవ్వుతూ.


దాంతో మొసలి "నేను ఇంత సేపు పట్టుకుంది కాలును కాదా" అని కాలును విడిచి కాలు కోసం వెతికింది.


మొసలి కాలును విడువగానే గట్టు మీదికి వచ్చి పడ్డాడు రైతు. నక్క మోసం అర్థమై మొసలికి.


"నక్కా! నువ్వు నీళ్ళు తాగేచోట కొడతాను చూడు" అంది మొసలి ఆగ్రహంతో ఊగిపోతూ.


"పోవే మొసలి! చూసుకుందాం గానీ" అంటూ ఎంచక్కా ఎగులేచ్చా వెళ్ళిపోయింది నక్క.


రైతు బతుకు జీవుడా అనుకుంటూ నక్కకు కృతజ్ఞతలు చెప్పుకుని ఇల్లు చేరుకున్నాడు రైతు.

-------+--

కాశీవరపు వెంకటసుబ్బయ్య గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ కాశీవరపు వెంకటసుబ్బయ్య గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

Podcast Link:

Youtube Play List Link:

పేరు: కాశీవరపు వెంకటసుబ్బయ్య

చదువు: B.com

పుట్టిన తేది: 1960

తల్లిదండ్రులు: వెంకటసుబ్బయ్య

రచనలు: ఎద మీటిన రాగాలు కవితా సంపుటి.

అముద్రితాలు: తుమ్మెద పదాలు మని కవితలు సంపుటి, పినాకిని కథలు కథల సంపుటి.

సాహిత్య సేవ: చైతన్య సాహిత్య కళా వేదిక సంస్థను స్థాపించి అనేక సాహిత్య కార్యక్రమాలు నిర్వహించడం.

సన్మానాలు సత్కారాలు: అనేక సాహితీ సంస్థల నుంచి సన్మానాలు సత్కారాలు పొందడం.35 views1 comment

1 Comment


@surekhap4148 • 1 hour ago

కథ బావుంది

Like
bottom of page