top of page

నేనూ సదూకున్న


కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.







Youtube Video link

'Nenu Sadukunna' New Telugu Story



(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)


(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


ఆనకాలం మండుతున్న ఎండతో పొద్దంతా ఎగసిపడ్డ సూరీడు, తన కోపం చల్లారనట్టు ఎర్రని రంగుతో మెల్లగా గుట్టల సాటుకు పాకుతూ, గుంకుతుండు.


కొద్దికొద్దిగా ఎలుగున్నా, నల్లని నీడతో నాలుగు దిక్కులనుంచి చీకటి అలుముకుంది. ఆనకాలం మెరిసి మెరిసి కొట్టే ఎండతో చెమటకు పెయ్యంత తడిసి పొద్దుగూకే యేళ

కు సల్లవడుతుంది. మేకలన్ని మందకు జేరుకుని అరుస్తూ, అంగడంగడి జేస్తున్నయి.


తల్లులకోసం తల్లడిల్లుతున్న పిల్లలను మేకలకు గుడుపుతూ సతమతమైతున్న.


గప్పుడే సూరీడు గుంకిన దిక్కు నుంచి మా మామ నెత్తిమీద సంచి మూటతో బస్సు దిగి మందదిక్కు వస్తుండు. మామ నెత్తి మీద మూట సూడంగనే నాకు మస్తు ఖుషీ

ఆకాశమంటింది.


మామంటే భయం. వాళ్ళ తానే మూడేండ్ల సంది మేకలు మేపుతున్న. పరుగెత్తి అటకాయించ లేను. కాని పాణం నిల్వక జర ముందుకెళ్ళి " ఇప్పుడే వస్తున్నవ మామ, ఇంటికాడంత మంచిగుండ్రా" అని అడిగిన.


" ఆ అందరు మంచిగుండ్రు" అని చెప్పుకుంట, గుడిసెల దిక్కువోయిండు. అక్కడున్నోళ్ళేమో ఆళ్ళఆళ్ళ ఇంటికాడ ముచ్చట్లు మాట్లాడతండ్రు.


ఎండకాలమే అప్పుజేసి ఇరవై మేకలు కొన్నం. మా కాడ ముప్పై మేకలుండే. అన్నిటిని కొట్టుకుని మేపెటందుకు మా మెదకు ఇడిసి నర్సాపూర్‌ అడవులకు అచ్చినం. ఆ ఆనలకు తడిసి గుట్టలెక్కి మేసే మేకలకు ' అడవులపొంటి తిరిగే అల్వాటు లేదు. పన్నెండు మేకలు సచ్చిపోయినై. ఆ బుగులుతోనే నేను ఓ మూల కూసున్న.


అప్పుడు మా మామ నన్న పిలిసి ' నీ తమ్ముడు యాదిగాడు ఏదో కాయితం ఇచ్చిండు. గా సంచిలుంది సూసుకో" అన్నడు. అప్పటికే చీకటైపాయే. కాయితం తీసి సదువరాదు.


మంట ఎల్గుకు సూద్దామని నాలుగు కట్టెలు ఒక్క దగ్గరేసి మంటవెట్టిన.


"పొద్దుగాల్ల సూతువులే శీకట్లేం కనిపిస్తది" అని మామ గరమయిండు. మూటను తీస్కపోయి ఓ మూలకు నెట్టిన. సినుకులు పడ్తుండగనే ఇన్ని బియ్యం ఉడ్కవెట్టుకుని తొక్కేస్కోని, తలో బుక్క డు దిని మంటసుట్టు అందరం పన్నం.


వారం రోజుల నుంచి ఇడువని వాన. ఎండ సక్కగా లేక గొంగడి ముక్క వాసన వట్టింది. ఆ గొంగడి కప్పుకొని, దానిమీదనుంచి ప్లాస్టిక్‌ కాయితమేస్కోని, కింద ఓ అరుస రాళ్ళు, ఆటి మీద టేకు ఆకులు ఏసుకొని పండుకున్నం. మక్కవాసనైతే అలవాటైంది గాని సినుకుల సప్పుడు సిటపట ఇన్పిస్తుంది. కిందేసుకున్న రాళ్ళు పక్క బొక్కలను ఒత్తుతున్నై.


నా కేమో నిద్రస్త లేదు.

ఆ మూటలున్న పేపర్‌ మీదనే.


అందులో పదో తరగతి పాసైనోళ్ళ నంబర్లున్నై. వాటిలో నా నంబర్‌ సూసుకుందామని.

అంతా యాదికొస్తన్నయి. ఆ సినుకుల సప్పుళ్ళలో, రాళ్ళ ఒత్తిడి నొప్పుల్లో కండ్లు మూస్కోని గతాన్ని తల్సుకుంటున్న. . . . . . చిన్నప్పటి సంది ఏడో తరగతి దాంక అన్ని తరగతుల్లోనూ నేనే ఫస్ట్‌. నేను సదువు మాని ఏడేండ్లయింది. ఏడో తరగతి అయిపోయిన ఏడాదే మా అయ్య, మా కాకలు ఏరువడ్డరు. అప్పుడు మేకలు పంచుకుంటే నలుగురికి ముప్పై ముప్పై మేకలు, ఇంత అప్పు అచ్చింది. ఆ అప్పును సూసి మా అయ్య జీతగాన్ని వెట్టుకోకుండా, నేను ఏడ్చినా ఇనకుండా, సదువు మాన్పించి మేకల కాడికి పంపిండు. ఐనా ఎప్పుడొక పుస్తకం దీస్కొని మేకలెంట వోయెటోన్ని. గింత వీలు దొరికితే సాలు బండలమీద కూసోని సదివేటోన్ని.


వేమన,సుమతి శతక పద్యాలు, భజన పాటలు నేర్చుకున్న. మేకలెనుక ఒంటరిని.

పల్కరించేటోల్లు గూడ లేరు. ఇగ నా మాట ముచ్చటంత పుస్తకాలతోనే. నా సోపతి

మేకలకాడి మల్లయ్య నన్ను భజనకు అల్వాటు జేసిండు. దానితోనే ఆ నాలుగక్షరాలు నా జీవితానికి పదును వెట్నై. సొంతంగా రామాయణం,భారతం లాంటి పుస్తకాలు

సదివిన. లేకపోతే నా సదువు అడివి లో కల్సిపోయేది. మేకల అరుపులు, చేను కావ

లోల్ల తిట్లు తప్ప నా శెవులకు ఇంకో శబ్దం ఇనవడదాయె. ఇట్ల గొంగడి సాటు బతుకు సూసి సదూలతల్లి నన్ను సమాజానికి సూపియ్యాలనుకుందేమో? ఓ సోపతి రూపంలో ఎదురైంది ఇజ్ఞాణం.


యాడాడనో సదివే సిన్నప్పటి సోపతిగాళ్ళు పండుగ తాతిళ్ళకి ఊరుకొచ్చిండ్రు.

ఆల్లు శీకటి వడినంక ఓ జాగల కూసొని ముచ్చట్లు పెట్టుకుండ్రు. అప్పుడే నేనుఅట్నుంచి వోతుంటే, మల్లేషు సూసి ఎదురొచ్చి " ఒరే నువ్వు సిన్నప్పుడు మా కంటె మంచిగ సదివేటోనివి. నీ సోపతోల్లం డిగ్రీ జేస్తున్నం. నువ్విట్లనే మేకలు కాస్తవా?చదువురా!ఇప్పుడైన పదోతరగతి పరీక్షకు ఫీజుగట్టు" అని సెప్పి, ఇంక ఏవేవో సెప్పి పోయే. ఇది ఇంటికాడ జెప్పి అట్ల ఫీజు గట్టిన. కాని సదవడం ఎట్ల?


పాటలు, పద్యాలు నేర్వటంతో తెలుగు సదువుతా. తక్కిన వి లెక్కలు, రసాయనశాస్త్ర

ము ఎవరైనా రాత్రిపూట చెప్తే మంచిగుండు అనుకున్న. ఇంతట్ల ఐదో తరగతిలో నాకు ప్రైవేట్‌ జెప్పిన ' రాములు' సారు యాదికొచ్చిండు. సార్‌ది మా పక్కూరే. ఓ దినం వాల్లింటికి పోయి " పదో తరగతి పరీక్ష ఫీజు కట్టిన సార్‌. మీరే నాకు అన్నీ జెప్పాలే జెర్ర" అని బతిమిలాడిన. తప్పకుండా చెబుతా నని నాకు భరోషా ఇచ్చిండు.


ఇంక మరుసటి సందె రాత్రి ఏడుగంటలకు రావడం మొదలువెట్టిండు. సారచ్చె

సరికి మేకలు కొట్టంలో తోలి, తల్లులకు గూడ్చి, పాతపైంటేసుకోని సదువు చెప్పించు

కునేటోన్ని. రేజు బడికి వోయే పిల్లలుగూడ పదిమంది వరకు అచ్చెటోళ్ళు. అట్ల మూడు నెల్లు జెప్పిండు. సారు జెప్పేది నా దిమాగ్‌ కు బాగా ఎక్కేది. ఏందో తెల్వదు

గాని నిద్ర వట్టేదే గాదు. ఎప్పుడు మేల్కొని సదివేటోన్ని. అమ్మనేమో " పిచ్చివట్టిందిరా।పొద్దంతా మేకల్తో తిరుగుతవ్‌ సప్పుడ్జేయక పండుకో" అనేది. నిద్ర సరిగ్గా లేక మస్తు సార్లు జరమొచ్చింది.


" రోజు బడిక్వోయి సదివేటోల్లంత పాసైతుండ్రు.. ఇగ నువ్వు పాసైతవు" అని ఎంతమంది ఎక్కిరిచ్చిండ్రో। ఆల్ల మాటలే నాలో కసిని పెంచినై. మా అయ్య నేను పరీక్ష రాసేటందుకు ఓ పైంటు, అంగి కుట్టించిండు. అంతకు ముందు నాకు పైంటు లేదు. ఏడో తరగతి వరకు లాగు. అక్కణ్ణుంచి గోశి.

ఇంత తన్లాడి సదివినందుకు పాసైన. నంబరు పేపర్లో సూసుకోవాలి అనుకుంట ఎప్పుడో నిద్ర పోయిన. అంతలోనే మేకపిల్లలు అరుస్తే మేల్కొ చ్చింది. తెల్లారుతోంది. కొంచెం మసకగా ఉంది. మామ కోపం చేస్తడని జల్దీ జల్దీ పనులు జేసేసి మూటిప్పిన. అందులో తొలి యాకాసికి చేసిన మురుకులు గవి ఉన్నయి. ఆ పేపర్‌ మధ్య లో పదోతరగతి ఫలితాలున్నాయి.


అందులో ఒక నంబరు కాడ గీత గీసి ఉంది. కాని పేపర్‌ నూనెకి తడ్వండంతో నంబర సక్కగా కనబడతలేదు. పరీక్ష వట్టి సూసిన. నేను పాసైన. మస్తు సంతోషవడ్డ. ఎెవ్వరికి నాకష్టం విలువ తెల్వదు. నాల్గుదినాలల్లో మా అయ్య వచ్చిండు. నా కోసం కాదు. మా మేకలు సచ్చిపోతున్నయని. వాటిని సూసెటందుకు. అదే సందు మా అయ్య రాంగనే నేను ఈడ ఉండనే ఉండనని మొండికేసి ఇంటికివోయిన.


ఊరికి బస్సుల వోతుంటే కాలేజీ పిల్లలల్ని చూస్తే ఆల్లకు,నాకు శాన తేడ. తొడల వరకు గోశి,మొండి చేతుల అంగి,భుజం మీద చిన్న గొంగడి,కాల్లకు కిర్రు చెప్పులు, నడుముకు గోతం,మేకల రొచ్చు వాసన ఇది నా యేసం. నేను కూసున్న సీట్ల ఎవ్వరు కోసోలే. నా మనసులో ఏదో ఆలోచన. సదూకుని సాధించాలె. లేకుంటె మన బతు

కులు గింతే. ఎందుకు పనికిరాను. ఇల్లు జేరుకున్న.


'నేను కాలేజీకి వోతనే' అంటె తిట్టిండు.

'సదూకో, ఏమన్న చేసుకో . మేకలైతే నువ్వే కాయాలి' అన్నడు.

అచ్చిన తెల్లారి మా మెదక్‌ లో ఉన్న ప్రభుత్వ జూనియర్‌కళాశాలలో హబీబుల్లా సార్‌ దగ్గరికి వోయిన. ఆయనకు నాకు కుసింత ఎరుకే. నేను ఆ సార్‌ కాడికి వోయి నేను సదూకునే సంగతి జెప్పిన.


'హెచ్‌. ఇ. సి . తీస్కోని మేకలు కాసుకుంటనే సదువుకో' అని చెప్పి నన్ను కాలేజీ లో షరీక్‌ చేయించిండు. అదే కాలేజీకి మొదటి చివరి రోజు. కాలేజీకి రోజు వోయి సదుకోక్కరలేదు. పుస్తకాలు తెచ్చుకుని సదువుతూ అనుమానాలొస్తే రోజు కాలేజీ పోయేటోల్లను అడిగి నేర్సుకుని ఇంటర్‌ పాసైన.


ఇంటర్‌ పాసైనంక మా అయ్యకు నా మీద నమ్మకం కుదిరింది. అవసరం గూడ తీరిపోయె. అప్పు తీరిపోయె. డిగ్రీల జేరిన. ప్రైవేట్‌ గా కట్టిన. ఊళ్ళో బి. టి. స్‌ లో జేరి

టీచర్‌ ట్రైనింగ్‌ పాసయిన. బిఏ. తెలుగు పాసయిన. మేకల కాడ సదువుకున్న పద్యాలు, రామాయణ, భారత కథలు అక్కరకొచ్చినయి.


నా సోపతిల ముందు నేను సదూకున్ననయిన.

------శుభం -------

అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం



మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


రచయిత పరిచయం

రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.

అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.

ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,

ఆంధ్రభూమి, " ఈ" పత్రికలు.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.





262 views0 comments

Comments


bottom of page